టైలర్ శీను

tailor srinu katha

 

ఎంత పెద్ద ఆకాశాన్నయినా ఇట్టే కత్తిరించేస్తాడు. ఎంత విస్తారమైన సముద్రాన్నయినా చిటికెలో మడతపెట్టేస్తాడు. దటీజ్ శీను. టైలర్ శీను. నా మీద కవిత్వం రాయవా అని ఆరోజుల్లో శీను తెగ బతిమలాడేవాడు. అప్పుడు ఈ రెండు లైన్లూ చెప్పి ఊరించేవాడిని.

మా వూళ్ళో టైలర్ శీను అంటే  ఒకప్పుడు..ఎప్పుడంటే  మా యవ్వనకాలపు జెండాలు పట్టుకుని పగలూ రాత్రి అదేపనిగా పిచ్చిగా తిరుగుతున్నప్పుడన్నమాట. అప్పుడు శీను మిషన్ కుట్టే చిన్న గదే మా సమావేశ స్థలం. ఒక కవితాగోష్ఠి. ఒక రహస్య కరపత్రాల ముద్రణాలయం. మేం పార్టీ వ్యవహారాలు, యువజన సంఘాల తీర్మానాలు, గరంగరం చర్చలు శీను గదిలోనే సాగించేవాళ్ళం. కళ్ళకీ కాళ్ళకీ చేతులకీ మిషన్ పని అప్పగించి చెవుల్ని మాత్రం మా మథ్యలో వదిలేసేవాడు శీను. శీను ఇల్లు రోడ్డు మీద వుండేది కాబట్టి బస్సుల్లో,బైకుల్లో, సైకిళ్ళ మీద వచ్చీపోయే మా బోటి వాళ్ళకు అదే రియల్ స్టాప్.

ఇప్పుడు శీను ఊళ్ళో లేడు. శీను శరీరాన్ని ఒక యంత్రంలా అదేపనిగా చాన్నాళ్ళు తిప్పితిప్పిన  కుట్టుమిషను  మాత్రం అదే వూళ్ళో  అతను అప్పులు చేసిన వాళ్ళింట్లో  ఏ పనీలేకుండా ఏ చప్పుడూ చేయకుండా ఒక మూలన పడివుంది.  శీను  కట్టుబట్టలతో కొడుకును బాగా చదివించుకోవాలని హైదరాబాద్ వచ్చేశాడు. తను చాన్నాళ్ళు కుట్టిన మిషన్ వదిలేసి వస్తున్నప్పుడు మాత్రం దాని చక్రాన్ని ఒకసారి తిప్పాడు.  అందులో తన రక్తమే గిర్రున తిరుగుతున్నట్టనిపించింది. కాళ్లతో మిషన్ తొక్కి చూశాడు. తన కండల  కదలికల నుంచి పుట్టిన సంగీతం ఏదో వినిపించింది.  అప్పుడే పదిహేనేళ్ళు దాటింది. కొడుకు బి.టెక్ లో చేరాడు. భార్య చిన్నపాటి ఉద్యోగంలో చేరింది. తను మాత్రం ఒకపెద్ద టైలరింగ్ షాపులో నెలజీతగానిగా కుదిరాడు.

శీనుకు మిషనంటే ఎంత ప్రాణమో మిషన్ పనంటే కూడా అంతే ప్రాణం. అంతకు మించి తన వూళ్ళో తన  కుట్టు మిషను బతుకు చుట్టూ అల్లుకున్న స్నేహితుల జ్ఞాపకాలంటే ఇంకా ఇష్టం. బట్టలు కుడుతూ కుడుతూనే ఎటో జ్ఞాపకాల్లోకి జారుకుంటాడు. అంత పరధ్యానంలో కూడా తన పనిలో ఇసుమంత పొరపాటు జరగనీయడు. అందుకే అతనికున్న ఇష్టాలతో సంబంధం లేకుండానే ఆ షాపు యజమాని శీనంటే ఇష్టపడతాడు.

ఇదంతా సరే. అసలు శీను హైదరాబాద్ వచ్చినా తన జ్ఞాపకాల ఊపిరితోనే ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవడమే ఇప్పుడు మనం చేయబోతున్న పని. ఆ జ్ఞాపకాల కలబోత ఏ పర్యవసానాలకు దారితీసిందో కూడా చూడాలి.

