నాకు నచ్చిన చాసో కథ – ఆఁవెఁత

chaso

సాహిత్య రచన ఏ ఆశయంతో జరగాలి అని ప్రశ్నించుకుంటే ఒక్కొకరూ ఒక్కో విధంగా వారి వారి అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది కాని సాహిత్య శిల్పం మాత్రం కాలపరిస్థితులని బట్టి మారుతుండాలి అనే విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తారు.  ఏ రచనైనా చదివి ప్రక్కన పడేసేదిగా కాక  కొంత సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలంటే రచయిత తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న, జరగబోయే మార్పుల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలి – అంతే గాక మానవ జీవిత క్రమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే శక్తి, నిశితంగా గమనించే నేర్పూ ఓర్పూ రచయితకి ఉండాలి – అలాంటి కోవకి చెందిన వారిలో ప్రముఖుడు శ్రీ చాగంటి సోమయాజులు గారు.

ఈయన రచనలకి ఆనాటి ఆయన సమకాలీన రచయితలు, ఆ తరం పాఠకులు ఎంత మందో ప్రభావితులైనారట.  ఇప్పటి రచయితలకి ఆయన రచనలు ఉత్తేజాన్ని కలిగించి కథంటే ఎలా ఉండాలో పాఠాలు చెప్తాయి.  ఆయన కథల్లోని వైవిధ్యం, క్లుప్తత, వేగం మనల్ని చకితుల్ని చేస్తాయి.

సాధారణ జీవితాల నుండి అంత గొప్ప కథలు రాయగలగడం అందునా సరళంగా రాయగలగడం ఎలా సాధ్యం అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాసిన ఏ కథ చదివినా ఆ కథ మరోలా రాయొచ్చునేమో ఇలా రాసుంటే బాగుండేదేమోననే ఆలోచన మనకి కలగదు.  విపరీతమైన ద్వేషాన్ని గురిచి కాని అనవసరమైన సానుభూతిని చూపిస్తూ కాని కాకుండా మామూలుగా కథని చెప్పే తీరు అనిర్విచనీయమైనది.  ఈనాటి ప్రతి రచయితా గ్రహించదగినది.  అందుకే ఆయనని  కథకుల కథకుడు అంటారు – ఈ విషయాలన్నీ నేను చెప్తున్నవి కాదు ఆయన గురించి మహామహులు చెప్పినవి, ఇప్పటికీ చెప్తున్నవి.

ఆయన రాసిన 40 కథలని విశాలాంధ్ర వారు వేసిన సంపుటిలో చదివాను.  వాటన్నిటి కంటే కూడా నాకు ఫేస్ బుక్ లో వేంపల్లి షరీఫ్ గారి ‘కథ’ గ్రూప్ ద్వారా పరిచయమైన రమణమూర్తి గారు పంపిన ఆఁవెఁత”  కథ ఎంతో నచ్చింది.

ఈ కథ నాకెలా దొరికిందంటే ….

వేంపల్లి షరీఫ్ గారు విశాలాంధ్ర వారు వేసిన చాసో కథల సంపుటిలోని అన్ని కథలూ చదివి  ‘చెప్పకు చెప్పకు’  అనే కథ పేరు నచ్చక – “ఆ పేరు నన్ను ఆకట్టుకోలేదు అందుకే చదవలేదు కాని ఇదొక్కటి ఎందుకు వదలాలిలే అని చదివాను చదివాక అర్థమైంది అది ఎంత మంచి కథో”  అని రాశారు కథ గ్రూప్ లో.

అప్పుడు గొరుసుగారు “ఆవెత కథని చదివితే చాసో విశ్వరూప దర్శనం లభిస్తుంది” అన్నారు.

రమణమూర్తి గారు “విశాలాంధ్ర వాళ్ళు వేసిన పుస్తకంలో లేని కథని షరీఫ్ ఎలా చదువుతాడు?  నా దగ్గర ఉంది  కావాల్సిన వాళ్ళు అడిగితే ఇస్తా”  అని ఊరించారు.  తాయిలం ఇస్తానంటే ఎవరు అడగరు చెప్పండి ఆయన ఆశ పెట్టడం కాకపోతే! రమణమూర్తి గారూ,  ఆ కథ  నాకు పంపగలరా?  నా ఇ మెయిల్ … అని టైప్ చేయగానే  ‘వామ్మో! ఇది ఫేస్ బుక్ కదా ఇ మెయిల్ అడ్రస్ ఇస్తే కొంప కొల్లేరు అవదూ’  అనుకుని ఆయన టైమ్ లైన్ కి వెళ్ళి మెసేజ్ పెట్టా.  వెంటనే రమణమూర్తి గారు “ఆఁవెఁత”  కథని పంపారు.  ఆ కథ చదవగానే గొరుసు గారు అన్నట్లు నాకు చాసో గారి సారస్వత  విశ్వరూప దర్శనం అయింది.  స్త్రీ స్వేచ్ఛపై సంపూర్ణ అవగాహన కలిగింది.

స్వేచ్ఛ ఉండాలిట స్త్రీకి సమస్త స్త్రీ జాతితో కలిసి మగవాళ్ళు కూడా (వ్యంగ్యంగా) అరుస్తున్నారు.  ఏ విధంగా ఉంటుంది? స్వేచ్ఛ ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది డబ్బు.  అది లేనపుడు స్త్రీని బానిసని చేయడానికి సంఘం, కట్టుకున్న భర్త ఆఖరికి కన్న తల్లి దండ్రులు కూడా వెనుకాడటం లేదు.  అవినీతికీ, అధికారానికీ, డబ్బుసంపాదనకీ స్త్రీని ఎరగా మారుస్తున్నారు – ఈ నిజాన్ని గుండెల్లో గుచ్చుకునేట్లు అలవోకగా చెప్పి తప్పుకుంటాడు చాసో ఈ కథలో మనల్ని వదిలేసి.  గుండెల్లో ఆ మంట ఆరడానికి మనకి చాలా రోజులు పడుతుంది.

