అంచులలో జీవితాలు :దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’

తనలోని ఒక ముఖ్యమైన భాగాన్ని, బహుశా సంఖ్యాత్మకంగా గణనీయమైన అంతర్భాగాన్ని తనలో భాగం కాదన్నట్టుగా చూడడమే, పట్టించుకోకపోవడమే, విస్మరించడమే, దూరం పెట్టడమే భారత సమాజపు ప్రత్యేకతలలో ఒకటి. భారత పాలకవర్గాలు ఆ గణనీయమైన భాగాన్ని శ్రమకూ సేవలకూ మాత్రం వాడుకుని ప్రతిఫలానికీ, వాటాకూ, హక్కుకూ, అధికారానికీ అవతల పెట్టాయి. అంచుల లోకి నెట్టాయి. నిమ్నమనీ, నీచమనీ, అస్పృశ్యమనీ ప్రకటించాయి. హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన, అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యథాస్థితిని సమర్థించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్తమజ్జాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టు కూడ తన కింద మరొక మెట్టు ఉండాలని కోరుకుంటుంది. ఉందని అనుకుంటుంది. ఆ కిందిమెట్టు కన్న తాను అధికురాలిననీ, దానితో తాను అస్పృశ్యత పాటించాలనీ, పాటించవచ్చుననీ భావిస్తుంది. సహచర మానవ సమూహాలతో అంతర్వివాహ, సహపంక్తి భోజన సంప్రదాయం లేకపోవడమే తమ సమూహపు ప్రత్యేకతగా ప్రతి సమూహమూ భావిస్తుంది. అందువల్ల అట్టడుగున అంచులలో ఉన్న సమూహాల మధ్య కూడ ఐక్యత గాని, ఏకశిలా సదృశ సంఘీభావం గాని సాధ్యం కావడంలేదు. ఆ అంచులలోనే మరెన్నో అంచులు, అక్కడా విభజనలు, అక్కడా నిచ్చెనమెట్లు, అక్కడా దూరాలు విస్తరించాయి.

ఆయా నిమ్నవర్గాలకు తమ జీవితాలను చిత్రించే, సమాజాన్ని తాము అర్థం చేసుకునే పద్ధతిని చిత్రించే సాహిత్య కళా సంస్కృతులు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ లిఖిత రూపం పొందక పోవడం వల్ల కొంత, అగ్రవర్ణ ఆధిపత్యం కింద, పాలక భావజాలపు ప్రభావం వల్ల కొంత నలిగిపోయాయి. ఒకటి రెండు శతాబ్దాలుగా ఆయా వర్గాల నుంచి పుట్టుకు వచ్చిన రచయితల వల్ల, వారితో సహానుభాతి ప్రదర్శించే ప్రగతిశీల భావధోరణులవల్ల, సామాజిక శాస్త్ర పరిశోధనల వల్ల ఆయా అంచుల జీవితం కొంతయినా బయట పడుతున్నది. కాని బయటపడని అపార జీవితంతో పోలిస్తే బయట పడుతున్నది చాల తక్కువ. అందులోనూ ఆ అంచులలో కూడ కొన్ని సమూహాల గురించి వచ్చిన దానితో పోలిస్తే ఇంకా సమాచారం బయటికి రాని సమూహాలు ఎన్నో ఉన్నాయి. సమాచారం ఎంతో ఉంది.

bayatigudiselu.jpg.1b3c128e7e.999x600x600

అటువంటి అనేకానేక అనామక అవ్యక్త అలిఖిత అంచుల జీవితాలలోనుంచి ఒక వర్గాన్ని ఎంచుకుని, ‘బయటి గుడిసెలు’ రూపంలో దానికి కళారూపం ఇవ్వడానికి ప్రయత్నించిన దేవులపల్లి కృష్ణమూర్తి గారి కృషి ప్రశంసనీయమైనది. ఈ చిత్రణలో మొండి, బుడగ జంగాలు, దాసరి, బైండ్ల వంటి నాలుగైదు కులాలు వాచ్యంగానూ, దొమ్మరి, ఎరుకల వంటి మరికొన్ని కులాలు సూచనప్రాయంగానూ ఉన్నాయి. అవన్నీ దళితుల కన్న కిందివీ, ఆదివాసి, గిరిజన తెగల కన్న పైవీ కావచ్చు. నిజానికి వాటిని కులాలు అనవచ్చునా లేదా అనేది కూడ సందేహమే. అధికారిక, సామాజిక శాస్త్ర అధ్యయనాలన్నీ వాటిని కులాలుగా గుర్తిస్తున్నాయి గాని, సాధారణంగా కులాలు స్థావర ప్రవృత్తితో, స్థిర ఉత్పత్తి విధానాలతో కలిసి ఏర్పడి గడ్డకట్టాయి. మరి ఇక్కడ చిత్రణ పొందిన సమూహాలన్నీ స్థావర ప్రవృత్తికీ, స్థిర ఉత్పత్తి విధానానికీ కూడ చేరనివి. కొంత ఆహారసేకరణ, కొంత పశుపోషణ దశల్లో ఉండి, జనావాసాల అంచులలో భిక్షుక వృత్తిలో ఉన్నవి. మరో మాటల్లో చెప్పాలంటే జంగమ ప్రవృత్తికి చెందినవి.

