అంటు

‘హలో యూసుఫన్నా! నేను రాజుని… మీ మామయ్య బిడ్డ రేష్మా లేదన్నా.. ఆమె మా మాదిగ ఇద్దయ్య కొడుకు సురేష్‌తోటి సిటీ కొచ్చేసిందన్నా.. యూనివర్సిటీల ఉంది. మీ మామలకు తెలిస్తే ఇద్దర్ని సంపేస్తరే.. జర నువ్వు సమ్జాయించి చెప్పు.. వచ్చి ఆ పిల్లను తీస్కెల్లిపొమ్మను అన్నా!’ అన్నడు రాజు మా ఊరి నుంచి.
సెల్‌ఫోన్ ఆగకుంట మల్ల మల్ల మోగుతుండేతలికి రోడ్డు పక్కన బండి ఆపి ఫోనెత్తి ఉంటి. అతని మాటలు విని కాసేపు ఏం మాట్లాడలేక పొయ్‌న. కొద్దిసేపట్ల సంభాలించుకొని, ‘అది కాదు రాజు, ఎప్పుడు జరిగిందిది? ఇప్పుడెక్కడ ఉన్నరు? మన ఊర్లో వాళ్లకు తెలిసిందా?’ అన్నా పరేశాన్‌గ.
‘రాత్రి ఒచ్చిన్రటన్నా. లేడీస్ హాస్టల్లో పిల్ల నుంచిన్రంట. పిలగాడు బాయ్స్ హాస్టల్ల ఉండు. ఊర్లె ఇంక తెలియదన్నా..’
‘పిలగాడు ఏం చేస్తడు?’

‘సదువుకుంటుండన్నా! వాళ్ల నాయన లేడు. వాళ్లమ్మ, వాడే ఉంటరు. షానా బీదోల్లన్నా. నేనే ఆనికి సదువుకు పైసలిస్తున్న. ఆడి సదువు ఖరాబైతదన్నా. మీ మామలు గుడ ఊకోరు. కొట్లాటలైతయ్.. వచ్చి పిల్లను తీస్కపొమ్మనన్నా..’

నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. ఏం చెప్పాల్నో ఏం చెయ్యాల్నొ సమజ్ కాలె. సుతరాయించుకొని ‘రాజు! నేను రోడ్డు మీదున్న, జరసేపాగి ఫోన్ చేస్త’ అన్న. ‘సరె అన్న, మీ మామలకు ఎవరికన్నా చెప్పన్నా, మల్ల ఫోన్ చెయ్యి’ అని కట్ చేసిండు రాజు.

ఫోన్ జేబుల పెట్టుకొని బండి స్టార్ట్ చేసి ఇంటి దిక్కు పోనిస్తున్న. షానా గజిబిజిగ అనిపిస్తున్నది. మనసంత ఏదొ అయిపొయినట్లున్నది. ఇంటికి పొయి కుర్సీల కూలబడ్డ. ఏమైంది అన్నది మా ఆమె.

‘మా నడిపి మామ బిడ్డ రేష్మ, ఎవరో మాదిగ పిలగానితోటి సిటీ కొచ్చేసిందంట!’ అన్న.

‘అవునా.. ఎవరు చెప్పిన్రు?’ అన్నది పరేశాన్‌గ మా ఆమె.
విషయమంత చెప్పిన. కొద్దిసేపు ఆమెతో చర్చించిన. రాజుకు ఫోన్ చేసిన.

‘…పిల్ల, పిలగాడు ఒకర్నొకరు బలంగ ఇష్టపడుతున్నరా.. ఏమంటున్నరు రాజు?’

‘నేను వాళ్లతోని మాట్లాడలేదన్న. వాళ్ల వయసుకు ఇప్పుడేడ సమజైతదన్నా? పిలగాడు చెప్తె ఇంటడన్న. మీ మామలకు చెప్తె ఆల్లే వచ్చి పిల్లను ఎట్లన్న ఒప్పిచ్చుకొని తీస్కపోతరు’ అన్నడు రాజు.

‘…మా మామోల్లకు నువ్వే ఫోన్ చెయ్ రాజు. నాకు చెప్పిందే వాళ్లకు చెప్పు. వొచ్చి పిల్లను తీస్కపొమ్మని నేనెట్ల చెప్త? లవ్ మ్యారేజ్‌లను నేను సపోర్ట్ చేస్త గదా.. నాది గుడ లవ్ మ్యారేజేనాయె!’ అన్న.

‘అట్ల కాదే.. మీ మామలు వాన్ని బతకనియ్యరన్నా.. వాళ్ల బిడ్డ మాదిగోల్ల పిలగానితోని లేషిపొయిందన్న పేరొస్తె ఊకుంటరా అన్నా?! పిలగాని వాల్లమ్మ బయపడి రాత్రే ఎటో ఎల్లిపొయిందంట! నువ్వే ఎవర్తోనన్న మీ మామోల్లకు చెప్పిస్తె ఆల్లే వొచ్చి ఎట్లన్న జేసి తోల్కపోతరు..’

‘నువ్వు చెప్తె ఏమైతది రాజు!’ అన్న ఓపిగ్గ.

‘నేను చెప్పలేనన్నా.. అసలు ఈ విషయం నాకు తెల్సని, నేను చెప్పిన్నని గుడ ఆల్లకు చెప్పొద్దన్నా.. మల్ల నాకు పరేశానైతది..’ అన్నడు రాజు.

‘..సరె, నేను ట్రై చేస్త.. నువ్వు పిల్ల, పిలగాని సంగతి తెల్సుకో.. మల్ల ఫోన్ చేస్త’ అని ఫోన్ పెట్టేసిన.

‘ఏందంట?’ మా ఆమె.

సంగతి చెప్పిన. కాలుగాలిన పిల్లిలెక్క అటు ఇటు తిరుగుతున్న. ఏం తోస్తలేదు నాకు. కొద్దిసేపు నా వాలకం జూసి.. ‘ఇట్ల కుర్సీల కూసొ నువ్వు.. నిమ్మలంగ ఏం జెయ్యాల్నొ ఆలోచించు..’ అన్నది మా ఆమె.

కూసున్న. ఒక్కసారిగ ఎన్నో ఆలోచనలు నా మీద దాడిచెయ్యబట్టినయ్..

