ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 10 వ భాగం

(గత వారం తరువాయి)

10

బెంజ్‌ లిమో కారు గంటకు నూరు మైళ్ళ వేగంతో పోతోంది.
ఇంకో పదినిముషాల్లో కారు విలార్డ్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌ ముందుంటుంది. బయట వర్షం కురుస్తూనే ఉంది..ఎప్పటినుండో..కాస్త చిక్కగానే
‘వాతావరణం నా మనసువలెనే వుంది..మబ్బుపట్టి..ముసురు ముసురుగా..చికాగ్గా, అసహనంగా..రొచ్చుగా..’ అనుకుంది లీల.
యిప్పుడు తను డీల్‌ చేస్తున్న పని తన అత్యంత ఆంతరంగికురాలైన నిర్మలక్కూడా తెలియనిది. ఆఫీషియల్‌ షెడ్యూల్‌లో ఈ ఎలిమెంట్‌ లేదు. యిప్పుడు తను ఎవరి నెట్‌వర్క్‌లోనూ లేదు. పూర్తిగా ఇండిపెండెంట్‌ ఈ క్షణం..అంటే స్వేచ్ఛ..తన గురించి ఎవరికీ తెలియని ఒక అన్‌నోన్‌ అడ్రస్‌ తనిప్పుడు. ఇండియానుండి నిర్మలగానీ, యిక్కడి తమ ఏజంట్‌ రాబర్ట్‌ గానీ, యింకెవరిగ్గానీ తనెక్కడుందో ఈ క్షణం తెలియదు. ఇలాంటి సందర్భం ఒక్కోసారి పంజరంలోనుండి బయటపడ్డ పక్షిపొందే స్వేచ్ఛవంటిది. కాని ఈ స్వేచ్ఛలో ప్రమాదముంది. పంజరంలో ఉండే పక్షిని ఎవరూ కాల్చరు. బయటికొస్తే అది అందరికిచెందిన వస్తువై అందరి పాలౌతుంది. తనుకూడా అంతే. యిప్పుడు తాను ఎవరి రక్షణలోనూ లేదు. నిర్మల, రాబర్ట్‌ దృష్టిలో తానిప్పుడు అన్నెపోలిస్‌ హోటల్‌ లూయిస్‌లో ఉంది. తన అత్యంత అంతరంగికురాలైన నిర్మలక్కూడా చెప్పగూడని అతిగోపనీయ సందర్భాలలో లీల యిటువంటి రిస్క్‌తో కూడిన పనులను చేపడ్తుంది.
రామంకు మళ్ళీ ఫోన్‌ చేసింది. యిది ఆరవ ఫోన్‌. ఫోన్‌రింగవుతోంది. కాని ఎత్తడంలేదు. ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టినట్టున్నాడు.
ఆమెకు అహం దెబ్బతిని. ‘లీల అను నేను ఫోన్‌చేస్తే ఎత్తకపోవడమా’ అనే ఒక అహంకార శిఖరంపై జ్వలించిపోతోందామె.
విసుగ్గా ఫోన్‌ కట్‌చేసి.. టైం చూచుకుంది. రాత్రి ఎనిమిదీ నలభై,
చకచకా ముఖ్యమంత్రి రహస్య ఫోన్‌కు చేసింది. డైరెక్ట్‌ లైనది. మోస్ట్‌ కాన్ఫిడెన్షియల్‌ హాట్‌లైన్లలో ఒకటది.
”హలో..” మరుక్షణంలో ముఖ్యమంత్రి.
”గుడీవినింగ్సర్‌..నేను వాషింగ్టన్‌ డి.సి నుండి..వరల్డ్‌ బ్యాంక్‌ డొమైన్‌నుండి మాట్లాడ్తున్నాను.”
”ఊఁ.. గుడీవినింగమ్మా లీలా..హౌ ఆర్‌ యు..”
”బాగున్నాన్సార్‌..సర్‌ ఆ మన వరల్డ్‌ బ్యాంక్‌ డీల్‌..మొత్తం మూడువందల మిలియన్‌ డాలర్ల లోన్‌ అది. మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌. థర్టీ ఇయర్స్‌ పీరియడ్‌. వన్‌పాయింట్‌ సిక్స్‌త్రీ పర్సంట్‌ ఇంట్రస్ట్‌.. మనం అనుకున్న ప్రకారం డైరెక్టర్‌ ఫర్‌ ఇండియా రాబర్ట్‌ జాఘాను ఒక గంటలో కలువబోతున్నా..మనం మొన్న అనుకున్న కిక్‌బ్యాక్‌ స్ట్రక్చర్‌ ఓకే గదా సర్‌..ది సీజ్‌ ఫర్‌ యువర్‌ ఫైనల్‌ అప్రూవల్‌..”
”ఏం ఫర్వాలేదమ్మా..మూడు బిలియన్‌ డాలర్ల డీల్‌ను ఓకే చేసుకొచ్చే భగీరథ ప్రయత్నం చేస్తున్నావు..కిక్‌బ్యాక్స్‌, నీ కన్‌సల్టెన్సీ ఫీ..ఓకే. డోన్ట్‌వర్రీ..గో ఎహెడ్‌. వచ్చాక ఒకసారి పర్సనల్‌గా నాకు కలువు. పోన్లొద్దు..”అని వెకిలిగా నవ్వుతూ, అదోరకంగా వంకర్లుపోతూ మాట్లాడాడు..
దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల అప్పు..మున్సిపాలిటీల అభివృద్ధి..అంటే చెత్తకుండీల అభివృద్ధి అన్నమాట. ఒక చెత్తబుట్టనుఎవరో ఒకరు కుండీలో కుమ్మరిస్తే కుక్కలమంద చటుక్కున కుండీపైకి ఎగబడి కొట్లాడుకుంటూ ఆ కుళ్ళిన పదార్థాలను దేనికందింది అది నోట కరుచుకుపోతున్న దృశ్యం జ్ఞాపకమొచ్చింది లీలకు. ఇప్పుడీ పదిహేను వందల కోట్లలో ప్రపంచస్థాయి లంచాలు, జాతీయస్థాయి లంచాలు, ట్రాన్సిషనల్‌ ఫ్లో బాపతు లీకేజెస్‌, తనవంతు కన్సల్టెన్సీ ఫీలు అన్నీ పోను.. అన్ని మున్సిపాలిటీలకు పంచి..ఇక మంత్రులు, శాసనసభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కొందరు అసోసిషన్‌ నాయకులు (నోరు తెరువకుండా)..మున్సిపల్‌ ఇంజినీర్స్‌..ఇఇ, డియి, ఎయి, కార్పొరేటర్లు..అందరికీ పండుగ.
