ఇప్పటికీ మించి పోయింది లేదు!

కె.ఎన్.వి.ఎం.వర్మ

కె.ఎన్.వి.ఎం.వర్మ

సాయంత్రం ఐదుకే చీకటి పోటెత్తింది
చలిగాలి ఊరు మీదకి వ్యాహ్యాళి కొచ్చింది
పెంట పోగు మీద ఎండుగడ్డి తెచ్చి
పాక చివర దోమలకి పొగ ఏస్తుంటే
దారి తప్పొచ్చిన వెన్నల
కుందేలు పిల్లలా తోటంతా గెంతుతోంది

ఒకానొక రోజు నువ్వేమన్నాయ్..
అంత మెహ మాసి పోయావా నాకోసం
అని అడిగావ్… గుర్తుందా?
ఇప్పటికీ మించి పోయింది లేదు

చూడు ఈ తోటంతా కలియ తిరుగు
పదహారు సెంట్ల మల్లెపందిరి చూడు
అత్తరు పూల సౌరభాలలో
నా నిశ్వాస పరిమళాలు అఘ్రాణించు
ఈశాన్య చెరువు గట్టు అఘ్నేయాన
వెచ్చని చలి మంట వేసుకొని
నిశ్చల తటాకంలో
చందమామని నన్నూ చూసుకొని మురిసిపోతుంటే

వెనుక నుంచి కుందేలు పిల్లలా దూకి
నన్నావహించకు,
ఒంటరిని చేసి పోతే
వ్యవసాయం చేసుకుంటానని
ఆ రోజే చెప్పాను….గుర్తుందా?

చూడు నిన్ను తలుచుకోగానే
మంచు కురిసిన తోట ఎలా నీరుగారిపోయిందో
ఇప్పటికీ మించి పోయింది లేదు
ఇక్కడ పండదని తెప్పించిన కాష్మీర్ కుంకుమ ఉంది
తోటలో నీ పాదాలు మోపగానే
బహుమతి ఇవ్వడానికి పసుపుకొమ్ము ఎదురుచూస్తోంది.

-కలిదిండి వర్మ

మీ మాటలు

 1. చాలా బావుంది వర్మగారు

 2. raamaa chandramouli says:

  బాగుంది.
  అభినందనలు.
  – రామా చంద్రమౌళి

 3. మొదటి , చివరి పేరాల్లోని పెంట పోగు, ఎండు గడ్డి , పసుపు కొమ్ము ,…………….. బాగున్నాయి సర్ ! వేటిని గూర్చి రాయాలో వాటి గురించి రాసేవారిలో మీరూ ఒకరు. మంచి కవిని మలీ ఇక్కడ పరిచయం చేసినందుకు సారంగ సారదులకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము

 4. మీ శైలి చాలా బాగుంది వర్మ గారు…

  థాంక్స్ ఫర్ ది నైస్ పొయిటిక్ ట్రీట్…

మీ మాటలు

*