పిట్ట మనసులో ఏవుందీ ?

SAM_0344

“ఓరి నీ అఘాయిత్యం కూలా ….ఎంత తోస్తే అంతా చేసేయడవే ! ఆలోచనుండొద్దూ ?” అంటూ అబ్బులుగాడి మీద అంతెత్తున  విరుచుకు పడ్డారు  అత్తగారు .

మరి, అబ్బులు చేసుకొచ్చింది ఆషామాషీ ఆగడం కాదు . పొగాకు బేరన్ కి పుల్ల కోసం ట్రాక్టరు తోలుకుని మన్యం వెళ్ళినవాడు పుల్లతోపాటు పిల్లనీ దింపేడు మా వాకిట్లో .

” ఆయ్..ఈ పిల్లపేరు తలుపులమ్మండీ ” అంటూ కొంగు ముడేసి తీసుకొచ్చిన కొత్తపెళ్ళాన్ని  పరిచయం చేసినట్టూ  బోర విరుచుకుని గర్వంగా  చెప్పేసరికి ,  అత్తగారు  సందేహంగానూ, నేను ఆశ్చర్యంగానూ చూస్తూ నిలబడిపోయాం. ” అడ్డతీగలండీ…అమ్మాబాబూ లేరంటండీ పాపం . అడివిలో పురుగూ పుట్టా మధ్య  బతకటం సేనా కట్టంగా  వుందనీ, మనూర్లకేసి వచ్చేసి ఏదో పనిసేసుకు బతుకు దారని పాపం ఒకటే గోలండి. ఆడకూతుర్ని అడవిలో వదిలేలేక ఎమ్మట ఎట్టుకొచ్చేసేనండీ  ” అంటూ వట్రంగా ఒక్కోమూడీ విప్పేసరికి,  చెప్పొద్దూ..  మా అత్తగాకీ నాకూ ఫ్యూసులు ఎగిరిపోయాయి.

వెనకటికి ఇలాగే … మారేడుమిల్లి అడవుల్లో దొరికిందని  దెబ్బతిన్న నెమలి  పిల్లని  ఒకదాన్ని చంకన పెట్టుకొచ్చాడు . మురిసిపోయిన మాంగారు అబ్బులుగాడికి ఒకబుట్ట పుగాకు బహుమానంగా ఇచ్చేసి, దాని పెంపకం బాధ్యత కూడా వాడికే అప్పచెప్పారు . వాడేమో మిగతా పనులన్నీ వదిలేసి, దాన్నే  కనిపెట్టుకుని కూర్చునేవాడు  . అది మకాంలోని   గిన్నీకోళ్ళు, డింకీకోళ్ళు, టర్కీ కోళ్ళు వంటి , పెంపుడు జాతులతో కలవలేక పోయేసరికి  ఇంటిపెరట్లో   దాని పెంపకానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు . తనపెంపకంలో చక్కని ఈకలు తొడిగి దినదినప్రవర్ధమానమవుతున్న ఆ నెమలి ని చూసి తెగ పొంగిపోయేవాడు అబ్బులు .దాంతో ఉత్సాహం తీరక  నలుగురి కంటా పడకుండా మా ఇంటి ప్రహారీ మధ్య తన హయాంలో గుట్టుగా  పెరుగుతున్న ఆ నెమలి వయ్యారాలని ఊరందరికీ వర్ణించి చెప్పుకోవడం మొదలుపెట్టాడు . ఆ కబుర్లు ఆనోటా ఈనోటా పాక్కుంటూ ఎక్కడో టౌను  స్టేషన్ లో నిద్రపోతున్న ఎస్సై చెవుల్లో పడిపోయాయి .” కేసవుతుందండీ రాజుగారు ”   అని ఆ పోలీసు బాబు ఒళ్ళువిరుచుకుంటూ వచ్చి పడేసరికి   , “ అమ్మమ్మా..అంతపనిచెయ్యకండి  ఏదో తెలీక ..” అంటూ బాబుని బుజ్జగించి  అబ్బులు చేతుల్లో అల్లారుముద్దుగా  పెరుగుతున్న ఆ నెమలిని దాని  పుట్టింట్లో  వదిలిరావడానికి  అప్పటికప్పుడు చిన్నకారు కట్టించుకుని అడవులకి దౌడుతీయాల్సి వచ్చింది మాంగారు .

“ఏటేస్ … నాటుకోడిని నీటుగా  నవిలేత్తే  కేసవ్వదుకానీ, నెమలికోడిని గారంగా పెంచుకుంటుంటే కేసేసేత్తారా ” అంటూ ఓనాడెప్పుడో   లోగిట్లో కోడిపులావ్ లొట్టలేసుకుంటూ తినెళ్ళిన ఆ ఎస్సైమీదకి తూగుతూ తగూకి  కి వెళ్ళబోయిన  అబ్బుల్ని ”  ఓరిబాబూ ఊరుకోరా … గవర్నమెంటోడి రూలంటే రూలే ..ఆడికంటే మనకెక్కువ తెలుసేటీ  . అదీగాపోయినా నువ్వు ఎన్నముద్దలెట్టి ఎన్నాళ్ళు  పెంచినా అది ఏదో ఓనాడు   జతకోసం అడివిలోకి ఎల్లిపోయీదే . ఆ మాత్రం దానికి ఓ ఇదయిపోటవెందుకూ ”  అని నచ్చచెప్పటానికి నానా కష్టాలు పడ్డాడు చేలో మకాం ఉండే కన్నప్పడు .   తన గారాలపట్టి ని తలుచుకుని తలుచుకుని కొన్నాళ్ళు బెంగపడ్డ  అబ్బులు , ఎంత దూరాన్ని వదిలేసినా అది తనని వెతుక్కుంటూ ఎగిరొచ్చేస్తుంద న్న  భ్రమలో  మరి కొన్నాళ్ళు గడిపేసాడు.. అదెక్కడున్నా సుఖంగా ఉండాలని గాల్లో దణ్ణాలు పెడుతూ   చాన్నాళ్ళకి ఆ సoగతి మర్చిపోగలిగాడు .

పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందన్న సామెత అబ్బులు విషయంలో చాలా సార్లు రుజువయ్యింది. నేలన పోయేదాన్ని నెత్త్తికి రుద్దుకోవడంలో కూడా వీడు సిద్దహస్తుడు.

