మా వంగూరి హౌస్, రేడియో సావిడి, సమ్మర్ హౌస్!

chitten raju

పుట్టిన ఇంట్లోనే గిట్టే దాకా ఉండడం పల్లెటూళ్ళలో మామూలే. ఉద్యోగాలలో బదిలీల మీద వేరే నగరాలకి పోవడం, ఒకే ఇంట్లో కొన్నేళ్ళు అద్దెకున్నా అనేక కారణాలకి ఇల్లు మారడం, సొంత ఇల్లు ఉన్నా చదువులకి పై ఊళ్ళు వెళ్ళవలసి రావడం వగైరా అనేక కారణాల వలన దశాబ్దాల కొద్దీ ఒకే ఇంట్లో ఉండడం పట్నం వాసులకి అరుదే అని అందరికీ తెలిసినదే. కానీ నా విషయంలో పుట్టిన ఇంట్లోనే పెరిగి, ఇంజనీరింగు డిగ్రీ చదువు పూర్తయే దాకా ..అంటే 21 సంవత్సరాలు కాకినాడలో మా “వంగూరి హౌస్” లోనే గడపడం నా అదృష్టమే!

1925 లో ఆ ఇల్లు ఆ నాటి ఇళ్ళ నమునాని తలపిస్తూ ముందు ఒక వరండా, నాలుగు స్తంభాలు, లోపల వాస్తు ప్రకారం ఆగ్నేయం మూల వంట గది, మరొక పక్కన రోజుకి ఇరవై నాలుగు గంటలూ బొగ్గుల మీద వేడిగా కాగుతున్న యాభై గేలన్ల పాల కుండ,   పక్కనే పూజ గది, ఆనుకుని ఆవకాయలు పెట్టుకునే అటక తో సహా ఊరగాయల గది, ఏడాదికి సరిపడా ధాన్యం నిలవ చేసుకునే కొట్టాం తో సహా పప్పులూ, వంట దినుసులూ అమర్చుకునే ఒక పెద్ద స్టోర్ రూమూ, వెనకాల భోజనాల వరండా, నాలుగు పడక గదులు, ఈ రోజుల్లో లివింగ్ రూమ్ అన దగ్గ మధ్య గది,  నగలు, నట్రా, వెండి కంచాలు  దాచుకునే భోషాణం గదీ, ముందు వరండాకి పక్కన ఒక అతిథి గది , వెరసి పది గదులతో ఆ “చిన్న” పెంకుటిల్లు తాత్కాలికంగా ఒక ఔట్ హౌస్ లా కట్టారు మా తాత గారు. అంత విశాలమైన స్థలంలో పెద్ద ఇంట్లో పుట్టి, పెరిగిన నాకు ఈ రోజుల్లో అందరూ “మేము త్రీ బెడ్ రూమ్ – త్రీ బాత్” ఫ్లాట్  కొనుక్కున్నాం అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటే “అదోలా” ఉంటుంది. 1980 లలో తీసిన ఆ ఇంటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఎదురుగుండా పెద్ద గుండిగల వెనకాల కిటికీ మా గెస్ట్ బెడ్ రూమ్. ఆ గదిలోనే ఉండి మా బంధువులు (మా సూరీడు బాబయ్య గారు, చిట్టెన్ రాజు బాబయ్య, హనుమంత రావు బావ, అబ్బులు బావ..వగైరా) అనేక మంది చదువుకున్నారు. సరిగ్గా ఆ గదికి వరండా అవతలి వేపు ఉన్న గది మొదట్లో మా తాత గారి గది. ఆయన పోయాక అది “పురిటి గది” అయిపోయింది. మా అన్నదమ్ములు, అప్పచెల్లళ్లతో సహా  మా బంధువులలో కనీసం వంద మంది అయినా ఆ గదిలో పుట్టారు. ఈ ఫోటో లో అక్కడ గోడకి ఆనుకుని కూచున్నది మా అమ్మ.  ఇంటి ముందు ఠీవిగా ఉన్నది మా మామిడి చెట్టు అని వేరే చెప్పక్కర లేదు.

