గతంలోకి ప్రయాణం

vekuvapoolu

‘‘గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్ళతో’’ అన్నాడు శ్రీశ్రీ. గతమంతా రణరక్త సిక్త ప్రవాహమేనా? ‘‘సదాస్మరించుకోవడానికి, తలుచుకుని పులకరించడానికే, లేశమాత్రమయిన మంచిలేదా?’’ అంటే మంచి కూడా వుంది. కానీ, ‘‘మంచి గతము కొంచేమేనోయ్‌’’ అన్నాడు గురజాడ. కవి నిరంకుశుడు గనుక దేన్నైనా ఎలాగయినా అనగలడు. కానీ మామూలు మనుషులుగా మనం అప్పుడప్పుడు గతంలోకి తొంగిచూడకపోతే, మన భవిష్యత్‌ ప్రస్థానానికి సరయిన ఆలంబన దొరకదు. గతంలో చేసిన తప్పు ఒప్పులే మన ప్రయాణానికి దారిదీపాలుగా వ్యవహరిస్తాయి.

నిద్రపట్టని ఒక అర్ధరాత్రి నా చూపుడు వేలు, నా పుస్తకాల ‘‘రాక్‌’’ లో వున్న ‘‘వేకువపూలు’’ అన్న నవలను బలంగా తాకింది. రెండు వందల పేజీల ఆ నవలను ఒక్కుదుటన తెల్లవారే వరకు చదివేసాను. ఎప్పుడో ఫిబ్రవరి 2000 సంవత్సరంలో చతుర మాస పత్రికలో సంక్షిప్తంగా ప్రచురించబడిన నవలకు విస్తృత రూపం నేను చదివిన ‘‘వేకువపూలు’’. కథాకాలం 1970 దశాబ్దం. అంటే 43 సంవత్సరాల పాత కథావస్తువు అన్నమాట. ఈ నవలను చదవడం అంటే ఇప్పటి గ్లోబల్‌ తరానికి ‘‘ఫేస్‌బుక్‌’’ లో ‘‘లైక్‌’’లు మాత్రమే పెట్టగల యువతరానికి, ‘‘టైమ్‌ మెషీన్‌’’లో గతంలోకి ప్రయాణం చెయ్యడం అన్నమాట. నిజంగా ఈ నవల చదవడం ఒక అనుభవం.

ఢిల్లీ లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత ఒక్కుమ్మడిగా కొవ్వొత్తులతో పార్లమెంటును ముట్టడిరచిన యువతరంగానికి, అరవై ఏళ్ళ వృద్ధుడు ‘‘అన్నా హజారే’’ నాయకత్వం వహిస్తే వెనుక వుండి సంఫీుభావం ప్రకటించే దుస్థితిలో వున్న యువ గళానికి, ఒక తరం క్రితం తమ సహచరులు ఎలా వున్నారో, సమాజ చలన శీలతను తమ కార్యాచరణతో ఎలా ప్రభావితం చేశారో, ఆ సామాజిక గమనానికి చోదక శక్తులై ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాడో సోదాహరణంగా చెప్పగలదీ నవల. ఇప్పటి ‘‘యువతరం’’ నిస్తేజాన్ని నిర్వ్సాపారాన్ని, చైతన్యలేమిని ప్రశ్నిస్తుందీ నవల.

1947లో స్వతంత్య్రం రావడమూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటమూ, స్వాతంత్య్రోద్యమ కాలంనాటి ఆదర్శాలన్నీ నీటి మీద రాతలయిన కరకు వాస్తవం తెలిసిన తర్వాత, 1969లో మొదటి దశ తెలంగాణా ఉద్యమం రావడమూ, అదీ అయిపోయాక శ్రీకాకుళంలో రాజుకున్న నిప్పురవ్వ, రాష్ట్రమంతటా వ్యాపించడం అనే అంశాలు నేపధ్యంగా ఈ నవలకి అమిరాయి.

