సుబ్బక్క సుప్రభాతం

  నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇబ్బంది. అది తేల్చుకోలేకే పదేళ్లుగా నానా తిప్పలు పడుతున్నాను.  రాజకీయ, సాహిత్య విద్యార్థిగా నన్ను నేను భావిస్తాను.కార్యకర్తనని కూడా అనుకుంటాను.నాకు గుర్తున్నంత వరకూ ఇది నా ఏడోకథ. ఆంధ్రజ్యోతిలో వచ్చిన  పులిజూదం కథను మధురాంతకం నరేంద్రవారి కథావార్షికలోనూ, రైతు కథల్లోనూ తిరిగి అచ్చువేశారు. నాకు దోస్తవిస్కీ ఇష్టం. రావిశాస్ర్తి, పతంజలి, నామిని ఇష్టం.  –జి. ఎస్.రామ్మోహన్

***

“నా బట్టల్లారా..నా సవుతుల్లారా

మీ ముక్కులో నా సాడు బొయ్య

మీ చేతిలో జెట్ట బుట్ట

మీకు గత్తర తగల

మీ తలపండు పగల

మీ వొంశం మీద మన్ను బొయ్య…….”

సుబ్బక్క సుప్రభాతంతో పల్లె రెక్కలిప్పుకుంది.

చేతుల్తో మట్టి ఎత్తెత్తి బోస్తా శాపనార్థాలు పెడతా ఉంది. రామాలయం మైకులోంచి ఎంఎస్‌ సుబ్బలక్ష్మి గొంతు మంద్రంగా వినిపిస్తా ఉంది. దాన్ని డామినేట్‌ చేయడానికా అన్నట్టు సుబ్బక్క అరిచి అరిచి గసపెడతా ఉంది. కళ్లాపి ఇసురిసురుగా చల్లతా ఉంది.

“ఏందే పొద్దు పొద్దునే బిగిన్‌చేసినావ్‌….ఊళ్లో అందరికి సావొస్తా ఉంది. నీకు రావడం లేదే…”

చెంబు తీసుకుని బయలుకు బోతావున్న ఎంగట్రాముడు నడక తగ్గిచ్చి పెద్దరికం చూపిచ్చినాడు.

“తిన్నదరక్క సొయ్యం బట్టి కొట్టుకుంటా ఉంటి నాయనా…ఊరోళ్ల ముల్లెంతా మూటగట్టుకుని మిద్దెలు, మాడీలు కడ్తినాయనా…అందుకే సావొస్త లేదు”…

మాంచి రెస్పాన్స్‌ ఇచ్చి మళ్లీ తిట్ల పనిలో పడింది సుబ్బక్క.

“నీ నోట్లో నోరుబెట్టి బతికిందెవడే” అనేసి ఎంగట్రాముడు నడకలో వేగం పెంచేసినాడు.

సుబ్బక్కకు ఐదుగజాల దూరంలోనే తలకాయొంచుకుని ముగ్గేస్తున్న సుజాత అంతా జాగర్తగా గమనిస్తా ఉంది. ఎదిరింటి వాకిట్లో యాప్పుల్ల నములుతా సుబ్బారాయుడు జరగబోయే వినోదం కోసం ఎదురుచూస్తా ఉన్నాడు. ఆయన భార్య రాములమ్మ పేడకాళ్లు తీస్తా ఉంది గానీ మనసంతా ఇక్కడే ఉంది.  తలకాయొంచుకున్న సుజాతనే మద్దెమద్దెలో తలతిప్పి జూస్తా ఉంది.

“యా పూటన్నా ఒకరింటికాడ చేయి జాపితినా..ఒకరి సంగిటిముద్దకు ఆశపడితినా…పెతి నాబట్టకు నా యవ్వారమే, పెతి లంజెకి నా ఇంటిమీద కన్నే…మీ కుదురు నాశనం కాను”….

సుబ్బక్క డోస్‌ పెంచేసింది.

“ఏందే బాసిలా…పిల్లోళ్లు ఎవరో ఆడుకోడానికి పిడికెడు సిమెంట్‌ తీసకబోతే ఇంత గత్తర జేయాల్నా లేకిముండా”..తగులుకొనింది సుజాత. లంజె అనే పదం ఇనిపిచ్చేసరికల్లా ఆ ఆడబిడ్డకు రోసం వచ్చేసింది. అదే సుబ్బక్క కోరుకునేది. అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట.

“అది పిడికెడా..ఎవురే లేకిది…పొరుగింటి సొమ్ముకు ఆశపడేది ఎవురే”…సిమెంట్‌బస్తాను అరుగుమీంచి లాగిలాగి చూపిస్తా ఉంది సుబ్బక్క.

“ఒరే సుబ్బరాయుడా!..నువ్వు జూడ్రా..ఇది పిల్లోళ్లు తీసకపోయినట్టు ఉండాదిరా..మాటనేదానికి ఇంగితం ఉండాల….నా సవితి, ఇపుడు తేలాల…నా సిమెంట్‌ దెంకపోయిందెవరో తేలాల…ఆ లంజెవరో లంజెకొడుకెవరో తేలాల”…

అనవసరంగా ఇరుక్కుంటి గదరా అనుకున్న సుబ్బారాయుడు “నాకెందుకులేత్తా!..మీ ఆడోళ్ల యవ్వారాలు” అని నోరుకడుక్కోవడానికి బోరింగ్‌ దగ్గరకు బోయినాడు.

“లేస్తే లంజె అంటాండావు, ఎవురే లంజె, నువ్వే లంజె, నీ ఆరికట్ల వంశమే లంజె వొంశం” అని సుజాత కొంగుబిగిచ్చి ముందుకు దూకింది. వీధి వీధంతా తమాస జూడ్డానికి తయారైపోయింది. జాలాడి బండకాడ పెచ్చులూడిపోతే రాత్రి సిమెంట్‌ తీసుకునిపోయిన సుజాత మొగుడు శ్రీనివాసులు ఇంట్లోంచి తల బయటకు పెట్టింది ల్యా.

తాగిన మత్తులో సిమెంట్‌ అవసరమైన దానికన్నా నాలుగు పిరికిళ్లు ఎక్కువ తీసుకుని దారిలో పోసి ఇపుడు సుజాతను బోనులో నిలబెట్టిన పాపానికి మంచంలోనే అటూ ఇటూ దొర్లుతూ ఇంట్లోంచే ఈదిరామాయణం చూస్తా ఉన్నాడు.

ఊరోళ్లకు సుబ్బక్క యవ్వారం కొత్తదేమీ కాదు గానీ దగ్గరిళ్లోళ్లకు మాత్రం నాలుగైదు రోజుల్నించి ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ‘కొడుకు దగ్గరకు పోయొచ్చినాల్మించి మళ్లీ దీనికి రోగం తిరగబెట్టిందేమే’ అని పక్కింట్లో ఎంగటేసులు ఒగటే ఆశ్చర్యపోతా ఉన్నాడు.  ‘మొన్న మొన్నటి దాకా నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది, నా కొడుక్కి ఉద్యోగమొచ్చింది అని తప్పెటేసుకుంటా తిరిగిన ముండకి ఇపుడేమైంది’ అనేది అర్తం కాకపాయె.  ‘పెళ్లికి అందర్నీ హైదరాబాద్‌ తీసుకుపోయి రయిక గుడ్డలు గూడక పెడితిరి..ఇపుడేమాయె దీనికి’ అని బీడితాగతా పొగలు పొగలుగా ఆలోచిస్తా ఉన్నాడు.

