కార్టూన్ అంటే కొంటె కోణం మాత్రమే కాదు:శేఖర్‌

Dsc_7391

శేఖర్‌… పొలిటికల్‌ కార్టూనిస్టులలో తనదైన బలమైన ముద్రవేసుకుని, తన మూలాలనుంచి నిటారుగా నిలబడి ప్రపంచాన్ని దర్శించిన కార్టూనిస్టు. అనేక సంక్షుభిత కాలాల్ని ఎదుర్కొంటున్న సామాన్యుడికి తన కార్టూన్లతో నేనున్నానని ధైర్యం చెప్పిన ప్రజల కార్టూనిస్టు. కార్టూన్‌ నవ్వులపాలు కాకూడదు అని నిరంతరం తపించిన కార్టూన్‌ ఇష్టుడు. తను నిలబడటమే కాదు అందరూ బావుండాలని పరితపించి కొత్తవారికి ప్రోత్సాహం,స్నేహం అందజేసే స్నేహశీలి.
తెలుగు కార్టూన్‌ అంటే ఇదే..అని చట్రాన్ని చూపించిన వారికి ఆ చట్రాన్ని ఛేదించి…అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చి.. అమెరికా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి తెలుగు  కార్టూనిస్టు. పీడిత జన బాహుళ్య ఉద్యమాలకు ఉడతాసాయం. స్వయం ప్రకాశంగా తనను తాను మలచుకుని తన కార్టూన్లకు ఒక గ్రామర్‌ని,గ్లామర్‌ని దిద్దుకున్న తెలివైన టెక్నీషియన్‌. మారుతున్న కాలానికనుగుణంగా  ‘శేఖర్‌టూన్‌ ’ సిండికేషన్‌ని దిగ్విజయంగా నడిపి తెలుగు కార్టూనిస్టు సత్తా భారతదేశం నలుమూలలా చాటినవాడూ శేఖరే…శ్రామికుడూ…నిరంతర స్వాప్నికుడూ అయిన శేఖర్‌…కార్టూన్‌ భ్రమలకు దీపపు పురుగు లా కాలిపోయిన అనేకమందిలా కాక…ఒక మిణుగురులా స్వయం ప్రకాశంగా ఎదిగి అందరికీ ఒక ఆశ్చర్యచిహ్నం అయ్యాడు…

నిరంతర ఐడియాల పుట్ట అయిన శేఖర్‌తో కాసేపు మాట్లాడితే చాలు..ఏదో ఒక ఐడియా మనకూ తలుక్కుమంటుంది…ఆ ఐడియాతో మనం ఒక రహదారి ఏర్పరుచుకోనూవచ్చు…కార్టూన్లపై ఒక సీరియస్‌ దృక్పథాన్ని ఏర్పరచుకోవచ్చు…ఆరు పుస్తకాలు ప్రచురించి…అనేక టెలివిజన్‌,రేడియో ఇంటర్వ్యూలు ఇచ్చిన శేఖర్‌…ఈ ఏడాది పొలిటికల్‌ కార్టూనిస్టుగా రజతోత్సవం జరుపుకుంటున్నారు. హైదరాబాద్‌ వెళ్లి ఆయనను అడిగిన అనేక ప్రశ్నల సమాహారాన్ని ఇలా గుదిగుచ్చి శేఖర్‌ అంతరంగం గా మీ ముందు ఉంచుతున్నాను.. ఈ ఇంటర్వ్యూలో కార్టూన్‌పట్ల ఆయన తపన,ప్రేమ,అంకితభావం అన్నీ మనకు అవగతమవుతాయి.. శేఖర్‌ ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే….

 

పొలిటికల్‌ కార్టూనిస్టుగా ఈ ఏడాదితో నేను 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాను. అంతకు ముందు వారపత్రికలకు కార్టూన్లు వేయడం ఒక నాలుగైదేళ్లుగా ఉంది. ఎమ్మే తెలుగు సాహిత్యం నా చదువు. హైస్కూల్‌ స్థాయినుంచే క్రియేటివిటీకి సంబంధించిన పనులు, కార్యక్రమాలలో పార్టిసిపేట్‌ చేయడం, గ్రంధాలయాలకు తప్పనిసరిగా వెళ్ళడం అక్కడ చదువుకున్న బాలసాహిత్యం ఇవన్నీ కూడా నన్ను సాహిత్యాభిమానిగా మార్చాయి.
సామాజికంగా వెనుకబడిన కమ్యూనిటీ నుంచి వచ్చాను. మాతల్లి తండ్రులిద్దరూ వ్యవసాయదారులు. మా నాన్న కొంత చదువుకున్న వాడే.. తెలంగాణా సాయుధపోరాట యోధుడు కూడా.చదువుకొని ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడవలసిన అవసరాలు నావి. ఈ సాహిత్యమూ, సభలూ గొప్పవాళ్లు కావాలనే వక్తల ప్రసంగాలూ నన్నూ నా దిశనూ మార్చేసాయి.

