క్యూ

మడిపల్లి రాజ్‍కుమార్

మడిపల్లి రాజ్‍కుమార్

* * *

1

జన్మాంతరం లో

చీమనను కుంటాను

చిన్నప్పటినుంచి

ఎన్నిసార్లు ఎన్ని క్యూలో……

కాళ్ల వేళ్లకు వేళ్లు మొలిచి పాతుకు పోయి

ఏ మాత్రం కదలని క్యూలు

2

వాచిని చూచి చూచి

వాచి పోయిన కళ్ళతోనే

క్షణాలను మోసి మోసి

కూలబడి పోతున్న పిక్కలకు

అవసరాల కర్రలు మోపి నిలబెడుతూ

ఎన్నెన్నెన్నె…..న్ని క్యూలో….?

3

ఏ పనీ లేకుండా

మిగతావన్నీ వాయిదా వేసి

ఒకే ఒక్క అవసరానికో లక్ష్యానికో

సమస్తం నన్ను ముడివేసిన ఎదురుచూపు

నలిపి నలిపి ఎంత వడి పెట్టినా

ఎండి ఎడారిలా మారిన నాలోంచి

ఏం రాలుతుందని

4

నా వెనుక పెరిగిన

కొమ్ములు వొంకలు తిరిగిన వాళ్లు

నా భుజాలనెక్కి… తలనెక్కి…

వడివడిగా వాడిగా

మున్మున్ము…ముందుకే

నేను మాత్రం వెనక్కి వెనక్కి….. నక్కి….క్కి… నెట్టబడుతూ

5

పెరుగుతున్న

నా నావాళ్ల అవసరాలూ కోరికలనూ

ప్రాధాన్య క్రమంలో

క్యూలో నిలబెడుతూ

అప్పుడూ

నా అవసరాలను ప్రతి నిత్యమూ

వెనక్కి వెనక్కి….. నక్కి….క్కి… నెడుతూ

కోరికలను జన్మాంతరానికి

వాయిదా వేసుకుంటూ…

క్యూ లోనే

వెనక్కి వెనక్కి….. నక్కి….క్కి… నెట్టబడుతూ

మడిపల్లి రాజ్‍కుమార్

మీ మాటలు

  1. knvmvarma says:

    చాలా బాగుంది …. మధ్యతరగతికి మరీ ఎక్కువ

  2. dasaraju ramarao says:

    ముందుగా తరంగ లో నీ పోయెం వచ్చినందుకు అభినందనలు.ప్రాధాన్యాతా క్యూని పసిగట్టడం, కోరికలను జన్మాంతరానికి నెట్టివేయడం బాగుంది…కాస్త వ్యంగంగా కూడా …

  3. Rammohan Rao says:

    ాజ్ కుమార్ గారు
    క్యూ పై అనుభవైకవెద్యమైన మధ్య తరగతి మనొవెదనని కవిత్వీకరిమ్చిన తీరు బాగుంది

  4. MADIPLLI RAJ KUMAR says:

    థాంక్యూ రామ్మోహన్ రావ్ గారు.

  5. చాలా బావుందండి..! మధ్య తరగతి బతుకు చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు.

Leave a Reply to MADIPLLI RAJ KUMAR Cancel reply

*