“ తోటలో నా ‘రాజు” – నిజంగానే, నేనే ?”

వంగూరి “జీవిత” కాలమ్ –  9

1952, డిశంబర్ చలి కాలంలో ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా జ్జాపకం. ఎందుకంటే నా చిన్నప్పుడు అంత గా గోల పెట్టి ఏడ్చిన రోజు మరొకటి లేదు. ఆ రోజు మద్రాసులో పొట్టి శ్రీ రాములు గారు నిరాహార దీక్ష చేస్తూ  మరణించారు. ఆయన ఎవరో, ఎందుకు నిరాహార దీక్ష చేసారో ఆ వయసులో నాకు తెలియదు. నాకు తెలిసినందల్లా ఆ రోజు కాకినాడ అంతా భగ్గుమంది. మా “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు” అర్జంటుగా మూసేసి మమ్మల్ని ఇంటికి పంపించేసారు. అన్ని కాలేజీలూ, దుకాణాలూ మూత పడి మొత్తం నగరం అంతా స్తంభించి పోయింది.  కొన్ని వేల మంది విద్యార్ధులు సైకిళ్ళమీదా, కాలి నడకనా ఊరేగుతూ మా ఇంటి దగ్గర గాంధీ గారి విగ్రహానికి పూల మాల వేసి, పార్కు కేసి నినాదాలు చేస్తూ వెడుతుంటే, అసలు విషయం తెలిసిన మా నాన్న గారూ, మా అన్నయ్యలతో బాటు కుర్ర కుంకలం అందరం కూడా మా గుమ్మం దగ్గర నుంచుని ఆ “ఊరేగింపు” చూస్తున్నాం. ఇంతలో హఠాత్తుగా ఒక కాలేజీ స్టూడెంట్ నాకేసి దూసుకొచ్చి, సరదాగా ఒక టెంకి జెల్ల కొట్టి, చేతిలో ఉన్న పెద్ద బొగ్గు కణికెతో మా గోడ మీద ఒక వేపు  “CR చావాలి” “CR కి ఉరికంబం” అనీ, రెండో వేపు “నెహ్రూ డౌన్, డౌన్” అనీ పెద్ద అక్షరాలతో రాసేసి ఊరేగింపు లో కలిసి పోయాడు. రాబోయే సంక్రాంతి కి మా నాన్న గారికి చాలా ఇష్టమైన గోపీ చందనం రంగుతో అప్పుడే వెల్ల వేసి, ఎంతో అందంగా ఉన్న ఆ గోడ ని మసి పూసి మారేడు కాయ చేసెయ్య గానే వేల సంఖ్యలో ఆవేశంలో ఉన్న ఆ స్ట్యూడెంట్స్ ని ఏమీ అన లేక మా నాన్న గారు, మిగిలిన వారూ నిస్సహాయంగా ఉన్న సమయంలో నేను ఆ గోడ కేసి చూసి భోరు మని ఏడుపు లంకించుకున్నాను. నేను ఎవరు ఎంత చెప్పినా, ఆ గోడ మీద రాతల కేసి చూపిస్తూ ఏడుపు స్థాయి పెంచుతూ ఉండగా ఎవరో “ఎందుకురా అంత ఏడుస్తున్నావు. ఆ మాత్రం చిన్న జెల్ల కాయ కొట్టి నందుకే అనీ” “పరవా లేదు రా మళ్ళీ వెల్ల వేయిస్తాం” అనీ అనగానే “అందుకు కాదు నా ఏడుపు. అసలు నేను ఎందుకు చావాలి? నన్ను ఉరికంబం ఎందుకు ఎక్కించాలి?” అని గగ్గోలు పెట్టాను. అప్పుడు అందరికీ అర్ధం అయింది. “ఓరి వెర్రి వెధవా, అదా సంగతీ. వాళ్ళు ‘చావాలి’ అన్నది CR ..అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి….నిన్ను కాదు. ” అని నాకు చాక్లేట్లు పెట్టి నా ఏడుపు ఆపారు. ఈ చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మా మిత్రులు కొంత మంది నన్ను “CR” అని పిలవడంతోటీ, మద్రాసులో ఉండే ఈ CR ఎవరో నాకు తెలియకా నా ఏడుపుకి కారణం. అదంతా తల్చుకుంటే నాకు అప్పటి ఏడుపు గురించి కాదు కానీ, ఇప్పడు నాకు మరో కారణానికి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం విషయంలో అసలు సమస్యలు పరిష్కరించుకోలేక ఏవేవో , కారాణాలు చెప్పుకుంటూ మళ్ళీ మనం మళ్ళీ వెనక్కి పోతున్నాం.  అన్నట్టు ఆ రాజగోపాలాచారి ప్రసంగం కొన్నేళ్ళ తరువాత కాకినాడలో ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నాను. ఆయనతో మాట్లాడాను కూడా.