Kakinada Home

ఆ ఇల్లు కట్టిన ఏడాదికి మా నాన్న గారికి పెళ్లి అయింది. మరో నాలుగేళ్ళ తరువాత వరసగా పిల్లలు పుట్టుకు రావడంతో 3600 గజాల స్థలంలో ఉన్న ఆ పది గదుల ఇల్లు కూడా  సరిపోక పోవడంతో మా నాన్న గారు అదే ఔట్ హౌస్ పద్ధతి ని కొనసాగించి పురిటి గదికి అవతలి వేపు ఒక పెద్ద గది, దాని మీద పైన పెంకులని ఆనుకుని ఒక చిన్న డాబా వేయించారు. ఆ డాబా చిన్నదే కానీ సుమారు ఇరవై మంది పిల్లలం ఇరవై వేసవి కాలాలు ఆ డాబా మీద రొజాయిలు వేసుకుని, కబుర్లు చెప్పుకుంటూ, నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూ గడించిన అనుభూతులు చాలా గొప్పవే! ఆ డాబా మీద పడుకునే నుంచే నేను ఒక నెల పాటు ఒక తోక చుక్క గమనాన్ని చూసాను.  ఇప్పటికీ, ఎప్పటికైనా అదృష్టవశాత్తూ చీకటి రాత్రి పూట ఆకాశం లోకి చూడగలిగితే  నక్షత్ర సమూహాల పేర్లు, కొన్ని గ్రహాలనీ గుర్తు పట్టగలను. ఆ డాబా మీదకి చొచ్చుకు వచ్చిన సీతా ఫలం చెట్ల నుంచి తాజాగా కోసుకున్న పళ్ళ రుచి నాకు యింకా జ్జాపకం వస్తూనే ఉంటుంది.  ఇక ఉన్న ఇంటికీ ఆనుకుని ప్రహరీ గోడ వెంబడి రెండు పడక గదులు, మధ్యలో హాలు కట్టించారు. ఇది ఎలాగా తాత్కాలికమే కదా, పెద్ద మేడ ఎలాగా కడతాం కదా అని పెంకుల బదులు ఈ నాలుగు గదులకీ పైన ఎస్బేస్టస్ రేకుల తో పై కప్పు వేయించారు. ఈ గదుల సమాహారానికి “రేడియో సావిడి” ని పేరు.

రేడియో సావిడిలో అక్క

రేడియో సావిడిలో అక్క

“రేడియో సావిడి” అనే పేరుకి కారణం స్పష్టంగానే తెలుస్తున్నా ఆ పేరు రావడానికి ఒక పిట్ట కథ ఏమిటంటే  నాకు సుమారు పదేళ్ళు వచ్చే దాకా మా జీవితం “అంధకారం” లోనే గడిచింది..అనగా మా పెద్ద చెల్లెలు భానుమతి పుట్టిన ఏడు మా ఇంటికి కరెంటు వచ్చింది. అంత వరకూ చీకటి పడేటప్పటికల్లా పదో, పదిహేనో కిరసనాయిలు లాంతర్లు, ఐదో, ఆరో పెట్రో మాక్స్ లైట్లూ ఆదరాబాదరాగా వెలిగించుకోవడం, వెలుగు ఉండగా చక్కబెట్టుకోవలసిన పనులు చేసేసుకోవడం మొదలైన హడావుడులు చాలానే ఉండేవి.  ఈ పెట్రోమాక్స్ లైట్లు టెక్నాలజీ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం గానే ఉంటుంది.  Max Gratetz అనే జర్మన్ మహానుభావుడు ఒక మేంటిల్ అనే దీపం వత్తిని కొంచెం వేడి చేసి, పెరాఫిన్ అనే పదార్ధాన్ని కొంచెం పెట్రోల్ తో బాగా ప్రెషర్ వచ్చేలా పంపు కొట్టి దాన్ని వాయువు గా చేసి ఆ దీపానికి పంపిస్తే అది భగ్గుమని అంటుకుని దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందులో ఎంతో స్పీడుగా టక టక టకా ఆ పంపు కొట్టే డ్యూటీ అప్పుడప్పుడు నాకు పడేది. ఎవరింట్లో పెళ్లి అయినా పల్లకీలో ఊరేగింపుకీ, ముఖ్యంగా మేళం ఆడేటప్పుడు డజన్ల కొద్దీ పెట్రోమాక్స్ లైట్లతో పెళ్లి వారు మహానంద పడేవారేవారు.  ఆ చుట్టుపక్కల అటు రాజమండ్రి, సామర్లకోట లాటి  ఊళ్ళలో ఎన్ని మేళాలు ఉన్నా, పెద్దాపురం మేళానిదే అగ్రతాంబూలం. ఆ పెట్రోమాక్స్ లైట్లు లేకపొతే వాళ్ళ అందచందాలు ఆస్వాదించేదెలా?  తెలియని వారికి ఆ పెట్రోమాక్స్ లైట్ ఫోటో ఇక్కడ జతపరిచాను.