sekhar1
అలా డిగ్రీ చదువుతున్న సమయంలో మార్క్సిస్టు పార్టీతో అనుబంధం పెరిగింది. నల్గొండ జిల్లా వామపక్ష ఉద్యమాలకు పెట్టింది పేరు. ఆ క్రమంలోనే పార్టీ వాల్‌రైటింగ్స్‌ చేయడానికి, చిన్న చిన్న బొమ్మలు వేయడానికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు నన్ను ఎంకరేజ్‌ చేసేవారు. ఉద్యమాలలో ప్రత్యక్షంగా,పరోక్షంగా పార్టిసిపేట్‌ చేయడం వల్ల మార్క్సిజాన్ని చదువుకున్నాను. మా తల్లితండ్రులకు నేను ఏంచేస్తున్నానో కూడా తెలుసుకునే అవగాహన శక్తీ,స్థాయి లేవు. వాళ్ళు కేవలం డిగ్రీ పూర్తిచేయడం ఓ ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్‌కావడం,పెళ్ళి చేయడం అంతవరకే ఆలోచించేవారు.
కాని అప్పటికే సాంస్కృతిక కళారంగాలలో పూర్తిగా మమేకమైపోయిన నాకు ఏదైనా ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపుకావాలనే కాంక్ష గాఢంగా ప్రబలింది. నేను చదువుకుంటున్న నల్గొండలో ఆర్టిస్టుల,రచయితల కోలాహలం బాగా ఉంటుండేది. ఆ క్రమంలోనే కార్టూనిస్టుని కావాలనే కోరిక కలిగింది. దానికి కారణం ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్‌. ఆనాడు ఏనోట విన్నా శ్రీధర్‌ నల్గొండ జిల్లాకు సంబంధించిన వాడని,అద్భుతంగా కార్టూన్లు వేస్తాడని, ఈనాడు పత్రికలో ఆయనకు ఎనలేని గౌరవం ఉండేదనే ప్రచారం కథలు కథలుగా సాగుతుండేది. ఆ మాటలు ప్రభావం నేను కార్టూనిస్టుని కావడానికి పూర్తిగా కారణమయ్యాయి. నల్గొండ జిల్లాలోని మిగతా కార్టూనిస్టులదీ దాదాపు ఇదే పరిస్థితి.
బీఎస్సీ పూర్తిచేసాక ఎమ్మే కాకతీయ యూనివర్శిటీలో జాయిన్‌ కావడం జరిగింది.అప్పటికి పూర్తిగా కాకపోయినా అంతో ఇంతో విప్లవభావాలు వచ్చిచేరాయి. అజ్ఞాతం లో  ఉన్న అన్నలు చాలామంది యూనివర్శిటీలో తారసపడి స్ఫూర్తిదాయకంగా కనిపించేవారు. అయితే ఈ చదువులూ, కార్టూన్లపై ఆసక్తి వ్యవహారం ఇలా నడుస్తున్నప్పటికి డిగ్రీలో ఉండగానే నాకు వివాహం చేసేసారు. అమ్మాయి పూర్తిగా నిరక్షరాస్యురాలు..సో..తప్పనిసరిగా నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకోవలసిన పరిస్థితికి నెట్టబడ్డాను.అయినా ఈ మొత్తం స్ట్రగుల్‌లో కెరీర్‌గా కార్టూన్‌ని ఎంచుకోవడానికే మొగ్గు చూపాను. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా వాటిని కాదనుకునేంతటి వ్యామోహం కార్టూన్లపై ఏర్పడింది. పత్రికలో కార్టూన్‌ని చూసుకోవడం, కార్టూన్‌లో నాపేరు చూసుకోవడం ఇవన్నీ ఒక దివ్యమైన విషయాలుగా కనిపించేవి. ఈ దశలో విజయవాడ నుంచి మార్క్సిస్టుల దినపత్రిక ప్రజాశక్తి నుంచి ఆహ్వానం అందింది. అప్పటి ఎడిటర్‌ మోటూరు హనుమంతరావు గారు మా సంపాదకవర్గంలో చేరమని హాస్టల్‌కి ఉత్తరం రాసారు. ఆ విధంగా ప్రజాశక్తికి మొట్టమొదటి కార్టూనిస్ట్‌ని అయ్యాను. 1989 జూన్‌ 16న నా మొదటి కార్టూన్‌ ప్రజాశక్తిలో ప్రచురణ జరిగింది.

 

సెల్ఫ్‌గ్రూమింగ్‌

ఇక ప్రజాశక్తిలో రోజూ నేను పనిచేసేదంతా హేమాహేమీలతోనే.బొమ్మారెడ్డి గారు, తెలకపల్లి రవిగారు నన్ను బాగా ఇష్టపడేవారు. నేను కోరినట్టుగా ఒకవైపు కార్టూన్లు,ఒక వైపు సబ్‌ ఎడిటింగ్‌, అడపాదడపా సినిమా రివ్యూలు,సాంస్కృతిక కార్యక్రమాల రిపోర్టింగ్‌ చేసేవాడిని. మార్క్సిజం ప్రాధమిక విషయాలతో పాటు చాప్లిన్‌ సినిమాలు,గురజాడ,కొడవటిగంటి వంటి వారి రచనాశైలిని ఆకళింపు చేసుకున్నాను. బొమ్మల విషయానికి వస్తే ఆర్‌.కె.లక్ష్మణ్‌ బొమ్మలను ఫాలో అయ్యేవాడిని,ఆయన ఆలోచనాధోరణిని సైతం ఆకళింపు చేసుకుని కార్టూన్లు వేసేవాడిని.
అదే సమయంలో గ్లోబలైజేషన్‌, సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం వల్ల సోషలిజం మీద ఉన్న భ్రమలు తగ్గడం  మొదలుపెట్టాయి. అయినా పి.వి.నరసింహారావు సరళీకరణ విధానాలమీద, మతోన్మాదం మీదా, ఐ.ఎమ్‌.ఎఫ్‌,డంకెల్‌ విధానాల మీద విస్త్రృతంగా,పుంఖాను పుంకాలుగా కార్టూన్లు వేసాను.
ప్రజాశక్తి ఆదివారం సంచికలలో తెలుగ్నుసాహిత్యాన్ని ఉపయోగించుకొని అనేక కార్టూన్లు వేసాను. ఆ సమయం తెలుగు పొలిటికల్‌ కార్టూన్‌ రంగానికి సువర్ణ అధ్యాయం. ఒకవైపు శ్రీధర్‌,సురేన్ద్ర,మోహన్‌,శ్యాంమోహన్‌ వివిధ పత్రికలలో కలర్‌ఫుల్‌ కార్టూన్లతో అలరిస్తుండేవారు. అయితే గ్రేట్‌ మాస్టర్స్‌ బొమ్మల్ని స్టడీచేయలేకపోవడం ఒక లోపంగా ఉండేది.