ఇక ఆ వీధి గుమ్మం కాక ఆ గోడలోనే మా పొలం నుంచి వచ్చే బళ్ళు లోపలి రావడానికి మరొక పెద్ద రేకుల గుమ్మం, అక్కడే వాయవ్యం మూల మా పాడి పశువులు ఉండే పాక ఉండేది. అక్కడి నుంచీ మా 3600 గజాల స్థలంలో మా చిన్నపుడు ఉండే “తోట విహారం” మొదలు పెడితే వాయవ్యం నుంచి ఈశాన్యం మూల దాకా ఉండే ప్రహారీ గోడని ఆనుకుని నేను ఎప్పుడూ ఎక్కని పెద్ద ములగ చెట్టు, అప్పుడప్పుడు ఎక్కే చిన్న ఉసిరి, పెద్ద ఉసిరి చెట్లూ, జీడిమామిడి, చిన్న మామిడి పళ్ళ చెట్టు, పొడుగ్గా ఉండే యూకలిప్టస్ చెట్లు, తలగడాలలో కూరుకునే పెద్ద పత్తి కాయలు కాసే వంద అడుగులు ఎత్తు ఉండే చెట్లు ఉండేవి. ఏడాది పొడుగునా కింద రాలిపోయే ఈ పత్తి కాయలని పోగేసి ఒక గుట్టగా పడేసే వాళ్ళం.  ఆరు నెలలకో సారి మా దూదేకుల సాయబు వచ్చి, మా ఇంటి వరండాలో దుకాణం పెట్టి వారం రోజుల పాటు నానా కంగాళీ చేసి, పదో, పదిహేనో తలగడాలూ, రొజాయిలు అనే పరుపులూ చేసే వాడు. అతనున్న వారం రోజులు మా ముక్కుల్లోను, చెవుల్లోనూ, నోట్లోనూ, ఇల్లంతానూ. ఆఖరికి ఎంతో మడిగా ఎక్కడో మూలా ఉన్న వంటింట్లో చేసిన అన్ని వంటకాల్లోనూ సిల్కు లా ఉండే ఈ దూది పింజలే! ఇక యూకలిప్టస్ ఆకులు కొయ్యడానికి కష్టపడినా, నలిపి చూస్తే భలేగా ఖరీదైన సెంటు వాసన వచ్చేది. ఇక ఈ ఈశాన్యం మూల ఉండే  ఆకుపచ్చ సంపెంగ చెట్టు మా గాంధీ నగరం అంతటికీ సువాసనలు వెద జల్లేది. ఆ సంపెంగ పువ్వులు, ఆకుల్లో కలిసిపోయి ఎప్పుడైనా మా అక్కా వాళ్ళూ కోసుకోడానికి కంటికి కనపడేవి కావు.  అ సంపెంగ మొక్క ఉంటే పాములు వస్తాయని మేము ఎప్పుడూ చీకటి పడ్డాక అటు వేపు వెళ్ళడానికి హడిలిపోయే వాళ్ళం.  నిజంగానే అక్కడ ఒకటి, రెండు పాము పుట్టలు ఉండేవి. మా పేటలో నాగుల చవితి హడావుడి అంతా అక్కడే. అందరూ ఆ పుట్టలలోనే పాలు పోసే వారు.

