ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? -12 వ భాగం

14

(గత వారం తరువాయి)

12

రాత్రి పదకొండు దాటింది. వర్షం.
”ఏమైందయ్యా.. నీయవ్వ.. ఎంతసేపింకా. ఎస్‌యీ గాడేడి..” పంచాయితీరాజ్‌ మంత్రి వీరాంజనేయులు చిందులు తొక్కుతున్నాడు గెస్ట్‌హౌజ్‌లో. అసలే మంత్రి.. పైగా విస్కీ తాగాడు పీకలదాకా.
ముందర చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య కూర్చున్నాడు. ఎప్పుడో ఎనకట బి.యి. చదివి.. అత్తెసరు మార్కులతో పాసయి.. ఎప్పుడో ఎడ్డి జమానాలో ఎయిగా చేరి ‘పైరవీ’తో ఈ దేశంలో దేన్నయినా సాధించవచ్చనే సూత్రంతో మెట్లు ఎక్కీ ఎక్కీ. అలసి..
మొన్ననే తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక ఇఇపై ఎసిబి వాళ్ళు దాడిచేస్తే ఇరవై రెండు కోట్ల నగదు, ఐదు కిలోల బంగారం బయటపడ్తే భయంతో బాత్‌రూంకెళ్ళి ఉచ్ఛపోసుకుంటూనే అలా సరదాకు.. తనపై ఎవరైనా దాడి చేస్తేనో అనుకున్నాడు గురవయ్య..
కనీసం యాభై కోట్ల నగదు.. ఇరవై కిలోల బంగారం.. వందల ఎకరాల భూములు.. ఒక పెళ్ళాం.. ముగ్గురు ముండలు.. ఇంకా ఇంకా.. యిలా హనుమంతుని తోకంత లిస్ట్‌ కదిలింది మనసులో.
”గురవయ్యా వేరీజ్‌ ఎస్సీ” మంత్రి మళ్ళీ అరిచాడు గాడిద ఓండ్రపెట్టినట్టు.
యిక గురవయ్య గురకపెడ్తున్నట్టు గొంతువిప్పబోతూండగా సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రమణ, వెంట ఇఇ ముత్యాలు, డి.ఇ ఇస్మాయిల్‌, ఎ యి జాన్సన్‌. కంట్రాక్టర్‌ రామలింగం..అందరూ కలిసికట్టుగా పాలకడలిపై విష్ణుమూర్తి దగ్గరకు పైరవీచేస్తూ వచ్చిన దేవతల గుంపులా వచ్చారు. వచ్చి ‘పాహిమాం పాహిమాం’ స్టైల్‌లో నమస్కారం సార్‌ అన్నారందరూ.. ముక్తకంఠంతో..
అప్పటికే పరమ అసహనంతో.. అప్పటికే దాదాపు హాఫ్‌ విస్కీ బాటిల్‌ ఫినిష్‌ చేసిన మంత్రి..
”నీయమ్మ.. ఎప్పుడయ్యా యింకా, కానీయండి తొందరగా..” అని ఘీంకరించాడు.
”కమాన్‌.. ఎస్సీ.. సబ్‌మిట్‌” అని అరిచాడు సి.ఇ గురువయ్య.
”సర్‌..” అని ఎ.ఇ. ఇస్మాయిల్‌ ఒక ఫైల్‌ విప్పి.. ”రామన్న మండలం.. బర్లగూడెం మైల్‌స్టోన్‌ 2 బై 6 నుండి తత్తరపల్లె 6 బై 6 వరకు.. బిటిరోడ్‌ .. జుమ్‌లా నాల్గుకిలోమీటర్ల నాల్గు హెక్టామీటర్లు.. మొత్తం ఎనిమిది లక్షల నలభై వేలు.. ఎస్టిమేషన్‌..” చెప్పుకుపోతున్నాడు.
”స్టాప్‌..” అని అరిచినట్టు అన్నాడు మంత్రి.
చటుక్కున ఎ.ఇ. ఆగి..బిక్కచచ్చి..
”అది ఎయిట్‌ లాక్స్‌ చిల్లరైతే.. మన సంగతెంత.. గుర్వయ్యా..”
”సర్‌ మీది ట్వంటీ సర్సంట్‌.. అటే.. లక్షా అరవైవేలు..”