ఛలో హైదరాబాద్‌
ప్రజాశక్తిలో ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నా ఆర్ధికంగా ఇబ్బందులు పడేవాడ్ని. భార్య ఇద్దరు పిల్లలతో కష్టంగా ఉండి ప్రజాశక్తి…తరువాత స్వశక్తిని నమ్ముకుని హైదరాబాద్‌ ఆంధ్రప్రభలో కార్టూనిస్ట్‌ సురేన్ద్ర సహకారంతో చేరాను. కానీ ఆంధ్రప్రభలో కులాల జాఢ్యం ఎక్కువగా ఉండేది. అప్పటి ఎడిటర్‌లతో నానా యాతనా పడాల్సి వచ్చింది. నేను చేరింది ఫ్రీలాన్సర్‌గా అయినా సరే ఈ జాఢ్యాలన్నీ ఎదుర్కోవలసి వచ్చేది. ఒక పదేళ్లపాటు అక్కడ కార్టూనిస్టుగా పనిచేసినా కేవలం‘జీవిక’ కోసమే భరించవలసి వచ్చింది. ఫ్రీలాన్సర్‌ని కాబట్టి ప్రజాశక్తితో కూడా అనుబంధం కొనసాగుతూ ఉండేది.ఇవికాక వివిధ సంస్థలకు పుస్తకాల కవర్‌పేజీలు,కార్టూన్లు, చిన్న చిన్న ప్రింటింగ్‌ పనులు చేసేవాడిని. అదే సమయంలో ‘చేతన పబ్లికేషన్స్‌’ పేర పుస్తక ప్రచురణ కూడా ప్రారంభించాను.
ఓవైపు తలమునకలుగా ఇన్ని పనులు చేస్తున్నా సాహిత్యం చదవడం, ఇంగ్లీషు చదువుకోవడం,రెగ్యులర్ గా  ఇంగ్లీషు కార్టూన్లు స్టడీ చేయడం,రాజకీయ కార్టూన్లు స్టడీచేయడం మాత్రం మానలేదు. ఓ వైపు నా మూలాలు, నా కల్చర్‌ని ప్రత్యామ్నాయంగా వెతకసాగాను.ఇక్కడ అప్పటికే మోహన్‌ లైన్‌ పరంగా ఎంతో ముందుకు వెళ్లి ఎందరినో ప్రభావితం చేసాడు.నేను మోహన్‌తో కలిసి ఉంటున్నా ఆయన లైన్‌ని అందుకోలేకపోయాను కాని ఆయన భావజాలాన్ని పూర్తిగా అందుకున్నాను.
ఓ పక్క ఇంటివద్ద డి.టి.పి వర్క్స్‌ చేస్తూ ఉండేవాళ్లం. నా భార్య చంద్రకళను చదివించి ఆమెకు కంప్యూటర్‌ నేర్పించాను.
నేను అత్యంతగా ఆనందించిన విషయంలో నా భార్యకు చదువు,కంప్యూటర్‌ నేర్పడం ఒకటి. ఇలా ఇంటి దగ్గర  కంప్యూటర్‌ జాబ్‌వర్క్స్‌ చేయడం,ఆర్దిక అవసరాల రీత్యా ఎక్కువ బొమ్మలు వేయడం వల్ల శిల్పం మీద ఎక్కువగా దృష్టిపెట్టలేదు. కాని ఐడియాలలో శేఖర్‌ దిట్ట అనిపించుకున్నాను. ఆర్ధికంగా చూసినా ఎలా చూసినా తెలుగు  పొలిటికల్‌ కార్టూనిస్టు జీవితం అభద్రతగా అనిపించి ఇంగ్లీషు జర్నలిజంలోకి వెళ్లడానికి పలు ప్రయత్నాలు చేసాను. ది వీక్‌, అవుట్‌లుక్‌ వంటి పత్రికలకు ఇంటర్వ్యూలకు వెళ్లాను.ముంబయి ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ లో అవకాశం వచ్చినా వదులుకున్నాను.

ఉద్యమాలతో ఉయ్యాల
హైదరాబాద్‌లో రగులుతున్న ఉద్యమాలన్నింటికీ పార్టీలు, గ్రూపులతో నిమిత్తం లేకుండా మోహన్‌ కార్టూన్లు,పోస్టర్లు వేస్తుండేవాడు. ఆ తరువాత  అవకాశాలు ఎక్కువగా నాకు వచ్చాయి. దళిత,బహుజన,తెలంగాణ,సిపిఐ,మార్క్సిస్ట్‌,ఎం ఎల్‌గ్రూపుల వాళ్లందరికీ కావలసిన పోస్టర్లు,క్యాసెట్‌ కవర్లు,కరపత్రాలు,పోస్టర్‌ డిజైన్‌లు విస్త్రృతంగా చేసేవాడిని. రెగ్యులర్  కార్టూనింగ్‌ చేస్తూ ఈ వర్క్‌ చేసేవాడిని.
2001లో నేనూ శ్యామ్‌మోహన్‌ చొరవతీసుకుని బెంగుళూరు వెళ్లి కర్నాటక కార్టూనిస్టుల సంఘం సమావేశానికి వెళ్లి ఆ తరహాలో ఫోరం ఫర్‌ పొలిటికల్‌ కార్టూనిస్టుల సంఘం ఏర్పాటుచేసాం. తరువాత దానికి ప్రెస్‌అకాడమీ, ఐయ్యేయస్‌ రమణాచారి లాంటి వాళ్లు పూర్తి సహకారం అందించి ఎన్నో ప్రదర్శనలు వర్క్‌షాప్‌ జరిగేలాగా తోడ్పడ్డారు. ఆ క్రమంలోనే పలువురు తెలుగు  చిత్రకారులు ప్రస్తుతమున్న ప్రముఖ దినపత్రికలలో స్థానం దక్కించుకున్నారు.
ఈ క్రమంలో దళిత ఉద్యమాన్ని కొంత మిస్సయినా, తెలంగాణ మలిదశ ఉద్యమానికి వచ్చేసరికి నా మూలాలు,సంస్కృతి ఏమిటో బాగా తెలిసి వచ్చింది. ఆ తరువాత పరోక్షంగా ఉద్యమానికి చాలా కార్టూన్లు,పోస్టర్లు అందించాను. ఆ క్రమంలోనే 2011లో ‘గిది తెలంగాణ’ పుస్తకం వచ్చింది. అది ఉద్యమానికి ఊతకర్రగా ఉందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి వాళ్లు ఆకాశానికెత్తారు. ప్రస్తుతం దళిత బహుజనవాదాన్ని అధ్యయనం చేస్తున్నాను.ఎనభైశాతంగా ఉన్న దళిత బహుజనులని అతి తక్కువ శాతంగా వున్న ఉన్నత వర్గాలు ఎలా ఎక్స్‌ప్లాయిట్‌ చేస్తున్నాయనేది స్పష్టంగా అర్ధమవుతోంది. సహజంగా, మార్క్సిస్టుగా నేను కులాన్ని నమ్మను. కాని ఈ సమాజంలో అది పోషిస్తున్న పాత్రను మాత్రం చాలా దగ్గరగా  చూసాను. ఎక్కడా కులతత్వవాదిగా ప్రవర్తించలేదు పైగా ఎనభై శాతంగా వున్న అన్ని రకాల కులాల వాళ్లపై సానుభూతి ఉంది. ఈ క్రమంలోనే భారతదేశంలో కులం అనేది ఎంతటి దుష్ఫరిణామాలకు దారితీస్తుందో తెలియజేయడానికి నా తాజా పుస్తకం ‘కేస్ట్‌ కేన్సర్‌’ పుస్తకంలో ప్రయత్నిస్తున్నాను. ఇది కులాలను వ్యతిరేకించేదిగా కాకుండా సమాజాన్ని కులాలుగా విభజించిన వారి మీద ఎక్కుపెట్టిన అస్త్రంగా ఉంటుంది.

