వీలునామా – 26 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.Hogarth’s Will కి అనుసృజన : శారద )

    (గత వారం తరువాయి )

ఆధ్యాత్మికత,  ప్రేమా,  రాజకీయం

బ్రాండన్ ఇంగ్లండు వదిలి మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్తాడని తెలియగానే చిన్నారి ఎమిలీ బావురుమంది. మళ్ళీ తిరిగి రావడానికి చాలా కాలం పట్టొచ్చన్న ఆలోచనతో బ్రాండన్ ఇంగ్లండులో తనుండబోయే ఇంకొద్ది రోజులూ తల్లితో చెల్లేళ్ళతో గడపడానికి లండన్ వదిలి ఏష్ ఫీల్డ్ వెళ్ళాడు. ఆ రోజంతా మొహం చిన్నబుచ్చుకోనే వుంది ఎమిలీ. ఎమిలీతో,  హేరియట్ తో వేగి విసిగిపోయిన జేన్ కి ఆ రోజు తన కొరకు ఫ్రాన్సిస్ వచ్చి కూర్చున్నాడన్న మాట సేద దీర్చింది. అందులోనూ తనూ అతనికి ఆతృతగా ఒక వార్త చెప్పాలని ఉవ్విళ్ళూరుతుంది.

అసలు తనారోజు రావాలనుకుంటున్నట్టు ఫ్రాన్సిస్ లిలీ ఫిలిప్స్ కి చెప్పాడు కూడా. ఆవిడ జేన్ తో ఆ సంగతి చెప్పడమే మర్చిపోయింది. బయట కూర్చున్న ఫ్రాన్సిస్ జేన్ చెల్లెల్ని తోడు తెచ్చుకోకుండా ఒంటరిగా వస్తే బాగుండు, అని ఆశ పడ్డాడు.

తను రాగానే, లేచి నిలబడి, చెల్లెల్ని పిలిచే అవకాశం ఇవ్వకుండా బయటికి దారి తీసిన ఫ్రాన్సిస్ ని చూసి జేన్ ఆశ్చర్యపోయింది. అయితే ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాలేమోననుకుని సరిపెట్టుకుంది.

తను అంతకు ముందురోజు తన తండ్రి ఆత్మతో మాట్లాడిన ఉదంతం మొత్తం జేన్ కి వివరించాడు. జేన్ ఏ వ్యాఖ్యానాలూ చేయకుండా,అడ్డు ప్రశ్నలు వేయకుండా శ్రధ్ధగా విన్నది. తన మన్సులోని గాఢమైన కోరిక గురించిన ప్రశ్నని ఫ్రాన్సిస్ దాట వేసాడు. తరవాత తనకి తన తల్లి నని చెప్పుకుంటూ మెల్బోర్న్ నించి వచ్చిన వుత్తరం గురించిన ప్రశ్నా, దానికి తనకొచ్చిన జవాబూ వివరించాడు.

“చెప్పు జేన్! నీ అభిప్రాయమేమిటి? ఇదంతా నమ్మొచ్చంటావా?”

“నిజంగా నమ్మలేకుండా వున్నాను. అయితే మనకొచ్చిన జవాబులని ఎలా అర్థం చేసుకోవాలో కూడా కొంచెం అయోమయంగా వుంది.”

“ఆయన ఆత్మ ఇచ్చిన సలహాలు పాటించొచ్చంటావా?”

“ఇంతకు ముందు నన్ను సలహాలడిగావు. ఇప్పుడు ఆత్మలనడుగుతున్నావు. నన్నడిగితే, బ్రతికున్న వాళ్ళనైనా, లేని వాళ్ళనైనా సలహా అడిగేకంటే, నీ మనసుకి నచ్చినట్టు చేసుకుంటూ పోవడం మంచిది. నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత నీదే కదా? అసలు నువ్వు నా వల్లనే ఫిలిప్స్ గారి సలహా పాటించడం నన్నెంతో బాధ పెడుతూంది. ఆయన సలహాకి అంత విలువ ఇవ్వకపోయి వుంటే నువ్వు మీ అమ్మ వుత్తరానికి జవాబిచ్చి వుండే వాడివి. ఇప్పటికే నేను నీ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నా కదా?”

veelunama11

“ఆ మాటకొస్తే మా నాన్నగారి ఆత్మ కూడా, ఆవిడ నా తల్లే అయినప్పటికీ ఆవిడకి దూరంగా వుండమనే కదా అన్నది. ఇందులో ఫిలిప్స్ గారొచ్చి పాడు చేసింది ఏముంది? అయినా, జేన్, నాకామెని చూడాలనీ, మాట్లాడాలనీ, ఉత్తరం రాయాలనీ ఏమాత్రం అనిపించడం లేదు.నాకు జన్మనివ్వడం అంటావా? అసలు నా జన్మలో సంతోషించాల్సిన విషయం, కనీసం ఒక్కటైనా వుందా చెప్పు? ఇలాటి జన్మనిచ్చినందుకా నేనావిడకి ఋణపడి వుండడం?”