రుచికరమైన చికెన్‌ బిర్యానీ అప్పనంగా దొరికినపుడు బిచ్చగాండ్లు ఎగబడి ఎగబడి తింటున్నప్పటి ఆనందం ఉంటుందిక. రోడ్ల అభివృద్ధి అంటాడు, గుడిసెవాసుల సౌకర్యాలంటాడు. మురికివాడల ఉద్ధరణ అంటాడు..ఇంకా ఏవేవో క్లాజ్‌లు. మున్సిపాలిటీల అభివృద్ధి అంటే అందులో పనిచేసే వ్యక్తుల అభివృద్ధి కాదా అని ఒక వెధవ ఇంట్రపిటేషన్‌ చేస్తాడు..మొత్తం మీద దొంగలు దొంగలు కలిసి ప్రపంచ బ్యాంక్‌ రుణాలను పంచుకుంటారు. ఈ నిధులు సరిగా వినియోగించబడ్తున్నాయా లేవా అని ఫస్ట్‌క్లాస్‌ టిఎ, డిఎలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్ళ అకామడేషన్లతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెద్దలొస్తారు పరిశీలనార్థం. అందరూ సంతుష్టులౌతారు ఇన్‌స్పెక్షన్‌ చేసి.. ఎందుకంటే ఎవరివాటా వాళ్లకు ముడ్తుంది జాగ్రత్తగా, రహస్యంగా, పదిలంగా, కాగితాలపై అప్పు ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికోసం వందల వేలకోట్ల సహాయాన్ని అగ్రదేశమైన అమెరికా ప్రపంచబ్యాంక్‌ ద్వారా ఉదారంగా,మానవతా దృష్టితో అప్పు ఇస్తోంది..ఒట్టి నామమాత్రపు వడ్డీరేటుపై. దాన్ని చాలా సమర్థవంతంగా వినియోగించి ప్రమాణాలను పాటించి, సక్రమంగా ప్రియారిటీ రంగాలకు పంచి అభివృద్ధి సాధించబడ్తోంది.. వెనుకబడిన దేశాలలో అని నివేదికలు వెళ్తాయి.
దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నాక..ఖేల్‌ కతం తాలీ బజావ్‌.
ఎప్పుడు తిరిగి చెల్లించాలి అప్పు ప్రపంచబ్యాంక్‌కు. ముప్పయిఏండ్లు. పది సంవత్సరాల గ్రేస్‌ పీరియడ్‌. నలభై ఏండ్ల తర్వాత రాముడెవడో రాకాసెవడో. ఈ ముఖ్యమంత్రుంటాడా, ఈ మంత్రుంటాడా, ఈ మేయరుంటుందా..ఈ లంచాలు తిన్న దొంగలుంటారా. అన్నీ అరిగి కొట్టుకుపోయిన రోడ్లు, ధ్వంసమైపోయిన మురుక్కాలువలు..కూలిపోయిన ఇళ్ళు..మళ్ళీఎప్పటి చిప్ప ఎనుగులోనే.,
కాని.. టంచన్‌గా ప్రతి క్వార్టర్‌కు తీసుకున్న అప్పుకు డాలర్లరూపంలో వడ్డీ మాత్రం తప్పకుండా కట్టాలి అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం. వడ్డీ తడిచి మోపెడై అసలును మించిపోతుంది. నలభై ఏండ్లలో ఈ తరం మారి..ఇంకా పుట్టని శిశువు నెత్తిపై ఋణభారం మోపబడి..అప్పులతో కొప్పులు పెట్టుకుని వయ్యారంగా కులుకుతున్న భారతదేశమా వర్థిల్లు.. తెలుగు సమాజమా వర్థిల్లు.
రాష్ట్రబడ్జెట్‌లో ఎంతశాతం అప్పులవడ్డీ కింద హరించబడ్తోందో సామన్య జనానికి విప్పిచెప్పితే పాలకుల బట్టలిప్పి చెప్పుల్తోకొడ్తారు.
అంతా రహస్యం..గోప్యం..కేన్సర్‌ రోగంవలె..ఎయిడ్స్‌ వ్యాధివలె.
యిదివరకు రోడ్డును తవ్వి ఏదైనా రిపేర్‌ చేస్తున్నపుడు ఒక బోర్డ్‌ పెట్టేవారు..’మరమ్మత్తు పనులు జరుగుతున్నవి’ అని. కాని ఆధునీకరణ పేరుతో వేస్తున్న లంచగొండితనం, వెర్రితలలు వేస్తున్న సంస్కృతిలో యిపుడు ఆ పనులకే ”అభివృద్ధి పనులు జరుగుచున్నవి” అని బోర్డు రాస్తున్నారు..అదీ అభివృద్ధి అంటే.
లీల ఫోన్‌ పెట్టేసి..ముందర టేబుల్‌పై ఉన్న లాప్‌టాప్‌ను క్లిక్‌ చేసి తను కలువవలసిన వ్యక్తిపేరు కోసం సర్చ్‌ చేసింది తన హిడెన్‌ ఫోల్డర్‌లో.
రాబర్ట్‌ జాఘా..డైరెక్టర్‌ ఫర్‌ ఇండియా. మొబైల్‌ నంబర్‌..ఈ రోజు తేది..ప్రక్కనే అపాయింట్‌మెంట్‌ టైం…తొమ్మిది గంటలు..అతను ప్రపంచ బ్యాంక్‌కు ప్రక్కవీధిలోనే ఉన్న విలార్డ్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌లో తనకోసం వేచి ఉంటాడు. మొబైల్‌లో తను సంప్రదించగానే తాము కలుసుకునే విధానం..చర్చించవలసిన విషయం. పట్టే సమయం..ఇతర కీలకమైన ఇచ్చిపుచ్చుకునే డబ్బు వివరాలు, చెల్లింపు పద్ధతి..ఇవన్నీ చెబుతాడు.
వెంటనే మొబైల్‌లో జాఘాకు డయల్‌ చేసింది.
మరుక్షణమే ఫోన్‌ ఎత్తాడు అట్నుండి.
”హాయ్‌..”
”హాయ్‌..గుడీవ్నింగు సర్‌, యామ్‌ లీల హియర్‌ ఫ్రం ఇండియా”
”యయ..ఐ హావ్‌ ఐడెంటిఫైడ్‌ యు. టెల్మీ”
”సర్‌ యామ్‌ రీచింగు యు సూన్‌..వితిన్‌ టెన్‌ మినట్స్‌”
”ప్లీజ్‌ డు కం. హౌ ఆర్‌ యు కమింగు..”
”యామ్‌ కమింగు బై ఎ బెంజ్‌ లిమో”
”దట్స్‌ బెటర్‌. ఐ హావ్‌ పీపుల్‌ ఎరౌండ్‌ మి. జస్ట్‌ ఐ విల్‌ స్కిప్‌ అండ్‌ కం ఇన్‌టు యువర్‌ లిమో..అండ్‌ వియ్‌ విల్‌ ఫైనలైజ్‌ ద డిస్కషన్‌ అండ్‌ డీల్‌ వితిన్‌ టెన్‌ మినట్స్‌..ఆర్యూ ఓకె విత్‌ దట్‌”
”యు మీన్‌..మనీ”
”యస్‌…”
”య”
”ప్లీజ్‌కం..ఐ షల్బీ వెయిటింగు”
లైన్‌ కట్టయింది
లీల నవ్వుకుంది..ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ కన్‌సల్టెన్సీ అనబడే దళారీ వ్యాపారంలోకి దిగకముందు అనుభవంతో.. ప్రారంభంలో డైరీలో రాసుకున్న తాత్పర్య వాక్యం జ్ఞప్తికొచ్చింది.
”కాంతా కనకాలకు లొంగని వాడెవ్వడూ ఈ ప్రపంచంలో లేడు” అని