తోటలో మా నాన్న గారు

తోటలో మా నాన్న గారు

ఇక ఈశాన్యం మూల నుంచి ఆగ్నేయం వేపు గోడ వారన నడుస్తూ ఉంటే ఓ ఉసిరి చెట్టు, కరివేపాకు మొక్కలూ, పులా మొక్కలు ఉన్నా, అన్నింటి కన్నా ప్రత్యేకమైన ఒక చిన్న, చిన్న పళ్ళు కాసే ఉసిరి చెట్టు లాంటి పెద్ద మొక్క ఉండేది. దాన్ని “పుల్ల, పుల్ల చెట్టు” అనే వాళ్ళం. అసలు పేరు ఎవరికీ తెలియదు. అది చిన్న ఉసిరి కాయల సైజులో పళ్ళు కాసినప్పుడు అవి తింటే విపరీతమైన పుల్లగా ఉండి అస్సలు తినలేక పోయే వాళ్ళం. కానీ అవి పండాక, వయొలెట్ రంగులో కి వచ్చాక అద్భుతమైన తీపి రుచి ఉండేవి. మా దురదృష్టవశాత్తూ, ఇరవై ఏళ్ల క్రితమో ఎప్పుడో, ఏదో తుఫానుకో , మరెందుకో మాయం అయిపోయింది. ఆ తరువాత ఆ మొక్క కోసం మా సుబ్బన్నయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి మొక్కలకి ప్రసిద్ధమైన కడియం గ్రామం లో ఉన్న అన్ని నర్సరీలో కూడా తను వాకబు చేసినా ఆ మొక్క ఏమిటో, ఎక్కడ దొరుకుతుందో ఎవరూ చెప్పలేక పోయారుట.  నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా ఆ మొక్క ఉండే చోటి దగ్గర నుంచుని ‘నివాళులు’ అర్పిస్తూ ఉంటాను.

ఇక మా స్థలం నైరుతి నుంచి ఆగ్నేయం వేపు ఉండే గోడని ఆనుకుని ఒక పెద్ద నేరేడు చెట్టూ, మా డాబా  మీదకి అందేలా పళ్ళు కాచే సీతా ఫలం చెట్టూ ఉండేవి. నాకు తెలియదు కానీ మా పెద్దన్నయ్య, ముఖ్యంగా చిన్నన్నయ్య కోపం వచ్చినా, ఏదైనా కావాల్సి వచ్చినా ఆ నేరేడు చెట్టు పై దాకా ఎక్కేసి దూకేస్తానని బెదిరించే వాడుట. పాపం మా బామ్మ గారు, తాత గారు వెళ్లి రక రకాల “లంచాలు” ఇచ్చి అతన్ని క్రిందకి దింపే వారుట. అప్పటికి నాకు ఐదేళ్ళు కూడా లేక పోయినా మా బామ్మ గారు మా చిన్నన్నయ్యకి ఇచ్చే లంచం పేరు “బంగారం పులుసు”. “ఒరేయ్, ఇవాళ నీ కోసం బంగారం పుసులు చేశాను రా. ఇంకెవరికీ అది పెట్టను. క్రిందకి దిగిరారా” అని ఆవిడ చేసిన గుమ్మడి కాయ పులుసు కి పెట్టిన స్పెషల్ పేరు ఆ బంగారం పులుసు. మా బామ్మ గారు ఎప్పుడూ వంద కాసుల పేరు పెట్టుకునే ఉండే వారు.  అవైనా ఇప్పటి లాగా చిన్న సైజువి కాదు. పూర్వకాలపు పెద్ద సైజు కాసులే!

ఇక మిగిలిన స్థలంలో అన్ని రకాల కూరగాయలు, పాదులూ ఒక ఎత్తయితే బొడ్డు మల్లి తొ సహా డజన్ల కొద్దీ పెద్ద మల్లె పొదలు, ఇంచు మించు అన్ని రంగుల మందారాలు, కనకాంబరాలు, డిశంబర్ పువ్వులు, దర్జాగా ఉండే ఒక పారిజాతం చెట్టు (ఆ పారిజాతానికి ఎప్పుడూ గొంగళీ పురుగులు అంటిపెట్టుకుని ఉండేవి) , ఐదారు నంది వర్ధనాలు, మొగలి రేకుల పొదలు రెండు,  నైట్ క్వీన్లూ, మెట్ట తామరా, రెండు బాదం చెట్లూ, ఒక పెద్ద సపోటా, ఒక చిన్న సపోటా, డజను పైగా కొబ్బరి చెట్లూ, దబ్బ చెట్టూ, రెండు నారింజలూ, నిమ్మ చెట్లూ,  ఒక దానిమ్మా,  నీరు బాగా పారే పెద్ద నూతి దగ్గరా, స్నానాల గదుల దగ్గరా అరటి చెట్లూ, ఒక పెద్ద జామ చెట్టు, ఒక చిన్న చిన్న తీపి కాయలు కాచే జామ చెట్టూ యింకా ఎన్నెన్నో మొక్కలతో మా తోట ఒక “ఆర్గనైజ్డ్ అరణ్యం” లా ఉండేది.

