సాహిత్యానికి భారతరత్నం రాదా?

bharathratna
దేశానికి గర్వకారణమైన వ్యక్తులను గౌరవించుకునేందుకు ఏర్పడ్డ అత్యున్నత పురస్కారమైన భారతరత్న తన చరిత్రలో మరో మేలిమలుపు తీసుకుంది. ఆరుపదుల ప్రస్థానం చేరుకుంటున్న ఈ పురస్కారం సాంఘికసేవా, రాజకీయ, శాస్త్రసాంకేతిక, కళారంగాల పరిమితి నుంచి ఏ రంగంలో అత్యున్నత ప్రతిభ చూపినవారికైనా ఇవ్వవచ్చని నిబంధనలు మార్చడమేకాక తొలిగా సచిన్ టెండూల్కర్ ను క్రీడారంగం నుంచి ఎంపికచేశారు. ఇక జాతిభేదాలకు 1980దశకంలో భారత్ లో జన్మించని భారతపౌరురాలు మదర్ థెరెసా, బ్రిటిష్ ఇండియాలో భాగమైన నేటి పాక్ ప్రాంతంలో జన్మించిన విదేశీపౌరుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ లకు, 90ల్లో ఈ దేశంలో జన్మించని, ఈ దేశపౌరుడూ కాని నెల్సన్ మండేలాకు పురస్కారం ఇచ్చి వసుధైవ కుటుంబమన్న భారతీయ ఆదర్శాన్ని చాటారు. లక్ష్యాల్లో ఇంతటి సువిశాలమైన అవార్డు మాత్రం తొలి నుంచీ మార్గదర్శకాల్లో భాగమైన సాహిత్యరంగాన్ని విస్మరించడం ఆశ్చర్యకరం, బాధాకరమూను.
భారతరత్న పురస్కారం పొందినవారిలో కొందరు బహు గ్రంథరచయితలు ఉన్నారు. వారిని రచయితలని పేర్కొంటూ భారతరత్న సాహిత్యానికి దక్కిందని భావించే వీలు లేదు. పురస్కార గ్రహీత జవహర్లాల్ నెహ్రూ భారత చరిత్ర, ప్రపంచ చరిత్రవంటి అంశాలపై గ్రంథరచన చేసినవారే. ఐతే వారిని గురించి పేర్కొనాల్సి వస్తే భారత తొలిప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు అనితప్ప సాహిత్యవేత్త అనరు. ఆయన మౌలికంగా రాజనీతి రంగానికి చెందినవారు. భారతరత్న పొందిన రాజకీయనేతలు చక్రవర్తుల రాజగోపాలచారి, గోపీచంద్ బోర్డోలోయ్ , తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్, సంస్కృత పండితుడు, సంఘసంస్కర్త పాండురంగ్ వర్మన్ కానే,శాస్త్రవేత్త ఎ.పి.జె.అబ్దుల్ కలాం, తదితరులు ఎంతో విలువైన సాహిత్యాన్ని రాసినా వారు మౌలికంగా వేర్వేరు రంగాలవారు. ఏ రంగానికి చెందిన నిష్ణాతులైనా తమ ఆవిష్కరణలను వెలువరించడానికి సాహిత్యాన్నే ఉపకరణం చేసుకోవడం సాహిత్య ఔన్నత్యాన్ని తిరుగులేనివిధంగా నిరూపిస్తోంది. సాహిత్యమనే రంగం తొలినుంచీ అవార్డుల నిబంధనల్లో ఉన్నా, సాహిత్యవిభాగంలో ఎవరికీ భారతరత్న దక్కలేదనే చేదునిజం తేలుతోంది.
మానవ హృదయనిర్మాతలుగా, జాతి భవిష్యత్ నిర్దేశకులుగా ప్రపంచంలోని ప్రతి జాతిలోనూ, ప్రతి దేశంలోనూ సాహిత్యకారులకు గౌరవం దక్కుతోంది. కిర్గిజ్ జాతికి ఛెంగిజ్ ఐత్మోతావ్ జాతిపితగా పేరొందగా షేక్స్పియర్, టాల్ స్టాయ్ వంటి ఎందరో సాహితీవేత్తలను ఆయా దేశాలు తమ సాంస్కృతిక సంపదగా గౌరవించుకుంటున్నాయి. విగ్రహాలు, స్మృతిచిహ్నాలు మొదలైన ఎన్నో విధాలైన గౌరవాలతోపాటు కొన్ని దేశాల్లో రచయితలు జీవించిన వాడలు, చిన్న ఊళ్లు వారు జీవించిన కాలంలో ఎలా ఉండేవో అలాగే టైం ఫ్రీజ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇదంతా వారి స్మృతికే కాక వారి సృజనలకు ఇచ్చే నివాళి. ఒక్కో కవి, రచయిత తన భావజాలాల పరిధి వందల, వేల ఏళ్లకు, దేశాల సరిహద్దులు దాటి విశ్వమానవాళికీ విస్తరింపజేశారు. మరో కోణంలో చెప్పాలంటే శాస్త్రసాంకేతిక, తత్త్వశాస్త్రాది రంగాల్లోనైనా అత్యుత్తమ స్థాయి ప్రతిభ చూపినవారు వాటిని వ్యక్తపరచడానికి కూడా సాహిత్యాన్నే ఎన్నుకున్నారు. వివిధ మతాలు, రకరకాల ఇజాలు తమ ప్రభావాన్ని చూపేందుకు అక్షరమే ఆయుధమైంది.
