కవిత్వం మైమరుపు కాదు, ఒక ఎరుక : లాలస

లాలస

లాలస

కొన్ని వాక్యాలు చదవగానే ఎక్కడో గుండె పట్టేస్తుంది .. మర్చిపోయిన తడి ఏదో మనల్ని మనమే తడిమేలా చేస్తుంది .. ఒకానొక మామూలు రోజుని దృశ్యాదృశ్యం గా మార్చగల శక్తి … దేనికన్నా ఉందీ అంటే .. అది పాట లాంటి అక్షరాల తోరణం కావచ్చు .. లేదా లాలస కవిత్వమూ కావచ్చు.
ఎవరీ లాలస ..ఏమా కథ .. నేను అనబడే సాయి పద్మ ప్రోలిఫిక్ గా రాస్తాను .. అంతకంటే ఎక్కువ చదువుతాను .. కవిత్వం చాలా తక్కువ చదువుతాను …చాలావరకూ నచ్చని వాక్యాన్ని మర్చిపోయే ప్రయత్నం శతవిధాలా చేస్తాను.
ఇహపోతే లాలస పేరుతో కవిత్వం రాసే శ్రీబాల వడ్లపట్ల .. ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్, టైమ్స్ అఫ్ ఇండియా లో పొలిటికల్ జర్నలిస్ట్ గా పనిచేస్తోంది. చాలా తక్కువ రాస్తుంది .. ఎందుకంటె ఆమె మాటల్లోనే చదవాలి మీరు.. రాసే కొన్ని వాక్యాలు ఎరుకలోనూ, మైమరపులోనూ గుర్తుకు వచ్చేది మంచి వాక్యం/కవిత్వం అనే ఒక అభిప్రాయంతో నేను చేస్తున్న పరిచయం ఇది.

. సరదాకి కొన్ని వాక్యాల సమ్మోహనత్వం ఇక్కడ –
• నదికి అణువణువునా చేతులే… కెరటాలుగా నది నీటిని ఈదుతుంటాయి
• రంగుల రుతువును రమ్మనేందుకు సైగలు లేవు … భాషలు ఒక్కసారి ఏకమైనా మహామౌనం కాలేవు
• ఇలాగైతే ఒక్క ఇష్టమైన కలనైనా రప్పించుకోగలరా ఎవరైనా
• కొత్త వానలు పుట్టుకురావు .. పాత చినుకులే మళ్ళీ మళ్ళీ వర్షమవుతాయి
• మరణం కొవ్వోత్తికి కాదు .. మారణాయుధాలకు రావాలి
• మిట్టమధ్యాహ్నం ఎండలో నీ కోసం రహస్యంగా మిద్దె మీద కొచ్చిన ఆమె వొట్టి పాదాల నెప్పి .. గురించి చెప్పావ్ గానీ .. నెప్పి నెప్పి వెన్ను నెప్పి కాదు బతికే ఉరఫ్ చచ్చే నెప్పి తెలుసా ?
• హృదయపు వలపు నిప్పు నుంచి ఉష్టం స్నేహితులే ఉపసంహరిస్తారు
• నదికి కవిత్వమొచ్చు అంది – అందుకోసమే వొంటి నిండా బోలెడు తడి ఉన్నది – ఇంకిపోవచ్చు-ఉప్పొంగిపోవచ్చు
• ఒక యవ్వనం రివైండు ఒక భగ్నప్రేమ ఫార్వర్డు
• నది – నదే , తాను ప్రవహించే తీరాల నిర్వచనం కాదు
• నేను నాట్యం చేయటం లేదు – వేదనను పాతాళం లోకి సరఫరా చేస్తున్నాను
• చినుకుల స్నో కారి మేకప్ రంగులు రాల్చుకుంటున్న భవనాలు
• యవ్వనమంటే మైమరపు మత్తు కాదు . యూత్ఫుల్నెస్, గంపల మీద కన్నం లాంటి లౌక్యపు మర్యాదతనమూ, ఎవరూ చూడకపోతే గాలిబుడగ లాంటి పెద్దమనిషితనాన్ని మసి చేయాలి
• కుర్రవాడా , మనసిచ్చా గానీ .. జీవితాన్నివ్వలేను

ఇన్ని వాక్యాలు పుస్తకం చూడకుండా రాసిన కవిత్వ పుస్తకాల్లో లాలస కవిత్వం ఒకటి . అది నా గొప్ప కాదు .. ప్రతీ పుట్టుమచ్చ వెనుక జ్ఞాపకం లేకపోవచ్చు .. బట్ ..ఆత్మని తాకే ప్రతీస్పర్శ … వేల మైమరపుల పచ్చబొట్టు కదూ ..!
పచ్చబొట్టు లాంటి అనేక కవిత్వపాదాల సంకలనం ‘ సౌండ్ అఫ్ పోయెట్రీ ‘ఆమె కవితల ఈ-బుక్ ఈ క్రింద లింక్ లో మీరు చదవవచ్చు

