నన్ను నేను సమాధానపరుచుకోవడానికేనేమో…!

     సాయంత్రమయ్యేసరికి నలుగురు పిల్లలను తన చుట్టూ పోగేసుకొని అమ్మమ్మ కథలు చెప్పిన తీరు నాకు కథలపై మొదటిగా ఆసక్తిని కలిగిస్తే, కాలేజీ రోజుల్లో అంత్యప్రాసలతో కూడిన నాలుగు వాక్యాలు కవిత్వమని భ్రమించేలా చేశాయి. కామ్రేడ్ పి.ప్రసాద్ గారి పరిచయం నన్ను సాహిత్యానికి చేరువ చేస్తే,  చిన్నతనంలో  నా చుట్టూ వున్న పరిస్థితులు చోటుచేసుకున్న సంఘటనలే  నేటి నా కవిత్వానికి ప్రధాన భూమికగా నిలిచాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
     నిత్యం సాహితీ  సువాసనలు గుభాళించే విజయనగరానికి కొద్దిపాటి దూరంలో కొండలనానుకొని, ప్రపంచపటంలో చీలీ దేశంలా సాగినట్టుండే నెల్లిమర్ల గ్రామానికి, పశ్చిమాన వెలగాడ కొండ.  దానిపై శిధిలమైన రాజముద్రికలా ఓ కోట.  ఊరు పక్కనుండి జలతారు చీరంచులా సాగే ఏరు. ఆ ఎటినానుకొని నిత్యం తన సైరన్ మోతతో మమ్మల్ని మేల్కొలిపే బ్రిటీష్ కాలంనాటి ఓ నారమిల్లు.
front cover
     సొంత ఊరిలో నాలుగు చినుకులు పడితేనే గాని పనికిరాని కాసింత మెట్టు భూమిని పక్కన బెట్టి, మిల్లులో పనికి కుదిరిన మా నాన్న, నాకు ఏడేళ్ళ ప్రాయంలో మా అమ్మ మాటపై మా చదువుల కోసమని కొండగుంపాం గ్రామం నుండి కుటుంబం మొత్తాన్ని నెల్లిమర్లకు తీసుకువచ్చాడు. మిల్లులో యంత్రాల మధ్య తానో యంత్రమైనప్పటికీ… మనసు మాత్రం నిత్యం మట్టిపై మెసిలాడేది. అటు మిల్లుకు ఇటు పొలానికి నిత్యం పరుగులెత్తేవాడు.  మా అమ్మ వద్దంటున్నా వినకుండా పొలానికి మదుపులేట్టేవాడు. ‘పనికిరాని చారెడు నేలపై పడి ఎందుకలా చచ్చిపోతావ్’ అని మా అమ్మ అంటే ‘భూమాతను నమ్ముకున్నోడు ఎప్పుడూ చెడిపోడు’ అని బదులిచ్చేవాడు. మా చదువుల కోసం, పొలం పనుల కోసం అవసరమైన డబ్బులకు మా అమ్మ ఎక్కని గడప వుండేది కాదు. తెచ్చిన అప్పుల కంటే పెరిగిన వడ్డీలకే మా నాన్న కష్టం సరిపోయేది. అందుకనేనేమో ఇప్పటకీ ‘వడ్డీలకు వడి గుర్రాలు చాలవ’ నే మాట మా అమ్మ నోటిలో నలుగుతునే వుంటుంది.  ‘ఆ కాసింత పొలం అమ్మేసి అప్పులు తీర్చెద్దామ్’ అని మా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేవాడు కాడు.  ఆ విషయంపై వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునేవారు.  అసహనానికి గురైన మా నాన్న చేతిలో మా అమ్మ చితికిన చేతి గాజయ్యేది, చివరికి ఉబికే కన్నీరై ఊరుకునేది. ఆ ఘర్షణలకు ప్రత్యక్ష సాక్షులుగా బెదిరిన పిట్టల్లా మా తమ్ముడు, చెల్లి నేను.
      కాలం పరిగెడుతున్న క్రమంలో ప్రపంచీకరణ ప్రభావం మా మిల్లుపైనా పడింది.  అంతవరకూ సక్రమంగా నడిచిందని చెప్పలేము కాని అప్పట్నుంచి మిల్లు  సైరన్ పదే పదే మూగబోవడం మొదలపెట్టింది.  స్థానిక రాజకీయ హస్తాల పెత్తనం కూడా ఎక్కువయ్యింది.  ఇంకేముంది ఒకసారి ఏకంగా పదహారు నెలలు మిల్లు గొంతు మూగబోయింది.
srinu pport
     అటు మా నోటికి మెతుకునివ్వని మెట్టు భూమి, ఇటు నడవక మొండికేసి కూర్చున్న మిల్లు మధ్య మేము విల విలలాడిపోతుంటే,  అది చూడలేని మా నాన్న విజయనగరం కూలి పనికి వెళ్ళేవాడు. ఒకరోజు బోరున వర్షం మినుకు మినుకుమంటూ వెలుగుతున్న కిరోసిన్ దీపం చుట్టూ మా నాన్న రాకకై ఎదురుచూస్తూ మేము. మెరిసే మెరుపుల మధ్య మా నాన్న వచ్చిన చప్పుడయ్యింది. వస్తూనే తడిసిన రెండు  పదిరూపాయిల నోట్లను మా అమ్మ చేతికందించాడు ఆ నోట్లను కిరోసిన్ బుడ్డి దగ్గర వెచ్చబెట్టిన సంఘటన తలుచుకుంటే ఇప్పటకీ నా గుండె తడసి ముద్దవుతుంటుంది.
     ఈ సమయంలోనే ‘ఇఫ్టూ’ నాయకత్వంలో లాకౌట్ పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. దానిలో భాగంగానే ‘ఆకలియాత్రలు’ ‘రాస్తారోకోలు’ జరిగాయి. సమస్య పరిష్కారం కాలేదు. చివరికి కార్మిక కుటుంబాలు ‘రైలురోకోకు’ సిద్దపడ్డాయి. తమ కడుపుమంటకు పరిష్కారం చూపమని అడిగినందుకు అయిదు ఆకలిగిన్నెలు తూటాలకు బలైయినాయి.
     ఈ సంఘటనలన్నీ ఆనాడే నా మనసుపై బలమైన ముద్రను వేసాయి, ఎందుకు పదే పదే మిల్లు సైరన్ మూగబోయేది? మా నాన్న చేతిలో మా అమ్మ ఎందుకు చితికిన చేతి గాజయ్యేది? అయిదుగురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నదెవరు? అన్న ప్రశ్నలు ఇప్పటికీ నన్ను వేదిస్తుంటే నా ఈ కవిత్వంతోనే నన్ను నేను సమాదానపరుచుకుంటున్నానేమో!?

