పుంజుతోక అను ‘Cocktail’ కవిత

పుంజును చేతబట్టుకుని పోతివి దానిని కోయనెంచి, నీ

కంజలులోయి మానవ, దృగంచలమందున నిన్ను బోలు వా

డంజనమేసినన్ దొరకడంచు వచించెద ; యేల నీకు ఆ

వ్యంజనమందు కాంక్ష ? వసివాడని జీవిని చంపుటేలనో

 

పుంజు యొక్క ప్రాశస్త్యమును ఏల గ్రహించవైతివి మానవాధమా? నిజమునకు దానిని పక్షిరాజమనవలె. ఎందుకనినచో అది ప్రాతఃకాలముననే నిన్ను నిద్రలేపును. నీ గృహము ముందున్న ప్రాంగణములోని పురుగుపుట్రలను భక్షించి, నీ ముంగిలిని శుభ్రముగా యుంచును. అది వేయునట్టి రెట్టలను ప్రస్తుతమునకు మరచిపొమ్ము! మరి పుంజునకు కృతజ్ఞుడవై యుండుటకు బదులుగా దాని ప్రాణములను హరింతువా? వివిధ వర్ణముల ఈకలుగల కోడితోకను వీక్షించినచో మనమునందు యెంతటి ప్రసన్నత కలుగునో ఎప్పుడైన ఆలోచించితివా?

 

పుంజు కొనవలెనోయీ

మనము ‘పుంజుకొన’ వలెనోయీ

రంజుగా కనిపించు పుంజుతోకను జూసి                    //పుంజు కొన//

 

గంప కిందా పుంజు గంపెడాశలు రేపు

ఇంపుగా కనిపించి సొంపులెన్నో జూపు                       //పుంజు కొన//

 

రంజకమ్మగు పక్షి రగిలించు మనసులూ

పుంజుతోకను చూసి పులకించు మేనులూ                  //పుంజు కొన//

 

 

తోకను చూసినప్పుడల్లా

ఏకరువు పెట్టాలనిపిస్తుంది ఊహల్ని

రంగులు నిండిన ఇంద్రధనుస్సులా పొంగుతూ

ఎంత అందంగా ఉంటుంది కోడితోక

దేని ఉపయోగం దానిదే సుమా

కోడితోకతో కొండంత లాభం

తోక లేకుంటే కోడిని పట్టటం కష్టం

అందుకే కోడితోకంటే నాకు యిష్టం

 

గందుకెనే మరి నేన్జెప్తున్న యినుండ్రి. పుంజును పట్కోని, పొతం బట్టి, అండుకొని తినంగనె అయిపాయెనా? అరె, దాని కూర దింటుంటె మంచిగుంటది నిజమేగని, గట్లని దాన్ని సంపుకోని తినుడేనా? సక్కదనమున్న దాని తోకను సూస్కుంట యాడాదులకు యాడాదులు గడ్పచ్చు. మజ్జుగ పండుకోని మత్తుల మునిగే లోకాన్ని నిద్రలేపే కొండగుర్తు కోడిపుంజంటె. గందుకెనే మరి కోడిపుంజుల్ని కోస్కోని తినుడు ఆపుండ్రి.

ఏందీ? పెట్టల్ని తింటమంటరా? ఆఁ , గిది జెరంత ఇషారం జేశెతందుకు సందిచ్చే సంగతే.

     ఎలనాగ

 

***

మీ మాటలు

  1. MADIPLLI RAJ KUMAR says:

    చిత్రం ఈ పుంజు తోకనే మహారంజుగా ఉందేమిటబ్బా? ఎలనాగ గారు ఎప్పుడో, ఎవరిదో ఆ కవి నన్ను క్షమించుగాకా.. ఓ మినీ కవితను జ్జప్తికి తెస్తోంది మీ కవిత
    కోడి పుంజు/ పొద్దున్నే అలారం/ పొద్దెక్కితే పలారం

  2. dasaraju ramarao says:

    చందోబద్దంగా ,గ్రాంధిక ,తెలంగాణా భాషతో హాస్యస్పోరకంగా ఒక అహింసా సందేశాన్ని సెటైర్ గా బాగా చెప్పారు…

  3. Thirupalu says:

    బావుంది!

  4. మంజరి.లక్ష్మి says:

    మంచి సరదాగా ఉంది

  5. దాసరాజు గారూ,
    తిరుపాలు గారూ,
    మంజరి లక్ష్మి గారూ!

    మీకు నా కాక్టెయిల్ కవిత నచ్చినందుకు సంతోషం, ధన్యవాదాలు

  6. మడిపల్లి రాజ్ కుమార్ గారూ!

    మీక్కూడా నా థాంక్స్.

  7. RammohanRao says:

    ఒక పద్యం ఒక గద్యం
    ఒక గేయం వచన కవిత
    తెలంగాణ మాండలికం
    మధు మధువది దేనికదే

    అన్నింటిని కలిపి కొట్టు
    అప్పుడు ఆ మజా చూడు
    అనెడు ప్రయోజన ప్రయోగ
    మీ మీ పుంజుతోక

    మీరు ప్యూరు వెజ్జు కదా
    మానవతకు సజ్జ కదా
    అందులకే నాన్ వెజ్
    నిరశనకై నిరసన కద

  8. రామ్మోహన్ రావు గారూ!

    బాగుంది మీ గేయ ఫణితి. ధన్యవాదాలు

  9. దడాల వెంకటేశ్వరరావు says:

    వేకువకు కోడిపుంజు
    మేలుకోలుపుకు కోడిపుంజు
    ఠీవికి కోడిపుంజు
    పోటీకి కోడిపుంజు
    పోరాడే కోడిపుంజు
    పౌరుషానికి కోడిపుంజు
    ఇంపైన కోడిపుంజు
    రంగురంగుల కోడిపుంజు
    ఎతైన కోడిపుంజు
    ఎత్తులోఉండే కోడిపుంజు
    రెక్కలున్న కోడిపుంజు
    ఎగరగలిగే కోడిపుంజు
    పులిగోరులున్న కోడిపుంజు
    అవి ఇవి అన్నీ ఉన్న కోడిపుంజు
    ఆఖరుకు మంచి మంచి భోజనంగామారే కోడిపుంజు

    దడాల వెంకటేశ్వరరావు

  10. దడాల వెంకటేశ్వర రావు గారూ,

    బాగుంది మీ కోడిపుంజు కవిత.

Leave a Reply to దడాల వెంకటేశ్వరరావు Cancel reply

*