సినిమాలు : మైలురాళ్ళూ, తంగేడు పూలూ!

వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి


మొదలుపెట్టేముందు నాదొక కన్ఫెషన్.

ఇలాంటి వ్యాసాలు రాయాలనుకోవడమే నాకు సిగ్గుగా ఉంది. ఇవన్నీ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పుకోనివి. బహుశా నేను మారుమూల పల్లెటూరివాడినని అందరికీ తెలిసిపోతుందనేమో ఇవన్నీ ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదేమో. లేదా ఇవన్నీ అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలేమీ కాకపోవడం కూడా కారణం అయ్యుండొచ్చు. అఫ్సర్ గారు సారంగ కి రాయమని అడిగినప్పుడు, ఏమి రాయాలో మీరే చెప్పండి అని అడిగాను. అంటే ఏదడిగితే అది రాసిచ్చేంత ఉద్దండపండితుడునని కాదు. అల్రెడీ సినిమాలకే అంకితమైన వెబ్ సైట్ నడుపుతున్నాను; అక్కడ వందలకొద్దీ రాసి పారేస్తున్నాను కాబట్టి సినిమా గురించి నవతరంగం లో ప్రచురించలేని వ్యాసాలేవైనా సారంగ కి రాస్తే బావుంటుందని నా ఆలోచన. లేదంటే ఒక వైపు నా సొంతదైన నవతరంగం కి అన్యాయం చేసినట్టవుతుందని నా బాధ.

ఆ క్రమంలో పుట్టిన ఐడియానే ఇది. నా సినిమా అనుభవాలు రాయమని సలహా ఇచ్చారు. మొదట్లోనే చెప్పినట్టు ఈ వ్యాసాలు రాయాలంటే బోలెడంత సిగ్గుగా ఉంది. అందుకు ఇంకో కారణం కూడా ఉంది. అల్రెడీ సినిమాల్లో పెద్ద పొడిచేసినట్లు అప్పుడే memoirs, జ్ఞాపకాలు గట్రా అవసరమా అని అంతరాత్మ తీవ్రంగా ఘోషించింది.అంత బాధపడీ రాయడమెందుకులే అనుకున్నాను. కానీ ఈ ఆలోచన పుట్టినప్పటినుంచీ జ్ఞాపకాలు తన్నుకుని బయటకు వస్తున్నాయి. అరే లోలోపల ఇంత దాగుందా అని అప్పుడనిపించింది.

సినిమా చూడ్డమంటే నాకు చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. కానీ సినిమా చూడ్డంతో నేను ఆగిపోను. ఆ సినిమా బావుంటే చాలా సార్లు ఆ సినిమా చూసి అందులోని అంశాలను పరిశీలించడం కూడా నాకు ఇష్టమైన పని. అలా చేస్తూ చేస్తూ ఆ విషయాల గురించి రాయడం కూడా అలవాటయింది. మొదట్లో “మౌత్ షట్” అనే సైట్ లో మొదలుపెట్టి, ఆ తర్వాత “24fps.com” అనే సైట్ మొదలు పెట్టి, కొన్ని రోజులు “ప్యాశన్ ఫర్ సినిమా” లో రాసిన తర్వాత చివరికి నవతరంగం స్థాపించాక సినిమాల గురించి వీలైనప్పుడల్లా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రాస్తునే ఉన్నాను. అయితే చూసిన సినిమాల గురించి కాకుండా అసలు సినిమా చూడడం, సినిమాలు చూస్తూ ఫిల్మ్ మేకింగ్ ప్రక్రియ గురించి అవగాహన పొందడం లాంటి అనుభవాల గురించి, సామాన్య ప్రేక్షకుడిగా రాస్తున్న వ్యాసాలు ఇవి.