కాగా..లీల ఒక ప్రధాన విషయాన్ని తన విస్తృతమైన అనుభవంనుండి గ్రహించింది. ఏమిటంటే..పైరవీ స్థాయి పైరవీ చేస్తున్న మొత్తం పెరుగుతున్నకొద్దీ పైరవీ స్ట్రెయిన్‌ తగ్గుతుంది. ఉదాహరణకు సరియైన దిశలో వెళ్తే ఒక మున్సిపల్‌ ఆఫీస్‌లో పైరవీ చేయడం కంటే ప్రైమినిస్టర్‌ ఆఫీస్‌లో పైరవీ చేయడం సుళువు. ఈ రహస్యాన్ని గమనించే కొందరు రాజకీయ నాయకులు కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి, కేంద్రమంత్రి..యిలాంటి సోపానపద్ధతిని పాటించకుండా నేరుగా ఢిల్లీలోనేష్టవేసి డైరెక్ట్‌ హై కమాండ్‌ లాబీయింగులోనే కాలం వెళ్ళబుచ్చుతూ చాలా ప్రయోజనాలూ, పదవులూ పొందుతుంటారు.
ఇరవై రెండు ఫీట్ల పొడవున్న లిమో..నల్లని కారు మెత్తగా, మెల్లగా..మక్‌మల్‌ గుడ్డపై గాజుగోలీలా విలార్డ్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ హాటల్‌ ఫోర్చ్‌లోకి ప్రవేశించింది.
వెంటనే లీల మొబైల్‌లో జాఘాకు ఫోన్‌చేసి..,
మరుక్షణమే ఎత్తాడు ఫోన్‌..”కీపాన్‌ సిట్టింగు ఇన్‌ ద లిమో.. ఐ విల్‌ జాయిన్‌ యు ఎలోన్‌ వితిన్‌ ఫైవ్‌ మినట్స్‌”
”ఒకే సర్‌..” వినమ్రమైన జవాబు.
మిలియన్స్‌ డాలర్ల డీల్‌. డీల్‌నుబట్టి వినయవిధేయతలు.
ఒకటి.. రెండు..మూడు. క్షణాలు గడుస్తున్నాయి.
ఎందుకో చటుక్కున రామం ఆమె మదిలో మెదిలాడు.
తాను చేస్తున్న పనిలో కోట్ల రూపాయల ఆదాయం, ప్రయోజనం ఉండవచ్చు. కాని ఎందుకో ఆ క్షణం ఆమెకు తనకు తాను ఒక పెద్ద మున్సిపల్‌ పెంటకుప్పలో పురుగులా జరజరా కదిలి ఒక కంపు బురదలో కూరుకుపోతున్న అనుభూతి కలిగి.,
ఎందుకు..ఎందుకు ఈ వికారమైన అనుభూతి..ఏమిటిది.?
”దీన్నే ‘ఆత్మ’ అంటారు లీలా..మనిషి తెలిసి తెలిసి తప్పు చేస్తున్నపుడు ఆత్మ అగ్నయి దహిస్తుంది..”
‘అగ్ని.. అగ్ని.. అగ్ని – దహిస్తోందా తననిప్పుడు.’
బయట సన్నగా వర్షం..రాలుతున్న గుండుసూదుల్లా చినుకులు.
చిన్నగా లిమోకార్‌ డోర్‌పై చిన్న ‘నాక్‌’ వినిపించింది. వెంటనే లీల డోర్‌ను రిమోట్‌తో తెరిచి..,
వెంటనే మెరుపులా, నల్లనికోట్‌, టై ధరించిన ఓ నలభై ఐదేళ్ల చురుకైన వ్యక్తి లోపలికి చొచ్చుకొచ్చి లీల ఎదురుగా కూర్చున్నాడు.
ఇరవై రెండు ఫీట్ల పొడవుండే లిమో కార్లలో డ్రైవర్‌కు లోపల ఉన్న వ్యక్తులతో సంబంధం ఉండదు. వాహనాన్ని నడపడమే అతని పని. ఓనర్‌ ఇంటర్‌కాంలో ఎటు చెబితే అటు పోవడం అతని వృత్తిధర్మం. కారు లోపల ఏం జరుగుతోందో తెలుసుకునే యాక్సెస్‌ డ్రైవర్‌కుండదు. అంతా సీక్రటే.
లీల ఇంటర్‌కాంలో డ్రైవర్‌కు..”స్టార్ట్‌..అండ్‌ గో” అని చెప్పింది.
లిమో కదిలింది.. మెత్తగా..పూలబాణంలా.
”మిస్‌ లీల..ఈజిట్‌” అన్నాడు జాఘా మంద్రంగా.
”ఎస్‌..”
”వి హాడ్‌ ఎ డిటైల్డ్‌ రిస్కషన్‌ ఎర్లియర్‌ ఓవర్‌ ఫోన్‌. లేటర్‌.. ఫ్యూ డేస్‌ బ్యాక్‌ ఐ గాట్‌ యువర్‌ ఫైల్‌ ఆఫ్‌ ప్రపోజల్స్‌ అప్రూవ్డ్‌ బై ది ప్రెసిడెంట్‌ ఆఫ్‌ డబ్ల్యు. బి. యాజ్‌ ఐ టోల్డ్‌ యు, దేరార్‌ సం ఫార్మాలిటీస్‌ టు బి కంప్లీటెడ్‌..” చెబుతున్నాడు.
అమెరికన్స్‌ దగ్గర ఓ సుగుణముంది. అనవసర చెత్త మాట్లాడకుండా సూటిగా విషయంలోకొస్తారు..యిక్కడ లోవెల్‌లోనుండి ఎంతో క్రమశిక్షణ, సభ్యత, మర్యాద, పనిపట్ల అంకితభావం, నిజాయితీ, దేశభక్తి ఉన్నాయి. దాదాపు లంచగొండితనం కూడా కిందిస్థాయిలో లేదు. కాని పై స్థాయిలో విపరీతమైన కిక్‌బ్యాక్స్‌, పర్సెంటేజ్‌లు, సర్వ దుర్లక్షణాలూ తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే ప్రపంచ అవినీతికర దేశాల జాబితాలో అమెరికా కూడా చాలా అగ్రస్థాయిలోనే ఉంది.. ఐతే యిక్కడ సర్వదరిద్రాలతో బాధపడే ఇండోనేసియా వంటి దేశం ప్రపంచంలో అతి అవినీతికరదేశంగా ఉందంటే వాని అవసరాలను అర్థం చేసుకోవచ్చు. కాని తిని అరిగించుకోలేని పరమ సుఖాల మధ్య ఓలలాడే వీడికేం దరిద్రం..బుద్ది.. అంతే..కోవె అన్నట్టు లంచం తీసుకోవడం ఒక మానసిక రుగ్మత.
మరి తనో..?
‘పేడలో పురుగు…’రామం జ్ఞాపకమొచ్చాడు మళ్ళీ..గుండెల్లో నిప్పు చురుక్కున మండుతూ కాల్చినట్టు ఈ రామం జ్ఞాపకమొకటి.
”ఐ మేడ్‌ ఆల్‌ ద అరెంజ్‌మెంట్స్‌ మిస్టర్‌ జాఘా..”అంది వంకర్లు తిరుగుతున్న అమెరికన్‌ యాసలో.
”హౌమచ్‌..”
”వన్‌ పర్సంట్‌”
”ఐ టోల్డ్‌ యు..టు మాడిఫై ఎ లిటిల్‌..ఈజిట్‌”
”….” లీల మౌనంగా..శూన్యంగా చూచిందతనివైపు కావాలనే..కొద్ది పర్సంటేజ్‌ పెంపైనా కొన్ని కోట్ల రూపాయల తేడా తెస్తుంది.
”టెల్మీ..ఇఫ్‌ యు సే ఒకే.. థింగ్సు విల్‌ బి రిలీజ్డ్‌ టుమారో”
”ఓకే. వుయ్‌ మేకిట్‌ వన్‌ పాయింట్‌ టు ఫైవ్‌..”
”ఓకే..డన్‌..ప్లీజ్‌ టేకప్‌ ది ప్రాసెసాఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌ ఇమ్మీడియేట్లీ. ఐ థింక్‌ యు హావ్‌ ది ప్రొసీజర్‌..యిమ్లీడియేట్లీ ఐ విల్‌ డు మై బిజినెస్‌”
”ఓకే” లీల కుడిచేతి బొటనవ్రేలిని పైకెత్తి ముఖంనిండా నవ్వుతో ప్రతిస్పందించి,
