పాదం మీది పుట్టుమచ్చ!

druhttps://i0.wp.com/saarangabooks.com/retired/wp-content/uploads/2013/12/drushya-drushyam-13-1024x693.jpg?resize=717%2C485shya drushyam-13

డావిన్సీ చిత్రించిన మోనాలిసా చిరునవ్వు గురించి చాలా చర్చ జరిగింది. ఇంకా జరుగుతుంది కూడా.
కానీ, దైనందిన జీవితంలో చిరునవ్వులతో జీవించే సాదాసీదా మనుషుల గురించి అంత చర్చ జరగదు.
జరగాలనీ లేదు. కానీ, ఈమెనే చూడండి.ఈమె మోనాలిసా కాదు, మేరీమాతా కాదు.
మామూలు మనిషి.
లక్ష్మి!
ఇంతకన్నా మంచిగ చెప్పడం నాకు చేతకావడం లేదు!ఇటువంటి వరలక్ష్ములతో, నడయాడే వారి పాదాలతో మా ఊరూ వాడా గొప్ప సంబురాన్నే పొందుతాయి.
ఆమె తిరుగాడినంత మేరా వాతావరణం పరిశుభ్రం అవుతుంది. ముషీరాబాద్లో మొదలయ్యే ఆమె బంజారాహిల్స్ దాకా నడుస్తుంది. తలపై భారం తీరాక ఆమె మళ్లీ వడివడిగా ఇంటికి చేరుకుంటుంది. అంతదాకా చిరునవ్వే!
ఒక శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆత్మీయమైన చాలనం.

+++

తాను మాదగ్గరి మనిషి. మేమంతా ఒకే వీధిలో ఉంటాం.
“చీపుర్లమ్మో…” అనుకుంటూ తిరగాడే ఈ వనిత నిజానికి సంచార జాతికి చెందిన స్త్రీ.
బిబూతీ భూషణుడు రాసిన ‘వనవాసి’ నవల్లో కనబడే ‘నాగరీకమైన’ మనిషి.
ఏదీ దాచుకోకుండా, దేనికీ సంశయించకుండా, మనసులో ఒకటి – మాటలో ఒకటి కాకుండా, నిర్భయంగా సంభాషించే సిసలైన సంస్కారి ఆమె.

+++

తన మోములో తాండవమాడే కళ చూడండి.
ఆమె పెదవులపై విరిసే దరహాసం చూడండి.
ఒద్దికగా ఒంటిని చుట్టుకున్న ఆ కొంగును, అందలి అభిమానం చూడండి.
తలపై దాల్చిన చీపురుకట్టలను, వాటిని సుతిల్ తాడుతో కట్టి ‘దూ’ ముడి వేసిన తీరు చూడండి.

చెంపలకు పసుపు, పచ్చటి రుమాలు, జాతీయ పతాకం వంటి చీరా…
అంతా వర్ణ సంచయం…శోభ.

ఇంకా కేవలం ఆమె…
ఆమెలో గొప్ప ఆత్మవిశ్వాసం….డిగ్నిటీ ఆఫ్ లేబర్…
స్త్రీత్వం, అందులో జనించే ప్రేమాభిమానాలు,
ఆదరణ, సిగ్గూ కలగలసిన హాసం…

కష్టజీవి స్వేదంనుంచి ఇంద్రధనుస్సు విరిసినట్టు అన్నీ కలిసిన ఆమె చిత్రం
నా వరకు నాకు ఈ చిత్రం ఒక అపూర్వమైన కానుక.
మాస్టర్ పీస్.

+++

ఇలాంటివి ఎన్ని చిత్రాలో…

తనను ఇలా వీధుల్లోకి వెళ్లేప్పుడు చూస్తాను. వెళ్లక ముందూ చూస్తాను.
పిల్లలతో ఉంటుంది. వాళ్ల ఆలనా పాలనా చూస్తుంది.
భర్తతో ఉంటుంది. అతడి అవసరాలను చూసుకుంటుంది.
స్నేహితులతో ఉంటుంది. అప్పుడు నవ్వులే నవ్వులు.
విశ్రాంతిగా ఉన్నప్పుడు శిరోజాలు విరబోసుకొని తలకు నూనె పట్టిస్తుంటుంది.
అత్తమ్మతో పేండ్లు చూయించుకుంటూ కూడా కనిపిస్తుంది.