ఒకసారి మేం చూస్తుండగానే   ఇంటి చూరునించీ జారి నీళ్ళగోళెంలో పడిన ఎర్రతేలు మునగాలో తేలాలో తేల్చుకోలేక అవస్థ పడుతుంది  .   అత్తగారూ నేనూ గోళెం చూట్టూ  ప్రదక్షిణ చేస్తూ  ఎవడి చెప్పుకిందో పడి చావకుండా నీళ్ళలో ములిగి ఉత్తమ మరణం పొందబోతున్న ఆ పుణ్యాత్మురాలయిన తేలుకు పుణ్యలోకాలు ప్రాప్తించాలని ప్రార్ధిస్తుంటే అటుగా వచ్చిన అబ్బులు ” అదేం పనండి అయ్యగారు ” అంటూ ఉత్తిపుణ్యానికే మమ్మల్ని  కోప్పడ్డాడు    . అక్కడికి  మేవేదో  దాని తోక పట్టుకుని నీళ్ళలో తోసేసినట్టు  .

“ అంతగా అయితే పైకి తీసి ఒక్కదెబ్బెయ్యాలిగానండీ  అలా పేణాలకోసం గిలగిలా కొట్టుకుంటుంటే సూత్తా ఊరుకో కూడదంటండీ…సేనా పాపవంట మా తాత సెప్పీవోడు”  అంటూ  తాతోపనిషత్ తిరగేసాడు. అక్కడే వున్న పుల్లని నీళ్ళలోకి జారవిడిచి వస్తాదులా నిలబడ్డాడు .” ఏడ్చావులే రా ! నీ దారిన నువ్వుఫో … దాని చావు అది చస్తుంది” అన్న అయ్యగారోపనిషత్  వాడి చెవికి చేరేలోగానే    , పుల్లమీంచీ మేం ఊహించని స్పీడులో పైకి  పాక్కుంటూ  వచ్చిన ఎర్రతేలు అదే స్పీడులో అబ్బులుగాడి చేతిమీదికి  చేరిపోయి  తన ప్రాణాలకు పుల్ల అడ్డేసిన  పెద్దమనిషన్న కనికరం అయినా లేకుండా తోకతో టపీ టపీమని కొట్టేసింది .  ఇంకేవుంది  .. చెయ్యి గాల్లో గింగిరాలు తిప్పేస్తూ  లబోదిబోమంటూ తేలుమంత్రం వేయించుకోడానికి   పరిగెత్తాడా    ఆపద్భాంధవుడు   .

ఆపదలోవున్నవారిని  అక్కున చేర్చుకోవాలని తహతహలాడిపోతుంటాడు పిచ్చి సన్నాసి   . అవతల ఉన్నది  మనిషయినా ,మానయినా –పురుగయినా, పిల్లయినా వాడికొక్కటే .

మరి అలాగే కదా , చెరుకు లోడుతో చెల్లూరు వెళ్ళినవాడు అక్కడా ఆపధ్భాంధవుడి అవతారం ఎత్తి అడకత్తెరలో పడ్డాడు . ఇప్పటికీ నలుగుతూనేవున్నాడు   .

అమ్మానాన్నా, అత్తామావా అందరూ  ఎంతగా  బతిమాలుతున్నా వినకుండా నక్కబావని నేను చేసుకోనంటే చేసుకోను అని మంకుపట్టుతో పంటకాలవలో దూకేసిన సత్యవతిని అటుగా వెళుతున్న అబ్బులు పైకి లాగి నీళ్ళు కక్కించాడట . కళ్ళుతెరిచిన ఆ పిల్ల  అబ్బులుని  పరీక్షగా చూసి , నా  వంటిమీద చెయ్యేసిన నువ్వే  నన్ను ఏలుకోవాల్సిన జగదేకవీరుడివి అంటూ వెంటపడిందట సతీ సత్యవతిలా  .    ‘ నాకు పెళ్ళయిపోయింది పిల్లో ‘ అని వాడు మొత్తుకుంటున్నా వినకుండా  వీడు చెరుకు లోడుతో వెళ్ళేసరికల్లా   షుగరు ఫేక్టరీ గేటు దగ్గరే ఎదుపడి వగలుపోయేదట    .  ఒకసారి,  శారదా వాణిశ్రీల మధ్య విలాసంగా నిలబడ్డ శోభన్ బాబు వాల్ పోస్టరు చూపించి , నువ్వాపాటి చెయ్యవా నీకేం తక్కువా అని ఎగేసిందట . అప్పటికీ వీడు చిక్కకపోయేసరికి ,   ఒక సుభలగ్నాన  వాళ్ళూరు పుంతరోడ్డులో సత్తెమ్మ తల్లి గుడిదగ్గర కాపుకాసి, ఈరోజుతో తాడో పేడో తేలిపోవాల్సిందే నుంచున్నపళంగా నా మెళ్ళో తాళికడతావా లేకపోతే , మా నక్కబావని  పెళ్ళిచేసుకుని ఈ రాత్రికే చచ్చిపోమంటావా అని నిలేసేసిందట , ఆపిల్ల మంకుపట్టుకి  అంతటి మొగోడు  కళ్ళనీళ్ళుపెట్టేసుకుని , ఏవయితే అదే అయిందని తలొంచుకుని సత్యవతి మెళ్ళో మూడుముళ్ళూ వేసేసాడట.

ఇంత జరిగాకా ఆ పిల్ల అమ్మానాన్నా  ఏడ్చి ఏడ్చి మొఖం కడుక్కుని  అబ్బులుని ఇంటికి పిలుచుకెళ్ళి ,   మా పిల్లనొదిలేసి మేం వుండలేం   మాకున్న అరెకరం పొలం, మేం వుంటున్న ఈ డాబా ఇల్లూ మా పిల్లవే అంటే ఇకనుంచీ  మీవే . మీ ఇబ్బంది మాకు తెలుసనుకోండి  అయినా   వీలు చిక్కినప్పుడలా  వచ్చిపోతుండండి అల్లుడుగారు అనేసారట .