ఇంగ్లీషుకార్టూన్లపై మోజు

జాతీయస్థాయిలో గుర్తింపు పొందడానికి ఎలాగైనా ఇంగ్లీషు కార్టూనిస్టుగా ప్రాచుర్యం పొందడానికి 36 ఏళ్ల వయసులో ఇంగ్లీషును మరింత మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాను. కొంత కాన్ఫిడెన్స్‌ వచ్చాక హైదరాబాద్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేరాను. మొదటి పేజిలో కేరికేచర్లు,ఇలస్ట్రేషన్లు,సండే మేగ్నజైన్‌లో కామిక్‌ బొమ్మలు వేసేవాడ్ని కాని పొలిటికల్‌ కార్టూనిస్టుగా నేననుకున్న బ్రేక్‌ రాలేదు. అలా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మూడేళ్ళపాటు పనిచేసాను. రకరకాల ఫీచర్స్‌కు,వార్తలకు బొమ్మలు వేసేవాడిని. ఆ తరువాత రెట్టింపు జీతం ఆఫర్‌ చేయడంతో ఆంధ్రజ్యోతిలో చేరాను.‘శేఖర్‌ టూన్‌’ అనే సిండికేట్‌ ద్వారా ఇంగ్లీషులో కార్టూన్లు వేస్తూ నార్త్‌ ఇండియన్‌ పత్రికలకు రెగ్యులర్ గా  పొలిటికల్‌ కార్టూన్లు పంపుతుండేవాడ్ని. అలా దాదాపు పదిభాషలలోఇంగ్లీషు,పంజాబీ,హిందీ,మరాఠీ,బెంగాళీ,ఉర్దూ,గుజరాతీ,మణిపురి భాషలలో నా కార్టూన్లు వచ్చేవి.

అపూర్వమైన అమెరికా అవకాశం
2011లో అమెరికన్‌ కాన్సులేట్‌ వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇరవైమంది కార్టూనిస్టులని నెలరోజులపాటు అమెరికాలో స్టడీటూర్‌కి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కార్టూనిస్టుల కార్టూన్లను ఇంటర్నెట్‌లో పరిశీలించి నన్ను ఎంపిక చేసారు. ఆంగ్ల లభాషలో రాయడం, మాట్లాడగలగడం  నాకు అదనపు అర్హత అయింది.అలా అమెరికాలో ఐదు ప్రసిద్ద రాష్ట్రాలు వాషింగ్న్టన్‌ డి సి, న్యూయార్క్‌,లాస్‌ఏంజిల్స్‌,ఫ్లోరిడా,ఒహాయ్‌ ఈ ఐదు రాష్ట్రాల్లో అనేక పత్రికల ఎడిటోరియల్‌ కార్టూనిస్టులని సంపాదకులని కలిసాము. ప్రొఫెషనల్‌గా అది చాలా గొప్ప టూర్‌. ఒక అరుదైన అవకాశం. రమీరాజ్‌,ఆంటెల్‌నెస్‌,డెరిల్‌ కేగిల్‌ వంటి ఉద్దండ కార్టూనిస్టులని కలవడం వారినుంచి ఇన్‌స్పిరేషన్‌ తీసుకోవడం వారి నుంచి కార్టూన్‌సిండికేషన్‌కు సైతం ఇన్‌స్పిరేషన్‌ పొందడం జరిగింది. అమెరికాలో కార్టూనిస్టులు ఆర్ధికంగా స్థిరపడినవారు. ఒక్కో కార్టూనిస్టు సిండికేషన్‌ ద్వారా చిన్న చిన్న ఆఫీసులను సైతం మెయిన్‌టెయిన్‌ చేయడం విశేషం. అలాగే అక్కడ ఆర్ధికంగా బాగోలేకపోయిన ఒక కార్టూనిస్టు పట్ల మిగతా కార్టూనిస్టులు వర్క్‌ విషయంలో షేర్‌ చేసుకుని ఆ కార్టూనిస్టుని ఆదుకోవడానికి ముందుకురావడం నేను అమెరికాలో ఉన్నపుడు నా కళ్లముందే జరిగిన విశేషం. మన దగ్గర ఒకరు ఎదుగుతున్నాడంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ.
56

నా కార్టూన్‌ శీర్షికలు
రోజువారీ కార్టూన్లతో పాటు పత్రికల సండే మేగ్నజీన్‌లలో పలు కార్టూన్‌ శీర్షికలు నిర్వహించేవాన్ని, జ్ఞాతం గా,  అజ్ఞాతంగా  వేలాది కార్టూన్లు అంటే ఇప్పటికి నలభై ఆరువేల కార్టూన్లు వేసానని గర్వంగా చెప్పగలను. శేకరవాలం,శేఖర్‌టూన్స్‌,అల్లాడీన్‌,లైఫ్‌లైన్‌ నా కార్టూన్‌ శీర్షికలలో ప్రజాదరణ పొందినవి. ఇవికాక ఓ ఐదు కార్టూన్‌ పుస్తకాలు ప్రచురించాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున 2006లో ఉత్తమ కార్టూనిస్ట్‌ అవార్డు అందుకున్నాను.ఇతరత్రా కూడా నాకు అనేక అవార్డులు వచ్చినా ఆర్దికంగా వాళ్లిచ్చే ‘పర్స్‌’ నన్ను ఎక్కువగా ఉత్సాహపరుస్తుండేది.
అలాగే వ్యాసాలు రాయగలగడం అనేది నాకు అదనపు అర్హతగా ఉండంది. కార్టూన్లమీదే కాక ఇతర అంశాలపై కూడా చాలా వ్యాసాలు రాసాను. నేను రాసిన ప్రతి వ్యాసమూ విమర్శకుల ప్రశంసపొందిందే. అనేక టీవీ ఛానళ్ల చర్చా కార్యక్రమాలలో, రేడియో కార్యక్రమాల్లో కార్టూన్లకు విస్త్రతంగా ప్రచారం కల్పించడానికి కృషిచేసాను. అన్నింటికీ మించి హిందూ పత్రిక తన ‘కాలమ్స్‌’లో నన్నువన్‌ ఆఫ్‌ ద బెస్ట్‌ కార్టూనిస్ట్‌ ఆఫ్‌ ఇండియా అని పేర్కొన్న సంగతి నాకు బాగా ఆనందం కలిగించే విషయం

