వాన రాత్రిలో…చీకటి దారిలో…మిగిలిపోయిన పాట…మన్నాడే!

Mannadey

 

మన్నా డే, తొంభై నాలుగేళ్ల పాటు ఒక పరిపూర్ణమైన జీవన యాత్రను కొనసాగించి ఇహలోకాన్ని వదలి వెళ్లి ఒక నెల  పైనే కావస్తోంది. “నాస్తి ఏషాం యశః కాయే, జరామరణజం భయం”, అన్న భర్త్రుహరి సుభాషితం, ఆయన నిష్క్రమణ వార్త వినంగానే, ఒక్క సారి కళ్ళ ముందు మెదిలింది.  భువనచంద్ర గారు ఆయనకి అశ్రునివాళిని ఈ పత్రికలోనే తమ వ్యాసంలో కొద్ది వారాల క్రిత్రమే ఎంతో హృద్యంగా అర్పించారు. దాదాపు అరవై ఏళ్ళ పాటు జరిగిన ఆయన  సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాల వాళ్ళు వివిధ దశల్లో ఆయనతో పాటు చేరి ఆ గంగలో అలా పరవశంతో తేలుతూనే ఉన్నారు. నాకు తెలిసిన నా మన్నాడే ని మీతో పంచుకొని ఆయన జీవితాన్నీ, సంగీతాన్నీ కూడా సెలబ్రేట్ చేసుకొందామనే ఈ చిన్ని సాహసం!

ఊహ తెలిసిన దగ్గరనుంచీ కిషోర్ పాటలంటే ప్రాణం. భాష తెలియని రోజుల్లో కూడా హిందీ పాటలను వినాలనిపించేలా చేసిన ఆయన గళమే నాకు మన్నాడేని పరిచయం చేసింది. “షోలే” సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్లు ఒక వింత స్కూటర్ మీద వెళ్తూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ, “యే…దోస్తీ.. హమ్ నహీ తోడేంగే.. తోడేంగే దం మగర్ తేరా సాథ్ నా ఛోడేంగే” అంటూ వాళ్ళ స్నేహాన్ని మనకు పరిచయం చేస్తారు. హుషారైన కిషోర్ గొంతుతో ధర్మేంద్ర పాడుతూ ఉంటే, అంతే ఉత్సాహంతో అమితాబ్ కి పాడిన ఈ పాట ద్వారానే మన్నాడే పేరు, నాకు తెలిసింది.

మళ్ళీ అమితాబ్ సినిమా జంజీర్ వల్లే, మన్నాడే పాటతో పరిచయం మరికొంత పెరిగింది. అందులో అమితాబ్ పిచ్చ సీరియస్ గా మొహం పెట్టుకొని కూర్చొని ఉంటాడు. పఠాన్ ప్రాణ్, “తేరీ హసీ కీ కీమత్ క్యా హై? యే..బతాదే తూ” అంటూ ప్రశ్నిస్తూ, అమితాబ్ ని నవ్వించటానికి ప్రయత్నం చేస్తూ, “యారీ హై…ఈమాన్ మేరా..యార్ మేరీ జిందగీ” అని పాట పాడతాడు. కొద్దిగా హై పిచ్ లో ఉంటుంది ఆ పాట. అయినా కానీ, మెలోడీ, ఆ గొంతు లోని తియ్యదనం,  ఏ మాత్రం తగ్గకుండా పాడిన మన్నాడే గాత్ర మాధుర్యాన్ని, అతని అద్భుతమైన కళనీ గుర్తించే వయసు కాదది. ఆ పాట అమితాబ్ కోసం పాడిన ప్రాణ్ పాట, అంతే!

రిషీ కపూర్, డింపుల్ కపాడియాల, రోమియో, జూలియాట్ల కథ, రాజ్ కపూర్ “బాబీ” సినిమా. రిషీ, అందులో తన కాబోయే మామగారిని (జాక్ బ్రిగాంజా – ప్రేమ్ నాథ్), తమ ఇంటికి ఆహ్వానించటానికి వచ్చినప్పుడు, ఆత్మాభిమానమే తప్ప మరో ధనం లేని, జాక్, చేతిలో విస్కీ బాటిల్ తో, గోవన్ డాన్సర్ల నేపథ్యంలో, “నా చాహు సోనా చాందీ..నా చాహు హీరా మోతీ…యే మేరే కిస్ కామ్ కే?” అంటూ పాటందుకుంటాడు. అదీ, రిషీ పాట, జాక్ బ్రిగాంజా పాట, లేదా రాజ్ కపూర్ పాట, తెర వెనుక గాత్రం మన్నాడేది.

