ఇవాళ ఆ ఆకలి మెతుకే గెలిచింది!

557857_3913613231735_1588337585_n

వొక ఆకలి మెతుకూ వొక అదనపు లాభం

క్రాస్ రోడ్డు మీద నిలబడి పోట్లాడుకుంటున్నాయ్.

ఆకలి  మెతుకులు లక్షన్నర. అదనపు లాభాలు పది.

అయినా సరే,

పది గదమాయిస్తుంది, దబాయిస్తుంది, ఘరానా చేస్తుంది.

చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.

ఆకలి మెతుకు

వొక తల్వార్ లాగా మెరిసి వొక నెత్తుటి చార కసిగా ఆక్రోశిస్తుంది.

నీకు అసందర్భంగా కనిపిస్తుందా, కవీ?!

–          ‘రోజ్ రోటీ’ కవిత నించి.. 2010.

 

తెలంగాణా ఉద్యమం బాగా వేడెక్కిన సందర్భంలో 2010లో టెక్సాస్ తో పాటు అమెరికాలోని  అనేక ఊళ్ళల్లో తెలంగాణా సభలు జరిగాయి.  కొన్ని సభల్లో  నేనున్నాను. మాట్లాడాను. ఆ సభల్లో కొన్ని చోట్ల  ప్రధాన వక్తల ప్రసంగాలు అయ్యాక తెలంగాణా పల్లెల నించి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవిత కథలు/ ఇప్పటి పల్లెల పరిస్థితి గురించీ వ్యక్తిగత కథనాలుగా వినిపించే వాళ్ళు. అవి విన్న ప్రతిసారీ ‘ఇది కదా జీవితం’ అని కళ్ళు చెమర్చేవి. మొసళ్ళు కన్నీళ్లు కార్చే ఈ లోకంలో వొక మనిషి కన్నీరు ఇలా కదా వుండాలి అనిపించేది. 

ప్రతిసారీ ఆ సభలనించి వెనక్కి వచ్చేటప్పుడు వొక తీవ్రమైన ఉద్వేగం నన్ను ఉప్పెనలా చుట్టుముట్టేది. అనేక రకాల ఆలోచనల మధ్య నిశ్శబ్దంలో కూరుకుపోయే వాణ్ని. అది నిశ్శబ్దంగా వుండాల్సిన సమయం కాదు. నిట్టూర్పులు విడుస్తూ కవిత్వ వాక్యాల మధ్య దాక్కోవాల్సిన సందర్భం అసలే కాదు. నిస్పృహ లేదనీ కాదు.

కాని, అంతకంటే బలమైన స్పృహ నన్ను ఆవరించి వుండేది.  ఈ సభలు నిర్వహిస్తున్న వాళ్ళంతా తెలంగాణాలోని మారుమూల పల్లెల నించి వచ్చి, సొంత పులుగు మీద జీవితాల్ని అమర్చుకుంటున్న వాళ్ళు. వొక పూట తిని ఇంకో పూట పస్తులుంటూ చదువుకున్న వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళలో కొంత మంది తల్లిదండ్రులు ఆ పాతకాలపు ఎప్పటికైనా కుప్పకూలిపోయే ఇండ్లల్లో బతుకు వెళ్లమారుస్తున్న వాళ్ళే! కాసింత నేలని నమ్ముకొని ఆ నేల చుట్టే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు.

చాలా ఆశ్చర్యంగా వుంటుంది కొన్ని సార్లు! దిగులు దిగులుగానూ వుంటుంది. ఎక్కడ మొదలయ్యామో వెతుక్కుంటూ వెళ్తే…కొంత మంది పూరిగుడిసెల్లో పుట్టీ పెరిగీ చూస్తూ చూస్తూ వుండగానే మిద్దె మీద మిద్దెలు కట్టుకుంటూ విలాసాలకి చేరువ అవుతారు. ఇంకా కొంత మంది ఇంత దూరం వచ్చి కూడా “అదనపు లాభాలు” సంపాదించే తెలివి తేటలు లేక వున్న చోటే బిక్కుబిక్కుమంటూ వుంటారు. ప్రవాస తెలంగాణా సభల్లో నేను చూసిన చాలా మంది యువకులు అలా బిక్కుబిక్కుమంటూనే కనిపించారు. వీళ్ళు ఇంటికి వెళ్లి ఇంకా ఆ జొన్న అంబలి ఆకలి ఆకలిగా  ఆబగా తాగే వాళ్ళుగానే అనిపించారు. వాళ్ళ ముఖాలు ఇంకా ఆ పచ్చడి మెతుకుల్లాగానే అనిపించాయి.

Untitled

వాళ్ళ అడుగుల్లో  “దూసుకెల్తా…!” అనే పిచ్చి పరుగు  కనిపించలేదు. వాళ్ళ మొహాల్లో ఇతరుల్ని వెర్రినాగన్నలానో, నాగమ్మలానో చూడాలన్న మితిమీరిన తెలివి కళ లేదు. విపరీత వస్తువ్యామోహంలో పరోక్ష ప్రశ్నలతో అవతలి వాడింటి వాసాలు – రాజభవనాల్ని తలపించే మేడలూ, ఆ మేడల్లో ప్లాస్మా స్మార్ట్ టీవీలూ వగైరా వగైరాల ఆరా  తీయాలన్న ఆరాటం లేదు. అన్నిటికీ మించి లేని మేధావితనాన్ని తెచ్చిపెట్టుకున్న సరికొత్త upstart crow వేషాలూ లేవు. అప్పుడే పుట్టుకొచ్చిన ‘అదనపు లాభాల’ పొగరులోంచి అరువు తెచ్చుకున్న నడమంత్రపు నయగారాలూ లేవు!