అబ్బులు చేసిన ఈ ఘనకార్యం ముందు చెల్లూరులోనూ  ఆనక మా ఊర్లోనూ షికారు చేసి చివరికెప్పటికో అబ్బులు పెళ్ళానికి చేరింది . ముందు మొగుడనే  మమకారం లేకుండా  చితక్కొట్టేసినా  …ఆనక అరెకరం పొలం -డాబా ఇల్లు సంగతీ తెలిసి ” సర్లే ….ఏదో సామెత చెప్పినట్టూ పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది . ఆడది అంతకి తెగించాకా ఆయన మాత్రం ఏం చేత్తాడు . రాముడు దేవుడు కనకా  శూర్పణకకి చిక్కకుండా తప్పించుకోగలిగేడు . మా అబ్బులు మాయ పాపం అమాయకుడు దొరికిపోయేడు . ఇకనుంచీ నేనెంతో ఆవిడా అంతే  ” అని సర్దేసుకుందట.  అలా అని   మొగుణ్ని  ముక్క బద్దా కింద  పంచేసుకోలేరు కదా ! అందుకే ఇద్దరూ గొడవ పడకుండా ఒక పద్ధతి ప్రకారం పోతూ   అబ్బులుని ఇక్కడ ఈవిడ  ఉతికి  ఆరేస్తే , అక్కడ ఆవిడ మడతేసి ఇస్త్రీ చేస్తుందనీ  జనం నవ్వుకుంటారు .   అబ్బులు మాత్రం అసలేం జరగనట్టూ ఎక్కడవక్కడే మర్చిపోయి  తన మానాన తను న్యాయమనుకున్న పనులు  చేసుకుపోతుంటాడు .

ఇక ఈ పిట్టకథలు , పీత కథలు పక్కనపెట్టి అసలు కథకొస్తే   ….. అబ్బులు చేసుకొచ్చిన ఘనకార్యానికి అయోమయంలో పడిపోయిన అత్తగారు అప్పటినుంచీ అదే పాట పాడుతున్నారు. బాగాచెప్పారు అంటూ నేను అలవాటుగా అత్తగారి వెనక నిలబడి  తాళం వేస్తున్నాను.

” నీకు బుర్రా బుద్ధీ లేదటరా…. ఇదేం చోద్యం రా . అడవిలో దొరికిందని  లేడి పిల్లని తెచ్చినట్టూ  ఆడపిల్లని తీసుకొచ్చేస్తావా ! ఇదేం అఘాయిత్యపు పనిరా ….ఆలోచనుండొద్దూ  !!

” అదికాదండి అయ్యగారూ …” అని తలొంచుకుని నీళ్ళు నములుతూ అబ్బులు, ఆ పక్కనే అదురూ బెదురూ లేకుండా నిట్రాటలా నిలబడి పరిసరాలు పరిశీలిస్తూ ఆ పిల్ల .

ఏగేసి మోకాళ్ళ కిందికి కట్టిన  ముదురాకుపచ్చ రంగు చీరలో బోసిమెడతో ఉన్న తలుపులమ్మ అడ్డూ ఆపూ లేకుండా తన ఇష్టానికి పెరిగిన అడవిమల్లెతీగలా సన్నగా బలంగా  వుంది . మెడలో పసుపుతాడులాంటిదేదీ కనిపించక పోవడంతో మేం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం .

” అదేపోన్లెండి  …మీకు నచ్చాపోతే  రేపొద్దుగాలే  ఆ అడివిలో దిగబెట్టేసొత్తాను . మాపిటికి ఇక్కడే మీ లోగిట్లోనే ఉండనీయండి . సాకిరీ సెయ్యలేక సీపురు పుల్లలా అయిపోయేరు గదా సిన్నయ్యగారు, చేతికింద సాయానికో మడిసుంటే ఆరికీ మీకూ కుంత కులాసాగా వుంటదని అలోచించేనండీ . మీరు వొద్దంటే ..నాకేం పట్టిందిలెండి “ అని   అబ్బులు నిష్టూరంగా అంటుంటే,  అన్నంత పనీ చేసేయడు కదా అన్నట్టు అబ్బులుకేసి దిగులు చూపులు చూస్తుంది తలుపులమ్మ . ‘ మా నాయనే ..నా కష్ట సుఖాల గురించి నీకెంత అక్కరరా ‘ అని  నా మనసు సంతోషంతో గంతులేసింది .

అత్తగారు మాత్రం అబ్బులు మాటకి “ హవ్వ… “ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ  వాడ్ని పక్కకి పిలిచి, “  నీ తెలివి తెలారినట్టేవుంది . ఇలా ముక్కూ మొహం తెలీని వాళ్ళని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఇంకేవన్నా ఉందట్రా   ! ఆ పిల్ల చూపూ వాలకం చూస్తే  పని తెలిసినదానిలా వుందా ? అసలే అడవుల్లోంచీ వచ్చింది అక్కడెవరితో ఏం సంబధాలున్నాయో ….ఈ సంగతి రాజుగారికి తెలిస్తే చీల్చి ఎండేస్తార్రోయ్  “ అంటూ  పళ్ళు నూరేసరికి   బెకబెకమంటూ నవ్వేసిన అబ్బులు , “ అబ్బే మీరూరికే అనుమానపడతనారండీ… ఆయమ్మి అలాటిది కాదండీ పాపం.  సేనా మంచిదండీ”  అంటూ వాదించబోయాడు . అప్పటికే విసిగిపోయి ఉన్న అత్తగారు ‘ ఠాట్ ‘ అంటూ కళ్ళెర్రజేసి గద్దించేసరికి కొంచెం బెదిరినట్టూ  వెనక్కి తగ్గి,  “ అయ్ బాబూ  అలాకోప్పడతారేటండీ…అలాగే అంపిచ్చేద్దారిలెండి “ అంటూ దారికొచ్చాడు .

ఆ మాటతో  సమాధానపడ్డ  అత్తగారు ” అలాగే  అఘోరించు . పొద్దున్నే రా ఫో “అ ని అబ్బుల్ని కేకలేసేసరికి వాడు కాల్లో ముల్లు  దిగబడ్డవాడిలా  బాధపడుతూ ఒక్కో అడుగూ అతికష్టం మీద వేసుకుంటూ వెనక్కి చూసుకుంటూ  వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ” పొద్దుగాలెప్పుడో తిన్నాది. పాపం ఆకలేత్తది కదండీ . మీరు తిన్నాకా కుంత ఒణ్ణం ఎట్టండి  ” అంటూ పరమాయించి పోయాడు.

తలుపులమ్మ  అన్నంతిని ఆకు పారేసొచ్చాకా  తుంగచాపా దుప్పటీ ఇచ్చి పడుకోటానికి చోటు చూపించారు అత్తగారు  .” ఈ రాత్రి మనకెలాగూ జాగారం తప్పదు అనుకుంటూ అత్తగారూ నేనూ  సావిట్లోనే  కూలబడ్డాం .  మేం నిద్రపోతే ఆ అపరిచితురాలు ఎక్కడ కొంప తవ్వుకుపోతుందో అన్నంత ఇదిగా రెప్పవేయకుండా జాగ్రత్తగా వుండాలనుకుంటూ ” ఇదిగో వెనకటిలాగే…” అని ఎక్కడెక్కడి పాత కథలో తవ్వుకుంటూనే  ఆవులింతలతో   ఒకరిమీద ఒకరు వాలిపోయాం .