మరింత ఊహ తెలిసిన తరవాత చూసిన సినిమా “పడోసన్”. కిషోర్ కుమార్ పిచ్చి పీక్స్ లో ఉన్నది కూడా ఆ సమయంలోనే. శాస్త్రీయ సంగీత నేపథ్యం లేకుండా, జన్మతః అబ్బిన ఒక అద్భుతమైన టాలెంట్ గల సింగర్ గా, తన నిజజీవితానికి అతిదగ్గరగా ఉండే పాత్రను, కిషోర్ దా, ఈ సినిమాలో పోషిస్తాడు. “పక్కింటి అమ్మాయి”ని పడవేసే ప్రయత్నంలో సునీల్ దత్ ఉంటే, ఆ అమ్మాయిని తన శాస్తీయ సంగీత విద్వత్తుతో బుట్టలో వేసేసుకుందామనే ఒక తమిళ కమీడియన్ పాత్ర మెహమూద్ ది. సునీల్ దత్ కి పాట రాక పోయినా, కిషోర్ ప్లేబ్యాక్ వాయిస్ తో (లిటరల్ గా), మెహమూద్ తో పోటీకి దిగుతాడు. “ఎక్ చతుర్ నార్ కర్ కే సింగార్” అంటూ సుశాస్తీయంగా మెహమూద్ పాటందుకుంటే, “ఎక్ చతుర్ నార్ బడి హోషియార్” అంటూ కిషోర్ కొంటెగా సమాధానం ఇస్తూ, స్వరాల్ని ఎడా పెదా మార్చేస్తూ, ఆ పాట పోటీలో నెగ్గుతాడు. ఆ పోటీ లో ఓడిన గళం  మన్నాడే దే. ఆ సమయంలో కిషోర్ గెలిచినందుకు ఎంత సంబరపడిపోయానో! అదే పాటని కాలేజి సమయంలో పాడటానికి ప్రయత్నించినప్పుడు తెలిసొచ్చింది, మన్నాడే పాడింది ఎంత కష్టతరమో! ఇప్పటికి కూడా ఆ పాట వినంగానే గుర్తుకొచ్చేది, కిషోర్, మెహమూద్ లే! ఈ సన్నివేశం మొత్తం ఈ క్రింది లింకులో చూడండి, మొత్తం సినిమా చూసేసినట్లే!

మన్నాడే పాటలని చెప్పి, ఆయన్ని వదిలేసి, ఆ సినిమాల గురించీ, సినిమాలో పాటానుసారం పెదాలాడించిన నటుల గురించే ఎక్కువ మాట్లాడేశాను కదా! ఒక “సినీ ప్లే బ్యాక్” సింగర్ అంటే, అసలు సిసలు నిర్వచనం అదేనెమో! ఒక పాట విన్నప్పుడల్లా, అది పాడిన వారు కనుమరుగైపోయి, తెర మీద కనిపించిన వారే కళ్ళెదుట మెదిలితే, అది నిస్సందేహంగా ఆ గాయకుడి ప్రజ్ఞే! తన గొంతుని, తెర పైన కనపడే పాత్ర భావావేశ ప్రకటన చేసే పాటకి  పూర్తిగా అంకితం చేసేసి, తాను కనుమరుగైపోవటం ఒక అత్యుత్తమ స్థాయికి చేరుకొన్న కళకు చిహ్నమేమో కూడా!

నిజానికి, రఫీ, కిషోర్, ముఖేష్, లతా, ఆషా లాంటి మహామహులందరి కంటే వయస్సులో, అనుభవంలో కూడా పెద్దవాడు, మన్నాడే. అందరి కంటే ముందర రంగప్రవేశం చేశారు కూడా. కానీ వాళ్ళ పాటలన్నీ వాళ్ళ పాటల్లానే ఈనాటికీ గుర్తింపబడితే, మన్నాడే పాటల్లో మాత్రం ఆయన “స్టాంపు” వెయ్యకుండా, తన గాత్రాన్ని ఒదిగించటం వల్ల, అవి ఆ సినిమా పాటలు గానో లేక ఆ నటుల పాటలు గానో మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం ఉండి పోయాయి.

1919లో కలకత్తా లో జన్మించిన మన్నాడే, 1942 లో బొంబాయి వచ్చి, “తమన్నా” అనే చిత్రం ద్వారా తన సినీసంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.  2012 వరకూ ఆయన పాడుతూనే ఉన్నారు. అంటే గత డెభ్భై సంవత్సరాలుగా మనకు సినిమా సంగీతంలో తెలిసిన (తెలియని) దాదాపు అందరితోనూ పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. హిందీ లోనే కాకుండా, తన మాతృభాష బెంగాలీలో, భోజపురీ, అస్సామీ, పంజాబీ, మరాఠీ, గుజరాతీ,ఒరియా, సింధీ, నేపాలీ భాషలలో నే కాకుండా, మళయాళంలో కూడా పాటలు పాడారు. ఒక్క హిందీలోనే దాదాపు వందకి పైగా సంగీత దర్శకులకు పాడారు. అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. 2007 లో భారతదేశపు అత్యుత్తమ సినీ పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్నారు.

