కిటికీ

సుమారు పది పదిహేను సంవత్సరాల క్రిందట అనుకుంటాను, “Readers Digest” ప్రత్యేక కథల సంపుటిలో ఈ Open Window కథ మొదటి సారి చదివాను.  మనసుమీద చెరగని ముద్ర వేసింది. ఈ కథకి ఆయువుపట్టు చివరి వాక్యమే. ఎక్కడా అసంబద్ధత లేకుండా, ఏ చిన్న విషయాన్నీ వదిలిపెట్టకుండా, ఎంత నిశితంగా పరీక్షించినా (నా మట్టుకు) తప్పుదొరక్కుండా పకడ్బందీగా కనిపించింది దీని అల్లిక.  Short Story(చిన్న కథ) అన్నపదానికి అక్షరాలా నిర్వచనంగా చూపించొచ్చు దీన్ని. ఇంగ్లీషు అచ్చులో 2, 3  బొమ్మలతో కలిపి 3 పేజీలు మించకుండా వచ్చినట్టు జ్ఞాపకం. కిటికీ వంటి చిన్న కేన్వాసుమీద కథ అల్లటం నిజంగా రచయితకి సవాలే. రావి శాస్త్రిగారు ఇలా “కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా…” అన్న శ్రీశ్రీ కవితలోని వస్తువులు తీసుకుని రసవత్తరమైన కథలు అల్లేరు. ఇంతకంటే ఎక్కువ చెబితే, పొరపాటునైనా కథగురించి క్లూ ఇచ్చేస్తానేమోనన్న భయంతో విషయం చెప్పకుండ కప్పదాట్లేస్తున్నాను. ఎవరికివారు చదివి ఆనందించవలసిన కథ ఇది.

452px-Hector_Hugh_Munro_aka_Saki,_by_E_O_Hoppe,_1913

* *

 

 

“మిస్టర్ నటెల్, మా అత్త ఇప్పుడే వచ్చేస్తుంది,” తన మనోభావాల్ని ఏమాత్రం పైకి కనపడనీయని నేర్పుగల పదిహేనేళ్ళ ఆ అమ్మాయి అంది; “అప్పటిదాకా మీరు నన్ను భరించక తప్పదు.”

ఫ్రాంటన్ నటెల్ ఆ క్షణానికి తగినట్టుగా మేనగోడల్ని పొగుడుతూ ఏదో తోచింది చెప్పేడు ఎదురుచూస్తున్న మేనత్తని ఏమాత్రం పలుచన చెయ్యకుండా. మనసులో మాత్రం ముక్కూ ముఖం తెలియని వాళ్ళ ఇళ్ళకి ఇలా తన ఆత్మవిశ్వాసం పునరుద్ధరించుకుందికి వెళ్ళడంవల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని మునుపటికంటే ఎక్కువగా ఇప్పుడు పునరాలోచించసాగేడు.

“నేను ఊహించుకో గలను,” అంది అతని సోదరి తను పల్లెవాతావరణంలో విశ్రాంతి తీసుకుందికి మకాం మార్చడానికి సిద్ధపడుతున్నప్పుడు; “ఏ ఒక్క ప్రాణితోనూ మాటాడకుండా నిన్ను నువ్వు అక్కడ సమాధి చేసేసుకుంటావు. దానితో నువ్వు ఇంకా అంతర్ముఖుడివైపోతావు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళందరికీ పరిచయపత్రాలిస్తాను. నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ మంచి వాళ్ళే.”

ఆ మంచి వాళ్ళ జాబితాలోకి తను పరిచయపత్రం ఇవ్వబోతున్న సాపిల్టన్ వస్తుందో రాదో అన్న సందేహం కలిగింది ఫ్రాంటన్ కి.

“మీకు ఇక్కడ తెలిసినవాళ్ళెవరైనా ఉన్నారా?” అని ఉండబట్టలేక అడిగింది ఆ మేనగోడలు… తమ మధ్య అప్పటికే తగినంత మౌనసంభాషణ జరిగిందని నిశ్చయించుకున్నాక.

“ఒక్కరు తెలిస్తే ఒట్టు,” అన్నాడు ఫ్రాంటన్. “సుమారు నాలుగేళ్ళక్రిందట మా సోదరి ఇక్కడ ఫాదిరీ గారింట్లో ఉండేది. ఆమే ఇక్కడ తనకి తెలిసిన కొద్ది మందికి పరిచయపత్రాలు ఇచ్చింది.”