అవును, ఇది ‘అమాయకత్వం’ అనుకుంటే, తెలంగాణా అలాంటి అమాయకత్వంలోనే కొన్ని దశాబ్దాలుగా బతుకుతోంది. మాయవన్నెలు తెలియక మోసపోతూనే వుంది. గదమయించే నోరు లేక, దబాయించే నీతిమాలిన తనం లేక, చరిత్రని వ్యాపారం చేయలేక, వ్యాపారాన్ని చరిత్ర చేయలేక వున్న చోటనే పడి, పడిగాపులు పడుతోంది.

కాని. ఈ పొద్దున్న తెలంగాణాలో నిజంగా పొద్దు పొడిచింది.

ఆ అమాయక ముఖాల్లో వొక సూర్య కాంతి మెరిసింది. ఈ పొద్దుని  కూడా నకిలీ సూర్యుళ్ళు కిడ్నాప్ చేస్తారన్న భయం కడుపులో లేకపోలేదు. ఈ కాసిని కిరణాల్ని కూడా వాళ్ళు దోచుకుపోయి అదనపు ఆదాయం కింద దాచి వుంచేసుకుంటారన్న దిగులు ఉండనే వుంది. కాని, సూర్యుడు చాలా స్పృహతో తెలంగాణా పంట చేల మీద పొడిచాడు! ఇవాళ ఆకలి మెతుకు గెలిచింది! తెలంగాణా నిరుపేదల చెంపల మీద కొన్ని దశాబ్దాలుగా చారికలు కట్టి వున్న కన్నీటి చుక్క గెలిచింది!

Hyderabad_CITY_Page_758745e

2

ఈ రాజకీయాలతో వొక రచయితకేమిటి? అని అనుకున్న సందర్భం లేదా అంటే వుంది.

ఈ ప్రశ్న మన తెలుగుదేశంలోని సో కాల్డ్ అమాయకమైన (?) సాహిత్య వేత్తలు మాత్రమే వేసుకోగలరని వొక పొగరుమోతు సమాధానం కూడా నా దగ్గిర వుంది. లేదూ, రాజకీయాలు చేస్తున్న సాహిత్యవేత్తలే ఇలాంటి ‘స్వచ్చమైన’ ‘నిర్మలమైన’ సాహిత్య  ప్రశ్న వేయగలరు అన్న కుటిలమైన సమాధానమూ వుంది. కాని, పోరాటాల పురిట్లో పుట్టిన తెలంగాణా రచయిత రాజకీయాలు వద్దని శుష్కమైన కలలో కూడా అనుకోలేడు. అలా అనుకుంటే, అతని మౌనం తెలివైన రాజకీయమే అవుతుంది. అతని కవిలె కట్ట అందమైన పాకేజీలో కట్టబెట్టిన మోసమే అవుతుంది.

రాజకీయాలు అనే మాటని నేను ఇక్కడ సంకుచితమైన అర్థంలో వాడడం లేదు. నేను చెప్పాలనుకున్న నిర్వచనం ఇదిగో చూడండి ఇతనెవరో నా కోసమే చెప్పినట్టుగా వుంది:

Politics is commonly viewed as the practice of power or the embodiment of collective wills and interests and the enactment of collective ideas. Now, such enactments or embodiments imply that you are taken into account as subjects sharing in a common world, making statements and not simply noise, discussing things located in a common world and not in your own fantasy. What really deserves the name of politics is the cluster of perceptions and practices that shape this common world. Politics is first of all a way of framing, among sensory data, a specific sphere of experience. It is a partition of the sensible, of the visible and the sayable, which allows (or does not allow) some specific data to appear; which allows or does not allow some specific subjects to designate them and speak about them. It is a specific intertwining of ways of being, ways of doing and ways of speaking. (Jacques Ranciere, 2004).

ఈ సాహిత్య తాత్వికుడు నా మాదిరిగానే literature as literature అనే ధోరణికి శత్రువు. ఎవరూ నేరుగా రాజకీయ ప్రకటనలు చేయకపోవచ్చు. కాని, వాళ్ళ సాహిత్య శరీర కదలికలు, పెదవి విరుపులు కనిపించని పెప్పర్ స్ప్రే చల్లుతాయి. సోకు చేసుకున్న వాక్యాలు  వెటకారాలూ మిరియాలూ నూరుతుంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో ఇలాంటి పెప్పర్ స్ప్రే విమర్శల్ని ప్రతి  తెలంగాణా రచయిత (నిజమైన తెలంగాణా రచయిత) ఎదుర్కొన్నవాడే!