అయితే ముందే చెప్పినట్టు నా కన్ఫెషన్ ఏంటంటే… జీవితంలో ఏదో సాధించేశాక తీరుబడిగా కూర్చుని, గడిచిపోయిన జీవితాన్ని నెమరువేసుకుంటూ, దాటిన మైలు రాళ్లను లెక్కపెట్టుకుంటూ, చేసిన తప్పొప్పుల్ని బేరీజు వేసుకుంటూ రాసే ఆటోబయోగ్రఫీ కాదిది. చిన్నప్పుడు ఏ లక్ష్యం లేకుండా మైళ్ల కొలది రోడ్ మీద నడుస్తూ, మైలు రాళ్ల పక్కన ఏపుగా ఎదిగిన తంగేడు పూలు ఏరుకున్నట్టుగా, నా సినిమా వ్యూయింగ్ మరియు ఇతరత్రా జ్ఞాపకాలను నెమరు వేసుకునే వ్యాసాలు ఇవి.

 -వెంకట్ సిద్దారెడ్డి

——————————————————————————————————————————————————————————-

  1. మొట్టమొదటి జ్ఞాపకాలు

రాత్రయింది. ఊరంతా చీకటి. కానీ ఊరు ఊరంతా సందడిగా ఉంది. ఆ రోజు మా ఊర్లో సినిమా ప్రదర్శిస్తున్నారు. బహుశా మా ఊర్లో అదే మొదటి సినిమా ప్రదర్శన అనుకుంటాను. అప్పటికి నా వయసు ఎంతో కూడా నాకు తెలియదు. ఊరిలోని పీర్ల చావిడి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో సినిమా ప్రదర్శన కి ఊరు ఊరంతా తరలి వచ్చింది. నిజానికి ఈ విషయాలేవీ నాకు గుర్తు లేవు. అసలు ఆ రోజు నేను ఎవరితో కలిసి సినిమాకెళ్లానో కూడా నాకు గుర్తు లేదు. చాలా ఏళ్ల తర్వాత మా అమ్మను అడిగితే నా చిన్నప్పుడు ఊరికి జెనరేటర్ తెచ్చి, తెరమీద సినిమా ప్రదర్శించినట్టు చెప్పింది కానీ అమ్మకి ఆ సినిమా పేరేదో గుర్తులేదు. కానీ నాకు బాగా గుర్తుంది. ఆ సినిమా పేరు అగ్గి బరాటా. ఆ రోజు రాత్రి సినిమా కి వెళ్లడం కానీ, తిరిగి రావడం కానీ, సినిమా చూస్తుండగా నేను పొందిన అనుభవం కానీ ఏదీ గుర్తు లేదు.  కానీ ఆ రోజు రాత్రి నేను చూసిన సినిమాలో ఒకే ఒక్క ఇమేజ్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. “ఒక యువతి తెర తీసుకుని బయటకు వస్తుంది. బయటకు రాగానే పిచ్చి పట్టిన దానిలా వేప రెమ్మలు చేతిలో పట్టుకుని గంతులేస్తుంది,” ఇదే నాకు గుర్తున్న ఇమేజ్.’

aggibarata

చాలా ఏళ్ల వరకూ నాకు సినిమా అంటే ఇదే ఇమేజ్ గుర్తుకొచ్చేది. అప్పట్లో అంటే కుదర్లేదు కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక చాలా సార్లు, అగ్గి బరాటా సినిమా చూసి అసలిలాంటి సీన్ ఇందులో ఉందో లేదో తేల్చుకోవాలనుకున్నాను. కానీ ఎందుకో మనసు ఒప్పేది కాదు. నా జ్ఞాపకం అబద్ధం అవుతుందేమోనని భయం అయివుంటుంది. కానీ ఈ వ్యాసం రాయడానికి పూనుకున్నాక ఆ పని చెయ్యక తప్పలేదు. అగ్గి బరాట సినిమా చూశాను. నా జ్ఞాపకం నిజమే. కానీ నాకు గుర్తున్న దానికంటే కొంత వ్యత్యాసం ఉందా సన్నివేశంలో. నిజానికి ఆ దృశ్యాలు “మల్లెలమ్మా…మల్లెలో” అనే పాటలో వచ్చే కొన్ని దృశ్యాలు. అందులో నాకు గుర్తున్నట్టుగానే హీరోయిన్ రాజశ్రీ ఒక గుడారం లోనుంచి బయటకు వస్తూ తెర తొలిగించుకుని వస్తుంది. కాకపోతే వేపాకులతో గంతులు వేసేది మాత్రం ఆమె కాదు; మారువేషం లో ఉన్న ఎన్టీయార్.