నామ మాత్రపు రాజకీయ స్వాతంత్య్రం, స్వాతంత్య్రమే కాదని, ఆర్ధిక స్వావలంబన, స్వేచ్ఛ సమానత్వం, అన్ని రంగాలలో, అన్ని వర్గాల ప్రజలకి అందినప్పుడే నిజమయిన స్వాతంత్య్రమని నమ్మిన యువతీ యువకులు, తాము కలలు గన్న సమాజాన్ని సాధించాలి అనే ఆశయంతో ఒక విస్తృత విప్లపవోద్యమాన్ని నిర్మించే క్రమంలో పెద్దయెత్తున ఉద్యమాలలో భాగస్వాములు అయ్యారు. కాలేజి, సాహితీ, సాంస్కృతిక సంఘాలలో భాగస్వాములయ్యారు. చదువునీ, జీవితాన్ని త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ‘‘నెత్తురు మండే, శక్తులు నిండే’’ యువతరానికి ప్రతినిధులు వారు.

అప్పటి సాంస్కృతికోద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ‘‘జతిన్‌ కుమార్‌’’ ఈ నవల రాశారు. ఉద్యమానికి ‘‘ఇన్‌సైడర్‌’’ కావటం వలన ఉద్యమ ఎత్తు పల్లాలని ప్రతిభావంతంగా ఆవిష్కరించగలిగారు.

ఈ నవలలో ప్రధాన పాత్రలు మూడు. సమత, ఝాన్సీ, రాకేష్‌. సమత ఇంటర్‌మీడియట్‌లో కాలేజీలో ప్రవేశించడంతో మొదలయ్యే నవల, సమత డిగ్రీ, పి.జీ దాటుకుని, పి.హెచ్‌.డి లో చేరి అర్థాంతరంగా మానేసి విప్లవోద్యమంలో మమేకమయి జైలు జీవితం అనుభవించి విడుదలవ్వడంతో ముగుస్తుంది.
నిత్య చైతన్యశీలి అయిన ఒక యువతి జీవితంలోని పది సంవత్సరాలను ఈ నవల చిత్రించింది. ‘‘సమత’’ నెపంగా ఆ సమయంలో సమాజంలో జరిగిన ప్రతి సంచలనాన్నీ నమోదు చేసినది. నమోదు చేయడమే కాకుండా, ఎలా ప్రతిస్పందించాలో, రకరకాల అంశాలు ఒక విషయాన్ని కప్పివేసినప్పుడు, ఆ పొరలను తొలగించి సత్యశోధన ఎలా చెయ్యాలో ఈ నవల వివరిస్తుంది.

కామినేని వెంకటరామారావు ఉరఫ్‌ కె.వి.ఆర్‌. మాస్టారు అనే ఉపాధ్యాయుడికి ముగ్గురమ్మాయిలు. స్వరాజ్యం,ఝాన్సీ, సమత. స్వరాజ్యం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మామూలు, సాదాసీదా ఆడపిల్ల. పెళ్ళయినాక భర్త ఆధిపత్యం అనే ‘ఛాయ’ లోకి వెళ్ళిపోయి, ఎప్పుటికప్పుడు పుట్టింటి నుండి ఏదో ఒకటి ఆశించే సాధారణ ఆడపిల్ల.

ఝాన్సీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తల్లిదండ్రులను పోషిస్తూ, చెల్లెలను చదివిస్తూ వుంటుంది. మిత భాషి, మరోమాటలో చెప్పాలంటే ఇంట్రావర్టు. అంతర్ముఖి. ఉద్యోగం చేస్తూనే ప్రయివేటుగా యం.కాం చదువుతుంది.