ఈ విషయం తెలిస్తె మా మామ తట్టుకోగలుగుతడా? బి.పి, షుగర్ ఉండె.. పెద్ద పిల్ల మెంటల్లీ రిటార్టెడ్. ఇంకో చిన్న పిల్ల ఉండె. ఇగ మిగతా ఇద్దరు మామల పరిస్థితి ఎట్లుంటదో.. ఎట్ల చెప్తం ఆల్లకు. అసలు ఆల్లకు చెప్పకుంటనె, ఈ పిల్లతోటి ఒక్కసారి మాట్లాడి సూస్తె బాగుండు. ఏం చెయ్యాలె…

మల్ల రాజుకు ఫోన్ చేసిన, ‘రాజు! యూనివర్సిటీల ఎవరు ఈల్లకు తోడున్నరు? ఆల్లతోటి ఒకసారి నేను మాట్లాడాలె’ అన్న.

‘లెనిన్, భరత్‌లు ఈల్లతోటి మాట్లాడుతున్నరన్న. వాళ్లతోటి నువ్వొకసారి మాట్లాడు..’ అన్నడు.
ముందుగాల భరత్‌కు ఫోన్ చేసిన.

‘హలో అన్నా! ఏం సంగతే?’ అన్నడు భరత్.

‘భరత్! మీ మాదిగోల్ల పిలగానితోటి వొచ్చిన పిల్ల కాస మా మామ బిడ్డనే’ అన్న.

‘అవునా అన్నా..! సొంతం మావ నా?!’ అన్నడు.