విశేషం ఏమిటంటే మా స్థలానికి సరిగ్గా మధ్యలో రెండు చాలా పొడుగైన తాటి చెట్లు ఉండేవి. ఇవి సాధారణంగా పొలం గట్ల మీదే ఉంటాయి కానీ ఇళ్ళ స్థలాలలో ఉండవు. ప్రతీ రోజూ సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ తాటి చెట్ల మీద వాలి సేద దీర్చుకోడానికి  రెండు రాబందులు వచ్చి వాలేవి. మేము స్కూల్లో “జంతు శాస్త్రం” లో గెద్దలకీ, రాబందులకీ ఉండే తేడాలు చదువుకునే రోజుల్లో వాటిని చూస్తూ మేము చదివిన పుస్తకాలలో ఉండే ముక్కులలా వాటి ముక్కులు సూదిగా, వంకర గా ఉన్నాయా, లేవా అని చూసే వాళ్ళం. ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ ఏమిటంటే ఒక సారి మా నాన్న  గారూ, మేమూ వరండాలో కూచుని ఆ రాబందుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మా చెల్లెలు హఠాత్తుగా “బాబయ్య గారూ, రాబందులు కూడా కాకి రెట్టలు వేస్తాయా?” అడిగింది అమాయకంగా. “లేదమ్మా, రాబందులు రాబందు రెట్టలు వేస్తాయి. కాకి రెట్టలు అవి వెయ్య లేవు” అని మా నాన్న గారు ఒక నవ్వు నవ్వి సమాధానం చెప్పారు.

అన్నట్టు, మా వీధి గుమ్మం పక్కనే ఉన్న బొగడ చెట్టు గురించి చెప్పడం మర్చిపోయాను. మా చిన్న బొగడ పువ్వులూ, పళ్ళు కాసేది. మా చిన్నప్పుడు ఒక సారి ఏమయిందంటే, ఓ రోజు చీకటి పడ్డాక, ఎవరికీ కనపడకుండా నేనూ, ఇంకో ఇద్దరు, ముగ్గురు స్నేహితులూ కలిసి ఆ బొగడ చెట్టు పై దాకా ..అంటే కనీసం యాభై అడుగులు ఎక్కేసి, పండిన బొగడ పళ్ళు కోసేసుకుని బొక్కుతూ ఉంటే, మా నాన్న గారో, మా దొడ్డమ్మో , మరెవరో “ఎవరా అక్కడా?” అని అరిచారు. నేను హడిలి చచ్చి పోయి ధబీమని కిందకి దూకేయ్యగానే,  మిగిలిన వెధవలు కూడా హర్రీ, బుర్రీగా గా దూకేసి, ఇంకెక్కడా చోటులేనట్టు నా మీదే పడ్డారు. ఇంకే ముంది మొత్తం “బొగడ పళ్ళ దొంగలం” అందరం దొరికిపోయాం. “వెధవల్లారా, ఏవో కాస్తో కూస్తో కోసుకుని తినాలి కానే వందల కొద్దీ బొగడ పళ్ళు తింటే కడుపు నొప్పి తో చస్తారు, మమ్మల్ని చంపుతారు” అని మా పెద్దలు చీవాట్లు వేసి, ఏవేవో ద్రవ్యాలు కలిపి తాగించి, మమ్మల్ని బతికించారు.

ఇక మా ఇంటికి ఆగ్నేయం మూల వంటింటికి వెనకాల మరొక మామిడి చెట్టు కూడా ఏకాకి గా ఉండేది. ఈ చెట్టు మా వెనకాల వీధిని ఆనుకుని వేపు ఉండడంతో, అది కాయలు కాసే వేసవి కాలంలో ఆ వీధిలో కుర్ర కుంకలు రాళ్ళు విసిరి మామిడి కాయలు రాల గొట్టి, గోడ దూకేవారు. ప్రతీ ఏడూ ఎన్ని సార్లు వాళ్లకి వార్నింగ్ ఇచ్చినా ఆ కుర్రాళ్లు యింకా రెచ్చి పోయేవారు. ఒక ఏడు అలా ఒక రాయి మా అమ్మకి తగలబోయింది. అసలే కోపిష్టి మనస్తత్వం ఉన్న మా చిన్నన్నయ్య కి ఆవేశం కట్టలు తెంచుకుని వెనకాల గోడ దూకి దొరికిన ఒక కుర్రాణ్ణి నాలుగు వాయించి  వాడి అమ్మకి అన్వయించదగ్గ తిట్లు కూడా తిట్టాడు. దాంతో ఆ వీధిలో వాళ్ళంతా ఏకమై పోయి మా ఇంటి వీధి గుమ్మం వేపు వచ్చి నానా గొడవా చేశారు. పోలీసులని పిలిచే దాకా వచ్చింది ఆ తగాదా. అప్పుడు బాగా తన్నులు తిన్నది ఆ ఇంటి పని వాడు సూన్నారాయణే పాపం!