శీను ఎప్పుడైనా  ఒకరోజు లాల్చీ కుట్టడానికి ఒక సిల్కు బట్టను కత్తిరిస్తున్నాడనుకుందాం.  అదిగో అప్పుడే   వూళ్ళో మగ్గం తాత గుర్తుకొస్తాడు. ఆ తాతతో శీను అనుబంధం ఒరిజినల్  తాతామనవలకంటె ఆత్మీయమైంది. ఇంకో కారణం ఏంటంటే     ఆ తాత అందరికీ ఇష్టమైన జరీపంచెలు,కండువాలు,చీరలూ బతుకంతా నేసిచ్చినా..ఒంటిమీద కప్పుకోడానికి నిండా బనీను కూడా వుండేది కాదు. ఎప్పుడైనా ఏ పంచెలసాపులోనో మిగిలిన గుడ్డ తెచ్చి ‘ బనీను కుట్టు మనవడా ‘ అని అడిగితే శీను ఆ బట్టముక్కను తీసుకుని అటు కొలిచీ ఇటు కొలిచీ అటు తిప్పీ ఇటు తిప్పీ చూస్తుంటే తాత కూడా అటూఇటూ  గుడ్లు తిప్పుతూ తెగ టెన్షన్ గా చూసేవాడు.

“ గోచీగుడ్డ తెచ్చి బనీను కుట్టమంటావేంటి తాతోయ్?” అని శీను గుచ్చి చూస్తే

“ ఓసోస్ నీకోసం ఏడుగజాల దర్మోరం సిల్కు పంచె తేవాలేంటి?”  ఇలా  తాత గదమాయించేవాడు. శీను నవ్వుకుని మరెవరికో కొలతలు ఎక్కువ చెప్పి ఎక్కువ బట్ట తెప్పించి తాతకు బనీను రెడీ చేసేవాడు. ఆ బనీను తీసుకు వెళ్ళేప్పుడు “మనవడా గుడ్డేమన్నా మిగుల్చుకున్నావా” అని తాతకు అనుమానంగా చూడ్డం అలవాటే.

“ ఆ మిగుల్చుకున్న బట్ట ధర్మవరం అమ్మకానికి పంపాను” అని శీనుకి  వేళాకోళం చేయడమూ పరిపాటే.  తాత గుర్తుకొస్తే తాత కొడుకు, తన ఫ్రెండ్.. చాలా చలాకీ కుర్రాడు అప్పారావు గుర్తుకొస్తాడు. నేత పని లాభం లేదని వూరొదిలి హైదరాబాద్ లో ఎక్కడో భార్య, ఇద్దరు పిల్లలతో వాచ్ మేన్ పనిచేసుకుంటున్నాడు.

బట్టలు కుట్టకుండా శీను బతకలేడేమో.  కాళ్ళు, కళ్ళూ, చేతులూ వాటంతట అవే ఒక లయబద్దంగా క్రమబద్ధంగా కదులుతుంటే మిషన్ మీద బట్టతో పాటు మనసు మిషన్ పై జ్ఞాపకాల వస్త్రాన్ని కూడా కుడుతాడు. అందుకే శీనుకి కుట్టుమిషనంటే అంత ఇష్టం.  లాల్చీలు కుట్టడంలో శీను దిట్ట. ఎన్ని లాల్చీలు కుట్టినా శీనుకి ఎప్పటికప్పుడు ఓ కొత్త అనుభవమే.   రక్తంలోంచి నరాల్లోంచికండల్లోంచి దేహంలోంచి కరిగికరిగి మరిగిమరిగి పుష్పించినట్టు ప్రతిసారీ తాను కుట్టిన   సిల్కు లాల్చీని మడతలు పెట్టి ముచ్చటగా చూసుకుంటాడు శీను. తాను కుట్టిన లాల్చీని చూస్తూ చూస్తూండగానే వూళ్ళో అత్తరు సాయిబు గుర్తుకొచ్చేస్తాడు. గుర్తుకు రాకపోతేనే చెప్పుకోవాలి.