petromax1

మా ఇంటికి కరెంటు రాగానే మా నాన్న గారు చేసిన మొదటి పనులలో గిరి & కో కి వెళ్లి ‘నేషనల్ ఎక్కో” వారి రేడియో ఒకటీ, ఆ తరువాత ఒక “కుక్క”  గ్రామఫోనూ కొనుక్కొచ్చారు. మెయిన్ రోడ్ లో ఉండే ఈ గిరి & కొ కాకినాడ నగరానికి ఆ రోజుల్లో ఒక లాండ్ మార్క్ . నాకు తెలిసీ మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో రేడియోలు, గ్రామఫోనులు మొదలైన అత్యాధునిక శ్రవణ పరికరాలు  అక్కడే దొరికేవి. దాని యజమానులు శేషగిరి రావు గారు కూడా మా గాంధీ నగరం లోనే ఉండే వారు. మా కుటుంబానికి సన్నిహితులు. ఆయన కొడుకులు వేంకటేశ్వర రావు (స్మైల్స్ ఫోటో స్టూడియో అధినేత), బాబ్జీ, భగవాన్ మా అన్నదమ్ములూ మేము చాలా మంచి మిత్రులం. అందులో భగవాన్ (ఇప్పుడు హైదరాబాద్ లో ఆడిటర్)  మంచి క్రికెట్ ఆటగాడిగా పేరు తెచ్చుకుని రంజీ ట్రోఫీ లో కూడా ఆడాడు. బాబ్జీ గారిని ఇటీవల మా హైస్కూల్ రజతోత్సవ సందర్భంగా కలుసుకున్నాను.

ఆ రేడియో, గ్రామఫోనూ కొన్న దగ్గర నుంచీ ..అంటే సుమారు 1950 నుంచీ మరో పదిహేనేళ్ళ తరువాత నేను కాకినాడ వదిలి బొంబాయి వెళ్ళేదాకా మా జీవితం అంతా ఆ రేడియో సావిట్లో ఆ రెండు శబ్ద శ్రవణ యంత్రాల చుట్టూనే తిరిగింది. ఆ రోజులలో మా అక్క ఆ రేడియో పెడుతున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను.  అప్పటికి  టెలివిజన్ అనే మాట కూడా మాకు తెలియదు. కేవలం రేడియో లో అనేక రకాల కార్యక్రమాలు విని, గ్రామఫోనులో ఘంటసాల గారిని విని నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను.  అంతెందుకు….అప్పటి దాకా మా ఇంటిల్లి పాదీ పొద్దున్నే మొహం కడుక్కోడానికి కచిక (కాల్చిన బొగ్గు నుసి) , వేప పుల్ల, “కోతి మార్కు” పళ్ళ పొడి, తాటాకు వగైరాలు వాడే వాళ్ళం. రేడియో సిలోన్ లో ప్రతీ అద్దివారం పొద్దున్న అమీన్ సాయాని పరమాద్భుతమైన గొంతుకలో “బినాకా గీత మాలా” అనే హిందీ సినిమా పాటల కార్యక్రమం వినడం మొదలుపెట్టగానే ఆ కచికల లాంటి సామగ్రి అంతా బయట పారేసి బినాకా టూత్ పేస్ట్ వాడడం మొదలుపెట్టి, “నాగరికులు” గా చెలామణీ అవడం మొదలుపెట్టాం.

