ఆ తప్పిపోయిన పిల్లడు…మళ్ళీ దొరికాడు!

మిమ్మల్నో మాట అడగనా? ఒక చక్కని పుస్తకం……మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది? సరే, ఆ చక్కని పుస్తకం మీరెప్పటినుంచో వెతుకుతున్నదైతే? మీకిష్టమై, మీరు ఒకసారి చదివేసి, విపరీతంగా ప్రేమించి, తరవాత తప్పిపోయిన పిల్లాడిలా ఆ పుస్తకం కోసం వెతికి ఇక వీల్లేదనుకున్న సమయంలో ఎవరో దయతలిచి, ‘నా దగ్గరుంది, సర్లే తీసుకో’ అని ప్రేమగా ఇస్తే? !!

అంతకు మించిన గొప్ప అనుభవం జరిగింది నాకు. ఉషోదయాన, హైదరాబాదు రోడ్లలో, కారులో ఒక్కదాన్నే రేడియోలో వచ్చే ‘భూలేబిసేరేగీత్’ వింటూ..అలా లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో ఉన్న ఇంకా పూర్తిగా సన్నిహితురాలు కాని మిత్రురాలి ఇంటికి వెళ్తుంటే ఆనందం నావెంటే వచ్చింది. అదే ఆనందంతో నా స్నేహితురాలితో కలిసి మీటింగ్ పూర్తిచేసుకుని, వెనక్కు వచ్చేదారిలో బోల్డన్ని కబుర్లూ చెప్పుకుంటూ, ఇద్దరమూ ఒకరినొకరిలో ఇంచుమించుగా చూసుకొంటూ, తబ్బిబ్బవుతూ, దారిలో ఒకచోట ఆగి పున్నాగ పూలు ఏరుకుని వాళ్ళ ఇంటిదాకా వచ్చాము. అదే ఉత్సాహంతో తను కారునుంచి ఒక్క గంతున ఇంట్లోకి, తరవాత చెంగున పెరట్లోకి దూకింది, నన్ను పిలుస్తూ! తన వెనుకే ‘ఏమిటా’ అని వెళ్లి అక్కడ నేలరాలిన పారిజాతాలను చూసి నేను ఆశ్చర్యపోతుంటే, తను ఆర్ద్రంగా నా చేతినిండా ఏరినపూలు పోసి ఇచ్చింది. అప్పటికే మూగబోయిన నాకు లోపలికి పిలిచి “ పెద్దప్రపంచం లో చిన్న పిల్లడు(వి. పనోవ)” నాచేతిలో పెట్టి సాగనంపితే……, ఏం చెప్పాలి!

2013-11-19 23.18.48

 

ఇదిగో, ఈ నెలన్నారా ఆ పుస్తకాన్ని చదివి ప్రతి వాక్యమూ ఆస్వాదిస్తూ ఇష్టంగా రాయాలకున్న కోరిక ఇప్పటికి తీరింది! పుస్తకం గురించి చెప్పాలంటే వెనుక అట్టతో మొదలుపెడతాను. అందులో ఇలా ఉంది:

“సెర్యోషకి ఆరేళ్లోస్తాయి. నాన్న యుద్ధంలో మరణించాడు. అమ్మ ఉంది, పాషా అత్తయ్య ఉంది, ల్యుకానిచ్ మావయ్య ఉన్నాడు. మరి సెర్యోషకి తను చుసుకొవలసినవీ, తను అనుభవించవలసినవీ ఎన్నో ఉన్నాయి- ఏమంటే తన జీవితంలో ప్రతిరొజూ ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది.
మరి, ఇప్పుడేమో, తన జీవితంలోకెల్లా అతి ముఖ్యమైన విషయం జరిగింది- తనకి మారు తండ్రి వచ్చాడు. ఈ పిల్లడికీ వాడి రెండవ తండ్రికీ ఉన్న సంబంధాల గురిచి ఈ పుస్తకం మనకి చెబుతుంది. “
************

ఇంతేనా?
ఈ పుస్తకం మనకు ఇంకా చాలా విషయాలు చెబుతుంది. అనుభూతిని పొందడం, స్పందించడం అనే మాటలు తెలుసుకోవాలంటే ఇది చదివాక మన మనస్ధితిని అర్థం చేసుకోగలిగితే చాలు.

