అనువాదం ఒక బిందువు…అంతే!

mukunda cover final

సాలెగూడుని ఒకచోట నుండి తీసి, మరొకచోట వేలాడ దీయడం, అనువాదం. ఎంత జాగ్రత్త పడ్డా అది మొదటి సాలిగూడు కానే కాదు. దాని అందం ఆకారం ఎంత పోతుందో, చూస్తే చాలు ఏవరికైనా తెలుస్తుంది. పైపైన ఎంత నష్టం జరుగుతున్నా, కేంద్రం చెడనంతవరకూ అది జీవంతో ఉన్నట్టే.  కవిత్వానువాదమూ అంతే. సాలెపురుగు తన గూడుని అవసరంకొద్దీ మళ్లీ సరిచేసుకున్నట్టు, ఫలితం ఎప్పుడూ సమగ్రంగా ఉండకపోయినా, శతాబ్దాల తరబడి, అనువాదకుడు అనువాదాలు చేస్తూనే ఉన్నాడు. 

 

ప్రేమ, విశ్వాసం, దుఃఖం, అహంకారం లాంటి భావావేశాలు చాలా వరకూ అన్ని భాషల్లోనూ ఒకటే కావడంతో అవి అనువాదానికి సులువు. దేశభక్తి మూల్యాలు, రాజభక్తి అనుసరణలు లాంటివి ఆయా సంస్కృతుల్లోనే అర్ధం చేసులోగలం. అంత లోతుగా వాటిని అర్ధం చేసులోలేకపోయినా, అనుభూతులు స్థలాలు ఊహించుకుని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.  ఎక్కడివైనా, ఎలా ఉన్నా, ఏ భాషలోనైనా, రంగు వాసన ఆకరాలు వేరైనా,  పూలు పూలే.  కవిత్వమూ అంతే! నాకు నచ్చినవి , అనువాదం చేయగలను అనుకున్నవి , విశ్వజనీనమైనవి, నాకు తెలిసి అంతకుముందు తెలుగులో అనువాదం కానివి, ప్రాముఖ్యం పొందినవి మాత్రమే నేను అనువాదానికి తీసుకున్నాను. అనువాదం చేసిన కవితలన్నీ ఆంగ్లానువాదాలనుండి తీసుకున్నవే. ఎవరో ఒకరు ఏదో ఒక కవిత ఇచ్చి నన్ను అనువాదం చేయమంటే నేనది నా సంతృప్త్తి మేర బహుశా నేను చేయలేక పోవచ్చు. ఆ కారణంగానే నా ప్రణళికలో దొరికిన కవితల్ని మాత్రమే చేస్తున్నాను. అవి చాలావరకు నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తున్నాయి.

 

మూలానికి విధేయుడిగా ఉండే ప్రయత్నమే ఎక్కువ చేసాను. భావాన్ని అనుసరించి స్వేచ్ఛ తీసుకున్నవి చాలా తక్కువ. అనువాదమే అయినా దాదాపు మన కవిత్వమే అనిపించే ప్రయత్నం మాత్రం ఉద్దేశపూర్వకంగానే చేసాను. అలాగే అందరికీ అర్ధమయే రీతిలో  ఉండాలనుకున్నది మరొకటి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనువాదం అనువాదమే. అందులోనూ కవిత్వ అనువాదం, కవి తన కవిత్వాన్ని తానే చేసుకున్నా, స్వయానా ఆ కవికే అంత సంతృప్తి నివ్వక పోవచ్చు. అలా అని అనువాదాలు చేసుకోకపోతే, ఇతర భాషల్లోని గొప్పతనాలు ఆ కాసింతైనా మనకు తెలియకుండా పోతాయి.