బాగా గుర్తొస్తుంది ఎప్పుడూ! వొక సారి మాటల సందర్భంలో సి.నారాయణ రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. “ఇప్పుడు కాదు కాని, నేనూ దాశరథి కొత్తగా రాస్తున్న కాలంలో ఆంధ్రా వాళ్లలా రాయాలనీ, మాట్లాడాలనీ మా మీద  తెలియని వొత్తిడి వుండేది. అంటే ఊహించు! మేం కలం పట్టి రాసేనాటికి మా కలాల మీద, మా తలల మీద మాది కాని చరిత్ర భారాన్ని మేం మోయాల్సి వచ్చిందన్న మాట!”

తెలంగాణా రచయితలు వాళ్ళ వాళ్ళ యాసల్లో మాట్లాడినప్పుడు/ రాసినప్పుడు  వినిపించిన వెక్కిరింతలు ఆ తరానికే పరిమితం కాదు. ప్రతి తరం అదే సమస్యని ఇంకో రూపంలో తలకెత్తుకుని భరించక తప్పలేదు. భాషని శుభ్రపరిచే పేరుతొ తల్లి భాష వస్త్రాలని నిలువునా అపహరిస్తున్నా తెలంగాణా రచయిత పడ్డాడు. అదనపు లాభాల సంస్కృతీ వోనమాలు కష్టంగా అయినా నేర్చుకున్నాడు. కొందరికే పరిమితమైన కోస్తా తెలుగుని అందరి నెత్తి మీదా మోపేందుకు వొక సాంస్కృతిక రాజ్యాన్ని (colonizing the mind) సాహిత్య రూపంలోనే కాదు, అలాంటి సామ్రాజ్యవాద సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నిర్మించిన పత్రికలూ, సినిమాలూ, భాషా తన గొంతు నులిమేస్తున్నపుడు తెలంగాణా రచయిత వొంటరి వాడయ్యాడు. తెలంగాణా ఆ చీకటి కొట్టంలో మగ్గిపోయింది. వ్యాపార చరిత్ర ముందు సాహిత్య చరిత్ర సిగ్గుపడి ఎటో పారిపోయింది.

నిజమైన తెలంగాణా ఇవాళ కాదు గెలిచింది! ఆ బానిస చరిత్రని ధిక్కరించిన ఇరవయ్యేళ్ళ కిందనే గెలిచింది. యాసని సాహంకారంగా తన అసలైన భాషగా ప్రకటించుకున్న రోజునే తెలంగాణా సాంస్కృతిక విజయం సాధించింది.  ఎడారులుగా మారిపోతున్న/ తమ గడ్డ మీద తామే వలస బతుకీడుస్తున్న తల్లిదండ్రుల శోకాన్ని అక్షరాలకెక్కించిన ప్రతి క్షణమూ తెలంగాణా గెలిచింది. తన వాక్యాల మీద ఇతరులిచ్చే పరిశుద్ధ తీర్పుల్ని ఆకుముక్కల కింద తీసిపడేసిన ప్రతి క్షణమూ తెలంగాణా అక్షరం గెలిచింది.

3

ఎప్పుడైనా ఎక్కడైనా పీడితులే గెలవాలి. పీడితులే చరిత్ర రాయాలి. పీడితులే వుద్యమాలు నడపాలి. పీడితుల అక్షరాలే నిజమైన సాహిత్యంగా నిలబడాలి.

ఇది ఇవాళ తెలంగాణా అనే ఈ ఆకలి మెతుకు నేర్పిన పాఠం!

నా ‘రోజ్ రోటీ’ కవితలోంచి కొన్ని వాక్యాలతోనే చివరి మాటలు ఇదిగో ఇక్కడ:

నువ్వు చెప్పు, నేను వింటా, నీ బాంచ!

వినీ వినీ నా చెవుల్లో పుట్టలు మొలిచినయిలే!

నువ్వు గొంతు సవరించుకునే లోగా నా వొళ్ళు వొంగి దండమయిపోయిందిలే!

ఇన్నాళ్ళూ. నిన్ను పీరీలాగా మోశానా, ఇప్పుడు నా కడుపు కర్బలా అయిపోయిందిలే!

చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా,

నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.

కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!

 

రోజ్ రోటీ నా అద్దం.

దాంట్లోంచి రాస్తున్నా కొత్త చరిత్ర.

 -అఫ్సర్

చిత్రాలు: అన్నవరం శ్రీనివాస్, ఏలే లక్ష్మణ్, యాసాల బాలయ్య

 

మీ మాటలు

 1. ఒకజాతిని వేరొక జాతీ ఒక భాషను వేరొక భాష పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు. బాగుంది ఐతే ఒకే భాషలోని ఒక యాసను ఇంకో యాస పీడించె ఓడించే సాంఘిక ధర్మం కాలం చెల్లి పోయినా ఆ భావం మాత్రం దురహంకా పూరితమైనది.

  • అఫ్సర్ says:

   తిరుపాలు: అవును, తెలంగాణా విషయంలో కూడా పీడనే అధర్మం. ఈ పీడన కొత్త రూపం ఎత్తుకుంది, అదొక్కటే తేడా!