ఆ చివరి మాట అంటున్నప్పుడు అతని గొంతులో పరిచయపత్రాలు ఎందుకు తీసుకున్నానా అన్న పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తోంది.

“అయితే మీకు మా మేనత్త గురించి అస్సలు ఏమీ తెలీదా?” అని రెట్టించి అడిగింది ఆ అమ్మాయి.

“ఆమె పేరూ, చిరునామా. అంతవరకే,” అంగీకరించాడు సందర్శకుడు. అసలు ఈ సాపిల్టన్ వివాహితో, భర్తృవిహీనో అర్థం కాలేదు అతనికి. ఎందుకంటే, ఆ గదిలోని వాతావరణం అతనికి కారణం చెప్పలేని అనుమానం కలిగిస్తోంది అక్కడ మగవాళ్ళే ఉంటున్నారేమోనని.

“ఆమె జీవితంలో అతి విషాదకరమైన సంఘటన జరిగి సుమారు మూడేళ్ళయి ఉంటుంది,” అంది ఆ పిల్ల; “బహుశా మీ సోదరి ఇక్కడనుండి వెళ్లిన తర్వాత అయి ఉండొచ్చు,” అని ప్రారంభిస్తూ.

“విషాద సంఘటనా?” అడిగేడు ఫ్రాంటన్; ఇంత ప్రశాంతమైన ప్రదేశంలో అకస్మాత్తుగా ఏ విషాద సంఘటనలు జరగడానికి అవకాశం లేదనిపించి.

“మీకు ఈపాటికి సందేహం వచ్చి ఉండాలి, అక్టోబరు నెలవచ్చినా ఇంకా ఆ కిటికీ ఇంకా ఎందుకు తెరిచే ఉంచేరని,” అంది ఆ మేనగోడలు, లాన్ లోకి తెరుచుకున్న పెద్ద ఫ్రెంచి కిటికీని చూపిస్తూ.

అసాధారణంగా ఈ నెలలో ఇక్కడ ఇంకా ఉక్కగానే ఉంది,” అన్నాడు ఫ్రాంటన్; “అయితే ఆ కిటికీకి, విషాదానికీ ఏమైనా లంకె ఉందా?” అని అడిగేడు.

“సరిగ్గా ఇవాళ్టికి మూడేళ్ళ క్రితం, ఆమె భర్తా, ఆమె సోదరులిద్దరూ వేటకని బయటకి వెళ్ళేరు. మరి తిరిగి రాలేదు. వాళ్ళకి ఇష్టమైన పక్షుల్ని వేటాడడానికి అనువైన చోటికి వెళుతూ దారిలో ఒక చిత్తడినేలదాటబోయి అక్కడి ప్రమాదకరమైన అడుసులో కూరుకుపోయారు. ఆ ఏడు ఎంత భయంకరంగా వర్షాలు కురిసేయంటే, అంతవరకూ నిరపాయమైన స్థలాలుకూడా తెలియకుండానే ప్రమాదకరంగా మారిపోయాయి. అన్నిటిలోకీ విషాదకరమైన విషయం వాళ్ళ శరీరాలు ఇంతవరకు దొరకలేదు.” ఇలా అంటున్నప్పుడు మాత్రం ఆ అమ్మాయి గొంతులో అంతవరకూ ఉన్న సంయమనం పోయి ఒక్క సారి గద్గదమైపోయింది. “పాపం, మా పిచ్చి అత్త, ఇంకా కలగంటూనే ఉంటుంది, ఏదో ఒక రోజు వాళ్ళూ, వాళ్ళతో పాటే తప్పిపోయిన వేటకుక్కా వాళ్ళు వెళ్ళిన ఆ కిటికీలోంచే ఇంట్లోకి తిరిగి వస్తారని. అందుకే ప్రతిరోజూ చీకటిపడే దాకా ఆ తలుపు తెరిచే ఉంచుతుంది. పాపం, ఆమె ఎప్పుడూ నాకు చెబుతూనే ఉంటుంది వాళ్లు బయటికి ఎలా వెళ్ళేరో… ఆమె భర్త మోచేతిమీద వాటర్ ప్రూఫ్ కోటు వేసుకునీ, ఆమె చిన్న తమ్ముడు రోనీ ఆమెని ఎప్పుడూ ఏడిపించడానికి పాడే “ఎక్కడికిపోతావె చిన్న దాన,” అన్న పాట పాడుకుంటూను. ఆ పాట వింటున్నప్పుడల్లా ఆమెకి గొప్పచిరాకేసేదట. ఎందుకో తెలీదుగాని, ఇలాంటి, స్తబ్ద నిశ్శబ్ద వాతావరణంలో, నాకు ఒళ్ళు గగుర్పొడిచే ఊహ కలుగుతూంటుంది… ఆ కిటికీ లోంచి వాళ్ళు నిజంగా లోపలికి వస్తారేమో నని….”

