అందం, ప్రతిభా, వ్యక్తిత్వం = సుచిత్రా సేన్!

 suchitra-sen-best-bengali-bollywood-movies-list

మొన్న శుక్రవారము 17 జనవరి 2014 బెంగాలీ చిత్రతార ఒకటి అస్తమించినది.  82 ఏళ్లు నిండిన సుచిత్రా సేన్ ఇక లేరు. ఆమె నేటి బంగ్లాదేశ్‌లోని పాబ్నాలో 1931లో రొమా (రమ) దాస్‌గుప్తాగా జన్మించినది. ఎనిమిది పిల్లలలో (మూడు మగ, ఐదు ఆడ) ఆమె ఐదవది. ఆమె అసలు పేరు కృష్ణ, కాని బడిలో చేర్పించేటప్పుడు, వాళ్ల నాన్నగారు రమ అని పేరిచ్చారట. కొందరు ఆమె శాంతినికేతనములో విద్యాభ్యాసము చేసినదంటారు.

 

అతి రూపవతియైన ఆమెకు పదహారవ ఏడే పెళ్లయినది.  ఆమెకు సంగీతమంటే యిష్టము.  చలనచిత్రాలలో పాడాలని ఆమె కోరిక.  కాని ఆమె అదృష్టము మరొక విధముగా పరిణమించినది.  వెండి తెర మరుగున గాక, వెండితెర మీదనే ఆమెకు అవకాశము లభించినది. ఆమె మొదటి చిత్రము 1953లో విడుదల అయినది.  ఆమెకు దర్శకుడు నితీశ్ రాయ్ సుచిత్ర అని పేరు నిచ్చాడట. తరువాత ఆమె వెండితెరపైన సుచిత్రా అనే పేరుతో స్థిరపడినది. ఆమె తన నాన్నమ్మను నటనవిద్యలో గురువుగా భావించింది. ఆమె సుచిత్ర నటనను ప్రోత్సహించడము మాత్రమే కాక విమర్శించేది కూడ. ఆమెతో నాయకుడుగా ఉత్తం కుమార్ నటించాడు.  ఉత్తం, సుచిత్రాల జోడీ అలా 1953లో ఆరంభమైనది.  వాళ్లిద్దరు తరువాత ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు.  పెళ్లికి పిదప నటన ప్రారంభించి కొనసాగించిన నాయికలు అరుదు.  అట్టి అరుదైన నాయికలలో ఆమె ఒకతె, మరొకరు గడచిన వారము మరణించిన తెలుగు నటి అంజలీదేవి.

 

సుచిత్రా సేన్ బెంగాలీ చిత్రములో వహించిన పాత్రలను తెలుగులో సావిత్రి, హిందీలో వహీదా రహ్మాన్ పోషించారు. దీనిని బట్టి మనము బెంగాలీ చిత్రాలను చూడకపోయినా ఆమె నటనను గురించి ఊహించుకోవడానికి అవకాశము ఉంటుంది.  ఉత్తంకుమారుతో ఆమె జోడీ హిందీలో రాజ్‌కపూర్-నర్గీస్, తెలుగులో నాగేశ్వరరావు-సావిత్రి లాటిది. వారిరువురు నటించిన చిత్రాలను ప్రేక్షకులు అమితముగా ఆదరించారు.  ఏ కళాకారులకైనా ఆ కళను అనుభవించే రసికులు ఆదరిస్తే అంతకన్న కావలసినదేముంది?

 

ఆమె 52 బెంగాలి, ఏడు హిందీ చిత్రాలలో నటించింది. అందులో 30 చిత్రాలలో ఆమెతో కూడ ఉత్తంకుమార్ నటించాడు. అలా వారిరువురు నటించిన మొదటి చిత్రము సారే చూయతర్, చివరి చిత్రము ప్రియ బాంధవి.  ఆమె నటించిన కొన్ని గొప్ప చిత్రాలు – అగ్నిపరీక్ష (తెలుగులో మాంగల్యబలం), ఉత్తర్ ఫల్గుని (హిందీలో మమత), దీప్ జ్వేలే జాయ్ (హిందీలో ఖామోషీ, తెలుగులో చివరకు మిగిలేది), సాత్ పా కే బంధా, హిందీ చిత్రములు దేవదాస్, ఆంధీ. ఇందులో సాత్ పా కే బంధా చిత్రములోని నటనకు ఉత్తమ నటి పురస్కారము మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవములో దొరికింది.  అంతర్జాతీయ రంగములో అలాటి ఉత్తమ నటనా పురస్కారమును నర్గీస్ తరువాత అందుకొన్న భారతీయ మహిళ ఆమెయే.