ఇదీ నా మొదటి సినిమా జ్ఞాపకం.

*****

అలా జ్ఞాపకాల త్రోవలో వెళ్తూ వుంటే నాకు గుర్తుకొచ్చే రెండవ జ్ఞాపకం, కొండవీటి సింహం సినిమా గురించి.

మా అమ్మమ్మ వాళ్ల ఊర్లో మూడు థియేటర్లు ఉండేవి. రామకృష్ణ, శ్రీనివాస, వెంకటేశ్వర. ఈ సినిమా రామకృష్ణ లో చూసినట్టు బాగా గుర్తు.

అగ్గిబరాటా లాగే కొండవీటి సింహం గురించి కూడా నా జ్ఞాపకాలు అన్నీ లీలగానే గుర్తుకొస్తాయి. ఎవరితో నేను ఆ సినిమాకెళ్లానో తెలియదు. కానీ నాకు బాగా గుర్తున్న విషయం మాత్రం థియేటర్ బయట నేను నిల్చుని ఉన్నాను. థియేటర్ చుట్టూ కొండవీటి సింహం పోస్టర్స్ వరుసగా పేర్చి ఉన్నాయి. అక్కడ్నుంచి ఎప్పుడు థియేటర్ లోపలకి వెళ్లానో, అప్పుడు నా వయసెంతో ఏమీ గుర్తు లేవు. కానీ థియేటర్లో కూర్చుని, సత్యనారాయణ, ఎన్టీయార్ లు ఒక పడవలో ఫైట్ చేస్తుండగా నేను ఉత్కంఠగా చూస్తుండడం మాత్రం గుర్తుంది. ఆ తర్వాత చాలా సార్లు అసలా సినిమాలో ఆ ఫైట్ ఉందా లేదా అని నివృత్తి చేసుకుందామనుకున్నాను. కానీ అలాంటి ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో సినిమా అంతా ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూస్తుంటే సినిమా చివరిదాకా ఎక్కడా అలాంటి ఫైట్ లేకపోవడంతో కొంచెం నిరాశపడుతుండగా, సినిమాలోని ఆఖరు మూడో నిమిషంలో వచ్చిన పడవ ఫైట్ దృశ్యాలు చూసి ఆనందపడ్డాను.

 

*****

మొదటి రెండు జ్ఞాపకాల్లో కేవలం నేను మాత్రమే ఉన్నాను. కానీ ఈ మూడో దాంట్లో మా బాబాయి ఉన్నాడు; అతని మిత్రులు కూడా ఉన్నారు. అప్పట్లో మా ఊరికి అర్టీసి బస్సులు వచ్చేవి కావు. ఒక ప్రైవేట్ బస్ మాత్రం మూడు సార్లు వచ్చేది. రాత్రి ఎనిమిదింటికి వచ్చిన బస్ రాత్రికి ఊర్లోనే ఉండి, వేకువ జామునే బయల్దేరేది. “నైట్ హాల్ట్” బస్ అనే వాళ్లం అప్పుడు. అయితే రాత్రి ఎనిమిదింటి నుంచి ఖాళీగా ఉన్న బస్ ని ఊర్లోని కుర్రాళ్ళు బుక్ చేసుకుని టౌన్ కి వెళ్లి సెకండ్ షో చూసి వచ్చేవాళ్ళు. అలా నేను కూడా మా బాబాయి వాళ్లతో వెళ్లి చూసిన సినిమా రంగూన్ రౌడి.