‘అవునే.. నేను చిన్నప్పుడు ఆల్లకాడనె పెరిగిన. ఏంది వాల్ల సంగతి?
‘రాత్రి ఒచ్చిన్రంటన్న.. వాళ్లు ఆగెటట్టు లేరు..!’
‘కాదన్న.. పిలగాడు ఎమ్మెస్సీ ఫస్టియరే సదువుతున్నడంట గదా.. ఎనకా ముందు ఏం లేదంట. ఈ పిల్ల గుడ కాలేజ్ బంద్ జేసె. మరెట్ల బతుకుతరే?!’ అన్న.
‘మేం అన్ని రకాలుగ చెప్పి జూసినమన్నా. పిల్లే ఇంటలేదన్న. ‘మీవల్ల అయితె పెండ్లి చెయ్‌రి. లేదంటే ఎల్లిపోతం’ అంటున్నదే. మమ్మల్నె నమ్ముతలేదె పిల్ల’ అన్నడు భరత్.
‘మరి పిలగానికి గుడ అంతే ఇష్టం ఉన్నదా భరత్?’ అన్న.
‘ఏమో అన్న! ఆడు భయపడుతున్నడు’ భరత్.
‘మరేం చెయ్యబోతున్నరు మీరు?’
‘మాదేముందన్నా.. అన్ని విధాల చెప్పి సూషినం. ఇగ ఆల్ల ఇష్టం’ అన్నడు.
‘నేను మల్ల మాట్లాడత’ అని పెట్టేసిన.
అప్పటికె రాజువి 4 మిస్‌డ్ కాల్స్ ఉన్నై.
ఏం చేస్తె బాగుంటదో సమజైతలేదు నాకు.
కొద్దిసేపు పక్క మీద పండుకుండిపొయ్‌న.. మల్ల ఆలోచనలు ముసురుకున్నయ్.
మా ముగ్గురు మామలకు ఒక తమ్ముని లెక్క వాల్ల దగ్గర్నె పెరిగినోన్ని నేను. కాని ఆల్ల లోకం వేరు. నా చైతన్యం వేరు. ఈ విషయాన్ని నేను చూసే తీరు వేరు. వాల్లు తీసుకునే తీరు వేరు. వాల్లు నిజంగనె ఊర్లె ఇజ్జత్ పొయ్‌నట్లు ఫీలయితరు. అందరికున్నట్లే మాదిగోల్లంటె వీల్లక్కూడ చిన్నచూపు మామూలె. తమ బిడ్డ ‘మాదిగోడితో లేషిపొయిందట’ అన్న మాట వాల్లు తట్టుకునే విషయమేం కాదు. మరి వాల్లను ఎట్ల సమ్‌జాయించాలె? ఎట్ల అర్దం చేయించాలె.. మొదలు విషయం చెప్పుడెట్ల..??
అసలు పరిస్తితేందో తెలుసుకుందామని ముందుగాల మా తమ్మునికి ఫోన్ చేసిన. ‘ఏంరా.. ఏంది సంగతులు. ఊర్లె ఏమన్న జరిగిందా? అన్న. ‘ఏం జరగలేదే.. ఏంది విషయం?’ అన్నడాడు.
‘నడిపి మామ బిడ్డ సంగతేంది?’ అన్న.
‘ఏమొ మరి, రాత్ర పదింటప్పుడు మామ నా కాడికొచ్చి జర తోడు రమ్మని తీస్కెళ్లిండే. ‘రేష్మ ఇంటికి రాలేదు. ఏమైందో తెలియద’న్నడు. ఊరి ఎనక రైలు పట్టాలెంట ఆడ్నించి ఈడిదాంక సూషి ఒచ్చినం. పరేశాన్ ఉన్నడు మామ’ అన్నడు.
‘ఆ పిల్ల సురేష్ అనే మాదిగోల్ల పిలగానితోటి సిటీకొచ్చి యూనివర్సిటీల ఉందంట. పెండ్లి చెయ్యమని స్టూడెంట్ లీడర్స్‌ని ఒత్తిడి చేస్తున్నదంటరా..’ అన్న.
‘అవునా…!’ అని పరేశానై, తర్వాత ‘మామ వాళ్లకు చెప్దామా మరి?’ అన్నడాడు సందిగ్ధంగా.
‘చెప్పేద్దాం.. తెలిసి గుడ చెప్పకుంటె బాగుండదు గదా.. నడిపి మామకు డైరెక్టుగ ఈ విషయం చెప్తే తట్టుకోగలుగుతడా?!’ అన్న.
‘మొత్తానికి ఇసొంటిదేదో జరిగి ఉంటదని ఆయనకు తెలిసే ఉన్నట్లున్నదన్న. ఆయన మాటల్ని బట్టి నాకట్ల సమజైంది’ అన్నడాడు.
‘ముందుగాల చిన్నమామకు ఈ విషయం చెప్పు. నడిపి మామ యాడ ఉన్నడో తెలుసుకొని ఆయన కాడికి పొయ్యి జర నిమ్మలంగ విషయం చెప్పమని చెప్పు’ అన్న.
‘సరె’
ఇంతల రాజు ఫోన్..
ఎత్తిన. ‘అన్నా! ఈవినింగే వాళ్ల పెండ్లి చేస్తానికి చూస్తున్నరంటనె.. జల్ది మీ మావోల్లను సిటీకి బయల్దేరి పొమ్మనన్నా’ ఆదుర్దాగా ఉంది రాజు గొంతు.
నాగ్గూడ కొద్దిగ షాకింగా అనిపించింది. ఏం చెయ్యాల్నొ అర్దం గాలె.
‘ఇప్పుడె మా మామోల్లకు చెప్పమని తమ్మునికి చెప్పిన రాజు. వాళ్లేమంటరో సూద్దాం.’
‘సూద్దామంటె ఎట్లన్న. అసలు నువ్వు యూనివర్సిటీ లీడర్స్‌తోటి గట్టిగ మాట్లాడన్నా. తొందరపడి పెండ్లి చెయ్యొద్దని చెప్పన్నా. పిల్ల వాళ్ల నాయనలు ఏమంటరో సూద్దాం, జర ఆగమనన్నా.’
‘అట్ల నేనెట్ల చెప్త రాజు? నువ్వే ఏమన్న చెప్పి ఆపితె ఆపు’ అన్న.
రాజు నారాజై ఫోన్ కట్ చేసిండు. నాగ్గూడ టెన్షన్‌గ అనిపించింది. రేష్మ తొందరపడుతున్నదేమొ.. ఐటెంక ఇబ్బందులు పడతదేమో.. అది ప్రేమ కాకుండా ఆకర్షణే అయితే మాత్రం కష్టమే.. ఏం చెయ్యాల్నో తోచక అటు ఇటు తిరుగుతున్న.
గంటకు- నడిపి మామ ఫోన్. మాట్లాడాలంటె ఎట్లనో అనిపించింది. కని తప్పదు. ఎత్తిన.
‘మామా! సలామలేకుమ్’ అన్న.
‘వాలేకుమ్ సలామ్. ఏం చేద్దాం యూసుఫ్ మరీ?’ అన్నడు.
‘నాక్కూడా ఏం సమజైతలేదు మామా! యూనివర్సిటీ స్టూడెంట్స్ రకరకాలుగ చెప్తున్నరు. ఈ సాయంత్రమే పెళ్లి చేసెయ్యాలని చూస్తున్నరని కూడా అంటున్నరు. మరి ఎట్లంటవ్?’ అన్న.
‘అట్లెట్ల?! మేం ఇప్పుడు బయలుదేరి వస్తం. ఆపమను’ అన్నడు కాస్త కటువుగ.
‘అట్ల మనం చెప్పలేం మామా! రేష్మానే వత్తిడి చేస్తుందని చెప్తున్నరు.’
‘లేదు యూసుఫ్, నేను ఒక్కసారి రేష్మతోని మాట్లాడాలె. దాని మనసుల ఏమున్నదొ నాకు తెల్వాలె గదా.. అంతవరకన్న ఆగాలె కదా..’ అన్నడు.
‘నిజమే కాని.. మనకు ఎట్ల తెలుస్తది మామా! మనకు చెప్పకుంట కూడ చేసెయ్యొచ్చు.’
‘అది కాదు యూసుఫ్, జర నువ్వు పొయ్ రావొచ్చు గదా.. పొయి వాళ్లతోని మాట్లాడితె వింటరేమో’
‘లేదు మామా! నేను వెళ్లలేను. నేను వెళ్లి మీరొచ్చేదాంక పెండ్లి ఆపమన్నా నేను మీ వైపు నుంచి వచ్చినట్లు యూనివర్సిటీ అంతా నన్ను బద్నాం చేస్తరు. నేను అందరికీ తెలుసు కదా..’
‘మరెట్లా! మేం వెళ్లిందాకనన్నా ఆగాలె కదా..’
‘మీరు వస్తున్నరు, వచ్చిందాక ఆగమంటున్నరని చెప్పించమంటె చెప్పిస్త మామా’ అన్న.
‘సరె, అట్లనన్న చెయ్. మేం బయలుదేరుతం’ అన్నడు.
‘సరె మామా!’