ఎండ మొఖం మీద పడటంతో మెలకువొచ్చిన మాకు నారింజరంగు చీరలోకి మారిపోయిన తలుపులమ్మ గుమ్మంలో ముగ్గేస్తూ కనిపించింది . వాకిట్లో పొయ్యిమీద నీళ్ళు కాగుతున్నాయ్ .  నవ్వుతూ వచ్చిన తలుపులమ్మ  గోళేల్లోకి  నీళ్ళు తోడేసిన సంగతి,  మంచినీళ్ళబిందెలూ, పాలతెపాళాలూ తోమేసి బోర్లించిన  సంగతీ చెప్పి ఇంకేవన్నా పనుంటే చెప్పండి అనేసరికి మేం  తెల్లమొఖాలేసుకు  నిలబడిపోయాం .

పొద్దున్నే వస్తానన్న అబ్బులు  మధ్యాహ్నవయినా అజాపజాలేడు. చూసినవాళ్ళు ఎవరూ ఏవిటీ అని ఆరాలు తీస్తారనే భయంతో అత్తగారు తలుపులమ్మని పెరడు దాటి రావద్దని  ఆజ్ఞాపించేసారు  . మoచినీళ్ళు దగ్గరినుంచీ అన్నీ కాళ్ళదగ్గరికే అందిస్తూ మాంగారు, మా రాజుగారు కూడా సావిడి దాటి వంటింటివైపు రాకుండా చూసుకుంటున్నాం.

చూస్తుండగానే సాయంత్రవయిపోయింది . ఆ పనీ ఈపనీ అని లేకుండా అన్ని పనులూ మా చేతుల్లోంచి చనువుగా లాక్కుని మరీ చేసేస్తుంది తలుపులమ్మ.  మాంగారు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు , అత్తగారు అబ్బులు గురించి ఆరా తీస్తే  ” మన్యం వెళ్ళొచ్చాడు కదా ! నీళ్ళు తేడా చేసాయేమో ..రెండు రోజులు రాలేనని కబురంపేడు “అన్నారట  . రెండ్రోజులే …..అని తలపట్టుకు కూర్చున్నారు అత్తగారు.

అంతోటి అత్తగారే అలా అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక కంగారుపడిపోయాన్నేను . ఇదేం పట్టని తలుపులమ్మ  రాములవారి గుళ్ళోంచీ మైకులో వినిపిస్తున్న మూగమనసులు సినిమాలోని ”  గోదారి గట్టుందీ… ..” అన్న పాటని   తలాడిస్తూ వింటుంది .

ఆ మర్నాడు కూడా కోడికన్నా ముందులేచి అంతే హుషారుగా పనులన్నీ చేసేసి  అత్తగారిని ఆశ్చర్యపరిచేసింది తలుపులమ్మ.

ఎంత పెట్టినా ఎప్పుడూ మొఖం మొటమొటలాడించుకుని గిన్నెలూ గిరాటేసే  నరసమ్మకీ , చలాగ్గా చేతిలో పని అందుకుని చేసేస్తున్న ఈ మనిషికీ  నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది కదే అన్నారు అత్తగారు .

అవునంటూ తలాడించాను .

మెతుకు చూస్తే అన్నం పదును తెలిసిపోదూ , ఈ రెండ్రోల్లోనీ  పిల్ల పద్ధతి తెలిసిపోయింది కదా , మనకీ చేదోడుగా వుంటుంది పోనీ ఉండనిద్దామా అన్నారు . మనిషి మొరటే అనుకో అయినా  పోగా పోగా తీరిక అదేవస్తుందిలే అన్నారు మళ్ళీ ఆవిడే . అదీ నిజమేలెండి అన్నాను .

ఆ సాయంత్రం “ పెరట్లో ఆ మనిషెవరూ కొత్తగావుందీ ?” అనడిగిన మాంగారితో  .  ఇంటిపనిలో చేతిసాయానికి పెట్టుకున్నాం ఇక ఇక్కడే వుంటుంది అని డిక్లేర్ చేసేసారు అత్తగారు  . వీధిలో రాజకీయాలకే రోజు చాలటంలేదు పెరటి రాజకీయాలు మనకెందుకనుకున్నారో ఏమో  వివరాలజోలికి పోకుండా ” ఓహో ” అనేసి ఊరుకున్నారు మాంగారు .

మూడోనాడు పొద్దున్నే ఈనులాగేసిన కొబ్బరాకులా వాలిపోతూ వాకిట్లో నిలబడ్డ అబ్బులు “అయ్యగారూ  సత్తెపెమాణకంగా పేణం బాగోక రాలేకపోయేనండీ … నిజవండీ బాబూ , ఒట్టండీ బాబూ ”   అంటూ పెద్దయ్యగారిని  ప్రసన్నం చేసుకోటానికి  తలమీద చేతులేసుకుని  తెగ ప్రయాస పడి పోతున్నాడు .

చేటలో బియ్యం పోసుకొచ్చిన తలుపులమ్మని ” ఒలే…నీ సంచొట్టుకొచ్చీ . అయ్యగారొద్దన్నాకా నువ్వో చనం కూడా ఉండటానికి ఈల్లేదు ” అంటూ వాడు  తొందర చేస్తుంటే ….”అయిందేదో అయిందిలే , ఇక్కడే వుండనీ “ అని అత్తగారు ప్రసన్నవదనంతో అభయం ఇచ్చేసరికి అంత నీరసంలోనూ అబ్బులు ఆనందతాండవం చేయబోయాడు .

అత్తగారు వాడి ఆత్రానికి పగ్గాలు బిగిస్తూ ” ఇక తలుపులమ్మ ఆలనా పాలనా మేం చూసుకుంటాం కాబట్టి, నువ్వు దాని ఇరుపంచాలా  కనిపించకూడదు. మేం లేనప్పుడు నీళ్ళనీ, నిప్పులనీ పెరట్లోకి  వెళ్ళి పలకరించకూడదు  . పనున్నాసరే నువ్వుదాని దరిదాపుల్లో మసలకూడదు ..మళ్ళీ లేనిపోని తంటసా  అంటూ ముచ్చటగా  పెట్టిన మూడు షరతులకే  మూర్చొచ్చినంత  పనయింది అబ్బులుకి . అయినా తమాయించుకుని ఉస్సూరంటూ ఓ చూపు చూసి    ” అలాగేలెండి ఏదో మీనీడన   ఆయమ్మి సల్లగా వుంటే  నాకంతే సాలు “అంటూ  ప్రేమ కథల్లో  నాగేస్సర్రావులా భుజమ్మీద  తువ్వాలు  జారిపోతున్నా పట్టించుకోకుండా తూగుతూ వెళ్ళిపోయాడు.