మూడో అమ్మాయి సమత. సమత అంటే ఒక చైతన్యం. ఒక పాట పాడినా, ఒక ఆట ఆడినా, గంభీరంగా ఏదయినా చర్చ సాగించినా ఆ యింట్లో మనుషులందర్నీ కలిపి వుంచే ఒక ‘‘హబ్‌’’ సమత. జీవితం పట్ల సమ్యక్‌ దృష్టి, జీవనంలో హుందాతనం, ప్రతి పని లోనూ ఆత్మ విశ్వాసం, ప్రతి మాటలోనూ ఆలోచన సమత వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే అంశాలు.
ఝాన్సీసమత పాత్రలు, వాళ్ళ జీవితాలలో ఎదురయ్యే పురుషులు. వీళ్ళద్వారా స్త్రీ పురుష సంబంధాలని, కేవలం సంబంధాలుగా కాక చైతన్యశీలంగా ఎలా మార్చవచ్చో జతిన్‌కుమార్‌ బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఝాన్సీకి దత్తాత్రేయ శర్మ అనే సహోద్యోగితో పరిచయం అవుతుంది. మొదట్లో వున్న స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. తీరా పెళ్ళి యింకో రెండు మూడు రోజులు వుంది అనగా దత్తాత్రేయ శర్మ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. కానీ ఝాన్సీ అప్పటికే గర్భవతి.    ఈ స్థితిలో మామూలు ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏం చేయాలని సమాజం ఆశిస్తుంది? గుట్టు, చప్పుడు కాకుండా ‘‘అబార్షన్‌’’ చేయించుకుని మరో పెళ్ళి చేసుకోమంటుంది సమాజం. అలా చేయమని తల్లిదండ్రులతో సహా మిగతా అందరూ ఒత్తిడి చేస్తారు. కానీ ఝాన్సీఅలా చెయ్యడానికి ఒప్పుకోలేదు. పెళ్ళి కాకుండానే తల్లి కావాలి అనుకుంది. ఆ నిర్ణయాన్ని తల్లి వ్యతిరేకిస్తుంది.

vekuva poolu-1

‘‘పెళ్ళి అని నలుగురికీ చెప్పుకుని చాటింపు వేయడం కాదమ్మా! ఏ స్త్రీ పురుషుల మనసులు యేకం అవుతాయో, వాళ్ళిద్దరూ కలసి వుండటమే దాని అంతరార్ధం. పెళ్ళి అనే తతంగం లేదు. కానీ నేను కోరుకున్న మగవాడి సంతానానికి తల్లిని అవుతున్నాను. ఇందులో తప్పు, అవినీతి ఏదీ లేదు’’.
‘‘పెళ్ళి తంతు జరగత ముందే అతను దూరం అయ్యాడు. నేను తల్లిని అవుతున్నాను. అతను దూరమయినంత మాత్రాన, మా మధ్య విరిసిన స్నేహం, ప్రేమ దాని మాధుర్యం’’ మరచిపోయి ఏమీ తెలియని దానిలా యింకో వ్యక్తికి భార్యను కాలేను.’’

అంతర్ముఖి. ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆమె అలాగే వుంటుంది. బిడ్డను కంటుంది. వాడి పేరు సుధాంశు. ఝాన్సీ పెళ్ళి కాకుండా తల్లి అయి, సింగల్‌ పేరెంట్‌లా ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు సమత దాన్ని అర్ధంచేసుకోవడానికే ప్రయత్నంచేస్తుంది. ఇదే విషయాన్ని ‘‘రాకేష్‌’’తో ప్రస్తావిస్తుంది.

‘‘ఆ అమ్మాయి మనో ధైర్యాన్ని మెచ్చుకోవాలండి’’ సంఘంలోని కృత్రిమ విలువల మీద ఒక స్త్రీ తీస్తున్న దెబ్బగా దానిని గుర్తించాలి.
ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలా లేదా? అనేది ఆమె వ్యక్తిగత ఈ నిర్ణయం. పెళ్ళికాకుండా, (ఇక్కడ అయ్యే అవకాశం లేదు కనుక) తల్లి అయి ఆ బిడ్డను పెంచడంలోనే ఆనందం వుంది అనుకుంటే అభ్యంతరం పెట్టవలసింది ఏం వుంది? అయితే ఇది ఆనందకరం కాదు అనే గుర్తింపు కలిగిన నాడు, ఇంకా ఏదో కావాలని కోరుకున్ననాడు ఇలాంటి అమ్మాయి సమాజం ఏమనుకుంటుందో అని వెనుకా, ముందూ చూడదు. తనకు కావలసింది అందిపుచ్చుకుంటుంది ధైర్యంగా’’ అంటాడు రాకేష్‌.
ఝాన్సీ మనస్తత్వానికి సరిగ్గా విరుద్ధంగా మరొక పాత్ర వుంది. పేరు వసంత.

