నాన్న లేని సినిమా జ్ఞాపకాలు…!

Venakt1.psd

ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది. చాలా వరకూ నా సినిమా జ్ఞాపకాల్లో మా నాన్న లేడసలు. బహుశా నా చిన్ననాటి  రోజుల్లో ఆయన వ్యాపార నిమిత్తం మధ్యప్రదేశ్ లో ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. అప్పట్లో మా అమ్మ కూడా కొన్ని రోజులు మధ్యప్రదేశ్ కి వెళ్లింది. నన్నూ శెలవుల్లో మధ్యప్రదేశ్ రమ్మంటే నేను వెళ్లలేదు. అందుకు ఒకే ఒక్క కారణం మధ్యప్రదేశ్ లో మా నాన్న ఉండే ఊర్లో అసలు ఒక్కటంటే ఒక్కటైనా థియేటర్లు లేవని నాకు తెలియడం.

అయితే మా నాన్నతో సినిమా అనగానే ఒక విచిత్రమైన అనుభవం గుర్తొస్తుంది. ఇది నిజంగా జరిగిందో, కలో కూడా నాకు తెలియదు.

ఒక రోజు నేనూ, మా నాన్న నెల్లూరి కి వచ్చాం. ఎందుకొచ్చామో నాకు గుర్తు లేదు కానీ, ఆ రోజు నాన్న నన్ను నెల్లూరు శ్రీనివాస థియేటర్ దగ్గరకు తీసుకెళ్లారు.అప్పుడే సినిమా ఇంటర్వెల్ ఇచ్చారు. సినిమా థియేటర్ దగ్గర ఎవరితోనో మాట్లాడి నన్ను అతనితో పాటు థియేటర్ లోపలకి పంపించి నాన్న ఎటో వెళ్లిపోయారు. థియేటర్ లో సెకండాఫ్ సినిమా మొత్తం చూశాను కానీ నాకు గుర్తున్నంతవరకూ అదో శోభన్ బాబు సినిమా. థియేటర్ లో అతను నాకో చాక్లెట్ కూడా కొనిచ్చాడు. సినిమా అయిపోయాక నాన్న నన్ను తీసుకెళ్లడం లాంటి విషయాలేవీ గుర్తు లేవు. అసలు ఇదంతా నిజంగా జరిగిందా లేదా అని కూడా నాకో డౌట్. ఈ సారి నాన్నను కలిసినప్పుడు అడిగి తెలుసుకోవాలి.

ఇక నాన్నతో సినిమా అనుభవం అంటే నాకు బాగా గుర్తొచ్చేది రెండు సినిమాలు. ఒకటి అంతిమ తీర్పు. రెండవది ఆఖరి పోరాటం. నాకు గుర్తున్నంతవరకూ ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసినట్టు జ్ఞాపకం. నన్ను సైనిక్ స్కూల్లో చేర్పించడానికి నెల్లూరు నుంచి విజయనగరం బయల్దేరాం. కానీ ట్రైన్ ఎప్పుడో తెల్లవారుజామున ఉండడంతో రాత్రి నిద్రపట్టక నాన్న నన్ను ఆ సినిమాలకు తీసుకెళ్లారు. ఆ రెండు సినిమాలు ఇప్పటికీ నాకు బాగా నచ్చుతాయి.

నాన్న మధ్యప్రదేశ్ లో ఉండడం కారణంగా హిందీ సినిమాలు ఎక్కువ చూసేవారు. నేను థియేటర్ లో చూసిన మొట్టమొదటి హిందీ సినిమా పరిందా”. అది మా నాన్నే తీసుకెళ్ళారు. ఇవి తప్ప నాన్నతో పెద్దగా సినిమా జ్ఞాపకాలేవీ లేవు. ఇప్పుడసలు సినిమా అంటేనే ఆసక్తి లేదు ఆయనకి. నేను తీసిన సినిమా కూడా చూడలేదు.

నాన్న గురించి మరొక చిత్రమైన జ్ఞాపకం ఒకటుంది. నేనూ నాన్న సైనిక్ స్కూల్ దగ్గరకు బస్ లో చేరుకున్నాం. బస్ ఒక చిన్న పల్లెటూరు లో ఆగింది. బస్ దిగగానే పక్కన జయప్రద “సుమంగళి” పోస్టర్ ఉంది. పోస్టర్ నిండా అందమైన ఆమె మొహం తప్ప మరేమీ లేదు. ఆ పోస్టర్ వైపు చూస్తూ, జయప్రద అందాన్ని పొగుడుతూ నాతో ఏదో అన్నారు నాన్న. నాతో అలా హీరోయిన్ అందం గురించి చర్చించడం కొంచెం గర్వంగా అనిపించింది. ఆ రోజే నన్ను హాస్టల్ లో చేర్పించారు. పెద్దాడయ్యానని మొదటి సారి అనిపించింది అప్పుడే!