హైదరాబాద్‌లో కొడుక్కి ఉద్యోగమొచ్చినాల్మించి సుబ్బక్క నెమ్మదిచ్చిన మాట వాస్తవమే. ఇల్లు బాగు చేయిచ్చుకోవడం, బేల్దారిని పిలిపిచ్చుకోవడం, రంగులేయిచ్చుకోవడం…బో కుశాలగా ఉండింది. మొగుడు పోయినాక సుబ్బక్కలో అంత నెమ్మది చూడడం అదే తొలిసారి. అవసరమున్నా లేకపోయినా ఇరుగింటికి పొరుగింటికి పోయి పనుల్లో చెయ్యేసేది. కొడుక్కి వచ్చిన బ్యాంకి ఉద్యోగం గురించి అడిగినోళ్లకు అడగనోళ్లకు వర్ణించి వర్ణించి చెప్పేది. ఊరోళ్లంతా ముసిల్దానా నువ్వు ఆడిదానివి కాదే, మొగరాయుడివే అంటుంటే పొంగిపోయేది. ఎవురైనా పొగుడుతుంటే బో సిగ్గుపడేది. సుబ్బక్క సిగ్గు పడగలదని ఊరోళ్లకి తెలిసిందపుడే. సర్కారీ నౌకరంటే సామాన్యమా!  లంచమివ్వకుండా ఏ ఎమ్మెల్యేతో చెప్పిచ్చుకోకుండా సుబ్బక్క కొడుక్కి ఉద్యోగం రావడమనేది ఊరోళ్లకి ఎంత బుర్ర చించుకున్నా అర్తమయ్యే విషయం కాదు.  సుబ్బక్క ఆ అద్భుతాన్ని సాధించింది.

‘నువ్వేమన్నా చెయ్యి నాయనా….నువ్వు సర్కారీ నౌకరి కొట్టాల..మనల్ని చిన్నతనంగా చూసినోళ్ల ముందు మొగోడివై మీసం తిప్పాల’. అని ఒగటే తారకమంత్రం బోధించింది. అతను కూడా అర్జునుడు పక్షి కన్నునే చూసినట్టు రేయింబవళ్లు ఉద్యోగాన్నే కలవరచ్చి కోచింగులు అవీ తీసుకుని పరీక్షలు అవీ రాసి కొట్టేసినాడు. సర్కారీ నౌకరయిపోయినాడు. ఊరిలో మొనగాళ్ల జాబితాలో చేరిపోయినాడు. అంతటితో ఆగిందా! ఆడు ఆడ్నే ఎవర్నో ఆడపిల్లను చూసుకున్నాడని తెలిసి ఏడెనిమిది లక్షలు పోయెగదరా బగమంతుడా! అని నాలుగైదు రోజులు బో బాధ పడింది సుబ్బక్క. ఉత్సాహమంతా నీరుగారిపోయి ఇరుగూ పొరుగుకు మొకం చూపిచ్చలేక యమ యాతన పడింది.  మామకు ఒగతే కూతురని, కొడుకుల్లేరని తెలిసి నిదానిచ్చింది. “కులమింటి కోతినే చేసుకుంటున్నాడమ్మో..ఏమో అనుకునేరు” అని ఇల్లిల్లూ తిరిగి వివరణ ఇచ్చింది.

బంధుబలగం అంతా పోయిం తర్వాత ఆ సింగిల్‌బెడ్‌రూం ఇంటి యవ్వారం చూసి కొత్త జంటకు అడ్డుగా ఉండడం మర్యాద కాదని వచ్చేసింది. రెండు నెలలు ఉగ్గబట్టినాక కజ్జికాయలు, బూందీ లడ్లు చేసుకుని ఎగురుకుంటూ పోయింది.

***

gs story copy

కజ్జికాయలు, బూందీలడ్లు చూసి కోడలు మొకం చిట్లిచ్చుకున్నా సుబ్బక్క పెద్దగా ఏమీ అనుకోలే. పట్నమోళ్లు ఇంగేమైనా నైసుగా జేసుకుంటారేమోలే అనేసుకుంది.

“మా ఊళ్లో అందరూ పామాయిల్‌తో చేసుకుంటారు.  నేనియ్యన్నీ సెనగనూనెతోనే చేసినానమ్మ!. మంచి బలం. తినాల. పెళ్లయిన కొత్తలో ఇట్టాంటియన్నీ తినాల!”….

ఏవో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కోడలికి అవేవీ వినడం ఇష్టం లేదని అర్థమై సైలెంటయిపోయింది. సుబ్బక్క గడబిడగా ఏదో మాట్లాడాలని అనుకుంటా ఉంటది. కోడలు పెద్దగా మాట్లాడదు. అన్నీ మొకం చూసి అర్తం చేసుకోవాల్సిందే.

“ఈడ నీళ్లు బాగున్నాయమ్మాయ్‌..మా వూర్లో అన్నీ సవ్వ నీళ్లు” అని ఇక్కడున్న సానుకూల అంశాన్ని ముందుకు నెట్టి మరోసారి మాట కలపాలని ప్రయత్నించింది సుబ్బక్క.

“మంజీర గదా, బానే ఉంటయ్‌”…అనేసి పక్కకు తిరిగి పనిమనిషికి ఏదో పురమాయిస్తూ బిజీ అయిపోయింది కోడలు. ఆ మాట తీరు కానీ హఠాత్తుగా బిజీగా మారిపోయిన తీరుగానీ ఇంకొక మాటకు అవకాశం లేకుండా చేశాయి. సుబ్బక్కకు సుర్రుమంది. కానీ తమాయించుకుంది.

ఆరోజు మద్యాన్నం సుబ్బక్క అలవాటు చొప్పున రొంటినున్న మూటలోంచి ఆకొక్క తీసి నమిలేసి రెండు పెదాలపై రెండు వేళ్లు పెట్టి గేట్‌మీదుగా వీధిలోకి ఉమ్మింది. ఖండాంతర క్షిపణి కంటే వేగంగా ప్రయాణించే పదార్థమది! ఆ సౌండ్‌ ప్రత్యేకం. కోడలు ఒక్కసారిగా తలతిప్పి చూసింది. అసహ్యం రంగరించిన చూపు.

‘ఏందిమే! నేనేమన్న లంజెతనం జేసిన్నా..దొంగతనం జేసిన్నా…ఏందీ బాసిలి ఈ మంతున జూస్తది’ అనుకుంది సుబ్బక్క. ఊరికే అనుకోవడమే గాకుండా ఆ మాటల్ని బయటకే అందామనుకుని నోరు తెరవబోయింది. కోడలు ఈ లోపు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దడేల్‌మని తలువేసుకుంది. అత్త ఎంత వేగంగా ఆకొక్క ఊసేయగలదో కోడలు అంత వేగంగా తలుపు వేసేయగలదు.

రోజూ వచ్చే దానికంటే ఒక అరగంట ముందే వచ్చినాడు కొడుకు. మంటలనార్పే ఫైరింజన్‌లాగా వచ్చినాడు.

“అట్లా బజార్లోకి ఊస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారమ్మా…ఇదేమైనా మనూరనుకున్నావా….అంతగా నమలాలనిపిస్తే ఇంట్లో వాష్‌బేసిన్‌ఉంది కదా..అందులో ఉమ్మేయ్‌”..అని సలహా ఇచ్చేసినాడు…ఇబ్బందికరంగా మసులుతూ కోడలివైపు అపాలజిటిక్‌గా చూస్తూ. ఆ చివరి వాక్యాలు కోడలికి నచ్చలేదని ఆ పిల్ల మొకం చూస్తే అనిపిస్తా ఉంది. దానికంటే కూడా కొడుకు కోడలికేసి అట్లా చూడడం సుబ్బక్కకు అర్థం కాలా. ఏ మొగుడైనా పెళ్లాందిక్కు అట్లా చూడడం ఆమె చూసి ఎరగదు.

