“ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ”

chitten raju

అది మార్చ్ 30, 1922 తారీకు. అంటే 90 ఏళ్ల పై మాటే. ఆ రోజు తను పెరిగిన మేనమామల గ్రామం మీద ఉన్న మమకారాన్ని తీర్చుకుని ఇప్పటికీ చాలా వరకు మా హయాంలోనే ఉన్న “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు” తన స్వార్జితంతో బొబ్బిలి సంస్థానానికి చెందిన చెలికాని రంగరాయణం గారి దగ్గర నుండి మా తాత గారు సూర్యప్రకాశ రావు గారు కొనుగోలు చేసిన రోజు. అది దొంతమ్మూరు గ్రామ శివారులో చిన జగ్గం పేట గ్రామానికి ఆనుకుని ఉన్న 350 ఎకరాల పొలానికి అధికారికంగా ఉన్న పేరు. ఆ ప్రాంతాలలో అంత విస్తీర్ణం ఉన్న పొలాన్ని “శేరీ” అంటారు. అంత కన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న వాటిని “మిరాశీ” అనీ పిలుస్తారు. మా తాత గారిని చదివించిన  మేనమామ కుంటముక్కుల హనుమయ్య గారి మిరాశీ  పొలానికి సరిహద్దుల్లోనే ఈ శేరీ అమ్మకానికి రావడంతో మా తాత గారు వెనకాడ లేదు.

కాకినాడలో నేను పుట్టి పెరిగిన 1925 నాటి “వంగూరి హౌస్” ఎలాగో  1922 నాటి ఈ  “లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ”  పొలమూ అలాగే నా జీవితంలో ఇప్పటికీ అంతర్భాగమే. సుప్రసిద్ధ గాయకులు పి.బి. శ్రీనివాస్ గారి పొలాలు మా పొలాల సమీపంలోనే. నిజానికి ఈ వ్యాసం ఇప్పుడే మా పొలం వెళ్లి తిరిగి వచ్చి గాంధీ నగరంలో మా “వంగూరి హౌస్” నుంచే వ్రాస్తున్నాను. ప్రతీ దేశానికీ రాష్ట్రాలు, రాష్ట్రానికీ జిల్లాలు, పట్టణాలు, పట్టణాలలో పేటలూ ఎలా ఉంటాయో అలాగే 350 ఎకరాల మా శేరీ లో చాలా  “మళ్ళు”, వాటికి ఆసక్తికరమైన పేర్లూ ఉన్నాయి.  ఉదాహరణకి మా శేరీ లో ఉండే కొన్ని వాటాల పేర్లు వరకట్టు, చవిటి రేవడి, తోటూరి వారి వాటా, దాట్లప్పయ్య రేవడి,  మాలోళ్ళ వాటా, సప్పావోడి వాలు, చిన్న చెరువు మళ్ళు, పర్ర, అమర్కోట మాణిక్యం వాటా, దరువు మొదలైనవి. ఎందుకో తెలియదు కానీ నాకు ఇవి చాలా ఇష్టమైన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు విన్నా చాలా మ్యూజికల్ గా వినిపిస్తాయి. అలాగే ఒక విధంగా శేరీ సరిహద్దులు అనదగ్గ రావి దొడ్డి కాలువ, శుద్ధ గెడ్డ, జగ్గమ్మ చెరువు గట్టు, తాటిపర్తి చెరువు, పుంత మొదలైనవీ, వీటన్నింటికీ మధ్యలో ఉన్న పది ఎకరాల చెరువూ, జగ్గమ్మ చెరువు కి వచ్చే వర్షం నీరులో మూడింత  ఒక వంతు మా చెరువు లోకి తరలించే “జంతి” అనే రెండు కాలువల సంగమం పేర్లలో ఉండే తెలుగు  సహజత్వం నాకు చాలా ఆహ్లాదంగా వినపడుతుంది.  ఈ పేర్ల వెనక ఖచ్చితంగా ఉండే చారిత్రక నేపధ్యం ఎవరికీ తెలియదు కానీ మా నాన్న గారు ముఫై ఏళ్లకి పైబడి గుర్రం మీదా, గుర్రబ్బండి, ఎడ్ల బండి మీదా కాకినాడ నుంచి వెళ్ళి దగ్గర ఉండి వ్యవసాయం చూసుకునే వారు కాబట్టి ఆయనని “దివాణం” గారు అనీ, ఆయన పోయి 30 ఏళ్ళు దాటినా మా పొలాన్ని “శేరీ రామం” గారి పొలాలు” అనీ ఆ ప్రాంతాలలో అంటారు. మా నాన్న గారు ఉన్నప్పుడు మా పెద్దన్నయ్య ని  “చిన్న దివాణం” అని పిలిచి, ఆ తరువాత మాత్రమే “దివాణం” అని ప్రమోషన్ ఇచ్చారు. ఇక ఆ ప్రాంతాలలో నా చిన్నప్పటి చిరునామా “పెకాస రావు గారి మనవడు”, లేదా  “రామం గారబ్బాయి” ..అంతే…..ఇప్పుడు కూడా నేను  ”దివాణం గారి తమ్ముడు రాజా గారు”, మహా అయితే  ప్రస్తుతం నా పై వాడూ, డాక్టరూ అయిన మా సుబ్బన్నయ్య మా పొలాల యాజమాన్యం చేస్తున్నాడు కాబట్టి నన్ను “డాక్టర్ గారి తమ్ముడు”  అనేదే నా అక్కడ నా ఉనికి. అలా పిలిపించుకోవడం నాకు భలే ఇష్టం.