  1. పోస్టర్స్ అండ్ క్రెడిట్స్

మా స్కూల్లో ఖాజా మస్తాన్ అని ఒక క్లాస్ మేట్ ఉండే వాడు. వాడికెలా దొరికిందో తెలియదు కానీ, కోటికొక్కడు సినిమా పోస్టర్ దొరికింది. వాడికి పెన్సిల్ షార్పనర్ ఇచ్చి ఆ పోస్టర్ తీసుకున్నాను. ఆ పోస్టర్ చాలా రోజుల వరకూ నా దగ్గర ఉండేది. ఆ రోజుల్లో మా ఊరికి న్యూస్ పేపర్ కూడా వచ్చేది కాదు. కానీ శెలవుల్లో పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్లినప్పుడు, ఆంధ్రజ్యోతి వార్తాపాత్రికలో వచ్చే ఫుల్ పేజ్ సినిమా ప్రకటనల పోస్టర్లు కలెక్ట్ చెయ్యడం అలవాటయింది. ఇలా కలెక్ట్ చేసిన వాటిని నా పుస్తకాలకు అట్టలుగా వేసుకునేవాడిని. అలా నేను ఒక పుస్తకానికి కోడె త్రాచు పోస్టర్ తో అట్ట వేశాను. బహుశా ఆ పోస్టర్ మీదే మొదటి సారి దర్శకుడు, నిర్మాత అనే పదాలను మొదటి సారి గమనించాను. వాటి గురించి మా ఇంట్లో అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేదు.

నాకు సినిమా అన్నా, సినిమా పోస్టర్లన్నా ఎంత పిచ్చంటే, శెలవులకి మా అమ్మమ్మ ఊరుకి వెళ్ళినప్పుడు థియేటర్లో వరుసగా కట్టిన ఫోటో కార్డ్స్ ని దొంగతనం చెయ్యడానికి ఎన్నో ప్లాన్స్ వేసుకునే వాడిని. ఆ టైంలో ఉదయాన్నే ఒక హోటల్ కి పాలుపోసే పని ఉండేది నాకు. ఆ హోటల్ సరిగ్గా థియేటర్ కి ఎదురుగా ఉండేది. పాలు పోసే సమయానికి ఇంకా చీకటిగానే ఉండేది. ఆ టైంలో ధైర్యం చేసి థియేటర్ గోడ దూకి వెళ్ళి రంగురంగుల ఫోటో కార్డ్స్ కొట్టేయాలని చాలా సార్లే అనుకున్నాను కానీ ఎప్పుడూ ప్రయత్నించే ధైర్యం మాత్రం చెయ్యలేదు.

ఆ తర్వాత కాస్తా పెద్దయ్యాక శెలవుల్లో మా అత్త వాళ్ళ ఊరికి వెళ్లడం మొదలయింది. అందుకు పెద్ద కారణమేమీ లేదు. మా అత్త వాళ్ళ ఊరికి దగ్గర్లో ఐదు థియేటర్లు ఉండడమే కాకుండా నెల్లూరుకి దగ్గరగా ఉండడంతో కొత్త సినిమాలు రిలీజయ్యేవి. ఆ రోజుల్లో చాలా వరకూ జీవితమంతా సినిమా చుట్టూనే తిరిగేది. కొత్త సినిమా వచ్చినప్పుడల్లా మా అత్త వాళ్ల ఇంటి గోడకి పోస్టర్ అంటించే వాళ్లు. అప్పటివరకూ పోస్టర్ల ను దూరం నుంచి చూడడమే తప్ప దగ్గరకెళ్లి ఎప్పుడూ ముట్టుకుని చూడలేదు. ఆ అవకాశం మా అత్త వాళ్ల ఊర్లో వచ్చింది. సినిమా వాల్ పోస్టర్ ని దగ్గరగా చూసినప్పుడు చాలా నిరాశకు గురయ్యాను. దూరం నుంచి చూస్తే ఉండే కళ అందులో లేదు. అంతా మసక మసకగా ఉండేది. అయినా కూడా పోస్టర్స్ మీద ఉన్న పిచ్చయితే తగ్గలేదు. ఎలాగోలా పోస్టర్ అంటించే వాళ్లని అడిగి ఒక పోస్టర్  సంపాదిద్దామనుకున్నాను. కానీ వాళ్లు ఏ అర్థ రాత్రో వచ్చి పోస్టర్ అంటించి వెళ్లేవాళ్లు. ఉదయం లేచి చూస్తే గోడ మీద రంగు రంగుల కొత్త పోస్టర్ కనిపించేది.