ఇక ఇన్నర్ వ్యూ లోకి వెళదామా .. ప్రతీ చెట్టూ జ్ఞాపకాల జలజలరాలలేక పోవచ్చు .. పరవళ్ళు తొక్కే అక్షరాల నది అల్చిప్పలని ఏరే ధైర్యం కావాలి కదా .. అలాంటి కొన్ని ప్రశ్నలూ జవాబులూ ..
లాలస ఎవరు?
లాలస ఎవరూ లేరు.లాలస నాలోని ఆత్మ, దాచిపెట్టుకున్న మహిళ వగైరా ఏమీ కాదు. ఆ పేరు వినడానికి ఈస్తటిక్ గా ఉంది.చలం రచనల్లో నాకు నచ్చిన ఏకైక నవల ” జీవితాదర్శం” లో ప్రధాన పాత్ర పేరు.చివరాకరకు శాంతి మాత్రమే మనిషికి మిగిలిన మార్గం అని, ఒక వేళ ఆ విషయం తెలిసినా కలిగే అలజడులే మనిషి తత్వం అనేదే ఆ పుస్తకం సారం.ఆయన ఆ పుస్తకానికి జీవితాదర్శం అని ఎందుకు పేరు పెట్టాడో తెలీదు. ఎందుకంటే జీవితానికి ఒక ఆదర్శం అంటూ ఉండదు అన్న తెలివిడే లక్ష్యంగా సాగిన రచన అది. నచ్చిన పుస్తకంలో నచ్చిన పేరు అలా పెట్టేసుకున్నా అంతే. పైగా నాకు యావజ్జాతికి కవిత్వం రాస్తానని తెలియడం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అదో అందమైన ముసుగు అనుకోండి.

మీ దృష్టిలో కవిత్వానికి, కవికి కావలసింది ఏమిటి?
కవిత్వానికి కవిత్వమే కావాలి. భావోద్వేగాలు లేదా ఆలోచనలు, లేదా ఇమేజరీలను ఒక లయలో పెట్టాలంటే క్రాఫ్టింగ్ అవసరం కొంత. బేసిక్ గా కవిత్వాన్ని ఆర్ట్ ఫాం అనుకంటాను నేను. దానికి కాస్త శ్రద్ధ ఓపిక, ఆ ఆర్ట్ కి కావలసిని మెళకువ తప్పనిసరే. ఫిక్షన్ తో పోలిస్తే కవిత్వం రాయడం ఈజీలా అనిపిస్తుంది. ఏదో ఒకటి కెలకాలనుకుంటే కెలకవచ్చు. క్రాఫ్టింగ్ పరంగా మనం సరిగ్గా ఉన్నామా లేదా అనే నిజాయితీ ముఖ్యం అనుకుంటాను. I don’t get fascinated by what i write.

కవి అంతర్ముఖుడు కావలసిన అవసరం ఉందా? సామాజిక దృక్పథంతో వస్తున్న కవిత్వం మీద మీ అభిప్రాయం ఏమిటి?
అంతర్ముఖం, బహిర్ముఖం ఇలా పర్సనాలిటీ ట్రెయిట్లతో పెద్ద పని ఏమీ లేదు. పొయెటిక్ సెన్స్, రీడింగ్ ఉండి ఎలాగైనా కవి అనిపించుకోవాలనే ఐడెంటీ క్రైసిస్ తో కాకుండా కలం పట్టుకుంటే చాలు కనీసం సంతృప్తికరమైన స్థాయిలోనే కవిత్వం రాయవచ్చు. విప్లవ కవిత్వం, పోస్ట్ మోడరన్ కవిత్వం ఇలా అన్ని ధోరణులు తెలుగులోనూ బాగానే వచ్చాయి. ఏ ధోరణితో రాసినా కవిత్వంగా చిక్కగా ఉండటమే ప్రయారిటీ. ( అయితే స్లోగన్ కవిత్వాలంటే కాస్త చిరాకే) పోస్ట్ మోడర్నిజం రిలవెన్స్ మీద ఇపుడు లిక్విడ్ మోడర్నటీ, సాలిడ్ మోడర్నటీ అని చర్చలు జరుగుతున్నాయి. ఏదైనా సామాజిక దృక్పథంతో రాయాలనుకుంటే , దానిలోని వస్తువే హైలెట్ కావాలనుకుంటే కవిత్వం కన్నా కథ, పాటలు మెరుగనుకుంటాను. ఎంతయినా కవిత్వం పర్సనల్ స్పేస్ లాంటిదే.

ఒక వాదం ( స్త్రీ వాదం లేదా ఏ అస్తిత్వ వాదం అయినా ) ఆధారంగా ఉన్న కవిత్వం మీద మీ అభిప్రాయం, దాని ప్రయోజనం ?
మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు కొనసాగింపే ఇది అనుకుంటున్నాను. Oppressed sections కవిత్వం లాంటి పర్సనల్ ఫాం ను ఎంచుకున్నపుడు కాస్త సీరియస్ గా రాయాలనే అంటాను.అవి స్లోగన్స్ కాకుండా చూసుకోవాలి. మీ దగ్గర ఒక విషయం ఉన్నపుడు రాయడానికి కాన్వాస్ చాలా పెద్దది అవుతుంది. దానిని ఎలా వాడుకుంటారు అనే దాన్ని బట్టి కవిత్వం ఉంటుంది.

మీ కవితల్లో, పదాల్లో ఉన్న వొత్తిడి ..ఒక కళ గా మార్చటంతో , మీ కవిత్వం ఒక కొత్త దారి తొక్కింది.. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి?
కొత్త దారో తెలీదు కానీ I can say that i am a very conscious writer. పుట్టుకెంత సహజమో కాంట్రడిక్షన్కు కూడా అంతే అనివార్యత ఉంది అని నమ్మే వ్యక్తిని. వైరుధ్యం ఎందుకు వస్తుందో, ఎక్కడ ఉండదో తెలుసుకోవడం లేదా తెలియడం సామాజిక, సాంసృతిక అవగాహనలో భాగమే. అవి ఎంత బాగా అర్ధమైతే అంత బాగా వాటిని వ్యక్తీకరించవచ్చు.

