కొన్ని కొన్నిసార్లు

09-jukanti-300

కొన్ని కొన్నిసార్లు
ఆగిన గడియారాల గురించి
తాళం వేసి పోగొట్టుకున్న చెవి గురించి
చీకటిలోని జిగేల్మనే వెలుగు గురించి
వెలుగులోని చిమ్మన్‌ చీకటి గురించి
మాట్లాడుకుంటాం కొట్లాడుకుంటాం

తండ్లాడుతుంటాం
తల్లడిల్లిపోతుంటాం
ఒక్కొక్కసారి
ఇల్లూ ముంగిలీ పిల్లల గురించున్నూ

కొన్నిసార్లు మనసు పెట్టి
కొన్నిసార్లుమ మనసున పట్టి

ఒకరిలోకి ఒకరు ప్రయాణించీ
ఇంకొకరిలోకి ఒకరు ప్రవేశించీ
కొన్ని రహస్య ప్రదేశాల్లో కొన్ని ఆశలతో
కొన్ని సంకేత స్థలాల్లో బోలెడు కాంక్షలతో
విశాల నీలాకాశం పందిరి కింద
దు:ఖ దు:ఖంగా
నిశ్శబ్ధంగా మౌనంగా
క్షామ శరీర క్షేమం కోసం

చలి వేకువలో మంటల్ని రాజేసినట్టు
రాత్రి కలల్ని కాజేసినట్టు
ఎడారి పెదవులకు
నవ్వును పువ్వు కానుకగా
సమర్పించడానికి గుసగుసగా మాట్లాడుతూనే ఉంటాం

సలంద్రి బాయి నుంచి
కిన్‌లే వాటర్‌బాటిల్‌ దాకా
కాలిబాట నుంచి
ఫోర్‌లైన్స్‌ రోడ్డుదాకా
ఎన్ని గెలుపోటములు
ఎన్నెన్ని మలుపులు
మరెన్నో తలపోతలుగా మాట్లాడుకుంటూనే ఉంటాం

ఒక మర్మ కర్మ స్పర్శ కోసం
కొన్ని జీవిత కాలాలపాటు…

                    – జూకంటి జగన్నాథం

మీ మాటలు

*