బినాకా గీత మాలా అనగానే మరొక పిట్ట కథ గుర్తుకొస్తొంది. అదేమిటంటే ..ఆ రోజుల్లో రేడియో లాంటి ఆధునిక యంత్రం మా స్నేహితులు ఎవరి ఇంట్లోనూ ఉండేది కాదు. ఉన్నది  కేవలం మా ఇంట్లోనే.   అందు చేత మా స్నేహితులందరూ..అంటే మా అక్క,  సుబ్బన్నయ్య, న్నేను, మా తమ్ముడు ..ఇలా అందరి స్నేహితులూ ఆది వారం పొద్దున్న ఎనిమిది అయ్యే సరికి మా ఇంటికి వచ్చేసే వారు ఈ బినాకా గీత్ మాలా వినడానికి. అందులో గురు మూర్తి అనే ఒక స్నేహితుడు …మా అక్క ఫ్రెండో, సుబ్బు ఫ్రెండో గుర్తు లేదు ప్రతీ ఆదివారం పొద్దున్న ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు మా రేడియో సావిట్లోనే ఉండే వాడు. ఆ తరువాత ఆ పాటల గురించి చర్చలు కొనసాగేవి. అలా ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు అమర్యాదగా ఉంటుంది అని మేము ఎవరమూ మా అమ్మ ఎంత పిలిచినా మధ్యాహ్నం భోజనాలకి వంటింట్లోకి  వెళ్ళే వాళ్ళం కాదు.  ప్రతీ పది నిముషాలకీ మా అమ్మ పాపం “ఎంతకీ భోజనాలకి రారు వీళ్ళు” అని బాధ పడుతూ “వాళ్ళని పిల్చుకు రావే” అని మా మెయిన్ హౌస్ నుంచి రేడియో సావిడికి మా రెండో చెల్లెలు అన్నపూర్ణ ని పంపించేది. ఒక సారి మా నాన్న గారు ఈ తతంగం అంతా గమనించి విసుక్కున్నారు. అది విని మా పూర్ణ రేడియో సావిట్లోకి వచ్చి “ఈ వెధవ ఫ్రెండ్స్ అంతా పొద్దున్నే వచ్చేసి సాయంత్రం దాకా ఇక్కడే తగలడతారు. చచ్చు వెధవలు. వాళ్ళు భోజనం చెయ్యరు. వీళ్ళని చెయ్యనివ్వరు” అని మా నాన్న గారు విసుక్కుంటున్నారు” అని సాక్షాత్తూ ఆ గురుమూర్తి తోటే చెప్పేసింది.  అంతే సంగతులు. అప్పటి నుంచే, ఇప్పటి దాకా ఆనాటి ఆప్త మిత్రుడు గురు మూర్తి ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో నాకు ఇప్పటికీ తెలియదు.