సెర్యోష! మన పెద్దప్రపంచంలో చిన్న పిల్లడు! తన ఊరూ, ఇల్లూ, స్నేహితులూ, ఇరుగు పొరుగు…అవేగాకుండా తను గమనించవలసిన విషయాలు ఎన్నో…వీటితోనే తను అలిసిపోతుంటే ఇప్పుడింటిలో కొత్తనాన్న రాక… ఇదివరకు కుటుంబానికి మిత్రుడు, ఇప్పుడు కొత్తనాన్నగా మారిన కొరొస్తల్యేవ్ వచ్చాక సెర్యోష మామూలుగా అడుగుతాడు. “నన్ను బెల్టుతో చెమ్డాలెక్కగొడ్టావా?” కొరొస్తల్యేవ్ ఆశ్చర్యపోతూనే చెప్తాడు, “మనం ఒక ఒప్పందం చేసుకుందాం. మన మధ్య బెల్టు వ్యవహారం ఎప్పటికి వొద్దు,” అని. సైకిలు కొనివ్వడం తో సెర్యోష అభిమానాన్ని సంపాదిస్తాడు కొరొస్తల్యేవ్. అంతేనా? కాదు, తనకెంతో ముఖ్యమైన తన బొమ్మలను, కొరొస్తల్యేవ్ బీరువా జరిపి ఇవ్వడంతోనే అతని బలానికి సెర్యోషకు తెలియని ఆరాధన కలుగుతుంది. చిన్నపిల్లలు ఎన్ని చిన్నవిషయాలు గమనిస్తారో! ‘అంత బీరువా ఎత్తగలిగిన మనిషి తనని ఎత్తలేడా’, అనే భరోసాతో రెండో రోజే సెర్యోష కొరొస్తల్యేవ్ భుజం మీద ఎక్కి గర్వంగా తిరుగుతాడు.

మొదటి పావువంతు పుస్తకం చదవగానే కొరొస్తల్యేవ్ కి సెర్యోష మీద ఉన్న గౌరవం అర్థమవుతుంది. నిజానికి ఈ పుస్తకంలో సెర్యోషతో పాటు కొరొస్తల్యేవ్ కూడా నాయకుడే.. కొరొస్తల్యేవ్ ఎప్పుడూ సెర్యోషని చిన్నపిల్లాడిలా చూసినట్లనిపించడు. అంతెందుకు కొరొస్తల్యేవ్ భోజనాల సమయంలో అందరితో పాటు సేర్యోషకు కూడా వైన్ అందించడంవంటి గౌరవాన్ని మరి ఎవరూ సేర్యోషకు అప్పటిదాకా ఇవ్వలేదు!!