చిన్నప్పుడు హిందుస్తానీ సంగీతం నేర్చుకొని సినిమా పాటలు పాడటం ప్రారంభించినా, తన శాస్త్రీయ సంగీతాభ్యాసం మరి కొంత కాలం కొనసాగిస్తూనే వచ్చారు. మన్నాడే కి శాస్త్రీయ సంగీతం మీద ఉన్న పట్టు వల్లనే నేమో, “బిజు బావ్రా” సినిమాలో భరత్ భూషణ్కి, మొహమ్మద్ రఫీ కొన్ని అద్భుతమైన పాటలు అప్పటికే పాడి ఉన్నప్పటికీ, “బసంత్ బహార్” సినిమాలో ఒక సన్నివేశానికి మాత్రం, శంకర్ జైకిషన్, మన్నాడే నే ఎన్నుకున్నారు. ఆ సన్నివేశానుసారం, “బసంత్” రాగంలో ఒక విద్వాంసుడు పాట పాడుతూ ఉంటే, హీరో వచ్చి, అదే రాగం అందుకొని, ఆ పాటని కొనసాగించి ఆ విద్వాంసుడిని “ఓడించాలి”. ఆ విద్వాంసుడికి గాత్ర దానం చేసింది మరెవరో కాదు, అప్పటికే, హిందుస్తానీ సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజులా శోభిల్లుతున్న పండిత్ భీమసేన్ జోషీ. హీరోకి పాడటానికి మన్నాడే ని తీసుకొన్నారు సంగీత దర్శకులు. నిజానికి, అది ఒక పెద్ద దుస్సాహసమే! ఆ పాట రికార్డింగు పూర్తికాంగానే, మన్నాడే తనంతట తానుగా వెళ్లి పండిత్ జీకి పాదాభివందనం చేశారని ఆయనే తరవాత చెప్పుకొన్నారు. “కేతకీ గులాబ్ జుహీ చంపక్ వన ఫూలే” అన్న ఈ పాట అద్భుతః!

అలాగే దర్బారీ కానడ లో సాగే “ఝనక్ ఝనక్ తోరి బాజే పాయలియాన్..” పాట, “మేరే హుజూర్” సినిమా నుంచి. మన్నాడే, మేలోడీని తన తియ్యని గళంతో ఆ పాటంతా నింపి చిరకాలం నిలచిపోయేలా పాడితే, ఆ దర్శకుడు మాత్రం దాన్ని అతి ఘోరంగా చిత్రీకరించారు. హెడ్ఫోన్స్ తగిలించుకొని ఈ పాటని వింటూ మన్నాడే గాన మకరందాన్ని ఆస్వాదించుకోవచ్చు కానీ, కళ్ళు మాత్రం మూసుకోవలసిందే!

హిందుస్తానీ భైరవి (కర్నాటక తోడి) లో సాగే “లాగా చునరీ మే దాగ్..ఛుపావూ కైసే? ఘర్ జావూ కైసే?”, పాట మాత్రం “మన్నాడే పాట”. రాజ్ కపూర్ మారు వేషం వేసి తెర మీద పాడతాడు కాబట్టి, ఈ ఒక్క సారికీ ఇది ఆయన పాట కాకుండా పోయింది. “దిల్ హీ తో హై” సినిమా లోని ఈ పాట, 2113 లో జరగబోయే పాటల పోటీలలో కూడా ఎవరో ఒకరు పాడి తీరతారు, మనమెవ్వరూ చూడటానికి మిగలక పోయినా!

రాజ్ కపూర్ అనంగానే గబుక్కున గుర్తుకొచ్చే గాయకుడు ముకేష్ అయినా, నా కిష్టమైన ఆయన పాటలు మాత్రం ఎక్కువ మన్నాడే వే. “దిల్ కా హాల్ సునే దిల్ వాలా..సీధీసీ బాత్ నా మిర్చి మసాలా..కేహకే రహేగా కేహనేవాలా”, “ముడ్ ముడ్ కే నా దేఖ్” “శ్రీ 420” పాటలు సతతహరితాలైతే, నా అభిప్రాయంలో “డ్యూయెట్ ఆఫ్ ది సెంచరీ”, “ప్యార్ హువా ఇక్రార్ హువా హై” పాటకి ఇచ్చెయ్యచ్చు. కాదంటారా? ఆ పాట ఇక్కడ చూసెయ్యండి, తరవాత చర్చిద్దాం.