 2. మైథిలి అబ్బరాజు says:

  చాలా అవసరమైన సంపాదకీయాన్ని ‘ నిర్భయంగా ‘ రాసినందుకు అభినందనలు అఫ్సర్ గారూ. నా గొంతు ఫేస్ బుక్ లో ఎక్కడా నేను వినిపించలేకపోయాను. ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

  • అఫ్సర్ says:

   మంచి మాట చెప్పారు, మైథిలి గారు, నిర్భాయంగానే చెప్పాలి సందర్భం వస్తే! సమకాలీనత ఆధునికత సహేతుకత లాంటి పలుకులు పలికే చాలా మంది రచయితలు కూడా తమ కళ్ళ ముందు జరిగే వాటిని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని, సాహిత్య సౌందర్య ధర్మాలు బోధించడం చూసాను. నా మటుకు నాకు రచయిత స్వర సౌందర్యం అనేది అతని/ ఆమె నిజాయితీలోంచి వస్తుందని అనిపిస్తుంది. మీ వ్యాఖ్య నాకు కాస్త ధైర్యాన్నిచ్చింది ఈ దిశగా ఆలోచించడానికి!

 3. ఆ ఆకలి మెతుకు గెలుపు పరిపూర్ణం కావాలి. ఆ కళ్ళలోని బెరుకు పోయి గుండెనిండుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. చాలా బాగుంది సార్. జయహో తెలంగాణా…

 4. balasudhakarmouli says:

  ఈ వ్యాసాన్ని కొందరితో చదివి చాలని, నా స్కూల్ పిల్లలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎలా వుంటాదో స్పందన చూడాలి.

  • అఫ్సర్ says:

   పిల్లలే కాదు,అంత కంటే ముఖ్యంగా పిల్లల కంటే అన్యాయంగా వున్న పెద్దలే చదవాలి, సుధాకర్!

 5. balasudhakarmouli says:

  ఈ వ్యాసాన్ని కొందరితో చదివిస్తాను. నా స్కూల్ పిల్లలకు చదివి వినిపిస్తాను. స్పందన ఎలా వుంటుదో చూడాలి.b

 6. Long live telegana andi.. As an adhrite I wish telegana bright future.. Edi pepper spray matalu kavu sir, nijamga annave.. Ee community lo na manchi chedu rendu untayi andi.. adi andhra ayina telegana ayina.. meku personal ga eduryna chedu anubhayalu ki andhra sahite veyyatale addhipataym karam ayithe meru me rachanala dwaraga samanymyna prathi andhra vadu telegane ni expolit chese vade ani cheppataniki prayatni chincharu.. Anyway andhra vadi medhi dweshani political leaders ee karanam kadu personal ga hurt prathi telegana pourudu alochanlalo adi undi ardam ayindi..
  chivaraga okka vishyam sir.. telegana vallu andhra ni avamanisthe emanukovali sir, manchi vadiki kopam vachinda ana.. leka innalu ma tatatlu chesina/chesaru anukone pettadari tanaki pratiphalam anukovala…

  • అఫ్సర్ says:

   ఆంధ్రా గారు: ఎవరు ఎవరిని అవమానించినా అది అసమ్మతమే! ఎవరూ ఇంకొకరి భాషనీ సంస్కృతినీ వెక్కిరించకూడదు అన్నదే నా మాట. మంచీ చెడు ప్రాంతాల బట్టి కాదు, ఆ వ్యక్తుల బట్టి కూడా వుంటాయి.

 7. Without culture, and the relative freedom it implies, society, even when perfect, is but a jungle- Albert camus . Good heavens atlast people are saved from that unwanted cultural burden. Picture perfect write up sir .

  • అఫ్సర్ says:

   నిశీధి గారు : unwanted cultural burden ఎప్పుడూ వుంటుంది. అలాగే, ఎప్పుడూ వొక అరణ్యం మనకి సమాంతరంగా పెరుగుతూనే వుంటుంది. కాని, అది అరణ్యం అని మనకి తెలీదు ఎప్పటికో గాని!

 8. KC Chekuri says:

  “తెలంగాణా ఉద్యమం బాగా వేడెక్కిన సందర్భంలో 2010లో టెక్సాస్ తో పాటు అమెరికాలోని అనేక ఊళ్ళల్లో తెలంగాణా సభలు జరిగాయి. ఈ సభలు నిర్వహిస్తున్న వాళ్ళంతా తెలంగాణాలోని మారుమూల పల్లెల నించి వచ్చి, సొంత పులుగు మీద జీవితాల్ని అమర్చుకుంటున్న వాళ్ళు. వొక పూట తిని ఇంకో పూట పస్తులుంటూ చదువుకున్న వాళ్ళు. ఇప్పటికీ వాళ్ళలో కొంత మంది తల్లిదండ్రులు ఆ పాతకాలపు ఎప్పటికైనా కుప్పకూలిపోయే ఇండ్లల్లో బతుకు వెళ్లమారుస్తున్న వాళ్ళే! కాసింత నేలని నమ్ముకొని ఆ నేల చుట్టే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు.”