అసలు ఈ పుస్తకం ఒక రకంగా ,“a book on parenting” అనవచ్చు. నిజమే, ఇది ఒక సుతిమెత్తని భావనను మిగిల్చే పుస్తకం మాత్రమే కాదు, తెలియకుండానే పేరెంటింగ్ టెక్నిక్స్ నేర్పే పుస్తకం కూడా. సెర్యోష ప్రకారం పెద్దవాళ్ళు చాలా అనవసరపు మాట్లాడుతారు- ‘ఎందుకు పాడుచేసావు’ లాంటి మాటలన్న మాట! వస్తువులు పాడుచేసినందుకు పిల్లలేమీ సంతోషించరు, ఇంకా సిగ్గుపడుతారు. అయినా ఈ పెద్దవారెందుకు ఆ విషయం గుర్తించకుండా అనవసరంగా మాట్లాడతారు? అదే వాళ్ళు పాడుచేస్తే ఎవరూ ఏమి మాట్లాడరు, అదేదో సరైనపనే జరిగినట్లు! ఇంకో విషయం- ‘దయచేసి(please)’ అన్నమాట వాడడం. ‘ఏదన్నా కావాలంటే దయచేసి అన్న మాట జత చేస్తే ఇస్తాను,’ అంటుంది, సెర్యోష అమ్మ. ‘మరైతే, ఏదైనా ఇయ్యి’ అని అడిగినప్పుడు, ‘నాకది కావాలని నీకు అర్ధం కాదా?’ అని అడుగుతాడు సెర్యోష. ‘దయచేసి అని అడగడం వల్ల ఇచ్చేవారు సంతోషంగా ఇస్తారని’ వివరిస్తుంది అమ్మ. అంటే ‘దయచేసి అని అడగకపొతే సంతోషం లేకుండా ఇస్తావా’, అనడుగుతాడు సెర్యోష. అమ్మ అప్పుడు, “అసలు ఇవ్వనే ఇవ్వను”, అని చెప్తుంది. “సరే అలాగే అంటాను” అనుకుంటాడు సెర్యోష. కాని కొరొస్తల్యేవ్ పెద్దవాళ్ళలాగా ఇలాంటి ‘ఉత్తుత్తి మాటలు’ పట్టించుకోడు. అంతేగాకుండా తను ఆడుకుంటున్నప్పుడు ల్యుకానిచ్ మావయ్య లాగా అనవసరంగా పిలిచి తనని ముద్దుచేసి చిరాకు పెట్టడు!

పేత్యమామ వచ్చి చాక్లట్ అని చెప్పి ఖాళీ కాగితం చుట్టిన ఉండను సెర్యోషకిస్తాడు. సెర్యోష మర్యాదగా దాన్ని అందుకొని మోసాన్ని గ్రహించి సిగ్గుపడితే, పేత్యమామ పగలబడి నవ్వుతాడు. సెర్యోష అసహనంతో ‘ పేత్యమామా, నీకు బుద్దిలేదా?’ అని నిర్మొహమాటంగా అడుగుతాడు. ఆ మాటలకు అమ్మ అదిరిపడి, సేర్యోషను మందలించి, క్షమాపణ అడగనందుకు శిక్షిస్తుంది. సెర్యోష ఆత్మాభిమానంతో ఏమి బదులు చెప్పడు. అతనికి తన తల్లి మీద కూడా కోపం వస్తుంది. తనను మోసం చేసిన పేత్యమామతో అమ్మ ఇంకా ఎలా కబుర్లూ చెప్తుంది? అని. సాయంత్రం సెర్యోష లేడనుకుని జరిగే చర్చలో కోరోస్తల్యేవ్ సెర్యోష మాటలను ‘న్యాయమైన విమర్శ’ అంటాడు. ‘ బుద్ధిలేనివాడిని బుద్ధిలేని వాడని అన్నందుకు ఏ బోధనాశాస్త్రం ప్రకారము శిక్షించకూడదు.’ ఈ మాటలకు అర్థం సెర్యోషకు తెలియక పోయినా కోరోస్తల్యేవ్ తన తరఫునే మాట్లాడాడని మనసులో కృతఙ్ఞతలు చెప్పుకుంటాడు.

సెర్యోషకు కొరొస్తల్యేవ్ మీద పూర్తినమ్మకం ఏర్పడినందుకు గీటురాయిగా, సెర్యోష తనకు ఈ బ్రహ్మాండవిశ్వంలో భూమికాక ఇతర గ్రహాలతోబాటు భూమివంటి మరో గ్రహం ఉంటే, అందులో సెర్యోషవంటి మరో కుర్రవాడి ఉనికిని గురించి వచ్చిన అద్భుతమైన ఊహ ఒక్క కొరొస్తల్యేవ్ కు మాత్రమే చెబుతాడు. అవును మరి, సెర్యోష ప్రకారం అటువంటివి పంచుకోవడానికి ఒక్క కొరొస్తల్యేవ్ మాత్రమే అర్హత ఉంది!