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

నేనూ, సూన్నారాయణా అక్టోబర్ 2013 లో

సుమారు నలభై ఏళ్ళు మా తోట అంతటినీ మానాన్న గారితో సమానంగా ఎంతో ఆప్యాయంగా చూసుకుని, రోజు నీళ్ళు పెట్టి, ఎరువులు వేసి అన్ని విధాలుగానూ మా కుటుంబానికి అన్ని విధాలుగానూ సేవ చేసిన ఆ సూన్నారాయణ ఎనభై ఏళ్ళు దాటినా రెండు నెలల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు నన్ను చూడడానికి వచ్చి మళ్ళీ నన్ను ఎత్తుకోడానికి ముచ్చట పడ్డాడు కానీ పాపం ఒక కన్ను కనపడకా, నేను తీవ్రంగా వారించబట్టీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. అతణ్ణి తీసుకుని మిత్రుడు చంద్రశేఖర్ నిర్వహించే సంకురాత్రి ఫౌండేషన్ లో కంటికి ఆపరేషన్ చేయించాను. అంతకు ముందే మొదటి కంటికి మా సుబ్బన్నయ్య (డా. సుబ్రహ్మణ్యం) దగ్గరుండి ఆపరేషన్ చేయించాడు.  ఆ సూన్నారాయణ తో తాజాగా మా “ఇలవేల్పు”  మామిడి చెట్టు నీడలో తీయించుకున్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

మా నాన్న గారికి కూరగాయలు పండించడం చాలా ఇష్టం.  ఖాళీ స్థలం ఉన్న వారందరూ వేసుకునే వంగా, బెండ, బీర, గుమ్మడి, ఆనప, పొట్ల మొదలైనవే కాక కాలీ ఫ్లవర్, కేబేజీ లాంటి వి కూడా వేసే వారు. మొక్క జొన్న మొక్కలని మా వీధి గుమ్మం నుంచి ఇంటి దాకా..అంటే సుమారు వంద గజాలు దారికి రెండు వేపులా వేసి పొలంలోనో, బొటానికల్ గార్డెన్ లో నడుతున్న భావన ఇంటికొచ్చిన వాళ్లకి కలిగేలా  చేసే వారు. పైగా మా నాన్న గారికి గార్డెనింగ్ తో బాటు తేనెటీగలని పెంచి తేనె తయారు చెయ్యడం మంచి హాబీగా ఉండేది.  సామర్ల కోట లో ఉన్న అగ్రికల్చరల్ ఫారం నుంచి తేనెటీగలు పెరిగే బీ-హైవ్ తెప్పించుకుని, అందులో “రాణీ తేనెటీగ” ని పెట్టగానీ వందల కొద్దీ ఉన్న ఆ తేనెటీగల కుటుంబం అందులో బస చేసేది. మాకున్న తోటలో అన్ని రకాల పువ్వులూ ఉండేవి కాబట్టి ఆ తేనెటీగలకి పుప్పొడి కోసం వేరే తోటల్లోకి వెళ్ళే అవసరం ఉండేది కాదు. ఆశ్చర్యం ఏమిటంటేమ మా కుర్ర వెధవలం అక్కడే ఆడుకుంటున్నా విశ్వాసం గల ఆ తేనెటీగలు  మాలో ఎవరినీ ఎప్పుడూ కుట్టిన జ్జాపకం లేదు నాకు. మానాన్న గారు మా తోట మధ్యలో నుంచుని మా సూన్నారయణకి ఆదేశాలిస్తున్న ఒక అపురూపమైన ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. మా పెద్దన్నయ్య ఇది రహస్యంగా తీశాడు. ఈ ఫోటో తీస్తున్నట్టు అప్పుడు ఆయనకీ తెలియదు. తెలిసాక “వెధవల్లారా, నేను చొక్కా వేసుకోకుండా, కనీసం బనీను అయినా వేసుకోకుండా ఉన్న ఫోటో తీస్తారా, బుద్ది లేదూ” అని మమ్మల్ని చెడా, మడా తిట్టారు. ఆయన పోయి 30 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఆ ఫోటో పబ్లిక్ గా బయట పెడుతున్నాను.  మా తోటలో అన్ని రకాల మొక్కలు వెయ్యడానికీ, వాటిని మా కుర్ర కుంకలం తొక్కేసి తగలెయ్యకుండా ఆడ సింహం లా కాపలా కాసేది మా రెండో మేనత్త హనుమాయమ్మ గారు. మాతో సహా ఆవిడని అందరూ దొడ్డమ్మ అని పిలిచే వారు. ఆవిడకి పెళ్లి అయినా, పిల్లలు లేరు. భర్త తో సత్సంబంధాలు లేక నాకు తెలిసీ యాభై ఏళ్ళు ఆవిడ మా ఇంట్లోనే ఉండి, అక్కడే పోయారు. మంచి సంస్కృత పండితురాలు.  మొక్కల విషయంలో ఆవిడ అంటే మాకు సింహ స్వప్నమే!