మా అమ్మాయిలతో నా పొలంలో

మా పొలాలకి ఎక్కడో ఉన్న ఏలేశ్వరం కొండలలో వర్షం కురిసి, జగ్గమ్మ చెరువు లోకి నీరు వస్తేనే మా చెరువు నిండితే పంటలు పండేవి. లేకపోతే ఎండి పోయేవి.  పైగా ఏ మాత్రం భారీగా వర్షాలు కురిసినా శుద్ధ గెడ్డ నిండి పోయి వరదలు వచ్చి పంటలని ముంచేసేవి. ఈ కారణాల వలన ఒక ఏడూ పండీ, మరొక ఏడు ఎండీ, వ్యవసాయం గిట్టుబాటు కాకా,  పెళ్ళిళ్ళు, చదువులు మొదలైన భారీ ఖర్చులు వచ్చినప్పుడు ,   మా నాన్న గారూ, ఆ తరువాత మా అన్నయ్యలూ దూరంగా ఉన్న వాటాలని అమ్మినప్పుడు మా రైతులే అవి కొనుక్కున్నారు.  ఇప్పటికీ మా పొలంలో పని చేసే వారందరూ మూడు, నాలుగు తరాల నుండీ  మా శేరీనీ నమ్ముకున్న వారే! నమ్ముకుని బాగు పడ్డ వారే. ఉదాహరణకి మా నాన్న గారి దగ్గర “ఉద్దారుడు” …అంటే పాలికాపులకి నాయకుడిగా పని  చేసిన  గుడాల వేంకటేశు ఎప్పుడూ నేల  మీద అణుకువ గానే  “ఆయ, ఆయ్” అనడమే నేను చూశాను.  ‘ఎంకటేశు’ ఎప్పుడో పోయినా మా పొలంలో పని చేసి అతను కూడబెట్టిన సంపద తో ఇప్పుడు అతని కుటుంబం మా అందరి కంటే  ధనవంతులు. అంతెందుకు, నేను మొన్న …అంటే ఫెబ్రవరి 2, 2014 నాడు మా పొలానికి వెళ్ళినప్పుడు, మా మూడో తరం పాలికాపు వీర్రాజు కి తీసిన ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. “నీకు ఎన్నేళ్ళురా వీర్రాజు?” అని అడిగితే “ ఆ మాత్రం తెల్దేటండీ. ఓ పదేళ్లుంటాయండి” అని, “ఏరా, ఉండవురా?”  అని పక్కనే ఉన్న అతని  60 ఏళ్ళు దాటిన కొడుకు ని అడిగాడు. మా పొలం లోనే పుట్టి, పెరిగిన ఈ  వీర్రాజుకి కనీసం తొంభై ఏళ్ళు  ఉంటాయి. ఎప్పుడో అక్కడే రాలిపోతాడు. శేరీ రామం గారబ్బాయి ..అంటే నేను వాడిని పలకరించగానే  గుర్తు పట్టిన  వీర్రాజు కళ్ళలో మెరిసిన ఆప్యాయతకి కి నేను తగనేమో అనిపించింది.