ఏది మంచి కార్టూన్‌?
ఈ ప్రశ్నకు కొంతమంది బాగా నవ్వించేది వ్యంగ్యంతో గిల్లగలిగేది,సున్నితంగా విషయాన్ని చెప్పగలిగేది అని సమాధానలిస్తుంటారు. కాని నా దృష్టిలో ‘థాట్‌ ప్రొవోకింగ్‌’ చేసేదే సరైన కార్టూన్‌ అంటాను. ఇప్పుడున్న రాజకీయాలు చూస్తున్నాం కద సున్నితంగా, చమత్కారంగా చెపితే అర్ధం చేసుకుని సరిదిద్దుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటారా? అందుకే కార్టూన్‌ నవ్వించకపోయినా పరవాలేదు, ఖచ్చితంగా ఆలోచింపజేసేదై ఉండాలంటాను. నిజానికి కార్టూన్‌ అనేది అద్భుతమైన కళ. వాటిని కేవలం నవ్వించడానికే పరిమితం చేయడం అంటే దాని విలువ మనం గుర్తించకపోవడమే. మన కార్టూనిస్టులలో చాలామంది ‘లీజర్‌ వర్గం’ నుంచి రావడం వల్ల కార్టూన్‌ని కేవలం హాస్యప్రక్రియ క్రిందే చూస్తున్నారు. అదే సామాజికంగా వెనుకబాటునుంచి వచ్చిన కార్టూనిస్టులు దానినొక ‘పంచింగ్‌’ ఆయుధంగా చూస్తున్నారు. ఈ కారణం రీత్యానే నేడు మనకు ఉన్న పొలిటికల్‌ కార్టూనిస్టులు ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వారే.
చరిత్రలో మనం ఎక్కడున్నామో మనం అర్ధం చేసుకోవాలి. మనది కాని కల్చర్‌ని ఓన్‌ చేసుకుని కార్టూన్లు వేయడం సరైన పద్దతి కాదు. మన లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలలో కార్టూనిస్ట్‌ పీడితుల(సఫరర్‌) పక్షానే ఉండాలి.

మనం ఎక్కడున్నాం?

మన కార్టూనిస్టులలో చాలా మందికి సామాజిక స్పృహ తక్కువ. మనది చాలా చిన్న కమ్యూనిటీ. ఒకప్పుడు స్టార్‌ ఇమేజ్‌ ఉండేది. క్రమంగా అది కనుమరుగైపోయింది. ఉన్న వాళ్లలో చాలామందికి సామాజిక స్పృహ లోపం ఉంది.. చుట్టూ ఉన్న సమాజం నుంచి అంశాలను తీసుకొని హాస్యస్ఫోరకంగా వేయడం తక్కువ. ఒక‘టెంప్లేట్‌’ లాంటి కార్టూన్‌ సిస్టమ్‌లో ప్రతి ఏడాది అవే కార్టూన్లు వేస్తున్నాం. కాబట్టి పాఠకులను అలరించలేకపోతున్నాం. దీనికి తోడు పత్రికలు తగ్గిపోవడం, కార్టూన్లకు స్పేస్‌ తగ్గడం  జరిగింది. ప్రస్తుతం కొంతలో కొంత కార్టూన్‌ని సోషల్‌మీడియా బతికిస్తుంది. అదికూడా చాలా మినిమైజ్‌డ్‌గా, వాటితో వచ్చే డబ్బులతో ఏ కార్టూనిస్టుకీ అవసరాలు తీరవు. కవులూ,రచయితలూ కవిత్వం రాసి ఒకరికొకరు చూపించుకున్నట్లుగా ఒకరికి ఒకరు‘లైక్‌’లు కొట్టుకుని సంతృప్తి పడాల్సిన పరిస్థితి.
కార్టూనిస్టుకి ఏ మాత్రం ఆర్ధిక దన్ను లేదు. ఒక చిన్న ప్రపంచంలో గ్నత వైభవం తలచుకుంటూ మురిసిపోవడం మినహా ప్రస్తుతానికి కార్టూనిస్టు చేయగలిగింది ఏమీలేదు. ఇందుకు దినపత్రికల కార్టూనిస్టులు ఏమీ మినహాయింపు కాదు. వేళ్లమీద లెక్కపెట్టగలిగినంతమంది మాత్రమే ఈ రంగంలో అదికూడా అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నారు. జీవిక కోసం ప్రతిరోజూ కార్టూన్‌లు వేయాల్సి రావడం వల్ల కొంతలో కొంత ఈ కార్టూన్లలోనే క్వాలిటీ కనిపిస్తుంది. చాలామంది దినపత్రికల కార్టూనిస్టులు చేస్తున్న ఉద్యోగ్నంతో పూర్తిస్థాయిలో బ్రతకలేక చిన్నా చితకా పనులు చేసుకుంటూ కార్టూన్‌ రంగంలో కొనసాగుతున్నారు. దినపత్రికల మొదటిపేజీలో ఉండవలసిన కార్టూన్‌ లోపల ఎక్కడికో విసిరివేయబడిరది. దినపత్రికకు మసాలా దినుసులలో కార్టూన్‌ ఒకటిగా ఉండబట్టే ఆ మాత్రం సర్వైవ్‌ అవుతున్నాయి. ఇంటర్నెట్‌,ఫొటోలు ఇతర అంశాలు విస్త్రతంగా దొరికి కార్టూన్‌ప్లేస్‌ని తగ్గించివేసాయి. సమాజంలో వస్తున్న అనేక ఆధునిక మార్పులలో దీనిని ఒకటిగా చూడటం తప్ప మనం వగచి  లాభంలేదు. అయితే సమాజాన్ని అర్ధం చేసుకుని అది హాస్యమైనా,వ్యంగ్యమైనా,చమత్కారమైనా కార్టూన్లలో ప్రతిఫలింపజేస్తే వాటికి ప్రాధాన్యత ఉండటం ఇప్పటికీ గమనించవచ్చు. వారపత్రిక కార్టూన్లలో ఒక మూసధోరణి ఉంటుంది. దిన పత్రికల కార్టూన్లలో కూడా అదే మూసధోరణి. గీసిందే గీసి చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. దీనికి నాతో సహా ఎవరూ మినహాయింపు కాదు.. అప్పుడపుడు ఏ ఇంగ్లీషు,ఇతర భాషలలోనో చమక్కుమన్న కార్టూన్‌ని తీసుకుని మనకి వర్తింపచేసుకుంటే అదో పెద్ద నేరం కింద భావిస్తున్నారు. మన తెలుగు భాష ప్రపంచంలో ఉన్న వేలాది భాషల్లో ఒక భాష. మన పత్రికలు, టీవీఛానళ్లు ఇతర మీడియా అనేక అంశాలని తెలుగులోకి దిగుమతి చేసుకుని అందిస్తున్న మాట వాస్తవమే కదా? అలాగే కార్టూన్లు కూడా. దీనికి కొందరు రంధ్రాన్వేషణ చేస్తూంటారు. మనది ఒక ప్రాంతీయ భాష అని గుర్తుంచుకుంటే సరి.