మర్నాడు పొద్దున్నే పళ్లుగూడా తోముకోకుండా కోడలు కాఫీ తాగుతుంటే సుబ్బక్క కాసేపు గిజగిజలాడింది.

“స్నానం చేసి పూజ చేసి నోట్లో ఏదైనా ఏసుకోవాలమ్మా…పాసినోటితో తాగడం మంచిది కాదమ్మా”.. అనునయంగా  పెద్దరికం చూపిచ్చింది.

“చూడండి అత్తయ్యా!..ఎవరి అలవాట్లు వారివి. మీ అలవాట్లు మీవి. మా అలవాట్లు మావి. మిమ్మల్ని మారమంటే మారతారా”…

కోపంగా చెప్పినట్టు లేదు. గయ్యాలి తనం అస్సలే లేదు. అలాగని సౌమ్యంలేదు. వినయం మాటెత్తడానికే లేదు. స్థిరంగా ఉంది. కరుగ్గా ఉంది. మారుమాట మాట్లాడేందుకు వీలులేకుండా ఉంది. ఇక చాలు, ఊరుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పినట్టుగా ఉంది. మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఉంది. ఈ రకం గొంతు సుబ్బక్కకు తెలీనిది. ఈ పట్నపు నీళ్లలో ఏదో తేడా ఉంది అనుకుంది సుబ్బక్క.

‘చిన్నప్పటినుంచి మాటలు పడుడే. ఆ మొగుడు నాబట్ట  కాలితో చేత్తో  ఊర్కూర్కినే తన్నేది. మొగుడు పోయినాల్మించి ఊరోళ్లంతా ఏడిపిచ్చి చంపేది. చిన్నప్పటినుంచి ఒకరి మాట తాను వినడమే. తనమాట ఒకరు వినడం ఎరగదు. ఇంత కాలానికి ఒక కోడలు పిల్ల వచ్చింది. నాలుగు మాటలు చెప్పొచ్చు. కొంచెం పెద్దరికం చూపొచ్చు’ అనుకుని ఆశపడింది. “ఓసే ఎడ్డిదానా ఆడికి పోయి ఏం మాట్లాడతావో ఏమో” అని అందరూ అంటా ఉంటే అదమ్మాయ్‌..ఇదమ్మాయ్ లాంటి నైస్‌ మాటలు కూడా నేర్చుకోని వచ్చింది. ఈడ యవ్వారం చూస్తే తేడాగా ఉంది.

సుబ్బక్కకు కుడి కన్ను అదిరినట్టుగా అనిపిచ్చింది. ఆకొక్క తోనే యవ్వారం తెలిసొచ్చినా ఏదో ఒక ఆశతో ఉండింది. ఇపుడదీ పోయింది. ‘ఇది తన పెద్దరికానికి తలొగ్గే రకం కాదు. ఊర్లో తెలిస్తే ఎంత నామర్దా. పరువు తుట్టాగా పోదూ!’

“ఊపుకుంటా పోయింది ముసిల్ది. కోడలి చేత ముడ్డిమీద తన్నిచ్చుకుని ముంగిమాదిరి వొచ్చింది”…ఇరుగు పొరుగు అనబోయే మాటలు ఇపుడే వినిపిస్తా ఉన్నాయి సుబ్బక్కకు.

మర్నాడు మరో ఎపిసోడ్‌. సాయంత్రం వక్క అయిపోతే వాచ్‌మన్‌పెళ్లాం దగ్గర అడిగి తీసుకుని అక్కడే ముచ్చట్లలోకి దిగింది సుబ్బక్క. కోడలికి  తల కొట్టేసినట్టయ్యింది. ఎదురింటి ఫ్లాట్‌ ఆవిడ తన అత్తగార్ని ఆ స్థితిలో చూసిందని తెలిసి కోడలికి మరీ మరీ మండుతా ఉంది. మర్నాడు పొద్దునే అత్తను తీసికెళ్లి చందన బ్రదర్స్‌లో రెండు మాంచి కోకలు కొనిచ్చి ఈడున్నన్ని రోజులు అవే కట్టుకోవాలని చెప్పేసింది. “ఏందో అనుకున్నా గానీ కొంచెం మంచిపిల్లే” అనుకునింది సుబ్బక్క. ఇంటికి చేరాక వాచ్‌మెన్‌క్వార్టర్‌ దగ్గరకు వెళ్లకూడదని, వెళ్లినా వారితో సమానంగా కూచ్చొని కబుర్లు చెప్పకూడదని కోడలు మెత్తగా చెప్పేసింది. అపుడు అర్తమైంది కోడలు కొత్త కోకలెందుకు కొనిచ్చిందో!

దేవాలయానికి పోయొచ్చేసరికి స్టవ్‌మీద ఏదో సుర్రుమంటా ఉంది. ఏందా అని చూడబోతే కొడుకు ఉల్లిపాయలు తరిగి తాలింపు వేస్తా ఉన్నాడు. “ఏందిరా ఈడు ఆడంగి పనులు చేసేది” అని మనసు గింజుకుంది. కోడలు స్నానానికి పోయింది అని అర్తమైపోయింది.

“నీ పెళ్లాం జలకాలాడతా ఉంటే నువ్వు వంట చేస్తా ఉండావా, నువ్వు లే..నాయినా..నేజేస్తా గానీ, మొగోడివి నువ్వు చెయి కాల్చుకోవాల్నా……అది నీళ్లు పోసుకొనొచ్చి వంట చేస్తే కందిపోతాదా…ఇంత సదువుకుని ఏం పనిరా ఇది” అని చేతిలో గంటె లాగేసుకుంది.

“నువ్వుండమ్మా…చిన్నచిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా…క్యారేజ్‌ రెడీ కాకపోతే ఆఫీసుకు లేటయిపోదూ”…

“ఏందిరా ప్రతిదానికీ దాన్ని ఎనకేసుకురావడమేనా… అప్పుడే పెళ్లాం బెల్లం అయిపోయిందా నాయనా”

కొడుకు పని అటూ ఇటూ గాకుండా తయారైంది. భార్య ఎక్కడ ఈ మాటలు వింటుందో, ఎక్కడ అత్తా కోడళ్ల యుద్ధం బద్దలవుతుందో అని భయం. పైగా కోడలికి కచ్చితంగా వినపడాలనే తల్లి గొంతు పెంచి మాట్లాడుతున్నట్టు అర్తమవుతూనే ఉంది. అతనసలే బహు జాగ్రత్తపరుడు. సాయిబాబా భక్తుడు. ఎప్పుడూ ఎవరితోనూ గొడవపడే మనిషి కాదు.

కోడలికి సుబ్బక్క మాటలు వినపడ్డాయో లేదో తెలీదు. ఆమె అనుమతి లేకుండా ఆమె మొకంలో ఏ భావమూ పలకదు. వచ్చేసి వంటలో మునిగిపోయింది గంభీరంగా.

సుబ్బక్కకేమీ అర్తం కాలా. ఎదుటి మనిషి గొంతు పెంచి గొడవపడితే తడాఖా చూపించొచ్చు. కానీ ఇట్లా ఉంటే ఏం చేయాలో ఆమెకు తెలీదు. కానీ అంతకంటే కూడా ఆమెకు కొడుకు యవ్వారమే అంతుపట్టకుండా ఉంది. కోడలి కేసి కొడుకు కేసి మార్చి మార్చి చూసింది. కొడుకు చూపులు నేలమీదకు దించేసుకోని వంటగదిలోంచి బయటకు పోయినాడు.