అత్తరు సాయిబా రారా అందాల మారాజా రారా అని ఎంత ఉడికించినా నాలుగు అత్తరు చుక్కలు చిలకరించి వెళ్ళిపోయేవాడు బాషా. కానీ అందరికీ అతను అత్తరు సాయిబే. ఊళ్ళో ఎవరు కొత్తబట్టలు కుట్టించుకుని శీను దగ్గర నుంచి తీసుకువెళ్ళినా వారికి ఓ అత్తరు బుడ్డి బహూకరించాల్సిందే. డబ్బులకోసం చూసే వాడు కాదు. ఎవరైనా పెద్దాసామి తక్కువిస్తే మాత్రం అరబ్బు దేశాల నుంచి సీదా మనూరికే తెప్పించాను మరి అని దబాయించేవాడు. బాషా గుర్తుకొచ్చి ఏదో బుల్లి అత్తరు సీసా మూత వూడి జేబులో ఒలికినట్టు తడిమి చూసుకుంటాడు శీను. అంతే తనను  గుప్పుమంటూ బాషా జ్ఞాపకాలు చట్టుముడతాయి. ముచ్చటగా మడతపెట్టిన లాల్చీని మురిపెంగా మళ్లీమళ్లీ వాసన చూస్తాడు. బాషా కూడా హైదరాబాద్ పాతబస్తీలో ఎవరో దూరపు చుట్టాల దగ్గరకు చేరాడు. చాలాకాలమైంది బాషాను పలకరించి అనుకున్నాడు.

అందంగా కుట్టి అపురూపంగా మడతపెట్టిన లాల్చీని దాని యజమాని కోసం  ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టినప్పుడు శీను చుట్టూ మరికొన్ని జ్ఞాపకాలు  ముసురుకుంటాయి. ఇప్పుడింత నిగారిస్తోంది కాని ఒకసారి చాకిరేవుకు పోతే ఈ మెరుపుంటుందా అనుకోవడం అతనికి అలవాటుగా మారింది. అనుకున్నదే తడవుగా వూళ్ళో తన దోస్త్ చాకలి సత్యన్నారాయణ గుర్తుకొస్తాడు.  బతుక్కోసం బట్టలు కుట్టడం ఎంత ఇష్టమో తన యవ్వనకాలపు జ్ఞాపకాలను కూడా పోగేసి వెరైటీ దుస్తుల్ని కుట్టడం కూడా అంతే ఇష్టం కదా శీనుకి. అందుకే అంతా తటాలున గుర్తుకొచ్చేస్తుంటారు. సత్యన్నారాయణంటే అన్నవరం సత్యన్నారాయణ కన్నా ఇష్టం మన శీనుకి. సొంతూళ్ళో ఉన్నప్పుడు  వీళ్ళద్దరి పోటీ విచిత్రంగా ఉండేది.

ఎంత కొత్తగా తాను కుట్టినప్పుడు తళతళమంటాయో చాకిరేవుకొచ్చినప్పుడు అంత బావురుమంటాయని శీను వెటకారం చేసేవాడు. అయితే సత్యం ఊరుకునేవాడా? శీనుకి పోటీగా బట్టలు ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి గర్వంగా వూళ్ళో అందరికీ అందజేసేవాడు. చూస్కోరా నీ కొత్తబట్టల కంటే నా ఇస్త్రీ బట్టలే మెరిసిపోతున్నాయని ఒకటే మురిసిపోయేవాడు. ఊళ్లో అందరి బట్టలూ ఉతికి ఉతికి సాపుచేసి ఫెళఫెళా వెండిపళ్ళాల్లా మెరిపించిన సత్యం తన బతుకులో మాత్రం ఎలాంటి మెరుపులూ  నింపుకోలేకపోయాడు. పెళ్ళలుపెళ్ళలుగా బాధల మురికి, కష్టాల మురికి, కన్నీటి మురికి పేరుకుపోయిన బతుకు మూటను మోసుకుంటూ సత్యం కూడా ఒకరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఒక పెద్ద అపార్ట్ మెంట్ లో సెల్లార్ లో ఇచ్చిన చిన్న ఇరుకు గదిలో ఉంటూ ఇస్త్రీ చేసుకుని బతుకుతున్నాడు. పెళ్ళాం అదే అపార్ట్ మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ లో పనికి కుదిరింది. పిల్లలు ఏవో మామూలు  బడుల్లోనే చదువుకుంటున్నారు.

శీను ఇలా కొత్త వస్త్రాన్ని కుట్టినప్పుడల్లా తన చిన్ననాటి దోస్తుల్ని తల్చుకోవడం ఓ ఆదివారం వాళ్ళని కలుసుకోడం రొటీన్ గా మార్చుకున్నాడు. యథాప్రకారం  ఓసారి అందరూ ఒకచోట కలిసి ఒకసారి వూరెళ్ళి అక్కడ జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసి రావాలని నిశ్చయించుకున్నారు. రాష్ట్రం విడిపోతే తమకు, నగరంలో తమ జీవితాలకూ ఏమైనా నష్టం వాటిల్లుతుందా అన్నదే వీరందరిలో ఇటీవల జరుగుతున్న ఘర్షణ. అందర్నీ తరిమేస్తారా!మళ్ళీ వూరికే మకాం కట్టాలా.. ! అక్కడేముందిప్పుడు ? కనీసం ఈ మాత్రం దర్జాగానైనా బతుకుతున్నామంటే ఈ నగరం పుణ్యమేకదా..!ఇవే ఆలోచనలు.