సేర్యోషకు తమ్ముడు పుట్టినప్పుడు, కొరొస్తల్యేవ్ మాటల ప్రకారం తన తమ్ముడిని బాగా చూసుకోవలనుకున్నాడు సెర్యోష. కానీ అదేంటదీ, ఇంత చిన్నగా ఉండే తమ్ముడిని అమ్మే సరిగ్గా ఎత్తుకోలేకపోతోంది! పైగా ఆ పిల్లాడి వ్యవహారం కూడా నచ్చలేదు సెర్యోష. కాస్త పాలకోసం ఏడ్చి గొడవచేసి, పాలుతాగిన వెంటనే చప్పున నిద్రపోయే తమ్ముడిని చూసి, “ఏం పిల్లాడమ్మా” అని అలసటగా అనుకుంటాడు సెర్యోష. కానీ కొరొస్తల్యేవ్ సర్దిచెప్పగానే కుదుటపడతాడు. అమ్మ తమ్ముడితో ఎప్పుడు పనిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొరొస్తల్యేవ్ వీలు చిక్కినప్పుడల్లా- అంటే బట్టలు మార్చుకునే సమయాల్లో, నిద్రపోయేముందు కథలు చెప్తాడు సెర్యోషకి. కాని కొరొస్తల్యేవ్ కు పూర్తిగా తీరిక అంట తేలిగ్గా ఎప్పుడూ చిక్కదు. అతను చాలా ముఖ్యమైన మనిషి- అతను లేకపొతే పనివాళ్ళకు జీతలుండవు, కావాలనుకుంటే వాళ్ళను ఉద్యోగాలనుండి తీసివేయగలడు. కొరొస్తల్యేవ్ ను అందరికీ అధికారిగా నియమించారంటే అర్థం, అతను అందరికన్నా మంచివాడు, గొప్పవాడు అని సెర్యోష గ్రహిస్తాడు.

కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. జీవితాన్ని ఇంతగా అర్థం చేసుకుంటున్న క్రమంలో సెర్యోషకు విపరీతమైన అనారోగ్యం. ఒక జబ్బు తగ్గగానే మళ్ళి ఇంకొకటి. సెర్యోష కుదుటపడుతుండగా అదే సమయంలో కొరొస్తల్యేవ్ కు బదిలీ అయింది. సేర్యోష ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా అతనిని కొంతకాలం వారు కదల్చలేని పరిస్ధితి. కాని సెర్యోష వేదన చెప్పనలవి కాదు. అమ్మ, కొరొస్తల్యేవ్, ల్యోన్య వెళ్ళిపోతుండగా తనను మాత్రం వదిలి వెళ్ళడం దుర్భరంగా ఉంది సేర్యోషకు. ఒక రోజు సెర్యోష బాధను చూసి కొరొస్తల్యేవ్ బయటకు తీసుకువెళ్తాడు. కొరొస్తల్యేవ్ ఎంతో ముద్దుగా మంచిగా మాటలు చెప్పి, సేర్యోషను వదిలి వెళ్ళడం తనకు కూడా ఇష్టం లేదు అనే విషయాన్ని వివరించాడు. దాని వల్ల రవ్వంత శాంతి కలిగినా సెర్యోష పూర్తిగా సమాధనపడలేదు. ఇదివరకు అమ్మ తనని వదిలి స్కూల్ లో పనికి వెళ్ళింది. కాని అప్పుడు అమ్మ ఒకతే- పైగా అప్పుడు తానింకా చిన్నవాడు, తనకు తెలియలేదు. ఇప్పుడు అలా కాదు. కొరొస్తల్యేవ్ కూడా వెళ్ళిపోతున్నాడు. అన్నింటికన్నా ఘోరం, ల్యోన్యను తీసుకెడుతున్నారు, తనను వదిలేసి! ఆ రాత్రి, చిట్టడివిలో సెర్యోష తో కొరొస్తల్యేవ్ చెప్పిన మాటలు విన్నా సమాధానపడని సెర్యోష గురించి రచయిత ఇలా అంటారు. :