మామ గొంతు పలికిన రకరకాల ధ్వనులకు నా మనసు గిలగిలలాడింది. అయ్‌నా ఏం చేయగలను..!
***
antu
ఇదంత అయ్యేసరికి మద్యాహ్నం దాటింది. నేను ఆఫీస్‌కు వెళ్లిపోయిన. రాజు మద్య మద్య హెచ్చరిస్తనె ఉండు. రాజును వాళ్లతోపాటు వెళ్లమని చెప్పిన. సరేనన్నడు. మా నడిపి మామ, వాళ్ల జిగ్రీ దోస్తు శ్రీను, మా చిన్న మామ, మా తమ్ముడు కారు మాట్లాడుకొని బయల్దేరిన్రు. రాజు చివరి నిమిషంలో తాను ఆల్రెడీ బస్‌లో బయలుదేరినట్లు చెప్పిండంట. ఒట్టిదే.. అతను రాడని సమజైపొయింది..
పొద్దుగూకింది..
భరత్‌కు ఫోన్ చేసిన. ‘పరిస్తితేంది భరత్?’ అన్న.
‘ఏముందన్న, వాళ్లకు పెండ్లయిపోయిందే!’ అన్నడు.
నేను పరేశానై, ‘అంటె.. మీరు చేసిన్రా?’ అన్న.
‘వాళ్లే చేసుకున్నరన్న. ఆ పిల్ల మమ్మల్నే నమ్ముతలేదు. మరి మీ నాయ్న వాళ్లు వస్తున్నరంట కదా.. వచ్చిందాంక ఆగమన్నం. దాంతోటి ఆ పిల్ల మరింత పరేశాన్ చేసింది. మీరు చేస్తె చెయ్‌రి. లేకపోతే ఎటన్న వెళ్లిపోతం అన్నది. మిమ్మల్ని నమ్మి మీ దగ్గర్కి వస్తె మీరేంది ఇట్ల చేస్తున్నరని అరిచింది.. పోరగాన్ని సమ్జాయించబోతె వాన్తోని గుడ ‘నువ్వు గన్క వాళ్ల మాటలు విని ఆగుతనంటె నేను ఇక్కడ్నె ఆత్మహత్య చేసుకుంట’నని గడ్‌బడ్ చేసిందన్న.. ‘అరె, జర ఆగమ్మా.. ఆన్ని గుడ ఆలోచించుకోనీ’ అన్నమన్నా.. ‘ఇద్దరం అనుకున్నంకనే కదా, మావోల్ల నందర్ని వొదిలేసి, ఇంట్ల నుంచి వొచ్చేసిన. మా నాయనలొస్తె పెండ్లి కానిస్తరా? ఇప్పుడు పెండ్లి చెయ్యకపోతె నేన్ సచ్చిపోత’ నని బెదిరించిందన్న’ అన్నడు భరత్.
‘అవునా..! మరి, ఎట్ల చేసిన్రు పెండ్లి?’ అన్న.
‘ఏముందన్న, ఆర్ట్స్ కాలేజ్ పక్కన గుడి ఉంది కదా.. అక్కడ దండలు మార్పిచ్చినమ్. తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేస్కుంటరంట’ అన్నడు.
‘సరె గని, భరత్! మా మామలు వస్తున్నరు. మరి వాళ్లతోని మారేజ్ అయినట్లు చెప్పొద్దు. వాళ్లు వెంటనె తట్టుకోలేరు. వాళ్లు ఏమంటరో వినురి’ అన్న.
‘అది కాదే.. ఇప్పుడెందుకు వాళ్లు ఇక్కడికి? ఇప్పుడొద్దని చెప్పన్నా.. రెండ్రోజులాగి రమ్మంటె మంచిది.. కొద్దిగ కోపం తగ్గుతది..’
‘వాళ్లు బయల్దేరిన్రు భరత్! నేను ఆగమంటె ఆగుతరా?’
‘ఇప్పుడొచ్చి ఏం చేస్తరన్న. అనవసరంగ ఆవేశపడ్డరనుకో.. ఇక్కడ పోరగాళ్లు ఊకోరు. బాగుండదన్నా..’
‘నేను చెప్త భరత్, వాళ్లతోని. గొడవ చెయ్యొద్దని. వాళ్లతోని మా తమ్ముడున్నడు. వాడికి కూడా చెప్త. జర ఓపిగ్గా వాళ్లతోని మాట్లాడి పంపించురి.’
ఫోన్ పెట్టేసినంక మా చిన్నమామకు ఫోన్ చేసిన- ‘మామా! అది యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ చాలామంది ఉంటరు కదా.. ఎవరు ఎట్లుంటరో చెప్పలేం. పిల్లలు ఇప్పుడు వాళ్ల హేండోవర్‌లో ఉన్నరు. గొడవ చేసేటట్టు గాని, కోపంగ గాని మాట్లాడితె గడ్‌బడైపోతది..’ అంటూ అన్ని విషయాలు వివరించిన.. మా తమ్మునికి గుడ జాగ్రతలు చెప్పిన.
ఐటెంక- ఆఫీసుల ఉన్ననన్న మాటేగనీ ఇదే మనాది.. ఏం జరుగుతదో ఏమోనని.
8 గం.లకు మల్ల తమ్మునికి ఫోన్ చేసిన.
‘ఇక్కడ అంబేద్కర్ హాస్టల్ కాడికొచ్చినం. నడిపి మామను కార్‌లనే కూసుండబెట్టి మేం ముగ్గురం భరత్ రూంకొచ్చినం. షానాసేపయ్యింది. స్టూడెంట్స్ షానామందే ఉన్నరు. అన్ని విషయాలు మంచిగనె మాట్లాడుతున్నరు.. చిన్నమామ, శ్రీను పిల్లను కలిషిపోతమని షానా రకాలుగ అడిగి సూషిన్రు.. కలవడం కుదరదని వాళ్లు చెప్తున్నరు. నన్ను పక్కకు తీస్కపొయి చెప్పిండు లెనిన్, ‘యూసుఫన్న మామలని ఇంతసేపు సమ్జాయిస్తున్నమే.. లేకుంటె ఇక్కడికి ఇప్పుడు వద్దనే ఖచ్చితంగా చెప్దుము’ అని. వీళ్లేమో ఇంకా కోషిష్ చేస్తనె ఉన్రు.’
‘సరె, బయల్దేరేటప్పుడు ఏ విషయమైంది నాకు చెప్పు. ఇంటికొచ్చి పోరి, మందు తెచ్చి పెడత’ అన్న.
రాత్రి 11కు ఫోన్ చేసిండు తమ్ముడు. ‘భాయ్! నల్గొండ కెల్లిపోతున్నం’ అని.
‘అరె, అదేందిర.. నేను ఇంటికొచ్చి ఎదురుచూస్తున్న కద.. మీల్స్, మందు రెడీ చేసి..’ అన్న.
‘ఇగ ఇప్పటికె లేటయ్యింది, పోదమన్నరు.’
‘అట్లనా.. ఇంతకు ఆఖరికేమయ్యిందిరా?’ అడిగిన.
‘రెండ్రోజులాగి రారి, మాట్లాడుకుందాం.. ఇప్పుడైతె కలవడం కుదరదన్నరు. నడిపి మామ కొద్దిసేపు అట్లెట్ల అని వాదించిండు. వాళ్లు నిమ్మలంగనె మామను సమ్జాయించిన్రు’
‘సరె, జాగ్రత్తగ పోరి’
***
తెల్లారి తమ్ముడు చెప్పిండు, రాత్రి ఊరు చేరుకునేసరికి మూడు దాటిందని. మద్యలో ఆపి మామకు జర మందు పోయించిన్రంట. బాగ ఏడ్చిండంట మామ.
పెద్ద మామ ఏమన్నడంట అని అడిగి తెలుసుకున్న- ఇజ్జత్ తీసిందని, నేనైతె నరికేద్దును అని అరిషిండంట.. నడిపి మామ మా అత్తను బాగ కొట్టిండంట..
ఇటు మా అమ్మ వాళ్లూ, అటు మా అమ్మమ్మ అంతా పరేశాన్ ఉన్రు.. అందరు నాకు ఫోన్ చేసి నన్నేదైన చెయ్యమంటున్నరు..
మద్యాహ్నం మా నడిపి మామ ఫోన్.. ఎట్లన్న చేసి రేష్మాను తనతోటి మాట్లాడించమని స్టూడెంట్ లీడర్స్‌తో మాట్లాడమన్నడు. రేష్మాతో ఒక్కసారి మాట్లాడితె సాలు అంటున్నడు.
‘నువు చెబితె రేష్మ ఇంటదని నీకు నమ్మకముందా మామా?’ అనడిగిన.