‘ఎట్టాంటోడికి ఎట్టాంటోడు పుట్టినాడు! ఆ నాబట్ట ఎపుడన్నా ఇటున్న చెంబు అటు పెట్టినోడా…సుట్టకాల్చుకోవడానికి అగ్గిపెట్టె అడిగితే ఆడ్నే ఉంది అని చెప్పిన పాపానికి “ఏం తీసిస్తే అరిగిపోతావే లంజె” అని యీదంతా తిప్పితిప్పి కొట్టలా”….చచ్చిపోయిన భర్త గుర్తొచ్చి లోలోపల మెలిపెట్టింది. గతం తవ్వుకున్న కొద్దీ ఏడుపొస్తా ఉంది. కోడలిమీద యాడలేని కోపం తన్నుకొస్తా ఉంది.

తొలిరోజే కోడలు పిల్ల రెండు సార్లు అన్నం వండాల్సి వచ్చింది. మనుషులు అంత అన్నం తింటారని కోడలికి తెలీదు. సుబ్బక్క అన్నాన్ని గురుగులాగా చేసుకుని పైన ఇంత పప్పేసుకుని ఇంతింత ముద్దలు కళ్లకద్దుకుని లాగిస్తా ఉంటే చూస్తా ఉండేది. ఆ ఆశ్చర్యానికి అంతే ఉండేది కాదు. మూడో రోజూ కోడలు కళ్లలో అదే ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం సుబ్బక్క కంట పడకుండా ఉండాలనే పట్టింపు కోడలికేమీ లేదు.

వాళ్లు తినే తిండి కూడా సుబ్బక్కకు ఆశ్చర్యమే. రెండు పిరికిళ్ల అన్నం. అంతే సైజులో రెండు మూడు రకాల కూరలు. ఆ కొంచెం తిని మనుషులు ఎట్లా బతుకుతారో ఆమెకు అర్తం కాని విషయం. మౌనంగా ఉండడానికి ఆమె కోడలు పిల్లలాంటిది కాదు.

” ఇట్ట తింటే ఎట్ట!…తినాల నాయనా.. రాళ్లు తిని రాళ్లు అరిగించుకునే వయసు. బాగా తినాల.” అని ప్రేమ చూపిచ్చబోయింది.

“మీ లాగా తినాలంటే కష్టమండి. మేం చేసే పనికి అదే ఎక్కువ” అంది కోడలు పిల్ల.

“అంత కొంచెం కూరేసుకుని అంతంత అన్నం తినేయకూడదమ్మా. కూరగాయలు బాగా తినాల. అన్నం ఎంత తింటామో కూర అంత తినాల. నిజానికి కూరే ఎక్కువ తినాలంట. డాక్టర్లు అదే చెప్పేది”. రివర్స్‌ జ్ఞానబోధలోకి దిగాడు కొడుకు.

‘నోరు లేవాల్సినపుడు లేవదు గానీ ఇపుడు దాని మాటకు తాళమేయడానికి మాత్రం తయారైపోయినాడు’ లోలోపల కాలిపోతోంది సుబ్బక్క.

“ఏమోలే నాయన! ఇంత సంగటిమీద ఊరుమిడి ఏసుకుని తినిన ప్రాణం. ఇపుడు మారాలంటే యాడ మారేది!” ….మొకం అదోలా పెట్టి మాటల్ని ఈటెలు చేసి విసిరింది.

పేరుకు నాయనా అన్నా ఆ విసురు కోడలిమీదే అని తెలుస్తానే ఉంది.

“చిన్నప్పటినుంచీ కుదార్తంగా కూచ్చొని తిన్నది లేదు. ఇపుడు తిందామంటే కుదరకపాయె. అది తింటే బిపి. ఇది తింటే సుగర్. ఆ డాక్టర్ నాబట్టదగ్గరకు పోయొచ్చినాల్మించి సప్పిడి బతుకయిపోయె. కోడలు పిల్ల మరీ అన్యాయం. ఉప్పు లేదు,కారం లేదు..నోరు సప్పగా చచ్చిపోయింది.  రుచీ పచీ లేకుండా ఇదేం తిండో అర్తమే కాదు”….తనలో తాను మాట్లాడుకోవడం నేర్చేసుకుంది సుబ్బక్క.

ఊళ్లో ఆ ఇబ్బంది ల్యా. తల తిప్పితే ఎవురో ఒకరు. ఎవురితో మాట్లాడాల్సినయి వాళ్లతో. ఈడ ఎవురికెవురు!

ఎవురితో మాట్లాడడానికి లేదు. ఎవురితో మాట్లాడకుండా ఉంటే నోరు పూర్తిగా చచ్చిపోయి మూగిదాన్నైపోతానేమో అన్నంత భయమొచ్చేసింది సుబ్బక్కకు. వాచ్‌మెన్‌భార్యతో ముచ్చట్లొద్దని కోడలి ఆర్డర్‌. ఇంకెవురితో మాట్లాడేది! అదేందో, అందరూ తలుపులేసుకునే ఉంటారు జైల్లోమాదిరి! ఇది ఏమి బతుకురా బగమంతుడా! అని సుబ్బక్క ఎన్ని సార్లు అనుకునిందో చెప్పలేం.

బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు.

“అమ్మొక్కతే ఏం చేస్తాది,  తీసుకుపోదాం” అన్నాడు కొడుకు.

కోడలు నోరు తెరిచింది లేదు. కొడుకు దాన్నే అంగీకారంగా అన్వయించేసుకుని అమ్మా “నువ్వు కూడా తయారవు” అనేసినాడు. కోడలిది అనాంగీకారంగా అర్తమైన సుబ్బక్క “ఎందుకులే నాయినా…ముసల్దాన్ని యాడికొచ్చేది, మీరు పోయిరాండి” అనేసింది. ఇట్లన్నా రిమోట్‌కంట్రోల్‌ చేతికొస్తుందేమో,ఈ పూటన్నా చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌ చూడొచ్చేమో అని లోలోపల ఆశపడింది.

“లేదమ్మా..పోయేది గుడికే. సాయిబాబా దేవలానికి ..రా..చాలా బాగుంటది, చూద్దువుకానీ” చిన్నపిల్లలకు తాయిలం ఇస్తున్నట్టు ఊరించే గొంతుతో చెప్పినాడు కొడుకు.

గుడి అనేసరికల్లా సుబ్బక్క మనసు మారిపోక తప్పలే. ముసిలోళ్లుగా ఉండి దేవలానికి రమ్మంటే రాకుండా ఉంటే ఏమైనా ఉంటదా! సరేలే నాయనా అని బయలు దేరింది.

Kadha-Saranga-2-300x268

“ఎంత బెమ్మాండంగా కట్టినారురా…అబ్బో అబ్బో” అని సుబ్బక్క అదే పనిగా ఆశ్చర్యపోతానే ఉంది. మురికి కాళ్లు అడుగు పెట్టదగిన ఆలయంలాగా లేదది. అక్కడికొచ్చిన వాళ్లందరిలో తనలాంటి మనిషి తానొక్కతే ఉన్నానని అర్థమైపోయిందామెకు. “ఇది సదువుకున్నోళ్లు, పెద్దపెద్దోళ్లు వచ్చే దేవలం. తన లాంటోళ్లది కాదు” అని అర్తమైపోయింది.