Summer Savidi

ఇక మా జనాభాకి రేడియో సావిడీ, మరొక మూడు గదులూ కూడా చాలక ఎదురుగుండా ఒక 20’ x 30’ అడుగుల ..అంటే సుమారు 600 చదరపు అడుగుల హాలు కట్టించారు. దీని పేరు “సమ్మర్ హౌస్”. దీని మీద ముందు తాటాకులూ, ఆ తరువాత మా పొలం లో ఉన్న చెరువులో కుప్పలు, తెప్పలుగా పెరిగే రెల్లు గడ్డి తో పై కప్పు వేయించారు.  నా చిన్నప్పటి జీవితం చాలా మటుకు ఈ సమ్మర్ హౌస్ లోనే గడిచింది. అందులో ఒక టేబుల్ టెన్నిస్ టేబులు, కేరమ్స్  టేబుళ్లు, చదరంగం, పేకాట బల్లలు ..ఒకటేమిటి నేను, మా అన్నయ్యలు, మా తమ్ముడు , అన్ని వయసులలో ఉన్న మా స్నేహితులకీ కావలసిన ఆట సామగ్రి అంతా ఆ సమ్మర్ హౌస్ లోనే ఉండేది. అక్కడే మేము గంధకం, బొగ్గు, భాస్వరం లాంటి ముడి సరుకులు కొనుక్కుని, వాటిని నూరి, సరి అయిన పాళ్ళలో కలిపి కూరి టపాకాయలు, చిచ్చు బుడ్లూ, కాకర పువ్వొత్తులూ, తార జువ్వలూ మొదలైన దీపావళి సామాగ్రి అంతా అక్కడే రెండు నెలల ముందు నుంచీ తయారు చేసుకునే వాళ్ళం. అక్కడే మాకు ప్రవేటు మేష్టార్లు పాఠాలు చెప్పే వారు. వేసవి కాలం వస్తే ఆ సావిడికి నాలుగు పక్కలా వట్టి వేళ్ళ తడకలు కట్టి, వాటి మీద గంట కొక సారి  పిచి కారీ తో నీళ్ళు కొట్టి ఆ సమ్మర్ హౌస్ ని చల్లబరిచే వాళ్ళం. మా తమ్ముడు బుజ్జి (రాజమండ్రి సూరీడు బాబయ్య గారి కొడుకు రమణ మూర్తి, ఇప్పుడు సుప్రసిద్ధ న్యాయవాది) కాలు విరిగినప్పుడు ఆ సమ్మర్ హౌస్ లోనే మూడు నెలలు మంచం మీద ఉన్నాడు. మా దొడ్డమ్మ (రెండో మేనత్త హనుమాయమ్మ) అక్కడే పోయింది. ఆశ్చర్యం ఏమిటంటే , మేము అన్నేళ్ళు  అనేక రకాలుగా వాడుకున్న ఆ సమ్మర్ హౌస్ కి ఒక్కటయినా సరి అయిన ఫోటో లేదు. కానీ మా పెద్దన్నయ్య అక్కడ తీయించుకున్న ఒకే ఒక్క ఫోటో ఇందుతో జత పరుస్తున్నాను.

ఇక మా వంటింటి వెనకాల ఉండే  చిన్న నూతి దగ్గర స్నానాలకి ఇబ్బందిగా ఉంది అని ఈ సమ్మర్ హౌస్ పక్కనే చుట్టూ ఐదు అడుగుల వెడల్పు ఉన్న సిమెంటు చపటాతో ఒక పెద్ద నుయ్యి తవ్వించారు మా నాన్న గారు.  ధాన్యం, నువ్వులు, కంది పప్పు, గొల్లప్రోలు మిరప కాయలు వగైరాలు దంచుకుని ఆరబెట్టుకోవడం, పాలికాపులకి భోజనాలు పెట్టడం, వేసవి కాలంలో మడత మంచాలు వేసుకుని పడుకోవడం మొదలైన రకరకాల ఉపయోగాలకి ఇంటి ముందు పది స్తంభాలతో, మామిడి చెట్టుని ఆనుకుని  ఒక సిమెంటు ప్లాట్ ఫారం కూడా ఉండేది. ఇప్పుడు ఎందుకు మాయం అయిపోయాయో తెలియదు కానీ, మా చిన్నప్పుడు గొల్లప్రోలు మిరప కాయలు, వాటి రంగు, రుచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవే.

నాకు ఊహ తెలిసే నాటికి ఆ ఇల్లు, మిగిలిన స్థలంలో మా తాత గారు కట్టదల్చుకున్న పెద్ద మేడకి ఐదు అడుగుల లోతుగా పెద్ద పెద్ద రాళ్ళతో భూమికి నాలుగు అడుగుల ఎత్తున పునాదులు ఉండేవి.  పైన చెప్పిన రేడియో సావిడి, సమ్మర్ హౌస్  తాత్కాలికంగానే కట్టినా, అవి పెర్మనెంట్ అయిపోయాక తరువాత మా నాన్న గారు ఆ పునాదులు తవ్వించేసి, మొత్తం స్థలం అంతా మొక్కలు, చెట్లతో నందన వనం లా తయారు చేశారు.

