ఇప్పుడు మనవి రాతి మొహాలు….మొరటు ఊహలు!

‘‘సౌందర్యం ఇటు వైపు నుండి చూస్తే సరిగ్గా కనిపించకపోతే, అటు వైపు దగ్గరగా వెళ్ళి కళ్ళతో ముట్టుకుని చూడాలి’’ అన్నాడు వారెన్‌ స్టీవెన్‌సన్‌ అనే ఆంగ్ల కవి.
‘‘జీవితంలో సౌందర్యాన్ని మించిన ఆనందమూ, సౌందర్యాన్ని మించిన విషాదమూ లేనే లేదు’’ అన్నాడు బుచ్చిబాబు అనే తెలుగు రచయిత.
‘‘సౌందర్యం’’ అంటే ఏమిటి? అని అడిగితే ఎవరికి తోచిన జవాబు వారు చెబుతారు. నైఘంటికార్ధం వేరే ఏదో ఒకటి వుండే వుంటుంది. కానీ చాలా సందర్భాలలో నైఘంటిక అర్ధాలకు, జీవన అనుభవాలకు పొత్తు కుదరదు. పొంతన జరగదు. ఉదాహరణకి ‘‘ఇల్లు’’ అంటే నిఘంటువుల్లో నాలుగు గోడలు, ఒక కప్పు కలిగి వుండి మనుషులు నివసించే ప్రదేశము అని వుంటుంది. కానీ ఇల్లంటే మనుషులు నివసించే ప్రాంతం మాత్రమే కాదు. ఆ మనుషుల మధ్య సజీవమయిన బంధం ఒకటి వుండాలి. అది నిరంతరం కాంతులీనుతూ వుండాలి. ప్రాకృతిక శక్తులకు ఎదురొడ్డి నిలిచే ధైర్యాన్ని ఆ బంధం ఇవ్వాలి. దు:ఖ సమయాలలో ఓదార్పు నివ్వాలి గుండె దిగులుగా కొట్టుకుంటున్నప్పుడు ‘‘నేనున్నాను’’ అనే సాంత్వన వీచిక అవ్వాలి. మనిషిలోపల రాక్షసత్వం మొగ్గతొడుగుతున్నప్పుడు దాన్ని సంహరించే సింహవాహని కావాలి. అందంగా, ఆనందంగా, స్వచ్ఛ సుందర శుభ్ర నీలంలాగా మనుషులు ఆనంద యాత్ర సాగించే పరిమళ భరిత తరుచ్ఛాయ కావాలి. ఈ లక్షణాలు అన్నీ వుంటేనే అది ఇల్లు అవుతుంది. హృదయాల నిలయం అవుతుంది.
నైఘంటిక అర్ధాలు వేరు జీవన అవసరాలు వేరు. అలాగే ‘‘సౌందర్యం’’ అంటే ఏదో ఒక నైఘంటిక అర్ధం వుంటుంది. కానీ అది జీవన వ్యాపారానికి సరిపోదు.  