గుళ్లోంచి బయటకు వచ్చింతర్వాత మొగుడూ పెళ్లాం గునా గునా మాట్లాడుకోవడం, ఇట్నించి ఇటే ఎక్కడన్నా బయట తినేసి ఇంటికిపోదాం అని కొడుకు ఎనౌన్స్‌మెంట్ ఇచ్చి చట్నీస్‌కి తీసుకుపోవడం అన్నీ ఒక పథకం ప్రకారం జరిగిపోయినాయి. ఈ దండగమారి హోటల్‌ప్లాన్‌ తన కోడలిదే అయ్యుంటాదని సుబ్బక్క అనుకునేసింది. ఆ చట్నీస్‌ అనే హోటల్‌లో కూడా తన లాంటి మనిషి తనొక్కతే ఉన్న విషయం, ఆ విషయాన్ని తనకు గుర్తు చేస్తున్నట్టున్న కోడలి చూపులు అన్నీ సుబ్బక్కకు అర్తమవుతానే ఉన్నాయి. కోడలు ఇడ్లీ దోసెతో సరిపెట్టేసుకుంది. సుబ్బక్క, సుబ్బక్క కొడుకు భోజనం కానిచ్చేసినారు. భోజనం తెచ్చిచ్చినోడు ఒక పుస్తకం లాంటిది పెట్టేసి దూరంగా చూస్తూ నిలబడినాడు. అందులో కొడుకు  రెండు అయిదొందల రూపాయల నోట్లు పెట్టినాడు. హోటల్‌వాడు మళ్లీ పుస్తకం తెచ్చిస్తే కొడుకు అందులోంచి ఒక్క వంద రూపాయల నోటు మాత్రం తీసుకుని మిగిలింది ఉంచేసినాడు. అన్నింటినీ సుబ్బక్క ఇచ్చిత్రంగా చూస్తా ఉంది.

“ఎంతయినాదిరా” అని అడిగింది గేట్లోంచి బయటపడగానే.

అప్పటిదాకా ఉగ్గబట్టుకుని ఉంది. అడక్కపోతే పొట్ట పగిలిపోయేట్టు ఉంది. కొడుకు ఏదో మాట్లాడబోయేంతలో….

“ఎంతయితే ఏమిట్లెండి” అని అడ్డుపడింది కోడలు పిల్ల.

“అన్నింటికి నువ్వు అడ్డమొస్తావేందిమే…మొగోడు మాట్లాడుతుంటే మద్దెలో మాట్లాడొచ్చునా…ఇదేం పద్దతమ్మాయ్‌..నీకు నీవాళ్లు పద్దతి సరిగా నేర్పిచ్చినట్టు లేరు”…సుబ్బక్క అసలు అవతారంలోకి వెళ్లిపోయింది. కొడుక్కి విషయం అర్తమైపోయింది.

“నేనేం చెప్పాను, మీరేం మాట్లాడుతున్నారు. పెద్దవాళ్లు కదా అని గౌరవమిచ్చి మాట్లాడితే మావాళ్లగురించి మాట్లాడతరేంటి…..అయినా మీకెందుకివ్వన్నీ”….పక్కనున్న మనుషులకు వినపడకుండా లోగొంతుకతో అయినా గట్టిగానే ఇచ్చింది కోడలు. ప్రపంచంలోని చిరాకు అసహ్యం అంతా రూపమెత్తినట్టు ఉంది ఆమె ముఖం.

హోటల్‌ బయట ఎక్కడ సీన్‌ క్రియేట్‌అవుతుందో అని కొడుకు గడగడలాడుతూ ఉన్నాడు. అతనసలే గొడవలంటే ఇష్టపడని మనిషి. దేనిమీదైనా ఒక వైఖరి తీసుకోడమంటే అతనికి మా చెడ్డ చిరాకు. సిగరెట్‌తాగని, మందు కొట్టని తనలాంటి మంచి మనిషికి ఇలాంటి కష్టం ఆ సాయినాధుడు ఎందుకు తెచ్చిపెడతాడా అని అతను ఆలోచిస్తా ఉన్నాడు. మౌనంగానే అంతా ఇల్లు చేరుకున్నారు. అక్కడ కొడుకు మొకం చూసి ఇబ్బందిని అర్త చేసుకుని మర్యాద కాపాడడానికి తమాయించుకుంది సుబ్బక్క. రగిలే బడబాగ్నిని దాచుకున్న అగ్ని పర్వతం ఇంటికి రాగానే లావా చిమ్మడం మొదలెట్టింది.

“అయినా ఏందిరా నీ పెళ్లాం! నేను దాన్నేమయినా అంటినా..నిన్ను కదా అడిగితి. మద్దెలో అడ్డమెందుకు రావాల. అయినా మగోడు మాట్లాడుతుంటే ఆడది మద్దెలో వచ్చేదేందిరా…అయినా నేనేమంటి… ఎంతయిందిరా అని అడిగితి” గాలి పీల్చుకోవడానికన్నట్టు ఓ క్షణం ఆగి కోడలి వైపు చూస్తూ అంది…..

“అదే తొమ్మిదొందలు పెడితే నాకు నెల గడిచిపోతుంది గదరా ఊళ్లో”

“మీ ఊరువేరు, ఇది వేరండి. ఎక్కడి పద్ధతులక్కడ ఉంటాయి. మమ్మల్ని కూడా మీలాగే బతకమంటారా”..

కోడలి గొంతు ఎపుడూ లేనంత ఆవేశంగా ఉంది. శరీరం వశం తప్పుతున్నట్టు ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌.

“మా లాగా మీరెట్ట బతుకుతరమ్మా….నువ్వు మహారాణివైపోతివి…నీ మొగుడొక మహారాజైపోయె. నీ మొగుడిలాగా నా మొగుడు ఉద్యోగస్తుడు కాదే. మట్టి పిసుక్కునేటోడు. కడుపు మాడ్చుకుని తినీతినక ఎంత జాగ్రత్తగా ఒక్కో రూపాయిని కూడబెడితే  నాయనా..నువ్వు డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదిచ్చింది? రూపాయి వచ్చినపుడు దాచిపెట్టుకోవాల నాయనా! ఈ బాసిలి కేమీ డూండాంగా తిరగాలంటాది. .మీరొండుకునే రెండు బొచ్చెలు తోమడానికి పనిమనిషి అవసరమా నాయనా! ఏం, నీ పెళ్లాం చేతులు బొబ్బలెక్కుతాయా…. దొరల కుటుంబంలో పుడితిమా నాయనా! అంతంత కర్చుపెట్టి కోకలు కడితేనే కట్టినట్టా నాయనా! అంతంత పెట్టి అట్టాంటి హోటల్లో తింటేనే తిన్నట్టా నాయినా! తొమ్మిదొందలంటే ఎంత కష్టపడితే నాయనా వచ్చేది. ఇద్దరు మడుసులకు నాలుగిత్తులు ఉడకేసుకోవడం కష్టమా నాయనా! ఉద్యోగం రావడం తోనే మొగోడివై పోవు …రూపాయి రూపాయి దాచిపెట్టుకుంటేనే రేపు నువ్వు మొగోడనిపిచ్చుకునేది. ఊర్లో మీసం మెలేసి, బాంచత్! పలానోడి కొడుకు ఈడు అని తిరగాలంటే ఇట్టయితే అయితదా నాయనా! ఇంట్లో ఆడిబిడ్డ అంటే ఎట్టుండాలా?.. మొగోడు దుబారా అయినా అది జాగ్రత్త చేసి పైసా పైసా కూడెయ్యాల. ఇట్టయితే అయితదా నాయనా! సంసారం ఈదుకొచ్చే ఆడిదేనా ఇది! ఇట్లాంటి ఐసాపైసా దాంతో ఉన్నది ఊడ్చేసుకుని పోవడమే కదా నాయనా!”..