ఒంటరితనం,ఒత్తిడి, మోహం దేనితో మీ కవిత్వాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు? ఎందుకు?
ఒంటరితనం,ఒత్తిడి, మోహం దేనితో మీ కవిత్వాన్ని ఐడెంటిఫై చేసుకుంటారు అంటే అన్నింటితోనూ అని చెబుతాను. మోహం స్ర్తీ,పురుషుల మధ్యనే కాకపోవచ్చు దేని మీదైనా ఉండవచ్చు. ఉదాహరణకు నాకు సంగీతం అంటే ఇష్టమే కాదు విపరీతమైన మోహం అనుకుంటాను. పని చేస్తూ, చదువుతూ కూడా నేను సంగీతం వింటాను. ఎంతో సంతోషకరమైన జీవితం గడుపుతున్న ఏ వ్యక్తికైనా ఒక Inner cry ఉంటుంది. బహుశా అందరూ దాన్ని గుర్తించలేకపోవచ్చు.కవులనే జాతి దాన్నిబాగా గుర్తించగలరు. అందులో ఏదైనా ఉండవచ్చు మట్టివాసన, పూల మీద ఎగిరే సీతాకోకచిలుక,నాన్న దూరమైతే కలిగే దుఃఖం, రాజ్యం చేసే పెత్తనం, సంతోషం, కంటి అంచునే అంటిపెట్టుకుపోయిన కన్నీరు ఏదైనా కావచ్చు. మనల్ని ఎక్కువగా పట్టే విషయాలే కవిత్వంలోకి వస్తాయి. తల్లి తండ్రులు ఎపుడూ మనతోనే ఉంటారు అనుకుంటాం. మా నాన్న చనిపోయినపుడు తెరలుగా తెరలుగా దుఃఖం కంటే అదో షాక్ లాంటిది దాదాపు రెండేళ్ళు నాలో ఉండిపోయింది. ఏదో ఎగిరే గాలిపటంకి పుటుక్కున దారం తెగినట్లు.నేను అలాంటి ఇమేజరీలతోనే కవిత్వం రాస్తే ఒకరు చిన్నపుడు ఎగేరేసిన గాలిపటాల కోసం రాశానని అనుకున్నారు. మరో సారి బిన్ లాడెన్ గురించి పర్సనల్ టచ్ తో పొలిటికల్ పొయెం రాస్తే అదేదో విరహం అనుకుని నాకు తెలీకుండానే ఒక ప్రేమ కవితలం సంకలనంలో వేశారు. నేను దాన్ని తప్పు బట్టను కానీ ఎవరి inner cry వారికి ఉంటుందీ అంటాను. ఎవరికి ఏది ఎలా అర్ధం అవుతుంది అనేది వారి జ్ఞాన స్థాయి బట్టి కాక దానిని బట్టి కూడా ఉండవచ్చు. మళ్ళీ అందుకు బేస్ ఏమిటని అడగకండేం.

సరే, కవిత్వంలో సంగీతం ప్రాధాన్యత ఎంత? మీ అభిప్రాయం (మీరు సంగీతప్రాయులు కాబట్టి)?
సంగీతం వేరు కవిత్వం వేరు కానీ సంగీతం తెలియడం ఎడ్వాంటేజే రాసేపుడు. కొన్ని ఎక్స్ ప్రెషన్లు బాగా రాయగలుగుతాం.

స్వీయ విధ్వంస ధోరణి ఒక తాత్వికా చింతనా? ఏరకంగా?
మనిషిలోని రకరకాల తత్వాల్లో ఇదీ ఒక భాగం.డయాబెటిక్ పేషెంట్లు అదే పనిగా స్వీట్లు తినడం కూడా .స్వీయ విధ్వంసమే మరి. అదో బ్రహ్మపదార్ధం కాదు తాత్విక చింతనా కాదు. కాకపోతే కొంత మందికి ఫ్యాన్సీ కావచ్చు.ఒక వేళ ఎవరికైనా బీబత్సమైన స్వీయ విధ్వంసం అనేది ఇష్టం అయితే ఇష్టం అయిన దానిని స్వీయ విధ్వంసం అనలేం గా….

మిగతా కవుల మరణ కాంక్షా కవిత్వానికి మీ కవిత్వానికి సామ్యం లేదా తేడా వివరించే ప్రయత్నం చేయగలరా?
మరణ కాంక్షా కవిత్వం అనేది ఒక ధోరణి గా లేదే. మీ ఉద్దేశం కవిత్వంలో మరణం గురించిన ప్రస్తావన లేదా దాని తాలూకు దుఃఖం అనుకుంటా. మరణం అంటే చావు అనే కాదు అర్ధం అంతం అని కూడా.ఒకోసారి అంతం నచ్చవచ్చు. మెచ్చవచ్చు.మరో సారి అంతం ఏవగింపు కావచ్చు.

సమూహంలో ఒంటరితనం, అంతర్యుధ్దం పరస్పర విరుద్ధ భావాలు ఎంత వరకు అవసరం?
నాకు తెలిసి పుట్టిన ప్రతి మనిషి ఒక ఒంటరి అంతర్యుద్ధంలోనే ఉంటాడు.జీవితంలో వైరుధ్యం ఎంత అనివార్యంగా ఉంటుందో అంతే అనివార్యంగా అంతర్యుధ్దమూ ఉంటుంది. ఒకోసారి కాంట్రడిక్షన్ లోని అనివార్యత నచ్చకపోవచ్చు. కానీ దానితో వచ్చిన అంతర్యుద్ధం మనల్ని కష్టపెట్టకపో చ్చు. పైగా తృఫ్తి కలగవచ్చు. అలాగే వైస్ వెర్సా. నేను పెద్దగా అంతర్యుద్దాల గురించి రాసిన గుర్తు లేదు. జీవితం మోసుకొచ్చిన పరిస్థితులను ఈదులాడే క్రమంలో ఉన్నపుడు ఒకోపుడు ఒకోలా ఉంటాం కదా.