జనన మరణాల భ్రమాన్విత లోకంలో లోలకంలాగా తిరిగే, మనిషికి అన్ని అయి సేద తీర్చే సర్వరోగ నివారిణి అవదు. ‘‘సౌందర్యం ఏమిటన్న మొదటి ప్రశ్న దగ్గరికే వస్తే, సౌందర్యం అంటే సౌందర్యమే అని జవాబు చెప్పి తప్పించుకునే చమత్కారం వద్దు కానీ… ‘‘ప్రేమలాగే సౌందర్యం కూడా ఒకే భావన, ఒక అనుభూతి, ఒక పరవశగానం, ఒక పరిమళ ప్రవాహం’’. ఈ భావనని మాటల్లోకి అనువదించలేము. మౌనంలోకి కుదించనూ లేము. వేగుంట మోహనప్రసాద్‌ సాంధ్య భాషలో చెప్పాలంటే అది ఉండుండీ సలపరించి ఊండ్‌. అది ఒక గాయం.
సౌందర్యం ఎలా వుంటుందీ అంటే…? అది ఎలా అయినా వుండవచ్చు. ధనుర్మాసంలో, గొబ్బిళ్ళ మద్యన లయ బద్ధంగా కాళ్ళు కదులుతుంటే, చలిని చీల్చుకుని స్వరాన్ని పెకలించునప్పుడు, హరిదాసు పాటలో ధ్వనించే ‘‘జీర’’ లాగా వుండొచ్చు. తులసి ఆకుల మీద జారిపోతున్న పాదరసం లాంటి, మంచు బిందువులా వుండొచ్చు. పట్టు పరికిణీ కట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకొని ఆ పారాణి పరికిణీకి అంటకుండా ఒక చేత్తో పరికిణి ఎత్తి పట్టుకుని, మరో చేత్తో పూల సజ్జ పట్టుకుని దైవ దర్శనానికి అమ్మవెంట అడుగులో అడుగు వేసే ఆరిందాలాగా వుండొచ్చు. పచ్చికొట్టిపోయిన ప్రియురాలి లేత పెదవి ఎరుపులాగా వుండొచ్చు. సౌందర్యం ఎలా గయినా వుండొచ్చు. ఎందుకంటే సౌందర్యం ఒక భావన మాత్రమే. సౌందర్యం ఒక సున్నితమయిన ఊహ మాత్రమే. సౌందర్యం ఒక గుడి గోపురం మీద నుండి ఒక్కసారిగా పైకెగసిన పావురాల రెక్కల సవ్వడి మాత్రమే.
వంశీ ఏమిటి ఇవ్వాళ సౌందర్యం చుట్టూ గిరికీలు కొడుతున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదు. మొన్నీమధ్య ఒక బస్సులో ప్రయాణం చేస్తూ అసంకల్పితంగా, అప్రయత్నంగా విన్న ఒక పాట కొద్దిసేపు కలవరానికి గురిచేసింది. ఆ పాట ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఆ పాట గురించి తర్వాత చెప్తాను.