 

అసలు బస్ ఎక్కినదీ గుర్తు లేదు. టౌన్ కి వెళ్లింది అసలే గుర్తు లేదు. ఈ సినిమా గురించి అంతంత మాత్రమే గుర్తున్న కొన్ని విషయాలు ఏంటంటే, సినిమాలో చిన్న పిల్ల బర్ట్ డే పార్టీలో పాడే “ఓ జాబిలీ” పాట, ఇంటర్వెల్ లో తిన్న సమోసాలు. బహుశా నేను సమోసా తినడం అదే మొదటి సారి అనుకుంటాను. ఆ రోజు తిన్న సమోసా రుచి, క్యాంటీన్ లోనుంచి గుబాళించిన ఉల్లిపాయల వాసన, రాత్రి తిరిగి బస్ లో వస్తుంటే అందరూ కలిసికట్టుగా పాడిన “ఓ జాబిలీ” పాట… ఇవీ రంగూన్ రౌడీ జ్ఞాపకాలు.

jayaprada

*****

బహుశా ఇవన్నీ నేను చాలా చిన్నప్పుడు చూసిన సినిమా జ్ఞాపకాలు అయ్యుండాలి. ఈ మూడు సినిమాల కథలు, నటీనటులు ఎవరూ గుర్తులేకుండా చూసినవి. ఆ తర్వాత కాలంలో ఈ సినిమాల గురించి చాలా వివరాలు తెలిసినప్పటికీ నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చేవి మాత్రం ఈ విషయాలే!

మీ మాటలు

  1. నాకూ మీ లాగే కొన్ని జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. “చూసుకో పదిలంగా…హృదయాన్ని అద్దంలా” పాటలా… (మా అమ్మమ్మతో నేలక్లాసులో చూసిన ‘అనురాగదేవత’ నుంచి) …ఆ కొన్ని క్షణాలు ఎప్పటికీ సజీవంగా అలా ఉండిపోతాయంతే. మీ ప్రతి అనుభూతిలోకి ప్రయాణం చేసాను. Keep writing..I am enjoying it to the fullest.

  2. కార్తీక్ రామ్ says:

    వెంకట్ సిద్దారెడ్డి కి నేను ఏకలవ్య శిష్యుడి లాంటివాడిని. ఫేస్బుక్ లో పరిచయం ఐన తన నవతరంగం సినిమా వెబ్ చదివేవాడిని., ఆ తరువాత నమస్తే తెలంగాణా లో ఆదివారం అనుబందం లో మంచి సినిమా (ఎకువగా విదేశీ చిత్రాలు ) ల గురించి సన్నివేశం అనే ఆర్టికల్ ను చదివేవాడిని. ఒక సినిమా ప్రియుడుగా (వాడుక లో సినిమా పిచ్చోడు ) నాకు ఇంగ్లీష్ సినిమా లే కాదు జపనీస్ కొరియన్ ఫ్రెంచ్ జర్మన్ ఇలా చెప్తే ప్రపంచ సినిమా లోని ఆణిముత్యాలను , సిద్దారెడ్డి పరిచయం చేసాడు. అవన్నీ కూడా సినిమా లు చూసే వాళ్లకు మాత్రమే కాక సినిమా ను ప్రేమించే వారికోసం రాసే విధంగా వుంటాయి. కాని ఇప్పుడు సారంగ లో ఈ వెంకట్ రాస్తున్న రంగురంగుల కలలు” ప్రతి ఒక్కరి జీవితం తో సరిపోయే జ్ఞాపకాలు.

  3. “చిన్నప్పుడు ఏ లక్ష్యం లేకుండా మైళ్ల కొలది రోడ్ మీద నడుస్తూ, మైలు రాళ్ల పక్కన ఏపుగా ఎదిగిన తంగేడు పూలు ఏరుకున్నట్టుగా… ” అని మొదలు పెట్టిన ఈ ప్రయాణం ఎన్నటికీ ఆగొద్దని ఆశిస్తున్న ఒక పాఠకుడు

మీ మాటలు

*