“ఫ్రాన్సిస్! అంత నిరాశ పనికి రాదు. నిజంగా నీ బ్రతుకులో, ఆ మాటకొస్తే నా బ్రతుకులో సంతోషమేదీ లేదా? మనకైన అనుభవాలను తప్పు పట్టకు. ఆ అనుభవాలే లేకపోతే మనకి ఇంత ఙ్ఞానం కలిగేదా? జీవితం నించీ, మనిద్దరం ఒకరినించొకరం, నేర్చుకున్నదేదీ లేదా? దానికి విలువేమీ లేదా?”

” ఈ ఙ్ఞాన విఙ్ఞానాల సంగతీ, అనుభవ సారాల సంగతీ కాదు నేను మాట్లాడేది. నాక్కావల్సింది మామూలు మనుషులకుండే సంతోషాలు. చిన్నవీ, పెద్దవీ!”

అతని ఆవేశాన్నీ కోపాన్నీ చూసి జేన్ ఆత్మీయంగా నవ్వింది. ఆమె కళ్ళల్లో ప్రేమ బదులు, కేవలం స్నేహమూ ఆప్యాయతా వుండడం చూసి ఫ్రాన్సిస్ నిరాశ ఎక్కువైంది. తనని ఆమె ఎప్పటికీ ఒక స్త్రీ పురుషుణ్ణి ప్రేమించినట్టు ప్రేమించలేదేమో. తనన్నా, తన ఒంటరితనమన్నా ఆమెకి కేవలం జాలి! ఫ్రాన్సిస్ కి మనసంతా కృంగిపోతున్నట్టనిపించింది. ఇంకేదైనా మాట్లాడాలనుకున్నాడు.

“అదలా వుంచు? బ్రాండన్ ఏం చేస్తున్నాడు? అతనికి ఎల్సీ అంటే చాలా ఇష్టమని గుడ్డి వాళ్ళక్కూడా అర్థమవుతూంది. ఇంకా దేనికోసం ఎదురుచూస్తున్నాడు? ఎల్సీ పెళ్ళైపోతే నీకొక బాధ్యతైనా తిరుతుంది కదా?” అసహనంగా అన్నాడు.

నవ్వింది జేన్.

“ఇంతకు ముందే నీకు చెప్పాను ఫ్రాన్సిస్. బ్రాండన్ ఇదివరకే ఎల్సీని వివాహం గురించి కదిపాడు. అప్పుడది ఒద్దంది. ఇప్పుడు మళ్ళీ అడగాలంటే మొహమాటంగా వుంటుంది,  పైగా వాళ్ళిద్దరికీ ఒంటరిగా మాట్లాడుకునే సమయమూ సందర్భమూ కూడా వుండవు.”

“నేనైతే నా కిష్టమైన అమ్మాయి ఎదురుగా వుంటే చచ్చినా వదలను. ఎన్ని సార్లైతే అన్ని సార్లు ఎలాగో అలా వీలు చూసుకుని మాట్లాడతాను.”

“మళ్ళీ అడిగినా అది వొద్దంటుందని భయ పడుతున్నాడేమో! ఇప్పుడది ఒప్ప్పుకుంటుంది, కానీ ఆ సంగతి అతనికి తెలియదే!”

“ఓ పని చేయి! అతనడగడమే ఆలస్యం అని నువ్వు సూచన ప్రాయంగా తెలియచేయి. అర్థంలేని భయాలతో, మొహమాటాలతో చెల్లెలి భవిష్యత్తు పాడు చేయకు జేన్!”

“నువ్వన్నది నిజమే ఫ్రాన్సిస్. ఈ పరిస్థితిలో నేను పెద్దరికంగా  బాధ్యత వహించకపోతే దానికున్న ఒక్క అవకాశమూ పోతుంది. అయినా ఏదో సంకోచం నన్ను వెనక్కి లాగుతోంది. అదీ గాక అందరూ బ్రాండన్ హేరియట్ ని పెళ్ళాడతారని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎల్సీ గురించి ప్రస్తావిస్తే తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టు వుండదూ?”