పదిహేను, ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన 1942 ఎ లవ్‌ స్టోరీ అనే సినిమాలో జావేద్‌ అఖ్తర్‌ అనుకుంటాను, ఒక పాట రాశాడు. ఆ పాట ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఎంత సౌందర్యాత్మకంగా వుంటుందీ అంటే ‘‘ఇంత’’ అని చెప్పలేనంత.
ఆ పాటలో కవి ఏం చెతున్నాడు? ఏమీ చెప్పడం లేదు. ఒక అందమయిన అపురూపమయిన, లేలేత మావిచిగురు లాంటి అమ్మాయిని చూసినపుడు అతడి భావనామయ దృష్టి ఎంతెంత దూరం ప్రయాణం చేసిందో అంత దూరాన్నీ అలతి, అలతి పదాలతో దండగా అల్లి మన మెడలో వేస్తున్నాడు.
‘‘ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా’’! అంటూ మొదలుపెట్టిన కవి మనలని తన వెంట ఎలా తీసుకెళుతున్నాడో చూడండి.
ఆ అందమయిన అమ్మాయి వికసిస్తూవున్న గులాబీపువ్వులాగా వున్నదట. భావుకుడయిన కవి రాసిన లాలిత్య పదగుంఫనాభరిత కవితలాగా, కవి కలలాగా వుందట. మెరిసేసూర్యకిరణంలాగా వుందట. అడవిలో ఛెంగు, ఛెంగుమని గెంతులేస్తున్న హరిణముద్రలాగా వుందట.
ఇంకా ఎలా వుందట? చంద్రుడు వెలిగించిన రాత్రిలాగా వుందట. సంగీతంలోని సుస్వరంలాగా వుందట. గర్భగుడిలో వెలుగుతున్న హారతి కాంతిలాగా వుందట. తొలి ఉషోదయమపు చెదరని అందంలాగా వుందట. హేమంత రుతువును వెచ్చచేసిన సూర్యకిరణ సందోహంలాగా వుందట. ఒక వీణా నినాదంలాగా, ఇంద్ర ధనుస్సులోని ఆత్మలాగా.
ఇంతదాకా రాసిన కవి దాహం తీరిందా? లేదు. ఆవిడ చుట్టూ యింకా ఎన్నెన్ని ఊహాల మాలలు అల్లుతున్నాడో చూడండి. విస్తరిస్తున్న తరుఛ్చాయలాగా వుందట. విస్మయం గొలిపే అలల సయ్యాటలాగా వుందట. మలయాద్రి పవనాలు తోడ్కొని తీసుకొస్తున్న పరిమళంలాగా వుందట.
పట్టు పురుగు జారవిడిచిన సిల్కు దారంలాగా వుందట. దేవతలు పాడుతున్న సంగీతం లాగా, చందనపు చెక్కలతో వెలిగించిన అగ్నిలాగా…
నిజంగా అ అమ్మాయి అలా వుందో లేదో తెలియదు కాని, కవి ఆ అమ్మాయిని చూసినపుడు ఇన్ని భావనలు పొందాడు. ఊహ ఎంత దూరం ప్రయాణించ గలదో . అంత దూరమూ ప్రయాణించాడు. ఈ పాటనంతా ఉదహరించింది నేను కవి ఊహా పటిమను గుర్తు చెయ్యడానికో, కవిత్వ సౌందర్యాన్ని కరతలామలకం చెయ్యడానికో కాదు. కవి సంస్కారాన్ని గుర్తుచెయ్యడానికి కవి సౌందర్యాభినివేశాన్ని లేదు మరో మాటలో చెప్పాలంటే కవి ఈస్థటిక్స్‌ని గుర్తుచెయ్యడానికి.
ఒక అందమయిన స్త్రీ మూర్తిని చూడగానే కవి ఎన్ని అందమయిన ఊహాలు చేశాడు? ఒక్క ఊహలో అయిన అశ్లీలత కానీ, అసభ్యత కానీ ఉందా? లేదు.. స్త్రీ పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం అన్నింటినీ మించి రక్త మాంసాలున్న సజీవ మూర్తి అన్న గ్రహింపు వుంటే కానీ, స్త్రీని గౌరవించాలనే సంస్కారం అబ్బదు.
ఇప్పుడు బస్సు ప్రయాణంలో నేను విన్న పాట గురించి. ప్రస్తావిస్తాను.
అక్కడ కవితో అందమయిన అమ్మాయి ఏం చెప్పిందో నాకు తెలియదు కానీ యిక్కడ అందమయిన అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని ఆగ్లంంలో చెప్పి వుంటంది. అందేకేనేమో కవి.