మీకు ఇష్టమైన కవిత్వం ఎవరిది?తెలుగు,ఇంగ్లీష్ ఏదైనా?
లౌడ్ గా పెడబొబ్బల్లా కాకుండా సునిశితంగా కవిత్వం ఎవరు ఎపుడు ఎందుకు రాసినా ఇష్టమే. కవిత్వాన్ని ఎంచుకోవడంలో నాకేమీ వేరే ఇతర నియమ నిబంధనలు ఏమీ లేవు. తెలుగులో ఇస్మాయిల్, నగ్నముని తరహా కవులు ఇష్టం. రేవతీదేవి చాలా తక్కువ రాశారు కానీ చాలా ఇష్టం ఆవిడ కవితలు. హిందీ లో గుల్జార్ ఇష్టం. ఉర్దులో ఫైజ్. నిజానికి భారతీయేతర సాహిత్యం బాగానే చదివాను. కవిత్వమే ఎక్కువ చదవలేదు. నాకో ఫిర్యాదు ఉంది కవిత్వ అనువాదాలు చదవేపుడు. నేటివ్ లాంగ్వేజ్ లోని కవిత్వం కనీసం ఎనభై శాతం కాంప్రమైజ్ అయ్యే వేరే భాషలోకి వెడుతుంది. ఇంగ్లీష్ లో అందరూ ఇష్టపడే కవులు నాకూ ఇష్టమే.

మీకు కావలసిన కవిత్వం వస్తోందా?
సమాధానం చెప్పలేను కానీ కవిత్వం అక్షరాల్లోనే కాదు జీవితంలో, మనిషిలో,కళలో,దృశ్యాల్లో, సన్నివేశాల్లో, ప్రపంచంలో ఉంటుందని తెలుసు నాకు. I engage with poetry at different levels, not just in writing. నా ఫ్రెండ్ కూతురికి ఎనిమిది నెలలు, చాలా ముద్దుగా ఉంటుంది. ఆ పాపకు ఎవరైనా కథలు చెపితే చివరి సెంటెన్స్ వరకూ చాలా యాంక్షస్ గా వింటుంది అర్ధమైనట్లు. చివరి వాక్యం ఏదైనా ఠా, హా అంటే చాలు ఒకటే నవ్వులు. ఆ ప్రాసెస్ మొత్తం కూడా కవిత్వమే నా దృష్టిలో. పొయెట్రీ పర్సనాలిటీలో ఉంటుంది. జీవితంలో ఉంటుంది. అనుభవంలోకి వస్తే బావుంటుంది. కవిత్వం రాయగలిగితే అది కూడా ఒక మంచి అనుభవమే.ఎవరైనా కన్నీరు గురించి రాసినా కడివెలు కొద్దీ కారుస్తూ రాస్తారు అని నేను అనుకోను. అదొక అనుభవం.
What i mean is being poetic is personality trait and writing is expression skill.

మీలోని లాలసకి కావలసింది ఏమిటి?
నాలోని లాలస అంటూ ఎవరూ విడిగా లేరు. బహుశా మీ ఉద్దేశం మీ అంతర్గత వాంఛ ఏమిటి అని ఏమో. అందరిలానే నాకు తిక్కలూ, ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. వాటిని వ్యక్తీకరించగలిగిన కొద్ది మందిలో నేనూ ఒక దాన్ని.

వచనంలో మీరు మరిచిపోలేని వాక్యాలు  కొన్ని?
రేవతీ దేవి గారు దివిసీమ ఉప్పెన సమయంలో వరదల బీభత్సం గురించి రాసిన ఒక లైన్ భలే ఇష్టం నాకు. ‘ ఈ నీళ్ళకు నిప్పు పెట్టండి”అని.. చాలా సార్లు చాలా సందర్భాల్లో గుర్తుకు వస్తుంటుంది ఆ లైన్. గుల్జార్ రాసిన చడ్డీ పెహన్ కే ఫూల్ ఖిలా హై అనే లైన్ కూడా ఇష్టం. ( పూల తొడిమను పిల్లలు వేసుకునే చడ్డీతో పోల్చారాయన). ఇలా కొన్ని. వీటి కన్నా గొప్ప లైన్లు వీళ్ళు కూడా రాసి ఉంటారు. కానీ నాకెందుకో గుర్తుకు వస్తాయి.

లాలస రాయాలనుకుని రాయలేకపోయిన వాక్యం?
రాయలేకుండా మిగిలిపోయిన వాక్యం ఏమీ లేదు నాకు సంబందించినంతవరకు

మీ కవితలో మీకు ఎక్కువ నచ్చిన వాక్యం…
జీవితం…. లెక్కల్లో విలువైన సున్నా

కవిత్వం కాకుండా మీకు నచ్చిన సాహిత్యకారులు?
చాలా మందే ఉన్నారు. ఒకోరు ఒకో కారణం వల్ల నచ్చుతారు. కామూ, కాఫ్కా, కుందేరా ఇలా చాలా మందే ఉన్నారు. ఇతర భారతీయ భాషల్లోనూ ఉన్నారు. అయితే ఈ మధ్య ఫిక్షన్ కన్నా ఎక్కువగా సీరియస్ సోషల్ కామెంటరీల మీద ఎక్కువ ఆస్తకి పెరిగింది. సూఫీ తత్వ వేత్తల రచనలు ఇష్టం. చదువుతూ ఉంటాను. తెలుసుకుంటూ ఉంటాను.