కాసేపు గస పోసుకోవడానికి ఆగింది. ముక్కు చీదుకుంది. కళ్లలో నీళ్లు పెట్టుకుంది.

ఇంటిదగ్గర నేర్చుకుని వచ్చిన అమ్మాయ్‌..లాంటి నైసు మాటలు మాయమై ఒరిజినల్‌ పూర్తిగా బయటికొచ్చేసింది.

కొడుకు ఒక్కమాట కూడా మాట్లాడకుండా నేలచూపులు చూస్తున్నాడు. మధ్యమధ్యలో కొద్దిగా తలపైకెత్తి కోడలి ముఖం వైపు ఇబ్బందిగా చూస్తున్నాడు. కొడుకు యవ్వారంతో సుబ్బక్కకు మరీ మంటెత్తింది.

“ఆడంగి నా కొడుకు పుట్టినావు కదరా…ఆయన ఎట్టుండేటోడు”. భర్తను గర్వంగా గుర్తు చేసుకుంది.

“నోరెత్తనిచ్చేటోడా…నోరెత్తితే ఎగిచ్చి ఎగిచ్చి తన్నేటోడు కాదు!”….

“మొగోడ్ని నేను మాట్లాడుతుంటే మధ్యలో నోరెత్తుతావే ముండా”….భర్త ఉగ్రస్వరూపం గుర్తొచ్చి బొటాబొటానీళ్లు కార్చేసింది సుబ్బక్క.

“మొగోడంటే అట్టుండాల. అయినా ఆడదాన్ని నోరెత్తనీయొచ్చునా! మొగోడంటే ఎట్టుండాల…పౌరుషముండొద్దూ. ఆడదాన్ని మాట్లాడనిస్తే మొగోడికి గౌరవముంటదా!”

కొడుకుతో మాట్లాడుతుందో, తనలో తానే మాట్లాడుతుందో తెలీనట్టుగా మాట్లాడేస్తూ ఉంది సుబ్బక్క.

స్టాచ్యూ అన్నట్టు నిలబడి పోయి చూస్తా ఉంది కోడలు పిల్ల. అత్తగారి ప్రవాహం చూశాక ఆపడానికి తన శక్తి సరిపోదని అర్థమైపోయింది. మధ్యలో ఆవేశం తెచ్చుకొని ఏదో మాట్లాడబోతే కళ్లతోనే వారించాడు కొడుకు. ఉడికిపోతా ఉంది. తట్టుకోలేకపోయింది.

“చీ..ఎదవగొడవ…ఎదవ మొకాలు” అనేసి విసురుగా లోపలకుపోయి దడాల్న తలుపేసుకుంది.

“ఏం మాటలయి..ఏం మాట్లాడుతున్నావ్‌ నువ్వు” …కొడుకు తలుపు వైపు తిరిగి అరిచినట్టుగా గొణుగుతున్నాడు.

“ఎవురే, ఎదవ మొకాలు”. ….ముక్కు చీదడం ఎక్కువ చేసింది సుబ్బక్క.

“నువ్వు జమీందారీ బిడ్డవి అయిపోతివి. ఉద్యోగస్తుడైన నాబిడ్డ, నేను ఎదవ మొకాలమైపోతిమి. ….ఏం మొగోడివిరా నువ్వు. అదట్లా నోరేసుకుని మాట్లాడుతుంటే”…ఆ రూట్లో నరుక్కొచ్చే ప్రయత్నం చేసింది సుబ్బక్క.

ఎవురు నోరేసుకుని మాట్లాడుతున్నారో అర్థం కానట్టు నిలబడి…”ఎందుకిమ్మా చిన్నదానికి ఇంతగొడవ” అని ఏవో సణుగుతూ నుంచున్నాడు కొడుకు. అతనసలే గొడవలంటే పడని మనిషి.

“కట్నం తీసుకోకుండా పెళ్లిచేసుకున్నాడే  నా కొడుకు నిన్ను! పది పదిహేను లచ్చలొచ్చేయి నా చిన్నాయన మనుమరాలిని చేసుకొనుంటే! ఎట్లుండేది అది! ఎంత మర్యాదగా ఉంటదది! నీలెక్కన పోలేరమ్మలాగుంటదా! ఎంత మర్యాద, ఎంత మన్నన! ఈడు నా మాటిని దాన్ని చేసుకునుంటే నాబతుకిట్టయ్యేదా!”

“ఆ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఖర్చే ఐదులక్షలయ్యింది మా డాడీకి. ఊరికే వస్తుంది కదాని బస్సేసుకుని ఒక మందని దింపారు ఇక్కడ. పెళ్లిని జాతర జేశారు”.. కోడలు తలుపు వెనకనుంచే అరుస్తోంది..

యవ్వారం ఎట్నుంచి ఎటుపోతోందో అర్థం చేసుకున్న కుమారరత్నం “అమ్మా..అవన్నీ తవ్విపోయకు. చిన్నదానికి రాద్దాంతం చేసేస్తున్నావు. ఇపుడేమైందని, ప్రశాంతంగా ఇంత తిని ఉండొచ్చు కదా, ఎందుకియ్యన్నీ నీకు” అని అసహనంగా అనునయించాడు.

“పెద్దామె ఏదో అంటే నువ్వు మళ్లీ మాట్లాడాల్నా…కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది!”..తలుపు వైపు తిరిగి అటువైపు చెప్పాల్సింది అక్కడ చెప్పేసాననుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.

“ఊళ్లో తిండిలేకనే నీదగ్గరకొస్తి నాయనా. తిని ఉన్నీకి. అంతేలే నాయనా. పెళ్లాం బెల్లం, తల్లి అల్లం. ఉరే, నానా గడ్డి తిని పైసా పైసా కూడబెట్టి చదివిచ్చినానురా..నిన్ను. ఇంత చేసి ఉద్యోగస్తుడ్ని చేసి దీని ఎదాన పడేస్తి కదరా నిన్ను” ముక్కు చీదుకుంటా ఘోరంగా ఏడుస్తోంది సుబ్బక్క.

తలుపు వెనుకనుంచి కోపంతో నిస్సహాయతతో బుసలు కొడుతోంది కోడలు. “లేబర్‌ మనుషులు, లేబర్‌ బుద్ధులు” అని ఏవోవో గొణుక్కుంటా ఉంది.

కొడుకు చూపులు మరింత నేలబారుగా దిగిపోయాయి. ఏం చేయాలో తెలీదు. ఎలా అనునయించాలో తెలీదు. ఎవర్ని అనునయించాలో తెలీదు. ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే  అతనికి మా చెడ్డ చిరాకు.

అతనసలే గొడవలంటే పడని మనిషి. సాయినాధుడి సన్నిధిలో ప్రశాంతంగా గడపాలనుకునే మనిషి.

***

“అవునే, నువ్వు దొజస్తంభం లేపిన పెతివ్రొతవి. మాదే లంజె వొంశం”…..సుజాత గొంతు పీలగా పలుకుతా ఉంది.