చాలా అనూహ్యంగా జాఘా పైకొచ్చి ఆమెపైకి వంగి పెదవులపై పెదవులనాచ్చి ముద్దుపేర పెదవులను చీకడం ప్రారంభించాడు.
లీలకు కంపరమెత్తింది. పైన ఒక బొంతపురుగు వచ్చిపడ్డ ఫీలింగు కల్గింది..ఐతే కోట్ల రూపాయల వ్యవహారం.. అవసరం..సున్నితమైన అత్యున్నతస్థాయి డీల్‌.
ఎందుకో మళ్ళీ రామం గుర్చొచ్చాడు.
‘భూమిపుండులా..ఒకసారి అందులో కూరుకుపోవడం మొదలైందంటే.. కదులుతున్నకొద్దీ యింకా యింకా లోపలికి దిగిపోవడమేగాని బయటికి రావడముండదు లీలా’
తన ముఖంపై వాని ముఖం..తన పెదవులపై వాని పెదవులు..అంతా తడి..ఎంగిలి.. ఛీఛీ..
దాదాపు ఓ ఐదు నిముషాలు వాడు పెదవులను చీకి చీకి.. ఒంటిని తాకి తాకి..తడిమి తడిమి..లేచి..
”థాంక్యూ..ఎవ్రీథింగు విల్బీ డన్‌..”అని.,
రోడ్డుపై దూసుకుపోతున్న బాణంలా లిమో.
”మిస్‌..ఊఁ..లీ..లా..” అని సాగదీసి.. ”గెట్‌ ద కార్‌ రివర్టెడ్‌ టు హోటల్‌ ఎగైన్‌. ఐవిల్‌ గో ఔట్‌..”
వెంటనే లీల ఇంటర్‌కాంలో డ్రైవర్‌కు మళ్ళీ కారును హోటల్‌ విలార్డ్‌కు తిరిగి పొమ్మని చెప్పింది..మహావేగంగా వెళ్తున్న లిమో స్పీడ్‌ కంట్రోల్‌ చేసుకుని ఇంటర్‌స్టేట్‌ 95 పైనున్న దాన్ని మెల్లగా మెత్తగా బ్రిడ్జ్‌పైనుండి యూ టర్న్‌ తీసుకుని డ్రైవర్‌ తిరిగి వరల్డ్‌ బ్యాంక్‌ దాపులోనే ఉన్న విలార్డ్‌ ఖండాంతర స్థాయి హోటల్‌ దారి పట్టించాడు.
లీల టైం చూచుకుంది..హోటల్‌ నుండి తాము బయలుదేరి పద్నాల్గు నిముషాలైంది..అంటే మళ్ళీ తిరుగు ప్రయాణం పద్నాల్గు నిముషాలన్నమాట..
ఈలోగా మళ్ళీ వీడేంజేస్తాడోనని భయం..కంపరం.. రోత.
తెలివిగా.. నిశ్శబ్దంగా..ఏదో ఆలోచిస్తున్నట్టు..కళ్ళుమూసుకుని వెనకి కుర్చీలోకి సాగిలపడి ఒరిగింది..అంటే ‘నన్ను డిస్ట్రర్బ్‌ చేయొద్దు..నేనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నాను.’ అన్న ముద్రను ఎదుటి మనిషిపైకి విసిరి..తప్పించుకుంటోందన్నమాట.
వెంటనే.. ఈ వరల్డ్‌ బ్యాంక్‌ అనే వ్యవస్థలోకి ఐదు సంవత్సరాల క్రితం ఒక రాజస్థాన్‌ గవర్నమెంట్‌ అసైన్‌మెంట్‌తో తాను ప్రవేశించిన విషయం గుర్తొచ్చింది లీలకు. కాలుపెట్టే ముందు కేస్‌ను పూర్తిగా అధ్యయనం చేసి లోలోతులను పరిశీలించి ప్రవేశించడం లీల దగ్గరున్న పెద్ద సుగుణం.
డబ్బున్నవాడూ, అధికారంలో ఉన్నవాడెప్పుడూ తన ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించే అనుచర అసురగణాన్ని తన చుట్టూ ప్రతిష్టించుకుంటాడు. అలాగే ప్రపంచంపై డబ్బుతో పెత్తనం చేయాలనే ఒక ప్రచ్ఛన్న సామ్రాజ్యవాద దుష్టవాంఛతో 1944లో తన వైట్‌హౌజ్‌, పార్లమెంట్‌ భవనం దాపులోనే వంద కార్యాలయాలతో 40 అంతస్తుల భవనంతో, పదివేలమందిఉద్యోగులతో వాషింగ్టన్‌ డి.సిలో ఒక అధికారిక కేంద్రాన్ని అమెరికా స్థాపించింది. నామమాత్రపు వడ్డీతో, మానవతా దృష్టితో బడుగు, వెనుకబడ్డ దేశాలను ఉద్దరించాలనే ప్రధాన లక్ష్యంతో నూటా ఎనభై ఆరు ప్రపంచదేశాలను సభ్యులుగా చేసి ”ఇంటర్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (|ఔష్ట్రఈ) మరియు ఇంటర్‌ నేషనల్‌ కాంట్రిబ్యూషన్‌ ఫర్‌ డెవలపింగు కంట్రీస్‌” పేరుతో కార్యకలాపాలను ప్రారంభించింది. ఇరవై నాల్గుమంది డైరెక్టర్లతో ఒక పాలకవర్గాన్ని, నియంత్రణ సంఘాల్ని తమ చెప్పుచేతల్లో కీలుబొమ్మల్లా ఉండే దేశాల లంచగొండి వ్యక్తులతో నింపి దాని తీర్మాలన్నింటినీ ప్రజాస్వామ్యబద్దంగా చర్చించి ప్రపంచ ప్రజల సంక్షేమం దృష్ట్యా తీసుకుంటున్నట్టుగా ప్రపంచానికి చాటిచెబుతోంది. దాంట్లో ప్రతి పెద్ద దేశ వ్యవహారాలను చూడ్డానికి ఒక అమెరికన్‌ డైరెక్టర్‌గా ఉంటాడు. ప్రస్తుతం వరల్డ్‌ బ్యాంక్‌లో 186 సభ్య దేశాలుంటే బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌ మరియు ఇండియాలకు కలిపి ఒక భారతదేశ ప్రతినిధిఉన్నాడు అభిషేక్‌ ముఖర్జీ అని. పరిశీనలతో తెలిసిందేమిటంటే ఈ నియామకాలన్నీ కూడా వ్యక్తుల ప్రతిభనుబట్టి కాకుండా రాజకీయ ఒత్తిడి, పైరవీ, లంచాల ద్వారా మాత్రమే జర్గుతాయి. ఈ వ్యక్తుల ద్వారానే మిలియన్‌ కోట్ల డాలర్ల అప్పులు, వితరణ, దయాదాక్షిణ్యాలు, చర్చలు.. అన్నీ జర్గుతాయి. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ల కుర్చీలలో మకుటంలేని మహారాజులు. ప్రపంచ శాసకులు. అమెరికా అనే చక్రవర్తికింద అతివిధేయులైన సామంతరాజులు. బానిసలు.