కవిత్వం.. జీవితంలో వివిధ పార్శ్యాల క్రాఫ్టింగ్ మీద మీ అభిప్రాయం ఏమిటి?
జీవితంలో వివిధ అంశాలు ఉన్నయి కదా వాటిని ఎలా కవిత్వీకరిస్తారు అనా మీ ఉద్దేశం. నేను పని గట్టుకుని చేసి పని కాదు కవిత్వం. మొన్నీ మధ్య ఒక అమెరికన్ జర్నలిస్టు కమ్ కవయిత్రి ఇంటర్ వ్యూ ఒకటి చదివా. నేను కవిని అనుకోవడం లేదు.నేను పదాలకు కొరియోగ్రఫీ చేస్తాను, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తా అదే కవిత్వమైపోతుంది అందావిడ. అదేమిటో పాలు పోలేదు కానీ నన్ను నేను మిగతా దుష్ట ప్రపంచంతో సంబంధం లేని ఒక మహోత్కృష్ట జీవి అనబడే కవి అనుకోను. ఇటీజ్ జస్ట్ ఐ లైక్ అండ్ ఐ నో టు రైట్. కవిత్వం రాసేపుడు వత్తిడికి గురికాకపోతే చాలు జీవితం తాలూకు వత్తిడి అందులోకి వస్తుందని తెలుసు. ఇది కవితా, మహా కవితా అనుకుంటూ రాస్తే అది ఎలా ఉంటుందో ఏమో తెలీదు.

మీరు ఏ థీం, లేదా ఏ విషయం మీద కవిత్వం రాయటానికి ఇష్టపడతారు?

ప్రత్యేకించి ఒకటి అంటూ లేదు. అయితే రాసినవి ఒక చోట పెట్టి గమనిస్తే ఎక్కువగా అవి soliloquy లా ఉంటాయి. దానిని బట్టి అలానే రాయడానికి ఇష్టపడతానేమో అనుకోవాలి.

మీ కవిత్వంలో USP ఏంటి?
ఏం రాసినా ఒక ఎరుకతోనే రాయడానికి ప్రయత్నిస్తాను. మైమరుపుతో కాదు. అదే కావచ్చు.

భరించలేని ఆనందనానికి విరిగిపోయే fluidity ని కవత్వీకరించారా?
కాంట్రడిక్షన్ కు,ఫ్లూయిడ్ గా ఉండానికి కాస్త సంబంధం ఉంది. కాంట్రడిక్షన్ ఆమోదించడం ఫ్లూయిడ్ గా ఉండడంలో భాగమే.

కవిత్వంలో మార్మికత, బ్రెవిటీ ఎంతవరకు అవసరం మీ అభిప్రాయం?
అసలు జీవితమే పెద్ద కవిత కదా. A loooong one at that. బ్రివిటీ అనేది ఎన్ని లైన్లు రాశారు అనే దాన్ని బట్టి ఉంటుంది అనుకోను కానీ నాలుగు లైన్లు రాయనీయండి,నాలుగు పేజీలు రాయనీయండి వ్యక్తీకరణ బ్రీఫ్ గా సూటిగా ఉంటేనే కవిత్వం చిక్కగా ఉంటుంది. చాలా మంది ఊతపదంలా వాడేసే పదం అనుకుంటా మార్మికత. నాకైతే అంతుబట్టలా ఇంతవరకూ.

గాఢమైన కవిత్వానికి మహా విషాదం అవసరమా?
మహా విషాదాలే కవితలు అవుతాయా ? ఈ ప్రశ్న బహుశా విషాదం ఎంత ఉంటే అంత గాఢమైన కవిత్వం వస్తుందనే స్పృహ స్థిరపడిపోవడం వల్ల వచ్చిందనుకుంటా. మీరు అదే కోవలో అడిగారో లేదో తెలీదు కానీ అనుభవాలు,గమనింపులు ఏవైనా కూడా కవితలు కావచ్చు. ఎంత బాగా కవిత్వం రాస్తాం అనేదే ముఖ్యం. విషాదం కాదు. లేదంటే కవిత్వమే విషాదం కాగలదు.లేదా కామెడీ కూడా.

ప్రేమ, ప్రేమ భావన ప్రేమ కవిత్వం మీద మీ అభిప్రాయం?
పరిణామ క్రమంలో అయితే ప్రేమ చాలా అక్వర్డ్ ఇమోషన్ ( Acquired emotion ) అనే నేనూ అనుకుంటాను. అదేమీ సహజం కాదు. సహజమైనా, అక్వర్డ్ అయినా మనిషిని నడిపించేది అయితే మంచిదే. ఆ కవిత్వమూ ఓకేనే. కానీ ఆరోతరగతి స్థాయి ప్రేమలేఖలు రాసేసి ఇదే ప్రేమ కవిత్వం అంటే మాత్రం బోలెడెంత నిస్సహయంగా ఉంటుంది లెండి. బ్లాగుల్లో ఈ ప్రేమ దాడి ఎక్కువైపోయింది.చదవండి ఒకసారి అని పంపుతూ ఉంటారు. చదివితే ఇలా ఉంటుంది వరస .

ఇపుడు ఏమన్నా రాస్తున్నారా? రాయకుండా ఉండలేని బలహీనతలు ఉన్నాయా?
రాయకుండా ఉండలేను అనే బలహీనత్వం ఏమీ లేదు.ఉంటే ఆరేడేళ్లు రాయకుండా కూచోను కదా.నాతో పాటు ఏళ్ళ తరబడి పని చేసిన వాళ్లకు కూడా నేను కవిత్వం రాస్తానని తెలీదు.ఎపుడూ పని గట్టుకుని చెప్పను. ఈ మధ్యనే మొదలు పెట్టాను మళ్ళీ రాయడం.చూడాలి ఈ స్థితి ఎంత కాలం ఉంటుందో.