‘అడిగైతె సూద్దాం యూసుఫ్. కని.. అది ఇనదు.. మొండిది..! అదేమనుకుంటదో అదే చేస్తది. దాని మనస్తత్వం నాకు తెల్సు.. అయ్‌నా, ఇంతపని చేస్తదని అనుకోలేదు యూసుఫ్. పెద్ద పిల్ల సూస్తె అట్ల ఉండె. ఇప్పుడు ఇదిట్ల చేస్తే చిన్నదాని పెండ్లెట్లయితది చెప్పూ…’ మామ గొంతు పూడుకుపొయింది.
‘మనసు గట్టి చేసుకోవాలె మామా! అయిందేదో అయింది, ఇప్పుడేం చేస్తే బాగుంటదో ఆలోచించాలె’ అన్న.
‘ఏం ఆలోచించాలె చెప్పూ.. ఊర్లె ఇజ్జత్ లేకుంట చేసింది. అప్పుడె ఊర్లె పోరగాళ్ల సూపు మారె.. అది ఇంత పని చేస్తదని కలల గుడ అనుకోలె..’ మామ ఏడుస్తున్నడు.
‘మామా! ఊరుకో మామా..! అన్నీ తెలిసినోడివి, నువ్వే ఇట్ల దైర్యం చెడితె ఎట్ల.. ఊరుకో..’ అంటుంటె నాకు కూడా గొంతు పూడుకుపొయింది.
మామకు దుఃఖం ఆగుతలేదు.. గొంతు పెగుల్త లేదు, ‘నేను మల్ల మాట్లాడత’ అని ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పక్కన పడేసి నేను గుడ కొద్దిసేపు ఏడ్షిన. ఇంతదాంక మామ ఏడ్షిండని విని గుడ ఎరుగను.. ఏం చెయ్యాల్నో తోచక తల్లడమల్లడమైన.
ఆఖరుకి- పొద్దుగూకాల మామకు ఫోన్ చేసిన- ‘మామా! ఒక్కటే మార్గం, మన రేష్మానె వినేటట్లు లేదు కాబట్టి ఆ పిలగాడిని ఒప్పించి ఏదొ ఒక మజీదులో నిఖా చదివించేస్తే, వాళ్ల బతుకు వాళ్లు బతుకుతరు. మీకు గుడ గౌరవంగ ఉంటది. చిన్న పిల్ల షాదీకి ఇబ్బంది ఉండదు.. సోంచాయించురి’ అన్న.
‘నాతోని గుడ మనోళ్లు ఇదే అంటున్నరు.. మరె అట్ల ఒప్పుకుంటడా పిలగాడు..’ అనుమానంగ అన్నడు మామ.
‘మీకు ఇష్టమేనా? ఇష్టమైతె అడుగుదాం’ అన్న.
‘ఇగ మన పిల్లే ఇననప్పుడు ఏం జేస్తం. గని, మరె మిగతా మామలు ఏమంటరో..’ అన్నడు.
‘మామా! మిగతావాళ్ల అభిప్రాయాలు తర్వాత సంగతి మామా! వాళ్లు రకరకాలుగ చెప్తుంటరు. రేష్మా నీ బిడ్డ! మీరంతా ఎక్కువ టైట్ చేస్తె ఆ పిల్ల ఏమన్న చేసుకుంటె ఏం చేస్తరు? నీ బిడ్డ మీద నీ ప్రేమ వేరు. మిగతా వాళ్ల ప్రేమ వేరు. కాబట్టి నీ నిర్ణయం ముఖ్యం మామా! నీకు ఓకే అయితే అందరు ఊకోక ఏం జేస్తరు?!’ అన్న కొంచెం టోన్ పెంచి.
కొద్దిసేపు సైలెంట్‌గ ఉండిపొయ్‌న మా మామ, ‘సరె, సూద్దాం యూసుఫ్! ముందు నేనొకసారి రేష్మాతోటి మాట్లాడాలె. రేష్మా నాతోని గుడ ఆ పిలగాన్నే చేసుకుంట అంటె ఇగ నువ్వన్నట్లె చేద్దాం’ అన్నడు.
***
మర్నాడు-
మా నడిపి మామ, ఆయన బామ్మర్దులు-దోస్తులు, మా చినమామ యూనివర్సిటీకొచ్చిన్రు. నేను గుడ పొయ్‌న. స్టూడెంట్ లీడర్స్ మా మామోళ్లను అంబేద్కర్ హాస్టల్ వెనక గ్రౌండ్‌లో దూరంగా చెట్టుకింద కూసోబెట్టిన్రు. పిల్ల, పిలగాన్ని హాస్టల్‌లోని ఒక రూంకు రప్పించిన్రు. మా నడిపి మామ ఎక్కడ బరస్ట్ అవుతడోనని, మా చిన్నమామను, నన్ను, శ్రీనును ముందు పిల్సుకపోయి వాళ్లతోటి కలిపిన్రు.
రేష్మ నన్ను, చిన్నమామను సూడంగనె లేషి నిలబడి సలాం చేసింది. సెల్వార్ ఖమీజ్‌లనె ఉన్నది. తన చామన ఛాయ మొఖం గుంజుకుపొయ్ ఉన్నది. కండ్లు పీక్కుపొయ్‌నయ్. పక్కన పిలగాడు లేషి నిలబడ్డడు. బక్కగున్నడు. నలుపే. అతని మొఖం గుడ పీక్కుపొయింది. మేం ఎదురుంగ కుర్సీల్ల కూసున్నం. వాళ్లు మంచం మీద కూసున్నరు. రేష్మ తల వొంచుకొని కుడి కాలి బొటనవేలితోటి నేలను రాస్తున్నది. కాలి ఏళ్లకు మెట్టెలు తొడిగిన్రు. చేతుల నిండా గాజులు. మెడల వెతికిన. పసుపుతాడో, నల్లపూసలో ఉన్నట్లుంది గనీ వోనీతోటి కప్పేసింది…
శ్రీను గుచ్చి గుచ్చి కొన్ని ప్రశ్నలు వేసిండు- ‘మీరిట్ల వొచ్చేస్తే మరి మీ వోల్లు ఎట్ల ఊకుంటరనుకున్నరు? ఎన్ని కష్టాలెదురైనా ఎదుర్కుంటరా? ఎప్పటికీ కలిసి ఉంటరా? మద్యల మోజు తీరిపోతె ఏం జేస్తరు?’ అని.
మొత్తానికి ఇద్దరూ షానా గుండె నిబ్బరంతోటే జవాబులిచ్చిన్రు. ఎక్కడా తొట్రుపాటు లేదు. కలిసే బతుకుతం.. కలిసే చస్తం! అన్నరు.
మా చిన్నమామ రేష్మా నుద్దేశించి- ‘మరి, నీ అక్క సూస్తె ఎడ్డిది.. ఆ పిల్ల నిన్ను విడిచి ఉండలేదు కదా.. నువ్వు కనబడక ఒకటె గొడవ చేస్తున్నది, ఏడుస్తున్నది. అట్ల చేస్తదని నీకు తెల్సు కదా!’ అన్నడు. ఆ మాటలకు మాత్రం రేష్మా కండ్ల నిండ నీళ్లు తిరిగినయ్. కండ్లు తుడుసుకున్నది. మల్ల మా మామ- ‘నువ్విట్ల చేస్తె మీ చెల్లె పెండ్లి ఎట్లయితదనుకున్నవ్? ఇగ ఆ పిల్లను ఎవరు చేసుకుంటరు?’ అన్నడు. దానికి వంచిన తల ఎత్తలేదు రేష్మా.
నేను పిలగాన్ని ఉద్దేశించి- ‘రేపు నీకు ఉద్యోగం వచ్చినంక కట్నం గిట్నం బాగొస్తదని ఈ పిల్లను వొదిలెయ్యవని గ్యారంటీ ఏంది?’ అనడిగిన. అట్లేం చెయ్యనన్నడు.
శ్రీను అందుకొని-‘సరె, అయిందేదొ అయింది. మరి మీరు మంచిగుండాలె. మీవాళ్లు గుడ మంచిగుండాలె. వాళ్ల పద్ధతి ప్రకారం పెండ్లి చేసుకుంటె, వాళ్లకు గుడ గౌరవంగ ఉంటది. మీకు గుడ ఏ ఇబ్బంది ఉండదు. అట్ల చేసుకుంటవా పిలగా?’ అడిగిండు.
అప్పటికె ఆ టాపిక్ వాళ్లదాక చేరి ఉండడంతోటి ఆ ప్రశ్నకు రెడీగ ఉన్నట్లె ఆ పిలగాడు ‘పెండ్లి వరకు వాళ్ల ప్రకారం చేసుకుంట’ అన్నడు. మంచిదె అనుకున్న నేను.
‘అయితె ఒక చిన్న పని చెయ్యాల్సొస్తది. మా ఇండ్లల్ల ఒట్టిగ మజీదుల నిఖా చదివించడానికైనా ముస్లిం పేరు పెట్టుకోవాలె. అట్లనె నిఖాకు ముందే సున్తీ చేయించుకోవాల్సి ఉంటది’ అన్నడు మా చిన మామ.