 

ఆమె కుమార్తె మూన్ మూన్ సేన్, మనుమరాళ్లు రైమా, రియా. ఆమెకు పద్మశ్రీ, బంగభూషణ్ పురస్కారములు ఇవ్వబడినవి. చిత్రజగత్తునుండి విరమించిన పిదప హాలీవూడ్ నటి గ్రెటా గార్బోవలె ఆమె ఎవరి కళ్లకు కనబడక ఏ కొద్దిమందితో మాత్రమే సంబంధము నుంచుకొని రామకృష్ణ ఆశ్రమపు కార్యక్రమాలలో కాలము గడిపినది. బంగభూషణ్ బహుమతిని ఆమె తరఫున ఆమె కుమార్తె మూన్ మూన్ అందుకొన్నది.  ఢిల్లీలో బహుమతిని అందుకొనవలసి వస్తుందని భారత చిత్ర జగత్తులో అతి ప్రశస్తమయిన దాదాసాహేబ్ ఫాల్కే బహుమతిని కూడ నిరాకరించినదట.

 

ఆంగ్లేయ చిత్ర విమర్శకుడు Derek Malcolm అంటాడు – ” ఆమె నిజంగా చాల అందగత్తె, ఆమెలో ఒక స్థిర చిత్రములాటి భంగిమ ఉన్నది, ఆమె ఎక్కువగా నటించ నక్కర లేదు.”  సుచిత్రా సేన్‌ను ఒక గొప్ప “మహానాయిక”గా అందరు ఎందుకు పరిగణిస్తున్నారు?  దీనికి గల కొన్ని కారణములను మనము తెలిసికోవాలి.  ఆమె సౌందర్యవతి, అందులో సందేహము ఏమీ లేదు.  కానీ చలన చిత్ర నాయికలు చాల మంది అందగత్తెలే, కుందనపు బొమ్మలే. అందమొక్కటే చాలదు, నటనాకౌశల్యము కూడ కావాలి.  ఆ నటన సంభాషణలను హావభావములతో వల్లించుట మాత్రమే కాదు.  ఒక చూపుతో, ఒక శిరఃకంపనముతో, ఒక సైగతో, ఒక నిట్టూర్పుతో, ఒక చిన్న పెదవి విరుపుతో గుండె లోతులలో ఉండే అనుభూతులను బయటికి తేవాలి. రచయిత కల్పించిన పాత్రలో మమైకము కావాలి. దర్శకుని భావాలను అర్థము చేసికొని వాటికి తన ముఖమునే అద్దముగా పెట్టాలి.  సుచిత్ర గ్లిసరిన్ వాడదని చెబుతారు.  సెట్టుపైన వెళ్లినప్పుడు కన్నీళ్లు తనంతట వచ్చేవట.

ఆమెకు ఆత్మవిశ్వాసము ఎక్కువ.  అందుకే నాయకుల ఆధిక్యత ఉండే చిత్రరంగములో తన పేరును నాయకునికి సమానముగా ప్రదర్శించమని దర్శకులను, నిర్మాతలను అడిగి వారిని ఒప్పించినది.  అందుకే చిత్రములలో సుచిత్రా సేన్, ఉత్తం కుమార్ అని నాయకీనాయకుల పేరులను చూపేవారు, ఉత్తం కుమార్, సుచిత్రా సేన్‌లని కాదు. సత్యజిత్ రాయ్ ఆమెను తాను తీయాలనుకొన్న ఛౌధురాణి చిత్రములో నాయికగా ఎన్నుకొన్నాడు. కాని రాయ్ తన చిత్రములోతప్ప మిగిలిన వాటిలో ఆ చిత్రము పూర్తి అయ్యేవరకు నటించరాదన్నాడట. మిగిలిన దర్శకనిర్మాతల చిత్ర నిర్మాణమునకు అది అడ్డవుతుంది కనుక అందుకు సుచిత్ర ఒప్పుకోలేదు. ఒక వేళ అలా సత్యజిత్ రాయ్ చిత్రములో ఆమె నటించి ఉంటే అది ఎలా ఉండి ఉంటుందో అన్నది ఇప్పుడు ఊహాతీతమయినది. రాజ కపూర్ చిత్రములో నటించడానికి కూడ ఆమె నిరాకరించినదట.