మీ కవిత్వంలో చెప్పినట్లు ఆర్ యు ఎడిక్టెట్ టు లివ్ ?
ఎడిక్టెడ్ టు లివ్ అనే మాట చాలా కాన్షియస్ గా రాశాను. మనం చాలా రకాల అవగాహనలకు వస్తూ ఉంటాం కదా. అలా ఒక సందర్భంలో వచ్చిన అవగాహన నుంచే అది రాశాను. తినడానికి, కట్టుకోవడానికి బట్ట లేని వాళ్లు.జీవితంలో తమకే కాదు తమ ముందు తరాలకు కూడా ఏమాత్రం తేడా రాదు అనే వారు కూడా ఎందుకు జీవితం కోసం కష్టపడతారు అంటే చాల మంది చెబుతారు ఆశే నడిపిస్తుంది అని.కానీ నేను అంటాను జీవితం విపరీతంగా అలవాటు అయిపోతుంది. జీవితం మీద అడిక్షన్ వల్లనే మనుష్యులు అన్ని అఘాయిత్యాలు భరిస్తారు. దుఃఖాన్ని భరిస్తారు.జీవితం ఒక అలవాటు అని. జీవితం కేవలం అలవాటు వల్ల కాకుండా ఇంకో కారణం వల్ల జీవించే ఛాన్స్ ఉందనుకోండి అదో లగ్జరీ.

సాహిత్యానికి సంబంధించి మీరు చేయాలనుకొని, రాయాలనుకున్నది ఏమిటి?
నా ఫాం కవిత్వమే.ఒకటి రెండు కథలు రాశాను. అది చేయలేననిపించింది.ముందు ముందు రాస్తానేమో తెలీదు. రాయడం అనేది నాకొక టెండన్సీ తప్ప దానిని సీరియస్ కెరీర్ లా ఎపుడూ చూడలేదు. కథ, కవిత్వం రెండూ రాసేసే వాళ్ళని చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా వీళ్లకి సాధ్యం అని.

మీరేమో కవయిత్రి ,కానీ మీరు పనిచేసేది పొలిటికల్ జర్నలిస్టుగా మీకు ఇబ్బంది ఉండదా?
ఒకటి వృత్తి, మరొకటి ప్రవృత్తి ఆ మాత్రం కంపార్టమెంటలేజేషన్ ఉండాలి గా.

తీరాల నిర్వచనం కాని నది..అలసి చేరేది ఎక్కడికి?
నది అలిసినా అలవకపోయినా చేరేది సముద్రంలోకే. దానిని నదికి ముగింపు అనుకోవచ్చు. లేదా ఒంటరి నదికి బోలెడు నదులు కలిసిన సముద్రుడి తోడు దొరికిన కొత్త ప్రారంభమూ అనుకోవచ్చు.మన మూడ్ బట్టి ఉంటుంది.

మీ లైఫ్ యాంబిషన్ ఏమిటి?
ప్రత్యేకించి ఏమీ లేదేమో. But i will be happy if life allows me to remain poetic till the end.

హ్మ్మ్… నావరకూ లాలస (శ్రీబాల ) ఇంటర్వ్యూ అవగానే కొన్ని పదాల పాదాలు ఇలా అనిపించాయి.
కొన్ని వాక్యాలు ఎంత అలంకరించినా కవిత్వం కావు -చీకటి వెలుగుల దోబూచులాట సౌందర్యానికి ఎలాంటి మేకప్ అక్కరనే లేదు -నలుపు తెలుపుల ఫ్రేముల్లో ఇమడని జీవితం -రంగుల రుతువుల్లో చిక్కి , మోహగాలంలో పడి మాయమవుతుంది ఎందుకనో ..
మే బీ వీ ఆర్ అడిక్తేడ్ టు లివ్ …!!

-సాయి పద్మ

మీ మాటలు

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    మిట్టమధ్యాహ్నం ఎండలో నీ కోసం రహస్యంగా మిద్దె మీద కొచ్చిన ఆమె వొట్టి పాదాల నెప్పి .. గురించి చెప్పావ్ గానీ .. నెప్పి నెప్పి వెన్ను నెప్పి కాదు బతికే ఉరఫ్ చచ్చే నెప్పి తెలుసా ?—— ఇది చదివాక ముందుకు సాగలేకపోయాను. నంగే పావ్ ఆనా యాడ్ హై ! అన్న నిఖా సినిమాలోని(80స్) పాట, సినిమాలోని అంత: సూత్రం కళ్ళ ముందు తిరుగాడాయి

    మళ్ళి ఎపుడైనా మిగతాది చదువుతాను

    • సాయి పద్మ says:

      తప్పకుండా.. జాన్ గారూ చదివి చెప్పండి . థేంక్ యు

  2. మా బాల కవిత్వంతో ఇంత లోతైన అనుబంధం కలిగి ఉందని తెలియదు. డౌన్ లోడ్ చేసాను. చదివి మళ్ళీ ఇంటర్యూ చదువుతాను. మప్పిదాలు సాయిపద్మగారు.

    • సాయి పద్మ says:

      అవునా .. శ్రీబాల లో ఈ కోణం నాకు కూడా ఈ మధ్యనే తెలుసు .. తెలిసింది పంచుకోవాలని ఇలా

  3. ఎస్‌! వీ ఆర్ అడిక్టెడ్‌ టు లివ్ …!! జీవితం జీవించడనికే జీవితం కొనసాగుతుంది. నిజమే! దీనికి అడిక్ట్‌ అవకపోతే ఇన్ని కష్టాలు కన్నీళ్లు ఎల భరించగలం? మంచి ఇంటర్వ్‌ సాయి పద్మగారు! థాంక్స్‌ !