ప్రపంచ మానవాళి అంతటిలాగానే భారతీయుల్లో కూడా సాహిత్యమనే దీపాన్ని వెలిగించి జాతిజనుల హృదయాలకు వెలుగులు పంచిన మహాకవులు, రచయితలూ సహజంగానే ఉన్నారు. వారి కవితాపాదాలు నినాదాలై  దేశాన్ని కుదిపేశాయి, వారి కవితల్లో భావచిత్రాలు శ్రోతల, పాఠకుల హృదయాల్లో జన్మాంతరమైన భావాలు రేపాయి. అలాంటి సహజరత్నాలైన ఎందరో సాహిత్యకారుల్ని భారతరత్నాలుగా గుర్తించకపోవడం వెనుక ఏ కారణాలున్నాయో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉంది.
తమ రంగాల్లోని అత్యున్నత ప్రతిభతో జాతికి సేవచేసిన, భారత జాతి ప్రతిష్టను పెంచిన వ్యక్తులు ఈ అత్యున్నత పురస్కారానికి అర్హులని మౌలికంగా చెప్పుకోవచ్చు. 1954లో నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రారంభించిన ఈ పురస్కారం ప్రకటించిన సచిన్, శాస్త్రజ్ఞుడు రావులను కలుపుకుంటే 43మందిని వరించింది. ఈ అవార్డు పొందినవారి జాబితా పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.
1.భారతజాతీయుల ప్రతిభ, కృషి అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించినప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో వారికి ప్రతిష్టాత్మక గౌరవాలు, పురస్కారాలు లభించినపుడు భారతరత్న ప్రదానం చేశారు.
అవార్డు ఏర్పరిచిన తొలిసారే నాటికి 20ఏళ్లనాడు ప్రతిష్టాత్మక నోబెల్ అందుకున్న సి.వి.రామన్ ను, ప్రపంచ ప్రఖ్యాతిపొందిన తత్త్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ను అవార్డు వరించింది. ఆపైన నోబెల్ పొందిన ఏడాది తిరగకుండానే అమర్త్య సేన్, ప్రతిష్టాత్మక ఆస్కార్ జీవితసాఫల్య పురస్కారం తానై కలకత్తా చేరి వరించిన ఏడాదే సత్యజిత్ రాయ్ లకు భారతరత్న లభించడం కూడా ఈ ధోరణిని చూపిస్తుంది. ఇలా చాలామందే అంతర్జాతీయ స్థాయి సత్కారాలు పొందిన తర్వాత భారతరత్న అందుకున్నారు. వీరికి అవార్డు లభించడంతో అవార్డుకు గౌరవం వచ్చింది.
2.మరో ధోరణి దేశ చరిత్రలో పలు మేలిమలుపుల వెనుకనున్న ఒకరికి సత్కారం లభించడం. దేశ విభజన అనంతరం స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకీకరణకు కృషి చేసిన వల్లభాయ్ పటేల్, 1944-1950 అస్సాంలో ప్రతిపక్ష నేతగానూ, పదవిలోనూ తన జాగ్రత్తతో ఆ ప్రాంతం తూర్పు పాకిస్థాన్ పరం కాకుండా కాపాడి, ఆపై సరిహద్దుల్లో చైనా దూకుడుకూ కళ్లెం వేసిన గోపీచంద్ బోర్డోలోయ్, ఆహారధాన్యాల కొరతతో విలవిలలాడుతున్న దేశానికి సుభిక్షతనిచ్చిన “హరిత విప్లవ” సారధుల్లో ఒకరైన నాటి వ్యవసాయమంత్రి చిదంబరం సుబ్రమణియం, దేశ ఆయుధరంగంలో కృషిచేసి సార్వభౌమత్వానికి పాటుపడ్డ ఎ.పి.జె.అబ్దుల్ కలాం తదితరులు ఈ కోవలోని వారు. వీరి కృషితో వచ్చిన గౌరవాన్ని అవార్డులకు ఆపాదిస్తారు. ఐతే వీరి ఎంపికలో రాజకీయపర కోణాలుంటాయి. ఒక్కో మేలిమలుపు వెనుక, ఒక్కో అపురూప ఘటన వెనుక కనీసం మరో నలుగురైదుగురు మూలమూర్తులు ఉంటారు. వారిలో ఎవరికి ప్రాతినిథ్యం కట్టబెట్టాలన్నప్పుడు ఆ స్వేఛ్ఛను వాడుకుంటారు.