Veerraju

మా చిన్నపుడు పొలంలో కనీసం యాభై పాడి పశువులు, పాతిక మందికి పైగా పాలికాపులు, ఇద్దరు, ముగ్గురు ఉద్దారులు, స్టేటస్ సింబల్ గా రెండు వేల రూపాయల అత్యధిక విలువ గల మైసూరు ఎడ్ల తో సహా సొగసైన గూడు బండి, వాటికి విలువైన మువ్వలు, ఇతర ఆభరణాలు, ప్రత్యేకంగా ఒక పాలికాపు.. నాగులు…ఉండే వారు. ప్రతీ పశువుకీ, ముఖ్యంగా ఆవులన్నింటికీ తెల్లావు, కర్రావు, గంగ, కామధేను, గుడ్డావు, కుంటావు మొదలైన పేర్లు ఉండేవి. వాటిల్లోంచి కనీసం ఒక ఆవు, గేదె  కాకినాడ లో మా ఇంటి ప్రాంగణంలో ఉండేవి. మా పొలం వెళ్ళాలంటే  బస్సులో ..సుమారు పది మైళ్ళు..అవును అప్పుడు  కిలో మీటర్లు లేవు …. పిఠాపురం మీదుగా గొల్లప్రోలు దాటాక, చేబ్రోలు కి ముందు వచ్చే అడ్డ రోడ్డు దగ్గర దిగాలి. వారం ముందుగానే మా పెద్దన్నయ్యకి కబురు పెడితే ఈ ప్రతిష్టాత్మకమైన మైసూరు ఎడ్ల బండి అన్ని హంగులతోటీ పంపించే వాడు. అక్కడ నుంచి  మా పొలానికి తాడిపర్తి, చిన జగ్గం పేట  మీదుగా రెండు మైళ్ళు ఈ బండిలో మేము మల్లీశ్వరి, రోజులు మారాయి వగైరా సినిమా పాటలు పాడుకుంటూ విపరీతంగా ఫీలయి పోతూ శేరీ “మకాం” …అవును … అది పొలంలో మేము నివశించే పెద్ద తాటాకుల పాక …అక్కడికి చేరుకునే వారం. ఈ రోజుల్లో అలాంటి ఇళ్ళని షోగ్గా “ఫార్మ్ హౌస్” అంటారు.  ఆ నాలుగు గదుల  “ఫార్మ్ హౌస్” ముందు ఈ రోజుల్లో అయితే దాన్ని “పాండ్” అనబడే పెద్ద “గొయ్యి” లో నించి నీళ్ళు తోడుకుని, మరిగించి, చల్లార్చి, “గుడ్డ ఫిల్టర్” లో ఫిల్టర్ చేసి అవి మంచి నీళ్ళగా తాగే వాళ్ళం.  ఈ మొత్తం 15 మైళ్ళ లోపు …. అంటే 30 కి. మీ.  లోపు  ప్రయాణానికి…వారం రోజులు సన్నాహాలూ,  కాకినాడలో బస్ స్టాండ్ దాకా రిక్షా, తరువాత బస్సు, ఆఖర్న ఎద్దు బండి, ఒక వేళ జగ్గమ్మ చెరువు నిండి  పోయి, బండి వెళ్ళ లేక పొతే, మోకాలు నీటి లోంచి నడిచి మరో అర మైలు నడిచి అంతా కలిపి ఇంచు మించు ఒక రోజు ప్రయాణం చేస్తే యావత్ ప్రపంచం తో సంబంధాలు పూర్తిగా తెగిపోయే ఆ ఏకాంత ప్రదేశానికి చేరుకొని మహాదానంద పడేవాణ్ణి.  ఇప్పుడు హాయిగా మినరల్ వాటర్స్ బాటిల్స్ పట్టుకుని, కారు లో వెళ్లి గంట సేపు గడిపేసి అరగంట లో వెనక్కి  తిరిగి వచ్చేసి ఆయాస పడిపోతున్నాను. అప్పుడూ, ఇప్పుడూ వీర్రాజు హాయిగా యింకా మట్టి ముంత లోనే  ఆవకాయ ముక్క నల్చుకుని గంజి అన్నం  తింటున్నాడు.  ఆ  పాక బదులు చిన్న సిమెంటు ఇల్లు,  పశు సంపద బదులు అద్దెకి తెచ్చుకునే ట్రాక్టరు, ఆడుతు పాడుతు పని చేసే పల్లె పడుచుల బదులు సెల్ ఫోన్లలో సినిమా పాటలు వింటూ పని “నటించే” వ్యవసాయ కూలీలు ఒకటేమిటి ఇప్పుడు మొత్తం సీనరీ మారి పోయి అలనాటి సీనరీలు సినిమాలకే పరిమితం అయిపోయాయి. అప్పుడు నేను స్వహస్తాలతో రోజు కూలీ రూపాయి పావలా ఇచ్చిన జ్జాపకం. ఇప్పుడు ప్రభుత్వం వారి “పనికి ఆహార పథకం” లేని  రోజు మాత్రమే కూలి కి వచ్చే వారి కూలి రోజుకి 300 రూపాయలు దాటింది. ఓడలు బళ్ళు అయ్యాయి. రోజులు మారాయి..ఖచ్చితంగా …

