అమ్మ, నేను, సినిమా!

memories-1

నేను ఏడో తరగతి లో ఉన్నప్పుడు మా ఊరికి కరెంట్ వచ్చింది. ఆ తర్వాత రెండేళ్ళకి మా ఊరికి టివి వచ్చింది. కానీ అంతకంటే ముందే నేను చాలా సినిమాలు చూసినట్టు గుర్తు. మా ఊర్లో స్కూల్ కి శెలవులు ఇవ్వగానే అమ్మ మమ్మల్ని అమ్మమ్మ ఊరికి తీసుకుళ్లేది. బహుశా, ఈ సమయానికి నేను స్కూల్ లో రెండో మూడో తరగతి లో ఉండి ఉంటాను. అప్పటికే మా అమ్మను ఎదిరించే ధైర్యం వచ్చింది. అప్పటి రోజుల కొన్ని సినిమా జ్ఞాపకాలు ఇవి.

ఒక రోజు రాత్రి నేను మా పెద్దమ్మ వాళ్లింట్లో నిద్రపోతున్నాను. కొంచెం హడావుడి అవుతుండడంతో లేచి చూశాను. ఏమీ లేదని చెప్పి మా అమ్మ నన్ను పడుకోబెట్టింది. కానీ కాసేపటికి లేచి చూస్తే ఇంట్లో మా అమ్మ లేదు; అలాగే మా ఇద్దరు అక్కలు లేరు. లేచి ఏడవడం మొదలు పెట్టాను. మా పెద్దమ్మ నిజం చెప్పేసింది. నన్ను పడుకోబెట్టి మా అమ్మ వాళ్లు సినిమాకెళ్లిపోయారు. నేను ఊరుకోలేదు. అంత రాత్రి పూట రోడ్డు మీద కి పరిగెత్తాను. కొంచెం దూరం వెళ్లగానే వాళ్ళు వెళ్తున్న రిక్షా కనిపించింది. గోలగోల చేశాను. రోడ్ మీద పడి దొర్లాడాను. మా అమ్మ నన్ను చితక్కొట్టింది. చివరకు మా అక్కవాళ్ళు జాలిపడి నన్ను సినిమాకి తీసుకెళ్లారు. ఆ సినిమా “అందరూ దొంగలే”.

అయితే సినిమా థియేటర్ వెళ్లేలోపే మళ్లీ నిద్రలోకి జారుకున్నాను. ఏమైందో తెలియదు. ఆ సినిమా కథేంటో కూడా గుర్తులేదు. కానీ ఎందుకో రమాప్రభ, పద్మనాభం ఇమేజ్ మాత్రం పోస్టర్ మీద చూసిన గుర్తు. సినిమా అయ్యాక థియేటర్ కి దగ్గర్లో ఉన్న మా బంధువుల హోటల్ కి వెళ్లి ఫ్రిజ్ లోని కూల్ వాటర్ తాగిన విషయం మాత్రం నాకు ఇప్పటికే గుర్తు. అదే మొదటి సార్ నేను చిల్డ్ వాటర్ తాగడం.

*****

ఇలాంటిదే మరో వయొలెంట్ సినిమా అనుభవం గుర్తుంది. మా అమ్మమ్మ వాళ్లందరూ కలిసి నెల్లూరికి దగ్గర్లో ఉన్న పెంచల కోన కి దేవుని దర్శనం కోసం బయల్దేరారు. కానీ నాకు వెళ్లడం ఏ మాత్రం ఇష్టం లేదు. అంతకు ముందు రోజే ఊరిలో సినిమా మారింది. నేను రానని మొండికేశాను. కొట్టారు. తిట్టారు. అయినా చివరికి నా మాటే నెగ్గింది. అందరూ వెళ్ళారు కానీ, మా తాతను నాకు కాపలాగా పెట్టారు. మా తాత కి సినిమాలంటే ఇష్టముండేది కాదో లేక టికెట్ కొనడానికి డబ్బులుండేవి కాదో తెలియదు కానీ నన్ను సినిమా హాల్లో కి పంపించి సినిమా అయ్యాక నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు మా తాత. అలా మా తాత నన్ను తీసుకెళ్ళిన మొదటి సినిమా పార్వతీ పరమేశ్వరులు.

ఈ సినిమా కథ పెద్దగా గుర్తు లేదు కానీ సత్యనారాయణ, చిరంజీవి ఉంటారని మాత్రం గుర్తుంది. చిరంజీవి వంటింట్లో పాడే ఒక పాట తాలూకు చిత్రాలు లీలగా గుర్తుకున్నాయి.

బహుశా ఆ రోజు పెనుశిల నరసింహ స్వామి నాకు శాపం పెట్టి ఉంటాడు – తనకంటే సినిమానే ఎక్కువైందని. అప్పటి నుంచి ఇప్పటివరకూ చాలా సార్లు పెంచలకోనకి వెళ్దామనుకున్నా ఎప్పుడూ కుదర్లేదు.