“కాకపోతే ఒకరి కూడికి ఆశపడితిరే లేకిముండా….నా కష్టం నేను పడుకుంటా నా బతుకేదో నేను బతుకుతా ఉంటే అందరికీ నామీదే కన్నేమే సొట్టముండా…. వయ్యారంగా తిప్పుకుంటా తిరగడం కాదే, కష్టపడితే తెలుస్తాదే…కష్టపడి బతకాల. మొగోళ్లా బతకాల. బాంచత్‌ అని ఒకడి మొకం మీద కొట్టినట్టు బతకాల. ముడ్డి తిప్పుకుంటా మాటలు చెప్పుకుంటా తిరగడం కాదు….”

గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క.  గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది.

సుజాతకు ఇచ్చిత్రంగా అనిపిస్తా ఉంది. ఇంతకుముందుకూడా ఇది నోరేసుకుని బతికిందే కానీ ఇట్టా ఎదుటోళ్లని తిట్టేటపుడు ఏడవడం ఏనాడూ చూడల్యా.

సుబ్బక్క సుజాతనే తిడుతోందో..ఇంకెవర్నయినా తిడుతోందో అర్థంకాక  జుట్టు పీక్కుంటా ఉన్నాడు పక్కింటి ఎంగటేశులు. సిమెంట్‌ తీసకపోయినదానికి ఇంత ఏడుపు దేనికో అతనికి ఎంత ఆలోచించినా అర్తం కావడం ల్యా.

 

జి ఎస్‌ రామ్మోహన్‌

కథకు బొమ్మ గీసిన వారు : అక్బర్

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. haritha devi says:

    మా నాయనమ్మని గుర్తుకు తెచ్చారు.మీరుకూడా భారాన్నే మోపారు మాపై.

  2. ప్రకాశం జిల్లా భాషతో కధ రక్తి కట్టింది. పాపం సాయిబాబా భక్తుడికి ఎన్ని కష్టాలు తెచ్చారు!!

  3. raghava reddy says:

    చాలా బావుంది కధ.ముఖ్యంగా characteraisation -ఎంత సహజం గా కుదిరాయి సంభాషణలు-ఐతే ఒకటి!ఆ నామిని అనేవాడు ఇలా ఎవరం రాసినా ఆ రాసింది ’చిన్న’గా కనపడేలా చేశాడబ్బా!

  4. pudota.showreelu says:

    కత చాలా బాగుంది పల్లెటూళ్ళో ఆడోళ్ళు పిల్లి మీదనో కుక్కమీదనో పెట్టి కడుపులోని సొద అంతా వెల్లబోసుకుంటారు సుబ్బక్కకి గుప్పెడు సిమెంట్ దొరికింది వెల్లబోసుకోవటానికి సంబాషణలు సహజంగా ఉండి కతకు విలువ పెంచాయి

  5. పద్మప్రియ says:

    కధ బావుంది. సుబ్బమ్మ పాత్ర ఒక ప్రవాహంలాగా సాగిపోవటమూ బావుంది. ఒక వైఖరి తీసుకోలేని కొడుకు …( “ఏ ఆక్రోశం ఏగొడవకు దారితీస్తుందో ఏది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో ఆలోచించాలంటేనే అసహనం. కారణాలు తెలీవని అనలేం. కానీ తెలుసుకునే కొద్దీ చిరాకు. ఇలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడడమే అతనికి మా చెడ్డ చిరాకు” ). తనదైన పట్నపు పద్ధతిలో కోడలి పాత్రలూ…సహజంగా ఉంది.

    భాషా, నుడికారమూ….నామిని గారు గుర్తుకొచ్చారు…

  6. Mallikarjuna Rao Chintala says:

    కధ చాలా బాగుంది …..బాల్యంలో మా ఇంటి దగ్గర వాతావరణం కనబడుతుంది ..ప్రకాశం జిల్లా వ్యావహారిక బాష కధకు అదనపు ఆకర్షణ . అజ్ఞాతంలో ఉన్న ప్రత్యర్థిని జుట్టుపట్టుకుని బయటకు ఈడ్చుకురావడంలో సుబ్బక్క దిట్ట…. అసహ్యం రంగరించిన చూపు.వాక్యాలు బాగున్నై.

  7. మోహనరాజు says

    కధలో పల్లెటూరి భాష, యాస భాగుంది. చదువుతున్నంత చేపు మావూరిలో మా పక్క్లింటి ముసలావిడ గుర్తుకొచ్చింది.ఒక్కసారిగా మనసు వూరి వైపు లాగింది.

  8. రెడ్డి రామకృష్ణ says:

    కథ చాలా బాగుంది.వడివడిగా సాగిపోయింది.కాకపోతే తిట్లు కొంత సమ్యమనం తో ఉంటే బాగుండేదనిపించింది.సహజత్వం కోసమే ఐనా కొన్ని మాటల్ని వాడకుండా కూడా వాటిభావ తీవ్రతని చెప్పవచ్చనుకుంటాను.

  9. బావుంది . వారంతో సరిపెట్టారు గానీ ఒక నెల గురించి రాసి ఉంటె నవల అయిపోయేది . సూర్యకాంతం సావిత్రి హరనాథ్ అందరూ ఉన్నారు పాత సినిమా మళ్ళీ ఒకటి చూసేను సరే కాని మాకేమి చెప్పదలచు కున్నారు మేము ఏమి నేర్చు కోవాలి ఈ కథ చదివి. ? మీకు ఒక ప్రాంతపు భాష బాగా తెలుసు అనా ? ఆడ వాళ్ళు పల్లెటూళ్ళో బూతులు మాట్లాడుకుం టార నా ? ఈ 2013 లో కూడా పల్లెల్లో భాష మారలేదు అనా ? దయచేసి చెప్పరా ? ఈ కథ ఎందుకు రాసారు ? ఎందుకు చదవాలి ?

  10. కథ లో భాష బాగా వొచ్చింది.. కొడుకు ని ఎంతో కష్టపడి ఉద్యోగస్తున్ని చేస్తే దక్కకుండా పోయాడనే తల్లి(దండ్రుల) బాధ బాగా వొచ్చింది. ”గసపెడతా తిడతా ఉంది సుబ్బక్క. గుండెలు ఎగిసేట్టు ఏడుస్తా తిడతా ఉంది.” ఇక్కడ సుబ్బక్క తిట్టేది ఈ ప్రపంచకమ్ మొత్తాన్ని. పట్నం వొచ్చిన కొడుకూ కోడళ్ళ కథలు 90 శాతం ఇలాగే ఉంటున్నాయి. మరి కోడలు తరఫున ఆలోచిస్తే కూడా ఒకింత సంఘర్షణ తప్పక వెంటాడుతుంది..
    కథ పేరు కుదరలేదు. వ్యంగ్యంగా ఉంది.

