కొన్ని ప్రస్తుత క్షణాల లోనే …!!

1619258_10152190932463308_49291678_n

మధ్యస్తపు అలల్లో వొలిపిరిలా తడిపి ,

విదిలించుకున్నా  విడువని సంద్రపు ఇసుకలా

వొళ్ళంతా అల్లుకుపోయిన పిల్లాడా ..

మళ్ళీ నీకో అస్తిత్వం అంటూ నటించకు

నీతో ఉన్న క్షణాలు మనవి  కాక మరేమిటి?

ఊపిరి సెగల్నీ, తడిసిన ఇసుక వాసనల్నీ

విడదీసే శక్తి ,

అత్తిపత్తిలా  పిలిస్తే ముడుచుకుపోయే దేవుడి కెక్కడిది ?

అలసిన దేహాల అవసరమే కావాలనుకుంటే

వూహకందని దూరాల్లోనూ , తెగని నీ ఆలోచనా ధార మాటేమిటి

శరీరాన్ని ప్రేమించని అనుభూతుల తపనేమిటి?

images

కళ్ళప్పగించే చోటల్లా వొళ్ళప్పగించాలనుకొనే

అమాయకపు పిలగాడా

నీతో ఉన్న క్షణాల ఇసుక రేణువులు

ఊపిరాడనివ్వని నీ అహపు బిగింపుల్లో

నలిగి, అలిగి ,జారి

వొంటరి సంద్రపు పాలయ్యేను సుమా ..

నీకై ఆలోచించే చిన్నపాటి మది కదలిక ..

నువ్వు స్తోత్రంలా చెప్పుకొనే అవసరాల ప్రేమజపాల కన్నా

ఎంత గొప్పదో అర్ధం అయితే ,

బంధపు గళ్ళు దాటి, మకిలి మాయల  ఆకళ్ళ వైపు

సాగేనా నీ మనస్సు ?

గుప్పెడు క్షణాల నిశ్శబ్దపు గొప్పదనం

పరమ సత్యంలా బోధపడేది ఇలాంటప్పుడే

గతం, భవిష్యత్లకు సందివ్వని అలల్లాంటి

కొన్ని ప్రస్తుత క్షణాల లోనే …!!

–సాయి పద్మ

మీ మాటలు

 1. చాలా బావుందండి.

 2. జాన్ హైడ్ కనుమూరి says:

  హ్మ్మ్మ్మ్మ్

  శిల్పం నచ్చింది

  ఫిలాసఫి అర్థమయ్యినట్టే ఉంది కాని

  గుప్పెడు క్షణాల నిశ్శబ్దపు గొప్పదనం

  అభినందనలు ..సాయి పద్మ గారు

 3. Vijaya Bhanu Kote says:

  చాలా అర్థవంతంగా ఉంది సాయి…

 4. మైథిలి అబ్బరాజు says:

  ”విడదీసే శక్తి ,
  అత్తిపత్తిలా పిలిస్తే ముడుచుకుపోయే దేవుడి కెక్కడిది ?”………………”నువ్వు స్తోత్రంలా చెప్పుకొనే అవసరాల ప్రేమజపాల కన్నా…” గొప్ప లోతైన భావాలు.
  ఆలోచన లోంచి అక్షరాల్లోకి దారి కనిపిస్తూనే ఉంది, చెప్పినదీ చెప్పనిదీ కలిపి అర్థమైంది నాకు, ఇంకాస్త స్పష్టమయినా అందం పోదేమో కాని….

  • హ్మ్మ్.. మైధిలి గారూ.. ప్రస్తుతంలో బ్రతకటం ..అదీ ఇష్టంగా చెప్పే చిన్ని ప్రయత్నం

   • మైథిలి అబ్బరాజు says:

    :( మీ మాటలలో ముందు మునిగి ఆ లోపలనుంచీ చెప్పిన మాటలు నావి, ఆ నీటి అడుగున ఆల్గే, కోరల్స్, జలచరాలూ…నోట్లోకీ కళ్లలోకీ ఉప్పునీళ్లూ ఇసకా వెళ్తూ ఉన్నప్పుడు .

 5. రాజశేఖర్ గుదిబండి says:

  “నీకై ఆలోచించే చిన్నపాటి మది కదలిక ..

  నువ్వు స్తోత్రంలా చెప్పుకొనే అవసరాల ప్రేమజపాల కన్నా

  ఎంత గొప్పదో అర్ధం అయితే ,.. చాలా బాగుందండి .. “శరీరాన్ని ప్రేమించని అనుభూతుల తపనేమిటి?.. మంచి ప్రశ్న..

 6. ఎప్పుడో ముద్దుగా అలంకరించుకున్న అక్వేరియం గుర్తొచ్చింది పద్మా

  ఆక్షరాలు చేపల్లా ఈదుతూ అందినట్టే అందక అదే కవిత అందం లా వుంది. బావుంది

 7. వాసుదేవ్ says:

  “గుప్పెడు క్షణాల నిశ్శబ్దపు గొప్పదనం

  పరమ సత్యంలా బోధపడేది ఇలాంటప్పుడే”
  ఔను ఇలాంటప్పుడే తెలిసేది…గాఢతలోంచి పుట్టే వాక్యాలన్ని ఇలానే ఉంటాయేమో! కొన్ని మాటల పదునేంటొ కొన్ని కవితావాక్యాల్లో ఇమిడిపోతేనె కానీ తెలియవన్న విషయాన్ని చక్కగా అక్షరీకరించారు. అభినందనలు.

 8. sathyanarayanaerathi says:

  తాదాత్మ్యపు ఆవిష్కరణ .

మీ మాటలు

*