  4. వాసుదేవ్ says:

    మీ ఈ ఇన్నర్ వ్యూలోంచి కవయిత్రినీ ఆమె కవిత్వాన్నీ చూసాక ఓ కవిని ఎలా ప్రశ్నిం చాలో అవగతమయింది. నిజానికి ఈ పేరి ఇంతకుముందు కొన్ని సార్లు విన్నా ఆమె కవిత్వం చదవటం ఇదే మొదటిసారి. దానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ప్రశ్నల్లోని క్వాలిటీ నచ్చింది. సాహితీపరంగా ఆకట్టుకున్న ఆర్టికల్ ఆద్యంతమూ చదివించింది. కంగ్రాట్స్

    • సాయి పద్మ says:

      థేంక్ యు వాసుదేవ్ గారూ .

      • నిజం. మీ ప్రశ్నల్లోని క్వాలిటీ బావుంది. అలాగే బాల సమాధానాలలో నిరాడంబరత, సూటిదనం గొప్పగా ఉన్నాయి.

  5. mythili abbaraju says:

    ఈ కవయిత్రిని ఫేస్ బుక్ లో మీ వాల్ పైన రాసుకున్న ఆప్తత గుర్తుంది…నిజం చెప్పనా, ఈ ప్రశ్నలన్నీసూపర్ ఫ్లుయస్ అనిపిస్తున్నాయి

    • సాయి పద్మ says:

      ఇంటర్వ్యూ , కవిత ఒకేసారి తీసుకున్నాను తన నుంచి. కానీ కవిత వేరే సెక్షన్ లో వేద్దామని అఫ్సర్ అలా వేసేరు . అది కూడా చాలా మందిని కదిలించింది. ఆమె కవిత్వం నాకు కూడా కొత్తే .. కాబట్టి నచ్చినది ముఖ్యంగా కాంటెంపరరీ కవిత్వంలో లాలస ది ఒక ముఖ్య స్వరం అనిపించి చేసాను. మీరేక్కువ చదువుతారు కాబట్టి మీకలా సూపర్ఫ్లుఇస్ గా అనిపించిందేమో .. ఆమె కవిత్వం కొత్త వాళ్ళల్లో చాలా తక్కువ మందికి చేరింది …చేరితే బాగుణ్ణు అని ఒక కోరిక. అంతే ..శ్రావణ సుభగంగా ఉండే ప్రతీ వాక్యమూ అందమైన దృశ్యమే కదండీ..

      • mythili abbaraju says:

        నా ఉద్దేశం అది అసలు కాదు సాయిపద్మ గారూ…ప్రశ్నలు అనవసరం అనిపించేలాగా కవిత్వం ఉందని…మీకూ ప్రశ్నించాలనిపించి ఉండదని…:) నిజమే, కవయిత్రిని విశ్లేషించాలి కదా. నేను మీ వాల్ మిదే చదివాను ఆవిడ కవితలు. సూపర్ ఫ్లుయస్ అనే మాటని ఎలా వాడానో చెప్తాను…ఒక ఋతుపవనారంభం లో కేరళలో నెలియంపట్టి అనే కొండ మీది గ్రామానికి ప్రయాణించాము. ఆ దారి ఎంత సౌందర్యభరితంగా ఉందంటే, డెస్టినేషన్ ఈస్ సూపర్ ఫ్లుయస్ అనుకున్నాము.

      • mythili abbaraju says:

        ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ కవిత్వాన్ని మీరు అంతలాగా పలవరించగలరు కదా అని నా భావన. నిజమే, ప్రశ్నలూ అవసరమే, అది వేరే ప్లేన్. మీరు నొచ్చుకొని ఉంటే మన్నించండి. :(

      • సాయి పద్మ says:

        మైథిలి గారూ.. మీ ఉద్దేశ్యం అర్ధమైంది . కవిత్వం గురించి మీరు ఎంత సున్నితంగా ఆలోచిస్తారో నాకు తెలియదా .. ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు అనే తీరులో వాడారు.. నాకు అర్ధం అయింది .. థేంక్ యు .. నిజంగా మీ సాహిత్యాభిలాష కి

  6. ప్రశ్నలు నచ్చాయి నాకు. కవయిత్రి ఆలోచనలను రాబట్టిన ప్రశ్నలకు నా వోట్లు :)
    నైస్ ఇంటర్వ్యూ సాయి :)

  7. ప్రశ్నలు అడగడమే ఇంటర్వ్యూ కాదు..
    హృదయాన్ని ఆవిష్కరించే వాక్యాల దారి పొడుగునా నువ్వూ లాలస (శ్రీ బాల వడ్లపట్ల ) గారు మమ్మల్ని ప్రతి పదం ఒకటికి రెండు సార్లు ఆస్వాదిస్తూ చదివించడం .. ఒక విధం గా this is the interview of the year (from my side )
    మనసు నింపే వాక్యాలు మన వెంట వచ్చే వాక్యాలు.. అతి తక్కువగా ఎదురవుతాయి.. థాంక్స్ పద్మా..
    జాన్ హైడ్ గారు అన్నట్లు.. నంగే పావ్ ఆనా యాద్ హె… అదే వాక్యం గుర్తొచ్చింది.. నేను ఉత్సాహం గా ముందుకు కదిలాను..దాము గారి ఇంటర్వ్యూ తరువాత.. ఇది బాగా నచ్చిన రెండో ఇంటర్వ్యూ… హోప్ అండ్ వెయిట్ ఫర్ మోర్ ఫ్రం యూ…

    • సాయి పద్మ says:

      అవును జయా .. లాలస ఇంటర్వూ , దాము ఇంటర్వ్యూ నేను చాలా నేర్చుకున్నాను. మంచి జర్నీ నాకు ..