‘‘గాల్లో తేలినట్టుందే,
గుండె జారినట్టుందే
ఫుల్లు బాటిల్‌ ఎత్తి దింపకుండా తాగినట్లుం దే ’’ అంటున్నాడు.
స్త్రీని గర్భగుడిలో వెలుగుతున్న హారతి కాంతితో పోల్చిన సంస్కారమెక్కడ…? ఇంటాక్సికేషన్‌ కలిగించే ఫుల్‌బాటిల్‌తో పోల్చి చూసిన సృజన సౌందర్యమెక్కడ?
మరో కవి

‘‘అమ్మో! బాపుగారి బొమ్మో
ఓల్డ్‌ మంక్‌ రమ్మో’’ అనీ అంటున్నాడు.
ప్రేయసిని బాపూ బొమ్మతో పోలుస్తూనే ఓల్డ్‌మంక్‌ రమ్ముతోనూ కొలుస్తున్నాడు.
పైన వివరంచిన పాటలోవి కవి ఉహాలే, క్రింద చెప్పిన పాటల్లోనూ కవి ఊహలే! కానీ ఎంత వ్యత్యాసం. ఎంత అగాధం. ఈ తేడా ఎందుకువచ్చింది. ఈ పతనానికి మూలం ఎక్కడుంది? ఈ అవ్యవస్థకి కారణం ఏమిటి? వంశీ మళ్ళీ మొదటికే వస్తున్నాడు అనుకోకపోతే, దీని మూలం మన గ్లోబలైజేషన్‌లో వుంది. ఈ పతనానికి కారణం మన నూతన ఆర్థిక విధానంలో వుంది. ‘‘గదినీ, మదినీ తెర్చి అన్ని పవనాలనీ ఆహ్వానించాలని’’ అని దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అన్న మాట వాస్తవమే కానీ మనం తెర్చిన గది మనది కాకుండా పోయిన విషాద దృశ్యం యిది. పడమటి గాలుల విసురు ఇంత బలంగా వున్నపుడు మనం ‘‘నిర్భయ’’ చట్టాలు ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు. నిర్భయ, అభయ, అనూహ్య ఎవరియితేనేం ఒక్కొక్కరు మన సంస్కారం అనే ధవళ వస్త్రం మీద పులిమిన కటిక కాటుక చీకటి లాంటి మరకలు.
మన సమాజంలో ఎన్ని వైరుధ్యాలు? ఎన్ని విరోధాబాసలు? మరెన్ని మానసిక వైక్లబ్యాలు? వీటన్నింటిని తల్చుకుని సమాజం తనను తాను ఎసర్ట్‌ చేసుకునే దశలో సునామీ లాగా వచ్చిన ప్రపంచీకరణ మన మూలాలను పెకిలించడం మొదలు పెట్టి దశాబ్దంకాలం పైనే అయింది.
తొంభై దశకంలో పుట్టిన ఇప్పటి కొత్త తరానికి, మన సాంప్రదాయం ఒక విలువలేవీ తెలియవు. అలా ఒక తరం నుండి మరొక తరానికి ప్రయాణించాల్సిన ఒక సత్‌ సంప్రదాయాపు ‘‘నోవా’’ ను మనకు మనమే పగుల గొట్టుకున్నాం.
బహుశా ఈ విపత్తును ముందే ఊహించాడేమో 80వ దశకంలోనే ఒక మైనారిటీ భాషా సముదాయానికి చెందిన ఒ.పి. శర్మ సారధి తన ‘‘నగర మధనం’’ అనే నవలలో, ఈ స్థితిని చిత్రవిచిత్రంగా చిత్రించాడు. ఆ నగరంలో ప్రతి మనిషికి ఒక ముసుగు వుంటుంది. వాళ్ళ చేతి సంచిలో రక రకాలు ముసుగులు వుంటాయి. అవసరార్ధం ఏ ముసుగు కావలసి వస్తే ఆ ముసుగు తగిలించుకొని జీవితం గడిపేస్తూ వుంటారు. ఈ నవల ‘‘డోగ్రి’’ భాషకి చెందినది. దీని గురించిన మరోసారి చెప్పుకుందాం.
ఇవ్వాళ మన మొహాల  మీద ముసుగు లేదుకానీ మన మొహాలు  ఉండాల్సిన రీతిలో లేవు. మన పెదవులకి నవ్వటం తెలియదు. మన నోటికి నిజం చెప్పడం తెలియదు. మన కళ్లకి కరుణ కురిపించడం తెలియదు. మన హృదయాలకి ప్రేమించడం తెలియదు. మన చేతులకి దానం చేయడం తెలియదు.
మన డ్రాయింగ్‌ రూంలో ఒక కంప్యూటర్‌, ఒక హోమ్‌ ధియేటర్‌. మన గోడలకి స్ల్పిట్‌ ఎ.సి. మిషన్‌, మన యింటి ముందు ఒక కారు. మన చెవులకి తగించుకున్న ఒక బ్లూటూత్‌.
మన ఆలోచనలన్నీ పోటీలేని పరుగులో విజయం వైపు. మన ధ్యాస అంతా మన బ్యాంక్‌ బాలెన్స్‌ వైపు. అందుకేనేమో మన మొహంలో వచ్చిన మార్పులేవీ మనకు తెలియదు. మనవి రాతి మొహాలు. మనవి మొరటు ఊహలు.
అందుకేనోమో స్తన్యమిచ్చిన అమ్మను కూడా ఫుల్‌ బాటిల్‌తో పోల్చగలిగిన సృజన మనకు అబ్బింది.