ఒక రోజు ఉదయం లేచే సరికి వర్షం పడుతోంది. బయటకొచ్చి చూస్తే నరేష్ నటించిన మారుతి సినిమా పోస్టర్ ఉంది. వర్షం కారణంగా పోస్టర్ తడి తడిగా ఉంది. లాగితే ఇట్టే వచ్చేసింది. కానీ పోస్టర్ రెండు ముక్కలుగా చేతికొచ్చింది. అది గోడ మీద నుంచి చింపడంలో జరిగిన తప్పు కాదు. అసలు పోస్టర్స్ రావడమే రెండు ముక్కలగా ఉంటుందని, వాటిని కలిపి అతికిస్తారని అప్పుడే  అర్థమయింది. కానీ అలా ఎందుకు చేసేవారో నాకు ఇప్పటికీ తెలియలేదు.

నా సినిమా పోస్టర్ల పిచ్చి మా ఇంట్లో వాళ్లకు అసలు ఇష్టం ఉండేది కాదు. అప్పట్లో మా ఇంట్లో జోక్ ఏంటంటే, ఎక్కడికైనా నన్ను బయటకు తీసుకెళ్తే చేతిని గట్టిగా పట్టుకోకపోతే సినిమా వాల్ పోస్టర్స్ చూస్తూ తప్పిపోతానని అనుకునేవాళ్ళు.

ఆ రోజుల్లో మా స్కూల్ హాస్టల్ లో శెలవులయ్యాక తిరిగిరాగానే ఎవరి కప్ బోర్డ్ ని వారి టేస్ట్ కి తగ్గట్టు అలంకరించుకునే వాళ్లు. నా కప్ బోర్డ్ ని మాత్రం, ఇంటి దగ్గర్నుంచి తెచుకున్న ఆంధ్రజ్యోతి ఫుల్ పేజ్ పోస్టర్స్ తో నింపేసేవాడిని. నా కప్ బోర్డ్ డెకరేషన్ చూడ్డానికి చాలా మందే వచ్చే వాళ్లు.

ఈ పోస్టర్ల పిచ్చి చిన్నప్పుడే కాదు…ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొన్నీ మధ్యనే షాంఘై సినిమా విడుదలైన సమయంలో ఒక మ్యజిక్ షాప్ ముందున్న పెద్ద పోస్టర్ ఒకటి షాప్ వాళ్ల కళ్లు గప్పి ఇంటికి తరలించి ఒక చిన్న అడ్వెంచర్ చేశాను.

అప్పట్లో మంచి సినిమా, చెడ్డ సినిమా అని తేడా ఉండేది కాదు నాకు. దొరికిన సినిమా చూసెయ్యడమే. కానీ ఒక సినిమా పోస్టర్ చూసి ఈ సినిమా తప్పకుండా చూడాలి అనిపించింది మాత్రం బుల్లెట్. ఆ పోస్టర్ లో ఒక different angle లో కృష్ణంరాజు బైక్ మీద ఉన్నట్టు గుర్తు.  బాపు గారు ఆ సినిమా దర్శకుడు. ఎందుకో బాపు అని చదవగానే ఆ పేరే నాకు చిత్రంగా అనిపించింది. పోస్టర్స్ చూస్తూ, చూస్తూ అందులో ఉన్న పేర్లనీ గమనించడం అలవాటయింది నాకు. నిర్మాత, దర్శకుడు అంటే తేడా తెలియని వయసు. కానీ కొన్నాళ్ళకు మా అన్నయ్య దర్శకుడు, నిర్మాతల మధ్య తేడా చెప్పాక కొంచెం అర్థమయింది. కానీ చాలా ఏళ్ల వరకూ నాకు ఎవరూ సరయిన సమాధానం చెప్పని ప్రశ్న ఆ రోజుల్లోనే నన్ను వేధించేది. అది “సమర్పించు” అంటే ఏమిటి అని?

సినిమా సమర్పించే వ్యక్తి అసలేం చేస్తాడు అని చాలా రోజుల వరకూ ప్రశ్నగానే మిగిలిపోయింది. సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక, అదీనూ హాలీవుడ్ సినిమాలు చూడడం ఎక్కువయ్యాక పోస్టర్స్ మీద చూసి కన్ఫ్యూజ్ అయిన మరొక పేరు “Executive Producer”. పేరు బట్టి నేనేమనుకున్నానంటే, నిర్మాత డబ్బులు మాత్రం పెడితే, ఆ డబ్బులు తీసుకుని సినిమాని execute చేసే వాడే EP అనుకునే వాడిని. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలకి స్టీవెన్ స్పీల్ బర్గ్ పేరు EP గా చూసినప్పుడు మళ్లీ మరో అనుమానం. వేరే ఎవరో డబ్బులు పెడితే ఆ ప్రాజెక్ట్ ని దగ్గరుండి execute చేసేంత అవసరం స్పీల్ బర్గ్ కి ఏముంటుంది? అయినా ఆయనకంతా టైం ఉంటుందా అని నా అనుమానం.