కార్టూన్‌కి సాహితీ గౌరవం ఏదీ?
నిజానికి చాలామంది కార్టూనిస్టులు జీవికకోసం కార్టూన్లు వేయడం,కొద్దిమంది తమ అభిరుచి మేరకు ఆయా రంగాలలో నిష్ణాతులవడం వల్ల ఈ మాత్రం గుర్తింపు తెలుగు కార్టూన్‌కి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో వస్తోంది.అయితే డబ్బు లేదనుకోండి. కార్టూన్‌ రంగంతో నిరాశతో ఇలా అనడంలేదు. కార్టూన్‌ గొప్పదని అర్ధం కావడానికి పాతికేళ్ళు పట్టింది. మరో విషయం కార్టూనిస్టులు ఎవరిస్థాయిలో వారు వ్యక్తిగతంగా కృషిచేస్తూ వారి ముద్రను క్రియేట్‌చేసారు. కానీ ఇది గమనించక ఎవరికి వారు ఇతరులతో పోల్చుకుని ఆత్మన్యూనతలో పడి ఫలానా వారి తరువాత నేనే ప్రకటించుకుంటున్నారు. చేసిన కృషికి తగిని సరైన ఎలివేషన్‌ లేకపోవడం కూడా ఈ దౌర్భాగ్యానికి కారణం. వెకిలి కార్టూన్‌లు వేయడం, కించపరిచేకార్టూన్లు వేయడం ఇలాంటి అన్ని కారణాల వలన కార్టూన్‌కి సాహితీ గౌరవం లేకుండా పోయింది.
కవిత్వాలకు,కథలకు వేసిన మంచి బొమ్మలతో కార్టూనిస్టు,ఆర్టిస్టు సంతృప్తి పడాల్సి వస్తోంది. నిజానికి కార్టూన్‌ చాలా శక్తివంతమైనది. థాట్‌ ప్రోవోకింగ్‌ కార్టూన్‌ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. మనం సమాజాన్ని రాత్రికి రాత్రి మార్చలేకపోవచ్చు,రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టించలేకపోవచ్చు. కాని ఒక ఆలోచన సృష్టించే కార్టూన్‌ దాని పని అది చేసుకుపోతుంది. ఒకరినుంచి ఒకరికి భావప్రసారమై ఒక మాస్‌ ఒపీనియన్‌ కిందకు తప్పకుండా మారుతుంది.

కార్టూనింగ్‌ అంత ఈజీ కాదు
పత్రికల్లో కార్టూనిస్ట్‌ తన పేరు చూసుకోవడం కోసం, దానికోసం పడే తపన,బాధ అంతా ఇంతా కాదు. కాని ఓ మంచి కార్టూన్‌ వేసి మెప్పించాలంటే దాని వెనుక ఎంతో అవగాహన,చదువు,చమత్కారం,డ్రాయింగ్‌ స్కిల్స్‌ ఇవన్నీ ఉండి తీరాలి. నిజానికి దీంట్లో చాలా పెయిన్‌ ఉంది. కార్టూనిస్టులు సెన్సిటివ్‌,అల్పసంతోషులు కాబట్టి తమ పేరు చూసుకొని ఇవన్నీ మరచిపోతారు. ఒక దినపత్రికలో ఒక కార్టూన్‌ వచ్చిందంటే ముందు అది ఎందరినో మెప్పించాలి. వడపోతలో నిలవాలి. ఆ తరువాత కార్టూనిస్టు శ్రమని బట్టి పాఠకుడి దయను బట్టి దాని సక్సెస్‌,ఫెయిల్యూర్‌ నిర్ణయించబడతాయి. చాలా మంది కార్టూన్‌ చూపించగానే ముందు మొహమాటం కొద్దీ నవ్వుతారు. అదే నిజమైన జడ్జిమెంట్‌గా భావించి మరొక పెయిన్‌ తీసుకోవడానికి పూనుకుంటాడు. నా కార్టూన్లలో చాలాసార్లు మొనాటనీ వచ్చి దానిని తొలగించుకోవడం కోసం నా బొమ్మ నేనే వేసుకునేవాడిని. రిపోర్టర్‌ కేరెక్టర్‌లలో చాలాసార్లు నేను కనిపించేవాడ్ని.
రెగ్న్యులర్‌గా కార్టూనింగ్‌ చేసేవారికి థాట్‌ప్రాసెస్‌ కూడా ఒక దశలో అలవాటయిపోతుంది. కొంతకాలం తరువాత ఏ సబ్జక్టయినా ఎలాగయినా వేయగలిగే స్థితికి వస్తాడు. సమాజంలో భిన్న వర్గాలు ఉంటాయి. ఒక ‘కామన్‌మేన్‌’ని అంటూ క్రియేట్‌ చేసి అతన్ని సంతృప్తి పరచడం ఒకప్పుడు సాధ్యపడేది. ఈ రోజు పెరిగిన టెక్నాలజీ,ఛానళ్ళప్రకారం పాఠకులు రకరకాలుగా పెరిగారు.
కుల,మతాలు,ప్రాంతీయబేధాలు,పత్రికల పాలసీలు,పాఠకుడి అభిరుచి ఇవన్నీ బేలన్స్‌ చేసుకుంటూ కార్టూన్‌ వేయడం కత్తిమీద సామే!అయినా ఒక ఆర్ట్‌ ఫామ్‌గా కార్టూన్‌ గొప్పది చాలా గొప్పది.