మొత్తానికి ఒకరోజు శీను,అప్పారావు, సత్యం వూరికి బయలుదేరారు. ఊళ్లో శీను ఒకప్పుడు టైలర్ పనిచేసుకునే రోజుల్లో యువజన కార్యకలాపాలంటూ ఊపుగా తిరిగిన వాళ్ళలో కొందరు ఇప్పుడు కొన్ని ఘరానా పార్టీల్లో కీలక నాయకులుగా ఎదిగిపోయారు. అందులో ఒక నాయకుణ్ణి కలిసి తమ భవిష్యత్తు ఏంటో కనుక్కుందామని ముగ్గురూ ఆ నాయకుని ఇంటికే సరాసరి వెళ్ళారు. గంటల తరబడి వసారాలో కూర్చున్న తర్వాత సదరు నాయకులుంగారు బయటొకొచ్చి శీనును వాటేసుకుని ఆనాటి ముచ్చట్లు ఏకరవుపెట్టి భోంచేసి వెళ్ళండని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకొచ్చారు..ఏమిటి అని ఆరా తీయలేదు.

కాని పి.ఎ. మాత్రం అన్ని ఆరాలు తీసి లోపలికెళ్ళి మళ్ళీ వచ్చి “ అయ్యగారేదో మీటింగుకెల్తన్నారు.   మిమ్మల్ని భోంచేసి వెళ్ళమన్నారు. ఏం భయపడొద్దని చెప్పారు. అంతా సర్దుకుంటుందంట. అసలేం కాదంట.  ఆందోళనేం పడొద్దని  అయ్యగారు  చెప్పారు.” పియ్యేగారు ఇలా  వివరించుకున్నారు. అయితే అంతటితో ఆగక ఆఖరున ఒక్క విషయం అడిగాడు.

“ఇంతకీ మీకు ఓట్లు ఎక్కడున్నాయ్?”

“ హైదరాబాద్ లోనే.”  ముగ్గురూ ముక్తకంఠంతో చెప్పారు

ఒకసారి భృకుటి ముడిచి..కళ్ళు అటూ ఇటూ తిప్పి..తల పైకీకిందకీ ఆడించి రెండడుగులు ముందుకీ ఆరడుగులు వెనక్కీ వేసి  వేగంగా సదరు పియ్యేగారు సరాసరి లోపలికెళ్ళాడు. లోపల నాయకులవారికి ఏం చెప్పాడో ఏమో..ఆ నాయకుడు  బయటకు వెళుతూ వీళ్ళను కనీసం చూడను కూడా చూడకుండా కారెక్కి తుర్రుమన్నాడు.

ఏం జరిగిందో తెలియక బుర్రలు గోక్కుంటూ ముగ్గురూ వూళ్ళో తెలిసిన వాళ్ళనీ చుట్టాలనీ పలకరించిపోవాలని బయటకు నడిచారు. వెనక నుంచి కొన్ని నవ్వులు వెంటబడ్డాయి.

“ ఓట్లున్న వాళ్ళకే దిక్కూ దివానం లేదు. తెయ్యమంటా పరిగెత్తుకొచ్చేరు.”

నవ్వులతో కలగలిసిన మాటలు వారిని వెనక నుండి పొడిస్తే ముందుకి పడిపోతూ తట్టుకుని నిలబడుతూ మరో తెలిసిన నాయకుణ్ణి కలిశారు. అంతకుముందే వీరు తమ ప్రత్యర్థిని కలిసినట్టు ఆ లీడర్ దొరగారికి తెలిసిపోయింది. కస్సుమన్నాడు. బుస్సుమన్నాడు.