గిరిజ,

ఇక్కడ ఒక పిట్ట కథ ఏమిటంటే , ప్రతీ వేసవి కాలం లో లాగా 1964, మే నెలలో నేను కుప్పనూర్పులకి పొలం వెళ్లాను. బాహ్య ప్రపంచంతో మాకు ఏకైక సంబంధం ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. ఆ రోజు  రేడియో పెట్టగానే “బినాకా గీత మాలా” “బావ గారి కబుర్లు”, “భక్తీ రంజని” లాంటి ఏ ప్రోగ్రామూ లేదు సరి కదా గంటల తరబడి ఏడుపు సంగీతమే. కనీసం మధ్యలో అప్పుడప్పుడైనా ఒక్క మాట కూడా  లేదు. రేడియో పాడై పోయింది కాబోసు అనుకుని ఎం చెయ్యాలో తెలియక భోరుమని ఏడ్చాను. రెండు రోజులయ్యాక తరువాత కాకినాడ వెళ్ళినప్పుడు తెలిసింది  ఆ రోజు (మే 27, 1964) నెహ్రూ గారు చనిపోయారని. గాంధీ గారి కంటే నాకు ఎక్కువ ఇష్టమైన నెహ్రూ గారు  పోతే, ఆలిండియా రేడియో వారు వార్తలు నిరాటంకంగా ప్రసారం విషయాలు ప్రజలకి చెప్పాలి కానీ ఇలా సంతాప సూచకంగా మూడు రోజులు మౌనం పాటించడం లాంటి బుద్ది తక్కువ ఆలోచన ఎవరికి కలిగిందో మరి. చిన్నప్పుడు మా స్కూల్ లో జరిగే  “ఐక్య రాజ్య సమితి” దేబెట్ల లో నేను ఎప్పుడూ తెల్ల టోపీ , లాంగ్ కోటూ వేసుకుని , అందులో గులాబీ పువ్వు పెట్టుకుని  నెహ్రూ గారి పాత్రం ధరించే వాణ్ణి. అప్పటికి రెండు, మూడేళ్ళ క్రితమే నెహ్రూ గారు కాకినాడ వచ్చినప్పుడు ఆ బహిరంగ సభలో మొట్ట మొదటి ఆయనని చూసి ఆ మహానుభావుడి ప్రసంగం విని, ఆయన పట్ల నా ఆరాధాన యింకా పెంచుకున్న నాకు ఆయన మరణ వార్త చాలా బాధించింది. మూడు రోజుల తరువాత మాత్రమే తెలిసినందుకు ఆలిండియా రేడియో మీద విపరీతమైన కోపం వచ్చింది.  నెహ్రూ గారు నేను ఏడ్చిన మాట నిజమే కాని, దానికి కారణం రేడియో పాడాయి పోయింది అనుకోవడమే!  అది తల్చుకున్నప్ప్పుడల్లా ఇప్పటికీ నాకు అదోలా ఉంటుంది.  ఈ రోజుల్లో అయితే  ఎవరైనా ఇంట్లోంచి హాస్పిటల్ కి వెళ్ళే దారిలో ఉండగానే టీవీ చానెల్స్ పసిగట్టేసి, దహన సంస్కారం దాకా  అన్నీ మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. అప్పుడు అది ఒక రకం దౌర్భాగ్యం, ఇప్పుడు మరొక రకం. అనావృష్టీ, అతివృష్టీ..