హ్యూస్టన్ లో చంద్రకాంతం

హ్యూస్టన్ లో చంద్రకాంతం

ఒక విశేషం ఏమిటంటే అన్ని కూరగాయలలోనూ కాలీ ఫ్లవర్ పువ్వు పూయగానే  మొత్తం తోట అంతా  ఘాటుగా వాసన వేసేది. అదేమిటో తెలియదు కానీ నేను అమెరికాలో మా ఇంటి వెనకాల వేసినప్పుడు చూడడానికి షోకే కానీ కాలీ ఫ్లవరే కాదు, అస్సలు ఏ పువ్వుకీ ఎటువంటి వాసనా ఉండదు. కానీ ఎటువంటి సువాసనా లేకున్నా చాలా అందంగా ఉండే పువ్వు చంద్రకాంతం పువ్వు. పదేళ్ళ క్రితం నేను కాకినాడ  వెళ్ళినప్పుడు మా తోటలో మా చిన్నప్పటి నుంఛీ ఇప్పటి దాకా ఉన్నవి మా మామిడి చెట్టు, బొగడ చెట్టు, చంద్రకాంతం మొక్కలు మాత్రమే.  మా మామిడి చెట్టునీ, బొగడ చెట్టునీ అమెరికా తెచ్చుకోలేను కాబట్టి, ఆ చంద్రకాంతం విత్తనాలని ఆప్యాయంగా కోసుకుని హ్యూస్టన్ లో మా తోటలో వేసుకున్నాను.. ఆ మొక్కలు ఇప్పటికీ ప్రతీ ఏడూ ఎన్నెన్నో పూస్తున్నాయి. ఎప్పుడైనా మా చిన్నతనం గుర్తుకి వస్తే మా తోటలోకి వెళ్లి ఆ చంద్రకాంతాలని పలకరిస్తూ ఉంటాను.  హ్యూస్టన్ లో మా తోటలో ఉన్న ఆ చంద్రకాంతాల ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. వాటి పూర్వీకులు నాలాగే కాకినాడ వారు. ఇప్పుడు మా నాన్న గారి గార్డెనింగ్ వారసత్వాన్ని,  నా పై వాడైన మా సుబ్బన్నయ్య పుణికి పుచ్చుకున్నాడు. అతను ఇటు కాకినాడలోనూ, అటు మా పొలంలోనూ అన్ని రకాల పూల మొక్కలు వేసి, కూరగాయలు పండిస్తున్నాడు. ఇటీవలే మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా తమ్ముడు (లాస్ ఏంజెలెస్ నివాసి) మా మామిడి చెట్టుకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి, మా స్థలాన్ని నందన వనం లా తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు.