”ఏయ్‌..నాకిప్పుడు నాల్గులక్షలు క్యాష్‌ కావాలె..నీయవ్వ మీ ఎస్టిమేషన్‌ ఎంతనో..ఆరోడ్డు ఎక్కడ్నో.. కాంట్రాక్టరెవ్వడో..అదంత నాకు తెల్వది. టర్మ్స్‌ ఇన్‌ క్యాష్‌..క్యాష్‌ యిచ్చి నాతోని ఎక్కడెక్కడ కావాల్నో అక్కడ అన్ని సంతకాలు తీస్కోండి గంతే…”
”అట్లగాద్సార్‌..” ఏదో అన్నబోయాడు ఎస్‌ఇ రమణ.. ‘నీ సంతకాలెవరిక్కావాలిరా వెధవా’ అని లోలోపల గొణుక్కుంటూ. ఉహు..మంత్రి వినలే..నాల్గు లక్షలు..అంతే అంటాడు.
సి.ఇ గురువయ్య.. ”రమణ.. మనం మనం అంత చూచుకుందాంగాని.. కాంట్రాక్టరెవడు.. రామలింగంగదా.. ఆ రామలింగంతోని ఓ ఐదు లక్షల క్యాష్‌ యిమ్మను యిప్పుడు.. ” అని ఓ ఆర్డర్‌ వేశాడు.
”అరె రామలింగం.. ఓ ఐదియ్యారా బై”
కాంట్రాక్టర్‌ రామలింగం వినయంగా ఓ మరమనిషిలా.. తన తోలుసంచీలో నుంచి అన్నీ కొత్తవే.. వేయిరూపాయల కట్టలు ఐదు తీసి ముందర టీపాయ్‌మీద పెట్టాడు.
చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య నాల్గు కట్టలను సవినయంగా మంత్రిగారికిచ్చి.. ఒక కట్టను తన బుష్షర్ట్‌కున్న సోల జేబులో పెట్టుకుని.. ”మీరిక దయచేయండి సర్‌” అన్నాడు చాలా సింపుల్‌గా.
మంత్రి వీరాంజనేయులు పరమవికారంగా నవ్వి.. తన బ్రీఫ్‌కేస్‌లో నాల్గు వేయిరూపాయల కట్టలను పెట్టుకుని.. లేచి..” గురవయ్యా.. నేనిప్పుడు హైద్రాబాద్‌ వెళ్తాన – నువ్వు నాకు రేపు మధ్యాహ్నం ఫోన్‌చేయ్‌” అని రివ్వున బాణంలా బయటకు వెళ్ళిపోయాడు.
రెండు నిముషాల తర్వాత.. మంత్రిగారి కారు, కాన్వాయ్‌.. మందీమార్బలం వేగంగా దూసుకుపోయిన శబ్దం.. కర్ణకఠోరంగా వినబడింది.
వాతావరణం కొద్దిగా నిమ్మళపడి.. అంతా సర్దుకున్నాక.,
సి.ఇ. గురవయ్య చెప్పాడు.. ”చూడు రమణా.. మంత్రిగారిది ట్వంటీ, నాది ఫిప్టీన్‌, నీది, ఇఇది, ఎయిది.. తలొక టెన్‌..మొత్తం ఎంతైంది.”
”అరవై ఐదు శాతం”
”ఓకే.. మిగిలిన ముప్పయ్యయిదు రామలింగంది. ఎయ్‌ కాంట్రాక్టర్‌.. యిపుడు గీ లెక్కచెప్పు.. నాకు , మంత్రికి కలిపి ముప్పయ్యయిదు శాతానికి ఐదు లక్షలైతే మీ పర్సంటేజిలంత కలిపి ఎస్టిమేషన్‌ ఎంతుండాలె .. ఊఁ..”
డి.ఇ. ఇస్మాయిల్‌ చూస్తున్నాడు అతను ఐఐటి మద్రాస్‌నుండి ఎమ్‌టెక్‌ స్ట్రక్చర్స్‌ డిస్టింక్షన్‌లో పాసై నాల్గునెలల క్రితమే పిఎస్‌సీ ద్వారా గ్రూప్‌వన్‌లో పంచాయితీరాజ్‌ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్ట్‌ డిఇగా అపాయింటయిండు. అతనికి నాల్గునెలల నుండీ అంతా వింత వింతగా, పిచ్చిపిచ్చిగా, ఆశ్చర్యంగా, అసహ్యంగా కూడా ఉంది. అతను అంతకుముందు ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి విపరీతంగా ఉందని విన్నాడు గాని యింత దారుణంగా, జుగుప్సాకరంగా గుడినీ, గుడిలింగాన్నీ మింగేసే స్థాయిలో ఉందని తెలసుకుంటున్నకొద్దీ రోత కలగడం మొదలైంది.. ఏమిటిది.. భరించలేని ఈ లంచగొండి దుర్గంధాన్ని ఎలా శుభ్రం చేయాలి.,