  Afsar Ji – Half truth, generalization and stereotyping ! Majority of the ‘organizers’ are rich, well-to-do upper caste and class of Telangana. I have participated in some of those meetings along with you

  తెలంగాణా ఆకాంక్ష నెరవేరినందుకు శుభాకాంక్షలు. కానీ తెలంగాణాలో నడిచిన ప్రజా ఉద్యమానికి లేని “అదనపు లాభాల” లక్షణం ఎన్నారై తెలంగాణా ఉద్యమానికి ఉందనే చారిత్రిక సత్యాన్ని మరుగునపడేయొద్దు.

  • అఫ్సర్ says:

   కేసీ: మీరన్నది నిజం కాదు అనలేను. తెలంగాణాలో కూడా అగ్రకుల, సంపన్న వర్గాల ఆధిపత్యం లేకపోలేదు. కాని, నా దృష్టిలో – ప్రస్తుతానికి- అది lesser evil. తెలంగాణాలో వొక లగడపాటి రాజగోపాల్ లాంటి వాడిని నేను ఊహించలేను కనీసం! అయితే, రాజకీయ లగడ పాటిల కంటే, సాహిత్య లగడపాట్లు ప్రమాదకరం. అది ఇప్పుడు పెరగవచ్చు.

   అదనపు లాభాలు అక్కడా వున్నాయి, ఇక్కడా వున్నాయి. కాని, వాటి పడగలో వున్న కొద్దిపాటి తేడాలు -ముఖ్యంగా ఎగబాకే సంస్కృతీ upward mobility- స్వభావాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి.

   అలాగే, మీరు చెప్పే చరిత్ర నేను చెప్పే చరిత్ర వొక్కటే కాదు, ఎందుకంటే చరిత్ర కూడా subjective గా వుంటుంది.

 9. ాయలసీమ నుంచి వచ్చిన మహాకవి ుట్టపర్తి నారాయణ చార్యులు గారు. ారి తెలుగు భాషనీ కోస్తా ఆంధ్ర కవులు వెక్కి రించారు.
  ాబట్టి రాయలసీమ ఆంధ్రా నుంచి విడిపోవాలా?
  mohan

  • సతీష్‌ కుమార్‌ says:

   మోహన్‌గారు…
   మీ ప్రశ్నలోనే ఒక అసహనం ఉంది. ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేనితనం ఉంది. ఇలాంటి రెచ్చగొట్టే పనికిరాని ప్రశ్నలే కలిసి ఉండలేని పరిస్థితిని కల్పించాయి.
   చిన్న రాష్ర్టాలు ఏర్పడడం ఆధునిక కాలంలో అనివార్యం. అభివృద్ధికే అవే సోపానాలు…పాలన ఫలాలు అందరికీ అందాలంటే వెనుకబడ్డ ప్రాంతాలకు స్వపరిపాలన కావాలి. ప్రాంతేతర ఆధిపత్య అన్యాయ పాలన కాదు…
   ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను మనం రెచ్చగొట్టకుంటే మనకే మంచిది…
   మీరు ఈక్రింది పుస్తకాలు కొని చదవండి…
   మీ అమాయకమైన ప్రశ్నకు జవాబు దొరుకుతుంది
   1.తెలంగాణ రాష్ర్టం-ఒక డిమాండ్‌…ప్రొ.జయశంకర్‌
   2.ప్రత్యేక తెలంగాణ-ప్రాంతీయ ఉద్యమం…ప్రొ.హనుమంతరావు
   3.తల్లడిల్లుతున్న తెలంగాణ…ప్రొ.సింహాద్రి

   • అఫ్సర్ says:

    సతీష్ గారు: షుక్రియా. మోహన్ గారు: అంత కంటే నేనేమీ చెప్పలేను.

 10. అవును, పొద్దు పొడిచింది, ఇక్కడా, అక్కడా.

  • అఫ్సర్ says:

   పొద్దు నిలబెట్టుకోవడం ఇంకో పోరాటం, కూర్మ!

 11. ఆర్.దమయంతి. says:

  ‘తెలుగు సాహిత్య చరిత్రలో ఇలాంటి పెప్పర్ స్ప్రే విమర్శల్ని ప్రతి తెలంగాణా రచయిత (నిజమైన తెలంగాణా రచయిత) ఎదుర్కొన్నవాడే!’

  అఫ్సర్ గారు,
  అన్నిటితో ఏకీభవించలేను.
  కొన్ని కాదనీ అన్లేను.
  బహుశా – రాష్ట్ర విభజనకి నేను వ్యతిరేకిని కావడం వల్ల కావొచ్చు.
  నాకింతవరకు తెలీదండి..
  మీరు తెలెంగాణ అని. చాల మందిని నేనిలానే పొరబడ్డానంటే కారణం..నాకు తెలుసుకోవాలని వుండదు. నాకు అక్షరమే ప్రధానం కావడం వల్ల.
  ఏమైనా నేను మీ భాషకు, భావుకత్వానికి, కవిత్వానికి అభిమానిని అని మాత్రం గర్వంగా చెప్పుకోగలను.
  శుభాభినందనలతో..

  • అఫ్సర్ says:

   దమయంతి గారు: మీ లేఖ నాకు చాలా నిజాయితీ గా అనిపించింది. అన్నీటినీ అందరూ వొప్పుకొలేము, అలా అని కొన్ని తప్పించుకోలేం కూడా!

