ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 7 వ భాగం

(గత వారం తరువాయి)

7

బయట వర్షం కురుస్తూనే ఉంది…ఎడతెగకుండా
రామం గబగబా వచ్చి ఎప్పట్నుండో బార్నెస్‌ అండ్‌ నోబుల్స్‌ బుక్స్‌లో ఎదురుచూస్తున్న క్యాథీ ఎదురుగా కూర్చుని.. ”ఎక్స్‌ట్రీమ్లీ సారీ…ఫర్‌ లేట్‌..”అని గొడుగును ప్రక్కన డస్ట్‌బిన్‌పైపెట్టి.. అమె ముఖంలోకి చూచి.,
”ఎగ్జిక్యూటివ్స్‌ ఎప్పుడూ సమయపాలన చేస్తారుగదా” అంది..అని ”ఎప్పుడో కాఫీ చెప్పా..అరగంటయింది. తెస్తానుండు” అని లేచి కాఫీ కౌంటర్‌వద్దకు నడిచిపోయింది.

క్యాథీని చూస్తే వర్తమాన తరంలో సాధారణ అమెరికన్‌ యువతులు చేసే వెర్రిమొర్రి లక్షణాలేవీ కన్పించవెప్పుడూ. రోజురోజూకూ ప్రపంచవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న విషసంస్కృతికి కొనసాగింపుగా అమెరికన్‌ విద్యార్థుల్లో కూడా విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. శరీరాన్ని గరిష్టంగా బహిరంగపర్చే వస్త్రధారణ…అసలు ఒంటిపై వస్త్రాలే లేనట్టు..బికినీకంటే కొద్డిగా మెరుగైన కురుచ నిక్కర్‌, పైన ఒక బ్రాను తలపించే అప్పర్‌.. మిగతా అంతా బహిరంగమే. ఎండాకాలమైతే మరీ నగ్నవిహారం. ఒంటిపై టట్టూలు శరీరంపై అక్కఅక్కడా  మెరిసే హాంగింగ్సు, ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నఖ సౌందర్యం., ఐతే ఇదంతా విద్యావిషయంగా ఉండవలసినంత శ్రద్దలేని ఎక్కువమంది స్థానిక అమెరికన్లలో. మరీ హద్దులు మీరి నల్ల అమెరికన్‌ యువతలో, ఎందుకో వీళ్ళలో చదువుపట్ల సహజంగానే ఆసక్తి తక్కువ. పాఠశాలలోకూడా విద్యా విషయక అంశాలకంటే నాన్‌ కర్రికులర్‌ యాక్టివిటీస్‌…పెయింటింగు, ఫీల్డ్‌ విజిట్స్‌, లెర్నింగు త్రూ లైబ్రరీ, అర్ట్‌ అండ్‌ మ్యూజిక్‌, వాచ్‌ అండ్‌ లెర్న్‌ విధానాలే ఎక్కువ. ఎకడమిక్‌ పాఠ్యాంశాల సాంద్రత, లోతు తక్కువ. తను పరిశీలించినంతవరకు యిక్కడ తయారవుతున్న విద్యార్థుల్లో ఎనభైశాతం సగటుకన్నా తక్కువ ప్రమాణాలు, మిగతావాళ్ళలో ఐదు నుండి పదిశాతం నాణ్యమైన పిల్లలు కనిపిస్తున్నారు. వీళ్ళది స్లో అండ్‌ స్టడీ ప్రాసెస్‌. భారతదేశంలో క్విక్‌ అండ్‌ రన్‌ విధానం. అమెరికా జనాభాలో ఒక శాతం ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల్లో బాలలు యిక్కడి అనేక విద్యా విషయక రంగాల్లో ప్రతిభావంతులుగా రాణిస్తూండడం ఒక చిత్రమైన విశేషం…ఉదాహరణకు ప్రతి సంవత్సరం జాతీయస్థాయిలో యిక్కడ నలభైవేల డాలర్ల నగదు, జ్ఞాపికతో గౌరవిస్తూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘నేషనల్‌ స్పెల్లింగు బీ అవార్డు’ పోటీల్లో గత పన్నెండేండ్ల కాలంలో ఎనిమిదిసార్లు భారతీయ బాలలే విజేతలు కావడం ఎంతో ప్రతిభావంతమైన సాధనగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