కాలిక్యులేటర్‌ను చటుక్కున బైటికితీసి ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ముత్యాలు ఎస్‌.ఇ. రమణకు అందివ్వబోయాడు.
”నాకిస్తావేమయ్యా ఫూల్‌.. చకచకా చేసి చెప్పు…” అన్నాడు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌. డి.ఇ ఇస్మాయిల్‌కు ఒంటిపైన జెర్రులు పాకుతున్నట్టనిపిస్తోంది. అప్పుడు మంత్రిగారున్నపుడే స్విచ్ఛాన్‌ చేసిపెట్టిన తన జేబులోని సెల్‌ఫోన్‌ కెమెరా, వాయిస్‌ రికార్డర్‌ పనిచేస్తున్నట్టుగా చెక్‌చేసుకుని అంతా ఓకే అని తెలుసుకుని..ఊపిరిపీల్చుకుని.. ఏమిటిది.. ఏంజరుగుతోంది.,
”సర్‌ పదహారు లక్షల చిల్లర.. సే.. పదిహేడు లక్షలు..” అన్నాడు జాన్సన్‌ తడబడ్తూ యాభై ఏడేండ్ల జాన్సన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఒక కానిస్టేబుల్‌ జీవితకాలమంతా కాలికింది చెప్పులా పనిచేసి పనిచేసి అరిగిపోయినట్టు ఉద్యోగం చేసీ చేసీ జీవితముగింపుకాలంలో రిటైర్మెంట్‌ముందు అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ప్రమోషన్‌ పొంది.. ఏదో అలా నడిపిస్తున్నాడు. ఎక్కడో ఓ డిప్లొమా సర్టిఫికేట్‌ సంపాదించి, ఏవో కొన్ని బండగుర్తు పనుల్ని నేర్చుకుని, ఏ పనికి ఎంత పర్సెంటేజో యింకా బాగా అవగాహన చేసుకుని రిటైర్మెంట్‌ముందు చీపురుతో డబ్బును ఊడ్చుకుంటున్నాడు.
”ఓకె.. ఏయ్‌ ముత్యాల్‌..నువ్వు రేపు ఆ ఎ.ఇ. గానితో ఆ బి.టి. రోడ్‌కు పదిహేడు లక్షల ఎస్టిమేషన్‌ తయారు చేయించి..” అని చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య అంటూండగా,
ఇస్మాయిల్‌ వెంటనే అందుకుని అన్నాడు ”సర్‌.. ఆ రోడ్డు నాల్గులక్షల కంటె ఎక్కువ కాద్సార్‌..” మెరుపులా.
షాక్‌ తిన్నట్టయి సి.ఇ గురవయ్య ఇ..ఇ ముత్యాలు దిక్కు ఎ.ఇ. జాన్సన్‌ దిక్కు చూశాడు ”వాటీజ్‌ దిస్‌ నాన్సెన్స్‌” అన్నట్టు.., చూచి ”మాకు తెల్సులేవో.. మూస్కో.. ముత్యాల్‌ వాళ్ళతో కూడా సంతకాలు చేయించి నేనుకూడా చేసి రిటర్న్‌ చేస్తా. ఓకేనా..” అని లేవబోయాడు తన సోఫాలోనుండి. అప్పుడు గురవయ్య దగ్గరినుండి విస్కీ, చికెన్‌మసాల కలగలిసిన కంపు వాసన ఇస్మాయిల్‌ ముక్కుపుటాలను అదరగొట్టింది.
”సర్‌..” ముత్యాలు ఏదో గొణుగుతుండగా,