మీ మాటలు

 1. కార్మిక వర్గ నేపథ్యం కలిగిన రైతు కుటుంబం నుండి వచ్చిన యువ కవి కలం పదును వాడి ఈ నేపథ్యగానంతో ఎరుకలోకి వస్తుంది. నెల్లిమర్ల అమరులకు వందనాలర్పిస్తూ మొయిదకు శుభాకాంక్షలు తెలుపుతు…

 2. moida srinivasarao says:

  థ్యాంక్యూ వర్మ గారు.

  • sudhakara rao hari says:

   కవిత్వం చాలా బాగుంది. ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల ఫై మీ/నీ స్పందన అభినందనీయం.

 3. attada appalnaidu says:

  డియర్ శ్రీను,నీ నేపధ్యం చాల బాగుంది.తడిసిన పది రూపాయల నోటు, వర్షపు వాతావరణం దీన్నంతటినీ ఆ గ్యపకాన్ని ఒక కవితగా రాయి. బెస్ట్ అఫ్ లక్..

  • moidasrinivasarao says:

   అప్పలనాయుడు గారు కవిత రాసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు.

 4. సార బావుంది మీ అమ్మా నాన్న గార్ల ఘర్షణల మూలాల్ని కనుక్కుంటే మీకు ఉపయోగ పడుతుందని అనుకుంటాను. ప్రసాద్ గారి పరిచయం మిమ్మల్ని సాహిత్యానికి సరే జీవిత నిజ రూపానికి చేరువ చేస్తే ఎంతో బాగుంటుంది. అవకాసం దొరికితే మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని ఆస పడుతున్నా.

 5. moidasrinivasarao says:

  ధన్యవాదాలు సార్. ఆ ప్రయత్నంలోనే వున్నాను. కలిసే అవకాశం వుంటే నీనే మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను.

 6. Garimella Nageswararao says:

  ప్రియమైన మిత్రమా..

  కవిత్వం తో పాటు మీరు అందించిన నాలుగు మాటలు గుండె ని కదిలించాయి నెల్లిమర్ల మిల్లు లాకౌట్ గురించి నేను కూడ ఒక కవిత రాసాను మా పెదనాన్న కూడా అదేమిల్లులో అష్టకష్టాలు పడతు జీవితాన్ని నారసంచులలోకెత్తి భారంగా మోయడం నాకు తెలుసు. ఉత్తరాంధ్ర ఆకలి కడుపులు పాడే అనేక కన్నీటి పాటలు విన్న అనుభవమే ఈ స్థితిని మరింత దిగజార్చుతున్దేమో నన్నభయానికి, ఏదో ఒకటి చెయ్యాలన్న తపనకి కారణమౌతొన్నది మీ సముద్రమంత చెమటచుక్కని చదివాక మీకు మరింత విపులంగా ఉత్తరం రాస్తా..అభినందనలతో !

  • moidasrinivasarao says:

   తప్పకుండా సర్ మీ వుత్తరం కోసం ఎదురుచూస్తూ…ధన్యవాదాలు

మీ మాటలు

*