  11. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. రచన పూర్తికాగానే రచయితకు దానికి బంధం తెగిపోవాలి. రచయితలు దాని గురించి మాట్లాడడం బాగుండదు. టెక్ట్స్‌లోంచి ఎవరికి వారు వారికి తోచింది, నచ్చింది, అర్థమైంది తీసుకుంటారు. కానీ చిత్రగారు మరీ మౌలికమైన ప్రశ్నలు వేశారు. సమాధానాలు కూడా సీరియస్‌గా ఆశిస్తున్నట్టున్నారు. వారిని నిరాశపరచడం ఇష్టంలేదు. కాబట్టి నాలుగు మాటలు.
    చిత్రగారూ!
    నేరుగా చెప్పదల్చుకుంటే అది వ్యాసం అవుతుంది. కథ కాదు. కథలో చెప్పదల్చుకున్నది అంతర్లీనంగానే ఉంటుందనేది మీకు తెలీనిది కాదనుకుంటా. ఫీల్‌ అని అంటారే అట్లాంటిదేమో ఉంటుంది. అది అందకపోతే అది వేరే కథ. అది కథకుడి నైపుణ్యం, పాఠకుడి(పాఠకురాలి) ఎక్స్‌పోజర్‌ లాంటి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కథలో సూర్యకాంతం, సావిత్రి, హరనాధ్‌ కనిపించారన్నారు. దాంతో మాత్రం ఏకీభవించలేను. పరమ చెత్త కథ అనండి. అదొక అభిప్రాయంగా తీసుకుంటాను. పెద్ద కత్తి తీసుకుని కథను ఖైమా కింద కొట్టయండి. ఇబ్బంది లేదు. ప్రసంశ కంటే నాకు విమర్శే అవసరం. కానీ కథలోని కారెక్టర్స్‌ ప్లాట్‌ కారెక్టర్స్‌ అంటే మాత్రం ఒప్పుకోలేను. నాకు కథన నైపుణ్యం ఎంత ఉందో ఎంత లేదో నాకు తెలీదు కానీ ప్లాట్‌ కారెక్టర్స్‌ మాత్రం ఉండవు గాక ఉండవు. మీరు మరోసారి కథ చదవాల్సిన అవసరం ఉందని చెప్పడానికి సాహసించుచున్నాను. సరే, ఇలా కథను వివరించడం కష్టం గాని నేరుగా చెప్పుకోదగిన కొన్ని గంభీరమైన విషయాలు మాట్లాడుకుందాం. ఎద్దులబండికి మెట్రో రైలుకు మధ్య చాలా గొడవ ఉంటుంది మాస్టారూ. ఇది కొత్త దేమీ కాదు. ఇక్కడ రైలు కేవలం రైలు కాదు. ఆధునికతకు అదొక చిహ్నం. పల్లె- పట్నం మాత్రం కేవలం మనుషుల సంఖ్యమీద ఆధారపడిన విషయాలు కాదు కదా! వాటితో ముడిపడిన ఆర్థిక సామాజిక వ్యవస్థలకు సూచికలుగా కూడా ఉపయోగిస్తాం. పట్నానికి పల్లెకు గొడవ కేవలం ఆర్థికరంగానికి మాత్రమే పరిమితమైనది కాదు. జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో దాని ప్రతిఫలనాలు ఉంటాయి. మనం తీసుకోదగినవీ ఉంటాయి. తీసుకోలేనివీ ఉంటాయి. అవసరాలు, ఆడంబరాలు, తిండీతిప్పలు, నాగరకత, అన్నింటికీ నిర్వచనాలు మారిపోతాయి. కొన్ని సందర్భాల్లో తారుమారవుతాయి. కొత్త ఆర్థికవ్యవస్థలో ఇంటిపనికి బయటిపనికి విలువలో ఉన్న అంతరం తగ్గిపోవడమనే చైతన్యం రాక తప్పదు. మగవాళ్లు ఇంటిపనిలో పాలు పంచుకోక తప్పదు. శారీరక శ్రమకు విలువ పెరగకా తప్పదు. జీవితంలో ఎక్కువ అణచివేతకు గురైన సమూహాలు సాపేక్షకంగా గాలిపీల్చుకోగలిగిన వాతావారణం ఏర్పడకా తప్పదు. అది ఒకరిచ్చేదికాదు. ఎవరు అడ్డుకున్నా ఆగేది కాదు. వ్యవస్థలోనే ఇన్‌బిల్ట్‌. సోషల్‌ మార్కర్స్‌ మెటీరియల్‌ మార్కర్స్‌గా మారిపోక తప్పదు. అది రెండు జీవనశైలుల మధ్యా చాలా ఘర్షణ తెస్తుంది. ఆ ఘర్షణ దగ్గరివారి మధ్య తలెత్తినపుడు బాధాకరంగా ఉంటుంది. పోలేరమ్మ నుంచి షిర్డీశాయి దాకా ప్రయాణం నల్లేరు మీద నడకలాగా ఉండదు. అలాగే సమానత్వంలో కాకుండా ఆధిపత్యంలో ఆనందం పొందే లక్షణమేదో మనుషులందరిలో కనిపిస్తా ఉంది. కొన్ని సార్లు అది ప్రత్యేకత అనే ముసుగు తొడుక్కోవచ్చు గాక, అది వేరే కథ! ఆ అవకాశం మనకు లేకపోతే ఆ అవకాశం ఉన్నవాళ్లను తిట్టిపోస్తూ సంతృప్తి పొందే లక్షణమూ ఉన్నది. అర్థం చేసుకోవడానికి వివరించడానికి పదాల్లో ఒదగని కష్టమైన పదార్థం మనిషి. ఆధిపత్య ప్రదర్శనలో కూడా పట్నానికి పల్లెకు తేడా ఉంటుంది. తృప్తి, అసంతృప్తి, ప్రేమ, కోపం, నిస్సహాయత, అసూయ, ద్వేషం వగైరా ఒకదాంట్లోంచి మరోదాంట్లోకి మారిపోతూ ఉంటాయి. మొన్న బాగున్న నీళ్లు ఇవాళ తేడాగా అనిపిస్తాయి. ఒకచోట అరుపు ఆయుధమైతే ఇంకో చోట మౌనం ఆయుధమవుతుంది. మనుషులు చెడ్డవారనో మంచివారనో మనం గుణవిభజన చేయనక్కర్లేదు. టైమ్‌ అండ్‌ స్పేస్‌ అనేవి ఉన్నాయి చూశారూ అవే నిజమై హీరోలు, విలన్లు. నేనేం అడిగానూ మీరేం చెపుతున్నారూ అనబోతారా! అంతే మాస్టారూ, మనిషి లాగే కథ కూడా వివరించానికి పదాల్లో ఒదగని సంక్లిష్ట పదార్థం. థ్యాంక్యూ!

  12. రామ్మొహన్‌ గారు,
    కధ చాలా నచ్చింది. అదీ ఒంగోలు జిల్లా బాషను ఉపయోగిస్తూ రాసిన కధను మొట్ట మొదటిగ ఇప్పుడే చదవటం. మా వూరు చూసినంత ఆనందంగా వుంది. ఈ కధ పెద్ద కధలా అనిపిస్తే చదవలేదు. చదవక పోయి ఉంటే ఏదో మిస్సయ్యేవాడిని.
    ఇది ఒక వాస్తవ చిత్రికరణ. ఇందులో తరాల అంతరాలతో బాటు గ్రామ, పట్టణాలమధ్య సాంస్కృతిక వైరుధ్యాన్ని- అదీ ఆర్దిక సంస్కరణల నేపద్యం లో వచ్చిన వైరుధ్యాలను బాగా చూపినట్లే నేను బావిస్తున్నాను.

  13. Kuppili Padma says:

    సుభక్క ఎవ్వరికీ చెప్పుకోలేని మనసులోని బాధని ఉన్నదున్నట్టు వ్యక్తపరచటం చాల powerful గా రాసారు రామ్మోహన్.. స్త్రీలు నిస్సహాయంగా నిలబడిన సందర్భాలలో తమ మనసులోని ధుక్కాన్నిరకరకాలుగా వ్యక్తపరుస్త్తుంటారు. ముగ్గురి జీవితాలోని నడుస్త్తున్న జీవిత వైరుధ్యాన్ని అందులోంచి వచ్చే మానసిక కష్టాన్ని రామ్మోహన్ గారు రాసిన పద్దతి భలే ఉంది. congratulations Rammohan …

మీ మాటలు

*