కాని ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ సమూహాలలో కొన్నిటికి గొప్ప సంస్కృతి ఉంది. సంగీత నృత్య గానాల సంప్రదాయాలున్నాయి. సాధారణంగా ఒక సమూహానికి తగినంత స్థిరత్వం ఉంటేనే సంస్కృతి రూపొంది, విస్తరిస్తుంది గాని, బహుశా ఈ సమూహాలలో జంగమ ప్రవృత్తి వల్లనే సంస్కృతి వర్ధిల్లినట్టుంది. పెద్దగా చలనం లేని పాత సమాజాల స్థితితో పోల్చి చూసినప్పుడు, నిరంతర చలనంలో ఉన్న ఈ సమూహాలు తాము వెళ్లిన ప్రతిచోటి నుంచీ ఎంతో కొంత స్వీకరించాయి, పంచుకున్నాయి. అటువంటి గొప్ప ఆదాన ప్రదానాల వల్ల వీరిలో సంస్కృతీ వికాసం జరిగినట్టుంది. కాలక్రమంలో, సామాజిక పరిణామాలలో ఈ జంగమ సమూహాలు కూడ అక్కడక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోక తప్పలేదు. సమాజం అంచులలో ఉన్నారనడానికి భౌతిక నిదర్శనంగా వారివి ‘బయటి గుడిసెలు’ అయిపోయాయి. దళితుల కన్న, ఆదివాసుల కన్న మరింత ఆవల అంచులలో కూడ అంచులలో ఉన్న మనుషులుగా వాళ్లు మిగిలిపోయారు.

సొంత ఆస్తి భావన తక్కువగానో, అసలు లేకుండానో ఉన్న ఈ ‘బయటి గుడిసెల’ వారిమీద  నేరస్త జాతులుగా ముద్ర వేసే అలవాటు వలస పాలన కాలం నుంచి ఇవాళ్టిదాకా సాగుతూనే ఉంది. సంభాషణలలో మొరటుదనం, బూతులు, అతిగానే మద్యపానం, మార్కెట్ కు లోబడకుండా తమ మద్యాన్ని తామే తయారు చేసుకోవడం, స్త్రీపురుష సంబంధాలలో భేషజాలు, విధినిషేధాలు తక్కువగా ఉండే సహజత్వం వంటి కారణాల వల్ల ఈ జాతులను “సంస్కృతి” లేనివి గానో,   అధోజగత్తుగానో చూసే అలవాటు కూడ పెరిగింది.

కాని ఆ లక్షణాలు సంస్కృతి లేకపోవడానికి చిహ్నాలు కావు, అవే ఒక సంస్కృతి. సరిగ్గా ఆ లక్షణాలు గల మనుషులే ఒక కళారూపానికి, ముఖ్యంగా కథ, నవల వంటి కాల్పనిక ప్రక్రియకు విలువైన ముడిసరుకులవుతారు. అటువంటి అద్భుతమైన నిర్దిష్ట చారిత్రక సామాజిక శకలపు ముడిసరుకును తీసుకుని కృష్ణమూర్తి గారు ఈ కథో, నవలికో, జీవన దృశ్యమో చిత్రించారు. రచయిత అక్కడక్కడ కనబడినా, ఆ జీవితాలతో, వారి జీవన్మరణ ఘర్షణలతో, కష్టాలతో, కడగండ్లతో రచయిత ఆద్యంతమూ సాధించిన మమేకత్వం పాఠకులను అబ్బురపరుస్తుంది. మాటతీరు, స్పందనలు, హావభావాలు, అలవాట్లు, జీవనగమనం, దారుణమైన విషాదాలు, జీవన బీభత్సం, సమాజంలో ఆధునికత ప్రవేశించినకొద్దీ వారి జీవితాలలో వస్తున్న మార్పులు – సమస్తమూ ఎంత వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రణ పొందాయంటే రచయిత తన పాత్రలతో సంపూర్ణంగా తాదాత్మ్యం చెంది ఉండకపోతే అది సాధ్యమయ్యేదే కాదు. నిజానికి చాల సందర్భాలలో అవి పాత్రలు కాదేమోనని, నిజజీవిత వ్యక్తులే తమంత తాముగా, తమ గుణదోషాలన్నిటితో, లక్షణాలన్నిటితో ఈ పుటలమీదికి నడిచివచ్చారేమోనని అనిపిస్తుంది.

