ఈలాంటి కథల్ని పల్లకీకెక్కించి మనమేం సాధిస్తాం??

మరో వుత్తమ కధ చూద్దాం. స్వాతి మాసపత్రిక మే 2012 లో  వి.రాజారామ్మోహనరావుగారు “ఉన్నంతలో” అనే కథ రాశారు.

భర్తకి జబ్బు చేస్తే ముక్కూమొహం తెలీని రామారావుని సాయం కోరుతుంది అరుంధతి. హాస్పిటల్‌లో చేర్పించి ఖర్చంతా భరిస్తాడు రామారావు. ఆ అప్పు తీర్చలేని అరుంధతి రామారావుతో సంబంధం ఏర్పరచుకొంటుంది. అరుంధతి భర్త మంగరాజు మంచానికే పరిమితమైపోడంతో ఆ సంబంధం కొనసాగుతుంది. తమ మధ్య అడ్డంగా మంగరాజు వద్దని వృద్ధాశ్రమంలో చేర్పించి, ఖర్చంతా తనే భరిస్తానన్న రామారావు ప్రతిపాదనని తిరస్కరిస్తుంది అరుంధతి. కథ చదివిన తర్వాత మనకు కలిగే ఆలోచన్లేంటి?

“రాజుకి ఆరునెలలుగా బాగోలేదు ఇల్లు కదలలేకపోతున్నాడు” అని స్వయంగా రాసిన రచయిత “అంత డబ్బు ఖర్చవుతుందని అని అరుంధతి అనుకోలేదు” అని తనే స్వయంగా చెప్పడం విశ్వసనీయంగా లేదు. అరుంధతికి నలభై రెండేళ్లు. అంతే కాదు. “ప్యాకింగ్ మెటీరియల్ తయారుచేసే ఓ ఫాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తూ, అనారోగ్య భర్తని పోషిస్తూ కాలం గడుపుతోంది అరుంధతి” అని రచయిత చెప్తారు. వాస్తవ దృష్టితో చూస్తే దాదాపు ఒంటి చేత్తో సంసారం నడుపుకు వస్తున్న  స్త్రీలకు కొంత “లోకజ్ఞానం” వుంటుంది. నలభయ్యేళ్ళ వయసు ఎంతో కొంత “తెలివిడి” తెచ్చే వుండాలి. అటువంటి స్త్రీ  ఏ రకమైన గత పరిచయం లేని ఒక పురుషుడు తన కుటుంబంపై అంత ఖర్చు పెడుతున్నప్పుడు వచ్చే పరిణామాల్ని ఊహించలేదని నమ్మలేం. అలా చూసినపుడు విధిలేక పరిస్థితులకు తలొగ్గే స్త్రీల పట్ల కలిగే సహజ సానుభూతి కలగదు. ఆ పాత్రపై ఒక సానుకూల దృక్పధమూ కలగదు. పాఠకులకు ఇది వాస్తవం కంటే కల్పన అనే నమ్మకమే ఎక్కువ కలుగుతుంది.

మరో విషయం చూస్తే అరుంధతి వుండేది ఒక రకం “వాడ”లో ” మీ యింటి ఎదురు సందులో వుంటాం” అని స్వయంగా ఆమే చెప్పింది. సందుల్లో వుండేది బీదజనమే. సాధారణంగా బీదవాడల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇరుగుపొరుగు జనం మూగుతారు. సహాయం చెయ్యలేకపోవచ్చు, డబ్బు ఇవ్వలేకపోవచ్చు కానీ అక్కడ ఒక రకం అలికిడి, కొంత హడావిడి కలగడం వుంటుంది. అటువంటిది అరుంధతి ఒంటరిగా వెతుక్కుంటూ రామారావు ఇంటికి రావడం కూడా కల్పనకి దగ్గరగా వుంటుంది.

వాస్తవంలో మనం ఆశించేదీ, అబ్బురపడేదీ ఈ వుమ్మడి తత్వం గురించే.. మధ్య తరగతిలో లేనిదీ అదే.