“సెర్యోషకి తన మనసులో ఇలా జవాబు చెప్పాలనిపించింది. ఎంత ఆలోచించిన సరే, ఎంత ఏడ్చినా సరే, ఏమి ప్రయోజనం లేదు, మీరు పెద్దవాళ్ళు, మీరు అన్నీ చేయగలరు. ఇది చెయ్యవచ్చని, ఇది చెయ్యకూడదనీ మీరే అన్నీ శాసిస్తారు; కానుకలిచ్చేవారు మీరే; దండిచేవారూ మీరే; మరి నన్ను ఉంచేస్తామని మీరు అన్నారూ అంటే, నేను ఉండిపోవాల్సిందే, నేను ఏమన్నా, ఏం చేసినా కార్యం ఉండదు. తన మనసులో ఉన్నది చెప్పగలిగే సామర్ధ్యం ఉండి ఉంటే ఇలా అని సెర్యోష జవాబు చెప్పి ఉండేవాడు.”
ఇంత వేదనను అనుభవించిన సెర్యోష కథ చివరికి ఊహించని మలుపు తిరిగి చదివినవారి హృదయాన్ని చాలా సున్నితంగా తాకుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ పుస్తకాన్ని చదివి చివరలో కంటతడి పెట్టకుండా ఉన్నట్లయితే వారిని ఇక పుస్తకపఠనం ఆపేయమని శాపం ఇవ్వొచ్చు.

ఇంతేనా ఉన్నదీ నవలలో..కానేకాదు…కథకు మించిన పాత్రలు- పెద్దరికాన్ని చూపే వాస్య, కష్టాలు పడిన జేన్య, కుళ్లుబోతు లీద, పెద్దవాళ్ళ నీచబుద్ధికి ప్రతీక జేన్య పెద్దమ్మ, జైలు నుంచి విడుదలైవచ్చి సెర్యోష ఇంటి ఆతిధ్యాన్ని అందుకున్న అనుకోని అతిధి(ఇక్కడ సెర్యోష గమనించిన విషయాలని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి), వాస్య మావయ్య, ఆయన పచ్చబొట్లు, పచ్చబొట్ల కోసం పిల్లల తిప్పలు- ఇలా ఎన్నో పాత్రలతో తియ్యని సన్నివేశాలతో మధురంగా గడిచిపోతుందీ నవల.

*****************
ఇంకొకటి! ఎవరికైనా నేను ఈ పుస్తకం గురించి నేను న్యాయంగా రాయలేదు అనిపిస్తే దయచేసి బాధపడకండి. ఎందుకంటే, మీరనుకున్నది నిజమే కావొచ్చు! ఈ పుస్తకమే అంత అందమైంది! దీని గురించి నేను రాస్తానన్నప్పుడు, ఒక అమ్మాయి రాయోద్దనికుడా బ్రతిమాలింది. ఆమెకి భయం- అలా రాసి ఈ పుస్తకం లో అందమైన అనుభూతిని అందరికీ దగ్గరగాకుండా చేస్తానేమో అని. ఆమె బాధ చాలా న్యాయంగా అనిపించడమే కాదు, అలా బాధపడడం వల్ల ఆమె మీద ప్రేమ కూడా కలిగింది.
ఒక చిన్న నవలలా కనిపించే ఇంత చక్కని కథ రాసింది వి. పనోవ. పుస్తకం అట్ట వెనుక రాసినట్లు ‘ఈమె పేరు విదేశీయ పాఠకులకు సుపరిచితమే. ఆమెకు మూడుసార్లు రష్యన్ ప్రభుత్వ బహుమానం లభించింది. వేరా పనోవ నాలుగు పెద్ద నవలలని, ఐదునాటకాల్ని, ఎన్నో నవలికల్ని రాసింది. అన్నీ ప్రజాదరణ పొందాయి. వీటిలో అనేకం వెండితెర పై ప్రదర్శితమయాయి.’