“నన్నడిగితే బుద్ధున్న వాడెవడూ హేరియట్ ని పెళ్ళాడడు. మొహం కుదురుగానే వున్నా, అంతా కలిపి చూస్తే ఆమెలో ఎలాంటి సౌందర్యమూ కనబడదు నాకు. ఇంకా ఆవిడ వదిన గారు, లిలీ ఫిలిప్స్ చాలా అందంగా అనిపిస్తారు. ఆవిడ ఎప్పుడూ అలాగే వుంటుందా?” కుతూహలంగా అడిగాడు ఫ్రాన్సిస్.

నవ్వేసింది జేన్.

“ముఖ సౌందర్యం మాటెలా వున్నా, లిలీ ఫిలిప్స్ ప్రవర్తన నాతోనూ ఎల్సీతోనూ చాలా సార్లు అంద వికారంగా వుంటుంది. అది సరే, నిన్నొక విషయం అడగాలనుకున్నాను. ఇవాళ పొద్దున్నే పెగ్గీ అక్క కొడుకు, నా శిష్యుడూ, టాం లౌరీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. వూళ్ళో అందరూ నిన్ను ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారట కదా? నాకు నువ్వు చెప్పనేలేదీ సంగతి!””

“అదా! అసలు నాకా సంగతే గుర్తు లేదు. మెల్బోర్న్ నించి వచ్చిన వుత్తరమూ, దాని గురించి ఆలోచనా, డెంస్టర్ ఇంటికెళ్ళడమూ, వీటన్నిటి ధ్యాసలో పడిమరిచేపోయాను,” చిన్న పిల్లాడిలా నవ్వుతూ అన్నాడు ఫ్రాన్సిస్.

ఆ రోజుల్లో ఆడవాళ్ళకి పెద్దగా రాజకీయాల్లో ప్రవేశం వుండేది కాదు. అయితే జేన్ లా కొంచెం ఆసక్తి వున్న స్త్రీలందరూ, రాజకీయాల్లో భవిష్యత్తుని వున్నదానికంటే పెద్దదిగా వూహించుకునేవారు. జేన్ కూడా అలాగే ఫ్రాన్సిస్ పెద్ద రాజకీయ వేత్త అయిపోయినట్టూ, తమ వూరినీ, ఎస్టేటునీ ఆదర్శవంతంగా తీర్చి దిద్దినట్టూ, అందరూ అతనికి జేజేలు పలుకుతున్నట్టూ ఊహించేసుకుంది. తమ కుటుంబానికి చెందిన వాడూ, విద్యాధికుడూ, పది మందికీ మంచి చేసే ఆలోచనలున్నవాడూ, ఎన్నికల్లో పోటీ చేసి పార్లిమెంటులో అడుగుపెడితే, అంతకంటే కావలసిందేముంది, అనుకున్నదామె అమాయకంగా.

స్వతంత్రంగా ఏదీ సాధించలేని స్త్రీలందరి లాగే, ఆమె తన కలలన్నీ నిజం చేసుకోవడానికి శిష్యుడు టాం లౌరీనీ, స్నేహితుడు ఫ్రాన్సిస్ నీ ఎన్నుకుంది. తన ఆశయాలకీ, ఆదర్సాలకీ ప్రాణం పోసి నిలబెట్టగలిగే వారు వాళ్ళిద్దరే అనుకుంది. అందుకే ఫ్రాన్సిస్ రాజకీయ ప్రవేశం గురించి అంత ఉత్సాహపడింది. డబ్బూ, చదువూ, సంఘంలో హోదా వున్న మగవాడు రాజకీయాల్లో ప్రవేశించి మనుషుల జీవితాలు మార్చెయ్యాలిగానీ, మామూలు మగవాళ్ళలా పెళ్ళీ, ఇల్లూ, పిల్లలూ లాటి మామూలు ప్రలోభాలకు లోను కాకూడదన్నది జేన్ నిశ్చితాభిప్రాయం. అందుకే ఫ్రాన్సిస్ చూపులూ, మాటలూ, కళ్ళల్లో తన పట్ల ఇష్టమూ అన్నీ అర్థమయినా, వాటిని పట్టించుకోదలచుకోలేదు. అవి ఆమె కన్నె మనసుని ఎంత గిలిగింతలు పెట్టినా, ఏమీ తెలియనట్టే వుండాలని నిర్ణయించుకుంది జేన్.

     ***

(సశేషం)

మీ మాటలు

*