అమెరికా తన మాట వినని దేశాలపై యుద్ధం ప్రకటించి ధ్వంసం చేస్తుంది. సుదీర్ఘకాల దమనకాండ తర్వాత ప్రజలు యిక నిస్సహాయస్థితికి వచ్చి కష్టాలు, కన్నీళ్ళతో కుమిలిపోతున్న దయనీయ సందర్భంలో ఆదుకుంటున్నట్టుగా ప్రపంచ ప్రజలకు ఒక ప్రకటనద్వారా తెలియజేసి ‘పునర్నిర్మాణం, అభివృద్ధి’ పేరుతో యుఎన్‌ఓ వరల్డ్‌ బ్యాంక్‌, ఐఎమ్‌ఎఫ్‌ సంస్థలద్వారా బిలియన్‌ డాలర్లను అప్పుగా యిచ్చి మళ్ళీ తమ కాంట్రాక్టర్లనే రంగంలోకి దింపి ప్రధానమైన పెద్దపెద్ద పనులన్నీ తమ సంస్థలకే అప్పజెప్పి.. మళ్ళీ మన డబ్బు మన దగ్గరికే..మన అధికారం మనదే..మన అహంకారం  మనదే.. అనే ‘నక్క జిత్తు’ను ప్రదర్శిస్తుంది. దీన్ని సామ్రాజ్యవాదమన్నా, పెత్తందారీ విధానమన్నా, అధికార దురహంకారమన్నా.. యిదివరకు ఎన్నో థాబ్దాలుగా జరిగిందీ అదే. ప్రస్తుతం జరుగుతున్నదీ అదే..మున్ముందు జరుగబోయేదికూడా అదే.
అప్ఘనిస్తాన్‌పై దాడిచేసింది. తాలిబన్ల సమస్య నిజంగా ప్రపంచసమస్యే ఐనా..ప్రపంచ పోలీస్‌ పాత్ర వహించి, ఇటు పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని తానే పెంచిపోషిస్తూ..మళ్ళీ వడ్డీ వ్యాపారమే. ఇరాక్‌పై విరుచుకుపడి, కోలుకోకుండా ధ్వంసంచేసి.. వందల బిలియన్ల డాలర్లను అప్పుగా కుమ్మరించి..మళ్ళీ వడ్డీ వ్యాపారమే.
వ్యవస్థ ఏదైనా..దేశం ఏదైనా..సందర్భం ఏదైనా..బలహీనుని నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వాన్ని శాశ్వత బానిసను చేసి, తన మాటకు ఎదురులేని అధికారిన్ని చెలాయించడమే ..ఉన్నవాడు పుట్టినప్పట్నుండీ లేనివానిపై చేస్తున్న ప్రచ్ఛన్నదాడి. సంపన్నుడు బీదవానిపై దౌర్జన్యం. దీన్ని ప్రతిఘటించేందుకు మానవ చరిత్ర నిండా ఎన్నో యుద్ధాలు, ఎన్నో తిరుగుబాట్లు, ఎన్నో ఉద్యమాలు..ఎంతో రక్తపాతం.
ఐనా వ్యవస్థ మారిందా..మారుతున్నట్టనిపిస్తోందా..మారే సూచనలేమైనా కనిపిస్తున్నాయా..ఉహుఁ..నానాటికీ యింకా దిగజారిపోతున్నాయేమో.
అసలు 1778లో బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, జాన్‌ ఆడమ్స్‌. థామస్‌ జఫర్సన్‌ అనే ముగ్గురు వ్యక్తులు కూర్చుని రూపొందించిన అమెరికా రాజ్యాంగమే ఈ అధికార కేంద్రీకరణకూ, పెత్తందారీతనానికి వీలు కల్పిస్తూ ఆర్థిక విధానాన్ని స్పష్టంగా నిర్వచించింది. అవే..అమెరికా యొక్క కాపిటలిస్ట్‌ ఎకానమి, మార్కెట్‌ ఎకానమీ. వీటి ప్రకారం ప్రైవేటీకరణ అనేది వేళ్ళూనుకుని ఊడలుపారి పాతుకుపోయింది. రెండువందల సంవత్సరాలకు పైగా. సర్వసంస్థలన్నీ ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలోనే ఉంటాయి..వ్యాపారాలన్నీ ప్రైవేట్‌ సంస్థలే నడుపుతాయి..కాని అందరి జుట్టుమాత్రం ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఫిలడల్ఫియా రాష్ట్రంలోని పెన్సెల్వీనియా రాష్ట్ర నయగరాగా పిలవబడే ‘బుష్‌కిల్‌ జలపాతం’ దాని చుట్టు ప్రక్కలున్న అడవి అంతా ఒక కుటుంబానికి చెందిన .. వ్యక్తికి చెందిన ప్రైవేట్‌ ఆస్తి అని తెలుసుకుంటే మనం ఆశ్చర్యంతో కొయ్యబారిపోతాం.
”ఇటీజ్‌ రైనింగు లైక్‌ దిస్‌ సిన్స్‌ మార్నింగు..వెన్‌ డిడ్యూకం టు అమెరికా..”అన్నాడు జాఘా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఏదో ఒకటి మాట్టాడాలని..లీలనుద్దేశించి.
పరధ్యానంగా..ఏదో లోకంలో మునిగి ఉన్న లీల ఉలిక్కిపడి…”యయ.. జస్ట్‌ ఫ్యూ అవర్స్‌ ఎగో.. ఐ విల్‌ బిఫ్లయింగు బ్యాక్‌ టు ఇండియా టునైటెగైన్‌” అంది జలజలా.
”ఓ…”
లిమో విలార్డ్‌ హోటల్‌ పార్కింగు యార్డ్‌లోకి ప్రవేశించింది. కారు ఆగగానే కదలకుండా లీల తన సీట్లో అలాగే కూర్చుంది కావాలనే. జాఘా లేచి.. నెత్తికి రూఫ్‌ తాకకుండా ఒక మెరుపువలె తన ప్రక్కన చేరి.. మళ్ళీ పైకివంగి కనురెప్పపాటు కాలంలో పెదవులపై పెదవులనుంచి గట్టిగా అదిమి ముద్దుపెట్టుకుని..,
‘ఛీ ఛీ.. మొద్దు ముండాకొడుకు..’ అని అనుకుంటూండగానే,
”బై బై..కంప్లీట్‌ ది ట్రాన్స్‌ఫర్‌ ప్రాసెస్‌ అండ్‌ రిపోర్ట్‌ సూన్‌.. బైబై..” అని లిమో దిగి చకచకా వెళ్ళిఫోయాడు పోర్చ్‌లోకి.
అంటే లంచం డబ్బును వాడి రహస్య అకౌంట్లలోకి వెంటనే బదిలీ చేయమని.,
అప్రయత్నంగానే లీల కార్లో..ఫ్లోర్‌ఫై తుపుక్కున ఉమ్మేసింది.
అసహ్యం కలిగింది.
ఎవరిపైన..జాఘాపైననా..తనపైననా..తను చేస్తున్న పనిపైననా. ఈ వ్యవస్థపైననా,
లిమో మళ్ళీ బయల్దేరింది ఇంటర్‌ స్టేట్‌ తొంభై ఐదుపై.. కాల్చబడ్డ తుపాకీ గుండులా.
ముడుచుకుపోయిన పువ్వులా..మురుక్కాలువలోపడ్డ వాన చినుకులా..పైన ఏదో వికారమైన పురుగు ప్రాకిన తర్వాత మిగిలే వికారమైన అనుభూతితో..లీల.
ఏమిటిది..ఛీ ఛీ.,