ఈ రచయిత్రి రాసిన అత్యంత కవితాత్మకమైన కృతులలో ఒకటి- “పెద్ద ప్రపంచంలో చిన్నపిల్లడు.” దీని అనువాదం ఉప్పల లక్ష్మణరావు గారు చేసారు. ‘రాదుగ పబ్లికేషన్స్’ వారు ప్రచురించిన ఈ నవల మొదటి ముద్రణ 1968లో, రెండవ ముద్రణ 1987 లో అయింది. ప్రస్తుతానికి కాపీలు అందుబాటులో లేవు. మీరు నిజంగా చదవాలనుకుంటే మీకు తెలిసిన, పుస్తకాల పిచ్చి ముదిరిన మిత్రుల దగ్గర ఖచ్చితంగా దొరకొచ్చు – ముందు లేదని దబాయించినా కాళ్ళు పట్టుకొంటే మెత్తబడో, మొహమాటపడో ఒకసారి చదవడానికి ఇవ్వొచ్చు!

విజయీభవ!

 – అపర్ణ తోట

aparna

మీ మాటలు

 1. అపర్ణా ,బావుంది రివ్యూ..కీప్ ఇట్ అప్

 2. నా జీవితంలో అతి ముఖ్యమైన , బలమైన భావాలు ఏర్పరిచిన పుస్తకం
  ఇప్పటికీ ఉంది..ఎవ్వరు అడిగినా ఇవ్వను ..కావాలంటే చదివి వినిపిస్తా
  మంచి విశ్లేషణ ..

 3. Rajasekhar Gudibandi says:

  మీ రివ్యు అద్బుతంగా ఉంది అపర్ణ గారూ.
  ఇప్పటివాళ్ళకి రష్యన్ సాహిత్యం లో ఉన్న మజా రుచి చూపించారు.
  పుస్తకం చదవాలని ఉన్నా దొరకదని తేల్చేశారు.. ఉన్న ఒహరూ అరా కూడా ఇచ్చేలా లేరని తేలిపోయింది.
  మీ రివ్యు మళ్లీ మళ్ళీ చదూకొని ఆనందపడతాం.. ఎందుకంటే మీరు రాసిన ఆ నాలుగు విషయాలతోనే ఆలోచనలో ఒక ప్రేరణ కలుగుతుంది ..
  ఆ చేత్తోనే మకరెంకో “అల్లరి పిల్లల్లో అద్భుత మార్పులు” గురించి కూడా రాసేస్తే చదవాలని ఉంది…

  • చాలా థాంక్సండి…మీకింకా నేను చెప్పిన పుస్తకం గురించి జ్ఞాపకం ఉందే!!! :) :) :)

 4. ఒక అద్బుతమైన పుస్తకానికి అందమైన విశ్లేషణ … చాల బాగా రాసారు .. ప్లీజ్ డూ కీప్ రైటింగ్

 5. చాలా బాగుంది. ఎండలో చల్లని గాలి తెమ్మెర లా, నీ రివ్యూ.

  • థాంక్స్ అండి…మీరు నాకు తెలుసా…? ఇంటి పేరు లేకుండా గుర్తుపట్టడం కష్టంగా ఉంది.

 6. హలో, చాల థాంక్స్ …..ఈ బుక్ నేను చిన్నప్పుడు చదివాను….మల్లి మీ రివ్యూ చదువుతుంటే గుర్తుకోచింది….

  నా చిన్నతనాన్ని మల్లి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు…

  శ్రీనివాస్ జోరిగే

  • నిజంగానండి…మన చిన్నతనం బాగా గుర్తొస్తుంది, ఈ పుస్తకం మళ్లీ ఇప్పుడు చదివితే.. :) మీకు నచ్చినందుకు థాంక్సు.. :)

 7. రమణ మూర్తి says:

  చక్కగా రాశారు, అపర్ణగారూ! చిన్నప్పుడు చదివిన, మంచివి అని అప్పట్లో అనుకున్న కొన్ని పుస్తకాల విషయంలో నాస్టాల్జ్యా పాలు ఎక్కువ అని నాకు నమ్మకం. అలాంటి పుస్తకం ఇప్పుడు మళ్ళీ చదివి కూడా మెచ్చుకోగలిగితే, అది నిస్సందేహంగా మంచి పుస్తకమే!

  ఒక మంచి పరిచయం చేసినందుకు అభినందనలు.