Suchitra-sen6-400-x-300

ఆమె నటించిన కొన్ని చిత్రములను సంక్షిప్తముగా పరిశిలిస్తే ఆమెను ఎందుకు గొప్ప నటి అంటారో మనకు తెలుస్తుంది,  కథా పాత్రల వైవిధ్యమును మనము అర్థము చేసికొనవచ్చును. ఇందులో ఎన్నో చలన చిత్రాలు యూట్యూబులో చూచి ఆనందించవచ్చును.

 

అగ్నిపరీక్ష (1954) – మాంగల్యబలం తెలుగు చిత్రము చూసిన వారికి ఈ కథ విదితమే. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిలా జరిగినదానిని తండ్రి నిరాకరించాడు.  పెద్దైన తరువాత ఒక యువకుడిని చూసి ప్రేమించింది తపసి.  అతనిని పెండ్లాడుట సరియా కాదా అనే సందిగ్ధములో నున్నప్పుడు, ఆమె నాన్నమ్మ ఆమెకు సీతలా నీవు కూడ నీ అగ్ని పరీక్షలో కృతార్థురాలవుతావు అని చెప్పింది. చిన్నప్పటి గ్రామానికి వెళ్లగా అక్కడ తన ప్రేమికుడినే చూసింది.

 

దేవదాస్ (1955) – దేవదాసు కథ అందరికీ తెలిసినదే. ఇందులో పార్వతి పాత్రకు జీవం పోసింది సుచిత్ర. ఆ పాత్రలోని గాంభీర్యము, ఔన్నత్యము, ప్రేమ, ఆవేదన చక్కగా తన నటనలో  ప్రతిబింబము చేసినది. నాయకుడు దిలీప్ కుమార్‌తో సరిసమానముగా నటించి అతని ప్రశంసలు మాత్రమే కాక దర్శకుడు బిమల్ రాయ్‌చేత కూడ మన్ననలను అందుకొన్నది. ఉత్తమ నటిగా ఆమెకు బహుమతి దొరికినది.  చంద్రముఖిగా నటించిన వైజయంతిమాలకు ఉత్తమ సహాయనటిగా బహుమతి లభించినా, ఆమె తనకు కూడ ఉత్తమ నటి బహుమతి ఇవ్వలేదని తన బహుమతిని నిరాకరించినది.

 

రాజలక్ష్మి శ్రీకాంత (1958) – దీని కథ శరత్ వ్రాసిన శ్రీకాంత్ నవలలోని ఒక భాగము.  ఈ శ్రీకాంత్ నవల కొందరు శరత్ ఆత్మకథపైన ఆధారపడినదని చెబుతారు.  శ్రీకాంత్ నవలను నాలుగు భాగములుగా విడదీయవచ్చును.  శ్రీకాంత్ నవల అందులోని కథానాయకుడు తన జీవితములో ఎదుర్కొన్న నాలుగు స్త్రీలను గురించిన కథ.  వాళ్లు – అన్నదా, రాజలక్ష్మి, అభయ, కమలలత.  ఇందులో రాజలక్ష్మిని గురించిన ఉదంతము ఈ చిత్రము. శ్రీకాంత్ ఒక చోట నిలకడగా ఉండడు, ఒక విధముగా దేశదిమ్మరి. అలా ప్రయాణం చేసేటప్పుడు ప్యారిబాయి రూపములో తన చిన్ననాటి స్నేహితురాలైన రాజలక్ష్మిని మళ్లీ చూస్తాడు. వారి రాగద్వేషాలు ఈ చిత్రపు కథ.  ఇందులో రాజలక్ష్మి తపన, ఆసక్తి, ప్రేమానురాగలను సుచిత్ర చాల చక్కగా తన నటనలో చూపినది.