ఒక్క క్షణం ఆగి, నడచి వచ్చిన దారిని వెనక్కి తిరిగి చూద్దామా? మన మొహాన్ని స్వచ్ఛ సుందర శుభ్రస్ఫటికం లాంటి నీళ్ళతో కడిగేద్దామా…?
శిశిరంలో మోడయిన తరువు, వసంతంలో తిరిగి చిగురించినట్లుగా మళ్ళీ కొత్తగా మొలకెత్తుదామా?

—  వంశీకృష్ణ

మీ మాటలు

  1. buchireddy gangula says:

    మన నోటికి నిజం చెప్పడం తెలియదు — నిజం రాశారు సర్
    బాగుంది ——

    —————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  2. Dr.Ismail says:

    Beautiful.

  3. Superb

  4. సత్య says:

    ప్రజల్లో రక రకాల సంస్కారాల వాళ్లు ఉంటారు. దాని ప్రకారం వాళ్ల పాటలు వాళ్ళ భాషలో పాడుకుంటారు.

    ఆకాశంలో హంసలమై, హాయిగ ఎగిరే జంటలమై అలా అలా కులాసాగా తేలి పోదామా…. అని ఒకప్పుడు పాడుకుంటే, “కుళ్ళి పోయిన మామిడి లో జత పురుగులమై ఉందామా” అని తర్వాత తరం వాళ్ళు పాడుకున్నారు.

    రెంటిలోనూ ప్రేమ తీవ్రత ఒకటే! ఈ రెండు పాటలూ అంతే! 15-20 ఏళ్ళ నాడే ఆ సినిమాలో ఆ పాట పాడిన వాడు పాత కాలం వాడు.

    గ్లోబలైజేషన్ లో మనమూ మునిగి పోయి, దాన్ని వాల్ మార్టులగానూ, ఫోర్డు కారులు గానూ ఉన్నపుడు ఎంజాయ్ చేస్తూ, మనకు నచ్చక పోగానే ఇదిగో, ఇలా అమ్మాయిని ఓల్డ్ మాంక్ రమ్ముతో పోల్చారని బాధ పడ్డం! సంస్కారాల దాకా పోవడం!

    ఆ రెండో పాట పాడిన వాడికి అసలు బాపూ బొమ్మ అంటే ఏమిటో తెల్సు,. అందుకు సంతోషించండి.

    గ్లోబలైజేషన్ ఎప్పుడు మొదలైందో అప్పుడే నిర్భయ చట్టాలు వచ్చే రోజొకటి వస్తుందని గుర్తెరిగి ఉండాలి మనం!!

  5. నిజమే. మన సాంప్రదాయాల గురించీ , విలువల గురించీ, ఇంకా మన భాషా సౌందర్యం గురించీ తొంభైల్లోనూ, ఆ త్రువాతా పుట్టినవాళ్ళు కొంతయినా తెలుసుకుంటే కదా ఏది సంస్కారమో ఏది కాదో తెలుసుకుని సాహిత్యాన్ని ఇష్టపడటానికి? ఇప్పటి చదువుల్లో ఇవన్నీ ఏవి? తల్లి తండ్రులిద్దరూ ఉద్యోగస్తులవడం, తాతలూ, బామ్మలూ ఎక్కడో వేరే ఊళ్ళలో ఉండటం లాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న పిల్లలకి కనీసం ఇంట్లో మంచి నేర్చుకునే అవకాశమేది? అలాంటి తరానికి మొదటి పాటకంటే కూడా మిగతా రెండు పాటలే నచ్చడంలో ఆశ్చర్యం లేదు.