గగుర్పాటు కలగడంతో ఆమె తన కథనం ఆపింది. ఇంతలో ఆమె మేనత్త ఇంట్లోకి తను ఆలస్యంగా వచ్చినందుకు పదేపదే క్షమాపణలు చెప్పుకుంటూ ప్రవేశించడంతో అతనికి కొంత ఊరట కలిగింది.

“వెరాతో మీకు మంచి కాలక్షేపం అవుతోందనుకుంటాను,” అందామె.

“ఆమె చాలా కుతూహలమైన విషయాలు చెబుతోంది,” అన్నాడు ఫ్రాంటన్.

“తలుపు తెరిచి ఉంచడం వల్ల మీకు అభ్యంతరం లేదు కదా,” అంది సాపిల్టన్, వెంటనే, “నా భర్తా, సోదరులిద్దరూ వేటనించి తిన్నగా ఈ తోవనే లోపలికి వస్తారు. ఇవాళ పక్షుల్ని పట్టుకుందికని బయటకి వెళ్ళేరు. వాళ్ళు నా కార్పెట్లని బురద బురద చేసెస్తారు. ఈ విషయంలో మీ మగవాళ్ళందరూ ఒక్కటే. అవునా?” అని అంది.

ఆమె అలా గలగలా మాటాడుతూనే ఉంది… వేట గురించీ, పక్షులు దొరక్కపోవడం గురించీ, ఈ శీతకాలంలో బాతులు లభ్యమవడం గురించీ. ఫ్రాంటన్ కి అదంతా భరించ శక్యంగా లేదు. అతను సంభాషణని ఎలాగైనా మరో విషయంవైపు మళ్ళిద్దామని శాయశక్తులా ప్రయత్నించాడు గాని అంతగా సఫలంకాలేకపోయాడు; పదే పదే ఆమె దృష్టి కిటికీ వైపూ, అక్కడి లాన్ వైపూ ఇంకా ముందికీ వెళుతోంది తప్ప, అతను చెబుతున్న దానిపై ఆమె ఏమాత్రం మనసు లగ్నం చెయ్యడం లేదన్న సంగతి అతను గ్రహించాడు. ఆ దురదృష్టసంఘటన జరిగిన వార్షికం నాడే తను ఆమెను కలవడానికి ప్రయత్నించడం కేవలం యాదృచ్ఛికం.

“డాక్టర్లందరూ నన్ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమనీ, దేనికీ ఉద్రేకపడొద్దనీ, ఎక్కువ శారీరకశ్రమ కలిగించే పనులు తలపెట్టవద్దనీ చెప్పారు,” చెప్పుకుపోతున్నాడు ఫ్రాంటన్ … తమకి ఏమాత్రం పరిచయంలేనివారు తమ రోగాలగురించీ తమ అశక్తతలగురించీ వాటి కారణాలూ, నివారణోపాయాలగుంచి ఏదో కుతూహలం కనబరుస్తారని చాలా మంది రోగులకి ఉండే అపోహను కనబరుస్తూ… “భోజనం విషయంలో మాత్రం ఎవరి అభిప్రాయాలూ కలవలేదు.”

“లేదూ?” అంది సాపిల్టన్, మనసులో నిర్లిప్తత గొంతులో లీలగా కదిలి చివరకి ఆవులింతగా పరిణమిస్తుంటే. ఆమె ఒక్కసారి వెంటనే అప్రమత్తమైంది … అయితే దానికి కారణం ఫాంటన్ చెబుతున్న విషయం కాదు.

“అదిగో వచ్చేశారు,” అని ఆనందతో కేరిందామె, “సరిగ్గా టీ వేళకి. వాళ్ళు ముఖంనిండా మట్టిగొట్టుకుపోయినట్టు లేరూ ?” అంది.