తీరిగ్గా తెలిసిన విషయం ఏంటంటే ఈ సమర్పకుడు కి Executive Producer కి చాలా దగ్గర సంబధం ఉంది. ఇది సినిమా క్రెడిట్స్ లోకెల్లా చాలా ఫ్లెక్సిబిల్ క్రెడిట్. ఎవరికి పడితే వాళ్లకి ఈ పేరు తగిలించవచ్చని స్వయంగా చేస్తే గానీ తెలియరాలేదు. మేమొక సినిమా తీసినప్పుడు మా నిర్మాత డబ్బులివ్వడం తప్పితే ఇంకెక్కడా వేలు పెట్టలేదు. అప్పుడు దాదాపు నిర్మాణ బాధ్యతలన్నీ మేమే నెత్తిమీద వేసుకున్నాం. సినిమా అంతా అయ్యాక, మాకో పిచ్చి ఆలోచన కలిగింది. మనమూ నిర్మాణ బాధ్యతలు చేపట్టాం కాబట్టి మనకీ అందులో క్రెడిట్ కావాలనిపించింది. ఓస్ అంతే కదా అని మా మేనేజర్ ఒక సలహా ఇచ్చాడు. ఈ చిత్రాన్ని నిర్మాత ఒప్పుకుంటే మీరో లేదా మీ కంపెనీ సమర్పించినట్టు వేసుకోవచ్చని చెప్పాడు. అప్పట్లో మేము స్థాపించిన ఒక కంపెనీ పేరు పెట్టి “సోఅండ్ సో కంపెనీ సమర్పించు” అని సినిమాకి ముందు వేసుకున్నాం. “సమర్పించు” అన్నా, “ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్” అన్నా, మనకిష్టమైన వాళ్లకి, పని చేసినా చెయ్యకపోయినా మన సినిమాలో వారికో క్రెడిట్ ఇవ్వాలంటే వాడుకునే ఒక సౌలభ్యమైన క్రెడిట్ అని తెలుసుకోవడంతో నా “సమర్పించు” అనుమానం తీరిపోయింది.

–వెంకట్ సిద్దారెడ్డి

మీ మాటలు

  1. బాగున్నాయండి మీ సినిమా జ్ఞాపకాలు. సినిమాలకు స్వర్గం అంటూ ఏదైనా వుంటే అది నెల్లూరే. 3 హాళ్ళు, నర్తకి , అర్చన థియేటర్లు…వాటిలో సినిమా చూడడం కూడా ఒక మంచి అనుభవమే. నేను కూడా మా అమ్మ, నాన్నలతో కలసి బ్యాక్ టు బ్యాక్ చూసిన అన్వేషణ, ముందడుగు , ఇప్పటికీ నాకిష్టమైన సినిమాలే :)

  2. “నా సినిమా పోస్టర్ల పిచ్చి మా ఇంట్లో వాళ్లకు అసలు ఇష్టం ఉండేది కాదు. అప్పట్లో మా ఇంట్లో జోక్ ఏంటంటే, ఎక్కడికైనా నన్ను బయటకు తీసుకెళ్తే చేతిని గట్టిగా పట్టుకోకపోతే సినిమా వాల్ పోస్టర్స్ చూస్తూ తప్పిపోతానని అనుకునేవాళ్ళు.” – అంత తపన, అంత తపస్సు, అంత పిచ్చి ప్రేమ వుంటేనే తప్ప E కళ అయినా మనల్ని వరిం చదట!..బాగుంది. బాగా చెప్పారు, మీ అనుభవాల్ని.

  3. Padma Ayala says:

    ఛాలా బాగా రాసారు. సినిమా అనుభవం లేని నాలాంటి వాళ్ళకి నిజంగానే Executive Producer అంటే ఏమిటో తేలీదు. కొత్త విషయం తెలుసుకున్నాను. మీ అనుభవాలే చాలావరకు నా అనుభవాలు. ఆ రోజుల్లో సినిమాకి వెళ్ళడం , ఆ తయారు సెకండ్ షో అంటే ఫస్ట్ షో టైం నుంచి గంట గంట వాచి చూడడం గుర్తుకు వచ్చాయి. మీ వ్యాసం బాగుంది.

  4. అనామకుడు says:

    టైటిల్ లో అనుకోకుండా ధ్వనిస్తోన్న ఒక అపశృతి వదిలేస్తే… అంతా బాగుంది.

మీ మాటలు

*