ఆ జీవితాలలో ఉండే నిస్సహాయత వల్ల, ఎవరిమీద తీర్చుకోవలసి ఉందో తెలియకుండా పేరుకుపోయే అసంతృప్తి ఆగ్రహాల వల్ల మనుషులు ఒకరికొకరు కనబడితేనే తిట్టుకుంటారు. తిట్టే ఒక పలకరింపు అవుతుంది. సాదాసీదా సంభాషణలు కూడ పోట్లాట స్థాయిలో జరుగుతాయి. బిచ్చమెత్తడానికి ఉదయాన బైటికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన భర్తతో “పొద్దున పోతివి, బతికితివా చస్తివా, జాడ తెల్వకపాయె, సావనన్న సావకపోతివి. నాపానాన బడ్తివి’ అంటూ తగులుకుంటుంది పెళ్లం” అని రాసిన వాక్యాలు రచయిత సృష్టించినవి కావు, నిత్యజీవితానుభవం లోనివే. అలాగే ఆ అసహన వాతావరణంలో మంచి మాట, ఆర్ద్రమైన పలకరింపు కూడ ఎట్లా అపార్థానికి, పరస్పర దూషణలకు, నిందారోపణలకు, ఎడతెగని వివాదాలకు, చివరికి భౌతిక హింసకు దారితీస్తాయో రచయిత ఎన్నో చోట్ల చిత్రించారు. ఈ లక్షణాలను దోషాలనుకుంటే అవి ఆ పాత్రల దోషాలు కావు, వారిని అటువంటి అమానవీయ స్థితిలోకి దిగజార్చిన వ్యవస్థ దుర్మార్గాలు. రచయిత చిత్రణ వాచ్యంగా ఆ మాట చెప్పకపోయినా సత్యజిత్ రాయ్ పేదరికపు చిత్రణ లాగ, ఆ అమానవీయ స్థితికి కారణమైన వారి మీద ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

“అరె, భూమి వుంటె ఎన్ని బాధలురా, దాని బాధలు దానికుంటయి కొడకా. అట్లె, సొంత ఇల్లుందనుకో, దాన్ని బాగు చేసుకోవాలె. ఎక్కడికి పోయినా, పానం ఇంటి మీదనే గుంజుద్ది. అందుకే భూమి, ఇల్లు జోలికి పోలేదురా” అని దాసరి రామచంద్రం అన్నమాట పని చేయడానికి ఇష్టపడని, అడుక్కతినడానికి అలవాటు పడిన ఒక సోమరి వృద్ధుడి మాటల్లా అనిపిస్తాయి గాని అట్టడుగున అవి సొంత ఆస్తి అనే బంధం లేని ఒక నైసర్గిక సామూహిక సహజ సంస్కృతి చిహ్నాలు. వేల సంవత్సరాలుగా ఆస్తి, అంతరాల భావనలు ఆ సహజత్వం మీద అభేద్యమైన మకిలి చిమ్మాయి. ఆ మకిలిని వదలగొట్టి మనిషికి మనిషితనాన్ని తిరిగి అందించే మహాపోరాటానికి సిద్ధపడే శక్తి మళ్లీ ఆ బయటి గుడిసెల మనుషులకే ఉంది. వారికి ఒక శాస్త్రీయ, సామాజిక, చారిత్రక భావజాల పరికరం దొరికితే ఆ పోరాటం విజయం సాధిస్తుంది. భారత సమాజానికే బయటి గుడిసెలుగా ఉండిన దండకారణ్యంలోని ఆదివాసులు ఇవాళ చేస్తున్న పని అదే. కృష్ణమూర్తి గారి పాత్రలు ఆ చైతన్యాన్ని అందుకోవడానికి ఇంకా చాల సమయమూ కాలమూ పట్టవచ్చు. కాని అటువంటి అధోజగత్ పాత్రలలో ఆ దందహ్యమాన పదార్థం ఉన్నదని గుర్తించి, ఆ పాత్రలను వాస్తవికంగా, విశ్వసనీయంగా చిత్రించడమే విప్లవ పూర్వ రష్యన్ సమాజంలో అటువంటి జీవితాలను చిత్రించిన దాస్తొవిస్కీ, తుర్గేనెవ్, కుప్రిన్ వంటి రచయితలు చేసిన పని. ఆ పనిని మన సమాజపు నిర్దిష్టతతో, వాస్తవికంగా చేసినందుకు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

  ఎన్ వేణుగోపాల్

( ఈ పుస్తకాన్ని ఆన్ లైన్ లో ఇక్కడ కొనుక్కోవచ్చు.)

http://www.logili.com/books/devulapalli-krishnamurthy/p-7488847-26370821871-cat.html#variant_id=7488847-26370821871

మీ మాటలు

  1. Anil battula says:

    నాకు చాల నచ్చింది ఈ నవల….దేవులపల్లి కృష్ణ మూర్తి గారి అన్ని రచనలు చదివాను. నాకు బాగా ఇష్టమైన రచయిత. ఈ మధ్యే వచ్చిన “తారు – మారు” కథల సంపుటి కూడా చాల బాగుంది.

మీ మాటలు

*