అబ్బులు వెళ్ళాకా తలుపులన్నీ బిగించి,  ఆ అడవిమల్లికి  కొన్ని సుగంధాలు  అద్దే ప్రయత్నంలో పడ్డారు  అత్తగారు  .

ఆప్రకారం ….  అత్తగారి అనుమతిలేకుండా వీధి గుమ్మం దాటకూడదనీ,ఊరికే గోడలెక్కీ గుమ్మాలెక్కీ వీధిలోకి చూడకూడదనీ , ఏదయినా పనిమీద ఎవరింటికయినా పంపిస్తే ఆ పని  చప్పున చక్కబెట్టుకు వచ్చేయాలి కానీ    అక్కడే కబుర్లు చెపుతూ కూర్చోకూడదనీ, అలా చేస్తే అవతలివాళ్ళు మాటల్లో పెట్టేసి మన ఇంటిగుట్టంతా లాగేస్తారనీ , ఎవరిగగ్గరా ఏదీ ఊరికే పుచ్చుకోకూడదనీ, ఇంట్లో మగాళ్ళుండగా వంచిన తలెత్తకుండా పనులు చేసుకోవాలి తప్ప, వచ్చేదెవరూ పోయేదెవరూ అని ఊరికే ఆరాలు తీయకూడదనీ , ఇంకా అదనీ, ఇదనీ ….పెద్ద పురాణమే చదివేసారు .  అవన్నీ విన్న తలుపులమ్మ అర్ధం అయీ కానట్టు అయోమయంగా  తలాడించినా నాకు మాత్రం    చుట్టూ కారుచీకట్లు కమ్ముకున్నట్టూ అనిపించి పైకి చూస్తే ఆకాశంలో కూడా గోడలు కనిపించాయి . సరిగ్గా అప్పుడే మా పొట్టి బ్రహ్మం ” చీకటిలో కారుచీకటిలో….” అన్న విషాద గీతానికి తనపొట్టి సన్నాయిమీద ట్యూన్స్ కట్టుకుంటున్నాడు. పాపం వాడి పెళ్ళం మళ్ళీ వాడ్ని కొట్టేసి పుట్టింటికెళ్ళిపోయినట్టుంది అనుకొని కాస్త విషాదంగా నవ్వుకున్నాను .

వచ్చిన నెలలో ఉన్న హుషారు తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టి  వాడిన  సన్నజాజి తీగలా వేలాడుతూ  తిరుగుతుంది తలుపులమ్మ .  ఇంకో పదిరోజులు గడిచేసరికి వంకర ముగ్గులు వేస్తూ , నూతిలో బకెటుకి బదులు తాడు వదిలేస్తూ పరధ్యానంలో పడింది. అబ్బులు గోడమించీ అందించిన గోలీ షోడాలు దాచినంత సులభంగా వాడందించిన సంపెంగలు, మొగలిరేకులూ మా కంట పడకుండా దాచలేక అవస్థ  పడుతుంది  .  పక్కూళ్ళో తీర్థానికి వెళ్ళాలని ఉబలాటపడి అయ్యగారి పర్మిషన్ దొరకక ఢీలా పడింది.  గోరింటాకు కోసుకురావటానికి  కరణంగారి తోటవరకూ  వెళ్ళొచ్చినరోజు మాత్రం కాస్త హుషారుగా కనపడింది . అటకమీద ఆవకాయ జాడీలు దించడానికి , చెట్టుమీంచీ కొబ్బరి గెలలు దించడానికీ , అబ్బులుగాడు వచ్చిపోయినప్పుడు దిగులుగా వాడెళ్ళినవేపు చూస్తూ వుండిపోయింది .  చుట్టూవున్న నాలుగు గోడల్నీ చూసినట్టే , రోజూ  కనపడే మా నాలుగు ముఖాల్నీ ఏభావం లేకుండా చూస్తుంది . కొత్తమనుషులెవరన్నా వస్తే వదలకుండా వాళ్ళనే అంటిపెట్టుకు తిరుగుతుంది . బయటినుంచి వినిపించే ప్రతీ మాటనీ , మైకులో వినవచ్చే ప్రతీ పాటనీ ఒళ్ళంతా చెవులుచేసుకు వింటుంది .

ఒక మిట్ట  మద్యాహ్నం  మండువా గుమ్మంలో  తీరిగ్గా కూర్చునున్నప్పుడు  …..” తలుపులొచ్చి మూడ్నెలు అయింది కదే “ అన్నారు అత్తగారు .  పత్తిలో గింజలు తీస్తూ …

అయ్యేవుంటుందిలెండి అన్నాను  నేను ,   పంచదారతో వచ్చిన పొట్లాల కాగితం విప్పుతూ….

“ ఆ అడవిలో ఏం తినేదో ఏంటో….మనతోపాటు శుబ్రమయిన తిండి తింటుందికదా  మనిషి  ఒల్లుచేసింది.  కానీ , మొఖంలో కళపోయి పాండురోగం వచ్చినదాన్లా రోజురోజుకీ అలా  అయిపోతుందేంటో !“ అన్నారు అత్తగారు .

అలా అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు …వాళ్ళూరు మీద బెంగ పెట్టుకుందేమో అని అప్పటికి తోచిందేదో చెప్పేసాను

ఇంకా నయం అక్కడెవరూ లేరనేగా ఇక్కడికొచ్చింది . అయినా మనం బానే చూస్తున్నాం కదా !   బట్ల భాస్కర్రావు దగ్గర దానికి నచ్చిన రంగు చీర తీయించి ఇచ్చామా . మనముందు బోడి బొంగరంలా తిరుగుతుంటే చూళ్ళేక రామిండ్రీనించీ గాజులూ పూసలూ తెప్పించి వేసామా . నెలక్రితం ద్వాదసి దీపాలు  వదలడానికెళుతూ మనతో పాటూ దాన్నీ  పుష్కరాలరేవుకు  తీసుకెళ్ళాం కదా ….అంటూ  చిన్న స్వరంతో చిట్టా విప్పుతున్న అత్తగారు

దూరంగా వాకిట్లో పందిరి రాటకు ఆనుకుని  ఆకాశంలోకి చూస్తూన్న తలుపులమ్మని  చూపించి  …దీని వాలకం చూస్తుంటే నాకు భయంగా వుందేవ్ ” వెర్రి మాలోకంలా అలా శూన్యంలోకి చూస్తుందేవిటే ”  అని గాభరాగా అంటూ గింజలు పళ్ళెంలోనూ, పత్తి నేలమీదికీ గిరాటేస్తున్నారు  .