పిలగాడు తకబిక అయ్యిండు ఆ మాటతోని. అతని దోస్తుల దిక్కు, స్టూడెంట్ లీడర్స్‌దిక్కు సూషిండు. ఆలోచించుకొని చెప్పు, బలవంతం ఏమీ లేదని ఎవరో అన్నరు. దాంతోని మేం కాసేపు మాట్లాడుకొని చెప్తం అన్నడు పిలగాని దోస్తు. దాంతో మా మామ, శ్రీను బైటికి నడుస్తుంటె, నేను పిలగాన్ని పక్కకు పిలిషి ‘ఇయాల్రేపు సున్తీ అనేది మామూలు విషయం. ఆరోగ్యానికి మంచిదని, డాక్టర్లు గుడ ఎంతోమందికి సున్తీ చేయించుకొమ్మని సజెస్ట్ చేస్తుంటరు. ఆ విషయంల నువ్వేం భయపడకు’ అని ‘దైర్యం చెప్పి బైటికొచ్చిన.
కొద్దిసేపటికి మల్ల వాళ్లు మమ్మల్ని లోపలికి పిలిషిన్రు. పిలగాడు రెండ్రోజులు టైమ్ కావాలన్నడు, తమ వాళ్లను అర్సుకొని చెప్తనన్నడు. సరె, అట్లనె కానివ్వమని అన్నరు వీళ్లు. బైటికొచ్చినంక నాకొక మీటింగ్ ఉండడంతోని నేను వొచ్చేసిన.
వీళ్లు పొయి మా నడిపి మామకు విషయం చెప్పిన్రంట. ఆయన అయితెమాయె గని పిల్లను నేను గుడ సూషి మాట్లాడత అన్నడంట. దానికి రేష్మ- ‘వొద్దు, నేను మా నాయన ముందు నిలబడలేను. వద్దే వద్దు’ అన్నదంట. అట్లెట్ల అని మా మామ, తానేమీ అననని, పలకరింపుగా చూస్తనని అన్నడంట. వద్దులెమ్మని స్టూడెంట్ లీడర్స్ అంటె వాళ్లతో కాస్త వాదం పెట్టుకున్నడంట. నా బిడ్డను నాకు సూపెట్టకపోతె ఎట్ల అని నిలదీసిండంట. దాంతో వాళ్లు రేష్మాను ఒప్పించి ఇద్దర్ని కలిపిన్రంట. తండ్రిని సూడంగనె కాళ్లమీద పడి బోరున ఏడ్సుకుంట నన్ను మాఫ్ చెయ్యమని వేడుకున్నదంట రేష్మా. రేష్మాను ఎత్తి గుండెలకు హత్తుకొని తాను గుడ ఏడ్షిండంట మామ. ఐటెంక ‘ఆ పిలగాడు రెండ్రోజులు టైమడిగిండు కదా.. నువ్వు మాతోటి వచ్చెయ్యి.. మల్ల రెండ్రోజుల తర్వాత వద్దాం’ అన్నడంట. దానికి రేష్మా, స్టూడెంట్ లీడర్స్ ఎవరూ ఒప్పుకోకపొయ్యేసరికి చేసేదేం లేక వీళ్లు వెనుదిరిగిన్రంట.
***
ఆ వెంటనె రాజు నాకు ఫోన్ చేసిండు- ‘ఏం జరిగిందన్నా..’ అన్నడు. విషయం చెప్పబొయ్‌న. అతను వ్యంగ్యంగా- ‘అంటె వానికి సున్తీ చేయించి వాన్ని ముస్లింగ మారుస్తరా? అంటే రేపు వాన్ని అందరూ తీవ్రవాదిగా సూస్తానికా?’ అన్నడు.
నేను ఆశ్చర్యపోయి- ‘అంటే నీకు ముస్లింలందరూ తీవ్రవాదుల్లెక్క కనిపిస్తున్నరా?’ అడిగిన విసురుగ.
అతను కూడ విసురుగ- ‘వానికి సున్తీ చేయించి వాని ఎస్.సి. రిజర్వేషన్ పోగొట్టాలనుకుంటున్నరా?’ అని మల్లొక బాంబు వేసిండు.
‘అరె, ఏం మాట్లాడుతున్నవ్ రాజు నువ్వు? అంటె వాళ్లను బలవంతంగ విడగొట్టాలనా నీ ఉద్దేశం?!’ అన్న.
‘మీరు అనుకున్నదే చేద్దామనుకుంటున్నరు కదా..! వాని జీవితాన్ని చెడగొడదామనుకుంటున్నరేమో- కానియ్‌రి.. సూద్దాం!’ అని కట్ చేసిండు ఫోన్.
నాకు చికాకేసింది. అతనికి వీళ్ల ప్రేమ వివాహం ఇష్టం లేదని ముందునుంచే అతనిపై ఉన్న డౌటు నిజమైంది. కాని ఇంతగనం వ్యతిరేకత ఉందని మాత్రం నేను అనుకోలే. అణగారిన కులం నుంచి వొచ్చి లెక్చరర్‌గ పనిచేస్తున్నవాడే ఇట్లంటె ఇగ మామూలు ‘హిందువుల’ సంగతేంది? అనుకున్న.
రెండు రోజులు గడిచినయ్-
రేష్మ రెండు మూడు మాట్లు మా మామకు ఫోన్ చేసి మాట్లాడిందంట- సున్తీ చేయించుకోవడానికి భయపడుతున్నడని ఒకసారి.. అతని దోస్తులు రకరకాలుగా భయపెడుతున్నరని ఒకసారి.. ఎస్.సి. రిజర్వేషన్ పోతదని భయపడుతున్నడని మల్లోసారి.. సున్తీ హైదరాబాద్‌లనే చేయించుకుంటనంటున్నడని మరొకసారి మాట్లాడిందంట. నల్గొండలోనైతే తాము తోడుంటమని మా మామ అన్నడంట. నల్గొండకు వస్తానికి భయపడుతున్నడని అన్నదంట. అయితె హైదరాబాద్‌లనే చేయిద్దాం, ఎప్పుడు చేయించుకుంటడో చెప్పమని మా మామ అన్నడంట.
ఆ తర్వాత నించి ఫోన్‌లు బందైనయంట. భరత్, లెనిన్‌లు గుడా ఫోన్‌లు ఎత్తుత లేరంట!
నాలుగు రోజులు చూసి మా మామ నాకు ఫోన్ చేసి ఏం సంగతో కనుక్కోమన్నడు. ప్రేమ పెళ్ళిళ్లకు రిజర్వేషన్ కూడా సమస్యే అయిందేందా అని జరసేపు సోంచాయించుకుంట ఉండిపొయి, ఇబ్బందిగనే భరత్‌కు ఫోన్ చేసిన.
‘ఏమో అన్న! వాళ్లు మాకు గుడ కాంటాక్టుల లేరే..! ఎటు పొయిన్రో సమజైతలేదు’ అన్నడు.
‘అదేందే! ఏం జరిగిందసలు?’ అనడిగిన.
‘ఆ సున్తీ గురించే వాడు భయపడుతున్నడన్నా..’ అన్నడు.
‘అరె! ఆ పిల్ల ఆ పిలగాని కోసం అందర్ని వొదులుకొని వచ్చినప్పుడు వాడా పిల్ల కోసం ఆ మాత్రం చెయ్యలేడానె? సున్తీ చేసుకున్నంత మాత్రాన ఏమైతది!’ అని అడిగిన నేను.
‘అట్లనె మేం గుడ అడిగినమన్నా.. ఇట్ల ఎటూ తేల్చుకోలేకపోతె కష్టమని, ఏదో ఒకటి చెప్పమని గట్టిగనె అడిగినం.. దాంతోటి వాడిక మమ్మల్ని గుడ కలుస్తలేడే! ఏమైందని తెల్సుకుంటె అసలు వాళ్లిద్దరు ఇక్కడ్నుంచి ఇంకెక్కడికో ఎల్లిపొయిన్రని తెలిసిందే.. యాడికి పొయిన్రో తెలుస్తలేదే..!’ అన్నడు భరత్.
ఎందుకో.. భరత్ మాటలు నమ్మబుద్ధి కాలేదు నాకు.
మా మామకేం చెప్పాల్నో ఎంతకూ సమజ్ కాలేదు.
సోంచాయించుకుంట కుర్సీల కూలబడ్డ-
పిలగాడు అట్లా భయపడడం సహజమే కానీ.. రేష్మ మనసెంత తల్లడిల్లుతుంటదో కదా..! తన దిక్కు నుంచి ఈల్లెవరు ఎందుకు ఆలోచించరు..!?
*
స్కైబాబా