“నెలకి అరుంధతికి ఇంటికి పదివేల రూపాయలు ఖర్చవుతున్నాయి. అది అతనికి ఎంత మాత్రం భారం కాదు” అని రచయిత స్వయంగా రాస్తారు. తర్వాత “మరో పదివేలు ఖర్చు అవుతాయి” అని స్వయంగా రామారావు అంటాడు. ఒకరి కోసం నెలకి ఇరవై వేలు ఖర్చు పెట్టగలిగిన  “లోలోపల  సుప్తచైతన్యం లోని ఎడారిలాంటి ఒంటరితనాన్ని” భరించిన రామారావు, “భార్య తర్వాత మరే స్త్రీ పట్లా ఆసక్తి చూపించలేదు” అని నమ్మడం కష్టమే. ఇది వాస్తవంకంటే కల్పనకే బాగా దగ్గరగా వుంటుంది.

మంగరాజు కోసం డబ్బూ, సమయం ఖర్చుపెట్టగలగడం, రికామిగా వుంటూ డబ్బు సంపాదించగలిగే వున్నత వర్గ మనుషులకే సాధ్యం.  కింది వర్గానికి చెందిన అరుంధతిని సుళువుగానే సమాజం భాషలోని “నీతి” కోల్పోయే దానిలా చిత్రీకరించి, వున్నతవర్గానికి చెందిన రామారావుని జాలి, సానుభూతి, దయ వగైరా “గొప్ప” గుణాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం కల్పన కాదంటే నమ్మడం అస్సలు సాధ్యం కాదు.

కథ చదువుతూ పోయేకొద్దీ ఇది రచయిత ఆలోచనల్లోంచీ, కల్పనా శక్తిలోంచీ పుట్టిన కథే అన్నది బలపడుతూనే వుంటుంది. ఇక ఈ కథకి పాఠకులు(Takers) ఎవరు అని ఆలోచిస్తే..

ఏ వృత్తిలో, ఏ వ్యాపకంలో చూసినా పనిగంటలు పెరిగిపోయాయి. జానెడు పొట్ట కోసం తెగ బారెడు పని చేస్తూ నిరంతరం భయంతో, అభద్రతతో బతికేలా మనుషుల్ని తయారు చేస్తున్నది పెట్టుబడీదారీ. వాళ్లకి సాహిత్యాల్తో, కళల్తో పని లేదు. వుండదు. మొదట్నించీ కాల్పనిక సాహిత్యానికి ప్రధాన పోషకులైన జానెడు తీరుబాటున్న మధ్యతరగతి స్త్రీలోకం అదృశ్యమైపోతూ వున్నది. దాదాపు ప్రతి స్త్రీ, తన పొట్ట కోసం, సంసారం కోసం, బండెడు చాకిరీ చెయ్యక తప్పటం లేదు. అందుకే కాల్పనిక సాహిత్య పాఠకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పూర్తి కాల్పనిక, వ్యూహా చాతుర్యం మీద ఆధారపడ్డ ఇలాంటి కథల్ని కీర్తించి, భుజాలకెత్తుకోడం కల్పనకి తులసి నీళ్లు పోయడమే. సంస్కారాన్ని వున్నతీకరించడం సాహిత్యం ఇచ్చే ప్రయోజనం అనుకుంటే ఆ ప్రయోజనానికి ఈ కథ విలోమంగా వుంటుంది. పాత్రకి అరుంధతి అని పేరు పెట్టడం. ఏం చేసైనా సరే భర్తని కాపాడుకోవాలన్న సుమతి, సక్కుబాయిల్ని ఆదర్శంగా తీసుకొచ్చి చూపించే ప్రయత్నమూ, చుట్టూ వున్న వాస్తవానికి పూర్తి విరుద్ధం. పాత్రివ్రత్యం రాచరిక, భూస్వామ్య సమాజాల విలువ.