  8. చాలా బావుంది సాయి. బాల ఎంత పరిచయం ఉన్నా…ఇంత నిశితంగా తెలుసుకోవడం బావుంది! లోతైన ప్రశ్నలు, సుటైన జవాబులు! ఇద్దరు తెలియడం నాకు గొప్పగా ఉంది. :)

  9. I know Sribala though not in person.
    I never knew that there is poet Lalasa.
    I also know that Saipadma is an avid reader, but I did not know this facet of her personality – the ability draw out the finer nuances of a poetry from a poet or for that matter a writer.
    Last but not the least, though I know Afsar, the editor of this webzine, we never met. Not even when he visited India recently. But this talent of his to to identify and bring out new talents into the main stream writing is commendable. I really appreciate that. Hat tip to you, Afsar ji.
    I guess I will have to read Lalasa’s poetry. :-)

    • సాయి పద్మ says:

      though i know sribala as friend, but i didnt know she is a good poet, when i came to know, i wanted to share my love for poetry with people . thank u anil garu

  10. అనిల్: “But this talent of his to to identify and bring out new talents into the main stream writing is commendable. I really appreciate that. Hat tip to you, Afsar ji.”

    It’s not just Afsar, but Kalpana Rentala who’s been playing a key role in shaping Saaranga Magazine. Both Afsar and Kalpana are my partners in this Saaranga endeavor, so I insist the credit should go where it’s due. :- )

    Raj

    • సాయి పద్మ says:

      kalpana garu is the backbone of this good mosaic of thoughts. really happy that she did along with raj garu n afsar ji.. i suggest a team profile should also be put in the website .. thank u so much

  11. పుస్తకాలు విపరీతం గా చదవడం సినిమాలు బాగా చూడడం , ఒంటరిగా సంగీతాన్ని వినడం వంటి అలవాటున్న శ్రీబాల గారు ఇంత లోతైన కవిత్వ భావన వుండటం లో ఆశ్చర్యం లేదు కాని.. ఇంటర్వ్యూ కంటే పద్మ గారు ప్రశ్నలతోనే మార్కులు కొట్టేయాలని చూసినట్టు అనిపిస్తోంది…లాలస సమాధానాలలో కొంత దాపరికం వున్నట్టు అనిపిస్తోంది…..అయినా ……

    • సాయి పద్మ says:

      కవిత్వమో, కవిత్వ భావనో లేకుండా కేవలం ప్రశ్నల ద్వారా మార్కులు ఎలా వస్తాయో అర్ధం కాలేదండీ.. కొన్ని కొత్త ( మిగతా వారిలా పుంఖానుపుంఖాలు గా ) రాయని /రాయలేని స్వరాలని వినిపించటమే ఇక్కడి ఉద్దేశ్యం. ఇక దాపరికాల గురించి కవయిత్రే చెప్పాలి. …అయినా.. ఆసాంతం చదివినందుకు ధన్యవాదాలు

  12. బాగుందండీ…
    పదునైన కవిత్వంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటును కలిగించిన కవయిత్రి గురించి మంచి పరిచయం వ్రాయడమే కాకుండా ఆసక్తికరమైన కబుర్లెన్నో చెప్పారు, చెప్పించారు.

    టైటిల్ మీరే సూచించి ఉంటే మీకు ప్రత్యేకంగా అభినందనలు. “కుర్రవాడా, మనసిచ్చాను కానీ జీవితాన్నివ్వలేను” అని అత్యంత స్పష్టంగా పలికిన కవిని గూర్చి తప్పకుండా వ్రాయాల్సిన మాటలే మీరు శీర్షికగా ఎంచుకోవడం మీ పరిశీలనా శక్తికి మచ్చుగా నిలబడుతోంది.

    • సాయి పద్మ says:

      శీర్షిక పెట్టింది అఫ్సర్ గారు. సో ఆ క్రెడిట్ ఆయనదే…కవిత్వం సున్నితంగా ఉంటూనే స్త్రైకింగ్ గా ఉండటం నాకు నచ్చే, ఈ ఇంటర్వూ చేసాను. మీకు నచ్చినందుకు థాంక్స్ మానసా

  13. మంచి పరిచయం. ప్రశ్నలు, సమాధానాలు ఆలోచనలోకి నేట్టేసేలా ఉన్నాయి.
    “కుర్రవాడా, మనసిచ్చాను కానీ జీవితాన్నివ్వలేను” …ఈ వ్యాక్యం దగ్గర ఆగలేక అప్లోడ్ చేసిన పుస్తకాన్ని చదివేస్తున్నా.

  14. కరిముల్లా ఘంటసాల says:

    ‘కవిత్వం రాసేపుడు వత్తిడికి గురికాకపోతే చాలు జీవితం తాలూకు వత్తిడి అందులోకి వస్తుందని తెలుసు’….గొప్ప వాక్యం.
    లాలస కవిత్వం పాఠకుడిలో ఒక ఆంతరిక సంక్షోభం కలిగిస్తుందని నేను పాఠకుడిగానే గమనించాను. అందరికీ కృతజ్ఞతలు.

  15. సాయి పద్మ says:

    అవును.. ఒక క్రాఫ్ట్ తో రాసిన నిత్య సత్యాలవి .

  16. Sadlapalle Chidambara Reddysa says:

    చాలా ఏళ్లకు ఇంత అద్భుతమైన,సహజమైన పరిచయాన్ని చదివాను.కవిత్వం చదివాక..మర్లాస్పదిస్తా.

  17. మంచి కవిత్వం

  18. Y RAJYALAKSHMI says:

    ఎడిక్టెడ్ టు లివ్ – హౌ ట్రు

Leave a Reply to సాయి పద్మ Cancel reply

*