 

దీప్ జ్వేలే జాయ్ (1959) – ఈ చిత్రము తెలుగులో చివరకు మిగిలేది, హిందీలో ఖామోషీ అనే పేరుతో విడుదల అయినది. మానసిక రోగముతో బాధపడే ఒక వ్యక్తిని కాపాడబోయి అతనికి ప్రేమికురాలుగా నటించి నిజముగా ప్రేమలో పడినది ఒక నర్సు.  అతడు చికిత్స పొంది వెళ్లిపోయిన తరువాత అలాగే ఇంకొక రోగితో నటించినప్పుడు మళ్లీ ప్రేమలో పడి తాను కూడ చిత్త భ్రమను పొందుతుంది.  ఖామోషిలో నటించిన వహీదా తన నటన సుచిత్రా సేన్ నటనకు సరి తూగదని తానే చెప్పినదంటే సుచిత్ర ఎంత గొప్పగా నటించినదో ఈ చిత్రములో!

 

ఉత్తర్ ఫల్గుని (1963), మమతా (1966) – ప్రేమికుడు విదేశాలకు వెళ్లగా, పరిస్థితులవల్ల తండ్రి మరొకనితో పెళ్లి జరుపుతాడు. ఆ భర్త త్రాగుబోతు, తన భార్యనే అమ్మడానికి సందేహించడు, వాడిని వదలి పారిపోయి పన్నాబాయిగా మారుతుంది. తన కూతురిని ఒక క్రైస్తవ మొనాస్టరీలో వదలి వెల్లిపోతుంది. విదేశాలకు వెళ్లిన ప్రేమికుడు ఆమెను ఒక రోజు చూస్తాడు.  ఆమెను తన యింటికి పిలిపించుకొని పాట పాడిస్తాడు, కాని తన ముఖము చూపడు. పారితోషికాన్ని అతని కార్యదర్శి ఇవ్వబోగా ముఖముచూపని వారిచే పారితోషికము గ్రహించనని చెప్పుతుంది. తరువాత అతడే ఆమె కూతురు సుపర్ణ బాధ్యతలు వహించి ఆమెను విదేశాలకు పంపుతాడు. ఆమె కూడ బారిస్టరుగా తిరిగి వస్తుంది. తన మాజీ త్రాగుబోతు భర్త బ్ల్యాక్మెయిల్ చేస్తుంటాడు, అప్పుడు తన కూతురి భవిష్యత్తు పాడవ కూడదని వాడిని హత్య చేస్తుంది. ఆమెను తప్పించడానికి ఆమె ప్రేమికుడే వాదిస్తాడు, అప్పుడు ఆమె కూతురు ఆమె అపరాధి ఆమె శిక్షార్హురాలు అని చెప్పగా, అతడు ముద్దాయి ఎవరోకాదు, సుపర్ణ తల్లి అని చెబుతాడు.  తల్లిగా, కూతురిగా రెండు పాత్రలను సుచిత్ర ఈ చిత్రములో పోషించింది. తల్లి పాత్రలోని ఆవేదన, కూతురి పాత్రలోని చలాకీదనము రెంటిని బింబప్రతిబింబాలుగా ప్రదర్శించింది ఇందులో.

 

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

ఉత్తమ్ కుమార్ తో సుచిత్ర

సాత్‌పాకే బంధా (1963)  (హిందీలో కోరా కాగజ్) – పెళ్లి అనేది ఏడడుగుల బంధమే కదా? దానినిగురించిన కథ ఇది.  తండ్రి ఒక విద్యాధికారి, తల్లి మామూలు మనిషి, కూతురు అర్చనకు ఒక కళాశాల ప్రాధ్యాపకుడు సుఖేందుతో ప్రేమ. తండ్రి ఒప్పుకొంటాడు, తల్లికి ఇష్టము లేదు. పెళ్లి అవుతుంది. అర్చన తన భర్త సుఖేందును సంతృప్తిపరచడానికి ఎంతో కష్టపడుతుంది. కాని సుఖేందుకు భార్యను అర్థము చేసికోలేక పోయాడు.  వాళ్లిద్దరి మధ్య దూరము పెరుగుతుంది. తల్లి తన కూతురు ఒక పేద అధ్యాపకునితో కష్టపడుతుందని తాను వాళ్లిద్దరి మధ్య జోక్యము కలుగజేసికొంటుంది. చివరకు ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమించుకొంటున్నా కూడ విడాకులు తీసికొంటారు. ఐనా సుఖేందు రాకకోసం అర్చన ఎదురుచూస్తూనే ఉంటుంది.