‘‘పొందిన ఒక అనుభూతిని భద్రంగా దాచుకొని బతుకంతా మురిసిపోతాను’’ అంటుంది ఝాన్సీ.
‘‘అనుభూతుల వేటలో అందే ఆనందమంతా జుర్రుకుంటాను ఈ సమాజ నీతితో నాకు సంబంధం లేదు’’ అంటుంది వసంత. పెళ్ళికి సంబంధించినంత వరకూ వీళ్ళ ఆలోచనలు, అనుభవాలు వేరు… వేరు…

జీవిత కాలానికి మీల్స్‌ టిక్కెట్లు, కొంచెం రక్షణ తప్ప మరేది యివ్వదు కొందరికి పెళ్లి. ముసలితంలో, రోగంతో, రోష్టులో తోడుంటాడనే చిన్న ఆశ తప్ప మరేమీ యివ్వదు కొందరికి పెళ్ళి. నిజంగా పెళ్ళంటే ఏమిటి? ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ. ఈ వేద మంత్రాలకు అర్థం లేదా?
ఆ అర్థం ఏమిటో సమతా రాకేష్‌ కలసి జీవించి చూపిస్తారు.

సమత నిద్రలేచేసరికి అతను కాఫీ టిఫిన్‌ రెడీ చేస్తాడు. కూరగాయ ముక్కలు తరిగి అన్ని గిన్నెల్లో పెట్టి రెడీ చేస్తాడు. సమత లేచి కాఫీ తాగి గదులు క్లీన్‌ చేసి ఉప్పుకారం చూసి చెబితే కుక్కర్‌ పెట్టేస్తాడు తొమ్మిది గంటలకు ఇద్దరూ తయారయి బయటకి వెళ్ళిపోతారు.

సాయంత్రం పనులు సమత చేసుకుంటుంది. అతను ఎప్పుడో రాత్రి పదిగంటలకు వస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఈ పని నీది, ఈ పని నాది అనే విభజన లేదు. ఎవరికి వీలుగా వుంటే వాళ్ళు చెయ్యడమే.

సమత పెళ్ళయిన ఎనిమిది నెలలకు సమత తల్లి ఒకసారి సమతను చూడటానికి వస్తుంది.

సమత కాపురం చూస్తుంటే ఆవిడకు ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. వాళ్ళ పిలుపులు, పలకరింపులు, పనులు చేసుకునే పద్దతి ఆమెకు కొత్తగా కనిపిస్తున్నాయి. ‘‘నేను అదీ కూర్చుని మాట్లాడుతూనే వున్నాం. ఎప్పుడు వెళ్ళాడో నేను గమనించనేలేదు. చటుక్కున కాఫీ తెచ్చి యిచ్చాడు. తాగాలంటే నాకెంత సిగ్గేసిందో’’.

స్త్రీ పురుష సంబంధాలలోని అన్ని కోణాలను ఈ నవలలో ప్రతిభావంతంగా చిత్రీకరించారు జతిన్‌. అలాగే దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి, ఉన్నత తరగతి జీవితాలలోని సంబంధాలలోని విలోమత్వాన్ని గూడా చిత్రీకరించారు.

సమత రాకేష్‌లది ఆదర్శ దాంపత్యమయితే, రాయుడు చంద్రావతిలది ఒకటే మాట, ఒకటే బాణం లాంటి ఏకాభిప్రాయ దాంపత్యం. స్రవంతి పురుషుడిని సాధించే స్త్రీ. వసంత పురుషుడిని ఆటవస్తువుగా ఆడుకుంటూనే అతడి మానసిక వైకల్యానికి జాలిపడే పాత్ర. ఆత్మ నూన్యతతో బాధపడుతూ భార్య జీవితంలో, తద్వారా తన జీవితంలోనూ హింసను గుమ్మరించుకునే పాత్ర గోవర్థన్‌ది.