శేరీ తో నా చిన్నప్పడు అద్భుతమైన అనుబంధాలు రెండు విధాలుగా ఉండేవి. మొదటిది తుమ్మ జిగురు. ఎందుకంటే, ఆ రోజుల్లో   మా పొలం గట్లు అన్నింటిమీదా తుమ్మ చెట్లు ఉండేవి. వాటి ఖాండానికి  ఒక చిన్న గాటు పెట్టి వదిలేస్తే కొన్ని రోజులకి తుమ్మ జిగురు ఊరేది.  ఆ తుమ్మ జిగురు ప్రతీ రోజూ వాడనిదే నా దిన చర్య పూర్తి అయ్యేది కాదు. మా స్కూల్ లో ఇచ్చే సైన్సు ప్రాజెక్టుల కంటే  ఆ రోజుల్లో వచ్చే అద్భుతమైన “ఇల్లస్త్రేటెడ్ వీక్లీ” అంత కంటే  ముఖ్యంగా “స్పోర్ట్స్ ఇలస్త్రేటేడ్” అనే పత్రిక లో వచ్చిన క్రికెట్ వీరుల బొమ్మలు కత్తిరించి, ఈ తుమ్మ జిగురుతో పేపర్ మీద అంటించి  ఆల్బమ్స్ తయారు చేయడం అప్పుడు నాకున్న అతి ముఖ్యమైన హాబీ. అందు వలన ఈ తుమ్మ జిగురు సప్లై కనక ఆగిపోతే నా ప్రాణం ఉసూరు మనేది. పోనీ బజార్లో కునుక్కుందామా అంటే, ఆ బాటిల్స్ లో ఉండేది  కూడా సరిగ్గా మా పొలం లో ఫ్రీ గా వచ్చే లాంటి సరుకే. అందు చేత నేను వారం, పది రోజులకి ఒక సారి “ పెద్దన్నయ్యా, ఇచ్చట కాకినాడలో మేము క్షేమం. అక్కడ  శేరీ మకాం లో నువ్వు క్షేమం అని తలుస్తాను.  ఇచ్చట  మా స్కూలు  సైన్సు  మాస్టారు అయిన “దొర” గారు ఎక్కువ పని ఇవ్వడం వలన నాకు అర్జంటుగా అతి ఎక్కువ గా తుమ్మ జిగురు కావలెను. ఈ సారి పొలం నుంచి నువ్వు ధాన్యం మొదలైనవి బండి లో పంపించినప్పుడు పొలంలో మొత్తంలో ఉన్న వంద తుమ్మ చెట్ల నుండీ జిగురు సేకరించి, నేను బాగా చదువుకోడానికి సహకరించ వలెను” అని ..అవును… ..పోస్ట్ కార్డులే  వ్రాసే వాణ్ణి.  దానికి సమాధానంగా మా పెద్దన్నయ్య “ఒరేయ్ తుమ్మ జిగురూ” అని సంబోదిస్తూ నాలుగైదు పేజీల సమాధానం వ్రాసి, జిగురుతో అంటించిన కవరూ, కావలినంత జిగురూ పంపించే వాడు.