    అచ్చ తెలుగు కుటుంబాల్లోని పిల్లలే ఇవాళ తెలుగు సరిగ్గా చదవలేము, తప్పులు లేకుండా వ్రాయలేము అని చెబుతుంటే ఎంత ఆవేదన కలుగుతోందో . ఎంత నిశ్శహాయత ఆవరిస్తోందో. హైదరాబాదు ఎక్కడో ఉందా? ఆంధ్ర రాష్ట్రంలోనే కదా ఉంది. మరి ఇక్కడి పిల్లలెందుకు తెలుగు విషయంలో ఇన్ని మెట్లు కింద ఉన్నారు?

    ఈ మధ్య మొదటిసారి ఒంగోలు వెళ్ళాను. అక్కడ నాకు అడుగడుగునా పుస్తకాల షాపులు కనిపించాయి. చక్కటి సాహిత్య పుస్తకాలన్నీ దొరుకుతున్నాయి. అదే ఇంత పెద్ద హైదరాబాదులో అయితే ఒకే ఒక్క విశాలాంధ్ర నో, ఒకే ఒక్క బ్రాంచ్ ఉన్న నవోదయానో ఆశ్రయించాలి ఎంత దూరమైనా. కనీసం ఇటువంటి ఊళ్ళలో అయినా పుస్తకాలు చదివేవాళ్ళున్నారు , అందుకే ఇన్ని పుస్తకాల షాపులున్నాయని మనసు కొంత సంతోషించింది.

    ఇదంతా ఈ వ్యాసానికి సంబంధించింది కాదు అని అనిపిస్తే మన్నించండి. కానీ నేటి తరానికి భాషా సౌందర్యం, విలువలు తెలీకుండా పోవడానికి మూలాలెక్కడున్నాయి, వ్యవస్త మరింతగా పాడవకుండా ఉండటానికి మన వంతు ఏం చెయ్యగలం అనిపిస్తూ ఉంటుంది. ఈవాళ ఈ వ్యాసం చదివాక ఆ వేదన ఇక్కడ పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.

  6. పడమటి గాలుల విసురు ఇంత బలంగా వున్నపుడు మనం ‘‘నిర్భయ’’ చట్టాలు ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు. నిర్భయ, అభయ, అనూహ్య ఎవరియితేనేం ఒక్కొక్కరు మన సంస్కారం అనే ధవళ వస్త్రం మీద పులిమిన కటిక కాటుక చీకటి లాంటి మరకలు.మన సమాజంలో ఎన్ని వైరుధ్యాలు? ఎన్ని విరోధాబాసలు? మరెన్ని మానసిక వైక్లబ్యాలు?

    ఇలా మనకు మనం చెప్పుకోవడాన్ని ఈ మద్య మన సమూహంలో వున్నవారనుకున్నవారే బేక్ టు పెవిలియన్ అన్నది విడ్డూరం. అసలు ఆ ఆలోచనే తప్పు అంటు సరికొత్త రాగం ఆలపిస్తున్నారు. నేనిక్కడ అన్నది మరీ వెనక్కి వెళ్ళిపోమ్మని కాదు కానీ అసలు ఉనికికే మోసం చేసుకునే మాయలో పడి వున్నామన్న ఎరుక వుండాలి కదా అని. దీనిపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరముంది. మంచి వ్యాసం. మీరెంచుకున్న పాటల బేక్ గ్రౌండ్ బాగుంది సార్. అభినందనలతో..