ఈ నవల చిత్రించిన జీవితం ఇప్పటి తరానికి పూర్తిగా అపరిచితమయినది. దేశం పట్ల, సమాజం పట్ల నలభైఏళ్ళ క్రితం యువతరం చూపించిన ప్రేమ, దేశంతోనూ, సమాజంతోనూ మమేకమయిన తీరు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ, యువతలో వుండవలసిన సరి అయిన ధృక్పధం అదే.
సమతకు, రాకేష్‌కి పుట్టిన పాప పేరు ఉజ్జ్వల. ఉజ్జ్వలకి సమత, అందరు తల్లులలాగే పాఠాలు చెప్పింది. అందరు తల్లుల లాగా ‘ఎ’ ఫర్‌ యాపిల్‌, బి ఫర్‌ బాయ్‌, అని కాక ఎ ఫర్‌ ఎబిలిటీ, ‘బి’ ఫర్‌ బెటర్‌మెంట్‌, సి ఫర్‌ కమ్యూనిటీ ‘ఆర్‌’ ఫర్‌ రివల్యూషన్‌ అంటూ ఆంగ్ల అక్షరాలని పరిచయం చేసింది.

జీవితాలని వెలిగించే విప్లవం ఒక్క క్షణంలోనో, ఒక్క ప్రదర్శనతోనో రాదు. అది నిరంతరం సాధన చెయ్యాల్సిన అసిధారావ్రతం అసిధార అంచు మీద నిల్చిన తరం అది. విలువల కోసం పిడికిలి బిగించిన తరం అది.
ఇప్పుడా విలువలన్నీ మారిపోయి సమాజం కులం, మతం అంటూ భిన్న  భిన్న సమూహాలుగా మారిపోయింది. సామూహిక చైతన్యం స్థానంలో అస్తిత్వచైతన్యం వచ్చి చేరింది. కుల రహిత సమాజం కోసం పోరాటం జరిగిన ఈ నేల మీద ‘‘కుల’’ స్థిరీకరణ కోసం పోరాటాలు జరగడాన్ని మించిన విషాదం ఏం వుంది?

వర్గ చైతన్యాన్ని బోధించిన యూనివర్సిటీలు ఈనాడు కుల సంఘాలుగా మారిపోయినాయి. సమాజం నిరంతర చలనశీలి. సామాజికంగా వచ్చే ఏ మార్పు కార్యకారణ సంబంధం లేకుండా రాదు.
ఇప్పటి గ్లోబల్‌ తరం అనుభవిస్తున్న జీవితం. ఎప్పటిసామాజిక రుగ్మతల ప్రతిఫలనం..? వచ్చిన మార్పు మంచిదేనా..? ఈ మార్పు యిలా కొనసాగవలసిందేనా… ఇప్పటి తరం వేసుకోవలసిన ప్రశ్నలు. యివి

 ఈ ప్రశ్నలు వేసుకోవడానికి కావలసిన తాత్విక భూమికలు ఏవో ఈ నవలలో ఉన్నాయని నా కనిపిస్తోంది. నవల చదివితే మీరూ ఒప్పుకుంటారేమో.

— వంశీకృష్ణ

మీ మాటలు

  1. మీ నవలా పరిచయం చాలా బాగుంది. ఏ రచన అయినా సమాజానికి ఎంతో కొంత మంచి నేర్పాలి . దారి చూపే కాగడా కావాలి. ఈ నవల ఆ పని చేసింది. సమత రాకేష్ పాత్రలు జానకి విముక్తి లోని సత్యం శాంతి లకు ప్రతీకలు. ఈ సమాజం లో ఝాన్సి లా ధైర్యంగా బతకడం చాలా కష్టం . అందుకు ఎంతో మానసిక పరిపక్వత ఉండాలి. ముఖ్యంగా ఆమెను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉండాలి . ఇలాంటి రచనలు ఎందుకు అంతగా వెలుగులోకి రావో అర్థం కాదు . వేకువపూలు నవల చదవాలని కుతూహలం కలిగించారు మీరు.
    – గొరుసు

  2. మంజరి.లక్ష్మి says:

    పుస్తక పరిచయం బాగుంది. నాకు కూడా వేకువపూలు నవల చదవాలని కుతూహలం కలిగించారు మీరు.

మీ మాటలు

*