ఎందుకో లీలకు చటుక్కున దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీళ్లు జలజలా రాలాయి..చలించిపోతోంది గాలిలో సన్నని కాగితం రెపరెపలాడ్తున్నట్టు.,
మనసంతా స్తబ్దత..ఎవరో నెత్తిపై సుత్తితో కొట్టినట్టు
ముందు కాన్ఫెరెన్స్‌ టేబుల్‌పై సైలెంట్‌ మోడ్‌లో నున్న తన మొబైల్‌ తెరపై కాల్‌ వస్తున్న సూచనగా బ్లింకవుతున్నట్టు కనిపిస్తోంది. అనాసక్తంగా చేతిలోకి తీసుకుని ఎత్తింది. ముఖ్యమంత్రి చాంబర్‌నుండి పర్సనల్‌ సెక్రటరీ మంజుల.
”హలో..గుడ్మార్నింగు మేం..”సన్నని మధురమైన గొంతు.
అక్కడ ఇండియాలో.. టైం ఎంతై ఉంటుంది..యిక్కడ రాత్రి..పదిం…అక్కడ ఉదయం ఏడున్నర దాటి..ఊఁ..
”గుడ్మార్నింగు మంజూ..చెప్పండి.”
”మీరు నిన్న సార్‌తో మాట్లాడిన వరల్డ్‌ బ్యాంక్‌ మున్సిపల్‌ బాపతు ఫండ్స్‌ శాంక్షనైతే…రెండుగంటల తర్వాత మీడియా మీటింగు పెట్టి తను ఎంతో కష్టపడి ప్రపంచ బ్యాంక్‌ అధికారులను ఒప్పించి బడుగు వర్గాల, మురికి వాడల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్‌ నిధులు పదిహేను వందలకోట్లను సాధించినట్టు పత్రికా ప్రకటనను జారీ చేస్తారు. వెయిటింగు ఫర్‌ యువర్‌ క్లియరెన్స్‌”
”ఆఁ.. మంజూ..ముఖ్యమంత్రిగారు పత్రికా ప్రకటన ఇవ్వవచ్చు. మూడువందల మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని ముప్పది సంవత్సరాల తర్వాత తిరిగి చెల్లించే .. కావలిస్తే మరో పది సంవత్సరాల గ్రేస్‌ పీరియడ్‌తో ఋణాన్ని ప్రపంచబ్యాంకు మంజూరు చేసింది. దీన్ని అధికారికంగా అనౌన్స్‌ చేయొచ్చిక. ఒక గంట క్రితమే క్లియర్‌ చేయించా..గో ఎహెడ్‌.”
”థాంక్యూ లీలగారూ..మీరు ఎప్పుడు ముఖ్యమంత్రిగారిని కలుస్తారు”
”ఆఫ్టర్‌ టు డేస్‌..ఎట్‌ ఢెల్హీ”
”థాంక్యూ..ఓకే..మేమ్‌” ఫోన్‌ పెట్టేసిన చప్పుడు.
నుదిటిపై పడ్తున్న ముంగురులను పైకి తోస్తూ..’ఏమిటీ జీవితం’ అనుకుంది లీల.
సరిగ్గా అప్పుడే మళ్ళీ మొబైల్‌ బ్లింక్‌ ఐంది.
”హలో..”
”రాబర్ట్‌ హియర్‌ మేం.”
వెంటనే..తను కొద్దిగంటల క్రితం వాషింగ్టన్‌ డి.సి డెల్లస్‌లో విమానం దిగడం..చెకౌట్‌ టైంలో.. టెక్సాస్‌ కంపెనీ.. త్రెట్‌.. నిర్మల హెచ్చరిక..తమ ఏజంట్‌..రాబర్ట్‌కు తెలియకుండా నిర్మలచే నియమించబడ్డ ప్రైవేట్‌ సెక్యూరిటీ..అంతా జ్ఞాపకమొచ్చింది లీలకు చకచకా.
”టెల్మీ”..
”దట్‌ టెక్సాస్‌ బాస్టర్డ్‌ హాజ్‌ బీన్‌ కిల్డ్‌ మేం..ద డెడ్‌ బాడీ యీజ్‌ డ్రాప్డ్‌ యిన్‌ పొకొనొ డీప్‌ ఫారెస్ట్‌ ఎట్‌ ఫిలడెల్ఫియా .. నథింగు టు వర్రీ మేం..యుకెన్‌ బ్రీత్‌…”
”ఓ..ఓకే..థాంక్యూ”
లైన్‌ తెగిపోయింది.
ఒక హత్య..ఒక కుట్ర..ఒక కుతంత్రం..చుట్టూ సుఖాలు, సౌకర్యాలు, అధికారం, అహంకారం..ఏమిటిదంతా,
”డ్రైవర్‌ హారీ..”
”యస్‌ మేం..”
”స్ట్రయ్‌టెవె గోటు అవర్‌ హోటల్‌ లోయిస్‌..అన్నెపోలిస్‌..ఓకే..”
”ఓకే మేమ్‌..”
”ఐయామ్‌ స్లీపింగు..డోన్డ్‌ డిస్ట్రబ్‌మి.”
”రైట్‌.. ”
లీల మనసు కల్లోల సముద్రంలా ఉంది. సముద్ర తీరంపై తను..ఎదురుగా భీకర శబ్దంతో అలలు.. ఎత్తయిన నీటిగోడ వచ్చీవచ్చీ తలను తీరానికి బాదుకుని..చిట్లి, చెదిరి..పగిలి..కకావికలై,
అలా ఎన్నిసార్లు.. ఎన్నిసార్లు సముద్రం ఒడ్డుపై గంటలగ్గంటలు ఒంటరిగా కూర్చుందో తను సముద్రంలోకి చూస్తూ. తనకు అత్యంత యిష్టమైన పనుల్లో అలా ఏకాంతంగా సముద్రంతో గడపడం మొదటిది.
దూసుకుపోతున్న లిమో కారు కిటికీ అద్దాన్ని కొద్దిగా, బయటికి చూచేందుకు  ప్రయత్నించిది లీల. నల్లగా చీకటి. కత్తిలా విసురుగా దూసుకు వచ్చిన గాలి. భయంకరమైన గాలి చప్పుడు..చిక్కగా వాన. ప్రక్క అదే రోడ్డుపై వందల సంఖ్యలో రేస్‌లోలా ఒకదాన్నొకటి దాటుకుంటూ పరుగెత్తుతున్న కార్లమందలు – తెల్లగా హెడ్‌ల్యాంప్స్‌. అటు ప్రక్కన ఎర్రని నిప్పుల సముద్రంలా టెయిల్‌ ల్యాంప్స్‌. బయటంత బీభీత్స వాతావరణం.. ఉద్విగ్నత.. లిప్తకాలమే ఐనా భరించలేక వెంటనే, మరుక్షణం కిటికీ అద్దాన్ని ఠక్కున మూసేసింది.
మళ్ళీ లోపల నిశ్శబ్దం.
కారు బయట బీభత్సం..లోపల నిశ్శబ్దం.
మనిషి బయట బీభత్సం..లోపలకూడా బీభత్సమే..బీభత్సమా అది..ప్రళయంకదా.
కళ్లు మూసుకుంది.
తను హైద్రాబాద్‌నుండి బయలుదేరిన దగ్గర్నుండి ఆరు కేసుల పరిష్కరణ. రెండు హత్యలు..ముప్పయి నలభై కోట్లకు పైగా ఆర్థిక లాభం రాగల లావాదేవీలు..ఎన్నో చాలెంజెస్‌..చదరంగం ఆటలోలా ఎత్తులు..వ్యూహాలు..కదలికలు.. ఏదో గర్వమనిపించే గెలుపు..ఐనా అర్ధంకాని ఓటమి.