ఇంటర్వ్యూ: హరి (విశాఖపట్నం)

 

***

శేఖర్‌ బయోడేటా

పూర్తి పేరు : కంభాలపల్లి చంద్రశేఖర్‌ చదువు : ఎం. ఎ (తెలుగు లిటరేచర్‌) బీఎస్సీ(సైన్స్‌) వయసు : 49 సంవత్సరాలు 16 జులై 1965 న నల్లొండజిల్లా సూర్యాపేటలో జన్మించారు. చిరునామా : బాలాజీహిల్స్‌,బోడుప్పల్‌,హైదరాబాద్‌ గత పాతికేళ్లుగా ప్రజాశక్తి,ఆంధ్రప్రభ,ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌,దినపత్రికలలో పొలిటికల్‌ కార్టూనిస్టుగా పనిచేసి ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘లోకంతీరు’ పై పాకెట్‌కార్టూన్లు వేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన నలభైఎనిమిది వేలకు పైగా కార్టూన్లు వేసారు..ఇందులో ఎక్కువ భాగం పొలిటికల్‌ కార్టూన్లు..పొలిటికల్‌ కార్టూన్లతో పాటు..వేలాది సోషల్‌ కార్టూన్లు…వందలాది ఇలస్ట్రేషన్లు..కారికేచర్లు వేసారు. ‘శేఖర్‌టూన్‌’ పేరిట పలు ప్రముఖ భారతీయ భాషా పత్రికలలో ఆయన కార్టూన్లు ప్రతినిత్యం ప్రచురితమవుతున్నాయి. కార్టూనిస్టుల మీద,కళారంగంపై పలువ్యాసాలను రచించారు, కార్టూన్‌ రంగంపై ఎన్నో రేడియో,టెలివిజన్‌ ఇంటర్వ్యూలను సైతం ఇచ్చారు.హిందూ దినపత్రిక తన ‘కాలమ్స్‌’లో భారతీయ కార్టూనిస్టులలో శేఖర్‌ను ఉత్తమ కార్టూనిస్టుగా కొనియాడిరది. శేకర్‌టూన్స్‌,లైఫ్‌లైన్‌,శేకర్‌వాలమ్‌,ఆల్‌ ఇన్‌ ద సైన్స్‌,రన్నింగ్‌ కామెంటరీ,అలాడీన్‌ ఆయన కార్టూన్‌ శీర్షికలలో ప్రాచుర్యం పొందినవి.శేఖర్‌ ఇప్పటి వరకు పారాహుషార్‌, బ్యాంక్‌బాబు,శేఖర్‌టూన్స్‌,గిది తెలంగాణ,కలర్స్‌ ఆఫ్‌ ఇండియా పుస్తకాలను ప్రచరించారు.‘ కేస్ట్‌ క్యాన్సర్‌’ ఆయన నుంచి రాబోతున్న సంచలనాత్మక పుస్తకం. ఆయన పలు కార్టూన్‌ ప్రదర్శనలు ఏర్పాటుచేసారు, బెంగుళూరులో ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్ష్‌‘లో శేఖర్‌ కార్టూన్ల ప్రదర్శన జరిగింది. ‘ఆంధ్రప్రదేశ్‌ ఫోరం ఫర్‌ పొలిటికల్‌ కార్టూనిస్ట్స్‌’ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఫోరం కోశాధికారిగా ఉంటూ పలు జాతీయ ఫెస్టివల్స్‌ నిర్వహించారు.అమెరికన్‌ ప్రభుత్వం శేఖర్‌ కృషికి గుర్తింపుగా 2011లో తమ దేశం ఆహ్వానించి ఆయనను గౌరవించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలను నెలరోజులపాటు శేఖర్‌ సందర్శించి అమెరికన్‌ కార్టూనిజం అభివృద్దిని ఆకళింపుచేసుకున్నారు. 2006లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనను ఉత్తమ కార్టూనిస్టుగా అవార్డునిచ్చి సత్కరించింది. లయన్స్‌ ఇంటర్నేషనల్‌ లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డ్‌,వడ్లమూడి రామ్మోహనరావు అవార్డు, ఇంకా పలు ప్రతిష్టాత్మక సంస్థల అవార్డులు శేఖర్‌ అందుకున్నారు.

 

‘‘ నెట్‌లో…శేఖర్‌’’
నెట్‌లో రాజ్యం ఏలుతున్న రోజులివి.వికిపీడియా మొదలుకొని శేఖర్‌ స్వంత బ్లాగు ‘శేఖర్టూన్‌’ వరకు ఎన్నో పేజీల్లో శేఖర్‌ కార్టూన్లను మనం చూడవచ్చు. ఇక ఫేస్‌బుక్‌,ట్టిట్టర్‌లైతే సరే సరి. మచ్చుకు కొన్ని అంశాలు.

en.wikipedia.org/wiki/shekar
shekartoon.blogspot.com
youtube/shekar cartoonist
google ýË shekartoons/shekar kambalapally అని టైప్‌చేస్తే బోలెడన్ని శేఖర్‌ కార్టూన్లు చూడవచ్చు. ఆయన స్వంత బ్లాగులోనైతే ఆయన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి ద్వారా ఆయన కార్టూన్లు విస్త్రతంగా కనిపిస్తాయి.
Email: shekartoon@yahoo.com
ఫోన్‌: 9849378031