నా “జీవిత కాలమ్” లో ఇదంతా ఎందుకు వ్రాసుకుంటున్నాను అంటే…..నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఏదో రకంగా ప్రాధాన్యత  ఉన్న కొన్ని కట్టడాలని కానీ, ఇళ్ళు కానీ చూస్తూ ఉంటాను. ఉదాహరణకి ఇటీవల ఒక సారి విజయ నగరం వెళ్లి “గురజాడ” వారి ఇల్లు చూశాను. మాములుగా చూస్తే అది ఒక పాత కాలం నాటి ఇల్లే కదా! అదే సిమెంటు, అదే ఇటికెలే కదా! మరి అంత ప్రాధాన్యత ఎందుకూ? ఎందుకంటే….ఆ ఇంటి నేల, ఇటికెలు మాత్రమే గురజాడ వారి స్పర్శకి  నోచుకుని, ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అలాంటిదే నెల్లూరు వెళ్లినప్పుడు పెన్నా నది ఒడ్డున శిధిలావస్థలో ఉన్న చూసిన “మహాకవి తిక్కన మహాభారతము రచించిన మందిరము”.  ఇలాంటివి యావత్ తెలుగు జాతి చూసి తరించవలసిన ప్రదేశాలు అయితే నాకు వ్యక్తిగతంగా, కేవలం నాకు మాత్రమే నేను పుట్టిన ఇల్లు ఇప్పుడు లేక పోయినా, మా స్థలం ఉంది కదా…అక్కడ మా అన్నయ్యల ఇళ్ళు, మా తమ్ముడి ఇల్లు ఉన్నాయి కదా.  అందుచేత ఆ ఇంటిని, అప్పటి భౌతిక వాతావరణాన్నీ నెమరు వేసుకుంటున్నాను.  ఈ తరహాలో మిగిలినది “లోకారెడ్డి  వారి చెరువు ఇస్తువా పంపు” దాని గురించి తదుపరి వ్యాసం లో ప్రస్తావిస్తాను.

-వంగూరి చిట్టెన్ రాజు

మీ మాటలు

 1. రాజు గారు మీరు మీ ఇంటిని చాల మిస్ అవుతున్నారనిపిస్తుంది కానీ మా అందరికి చూపిస్తున్నారు కదా మీరు huastun లో మామిడి చెట్టు వెసుకోలేదా chadrakantha వేసుకున్నారు kada

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   పద్మజ గారు..

   మీరు ఊహించినట్టు ఆ బంగిన పల్లి టెంకలు కష్టమ్స్ వారి కన్నుగప్పి తీసుకెళ్ళి మా తోటలో వేశాను కానీ మొక్క రాలేదు. అంతకీ చైనా వాడి దగ్గర మామిడి మొక్కలు కొనుక్కున్నా చలి కాలం లో వాటిని బతికించ లేక నానా అవస్తలు పడ్డాను. మా ఊళ్లో కొందరు బాగానే కాపాడుకుని పిందెలు కూడా వేయించగలిగారు.
   నమ్మండి, నమ్మక పొండి..క్రిందటేడు మా అమ్మాయి పెళ్ళికి ఒక రెబ్బకి ..అంటే ఆరు మామిడాకులకి..పది డాలర్లు పెట్టి మద్రాసు నుంచి తెప్పించుకున్నాం.
   అదీ సంగతి

   మీ స్పందనకి ధన్యవాదాలతో

   –వంగూరి చిట్టెన్ రాజు

 2. bhasker.koorapati says:

  రాజు గారు. చక్కటి కథనం. వెనకటి రోజుల్ని తలపింప చేసారు. ఇప్పుడు మీ ఆ ఇల్లు అక్కడ లేకున్నా మీ స్మృతుల్లో పదిలం కదా. ఇప్పుడు మీరు ఉంటున్న హ్యూస్టన్ ఇల్లు కూడా చెట్లతో కళకళలాడుతుంది. మీ మెత్తటి మనసులానే….హ్యూస్టన్లో మీ ఇల్లు చూసి తరించినందుకు పులకిస్తూ….
  మీ మిత్రుడు,
  —-భాస్కర్ కూరపాటి.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ఎలా ఉన్నారు, మహాశయా ..

   మీ ఆత్మీయతకి ధన్యవాదాలు.

   –వంగూరి చిట్టెన్ రాజు

మీ మాటలు

*