 

అయితే ఏ అనువాదమూ సర్వ సమగ్రం కాదు. ఏ అనువాదమూ అందరినీ సంతృప్తి పరచలేవు. మూల భాషనుండి వచ్చిన అనువాదాల్లో కూడా అనేక భాషాంతరాలున్నాయి. ఒకే కవిత అనువాదం వివిధ అనువాదకులు చేసింది, ఆశ్చర్యంగా వేటికవే భిన్నంగా ఉన్నాయి. చేసిన వారందరూ ప్రసిద్ధ కవులూ, అనువాదకులే అయినా, ఎవరి అనువాదం సరైనది, ఎవరిది కాదు అన్న సందిగ్ధం నన్ను ఒక్కోమారు ఇబ్బందుల్లోకి నెట్టేది. వాటన్నింటిలో ఉన్న భావార్ధం చాలా వరకూ ఒకటే ఉండటంతో ఆ కవిత ఆత్మని అవి పట్టిచ్చేవి. అది ఆధారంగా చేసుకుని అనువాదం చేసినవీ ఉన్నాయి. చెప్పొచ్చేదేమిటంటే భావార్ధం చెడనంతవరకూ ఏ అనువాదమయినా భరించగలమన్నదే. మూల భాషనుండి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుండి తెలుగులోకి వచ్చిన అనువాదాలు రెండు వంతెనల్ని దాటొచ్చినవి.మొదటి వంతెనలో లోపాలతో బాటు (ఏమన్నా ఉంటే) రెండవ వంతెనలో లోపాలు కాడా తోడయితే, ఆ అనువాదం ఎంత లోపభూయిష్టంగా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు.   మూలంలో లేనిది అనువాదంలో కనిపించినపుడు అది మూల రచయితకే కాదు, ఆ మూలం తెలిసిన ఎవరినైనా ఇబ్బందిపెడుతుంది.

 

ఎవరెంత అద్భుతంగా చేసినా, మూల భాషలోని సౌందర్యాన్ని సంగీతాన్ని అనువాదంలో తేలేకపోవడమే అనువాద ప్రక్రియలోని అతి పెద్ద విషాదం.

 

చేయాలనుకుంటే సముద్రమంత సాహిత్యం అనువాదకుడి ముందుంటుంది. ఎంత చేసినా అందులో కొన్ని బింధువుల్ని మాత్రమే స్పృశించగలుగుతాడు. వాటిల్లో నచ్చినవి కొన్నయితే, నచ్చనివి ఇంకొన్ని. నచ్చనంత మాత్రాన అవి మంచి కవితలు కావని చెప్పలేము. అలాగే అనువాదం చేయగలిగినవి కొన్నయితే, అనువాదం చెయలేనివి ఇంకొన్ని. కవుల, ఆంగ్ల కవిత్వానువాదాలు సంపాదించగలగడం ఒక కష్టమయితే, చదివిన వాటిల్లో కవితల్ని ఏరుకోవటం మరొకటి. అనువాద కష్టాలు ఎలాగూ తప్పనివి. తీరా ఇంతా చేసాక సంతృప్తి నిచ్చిన వాటినే నలుగురితో పంచుకోగలం కదా! అనువాదం చేసినా అలా ఏదో కొంత అసంతృప్తి మూలాన వదిలేసిన కవితల సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

 

మంచి సాహిత్యం ఎక్కడైనా అర్ధవంతమైనదే. అలా కాని పక్షంలో రూమీ, హఫీజ్, లీపో, వాంగ్ వెయి, హూ షీ, పాబ్లో నెరూడా, యెహూదా అమీహాయి, షేక్స్ పియర్, చెస్వ మిలోజ్, ఎమిలీ డికిన్సన్, ఖలీల్ జీబ్రాన్ లాంటి వారి కవిత్వాల్ని ప్రపంచవ్యాప్తంగా అనువాదంలోనైనా ఎందుకు చదువుతారు. గొప్ప సాహిత్యానికున్న విశ్వజనీనత మూలంగా, అవి సమయానికి, స్థానికతకు, భాషకు, సిద్ధాంతాలకు అధిగమించి మొదట ప్రచురించబడ్డ దగరనుంచి శతాబ్దాలతరబడి నిలబడగలుగుతాయి. అస్పష్టతగా ఉన్న కవితలే అనువాదాల్లో ఎక్కువ ఇబ్బంది పెట్టేవి. నైఘంటుక నిర్మాణాత్మక విషయాల్లోను ఒక సందిగ్ధ స్థితి ఎదుర్కోవల్సి వచ్చేది. జాతీయాలు, సహసంబంధమున్న పదాల అనువాదంలోను సరైన సమజోడీలు దొరకనపుడు, తట్టనపుడు పడ్డ ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు.