నీళ్లు పడుతున్నప్పుడు, ఏదో పనిమీద కిరాణా దుకాణంలోకి వెళుతున్నప్పుడు,
వాడకట్టులో అకస్మాత్తుగా తప్పిపోయిన పిల్లవాడిని వెతుకుతూ ఉన్నప్పుడు, ఎన్ని చిత్రాలో!
అన్నీ వేటికవే సాటి.

+++

ఇట్లా అనేకానేక ఘడియల్లో ఆమెను, ఆమె వంటి ఎందరినో చూస్తూనే ఉంటాను.
కొన్నిసార్లు కెమెరాతో ఆ ఘడియలను పదిలపరుస్తుంటాను. అదొక అదృష్టం.
బహుశా ఈమెవే నా వద్ద పదిపదహారు అదృష్టాలున్నయి.
ప్రతిదీ దేనికదే సాటి. ఇంత గొప్పవే అవన్నీనూ!

కానీ, దురదృష్టం ఏమంటే, తనను ఇలా మోనాలిసాతోనో మరొకరితోనో పోల్చవలసి వస్తుండటం!
అదొక బలహీనత కాబోలు! నిజమే మరి! మోనాలిసాను తలదన్నే జీవితాలు ప్రధాన స్రవంతి అయ్యేదాకా
ఇట్లా నావలె ఎవరో ఒకరు, ఏదో రకంగా వాపోవడమూ, పోల్చుకోవడమూ బలహీనతే!

అయినా పరవాలేదు. బలహీనతే బలం అనుకొని మరికొందరు అదృష్ట దేవతలను చిత్రీకరిస్తూ ఉంటాను.

+++

నమ్ముతారో లేదోగానీ, ఇట్లా ఈ జనసామాన్యం జీవనచ్ఛాయల్లో తొణికిసలాడే నిండుతనం, తృప్తీ, శాంతి,
వాటితో వర్ధిల్లే చిరునవ్వు…వాటిని ఒడిసి పట్టుకోవడాన్ని మించింది ఇంకేమైనా ఉంటుందా?
వారి నడకలో, నడతలో, బింబప్రతిబింబాల్లో తారాడే ఆ వెలుతురు, దాని నీడన జీవించడాన్ని, జీవనచ్ఛాయను కావడాన్ని మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? ముఖ్యంగా నగరంలో రాంనగర్, ముషీరాబాద్ వంటి పరిసరాల్లో జీవించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జీవితాలకు ఇలాంటి బతికిన క్షణాలే చిరునవ్వులు!

అయితే, ఒకటి మాత్రం నిజం. ఉన్నతిని పొందేకొలదీ మనుషులు మారతారని కాదు. కానీ, వాళ్ల పోకడ వేరుగా ఉంటుంది. దాంతో ఇంత నిర్మలమైన చిరునవ్వులు చూడటం కష్టమేమో! వాటిని ఒడిసి పట్టుకోవాలనుకునే తాపత్రాయులకూ కొరతేనేమో! ఏమో! అది వేరే వాళ్ల కష్టం!

+++

ఏమైనా ఈ మనిషిని మళ్లీ చూడండి.ఎంత అద్భుతంగా ఉంది.
ఆమె వైభవానికి శీర్షిక పెడితే… ‘చిరునవ్వూ – చీపురు కట్టలూ – రాజరికం’ అనాలేమో!

+++

నిజానికి, ఇలాంటి కష్టజీవులను అందంగా చిత్రీకరించడం తేలిక.
ఎందుకంటే వాళ్ల కీర్తికిరీటాలన్నీ కష్టార్జితం. అది సామూహికం.
కాయకష్టంతో జీవించే వారిలో ఒక వర్ఛస్సు, కళ. అలౌకికత్వం, ఆత్మసౌందర్యం మహత్తరం.
అది కాసులకు లొంగనిది. పేరుప్రఖ్యాతులతో కునారిల్లనిదీనూ.
అందుకే ఈ మహిళ ఒక చూడముచ్చట.

ఆమె ఒక నిరాడంబరమైన కవిత.
మన సోదరి. దీవించండి.

+++

గద్దరన్న రాస్తాడు, “నీ పాదం మీది పుట్టమచ్చనై చెల్లెమ్మా…” అని!.
ఇటువంటి సోదరీమణుల చెంత దినదినం ప్రవర్థమానం అవుతున్న కళ…అది ఎవరిదైనా కానీ…
నిజంగానే అదొక చూడముచ్చట. దాన్ని నలుగురికీ పంచడమే నిజమైన చిరునవ్వు!