స్కైబాబా

–స్కైబాబ

మీ మాటలు

  1. ఘంటా రాము says:

    నాకు తెలిసి ఇది వాస్తవం . కధ చెప్పటం మొదలు పెడితే ముగింపు ఉంటుంది … వాస్తవం కధగా మారినప్పుడు పాటకుడిని ఆలోచింప చేస్తుంది …. ముగింపు చదివిన మనసు ఆలోచన బట్టి ఉండేలా చేయటం రచయిత ప్రత్యేకత … స్కై బాబా గారు బాగుంది … అభినందనలు

  2. కద ప్రదమ పురుష లో ఉండటం వలన/ ప్రధాన పాత్ర ముస్లిం కావడం వలన కావచ్చు ఇదంతా నిజంగా స్కై బాబా గారి అనుభవం చెప్తున్నట్లు గా ఉంది. ఈ కధ లో మూడు ప్రత్యేకతలు నేను గమనించాను. 1) కులభేధాలకు తావు లేని మతస్తుల మనసులు కూడా భారత దేశ అర్ధ భూస్వామ్య సామాజిక వ్యవస్థ ప్రభావం తో ఎలా కలుషితం అవుతున్నారో చూపించారు. 2)భారత రాజకీయ వ్యవస్థ రిజర్వేషన్లు అమలు చేస్తున్న తీరు ప్రజలమద్య అంతరాలు తొలగడానికి ఎలా అడ్డుగా వుందో చూపించారు.(బాబాసాహెబ్ అంబేత్కర్ కుల నిర్మూలన కి కులాంతర వివాహాలు ఒకానొక పరిష్కారం గా చూపించారు.) 3)కులాంతర వివాహాల కంటే మతాంతర వివాహాలు ఎలా ప్రత్యేకమో వివరించారు. అంతిమంగా చాలా కొత్త అంశాన్ని పరిచయం చేశారు. కధ చాలా బాగుంది. ధన్యవాదాలు.