   తెలంగాణా – ఆ మాటకొస్తే సీమ వేదనని కూడా- అర్థం చేసుకోవడానికి మనం ఆ ప్రాంతాల నించి రానక్కరలేదు. గొర్కీని, చెఖొవ్ నీ ఎందుకు అంతగా ప్రేమించాం? ఎందుకు మనం దక్షిణాఫ్రికా నల్ల సాహిత్యాన్ని ఇష్ట పడతాం? ఎక్కడో వున్న లాటిన్ అమెరికా రచనలు మన రచయితల్ని ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి? ఆ ప్రాంతాలూ, అక్కడి మనుషులూ, ఆ భాషలూ మనవి కావు. కాని, ఆ దూరపు వేదనలో మన సంవేదనలు కనెక్ట్ అయ్యాయి కనుక!

   మామూలుగా ఎక్కడో వున్న ఉద్యమాలూ, వాటి రచయితలని అక్కున చేర్చుకోవడంలో వొక సుఖం వుంది. కాని, మన పక్కనే వున్న వుద్యమాలూ, వాటి రచయితలని చదవడంలో గాని, మెచ్చుకోవడం లో గాని ఆ ‘సుఖం’ లేదు. ఇందులో వొక బాధ వుంది. రచయితలకైతే, ఆ ప్రాంతాలూ, ఆ నిర్దిష్ట కులాల నించి వచ్చే అవార్డులు వంటి privileges పోతాయి. మామూలు రీడర్లకు అది లేనిపోని తలనొప్పి ఎందుకులే, అందరితో హలో అంటే సరిపోతుంది కదా అనే భావన వుండడం వల్ల ఆ వేదన మనది కాకుండా పోతుంది.

   కాని, మీరు మంచి ఆలోచనాజీవి అని, మీలోపల సజీవమైన స్పందనలున్నాయని, ఆ కారణంగానే మీరు సాహిత్యాన్ని దాని నిజమైన స్పూర్తితో చదువుతున్నారని మీ లేఖ వల్ల అర్థమైంది నాకు- అందుకు సంతోషంగా వుంది.

 12. అప్సర్ గారూ!

  వ్యాసం చాలా బాగుంది.
  ఎవరూ నేరుగా రాజకీయ ప్రకటనలు చేయకపోయినా వాళ్ల సాహిత్య శరీర కదలికలు , పెదవి విరుపులు కనిపించని స్ప్రేలు చల్లతాయనీ, యాసని సాహంకారంగా తన అసలైన భాషగా ప్రకటించుకున్న రోజునే తెలంగాణ సాంస్కృతిక విజయం సాధించిందనీ మీరు చెప్పిన వాక్యాలు అక్షర సత్యాలు. మీ కవిత రోజ్ రోటీ కూడా చాలా బాగుంది. అభినందనలు.

  ఉద్యమం పుణ్యమా అని తెలంగాణ కవి ఈనాడు కవిత్వాకాశంలో ఊహించనంత ఎత్తుకు ఎదిగాడు. ఉద్యమ సంబంధమైన ప్రేరణ దీనికి ముఖ్యకారణమైంది. ఇప్పుడు ఆ ప్రేరణ ఉండదు కనుక ఈ ప్రాసెస్ వెనుకంజవేస్తుందేమోననే అనుమానం, దిగులు, భయం ఇక్కడి సాహిత్యాభిమానులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. అయితే తెలంగాణ పునర్నిర్మాణ అంశాన్ని ఉద్యమ స్థాయికి తీసుకుపోవటం ద్వారా మళ్లీ ప్రేరణను పొందుతూనే వుండాలి తెలంగాణ కవులు.

 13. srinivasu Gaddapati says:

  నిజమైన తెలంగాణా ఇవాళ కాదు గెలిచింది! ఆ బానిస చరిత్రని ధిక్కరించిన ఇరవయ్యేళ్ళ కిందనే గెలిచింది. యాసని సాహంకారంగా తన అసలైన భాషగా ప్రకటించుకున్న రోజునే తెలంగాణా సాంస్కృతిక విజయం సాధించింది.

 14. మెర్సీ మార్గరెట్ says:

  మీ ఈ వ్యాసాన్ని గట్టిగా చదివాను , ఇంట్లో వాళ్ళంతా వినేలా చదివాను.. మీరు ఏ ఉద్రేకంతో ఎలా ఉచ్చరిస్తూ ఏ ఉచ్చారణను లోలోపల అనుకుంటూ రాసారో తెలియదు కాని.. అలాగే అదే భావావేశంతో మాత్రం చదివే ప్రయత్నం చేశాను.. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక వైపు వెనుకటి చీకటి ఇక ఇప్పుడు నిజంగానే నిజమైన సూర్యుడు పొద్దు పొడిచాడు.. పొడుస్తున్న పోద్దుమీద నడుస్తున్న గానమైన తెలంగాణా ముఖంలో వెలుగులు ఒంపుకోబోతుంది… నిజమే ఎప్పుడైనా ఎక్కడైనా పీడితులే గెలవాలి. పీడితులే చరిత్ర రాయాలి. పీడితులే వుద్యమాలు నడపాలి. పీడితుల అక్షరాలే నిజమైన సాహిత్యంగా నిలబడాలి.