ఇవతలున్న సగం జోకూ చదివేసి, నవ్వురాక పొట్లంలో చిక్కుకున్న పూర్తి జోకు చదవాలనే  కుతూహలంతో   కాగితం మడతల్ని జాగ్రత్తగా విప్పుకుంటున్నదాన్నల్లా  “ ఆకాశంలో అడ్డు  గోడలుండవుకదండీ  ! అందుకే  అందినంతమేరా అలా చూస్తూ పోతుందేమో !” అనేద్దామనుకుని  …..అసలే అత్తగారు ఒకింత గాభరాగా వున్నారుకదా  ఇంకా కంగారుపెట్టడం భావ్యం కాదనిపించి  , నా కవి హృదయాన్ని తొక్కిపట్టి   ” ఏమోనండీ నాకెలాతెలుస్తుందీ  ”  అని అప్పటికి తప్పించుకున్నాను .

పండుగ నెల . సీతాకాలం పొద్దు ,  భోగి పిడకలకి ఆవుపేడ తెస్తానని మధ్యాహ్నం వెళ్ళిన తలుపులమ్మ   దీపాలవేళయినా  ఇల్లుచేరలేదేవిటని అత్తగారు హైరానా పడుతున్నారు . “అదేం చిన్నపిల్లా తప్పిపోటానికీ …రావాలంటే  తనే వస్తుంది . ఓ..ఇదయిపోతారెందుకూ” అని మాంగారు కేకలేస్తున్నారు .  అంతలో,  ఆ మధ్య ఇంటికి సున్నాలేయటానికొచ్చిన జట్టులో సూరిబాబనే వోడు , పడుతూ లేస్తూ  వచ్చి ఈ కబురు చెప్పేడు  .

మధాహ్నమే  తలుపులమ్మ  గోకారం రోడ్డులో ఉల్లిపాయల సూరిబాబు ఒంటెద్దుబండిమీద వెళ్ళటం చూసేనని .  ఎక్కడికని అడిగితే కోపంగా చూసిందట   . మళ్ళీ ఎప్పుడొస్తావ్ అంటే  ” మళ్ళీనా ! సత్తేరాను …ఆ కొంపలో నాకు గాలాడతాలేదు ” అందట . “ఎందుకన్నా మంచిది ఓపాలి సూసుకోండి రాజుగారూ ఏవన్నా అట్టుకుపోయిందేమో”  అని మాకంటే ఎక్కువ కంగారు పడిపోయాడు  .

ఇలా తెల్లారిందో లేదో అలా ఊళ్ళో జనం ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ తోసుకుంటూ పరామర్శకి వచ్చేసారు .

అమ్మో  అలా జరిగిందా అని ఆశ్చర్యపోయారు  . నమ్మి ఇన్నాళ్ళూ ఇంట్లో పెట్టుకుంటే ఒక్క మాటన్నా చెప్పకుండా చెక్కేసిందంటే ఎంత గుండెలు తీసిన బంటో చూడండి  అంటూ  ఆడిపోసుకున్నారు .   ఏవేం పట్టుకు పోయిందీ అని ఆరాలకి దిగారు .

ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది …పాపం ! పూచికపుల్లకూడా పట్టుకెళలేదు అని మేం చెపుతుంటే వినరే . అలా ఎలా జరుగుతుందీ  ఏ చెంబో గిన్నో అయినా ఎత్తేసుంటుంది సరిగా చూసుకోండి అంటూ  మాకు ఊపిరాడకుండా చేసేస్తుంటే , విసిగిపోయిన మేం ” ఏమో బాబూ  ఇక్కడయితే ఏం పోలేదు . అక్కడినుంచేవయినా కొల్లగొట్టుకుపోయిందేమో ఆరా తీయండి  “ అంటూ  మల్లెపందిరి  కింద చతికిలపడి విచారవదనంతో  గాల్లో దణ్ణాలు పెడుతున్న అబ్బులు మీదికి తోలేసాం . వాడ్ని పట్టుకుని  కావల్సిన కథలేవో వాళ్ళే దులుపుకుంటారని .

తలుపులమ్మ తలపుల్లోంచీ అబ్బులు తొందరగానే బయటపడ్డా “  ఆ కొంపలో గాలడతాలేదు ” అని  ఆ అడవిమల్లి అనేసి పోయిన మాటని మాత్రం అత్తగారు మర్చిపోలేక పోతున్నారు .

“ అంత మాటందా ! మరీ విడ్డూరం కాకపొతే . ఇవే కొంపల్లో మనం తరాల తరబడి బ్రతికేయడంలేదూ”  అన్నారు   అమాయకంగా .

“ దట్టమయిన అడవుల్లో మొలిచే కొన్ని మొక్కలు ఎండని వెతుక్కుంటూ పెరుగుతూ పోతాయట .  మరికొన్ని   మొక్కలకి ఆట్టే గాలీ వెలుతురూ అక్కరలేదట . వాటిని ఇళ్ళలో ఉంచేసినా  కిటికీలోంచి పడే చిన్నపాటి ఎండతోనే అవి చక్కగా జీవించడానికి అలవాటు పడిపోతాయట   . వాటినే ఇండోర్ ప్లాంట్స్ అంటారట”  . అని నేను అన్నదాతలో వచ్చిన వ్యాసాన్ని పైకి చదివి వినిపించబోతే , నే అడిగేదానికీ నువ్వు చెప్పేదానికీ ఏవన్నా సంబంధం వుందా  …” అయ్యోరాత  ! ఇంత  అయోమయం ఏవిటే !” అని విసుక్కుంటున్న అత్తగారికి విడమర్చి చెప్పటం నావల్లకాదు బాబు .

–దాట్ల లలిత

మీ మాటలు

  1. ఏమని రాయాలో తెలీట్లేదండి సిన్నయ్యగోరూ… ఇది మాత్రం బాగా మనసుని తాకింది..!!