పోనీ కల్పనగా తీసుకున్న కథలో పెద్ద గొప్ప, ప్రత్యేకత కనబడకపోవడం బహుశః నా లోపమేనేమో? భర్త ఆరోగ్యాన్నీ, గౌరవాన్నీ, ప్రాణాల్నీ కాపాడ్డానికి తన శీలం (క్షమించాలి) పణంగా పెట్టడం ఎన్నోసార్లు చదువుకున్న పౌరాణిక వారసత్వమే. కథనం మామూలు వచనమే. పాత్రచిత్రణలో కూడా ఏకసూత్రత కనబడక ఒకే పాత్రపై విరుద్ధ భావాలు కలగడం కళావిలువల దృష్ట్యా ఓటమే. “ఏ అరమరికలు లేకుండా” మాట్లాడుకున్న రామారావు, అరుంధతిల మధ్య సంభాషణ గోరంత కూడా చెప్పకుండా మనిషి మారిపొయినట్లు చెప్పటం కథలో “టెంపో”ని పోషించదు. రామారావు భార్య ఎందుకు వెళ్లిపోయిందో చెప్పకుండా “అన్ని సౌకర్యాలు వుండి, ఏ ఇబ్బంది లేకపోయినా అదనపు సౌఖ్యమని తన భార్య ఎవరితోనో వెళ్ళిపోయింది” అనుకుంటాడు.

వెళ్ళిపోయే స్త్రీ పాత్ర  ఒకటి, సుళువుగా లొంగిపోయే స్త్రీ పాత్ర ఒకటి సృష్టించి, రిపీట్ , సృష్టించి వారి మధ్య ఒక దయామయుడైన పురుష పాత్రని ప్రతిష్టించి ఏ స్త్రీ పాఠకుల్ని గెల్చుకుందామనుకున్నారో అర్ధం కాదు. వారికేం చెప్పదల్చుకున్నారు? వెళ్లిపోవద్దా? భర్త కోసం ఏమైనా చెయ్యకూడదా? తన పాఠకుల పట్ల తనకే సరైన అవగాహన లేకపోయిన కథ ఏం సాధిస్తుంది?

ఈలాంటి కథల్ని పల్లకీకకెక్కించి మనమేం సాధిస్తాం??

–చిత్ర

మీ మాటలు

 1. Manjari Lakshmi says:

  విశ్లేషణ బాగుంది.

 2. ఆ కథ నేరుగా నేను చదవలేదు కానీ, కథ గురించి మీరు రాసిన విశ్లేషణ బాగుంది. స్త్రీలు అంటే బలహీనురుగా చూపించే ఈ తత్వం ఎప్పుడు మారుతుందో ..

 3. buchireddy gangula says:

  చిత్ర గారు
  మీ సమీక్ష బాగుంది —కథ తెలిసిపోయింది –పేలవంగా ఉంది
  ప్లస్ మగ — మైనస్ అడ — ఎందుకు స్త్రీ అనగానే చులకన — తక్కువ చూపు తో –
  దేనికి అ బేధం – అ తేడా ??
  రామ రావు సహాయం అంతా ఆమె తో — సెక్స్ కోసమే అని —చెత్తగా ఉంది
  ——————-
  బుచ్చి రెడ్డి గంగుల

 4. సమీక్ష బాగుంది .

 5. chitra garoo,

  visleshana chaalaa baagundi. vaastvamgaa aalochiste dabbu dorike maargaalu tattaka povu, rachayita kadha lo cheppinattu kaakundaa. vuttama kadha analemu.

 6. <>

  స్త్రీలను అణచి ఉంచడానికి, నోరెత్తనివ్వక ఫొవటానికీ ఇది చాలదా?ఇటీవలి గణాంకలను బట్టీ , వరకట్న కేసులు, కుటుంబ కలహాల కేసులు అత్యదికంగా నమోదైన రాష్ట్రం మన ఆంద్రప్రదేశేనట. ఒక తెలుగు టీవి చానల్లో చుశాను. అందులో ఒక స్త్రీ లాయర్‌ స్టేట్‌ మెంట్‌ ప్రకారం దీనికి కారణం స్త్రీలలో మునుపు లాగా ఓపిక లేకఫోవటమేనట! ఈ ఓపిక లేకపోవటాన్ని స్త్రీలలో చైతన్యంగా తీసుకోవాలా లేక దౌర్జన్యంగా తీసుకోవాలా?

  • ఈలాంటి కధల్ని పల్లకెక్కించి మనమేం సాదిస్తాం?? పై వ్యాక్య ఈ ప్రశ్నకు జవాబు.

మీ మాటలు

*