సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ…

srikantha sarma

దాట్ల దేవదానం రాజు, శ్రీకాంత శర్మ, జానకీ బాల

జ్ఞాపకపు పరిమళాలు, జీవన సౌరభాలతో పాటు వాస్తవపు వాసననీ వెదజిమ్మే పలువర్ణాల పూలసజ్జ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి “అనుభూతి గీతాలు” కవిత్వం. స్వప్నసేతువులాంటి ఏకాంతలో కలల్ని కవిత్వంగా మార్చుకున్న రసాత్మకత తొణికిసలాడుతుంది ఈ గీతాల్లో. పువ్వుల్లా పూసిన రోజులు రాలిపోయాక తొడిమల్లా మిగిలిన జ్ఞాపకాల్ని తడిమే స్పర్శతో, చురుక్కుమని తగిలినా పరిమళించే అగరువత్తి కొనల్లాంటి అక్షరాలతో అలరారుతుంది ఈ కవిత్వం. కొన్ని వర్ణనలు “ఆకుఆకునా బిందువులై ఊగే ఎండ/నీడల బీటల మధ్య పడియలై” సజీవ చిత్రాలుగా కనుపాపల కొక్కేలకి వేలాడతాయి. మరికొన్ని భావనలు “ఎన్ని కదలికల రంగులో తాకి తొణికి తడిసి మెరిసే గాజుకాగితం లాంటి నిదుర” ని సున్నితంగా చెదరగొడతాయి. “సూర్యస్నానం చేసిన సాగరోద్వేగాలూ/మంద్రపవన మలయవేణుస్పర్శలూ” కలిసినంత ఆహ్లాదంతో ఓలలాడించే అలాటి ఒక అందమైన కవిత ఇక్కడ:

 

40- సూర్యకిరణాల జీవధార

నిద్రపోయే నది గుండెను తట్టి

పడవను మేలుకొలుపుతుంది-

ఇంత వెలుగు- ఇంతగాలి-

పడవని ఊగించి లాలిస్తాయి-

లోతైన నదిగుండెలోకి

స్తిమితంగా మునకవేసిన వెదురుగడ

పడవచేతిలో తంబురా…

పడుకున్న పక్షిని

పాటలతో మేల్కొలుపుతుంది-

పక్షి పంజరం దాటుకుని

వెళ్ళిపోయిన శూన్యసమయం-

అలలమీద దర్భపుల్లలూ, నందివర్ధనంపూలూ…

మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ

నిర్గమన సాక్షులుగా

మనిషి పేరిటి వేషం విప్పేసిన

నా తండ్రి సంస్కృతి నిమజ్జనమైన వేళ…

నది కాసేపు అరమోడ్పు కళ్ళతో నిలిచింది-

ఒడ్డున ఒంటరిగా నన్ను వదిలేసి

తంబురా మీటుకుంటూ

పక్షుల్ని మేలుకొలుపుకుంటూ

పడవ మాత్రం

మరో తీరం వైపు-


 

వ్యాఖ్యానం

ఒక నిశ్చల చిత్రంలో కదలిక కలిగి దాన్లోని రంగులకి గాలి అల తాకినట్టు కాస్త ఊగి మళ్ళీ ముందులానే సర్దుకున్నట్టు ఉంటాయి కొన్ని అనుభూతులు. “సూర్యకిరణాల జీవధార/నిద్రపోయే నది గుండెను” తాకడం కూడా అలాటి ఒక దృశ్యానుభూతి. మొట్ట మొదటి చైతన్య కిరణం తాకిన నీరు పడవలో కదలికగా పరావర్తనం చెందుతుంది. బహుశా పడవ కదలికే నదికి గుండె చప్పుడు కాబోలు. “ఇంత వెలుగు- ఇంతగాలి” చూపుగా, ఊపిరిగా నీటి ప్రాణాన్ని నిలబెడుతూ ఉండొచ్చు.

కొన్ని ప్రయాణాలకి సిద్ధమవ్వడం అంత సులువు కాదు. పైపైన కనపడే పనుల్ని తెముల్చుకోవడమే కాక లోతుల్లోకి మునకేసి అక్కడి ప్రవాహపు నిండుతనాన్ని చీల్చుకుపోవాల్సి రావచ్చు. తీరం మీదే వదిలేయాలని తెలిసీ తంబురాని శృతి చేసుకుంటూ “పడుకున్న పక్షిని పాటలతో“ మేల్కొలిపే సమయం దగ్గరైనప్పుడు బహుశా ఎగిరిపోవడానికి మాత్రమే నిద్ర లేస్తుంది పక్షి. పంజరానికి శూన్యాన్ని వదిలి పాటని మాత్రం తనతో తీసుకెళ్తుంది. అప్పుడు “అలలమీద దర్భపుల్లలూ, నందివర్ధనంపూలూ…మంత్రాలు గొణిగే బ్రాహ్మడూ నిర్గమన సాక్షులుగా” మిగుల్తారు. వెళ్తూ వెళ్తూ రెక్కల కింద వీచిన చల్లటి గాలి తెమ్మెరకి కృతజ్ఞతగా “నది కాసేపు అరమోడ్పు కళ్ళతో” మౌనంగా నిలుస్తుంది.

ఒక మనిషి దాటిపోవడం అంటే అతనికే చెందిన కొన్ని మాటలు, అలవాట్లు, వివరాలు, అనుభవాలూ అన్నీ కాలంలో కలిసిపోవడం. ఒకానొక తరానికి చెందిన సంస్కృతిలోని ఒక సూక్ష్మభాగం నీళ్లలో నిమజ్జనం అయిపోవడం. మనుగడ అనేది మనుషుల మధ్య ఆగకుండా కొత్త చరణాల్ని కలుపుకుంటూ వెళ్ళిపోయే ఒక పాట లాంటిది. ఇక నిష్క్రమించవలసిన చరణాల్ని మోసుకుంటూ పడవ కాలంలా, జీవితంలా నిరంతరాయంగా అనంతమైన ఆవలితీరం వైపు సాగిపోతూ ఉంటుంది ”తంబురా మీటుకుంటూ పక్షుల్ని మేలుకొలుపుకుంటూ…”

1swatikumari-226x300–బండ్లమూడి స్వాతి కుమారి

 

మీ మాటలు

  1. అద్భుతమైన కవితకి, అందమైన వ్యాఖ్యానం.
    “ఒక మనిషి దాటిపోవడం అంటే అతనికే చెందిన కొన్ని మాటలు, అలవాట్లు, వివరాలు, అనుభవాలూ అన్నీ కాలంలో కలిసిపోవడం. ఒకానొక తరానికి చెందిన సంస్కృతిలోని ఒక సూక్ష్మభాగం నీళ్లలో నిమజ్జనం అయిపోవడం. మనుగడ అనేది మనుషుల మధ్య ఆగకుండా కొత్త చరణాల్ని కలుపుకుంటూ వెళ్ళిపోయే ఒక పాట లాంటిది…” ఎక్సెలెంట్ ఇంటర్‌ప్రిటేషన్!

మీ మాటలు

*