ఐతే భారతదేశంలో అనుకుంటున్నట్టు యిక్కడి సంస్కారవంతులైన యువతులెవ్వరూ అర్థనగ్న వస్త్రధారణ చేయరు. మోకాళ్ళదాకా స్కర్ట్‌, పైన బుష్‌షర్ట్‌పై ఓవర్‌కోట్‌..అలా చూడ్డానికి గంభీరంగా, గౌరవనీయంగా ఉండే పద్ధతిలోనే కనిపిస్తారు.
క్యాథీ తనకు మొట్టమొదట పరిచయమైననాటినుండి ఎప్పుడూ పరిపూర్ణమైన వస్త్రధారణతోనే కనిపించింది..అంటుంది… రామం పాత అమెరికా సినిమాలు చూడు గాడ్‌ ఫాదర్‌, గాన్‌ విత్‌ ద విండ్‌, సౌండాఫ్‌ మ్యూజిక్‌..అమెరికన్‌ స్త్రీ వేషభాషలు ఎంత ముచ్చగా ఉంటాయో..ఐ లైకిట్‌…అని.
నిజంగానే ప్రత్యేకమైన అభిరుచి, తత్వంగల స్త్రీ ఈమె. రెండు చేతుల్లో రెండు పొడవాటి కాఫీ కప్స్‌తో, రాపర్స్‌తో, నాప్‌కిన్స్‌తో సహా తీసుకుని వస్తూ,”ఏయ్‌” వై డోన్ట్‌ యు హెల్ప్‌ మీ..”అంది దగ్గరగా వస్తూ,
ఉలిక్కిపడ్డ రామం ”సారీ..”అంటూ ఆమె చేతిలోని సరంజామాను అందుకుంటూండగా,
”నువ్వు అబ్సెంట్‌మైండెడ్‌గా ఉన్నావెందుకో’ ఈరోజు” అందామె.
”ఔను క్యాథీ..ఐ లాస్ట్‌ మైసెల్ఫ్‌ టుడే..హైలీ డిస్టార్టెడ్‌..ఎందుకో నా గతం ప్రొద్దట్నుండీ నన్ను వెంటాడ్తోంది.
”అది తుపానుముందటి అలజడి…ఎ గేల్‌ బిఫోర్‌ ది హర్రికేన్‌”
”ఔననిపిస్తోంది నాక్కూడా”..ఎంత ఖచ్చింగా మనిషిని చదువుతుందీమె అనిపించింది రామంకు.
”అమృతం కురిసిన రాత్రి జ్ఞాపకముందా..”
”ఊఁ…తిలక్‌ కవిత్వంకదా..”
”ఔను..వెన్నెల్లో….”
‘వసుధైక గీతం’ లో అంటాడు,
‘భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది
భ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది
ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
సూర్యుడుని చూడు నా తలమీద పువ్వు
అట్లాంటిక్‌ కల్లోల తరంగాల మేను వాల్చింది నేను
పసిఫిక్‌ లోతులలో రత్నాల్ని వెదికి తీసింది నేను
ఉత్తర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరోపాదం
సర్వంసహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను-‘
”…వలె మన జీవితంలో కూడా ఎంతో ప్రధానమైందీ వర్షం కురుస్తున్న రాత్రి..జ్ఞాపకముందా..మనం మొట్టమొదట కలుసుకున్నది వర్షం కురుస్తున్న రాత్రే..మనం తర్వాత సన్నిహితంగా దగ్గరైన ప్రతి కలయికా వర్షం కురుస్తున్న సందర్భమే.. హైద్రాబాద్‌లో మన ‘రామం’ కంపెనీని ప్రారంభించిందీ ఎడతెగని వర్షం కురుస్తున్న రోజే..యిప్పుడు అత్యంత కీలకమైన మనిద్దరి జీవితాల దిశను నిర్ణయించుకుందామనుకుని సమావేశమైన ఈ రాత్రి..ఇప్పుడుకూడా వర్షం కురుస్తున్న రాత్రే.. ఐ లైక్‌ రెయి..చిన్నప్పుడు రైన్‌ రైన్‌ గో ఎవే అనే పాటను రైన్‌ రైన్‌ కంకం, డోన్ట్‌ గో ఎవే బట్‌ అల్వేస్‌ స్టే అని పాడేదాన్ని..”