29085.png

ఇలాగే మా అమ్మతో గొడవపడి, ఏడ్చి చివరకి మా తాత నన్ను ఓదారుస్తూ తీసుకెళ్ళిన మరో సినిమా శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం.  అప్పటికే మా ఎదురింట్లో ఉండే చంద్రశేఖర్ రెడ్డి అనే పెద్దయన చెప్పగా కొద్దో గొప్పో రామాయణం, భారతం కథలు విని ఉన్నాను. అందుకే రామాయణభారతాలను కలిపిన ఆ సినిమా టైటిలే నాకు గమ్మత్తుగా అనిపించింది. కానీ సినిమాకి సంబంధించిన ఏ విషయాలూ గుర్తులేవు.

నేను చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తున్న మొదటి సినిమా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. బహుశా అప్పటికే చాలా సార్లు బ్రహ్మం గారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన చూడడం వల్ల, కక్కయ్య, సిద్ధయ్య కథలు కాస్తా తెలిసి ఉండడం చేతనేమో ఈ సినిమా లో సన్నివేశాలు ఇప్పటికీ గుర్తున్నాయి.

అయితే ఈ సినిమా లోని సన్నివేశాలు మాత్రమే కాదు ఆ రోజు సినిమా చూసిన అనుభవం కూడా నాకు బాగా గుర్తుంది.

అప్పట్లో ఈ సినిమా చూడ్డానికి జనాలు బండ్లు కట్టుకుని టౌన్ కెళ్లేవారని మీరెక్కడైనా వినుంటే అది నిజం. అందుకు నేనే సాక్ష్యం. కాకపోతే మరీ ఎద్దుల బండి కాకపోయినా, మా ఊరికొచ్చే డొక్కు ఆర్టీసీ బస్సు లో ఈ సినిమా చూడ్డానికి నేను, మా చెల్లి, అమ్మ, పిన్ని, తమ్ముడు అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చాం. ఎలాగూ వచ్చాం కాబట్టి రెండు సినిమాలు చూసి వెళ్దామనుకున్నాం. కానీ మధ్యలో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళేంత టైం ఉండదు కాబట్టి టిఫిన్ లో పెరుగన్నం, పులిహోర పెట్టుకుని బయల్దేరాం.

టౌన్ కి చేరుకోగానే  మార్నింగ్ షో  బ్రహ్మం గారి సినిమా చూశాక, మధ్యాహ్నం దగ్గర్లోనే ఉన్న పార్క్ లో కూర్చుని భోజనం చేస్తుండగా మాకు తెలిసిన వారెవరో చూసి మా వాళ్లకి విషయం చేరవేశారు. విషయం తెలుసుకున్న మా పెద్దమ్మ కూతుళ్లిద్దరూ పార్క్ కి వచ్చేశారు. మేమింకా బతికే ఉన్నాం, ఇలా పార్క్ లో కూర్చుని భోజనం చెయ్యడమేంటని వాళ్ళు నానా గొడవ చేశారు. మా అమ్మ తో పెద్ద గొడవే పెట్టుకున్నారు. చివరికి వాళ్లమాటే నెగ్గింది. రెండో సినిమా ప్లాన్ క్యాన్సిల్ అయింది. అందరం వాళ్లింటికి వెళ్ళాం. రెండో సినిమా మిస్సయినందుకు నాకు భలే బాధ వేసింది; ఏడుపొచ్చింది. కానీ అప్పటికి కాస్త పెద్దాడయ్యాను కాబట్టి బయటకు ఏడవలేదు.

marana_mrudhangam_Songs

కొన్నాళ్ళకు నన్ను హాస్టల్లో చేర్పించారు. అప్పట్నుంచీ అమ్మతో సినిమా గొడవలే లేవు. అంతా నా ఇష్టమే. కానీ హాస్టల్లో ఉండగా ఒక రోజు నన్ను చూడ్డానికి వచ్చారు అమ్మా, నాన్న. వాళ్లు వెళ్లిపోతుంటే దిగులుగా మొహం పెడితే వెళ్తూ వెళ్తూ విజయనగరంలో మరణ మృదంగం సినిమా చూపించారు. బహుశా అమ్మతో చూసిన చివరి సినిమా ఇదే అనుకుంటా! ఇరవై ఏళ్ల తర్వాత నేను తీసిన సినిమా విడుదలైనప్పుడు చూసి ఫోన్ చేసింది. తీసుకున్న కాన్స్పెప్ట్ కి న్యాయం చేశానని చెప్పి మెచ్చుకుంది.

 

 –వెంకట్ సిద్దారెడ్డి

మీ మాటలు

*