10ashekar babay family

భార్య చంద్రకళ, కొడుకు నందూ, కూతురు చేతన తో శేఖర్

స్ఫూర్తిదాయక జంట చంద్రకళా …శేఖర్‌
కార్టూనిస్ట్‌ శేఖర్‌ గురించి ప్రస్తావించినపుడు ఆయన జీవిత సహచరి చంద్రకళ గురించి చెప్పకుండా ఉండలేం. భార్యా భర్తలకు స్వచ్చమైన నిదర్శనం ఆ జంట. అది కార్టూనిస్టుల మీటింగ్‌ కావచ్చు. కవి సమ్మేళనం కావొచ్చు. మరో రాజకీయ పార్టీ బహిరంగసభ కావొచ్చు ఎక్కడైనా ఇద్దరూ ప్రత్యక్షం. శ్రీమతి చంద్రకళ శేఖర్‌ తీర్చిదిద్దుకున్న బొమ్మ. ఒకరిని చూస్తే మరొకరు గుర్తుకువస్తారు,సాహిత్య కళారంగాల్లో చాలామందికి.
ఎప్పుడో పెళ్లంటే ఏంటో కూడా తెలియని వయసులో నిరక్షరాస్యురాలైన చంద్రకళను శేఖర్‌ వివాహం చేసుకున్నాడు. దాదాపు 30 ఏళ్లు వారి జీవన ప్రయాణంలో నేర్చుకుంటున్నదే ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ల పెళ్లినాటికి ఆమె నిరక్షరాస్యురాలు,శేఖర్‌ నిర్గీతరాస్యుడు.అప్పటికి ఆయనకు కార్టూన్లు తెలియదు. ఒకరి సమక్షంలో ఒకరు కార్టూన్లు,చదువు నేర్చుకున్నారు. భార్యకు చదువులేదని బాధకు గురైన మరుక్షణమే శేఖర్‌ ఆమెకు అక్షరాభ్యాసం చేశాడు. అలా ఓ దశాబ్దంన్నర కాలంలో ఆమెను బి.ఏ వరకు చదివించారు. అన్నిటికీ ఆయనే గురువు. కంప్యూటర్‌ రంగంలో డిటిపి డిజైనింగ్‌ నేర్పించి ‘చేతనాగ్రాఫిక్స్‌’ పేరుతో సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆమె కూడా శేఖర్‌ స్ఫూర్తితో పెయింటింగ్‌లు వేయడం నేర్చుకున్నారు. ఒకవైపు పిల్లల పెంపకం మరోవైపు ఇద్దరి చదువు. క్షణం తీరిక లేకుండా గడిచింది. శ్రీమతి చంద్రకళ తనకు చదువు వచ్చిందని నమ్మకం కుదిరాక అలతి అలతి పదాలలో ‘‘ కలుపుతీసిన..కంప్యూటర్‌ చేసినా’’ అనే చిన్న పుస్తకాన్ని రాసారు. పెళ్లికి ముందు పొలాల్లో పనిచేసి, పశువులు కాసిన చంద్రకళ రాసిన ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు వయోజన విద్యాశాఖలో ఓ పాఠ్యగ్రంధంగా ఉంచారంటే చదువు విషయంలో చంద్రకళ చేసిన కృషి తెలిసిపోతుంది. శేఖర్‌ ఏం చదివినా,చూసినా ఆమెకు చెప్పకుండా ఉండరు. ఆఖరుకి తనతో పాటే తన భార్యకూ కార్‌డ్రైవింగ్‌ నేర్పించడం విశేషం. ఆమె చదువులో ఆయన కార్టూన్‌ రంగంలో ఒకరి వెన్నంటి ఒకరు విజయాలు సాదించారు.
చంద్రకళ పుస్తకం చూసి చాలామంది ఆమెను రష్యన్‌ రచయిత్రి రోజన్‌బర్గలతోను,సావిత్రిబాయి పూలేతో పోల్చేవారు. నిజానికి శేఖర్‌ చంద్రకళల కృషికూడా సావిత్రిబాయి,పూలేల ఆశయసాధన దిశగా సాగుతోంది ఇప్పుడు. ఆదర్శవనిత,విశిష్టమహిళ పురస్కారం ఇతర అనేక సన్మానాలు అందుకున్నా అన్నిటికి నా గురువు శేఖర్‌ గారే కారణం అని వినయంగా చెబుతారామె. ఎన్నో అవాంతరాల మధ్య వారి ‘కళాత్మక’జీవితం నడుస్తోందని అనిపిస్తోంది వారికి చూసిన వారికి. స్ఫూర్తిదాయకమైన ఈ జంటకు ‘నందు’ అనే అబ్బాయి, ‘చేతన’ అనే అమ్మాయి ఉన్నారు.

 

మీ మాటలు

 1. ముందుగా రజతోత్సవ శుభాకాంక్షలు :)

  తెలుగు నాట కార్టూనిస్ట్ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టారు.
  కార్టూనిస్ట్ అవుదామనుకునే వారు తప్పక చదవాల్సిన ఇంటర్వ్యూ.

  మొత్తం ఇంటర్వ్యూ చదివాక నన్ను నేను చాలా ప్రశ్నలు వేసుకుంటూ మళ్ళీ పైకెళ్ళా,”నీకు తిరుగులేదు,విజ్రుoభించు” అని మీరు ఇంకు,బ్రష్,కొండంత ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా అన్పించింది ఫోటో చూస్తే.

  హరి గారు కాబట్టే ఇన్ని విషయాలు రాబట్టగలిగారు.

  ధన్యవాదాలు.

 2. Lalitha P. says:

  శేఖర్ టూన్స్ ను అభిమానించటమే గానీ, ఆయన జీవితం ఇంత స్ఫూర్తిదాయకమైనదని ఇప్పటి దాకా నాకు తెలియదు. శేఖర్ జీవితాన్ని, అభిప్రాయాలను చాలా చక్కగా పొందుపరచారు. హరి గారికి ధన్యవాదాలు.

 3. మంచి ప్రేరణగా వుంది ధన్యవాదాలు .

 4. గొప్ప స్ఫూర్తి దాయకం గా వుంది – ఇంటార్వ్యు!
  భార్యని విద్యావంతురాలిగా తీర్చి దిద్దడం మీరు సాధించిన ఒక అద్భుతమైన విజయం గా తోచింది.
  ఆనంద మైంది. అందుకు మీకెన్నో అభినందనలు తెలియచేస్తూ
  శుభాకాంక్షలతో..

 5. devika rani says:

  శేఖర్ గారూ నిజంగా మీ జీవితం స్ఫూర్తిదాయకం. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే కాక… మీ అర్థాంగినీ మలిచారు….గ్రేట్…మీరు మరిన్ని విజయాలు సాధించాలని…ఆకాంక్షిస్తూ….

మీ మాటలు

*