  7. సాహిత్యాన్ని అస్వాదించి ఆనందించే వాతావరణం ఇప్పటి తరానికి ఎక్కడ కనిపిస్తోంది ?? మన చుట్టూ ఉండే ప్రక్రుతి నీ ఉదయించే సూర్యుడినీ అప్పుడే విచ్హుకున్న పసి మొగ్గలనీ కంటికి కూడా కనిపించని గాలినీ ఇన్ని రంగులు పోసుకుని ఉండే ఆకాసాన్నీ చూసి వాటిలోని సున్నితత్వాన్ని అందాన్ని అనుభవించే మనసు ఎంతమందికి ఉంటోం ది ??
    మనం (అంటే అందరం కాదు 75 శాతం తల్లి తండ్రులు ) పిల్లలకి మర బొమ్మల మాయ లొకమ్ లోకి తోసేస్తూ అవే జీవితానికి పరమావధి గా చేసేస్తూ పక్కనే వున్న చిన్న చిన్న సంతోషాలని కాలదన్ని ఇంకేదో అందలాన్ని అందుకునే ప్రయత్నం లో అథః పాతాళానికి భవిష్య తరాలని తోసేస్త్హున్నామా?
    ఒకే అలోచనలు వున్న మన లాంటి వారం ఏమీ చేయలేమా?????

  8. kv ramana says:

    వెనకటి రోజులు బాగుండేవని అనుకోవడం ఒక మానసిక సమస్య. జాగ్రత్తగా చూస్తే రోజుల మధ్య అలాంటి తేడా ఏమీ కనబడదు. ఒకప్పుడు చింతామణి నాటకం ఆడుతుంటే బళ్ళ మీద వెళ్ళి చూసేవారు. చింతామణి మంచి సందేశం ఉన్న నాటకం. కానీ జనాన్ని ఆనందింపజేయడానికి అందులో బూతు కలిపేవారు. తోలుబొమ్మలాటలో కేతిగాడు, బంగారక్కల మధ్య బూతు ఉండేదని విన్నాను. మంచి టేస్టు ఉన్నవాళ్ళు, లేనివాళ్లు ఎప్పుడూ ఉంటారు. వీళ్ళ సంఖ్యలో తేడా కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంటుంది. టేస్టు లేనివాళ్లు ఇప్పుడే ఉన్నారని అనుకోవడం ఒక భ్రమ. అజ్ఞానం కూడా. టేస్టు అనేది డబ్బుతోనూ, చదువుతోనూ వస్తుంది. డబ్బూ, చదువూ లేనివాళ్లు పాతకాలంలో చింతామణి లాంటి నాటకం ఉచితంగా చూసి ఆనందించేవారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర సినిమా చూసేంత డబ్బు ఉంది కనుక, గొప్ప చదువు లేదు కనుక సినిమాను పోషిస్తున్నారు. వీళ్ళే సినిమాకు పెట్టుబడిదారులు. అందుకే వీళ్ళను దృష్టిలో పెట్టుకునే సినిమాలు వస్తాయి. గోదావరి సినిమా(పేరు కరెక్టెనా?) మంచి టేస్టు ఉన్న సినిమా. కానీ నిర్మాతకు నష్టం వచ్చింది. ఈ తేడాలు చూడలేకపోతున్న మన ఆజ్ఞానాన్ని గుర్తించకుండా పడమటి గాలులు అంటూ ఎవళ్ళనో తిట్టుకుంటున్నాం. ఎంత బాగుందో.

  9. మంచి వ్యాసం.
    రమణ గారు@ మీతో ఏకీభవిస్తూ కొంత విభేదిస్తూన్నాను. మా చిన్నప్పటి సినిమాలలో సిల్క్ స్మిత క్లబ్బు డాన్సులు ఉన్నాయి.కాకపొతే మీరు ఉదహరించిన గోదావరి సినిమ్మల్లాంటి మంచి సినిమాలు అతి తక్కువగానూ బిజినెస్ మాన్ లాంటి సినిమాలు ఎక్కువగాను వస్తున్నాయి ఇప్పుడు.
    ప్రతిదానికి పడమటి గాలులను సాకుగా చూపటాన్ని నేనూ ఒప్పుకోను.

  10. In two words, Superb & Intensely thoughtful. Comments are also very reflective. Great job Vamsi garu!

Leave a Reply to Radha Cancel reply

*