కన్నంటుకుంది లీలకు..చటుక్కున గాఢనిద్రలోకి జారిపోయింది. లిమో కారు కాన్ఫరెన్సింగు సీట్‌ను స్ట్రెచ్‌ చేసుకుని ఒరిగి పడుకుంటే మెత్తని మంచంపై పడుకున్నట్టే ఎంతో సౌకర్యంగా ఉంటుంది.
లిప్తకాలంలో ఓ గాఢ స్వప్నం విచ్చుకుంది.
అది.. అట్లాంటిక్‌ మహాసముద్రంలో..అట్లాంటిక్‌ స్మశానంగా ప్రపంచ ప్రసిద్ధిచెందిన ‘బెర్ముడా త్రికోణం’. అల్పపీడనమో, మనుషులకు ఇంతవరకు బోధపడని భౌతికేతర ఏ ప్రాకృతిక కారణమో, శాస్త్రాలకు ఇంతవరకు బోధపడని ఏ అహేతువో.. కొన్ని కిలోమీటర్లమేర వ్యాపించిన ఒక సువిశాల సముద్రతలంనుండి ఆకాశాంతరాల్లోకి వ్యాపించిన ఒక అదృశ్య జలశూన్యం. ఇంతవరకు ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన విమానాలు, నౌకలు ఏవైనా నమ్మశక్యంకానివిధంగాసుళ్లుతిరిగి అదృశ్యమై శాశ్వతంగా మళ్ళీ కనబడకుండా బెర్ముడా త్రికోణంలోకి కనుమరుగైపోవడం..ఒక మాయవలె, మంత్రంవలె.. అపార జలనిధిలోకి మహాభినిష్క్రమణం..ఎవరికీ అంతుపట్టని చిత్రం. శాస్త్రానికందని వింత. ‘బెర్ముడా త్రికోణం’ ఒక జలస్మశానం.
తను.. ఎక్కడనుండో..ఒక వర్షపు చినుకులా ఆకాశంలోనుండి రాలిపడి..ఒక మహాశూన్యంలోనుండి తెగిన చుక్కలా రాలి రాలి..చుట్టూ అంతా శూన్యం..ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి..ప్రాణం బిగబట్టుకున్న శరీర స్తంభన..వస్తోంది..క్రిందికి.. యింకా క్రిందికి..సర్‌ర్‌ర్‌న..,
వచ్చీ వచ్చీ..ఒక శూన్యనాళికలోకి ప్రవేశించినట్టు..క్రింద భీకరంగా సముద్రం..చుట్టూ సుడితిర్గుతున్న బలమైన గాలిగొట్టం.. పైకి లేచి, కిందికి నెట్టబడి..మళ్ళీ ఎత్తుకు ఎగిరి..ఈడ్చి క్రిందకు తన్నబడి..కొట్టుకుపోతోంది తను..మనిషి ఒట్టి కాగితపుముక్కకన్నా, ధూళికణంకన్నా అధ్వాన్నంగా ఎక్కడకో తరుమబడ్తోంది…పాతాళంలోకి, మళ్ళీ ఆకాశగర్భంలోకి.. సముద్రంలోకి.,
చటుక్కున సముద్రంలోకి.. యింకా లోలోకి..అందనంత లోతుకు..చిక్కని నీలి నీళ్ళలోకి కూరుకుపోతూ.. మునిగిపోతూ, కొట్టుకుపోతూ..
ఊపిరాడ్డంలేదు..శరీరం స్తంభించిపోతోంది. గాలి అందడంలేదు. శ్వాసాగిపోతోందా?
భయంతో ఉలిక్కిపడి. మెలకువ వచ్చి.,
తనింకా జీవించే ఉందా..చచ్చిపోయిందా..జలసమాధి ఐపోయిందా. ఆ బీభత్సం..ఆఁ.. ఆఁ..
లీల ఉలిక్కిపడి..భయంతో కంపించిపోతూ..ఒళ్ళంతా చెమటతో నిండిపోయి..గుండె దడదడా కొట్టుకుంటూ.,
‘అబ్బా..యిది కలా..హమ్మయ్య’ మెల్లమెల్లగా,
స్పృహ. వాస్తవం…తెలివి..మెలకువ..స్పృహ..స్పృహ..,
కల చెదిరింది..హమ్మయ్య.. తను చావలేదు..బతికేఉంది.
లిమోకారు యింకా పోతూనే ఉంది..గర్జించుకుంటూ..
బయటికి చూచి..కారు ఎక్కడుందో గుర్తుపట్టేందుకు ప్రయత్నించింది.
దూరంగా..లోయిస్‌ హోటల్‌ కన్పిస్తోంది..సరిగ్గా అప్పుడు లీల మొబైల్‌ ఫోన్‌ మ్రోగింది..బ్లింకవుతూ.
స్క్రీన్‌పై చూస్తూ స్విచ్‌ నొక్కింది..’రామం’
ఓహ్‌ా రామం..రామం..తను యిష్టపడే..తను ఆరాధించే తన మనసునిండా నిండి ఈ ప్రపంచంలో తనకు తప్ప ఎవరికీ తెలియని అదృశ్య, అజ్ఞాత వ్యక్తి రామం.
”రామం..”అంది ఉత్సాహంతో ఉప్పొంగిపోతూ.
తను అమెరికానుండి ఇండియాకు వెళ్ళేలోగా రామం ఇక ఫోన్‌ చేయడనుకుంది. కాని చేశాడు..తనకోసం రామం ఫోన్‌ చేశాడు.
అప్పుడు లీల ఆకాశంలో ఎగుర్తున్న పక్షి.,
”లీలా..చెప్పు”
”రేపుదయం ఆరుగంటల ఫ్లైట్‌లో వాషింగ్టన్‌ డి.సి.డల్లెస్‌ నుండి ఇండియా వెళ్ళిపోతున్నా రామం”
”అసలిప్పుడు నువ్వు యుఎస్‌లో ఉన్నావా”
”ఔను.. ఐదు గంటల క్రితం వచ్చాను…ఉదయం వెళ్తున్నా”
”ఎక్కడున్నావ్‌”
”అన్నెపోలిస్‌.. హోటల్‌ లోయిస్‌..ఒక్కసారి మనం కలవాలి రామం. ప్లీజ్‌”
”అవసరమా లీలా”
”ఔను చాలా అవసరం”
”సరే.. రేపు ఉదయం ఒక గంటముందుగా..ఏర్‌పోర్ట్‌కు రా. నేను చెప్పిన టైంకు ముందు. అంటే, నాలుగ్గంటలకువిజిటర్స్‌ లాంజ్‌లో కలుస్తా..సరేనా..”
”ఓకే.. థాంక్యూ రామం. థాంక్యూ వెరీమచ్‌..”
”మంచిది లీలా..గుడ్‌నైట్‌”
మొబైల్‌ లైన్‌ తెగిపోయింది. ఏదో ఒక విద్యుత్‌ ప్రవాహం ఆగిపోయి, అదృశ్యమైన ఒక జీవవాహకం మరుక్షణమే మృతవాహకంగా మిగిలిపోయినట్టు., ఏదో ఖాళీ..శూన్యం. ఐనా రామం తనకు తాను ఫోన్‌చేసి మట్లాడినందుకు ఆమెకు ఏదో చెప్పలేని ఒళ్లంతా పులకింత..తృప్తి..సంతోషం..ఉద్వేగం.
రామం రేపుదయం తనకు కనబడ్తాడు..రామం రేపుదయం తనతో మాట్లాడ్తాడు. రామం రేపుదయం తనతో ..,
ఏదో హాయి.
లిమో కారు నెమ్మదిగా..మెత్తగా లోయిస్‌ ఇంటర్‌కాంటినెంటల్‌ పోర్టికోలో ఆగుతోందిక..అబ్బా ఎంత హాయో..
లీల అప్పుడే పూర్తిగా విచ్చుకుంటున్న కలువలా పరవశించిపోతూ.,
టైం చూచుకుంది లీల లిమోనుండి క్రిందికి దిగుతూ
పదకొండూ నలభైనిముషాలు.