 

ఆంధీ (1975) – సుచిత్రా సేన్ ఆఖరి చిత్రాలలో ఇదొకటి. ఇందులో ఆమె పాత్రకు, ఇందిరా గాంధీ జీవితానికి లంకె ఉన్నదని ఒక ప్రచారము ఉండేది. ఇందులో ఆమె వస్త్రాలంకారము, కేశాలంకారము మున్నగునవి కూడ దీనిని బలపరిచింది. ఇరవై వారాల తరువాత ఈ చిత్ర ప్రదర్శనను ఆపారు. అవి ఎమర్జెన్సీ రోజులు, ఈ తరము వారికి ఆ విషయాలు తెలియవు. కొద్దిగా సందేహము కలిగినా ఇలాటివి సర్వసామాన్యము ఆ కాలములో. కిశోర్ కుమార్ కాంగ్రెస్ మహాసభలో పాడడానికి నిరాకరించాడని అతని పాటల ప్రసారమునే ఆకాశవాణిలో ఆపిన దినాలు అవి!  తనకు  ఆదర్శవంతురాలైన నాయకురాలు ఇందిరా గాంధి అని సుచిత్ర పాత్ర ఇందిరా గాంధి చిత్రపటము ముందు చెప్పిన మాటలను చిత్రముతో జత చేసిన తరువాత మళ్లీ చిత్రాన్ని విడుదల చేయుటకు అనుమతించారు. తన తండ్రిచే ప్రోత్సహించబడి రాజకీయాలలో చేరి ఎన్నికలలో పోటి చేస్తున్న ఒక రాజకీయవాదిగా సుచిత్ర ఇందులో నటించినది. విడాకులు పొందిన భర్తను మళ్లీ కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు ప్రేమ మళ్లీ చిగిరింది. ఇందులోని ఆరతీదేవి పాత్ర నెరసిన వెండ్రుకలు, ఆమె కట్టుకొన్న చీరలు ఇందిరా గాంధీకి సరిపోయేటట్లు ఉండడము ఒక విశేషము.

 

ఆమె నటించిన చిత్రములలో నాకు నచ్చిన రెండు పాటలను మీకు జ్ఞాపకము చేస్తున్నాను –

 

(1) అగ్నిపరీక్ష చిత్రములోని కే తుమి ఆమారే డాకో అనే పాట ( – http://www.youtube.com/watch?v=xR6OllPrZ_U&list=PLE0072797BFB1F116 ). మాంగల్యబలములోలోని పెనుచీకటాయె లోకం పాట ఈపాటపై ఆధార పడినదే.

 

(2) మమత చిత్రములోని ఛుపాలో దిల్ మే యూఁ ప్యార్ మేరా (  http://www.youtube.com/watch?v=lZCHYFkED5M ). ఈ పాట పారసీక ఛందస్సు ముతకారిబ్ ముసమ్మన్ ముజాఫ్ మక్బూజ్ అస్లం ముజాయిఫ్ పైన ఆధారపడినది.  దీనిని గురించి అంతర్జాల పత్రికయైన మాలికలో నేను చర్చించియున్నాను.

 

ఒక తార భూమిపైన అస్తమయమై ఆకాశములో ఉదయించింది.  మరో ప్రపంచము అనేది ఉంటే అక్కడ దివంగతుడైన ఉత్తం కుమార్‌తో మళ్లీ నటించడానికి నాందీవాక్యమును సుచిత్రా సేన్ పలుకవచ్చును.

– జెజ్జాల కృష్ణ మోహన రావు

222121_10150170989267886_3694186_n

మీ మాటలు

  1. మంజరి.లక్ష్మి says:

    ఆంధీ సినిమా నాకు చాలా నచ్చిన సినిమా. అందులోనూ, మమతాలోను సుచిత్రాసేన్ నటన చాలా బాగుంటుంది. సుచిత్రాసేన్ భర్త, నాయనమ్మల పేర్లేమిటో రాయలేదు మీరు.

    • J K Mohana Rao says:

      సుచిత్రా సేన్ తలిదండ్రులు ఇందిరాదేవి, కరుణామయ్ దాస్‌గుప్తా, భర్త దిబా(వా)నాథ్ సేన్.

మీ మాటలు

*