కృతజ్ఞతలు.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

మీ మాటలు

  1. raamaa chandramouli says:

    గడ్డి పూవు చాలా అందంగా ఉంటుంది రమేష్.అది చాలామందికి తెలియదు.
    చూచే కళ్ళూ, దృశ్యించే హృదయం ఉండాలె.
    – రామా చంద్రమౌళి

    • దృశ్యించే హృదయం.
      బాగా చెప్పారన్న.
      ఇంకా మచి మంచి ఫోటోలు చూపిస్తాను, దాచు కోకుండా!

  2. చెంపలకు పసుపు, పచ్చటి రుమాలు, జాతీయ పతాకం వంటి చీరా…
    అంతా వర్ణ సంచయం…శోభ.

    ఇంకా కేవలం ఆమె…
    ఆమెలో గొప్ప ఆత్మవిశ్వాసం….డిగ్నిటీ ఆఫ్ లేబర్…
    స్త్రీత్వం, అందులో జనించే ప్రేమాభిమానాలు,
    ఆదరణ, సిగ్గూ కలగలసిన హాసం… :)

  3. DrPBDVPrasad says:

    సుతారంగా కసువులూడ్చుకోమని
    చిరునవ్వుతోనే చెత్తంతా చిమ్మేసుకోమని
    చెబుతూనే..
    నెత్తిమీద ఉన్నవి చీపుళ్ళే కాదు
    ఆం ఆద్మి ఆయుధాలని హెచ్చరిస్తున్న
    లక్ష్మమ్మని రమేష్ బాగా చిత్రించారు

  4. భలే ఫొటో బాస్‌!

  5. కల్లూరి భాస్కరం says:

    రమేష్…మీ చిత్రమూ, చిత్రణా చాలా బాగున్నాయి. ఒక కొత్త ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నారు. అభినందనలు. ‘(ఈ) జీవితాలు ప్రధానస్రవంతి అయ్యేదాకా…’ అన్నారు. ప్రధానస్రవంతి అయితే ఈ శ్రమైకజీవన సంతృప్తీ, సౌందర్యం, శోభా మిగులుతాయా?! పరిణామాలను మనం ఎలా అడ్డుకోగలం కానీ ఊరికే అలా అనిపించింది…

  6. కల్లూరి భాస్కరం గారు.,
    బాగున్నారా?
    చాల థాంక్స్. కొత్త ప్రక్రియ అన్న్నదుకు!
    ఐతే, ‘(ఈ) జీవితాలు ప్రధానస్రవంతి అయ్యేదాకా…’ అనడంలో నా అవగాహన, ఆశ,
    సుబాల్తేర్న్ స్టడీస్ గా చూడకుండా వీటిని మెయిన్ స్ట్రేం గా గుర్హించడం ఒకటి.
    అంతకన్నా అత్యాశ ఇప్పుడే బహుశ లేదు!.
    కృతజ్ణతలు.

    • ( నిజానికి మెజారిటీ ప్రజల జీవితాలు ప్రధాన స్రవంతే అని నేను కుడా తరచూ మర్చిపోతుంటాను. )

  7. అందరికి చాలా సాధరణమైన విషయం మీకు దా వించి వేసిన మొనాలిస చిత్రం లా కనిపించడం దానికి మీ వ్యఖ్యనాం చాలా బాగుంది.

  8. నిజానికి, ఇలాంటి కష్టజీవులను అందంగా చిత్రీకరించడం తేలిక.
    ఎందుకంటే వాళ్ల కీర్తికిరీటాలన్నీ కష్టార్జితం. అది సామూహికం.
    కాయకష్టంతో జీవించే వారిలో ఒక వర్ఛస్సు, కళ. అలౌకికత్వం, ఆత్మసౌందర్యం మహత్తరం

    చాలా మంచి మాట చెప్పారన్నా.. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అన్నడు మహాకవి. వీళ్ళంతా లేకపోతే ఈ భూమి మీద ఉండనక్కర్లేదు కదా. మనిషితనం మిగిలి ఉన్నది వీళ్ళ దగ్గరే.

    ఆత్మీయ కరచాలనంతో..

  9. నిజమైన స్రమజీఅవనసొఉన్దర్యమ్….. అభినందనలు..

మీ మాటలు

*