రెండోది ప్రతీ వేసవి కాలం లోనూ నేనూ, మా తమ్ముడు  ఆంజీ అనబడే హనుమంత రావూ, మా పెద్దన్నయ్య బావ మరిది చాగంటి వెంకట్రావూ, అబ్బులు బావా వగైరా కుర్ర గేంగ్ అంతా సుమారు రెండు నెలలు మా పొలం లోనే మకాం వేసే వాళ్ళం. ఆ వివరాలు ప్రస్తావించే ముందు మా పెళ్ళయిన వారం రోజులలో మా ఆవిడ కి మా పొలం చూపించడానికి వెళ్ళినప్పుడు నా రెండో చెల్లెలు భాస్కర అన్నపూర్ణ తో ఫోటో, అలాగే అమెరికా లో పుట్టి పెరిగిన మా అమ్మాయిలకి కూడా “రామం గారి శేరీ” లో “రాజా గారి వాటా”  చూపించి, మా రైతులతో దిగిననప్పటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. వచ్చే నెల మరి కొన్ని ““ లోకారెడ్డి వారి చెరువు ఇస్తువా పంపు అనబడే శేరీ ” విశేషాలతో కలుసుకుందాం.  అన్నట్టు మొన్న మా పొలం వెళ్ళినప్పుడు ఒక్క తుమ్మ చెట్టు  కూడా కనపడ లేదు.  ఎందుకంటే వాటి నీడకి పంట తక్కువ రాలుతోంది అని  పొలం  గట్ల మీద మా చిన్నప్పటిలా తుమ్మ చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు మొదలైనవే కాక కంది, మినప, పత్తి లాంటి పొదల మొక్కలు కూడా ఈ రోజుల్లో వెయ్యడం లేదుట.  అంత కంటా దారుణం సెల్ ఫోన్ల్ నుంచి వచ్చే రేడియేషన్ కి పిచ్చుకలు మూకుమ్మడిగా చచ్చి పోయి, ఉన్న వాటికి రాలడానికి ఏ రకమైన చెట్లూ లేకా ఎక్కడా అసలు ఒక్క పిచ్చుకైనా  కూడా కనపడ లేదు.  ఆ అర్భక జాతి మన పురోగతికి ఆహుతి అయిపోయింది అన్న  మాట . హతోస్మి !

   — వంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

 

మీ మాటలు

 1. రమణ బాలాంత్రపు says:

  అద్భుతం…అత్యద్భుతం !! ఎంత చక్కటి తెలుగు పదాలు, నుడికారాలు !!!
  This

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, రమణా

   —-వంగూరి చిట్టెన్ రాజు

 2. రమణ బాలాంత్రపు says:

  This is simply the best thus far !!!

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, రమణా

   —-వంగూరి చిట్టెన్ రాజు

 3. kameswari yaddanapudi says:

  మివూరికి తీసుకు వెళ్ళినందుకు కృతజ్ఞతలండి

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు..

   వంగూరి చిట్టెన్ రాజు

 4. రవిశంకర్ says:

  మా అక్కయ్య ఒకామెకు అప్పట్లో దొంతమూరు కరణంగా పనిచేస్తున్న కుంటముక్కల సుభద్రారావుగారితో వివాహం జరిగింది. అందుకని, 70-80ల్లో మేము చాలా సార్లు దొంతమూరు వెళుతూ ఉండేవాళ్ళం. ఐతే, చేబ్రోలు కాకుండా దివిలిలో బస్సుదిగి, రిక్షా మీదో, బండి మీదో వెళ్ళేవాళ్ళమని గుర్తు. వాళ్ళదగ్గర “మిరాసీ”, “శేరీ” అనే మాటల్ని వినేవాణ్ణిగాని, వాటి అర్థం ఇప్పుడు మీరు చెబితేనే తెలిసింది. మీ కథనం చదువుతోంటే, నాకు కూడా ఆ రోజులు జ్ఞాపకం వచ్చాయి – రవిశంకర్

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   రవి శంకర్ గారూ …మా మేనత్త కుటుంబం వారే కాక మా రెండో వదిన వేపు కూడా దొంతమ్మూరు కుంటముక్కల వారే. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. క్రిందటి వారమే మా మేనల్లుళ్ళతో ఆ ఊరు వెళ్ళి, పూర్వం మా మేడ ఉండే ఖాళీ స్థలం చూసి వచ్చాను.

   మీ స్పందనకి ధన్యవాదాలు.

   –వంగూరి చిట్టెన్ రాజు

మీ మాటలు

*