అలాగే “చోరీ చోరీ” నుంచి, “యే రాత్ భీగీ భీగీ….”. అవిచి వి. మెయ్యప్పన్ (ఎ.వి.యమ్), ఆ చిత్ర నిర్మాత. ముకేష్ తప్ప వేరెవ్వరూ పాడటానికి వీల్లేదని పంతం పట్టుకు కూర్చున్నారట. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్లు, ఎలాగొలా ఒప్పించి మన్నాడే చేతే పాడించారు. ఎ.వి.యమ్ గారు, రికార్డింగ్ అవ్వంగానే ఆనందంతో మన్నాడే ని వాటేసుకున్నారని కథనం. “ఆజా సనమ్..మథుర్ చాందినీ మే హమ్”, అదే సినిమాలోని ఇంకొక మర్చిపోలేని యుగళగీతం.

రాజ్ కపూర్ లాంటి హీరోతో పాటుగా, హిందీలో చెప్పుకోదగ్గ అత్యంత శ్రేష్ఠ క్యారెక్టర్ ఆర్టిస్టులైనటువంటి బల్రాజ్ సహానీ, ప్రాణ్ లకి కూడా అజరామరమైనటువంటి పాటలు ఇచ్చారు మన్నాడే. “కాబులీవాలా” లోని “యే..మేరే ప్యారే వతన్, యే మేరె ఉజ్డే చమన్, తుమ్పే దిల్ ఖుర్బాన్” పాటలో “తూహీ మేరీ ఆర్జూ…తుహీ మేరీ ఆబరూ…” అని వేదనతో నిండిన మేలోడిక్ స్వరం విన్నప్పుడు, ఒక సారి రోమాలు నిక్కపోడుచుకుంటాయి. బల్రాజ్ సహానీ కే, “వక్త్” లో పాడిన “ఎ మేరె జోహ్ర జబీన్..” పాట మాత్రం ఎవరు మరువగలరు?

ప్రాణ్ కి పాడిన “యారీ హై…” పాట గురించి పైన చెప్పుకున్నాం. ప్రాణ్ అనంగానే గుర్తుకొచ్చే మరో “హాంటింగ్ మెలాంకొలిక్ మెలోడీ”,  “ఉప్కార్” చిత్రం నుంచి., “కస్మే వాదే ప్యార్ వఫా సబ్ బాతే హై…బాతోం కా క్యా?”.

డెభ్భైల్లోని సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా అనంగానే కిషోర్ కుమార్ గుర్తుకొచ్చేస్తారు. కానీ మన్నాడే కూడా అడపా తడపా రాజేష్ ఖన్నాకి పాడారు. “బావర్చీ” లో శాస్త్రీయంగా సాగే “తుమ్ బిన్ జీవన్ కైసా జీవన్…” చాలా మధురంగా ఉంటుంది.

ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నా కోసం పాడిన “జిందగీ కైసీ యే హాయే పహేలీ హాయే..” పాట లోని లిరిక్స్ ఇలా ఉంటాయి.

“జిన్హోంనే సజాయే యహా మేలే … సుఖ్ దుఖ్ సంగ్ సంగ్ ఝేలే

వోహి చునకర్ ఖామోషీ…యూ చలే జాయే అకేలే కహా?”

మన్నాడే మౌనంగా ఒక్కరే ఏదో లోకాలకి వెళ్లిపోయి ఉండచ్చు, వారి సంగీత సంపద మాత్రం తరతరాలకీ తరగని విధంగా మనకి వదిలేశారు. మరిక బాధేల మిత్రమా?

“దునియా మే ఖుష్ రెహనా హోతో మానో మన్నాడే కీ బాత్”
“ఆవో ట్విస్ట్ కరే… జగ్ ఉఠా మౌసమ్!”

-శివ సోమయాజులు

Siva

 

మీ మాటలు

  1. కొన్ని రోజుల క్రితం మన్ చాహే గీత్ అని ఓ పుస్తకం చదివాను ఖదీర్ బాబు గారిది. ఒక్కో పేజీ తిరగేస్తూ ఎటో వెళ్లిపోయా…వెటనే నాన్నతో చదివించా….మీ పోస్ట్ చూడగానే ముందు అది గుర్తొచ్చింది…చాల బావుంది.మనసులో ఓ ప్రత్యేక స్థానంలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలు అలలై చుట్టేస్తున్నాయి.

మీ మాటలు

*