‘ఆఁవెఁత’  అంటే ‘విందు’ అట.  గతిలేని ఓ స్త్రీ, భర్త చేసిన అప్పు – తమ పెళ్ళి కోసం చేసిన అప్పుని కట్టడానికి ఓ డబ్బున్న మగవాడికి విందుగా మారడమే ఈ కథ.

పెళ్ళయ్యాక ఆమె పారాణి కూడా ఆరిందో లేదో పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి రంగూన్ వెళ్ళిపోతాడు చాకలి దాలిగాడు.  వాడటు వెళ్ళగానే ‘భర్త లేకుండా పాపం దానికి ఎట్లా నిద్రపట్టేది’ అని ప్రతి వాడూ “ఏమంటావు ఏమంటావు” అని ఆమె వెంట పడుతుంటారు.

ఆ ఊళ్ళో వాళ్ళు ఆమెని దక్కించుకోవాలని,  దాలిగాడు రంగూన్ లో ఒకదాన్ని మరిగాడనీ ఇక రాడనీ కథలు పుట్టిస్తారు.  ఆ ఊరివాడే పెళ్ళి కాని చిన్నవాడు శాస్త్రి ఆమె అమ్మకి డబ్బు ఆశ చూపించి కూతురిని తన దగ్గరకి పంపమంటాడు. దాలిగాడు నిజంగానే రావడం లేదు ఎన్నాళ్ళయినా ఇక డబ్బున్న శాస్త్రే గతి అని నిర్ణయించుకున్న ఆమె అమ్మ కూతురిని శాస్త్రి దగ్గరకి పంపుతుంది.  అట్లా ఆమెని లోబరుచుకుంటాడు శాస్త్రి.  పొలంలో మంచి గదీ, మంచం, పుస్తకాలు, టీకి సరంజామా వాటితో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు ఇచ్చి ఆమె  “విందు” తెప్పించుకుంటుంటాడు.  అతనికి లోబడుతున్న ప్రతిసారీ మనసుకీ, తనువుకీ సుఖమిచ్చిన భర్తకి అన్యాయం చేస్తున్నానని ఆమె పడే బాధ – అమాయకమైన ఆమె మాటలతో మన గుండె లోతులని స్పృశిస్తాడు చాసో.

ఇంతకు ముందు ఎవరూ చెప్పని సందేశాన్ని సున్నితంగా చెప్పడమే చాసో కథల ప్రత్యేకతట.  ఆ  నాడు (1950-51) ఆయన చెప్దామనుకున్నదేమిటో అందరికీ స్పష్టమే కాని ఇప్పుడు చదివే వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఎదిగిన ఇప్పటి స్త్రీకి ఈ కథ వల్ల తగిన నూతన సందేశం తప్పకుండా అందుతుంది.

ఈనాటి స్త్రీ (ఎక్కువ శాతం)  ఆర్థికంగా నిలదొక్కుకుంది నిజమే కాని దానితో పాటు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, వివేక విచక్షణా జ్ఞానాన్ని అలవరచుకోవాలి.  లోపల –  లోలోపల నిజమైన స్వేచ్ఛని పొందాలి.  అలా లేని నాడు పురాతన స్త్రీకి భిన్నంగా మగవాడి పెత్తనాన్ని తప్పించుకోగలదేమో కాని అధికార వ్యామోహానికీ, అహంకారానికీ, అసూయాద్వేషాలకీ,  ధనకాంక్ష కీ బానిస అవుతుంది  అన్న విషయం నాకు గ్రహింపుకి తెచ్చిన కథకుల కథకుడు చాసోకి వందనాలు.

 

    ***

radhamanduva1–రాధ మండువ

  —    రాధ మండువ

మీ మాటలు

 1. రాజశేఖర్ గుదిబండి says:

  చాలా బాగా రాశారండి. నేను కూడా మీలాగే చదివాను , రమణమూర్తి గారికి రిక్వెస్ట్ పంపి సంపాదించాను.
  చాలా అద్భుతమైన కధ.

  • థాంక్ యు రాజశేఖర్ గారు. చదివాక భలే బాధ కలుగుతుంది ఎవరికైనా.

 2. మీకు నచ్చిన విధానం చెప్పాక ఈ కథ ని చదవాలనిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది రాధ గారు.

  • ఇదే కాదండీ. ఆయన కథలన్నీ ఒకే సారి చదవాలి. అప్పడే ఆ యా కథల్లోని వైవిధ్యం తెలుస్తుంది. కథకుల కథకుడు అని ఊరికే అన్నారా మరి!!?

 3. కథ గుంపులో మీ పోస్టింగ్ చూసి, రమణమూర్తిగారిని అడుగుతే లింక్ పంపారు.
  నిస్సహాయ స్థితిలో ఇష్టంలేని తప్పుచెయ్యడానికి ఒప్పకున్న అమాయకురాలైన స్త్రీ ఆవేదన ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా చెప్పారు చాకోగారు. మా వివరణ కూడా అంతబాగా ఉంది రాధగారూ.

 4. Thank u

మీ మాటలు

*