3.కొన్ని భావజాలాలకు ప్రతినిథులను కూడా ఈ పురస్కారాలకు ఎంపికచేశారు. అలాగే వివిధరంగాల్లో మేరుసమానులనూ ఎంపిక చేశారు. వీరినే ఎందుకు ఎంచారన్నదానిలో కూడా అధికారంలోని వ్యక్తుల తాత్త్విక, రాజకీయ భావజాలాలు, ఆనాటి స్థితిగతులు ఉంటాయి. ముఖ్యంగా 1999లో కార్గిల్ విజయోత్సాహంలోని ఎన్.డి.యే. హయాంలో అస్సాం(నేటి ఈశాన్యరాష్ట్రాల్లో అధిక భాగం అస్సాంగానే ఉండేది)ను భారతదేశంలో విలీనం చేసిన అర్థశతాబ్ది నాటి గోపీచంద్ కు అవార్డు దక్కిందంటే దాని వెనుకనున్న కారణాలు చెప్పనక్కర లేదు కదా. అలాగే వారణాసి, గంగ, విశ్వేశ్వరాలయం నాతో అమెరికా తీసుకురాగలరా అని తనను ఆహ్వానించిన పాశ్చాత్యులను ప్రశ్నించిన షెహనాయ్ మేరుశిఖరం బిస్మిల్లా ఖాన్ కు కూడా వారి హయాంలోనే అవార్డు వచ్చింది. తాను ప్రధాని అయ్యేనాటికి కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన కామరాజ్ కు ఇందిర హయాంలో అవార్డు రావడం మొదలుగా చెప్పుకుంటూపోతే ఏ అవార్డు వెనుకనైనా ఏదోక రాజకీయకోణం తొంగిచూస్తూంటుంది. దేశంలోని కొన్ని భాషలు, కొన్ని వర్గాల వారు అభిమానించి ఆరాధించేవారెందరికో అవార్డు రావడం వెనుక అది కారణంగా నిలిచింది. రాజకీయ కారణాలతో పాటు పురస్కారాలు అందుకున్నవారు చాలామంది ఈ పురస్కారం విలువను పెంచినవారే అయ్యారు.
ఈ నేపథ్యంలో చూస్తే ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన పురస్కారాలు పొందినవారు, తమ కవితలోని రెండు పదాలు నినాదాలై చరిత్ర గతి మార్చిన ఉద్యమపతాకం పొందినవారు, నేటి మన ప్రతి భావజాలానికి ప్రతీకలై నిలిచినవారు గత శతాబ్ది సాహిత్యవేత్తల్లో ఉన్నారు. రెండుదేశాలకు జాతీయగీతాలుగా తాను రాసిన పాటలు వెలిగి ఆ కారణంగా ప్రపంచంలోనే అరుదుగా నిలిచిన సాహితీవేత్త భారతీయుడే. దేశంలో ప్రతిభాషలోనూ తమ జాతిజనులను ప్రభావితం చేసి అజరామరమూ, సర్వకాలీన, సార్వజనీన సాహితాన్ని సృష్టించినవారున్నారు. పోనీ రాజకీయ కారణాలని అనుకుంటే రాజకీయంగా వర్గాలుగా విడదీసుకుని చూసినా ఒక్కో సాహిత్యవేత్తనీ తమ భావజాలాలకు ప్రతినిధిగా చూసే అశేషప్రజానీకం ఉన్నారు.
వివిధ భాషా వైవిధ్యాలతో విలసిల్లే దేశంలో భాష ప్రధానాంశమైన సాహితీవేత్తలకు పురస్కారాలు ఇస్తే ఇతర భాషాసమాజాల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించే అవకాశం ఉంది. కానీ జాతి భవిష్యత్తును నిర్మించేందుకు, సంస్కృతిని తమ రచనల్లో ప్రతిబింబించేందుకు కృషి చేసి ఋషిత్వాన్ని పొందిన సాహిత్యకారులకు నిష్పాక్షికంగా భారతరత్నకు ఎంపికచేస్తే బహుళత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న భారతీయులు సంతోషిస్తారు తప్ప వ్యతిరేకించరు. మరణానంతరం పురస్కారం ప్రదానం చేసే సంప్రదాయం ఉంది కనుక ఇన్ని ఏళ్లుగా పురస్కారం పొందని పలువురు అర్హులైన సాహిత్యవేత్తలకు ఇకనైనా ప్రదానం చేయవచ్చు. జాతి సామూహిక మేధలో, హృదయంలో తమ రచనలతో భాగమైపోయిన సాహిత్యకారులను అత్యున్నత పౌరపురస్కారంతో గౌరవించడం సముచితమే కాదు అత్యవసరం.
santhosh—సూరంపూడి పవన్ సంతోష్

మీ మాటలు

*