“అసలు రాష్ట్రానికి ఇంత దరిద్రం దాపురించడానికి మీరు  ఇంతకుముందు కలిసిన పార్టీనాయకులే కారణం” అని పళ్ళు పటపటా కొరికి పొడుగు చేతుల చొక్కాని టపటపా పైకి లాగాడు. శీను, సత్యం, అప్పారావు ఖంగు తిన్నారు. అయితే చివరికి

“ ఏం పర్వాలేదు. మీకు ఓట్లు లేకపోయినా పర్వాలేదు. మీవాళ్ళకి మాత్రం చెప్పండి. మన పార్టీనే నమ్ముకోని ఉండమనండి. అక్కడున్న మీకు, ఇక్కడున్న మీవాళ్ళకీ అండగా వుంటాన్లే” అని ఓ సానుభూతి వీళ్ళ మొహాల మీద పారేసి చిరాగ్గా ఎక్కడో ధర్నాకు వెళ్ళిపోయాడా నాయకుడు.

ఏంటో ఎవరి మాటా ఏమీ అర్థం కాక  ..వూరినీ వూళ్ళో వాళ్ళనీ ఒకసారి చూసి రాత్రికి తిరుగుబస్సెక్కేద్దామని నిర్ణయించుకున్నారు. ఊరంతా ఖాళీఖాళీగా ఉన్నట్టు అనిపించింది. శీనుగాడు,అప్పిగాడు, సత్తిగాడు వచ్చాడని వాళ్ళవాళ్ల కులాల పేర్లు ముందు తగిలించి కొంచెం మమకారం కూడా అతికించి జనం పలకరించారు. అయిన వాళ్ళు ఆప్యాయంగా భోజనాలు పెట్టారు. ఏదో వెలితి మాత్రం కూడా తెచ్చుకున్న సంచుల్లో భారీగా నింపుకుని తిరిగి బస్సెక్కి ఉదయమే నగరానికి చేరుకున్నారు. మనుషులంటే ఓట్లు తప్ప నాయకులకు మరింకేమీ కనిపించటం లేదన్న విషయం ఆ ముగ్గురిలో ఎవరికి ఏ విధంగా అర్థమైందో ఏమో. రాత్రంతా బస్సులో పడుకొని తెల్లారాక నగరంలో ఎవరి పనుల్లో వారు పడిపోయారు. హైదరాబాద్ నుండి తరుముతారో లేదో కాని..ఇంకా కొన్ని రోజులు వూళ్ళోనే ఉంటే ఖచ్చితంగా తరిమికొట్టేసే వారేమో అని కలిసినప్పుడు నవ్వుకుంటూ అనుకోవడం వారికి పరిపాటిగా మారింది.

శీను యథాప్రకారం తన మిషన్ పని తాను చేసుకుంటూనే ఉన్నాడు. బట్టలతో పాటు జ్ఞాపకాలనీ కుడుతూనే వున్నాడు. అందరూ కలుసుకుంటూనే ఉన్నారు. ఏ నాయకుడి  మాటలు నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక  గందరగోళపడుతూనే ఉన్నారు. నేనుగాని  కలిస్తే నామీద  కవిత పూర్తిచేశావా అని అడగడం మాత్రం మానడు. పైకి చెప్పలేదు కాని ఇలా అనుకున్నాను.   ఎంత పెద్దనాయకుడైనా  మా శీను దగ్గర నిలబడాలంటే సిగ్గుపడాలి మరి.   కత్తిరించడమే కాదురా.. కలిపి కుట్టడం కూడా  నేర్చుకోండని శీను తన శరీరాన్ని మిషన్ చక్రంలా తిప్పుతూ చెప్పేస్తాడు.

 

 

                                                                                                ప్రసాదమూర్తి

మీ మాటలు

 1. buchireddy gangula says:

  విడిపోయిన కలిసి బ్రతకాలి అన్నదే తెలంగాణా ప్రజల ఆశయం — 60 ఏళ్ళ తెలంగాణా
  చరిత్ర తిరిగి వేయండి —– ఎందుకు విడి పోవాలనుకున్నా రో —–వి డి పోయారో —
  తెలంగాణా — నాలున్నర కోట్ల ప్రజల గుండె చప్పుడు —-కోరిక –ఆశ -ఆశయం —శ్రీను –అతని మిత్రులు అంతా — హైదరాబాద్ లో —హాయిగా ఆనందంగా బతకవచ్చు –అలా
  అందరం కలిసి బతుకాలన్నదే — తెలంగాణా ప్రజల ఆశయం — శ్రీను చెప్పేది అదే
  —కథ బాగుంది సర్
  ———————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 2. Rajesh Yalla says:

  చాలా చక్కగా రాసారు. అభినందనలు ప్రసాదమూర్తి గారూ!!

మీ మాటలు

*