  ఇది ఇవాళ తెలంగాణా అనే ఈ ఆకలి మెతుకు నేర్పిన పాఠం!

 15. వాహ్!
  క్యా బాత్ హై అఫ్సర్ సాబ్!
  ఇత్నే సాలోన్సే ఆప్ కె దిల్ మే జొ భంవర్ థా
  వొ ఉభర్ పడా!
  ఆంఖొన్ మె పాని కీ పిచ్కారీ..
  సహీ..
  జిస్ రాస్తోన్ సే హమ్ గుజ్రే
  వొ తో
  అంగారే ఔర్ కాంటోన్ సే భరేహువే థె..
  ఆజ్ వో ఫూల్ బన్ గయే!
  బహుత్ ముబారక్!
  ఔర్
  అలాయ్ బలాయ్!!

 16. శాంతిప్రబోధ says:

  అఫ్సర్ గారూ,

  చాలా బాగుంది
  ‘సూర్యుడు చాలా స్పృహతో తెలంగాణా పంట చేల మీద పొడిచాడు! ఇవాళ ఆకలి మెతుకు గెలిచింది! తెలంగాణా నిరుపేదల చెంపల మీద కొన్ని దశాబ్దాలుగా చారికలు కట్టి వున్న కన్నీటి చుక్క గెలిచింది! ‘ నాకు చాలా చాలా నచ్చిన వాక్యాలు .

  ప్రజల వేదనలోంచి, సంవేదన లోంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలు ఏనాటికైనా గెలిచి తీరాల్సిందే కదా … అదే జరిగింది

 17. అఫ్సర్ i dont agree with you at all, there are bad elements everywhere, all Andhra people don’t torture people with pepperspray except a few లగడాపటి లు. మరియు చాలా మంది తెలంగాణా లగడపాటిలుకూడా ఉన్నారు.

  There are several Andhra s married Telangana s and vice versa మానసా కర్మణా వారు వీరు అయ్యారు వీరు వారయ్యారు. ఈ వ్యాసం చాలా amateur గా వుంది unlike your earlier works

 18. ఆకలి మెతుకు గెలిచిందా? అధికార దాహం గెలిచిందంటే సత్యానికి దగ్గరగా ఉండేది. ఓడేదెప్పుడూ ప్రజలే.

 19. Ramesh Kumar M says:

  నాయకుల సంగతేమో కానీ సీమాంధ్ర ప్రజలెప్పుడూ తెలంగాణా సోదరుల అభివృధ్ధికి ఆటంకపడాలనో లేదా తామే బాగుపడాలనో ఉద్యమం చెయ్యలేదు.. నాయకుల ఆలోచనా రాహిత్యం కారణంగా అభివృధ్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైన పరిస్థితుల్లో విడిపోతే వచ్చే నష్టాలను ఎలా తట్టుకుంటామనే ఆవేదనతో రోడ్లమీదకొచ్చారు. అన్ని చోట్లా.. అన్ని వృత్తులవారు, అన్ని వర్గాలవారు, అన్ని కులాలవారు, అన్ని మతాలవారు ఒకే గొంతుతో నినదించారు. భయంతో, బాధతో ఆక్రోశించారు.. తెలంగాణాకు అన్యాయం చెయ్యమని కాదు.. మాకు న్యాయం చెయ్యమనే లోపలి గొంతును మీరు వినలేకపోతే అది వాళ్ళ తప్పు కాదు. ఈ ‘లోటు’ పాట్లను ఎవరు.. ఎప్పటికి.. ఎలా సరిదిద్దుతారు..? మా దగ్గర కాలయంత్రం లేదు కానీ ఎన్నేళ్ళు వెనక్కు వెళ్ళబోతున్నామో కనిపిస్తూనే వుంది..! ఆకలిమెతుకులూ, చిద్రమైన బతుకులూ ఇక్కడ కూడా వున్నాయి. “ఆకలి మెతుకు గెలిచింది.. కన్నీటిచుక్క గెలిచింది..” కవితలుగా వినిపించడానికి గొప్పగా వుంటాయి. .వాస్తవం ఏమంటే తెలంగాణా ఒకరి చేతుల్లోంచి మరొకరి చేతుల్లోకి వెళ్ళబోతుంది.. అంతే..! ఆ “ఒకరూ, మరొకరూ” ప్రజలు మాత్రం కాదు.. సోషలిజమో, కమ్యునిజమో, హ్యూమనిజమో మరే ఇజమో.. ఏది నిజమో నాకు తెలీదు.. మన బతుకుల్ని మనమే బాగుచేసుకోగలిగే రోజు వచ్చినప్పుడు అంతా కలిసి
  ” ఆకలిమెతుకు గెలిచింది.. కన్నీటిచుక్క గెలిచింది..” అంటూ గొంతెత్తి పాడుకుందాం!