ఫ్రాంటన్ కి ఒకసారి ఒళ్ళుజలదరించి మేనగోడలువైపు చూశాడు కళ్ళలో జాలి కనబరుస్తూ. ఆ అమ్మాయి ఒక భయంకర దృశ్యాన్ని చూస్తున్నట్టు తెరిచిన కిటికీ వైపు కళ్ళు తేలేసి చూస్తోంది. చెప్పలేని భయమేదో ఆవహించి కొయ్య బారిపోతూ తనూ ఆమెచూస్తున్న వైపు తనదృష్టి సారించాడు.

ముసురుకుంటున్న సంజచీకట్లలో మూడు ఆకారాలు చంకలో తుపాకులు వేలేసుకుంటూ లాన్ వైపు నడుచుకుంటూ వస్తున్నాయి …. ఒక దానికి అదనంగా తెల్లని కోటు ఒకటి భుజానికి వేలాడుతోంది. బాగా అలసినట్టు కనిపిస్తున్న గోధుమరంగు వేటకుక్క ఒకటి వాళ్ళ అడుగుల్లో అడుగులేస్తూ అనుసరిస్తోంది. చప్పుడు చెయ్యకుండా వాళ్ళు ఇల్లు సమీపించిన తర్వాత, ఒక పడుచుగొంతుక, “ఎక్కడికి పోతావె చిన్న దానా?” అన్న పాట అందుకుంది.

అంతే! ఫ్రాంటన్ తన చేతికర్రనీ టోపీని ఒక్కసారి ఎలా అందుకున్నాడో అందుకున్నాడు; హాలుకి తలుపెటుందో, కంకరపరిచిన కాలిబాట ఎక్కడుందో, ముఖద్వారం ఎటో అతనికి లీలగా గుర్తున్నాయి అతని వెనుదిరిగి చూడని పరుగులో. పాపం, ఆ రోడ్డువెంట సైకిలు తొక్కుకుంటూ వస్తున్న వ్యక్తి తన సైకిలు తుప్పల్లోకి మళ్ళించవలసి వచ్చింది ఖచ్చితమైన ప్రమాదాన్ని నివారించడానికి.

“ప్రియా, ఇదిగో వచ్చేశాం” అన్నాడు తెల్లనికోటు మోసుకుని కిటికీలోంచి లోపలికి ప్రవేశించిన వ్యక్తి, “బురద కొట్టుకు పోయామనుకో, అయినా ఫర్వాలేదు చాలవరకు పొడిగానే ఉన్నాం. ఇంతకీ, ఎవరా వ్యక్తి, మేం లోపలికి వస్తుంటే, బయటకి బుల్లెట్ లా పరిగెత్తేడు?”

“ఎవరో, నటెల్ ట. చాలా చిత్రమైన వ్యక్తి,” అంది సాపిల్టన్; “అతని అనారోగ్యం గురించి తప్ప మరో మాటలేదు. మీరు రావడమే తడవు, శలవు తీసుకోకుండా, వీడ్కోలైనా చెప్పకుండా ఏదో దయ్యాల్ని చూసినట్టు పరిగెత్తాడు.”

“దానికి కారణం, ఆ వేటకుక్కే అనుకుంటున్నాను,” అంది ఆ మేనగోడలు ప్రశాంతంగా; “అతను చెప్పేడు నాకు కుక్కలంటే మహాభయమని. ఒకసారి అతన్ని గంగానది ఒడ్డునున్న ఒక గోరీలదొడ్డిలోకి కొన్ని కుక్కలు తరిమేయట. పాపం, అప్పుడే తవ్విన ఒక గోతిలో దూకి రాత్రల్లా తలదాచుకున్నాడట నెత్తి మీద అవన్నీ చొంగకారుస్తూ, మొరుగుతుంటే. అది చాలు, హడలిపోయి ఎవరికైనా ధైర్యం సన్నగిలిపోడానికి.”

ఉన్నపళంగా కథలల్లగలగడం ఆ పిల్ల ప్రత్యేకత.

.

సాకీ  (హెక్టర్ హ్యూ మన్రో.)

(18 December 1870 – 13 November 1916),

Notes:

ఇక్కడ కిటికీ అంటే  నేలకి 3 నాలుగు అడుగుల ఎత్తులో మనకు పరిచయమున్న కిటికీ కాదు; ఫ్రెంచ్ కిటికీ. మన ద్వారబంధాలలాగే నేల వరకూ ఉండి, ఒక గదిలోంచి బయట వసారాలోకో, తలవాకిట్లోకో తెరుచుకునే కిటికీ.

అనువాదం: నౌడూరి మూర్తి

 

మీ మాటలు

*