”ముత్యాలూ టైం షెడ్యూలేమిటంటే.. ఎండాకాలం, కాబట్టి మే లో మనం రోడ్డును వేశాం. క్వాలిటీ కంట్రోల్‌ ఇన్‌స్పెక్షన్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఇన్‌స్పెక్షన్‌ అన్నీ ఐపోయాయి. మే ఎండింగులో. ఎ.యి చెక్‌ మెజర్‌ చేసి బిల్స్‌ సబ్‌మిట్‌ చేశాడు. ప్రాసెస్‌ ఐపోయి కాంట్రాక్టర్‌ రామలింగం జూన్‌ మొదటివారంలో బిల్‌ డ్రా చేసుకున్నాడు. ఫైల్‌ క్లోజ్డ్‌.. డి.డిస్‌. మళ్ళీ సెప్టెంబర్‌లో ఈ ప్రాంతం వరదముంపు ప్రాంతం కాబట్టి భీకరంగా వచ్చిన వరదల తాకిడికి, ఉప్పెనకు బర్లగూడెం – తత్తరిపల్లె లోతట్టు ప్రాంత బి.టి రోడ్‌ పూర్తిగా నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. సి.ఇ, ఎస్‌.ఇ. అందరూ ఇన్‌స్పెక్ట్‌ చేసి రోడ్డు కొట్టుకుపోయిందని సర్టిఫై చేశారు.. మళ్లీ ఆ పాతఫైల్‌ను తీసి రీ సబ్‌మిట్‌ చేసి, రోడ్డు కొట్టుకుపోయిందనే నోట్‌ అప్రూవల్‌. ఫైల్‌ క్లోజ్డ్‌ ఎల్‌.డిస్‌.. అర్థమైందా”
”సర్‌.. అర్థమైంది సర్‌.. మనం యిదివరక్కూడా పాపికొండల దగ్గర గిరిజనపల్లె రాజీరా నుండి మోత్కుగూడెం దాకా ఇరవై లక్షల వర్క్‌.. ప్రపంచబ్యాంక్‌ లోతట్టు ప్రాంతాల అభివృద్ధి పథకం క్రింద ఇదేరకంగా.. అసలు రోడ్‌ వేయకుండానే.. వేసినట్టు.. ఆ తర్వాత వరదల్లో కొట్టుకుపోయినట్టు ఫినిష్‌ చేశాం గద్సార్‌. ఇదికూడా ఎగ్జాట్లీ అలాగేనన్నమాట.. అంతేనా సార్‌..” అన్నాడు ఇఇ ముత్యాలు కాస్త అమాయకంగానే.. విధేయంగాకూడా.
”అరె నీయవ్వ.. గింతవివరంగా చెప్తావేమయ్యా.. అర్థం చేసుకోవాలంతే..” అని చీఫ్‌ ఇంజినీర్‌ గురవయ్య గబగబా బయటికెళ్ళి తన ప్రభుత్వ టాటాఇండికా ఎసి కార్లో కూర్చున్నాడు. వెంటనే మందకుమంద అందరూ సి.ఇ వెంట గొర్రెలమందలా నడిచి.. అతివినయంగా.. తలలూపి.. చెంపలేసుకున్నంత పనిచేసి,
”రామలింగం.. హాపీనా..” కాంట్రాక్టర్‌ను అనునయించాడు సి.ఇ.
రామలింగం తొండవలె పరమవికారంగా నవ్వి.. ”అయ్యా.. అఁయ్‌..” అన్నాడు తలూపుతూ
చీఫింజినీర్‌ కార్‌ మరుక్షణంలో జారి.. చీకట్లోకి మాయమైంది..హైద్రాబాద్‌ వైపు.
రెండు నిముషాల తర్వాత ఇఇ ముత్యాలు, ఎఇ జాన్సన్‌, కాంట్రాక్టర్‌ రామలింగం, అందరూ వాళ్ళ వాళ్ళ జీపులు, కార్లలో ఉడాయించి..
ఒక హత్యానంతర నిశ్శబ్దం మిగిలింది.
ఇంకా ఈ నగ్నలంచాల వ్యవస్థకు పూర్తిగా అలవాటుపడని ఇరవై ఎనిమిది సంవత్సరాల యువ ఇంజినీర్‌ ఇస్మాయిల్‌ భారంగా తన హీరోహోండా మోటార్‌సైకిల్‌ దిక్కు నడుస్తూండగా.,
ఎక్కడో ఫెళపెళమని ఉరుముతూ పిడుగుపడి.. వర్షం ఉన్నఫళంగా ఎక్కువైంది.
తన జేబులోని సెల్‌ఫోన్‌ కెమెరాను, వాయిస్‌ రికార్డర్‌ను స్విఛాఫ్‌ చేసి ఇస్మాయిల్‌ తన బైక్‌ను స్టార్ట్‌ చేశాడు.
వర్షం కురుస్తూనే ఉంది.. అర్ధరాత్రి.. నిశ్శబ్దంగా.

(సశేషం)

మీ మాటలు

  1. maanasa.k says:

    దొంగలుదొంగలు కలిసి దేశాన్ని దోచుకునే దుస్థితిని మౌళి గారు చక్కగా ప్రస్తావించారు.అభినందనలు.
    మానస.కె.కాకికాడ

మీ మాటలు

*