 20. అప్సర్ ,

  నిజమే ,సుదీర్గాపోరాటం పలించిన సందర్బం ముప్పేట సంతోషమే .
  వేయిమంది ప్రాణత్యాగ0 (బలిదానం ) తరువాత , యంతటి కఠోర పరిస్తితులయిన లొంగక మానవు .ప్రపంచ దేశాలన్నీ ఈ పోరాటం నుంచి నేర్చుకోవాల్సి0ది చానవుంది.
  కానీ ,
  ఇద్దరు తేలివిగల వాళ్ళ
  ఎత్తులు , జిత్తుల మద్య
  అమాయక కుందేళ్ళు
  ఎమిచెయగలవు ?
  పోలవరం ముంపు ప్రాంతపు అమాయక గిరిజనం హ్రదయ విదారక ఆర్తనాదం ఎవరిచెవులకెనా చేరే పరిసిత్తిలెదు . టి.వి మీడియా విజయా దుందుభిల మద్య పూడి పోతున్న గొంతులు , ఊపిరి మెసలనితనం.ఎవరికీ పడుతుంది .?
  ఏనుగులు తొక్కినా పంటచేలను
  మళ్ళి నిలబెట్టుకోవచు .
  ముంచెసుతున్న చేతులు రక్షణ కలిపిస్తమని చెప్పటమే విషాదం .
  నీటి నుండి వేరుపడి
  బతికి బట్ట కట్టిన చేపలు
  ఉన్నాయా ? వెతకాలి !

  మిటా యీలు పంచి పెట్టి
  నోరు తీపి చేసుకునే వెల
  వీడెవ్డు అంటారా ?
  -హనీఫ్

 21. sridhar rao deshpande says:

  అఫ్సర్ గారు మంచి బరువైన , ఉద్వేగభరితమైన ఎడిటోరియల్ రాసినందుకు అభినందనలు. గెలిచింది తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష. ఓడింది సీమాంధ్ర ప్రజలు కాదు సీమాంధ్ర లుంపేన్ క్యాపిటల్ . తమ ప్రయోజనాలే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలుగా మలచి తమ దోపిడిని కొనసాగించుకోవడానికి ఇన్నాళ్ళు తెలంగాణ ఆవిర్భావాన్ని అడ్డుకున్నారు. లుంపేన్ క్యాపిటల్ భావజాల మాయలో పడి సీమాంధ్ర మేధావి వర్గం కూడా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక పోరాటాలను సమర్థించలేకపోయినారు. సరే ఒక పోరాటం ముగిసింది. ఒక ఘర్షణకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలుగు భాషకు , తెలుగు ప్రజలకు మరో రాష్ట్రం ఏర్పడింది. ఆ అపూర్వ చారిత్రిక ఘట్టాన్ని అందరు స్వాగతించాల్సి ఉన్నది. పోరాట సందర్భంలో ప్రజల మద్య అనివార్యంగా ఏర్పడిన వైమానశ్యాలను తొలగించుకోవలసి ఉన్నది. కానీ అటు వైపు నుంచి ఇంకా తెలంగాణని స్వాగతించే సౌజన్యం ప్రదర్శించడం లేదు. పైగా విషం చిమ్మే పని పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి విషప్పరుగులని అరికట్టి వైమానశ్యాలను తొలగించే కృషి జరగాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య కృషి , ఆదాన ప్రదానం ముమ్మరం కావాలి. ఆ కృషి సఫలం అవుతున్నదన్న సంకేతాలు మీ వ్యాసానికి వచ్చిన ప్రతిస్పందనలను చూస్తే తెలుస్తున్నది. జయహో తెలంగాణ – జయహో సీమాంధ్ర.

 22. Garimella Nageswararao says:

  అఫ్సర్ గారికి నమస్కారం!
  అత్యంత సహజంగా మీ హృదయంలోంచి జాలువారిన నిజాయితీకి ధన్యవాదాలు. ఆకలిమెతుకు తెలంగాణాలో ఎలా గెలిచిందో
  ఇటు సీమాన్ధ్రలో కూడా తప్పకుండా గెలవాలని మేము కోరుకోవడం తప్పు కాదు కదా. ఆకలి ఎక్కడైనా ఆకలే. ఇక్కడి ప్రజలకి జీవితాలకీ విభజన వల్ల కలిగే నష్టాల పట్లనే మా భయమంతా. మన చుట్టూ కష్టాలలో వుండి వారికి మరింత అన్యాయం జరుగుతోన్నప్పుడు వారి పక్షాన నిలబడి కనీసం నాలుగాక్షరాల్తోనైనా మద్దతు ఇవ్వ వద్దూ?తెలంగాణలో లాగానే ఇక్కడ కూడా పల్లెలలో కన్నీటి జీవితాల కధలెన్నో వున్నాయి. రాజకీయ చదరంగంలో అవి మరింత శి ధిలం కాకుడదన్న తాపత్రయం నిరంతరం ఆలోచనల్లో కదులుతున్నప్పుడు వారి పక్షాన గొంతులు వినిపించాల్సిన అవసరాన్ని బాధ్యతగా భావిస్తున్నా అంతమాత్రం చేత తెలంగాణాకి వ్యతిరేకం కానే కాదు. న్యాయమైన ఈ ఆలోచనకి మీలాంటివాళ్ళు కూడా మద్దతు పలుకుతారన్నది నా విశ్వాసమ్.

Leave a Reply to మెర్సీ మార్గరెట్ Cancel reply

*