    • లలిత says:

      హుమ్మ్..! ఒక గట్టి నిట్టూర్పు విడిచేయండి తృష్ణ గారు . మనసు తేలికయిపోతుంది

  2. కథ చదివించే మెట్టు దాటి, కథ ‘చెప్పే..’ మెట్టేక్కేసారండీ లలిత గారూ.. బెమ్మాండమసలు!! :)

  3. మమ్మల్నలా రామిండ్రి చుట్టుపక్కలే తిప్పుకోవడం ఏమన్నా భావ్యంగా ఉందా మీకు..

    • లలిత says:

      జ్యోతిర్మయి గారు :)
      ఏవండీ మీకు గోదారి గాలి పడదా ?

  4. చాలా బాగుందండీ కథ!

  5. లలిత గారూ,
    కథ చాలా బాగుంది. అడవి మొగ్గలను ఎవరో వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు – వాటికి బాగా తెలుసు ఎలా ఎదగాలో అనే సందేశం కథలో అంతర్లీనం గా ఉండటం వాళ్ళ కథ మనసుకి హత్తుకుంది. అభినందనలు.

    • లలిత says:

      రాధ గారు ,
      ఏమోబాబూ …నాకు తెలిసింది చెప్పేసాను. ఆ సందేశాలు అవీ ఏంటో మరి నాకు తెలీదు

  6. Sailaja Chandu says:

    దాట్ల లలిత గారు, ఏ నెల కానెల, అన్నింటికన్నాఈ కథే బాగుంది అనుకుంటాను. ఈ నెల అయితే మరీ మరీ అనుకున్నాను.

    • లలిత says:

      చందు శైలజ గారు , అలా మీలో మీరే అనేసుకుంటే మాకెలా తెలుస్తుందీ. ఇలా ఒక ముక్క ఎప్పుడయినా అంటేనేకదా తెలిసేది. మీ అమూల్యమయిన వ్యాఖ్యకు మా హృదయపూర్వక ధన్యవాదాలు :)

  7. “ ఆ కొంపలో గాలడతాలేదు ” అని ఆ అడవిమల్లి అనేసి పోయిన మాట… దట్టమయిన అడవుల్లో మొలిచే కొన్ని మొక్కలు ఎండని వెతుక్కుంటూ పెరుగుతూ పోతాయట . మరికొన్ని మొక్కలకి ఆట్టే గాలీ వెలుతురూ అక్కరలేదట…
    హ్మ్మ్..నిజంకదా…

  8. లలిత గారు చాలా బాగుంది . అద్బుతం !!

  9. లలిత గారు – wonderful story, as everything you write! This story reminded me of “Alyosha Gorshok” by Tolstoy. Like all your stories, this story, though evoking plenty of humor, is not that far away from showing the poignant state of the characters (sorry for English writing, still struggling to regain my Telugu writing skills).

    Raj

    • లలిత says:

      థాంక్స్ రాజ్ గారు .
      నేను రాసే విధానం మీకు నచ్చినందుకు .నా కథని మీరు మెచ్చినందుకు : )

  10. అబ్బులు గారూ బహు”పరాకు”

  11. లలిత గారు ఎంతో సహజంగా ఆకాశంలో కూడా ఆడ్డుగోడలుండగలవని చూపించారు.
    అలరాసపుట్టిల్లు కధ లోని హీరోయిన్ తరువాత నాకు అంత బాగా నచ్చిన హీరోయిన్ మీ కధలోని తలుపులే.
    కధ చక్కగా ఉంది. టైటిల్ మరింత అమోఘంగా ఉంది.

    అభినందనలతో,
    నారాయణ గరిమెళ్ళ.

  12. లలిత says:

    ధన్యవాదాలు నారాయణ గారు

  13. సత్యభామ says:

    మనసుని పట్టి ఊపిందీ కథ… బావుంది లలిత గారూ. ఒక పక్క నవ్విస్తూనే ఇంకో పక్క ఇంత చెమరించే కథని ఎంత అలవోకగా రాసేసారు !!!

  14. లలిత గారు మీ కధ చదవడం ఇదే మొదటిసారి. మీరు రాసిన మిగిలిన కధలు వెతికి చదవాలనుంది. పిట్ట మనసులో ఏముందో కధ చాలా బాగుంది. కధ చెప్పిన పద్దతి ,యాస, అందులో ఇమిడి ఉన్న హాస్యం, వాఖ్యాల వెనుక దాగి ఉన్న అర్ధం మనసుకు హత్తుకునేటట్టు ఉన్నాయి.

  15. లలితా గారు , మీ కథలు చదవడం ఇదే మొదలు , అసలు ఇవి ఇన్నాళ్ళు ఎలా చదవకుండా ఉన్నానా అని ఆశ్చర్యంగా ఉంది . గోదారంతా ఓసారి తిరిగినట్టు అనిపించింది . చివర కొసరు బాగుంది .

  16. లలిత గారు, ఎక్కడకి వెళ్ళిపోయారు? మీకోసం పోయిన నెల అంతా ఎదురు చూసి అలసి పోయాము. మీరు మరో చోట చెప్పినట్లు వ్రాయటం మానేసారా?

  17. G.S.Lakshmi says:

    కథ బాగుందని చెప్పడం చాలా చిన్నమాటే అవుతుంది లలితగారూ..

  18. భవాని says:

    కథ ఎంత బాగుందో !!

  19. మళ్ళీ మళ్ళీ సూపర్

  20. కె.కె. రామయ్య says:

    సిన్నయ్యగోరండీ, ఎక్కడకెళ్ళి పోయారు? మీకోసం అంతా ఎదురు చూసి చూసి అలసి పోతున్నారు.

    సారంగలో వచ్చిన మీ ‘ఈదేసిన గోదారి’ కధలన్నీ ప్రింటు తీసి త్రిపుర గారికాప్త మిత్రులు, సాహితీ సత్యహరిశ్చంద్రులు, సత్తెకాలపు శ్రీ రామడుగు రాధాకృష్ణమూర్తి గారికి అంపిస్తే చదివి తన మనస్సు రాజమంద్రం అయిపోయిందని చెప్పారు. చదివి రెండురోజులు ఆనందంలో మునిగితేలాననీ అన్నారు. ఇంతటి ప్రతిభ చూపిన రచయిత్రి దివాణం కధలు రాసిన దాట్ల నారాయణమూర్తిరాజు గారికేవవుతారో అని ఉహూ యిదయ్యారు.