  3. pudota.showreelu says:

    కలిసిన రెండు మనసులు కలిసి కాపురం చేయటానికి ఎన్ని అడ్డంకులు,ఎన్ని కట్టుబాట్లు కత చాలా బాగా రాశారు స్కై బాబా గారు

  4. ఫేస్ బుక్ లో కామెంట్స్
    – – – – — – – — — – –
    జీ. శ్రీ, Shaik Azharuddin, Nandini రెడ్డి, Sandeepreddy Kothapally, Kurella Swamy and Mamidi Amarendar and 27 others like this. (33 మంది like చేశారు)

    Prasannanjaneyaraju సరికొండ: ఈ కధ లో మూడు ప్రత్యేకతలు నేను గమనించాను. 1) కులభేధాలకు తావు లేని మతస్తుల మనసులు కూడా భారత దేశ అర్ధ భూస్వామ్య సామాజిక వ్యవస్థ ప్రభావం తో ఎలా కలుషితం అవుతున్నారో చూపించారు. 2)భారత రాజకీయ వ్యవస్థ రిజర్వేషన్లు అమలు చేస్తున్న తీరు ప్రజలమద్య అంతరాలు తొలగడానికి ఎలా అడ్డుగా వుందో చూపించారు.(బాబాసాహెబ్ అంబేత్కర్ కుల నిర్మూలన కి కులాంతర వివాహాలు ఒకానొక పరిష్కారం గా చూపించారు.) 3)కులాంతర వివాహాల కంటే మతాంతర వివాహాలు ఎలా ప్రత్యేకమో వివరించారు. అంతిమంగా చాలా కొత్త అంశాన్ని పరిచయం చేశారు. కధ చాలా బాగుంది. ధన్యవాదాలు.
    December 27, 2013 at 2:05pm · Unlike · 6

    Showreelu పూదోట: కలిసిన రెండు మనసులు కలిసి కాపురం చేయటానికి ఎన్ని అడ్డంకులు,ఎన్ని కట్టుబాట్లు కత చాలా బాగా రాశారు స్కై బాబా గారు

    Uma ఉమా: బాగా రాసారు.. కానీ కథ ముగింపు నచలేదు.. నా ఒపీనియన్.. నేను తెలంగాణ అమ్మాయినే, బట్ did not feel comfortable reading the first few paragraphs..

    Krishna రమేష్: సర్, కథ బాగుంది

    Yadav స్వామి: బయ్య. కథ చాల బాగుంది.

    Gouse పాషా: Exlant. ……

    Vemula ఎల్లయ్య: నిజాయితి లేనిది ఏది నిలవదు. అంటును ఎరుక పర్శినందుకు షుక్రియా… రాత్రి గంటసేపు ఇఫ్లు యునివర్సిటి లో చర్చించుకున్నాం..

    Madhavi అన్నాప్రగడ: బాగుంది మీ కథ “అంటు” ..ప్రేమ పెళ్ళిళ్ళు కూడా రిజర్వేషన్ కోరల్లో చిక్కుకున్నట్టు చెప్పే అంశం బాగుంది ..ముగింపులో ఏమన్నా చెప్పిఉంటే ఇంకా బాగుండేది…..

    Shaik Imran పర్వేజ్: కథ బాగుంది అన్న…

    Srujan ఆర్టిస్ట్: గొప్ప కథ. అభినందనలు సర్

    Mamidi Amarendar : భయ్యా.. ఇది కథనా నిజంగా జరిగిందా..
    ఇది సదువుకుంట సదువుకుంటనే ఆలోచన్ల పడ్డా..
    పిల్ల పర్షాని పిల్లకే ఉంది, పేరెంట్స్‌ పర్షాని పేరెంట్స్‌ కే ఉంది.. పిలగానిది పిలగానికే ఉంది.. వీలందరిది ఇటుంచి బయట రాజు అసొంటల్లది ఆల్లకే ఉంది..

    Sandeepreddy Kothapally : కథ చదివాను..కాకపోతే కథలోని పాత్రలకు మాదిరే మీరు కూడా హిందూ ..ముస్లిం అనుబంధాల పట్ల కన్ఫూజన్ లో ఉన్నారు అని నాకు కథ ముగింపు చూసి అనిపించింది. తెలంగాణ లోని కొద్ది పట్టణాలు మినహా గ్రామీణ ప్రాంతాలలో అన్ని వర్గాలతో ముస్లింలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంఘటన కథనా ? వాస్తవమా ?

    Tipparthi Yadaiah : ఈ జరిగిందె కత మొత్తానికి వాస్తవాన్ని కత గ మార్చావ్ హట్సా స్కై

  5. సుబద్ర జూపాక: (మెయిల్ లో)
    పెళ్లి ఇరు సామాజిక సమూహాల్ని గౌరవించేటట్టు ఉండాలే. ఎవరు
    తమ సొంత అస్తిత్వాలని ధ్వంసం చేసుకోవద్దు. సుంతీ అనేది ముస్లిమ్స్
    ని abuse చేయనీకి కూడా use చేసింది హిందూ సమాజం. సుంతీ ని
    సామాజికం చేస్తే ఈ ప్రాబ్లం వుండేది కాదు. ఇక్కడ రేష్మని, మాదిగోల్ల పిలగాన్ని నిన్దించొద్దు. వాల్లనట్ల సమాజంలోకి పోనిద్దాం…

  6. సాహిత్యాన్ని అడ్డం పెట్టుకుని అవార్డులు, పోటిలలో బహుమతులు అడిగే వెధవ.

  7. ెల్లో.స్కి.నేను రాజు ను మాట్లాడుతున్న.వాస్తవాలని వక్రీకరించి వ్రాస్తే గొప్పకతకుడి వైతవ .నీలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టిన మాదిగ జాతిని అంతమొందించ లేరు.ముస్లిం గ మారక పోతే మా వాళ్ళు చంపేస్తారని నీవు అంటివి గద.అది రాయలేదు ఎందుకు.ఇప్పటి కైనా గుర్తు పెట్టుకో మాదిగవాడు మాదిగోనిగానే చస్తాడు గాని ముస్లిం గ మారదు.బుద్ధి మార్చుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు.ఖబడ్దార్ .

  8. కథ మధ్యలో ఆపేశావు .మిగతా నాటకం గుర్తుకు రావటం లేదా .నీ ముసుగు నేను తొలగించి ముగింపు ఇస్తాను చదువుకో .

  9. పాత్ర తిరగబడడం అంటే ఇదే!

Leave a Reply to pudota.showreelu Cancel reply

*