 

ఏ కవితైనా మనసులో ఇంకేవరకూ అనువాదానికి లొంగేది కాదు. సాంస్కృతిక, భాషాపరమైన, రసజ్ఞాన సంబంధమైన విషయాలపట్ల ఇబ్బందులతో బాటు, భాషా పరిజ్ఞానం లాంటి పరిమితుల మూలంగా కూడా కొన్ని కవితలు నెలలతరబడి తీసుకున్నవీ ఉన్నాయి. అనువాదమైనాక ఆ కవితలోని అందం కవిత్వం మరింత ఆనంద పరిచిన సన్నివేశాలూ ఎక్కువే. అనువాదం ఒకవిధంగా లోతుగా అతి సన్నిహితంగా చదవడం లేదా ఆ మూలానికి లొంగిపోవడం లాంటిది. అందుకే బహుశా మామూలుగా చదివినప్పటికంటే అనువాదం చేసినపుడు ఆ కవిత అర్ధమైన విధానం ఆశ్చర్యపరుస్తుంది.

 

అనేకమంది కవుల్ని విస్తృతంగా చదివి ఆనందించడం నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఆ అదృష్టాన్ని అందరితో పంచుకోవాలన్న ప్రయత్నమే అనువాదం. నేను లాభ పడిన దానిలో ఏకొద్దిగానైనా అందరితో నేను పంచుకోగలిగితే, అదే నాకు ఆనందాన్ని కలగజేసే అంశం.

 

మనం రాస్తున్న మాటాడుతున్న  ప్రతీదీ అనువాదమే, ఔనన్నా కాదన్నా అన్ని అనువాదాలూ ఒక విధంగా సృజనే. ఎన్ని కష్టాలు పడ్డా, అందరినీ సంతృప్తి పర్చలేకపోయినా,  అనువాదకుడు తన అనువాదాలను చూసి, అందుకే స్వీయ రచన చేసినంత సంబరపడతాడు.

 

ఏది ఏమైనా అనువాదకుడు ఎరువుతెచ్చుకున్న కాంతిని అందరికీ ఆనందంగా పంచుతున్న చంద్రుడని నేను భావిస్తాను.

 

–          ముకుంద రామారావు

మీ మాటలు

  1. పాలపిట్టలో వ్యాసాలుగా వచ్చిన రోజుల్లోనే ఆ శీర్షిక ఎందరినో ఆకర్షించింది. ఇలా ఒక పుస్తక రూపంలో దీన్ని తీసుకురావడం బాగుంది. దాచుకోదగ్గ పుస్తకం. వెల్చేరు గారనట్టు, అరచేతిలో విశ్వ సాహిత్యాన్ని ఉంచిన అరుదైన వ్యాసాల సంకలనమిది. టాగోర్ మొదలుకుని ఏట్స్ వరకూ ఎందరు కవులు, ఎన్నెన్ని విశేషాలూ, ఎంచక్కని కవితలూ..

    “రెండవరాక”లో ప్రస్తావించినది నరసిమ్హ స్వామి గురించి అనీ, టాగోర్ అందించిన వివరాలను ఏట్స్ అలా వాడుకున్నారనీ, పుస్తకంలో చదివి చాలా ఆశ్చర్యపోయాను.
    అలాగే మొట్టమొదటి నోబుల్ సాహిత్య బహుమతి కవిత్వానికే రావడం, అదీ ఒక విఫల ప్రేమలో ప్రభవించిన కవిత్వమవడం, నెరుడా వ్యక్తిగత జీవిత విశేషాలు, భారతీయ మూలాలు ఉన్న ఇతర నోబుల్ కవులు..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్న విశేషాలు ఎన్నో,ఎన్నెన్నో!

    ఇంత చక్కని పుస్తకాన్ని గురించి రచయిత మళ్ళీ ఏమైనా చెప్పారేమో నన్న ఆసక్తితో ఈ వ్యాసాన్ని చూస్తే, ఇది పుస్తకంలోని ముందు మాటే. ఆ మేరకు ఒకింత నిరాశ.

మీ మాటలు

*