  అలానే, ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్పినందుకు ధన్యవాదాలు…!! :-P

  • అవును నిస్సందేహంగా మంచి పుస్తకం. నాస్తాల్జియా తో romantasise చేయబడ్డ పుస్తకం కానే కాదు.. పుస్తకం అడ్రెస్స్ అంటారా… ఇంచుమించుగా ఆ మాత్రం రిస్క్ తీసుకోదగ్గ పుస్తకమే :) :)

 8. mythili abbaraju says:

  తీయతీయగా పుల్లపుల్లగా లాలీపాప్ లా ఉంది మీ రివ్యూ అపర్ణ గారూ. థాంక్ యూ సో మచ్.నేను గట్టిగా ముద్దు పెట్టుకునే పుస్తకాలలోఇది ఒకటి.. పది రోజుల క్రితమే ఇంట్లో ‘ దొరికింది ‘ …క్లినిక్ కి తీసుకుపోయిమరీ మీలాగా ప్రతివాక్యం చదువుకున్నాను. ఉప్పల లక్ష్మణ రావు గారి అనువాదం లో ప్రత్యేకమైన ఫ్లేవర్. వి.పనోవ పుస్తకాలు ఇంకా దొరుకుతాయేమోనని వెతికాను .నెట్ లో రెండు నవలలు పూర్తిగా ఉన్నాయి.[రష్యన్ పుస్తకాలు తెలుగులో చదివితేనే మజా ] సెర్యోష అనే నవల [ ఈ పుస్తకం ] మాత్రం లేదు.

  • :) :) :) నా రివ్యూ కన్నా మీ కామెంట్ ఇంకా బావుంది :) పుస్తకం మీద ఇంత ప్రేమా!! ఆశ్చర్యంకాదు, ఆనందం. :) ఒక మంచి హగ్ హైదరాబాద్ నుంచి అందుకోండి. :)

 9. అపర్ణ మనిద్దరం అర్జెంట్ గా తికెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాంగా. ఆ పుస్తకం నాకోసారి ఇప్పించరూ..ప్లీజ్. అంత అధ్బుతంగా రాసారు :)

  • :) ఇంటికి రండి..ఇప్పిస్తాను…కానీ తిక్కేస్ట్ ఫ్రెండ్స్ స్టేటస్ మార్చకండి :) నాక్కూడా కొన్ని పుస్తకాలు అవసరం పడతాయి!

 10. Anil battula says:

  చక్కటి “రాదుగా” పుస్తకం గురించి చక్కగా రాసారు….soviet తెలుగు అనువాదాలంటే..నాకు చాల ఇష్టం….ఎంత ఇష్టమంటే…..ఏమో….మాటల్లో చెప్పలేనంత….మీరు ఇలానే మరికొన్ని రష్యన్ తెలుగు అనువాదాల్ని….పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను….

 11. Srinivaas Goud Muddam says:

  రివ్యు బావుంది, అభినందనలు.

 12. అపర్ణా !!!!ఇలా పిలవొచ్చుగా…
  “పెద్ద ప్రపంచం లో చిన్న పిల్లడు” పుస్తకం చిన్నప్పుడెప్పుడో చదివాను.
  జ్ఞాపకాల పొరల్లో ఎక్కడో జారిపోయింది.
  రష్యన్ అనువాదాలు చదివే కదా ఇప్పుడిలా మనుషుల్లా మిగిలాం.
  ఎన్నెన్ని పుస్తకాలు…ఎన్నెన్ని జ్ఞాపకాలు…
  “గోర్కీ స్వర్ణ పిశాచీ నగరం” చదివాక బంగారమంటే ఎంత విముఖత…
  “అమ్మ ” చదివి విప్లవంలో చేరిపోవాలని కలలు కన్న వాళ్ళు నా జనరేషన్ లో కోకొల్లాలు.
  మీరు పుస్తక సమీక్ష రాసిన తీరు అద్భుతం.
  ఆ పుస్తకాన్ని పొందిన వైనం…పున్నాగ పూలు…పారిజాత పూలు…
  మొగలి పూల పుప్పొడిలాంటి స్నేహ వాక్యం…ఎక్కడో మనసు లోతుల్ని తాకిన అనుభూతి.
  ఈ సమీక్షని భూమిక లో వెయ్యడానికి అనుమతి ఇస్తారా???
  సారంగ లో వచ్చిన రచనలు భూమిక లో వేసుకోవచ్చని కల్పన పర్మిషన్ ఇచ్చింది.తను నా ఫ్రెండే.
  మీరు ఓకె అంటే భూమిక లో వేసేద్దాం.