(సశేషం)

–రామా చంద్రమౌళి

మీ మాటలు

 1. గుండెబోయిన శ్రీనివాస్ says:

  ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? సీరియల్ ఆఖరి దశకు చేరుకుంటున్నట్లుంది.

 2. shyamala.k says:

  ii navalanu modaTinuMDi chaduvutunnaanu.adbhutamaina nadakatO saagutOMdi.oka samasyanu tiisukuni mouLigaaru SaastriiyamGaa viSlEShistunnaaru.’prapaMcha baaMk ‘vaMtI samstala guTTu raTTu chEstunnaaru.
  mouLi gaariki abhinaMdanalu.
  Dr,shyaamala.k

 3. రుచికరమైన చికెన్‌ బిర్యానీ అప్పనంగా దొరికినపుడు బిచ్చగాండ్లు ఎగబడి ఎగబడి తింటున్నప్పటి ఆనందం ఉంటుందిక. రోడ్ల అభివృద్ధి అంటాడు, గుడిసెవాసుల సౌకర్యాలంటాడు. మురికివాడల ఉద్ధరణ అంటాడు..ఇంకా ఏవేవో క్లాజ్‌లు. మున్సిపాలిటీల అభివృద్ధి అంటే అందులో పనిచేసే వ్యక్తుల అభివృద్ధి కాదా అని ఒక వెధవ ఇంట్రపిటేషన్‌ చేస్తాడు..మొత్తం మీద దొంగలు దొంగలు కలిసి ప్రపంచ బ్యాంక్‌ రుణాలను పంచుకుంటారు. ఈ నిధులు సరిగా వినియోగించబడ్తున్నాయా లేవా అని ఫస్ట్‌క్లాస్‌ టిఎ, డిఎలు, ఫైవ్‌స్టార్‌ హోటళ్ళ అకామడేషన్లతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెద్దలొస్తారు పరిశీలనార్థం. అందరూ సంతుష్టులౌతారు ఇన్‌స్పెక్షన్‌ చేసి.. ఎందుకంటే ఎవరివాటా వాళ్లకు ముడ్తుంది జాగ్రత్తగా, రహస్యంగా, పదిలంగా, కాగితాలపై అప్పు ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికోసం వందల వేలకోట్ల సహాయాన్ని అగ్రదేశమైన అమెరికా ప్రపంచబ్యాంక్‌ ద్వారా ఉదారంగా,మానవతా దృష్టితో అప్పు ఇస్తోంది..ఒట్టి నామమాత్రపు వడ్డీరేటుపై. దాన్ని చాలా సమర్థవంతంగా వినియోగించి ప్రమాణాలను పాటించి, సక్రమంగా ప్రియారిటీ రంగాలకు పంచి అభివృద్ధి సాధించబడ్తోంది.. వెనుకబడిన దేశాలలో అని నివేదికలు వెళ్తాయి.
  దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నాక..ఖేల్‌ కతం తాలీ బజావ్‌.
  ఇదే వర్తమాన భారతదేశ పరిస్థితి ..మౌళిగారు చాలా ధైర్యంగా రాస్తున్నారు.
  సామాజిక స్ప్రహ అనేది మృగ్యమై పోతున్న ఈ తరానికి ఈ నవల ఒక కనువిప్పు.

  – డాక్టర్ డి.రాములు.నిర్మల్.

 4. ఎక్కడ నుంచి ఎక్కడి దాకా ? – నవల చాల ఆకట్టుకుంటూ …..వర్తమాన భారతీయ వ్యవస్థను ఆవేదనగా వ్యక్తీరించటం …..,మౌళీ గారికి .ధన్యవాదములు ,

 5. ఈ నవల chaduvutoo ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము rachaita raama చంద్ర మౌళి gaariki maa నమస్కారములు
  సుమ
  vizag

 6. srinivas.R says:

  రచయిత ఎంచుకునే వస్తువును బట్టి ఆ రచనయొక్క ఉత్కృష్టత బహిర్గతమౌతుంది.నిస్సందేహంగా ఈ నవల ప్రయోజనాత్మకమైంది.మౌళిగారికి.సంపాదకులకు అభినందనలు.
  శ్రిఇనివాస్.ఆర్ .హైదరాబాద్.

మీ మాటలు

*