8
”ఊఁ…”    నిజంగా రామంకు కూడా చాలా ఉద్వేగంగా ఉంది..ఈ రాత్రి తామిద్దరూ కలిసి తమ భవిష్యత్తును, సాధించవలసిన కఠోరమైన యాత్ర తాలూకు పథకాల రూపకల్పననూ పూర్తి చేయాల్సిఉంది. అందుకే గతవారంనుండి క్యాథీకి ఈనాటి ఈ కలయిక గురించి ప్రత్యేకంగా చెబుతూ వస్తున్నాడు. తను తన మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ క్యాథీ సమగ్రంగా చదివింది. నిజానికి తన గురించి తనకంటే ఎక్కువ క్యాథీకే తెలుసు. అందుకే ఒక అనుచరురాలిగా ప్రణాళికారచన బాధ్యతను ఆమెకే అప్పగించాడు.
ఐతే.. జరుగవలసిన చర్చకు…లోతుగా ఆలోచించి తీసుకొనవలసిన నిర్ణయాల తాలుకు తుది రూపమివ్వడానికి ఈ బార్నెస్‌ పుస్తకశాల వేదిక  కాదు..కలుసుకోడానికి మాత్రమే క్యాథీని యిక్కడికి రమ్మన్నాడు రామం..ఐతే..డిస్టర్బయి.. మనసంతా వికలమై.,
రామం ఎంత దాచుకుందామన్నా..యిక సాధ్యంకాక బయటికి తన్నుకొచ్చే జీవిస్తున్న ”లీల” తాలూకు జ్ఞాపకం మనసుతెరపై ప్రత్యక్షమైంది.
వద్దు..వద్దు..వద్దు..లీల బాపతు ఏ జ్ఞాపకాలూ వద్దు..ఆమెకు సంబంధించిన ఏ సంఘటనలూ స్మతిపథంలో వద్దు.. తను భరించలేడు..లీలయొక్క ఏ ప్రస్థావన హృదయంలో పొటమరించినా ఎందుకో శరీరమంతా ఒక కల్లోల సముద్రమై కంపిస్తోంది. చలించిపోతున్నాడు తను. బలవంతంగా లీల జ్ఞాపకాల్ని పక్కకు జరిపి.. నెట్టి.. మూసేసి,
”క్యాథీ..మనింటికి పోదాంపద ”
”… ఎందుకలా డిస్టర్బ్‌గా ఉన్నావ్‌ రామం..యువార్‌ నాట్‌ స్టేబుల్‌”
”యువార్‌ రైట్‌..ఎట్‌ లెటజ్‌ గో..” లేచాడు రామం ఆమె జవాబు కోసం ఎదురుచూడకుండా…అప్పటికి వాళ్ళు కాఫీ టబ్స్‌లోనుండి సగంకూడా తాగలేదు. అతనికి క్యాథీ కాఫీ తాగుతోందా..తాగిందా అన్న గమనింపుకూడా లేదు చకచకా తెచ్చుకున్న గొడుగును కూడా అక్కడే వదిలి బయటికి నడిచాడు. క్యాథీ అతనివైపు చిత్రంగా, కొద్ది ఆందోళనగా చూచి.. ఏమైందితనికివ్వాళ అనుకుంది. రామం గొడుగును ఆమె చేతిలోకి తీసుకుని బయటికి…అతని వెనకాల నడిచింది.

(సశేషం)

మీ మాటలు

 1. Dr.shyaamala.k says:

  ‘వసుధైక గీతం’ లో అంటాడు,
  ‘భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది
  భ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది
  ఈ వేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
  సూర్యుడుని చూడు నా తలమీద పువ్వు
  అట్లాంటిక్‌ కల్లోల తరంగాల మేను వాల్చింది నేను
  పసిఫిక్‌ లోతులలో రత్నాల్ని వెదికి తీసింది నేను
  ఉత్తర ధృవాన ఒక పాదం దక్షిణ ధృవాన మరోపాదం
  సర్వంసహా చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను-

  తిలక్ కవిత్వాన్ని ఒక అమెరికన్ యువతి నోటినుండి వినిపించిన మౌళి గారి పాత్ర సృజన అపూర్వమ్.థాంక్స్.
  Dr.Shyaamala.k new jersy ( usa)

 2. సారంగ పత్రిక వారికి నమస్కారములు … రామాచంద్ర మౌళీ గారి నవల ఎంతో ఆకట్టుకుంటూ సాగిపోతున్నది ….బాల గంగాధర్ తిలక్ కవిత్వం …నెమరు వేసుకుంటూ …,,మరో పక్కన ఆమెరికా జనాభాలో ఒక శాతం ఉన్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల్లో …ముఖ్యం గా బాలలు ఆనేక రంగాల్లో రాణి స్తుండటం ….ఈ విషయాలు ప్రస్తావించటం .. ఇక్కడ అమెరికా లో ప్రస్తుతం ఈ జీవితాలు పరిశీలిస్తున్న నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నది …

 3. రామాచంద్ర మౌళీ గారి నవల చాల ఆద్భుతం గా వున్నది ..ఒక పక్కన భారతీయ సామాజిక సంవేదనా స్ఫూర్తి , …… మరో పక్కన ఆమెరికా లో రామం ,క్యాతీ పాత్రల్లోని సంభాషణ ఆకట్టుకుంటూ …ధన్య వాదములు .

మీ మాటలు

*