    “దాట్ల లలిత గారు ప్యూర్ హ్యూమర్ రాయగల చాలా మంచి రచయిత్రి. పతంజలి మిస్ చేసిన రాజుల లోగిళ్ళలోని స్త్రీల జీవితాలను ఆమె బాగా పట్టుకుంటున్నారు. స్త్రీలు అట్లా రాస్తుంటే గర్వంగా ఉంటుంది” అని జాజిమల్లి డా. మల్లీశ్వరి గారు కూడా అన్నారు.

    డిసెంబర్లో అమిరికా నుండి ఆంధ్రా కొచ్చే వాళ్లకి ‘ఈదేసిన గోదారి’ పుస్తకాలు అందుబాటు చెయ్యకపోతే మాటొచ్చుదేవో ఓ మారు ఆలోసించండి మరి.

    ~ ఇట్లు మీ అబ్బులుగాడు లాంటి కె.కె. రామయ్య

  21. ఇంద్రకంటి వేంకటేశ్వర్లు says:

    మిత్రులు శ్రీ రామయ్య గారికి, మీకు చాలా ఋణపడివుంటాను. ఆ అమ్మాయి శ్రీమతి దాట్ల లలిత గారి “ఈదేసిన గోదావరి” మొత్తం (9 మార్చ్ 2013 నుంచి డిశంబర్ 2013 దాకా),ఈరొజే ప్రారంభించి, పూర్తిచేశాను. నాకవెంతనచ్చాయో చెప్పటానికి ఇంకేమి దృష్టాంతం కావాలి. అంతమంది అభిప్రాయాలు చూశాక, ఇక నేను అంతకంటే ఎక్కువ చెప్పేదేముంది.
    ఆ అమ్మాయిలో అద్భుతమైన టాలెంట్ వుంది. ఏదో ఒక మేధోజనితమైన కల్పనకు అక్షరరూపం ఇవ్వటం తేలిక. కానీ, స్వీయానుభవాలను అక్షరంగా మార్చటం, అదీ సర్వజనమోదకంగా, పఠనీయంగా–చాలా నైపుణ్యం కావాలి. పైగా హాస్యానికీ-కరుణరసానికీ నిజంగా అత్తాకోడళ్ళ లాంటి ఒద్దిక. దాన్ని అంత సులభంగా సాధించారు వారు. “మహరాజు-యువరాజు” లాంటికథల్లో ముళ్ళపూడి, “చెకిముకినిప్పు” లాంటికథల్లో బీనాదేవి గారు ఆ ప్రతిభచూపారు. అందరూ వీరిని భానుమతిగారితో పోలుస్తున్నారుగానీ, నేను ఏకీభవించను. భానుమతిగారివి అనుభవాలు కాదు, అయినా హాస్యాన్ని బాగా పండించినమాట వాస్తవం. లలితగారివి అలాకాదు, పాథకునిక్కూడా తమ అనుభవాలే అన్న భావన కలిగిస్తాయి. భానుమతిగారి కంటే ఎక్కువజీవం ఉంది లలితగారి రచనలో. మరొక్క ముఖ్యాంశం, కొంతమంది రచయితల మాండలీకం కృతకంగా, అర్థంకాకుండా,ఎబ్బెట్టుగా ఉంటుంది, లలితగారిది పూర్తి గోదావరిమాండలీకం ఐనా ఎక్కాడా విసుగనిపించలేదు.
    మీకు లలితగారితో వ్యక్తిగత పరిచయం ఉంటే నా ప్రశంసలు తెలియచేయండి.

    నిజంగానే మీకు, మిమ్ముల్ను ప్రోత్సహించిన(నాకు పంపటం గురించి) ఆ అదృశ్యశక్తికీ వేనవేల థాంక్స్.

    ~ ఇంద్రకంటి వేంకటేశ్వర్లు, కర్నూలు

  22. కె.కె. రామయ్య says:

    “ఆకాశంలో అడ్డు గోడలుండవు” అన్న రామిండ్రి సిన్నయ్యగోరండీ! డిసెంబర్లో అమిరికా నుండి ఆంధ్రా కొచ్చే వాళ్లకి ‘ఈదేసిన గోదారి’ పుస్తకాలు అందుబాటు చెయ్యలేకపోయావండి. హైదరాబాదు బుక్కేజిబిషన్ కు కూడా అన్దించలేకపొయ్యామండి. ఇది నాకు సానా సిన్నతనంగా ఉన్నాదండి.

    మద్రాసులో ఉంటూ తెలుగు భాషని తమ శక్తిమేరకు ఉన్నత శిఖరాలధిరోహించడానికి సేవ చేసిన వారిలో ఒకరుగా పేరొందిన శ్రీమతి సరోజిని ప్రేంచంద్ గారు ( వారి శ్రీవారు ప్రేంచంద్ గారు ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారి ఇలాకా అనుకుంటానండి ), జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేశన్, మద్రాసు తరపున JK రచనల తెలుగులు అనువాదాలు తెస్తున్న శ్రీమతి సరోజిని ప్రేంచంద్ గారు ‘ఈదేసిన గోదారి’ కధల ప్రింటు కాపీని చదివి ఎంతో సంతోషించారండి. ప్రస్తుతం కొద్దిరోజులుగా హైదరాబాదులో ఉంటున్న వారు తమ ఇరుగుపొరుగు వారైన భీమవరం వాస్తవ్యులకు కూడా మన బుక్కు చూపెట్టి వారందరి మనసులూ ‘రాజమంద్రం’ చేసేసేరంటండి ( ఆ బీమోరమ్ ఇరుగుపొరు వాళ్లకి సారంగ అఫ్సర్ గారు బాగా ఎరికేనంటండి ).

    రిషీ వ్యాలీ జె కె స్కూల్ శ్రీ పిడూరి రాజశేఖర్ గారు ( రచయిత్రి రాధ మండువ గారి ఇలాకా ), కర్నూలులోని సాహితీ పెద్దలు శ్రీ ఇంద్రకంటి వేంకటేశ్వర్లు గార్ల వల్ల నాకు సరోజిని ప్రేంచంద్ గారి ఊసుతెలిసొచ్చిన్దండి. ( ఇట్టాంటి దాన్నే నేమ్ డ్రాపింగ్ అంటారంటండి ).

    ఎండని వెతుక్కుంటూ పెరుగుతూ పోయే కొన్ని జనారణ్య మొక్క లాంటోళ్లమ్ మా పై శీతకన్ను వెయ్యడం ఏవీ బాగానేదండి.

    ~ ఇట్లు మీ అబ్బులుగాడు లాంటి కె.కె. రామయ్య

Leave a Reply to లలిత Cancel reply

*