  స్నేహంగా
  సత్యవతి

  • మీకు సమాధానం ఫేస్బుక్ లో కూడా పెట్టాను. :) ఐ యాం ఆనర్డ్!

  • సత్యవతి, అవును. భూమికలో వేసుకోవచ్చు. కాని, సారంగ వార పత్రిక నించి అని పెట్టడం మరచిపోవద్దు.

 13. షేర్ చెయ్యకపొతే ఇంత త్వరగా నా దృష్టికి వచ్చేది కాదు.
  చక్కని పరిచయం.
  కేవలం కాకతాళీయమా..ఈ రోరు జ్యోతి ఆదివారం లో కూడ రషియా తెలుగు అనువాదాల గురించి, అనిల్ బత్తుల సేకరణ గురించి ప్రచురించడం!

  • థాంక్యూ! మీరు నా రోజును తయారు చేసారు! (you made my day కు స్వేచ్చానువాదం!) :)

 14. అపర్ణ గారూ,

  ఒక చక్కని ఆంగ్ల జాతీయాన్ని(idiom ను) తెలిపినందుకు మిమ్మల్ని అభినందించాలి. కాని తెలుగులో దాని సరైన అనువాదాన్ని ఇవ్వకపోవటం వల్ల మీరు చెప్పదల్చుకున్న అసలైన అర్థం చాలా మంది తెలుగు పాఠకులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఉద్దేశపూర్వకంగానే అట్లా చేశారా? మీరు చెప్పిన ఆంగ్ల జాతీయాన్ని చదివి, శ్రద్ధతో ఇంగ్లిష్ డిక్షనరీని సంప్రదించేటంత ఓపిక ఈ రోజుల్లో ఎంత మందికి వుంటుందంటారు?

 15. పైగా ఆంగ్ల జాతీయాల్ని ఈ విధంగానే అనువదించాలి కాబోలు అనుకునే అమాయకులూ వుంటారు కొందరు. కాదంటారా?

  • సరదాకే రాసానండి! గ్రూప్ లో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.. :)

 16. సోవియట్ తెలుగు పుస్తకాల బ్లాగ్ : http://sovietbooksintelugu.blogspot.in/

 17. సెర్యోష మరియు పెద్దప్రపంచం లో చిన్న పిల్లడు(వి. పనోవ), రెండు ఒకే పుస్తకము . ఒకే పుస్తకాన్ని రెండు పేర్లతో prachrincharu.

  వేరా పనోవాడే మరో పుస్తకం కూడా రెండు పేర్లతో prachurincharu. ఆ పుస్తకం perlu. సమరంలో కలసిన గీతాలు మరియు రైలు బండి .

 18. నిజంగా మీరు రాసిన సమీక్ష చదివి ముగ్ధురాలిని ఐపోయాను…..ఒక్క క్షణం అలా ఆ బొమ్మ కేసి చూస్తుండి పోయాను..ఆ బొమ్మలో నా బాల్యం జ్ఞాపకాలు కనపడ్డాయి..ఎదురు చూసిన నేస్తం ఎదురుగ నిల బడ్డట్టు అనిపించింది. ఆ తర్వాత మీ సమీక్ష ఎంత ఆనందం అలిగిందో మాటల్లో చెప్పలేను.. ఇలాంటి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పరా ప్లీజ్ ……………..

 19. పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లడు ebook లింక్:

  http://sovietbooksintelugu.blogspot.in/2015/04/ebook-link_42.html

 20. వెరీ నైస్ అపర్ణా

మీ మాటలు

*