..మా చిన్నప్పుడు నేను నిజంగానే “తోటలో నా రాజు” ని.. ఒకటేమిటి, మా తోటలో లేని పూల మొక్కలు కాని, పళ్ళ చెట్లు కాని, కూరగాయలు కానీ లేవన్నా, ఆ సకల సంపదల మధ్యా నా చిన్నతనం గడిచింది సుమా అని నాకు ఇప్పటికీ నమ్మ బుద్ది కావడం లేదు. ప్రపంచంలో అందరికీ ఇలాంటి “బాల్య సంపద” ఉంటుంది. దాన్ని నెమరు వేసుకునే యోగం కొందరికే ఉంటుంది ఆ రోజుల్లో అది గుర్తించే బుద్ది నాకు అప్పుడు లేకపోయినా, ఇప్పుడు గుర్తు చేసుకుని అక్షరబద్ధం చేసుకునే అదృష్టం నాకు కలిగింది.

chitten rajuవంగూరి చిట్టెన్ రాజు, హ్యూస్టన్

మీ మాటలు

 1. Rajendra Prasad . Maheswaram says:

  రాజుగారికి, మీ బాల్యంతోపతుగా అనేక పాటకుల బాల్యాన్ని అవిష్కరిమ్పచేసి anandanni పెంచి పంచినందుకు కృతజ్ఞులము. ఆ ఆటలున్ పాటలున్ జ్ఞాప్తికివచినపుదేల్ల దేహముప్పొంగేడున్.

 2. నేటి బాలలే రేపటి పౌరులైనట్టే ..అప్పటి తోటలో రాజు ఇప్పుడు అమెరికా తెలుగు తోటకు కూడా రాజే అన్న సంగతి గుర్తొచ్చి, మీకు ఇప్పుడు తెలుగు సాహిత్యం మీది ప్రేమకు అప్పటి బాల్యం కూడా తన వంతు సహకరించినదనిపిస్తోంది.
  అనేకమంది బాల్యాన్ని (నా లాగే) మీరు గుర్తుకు తెచ్చారు.
  తలగడాలలో కూరుకునే పెద్ద పత్తి కాయలు కాసే వంద అడుగులు ఎత్తు ఉండే చెట్లని బూరుగు చెట్లు అంటారని గుర్తుంది. వాటిని బూరుగు-దూది కాయలు అనే వారు. దూదేకినప్పుడు వచ్చే ధ్వని చాలా విచిత్రంగా ఉంటుంది. మా చిన్నప్పుడు దానిని అనుకరించి నవ్వుకునే వాళ్ళం.
  మీ చెల్లెలు రాబందులు కాకుల గురించి అనుకున్నట్టే…మేము గొర్రెలంటే ఆడవనీ …మేకలంటె మొగవనీ అనుకునే వాళ్ళం.
  మొత్తానికి చాలా విషయాలు గుర్తు చేశారు.

  అభినందనలు మరియు ధన్యవాదాలు,
  నారాయణ గరిమెళ్ళ.

  • -వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు. నా “సొంత సుత్తి” చదువుతున్న వారికి ఎవరికైనా వారి చిన్నతన్నం కానీ, వారి పూర్వీకులు కానీ వారి జీవితంలో అపురూపమైన సంఘటనలు కానీ గుర్తుకు వస్తే నా అంతకంటే కావలిసినది
   ఏముందీ?

   -వంగూరి చిట్టెన్ రాజు

 3. బాలాంత్రపు వెంకట రమణ says:

  అన్నయ్యా,
  మీ జీవిత కథ చదువుతుంటే నా బాల్యం అంతా సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లాగ తిరిగిపోతోంది. నాకు దక్కిన వరం ఏమిటంటే నా ఫ్లాష్ బ్యాక్ లో మీరు, అంజి అన్నయ్య కూడా కూడా పాత్రధారులే. మన క్రికెట్ రోజులు – ప్రతి రోజూ, ఆడిన ప్రతి బంతీ, కొట్టిన ప్రతి షాటూ – గుర్తున్నాయి. ఆట అయిపోయాక అబ్దుల్ సత్తార్ తెచ్చిన అయిస్ ఫ్రూట్ లు మీరు కొనిపెడితే దాహం తీరా తినిసేవాడిని. మీ ఇంట్లో లాగానే మా ఇంట్లో కూడా లేని చెట్టు అంటూ లేదు. నా బాల్యం అంతా – స్కూల్ కి వెళ్ళినప్పుడూ, రాత్రి నిద్ర సమయంలో తప్పితే – ఆ చెట్ల మీదే గడిచింది. వల్లూర్ శంకరరావు గాని, అంజి అన్నయ్యగాని సైకిల్ మీద వచ్చి తమ్ముడూ మాచ్ ఉంది రా అని నన్ను తీసికు వెళ్ళే వారు.
  మీ ఆత్మ కథ అత్యద్భుతం అంటే అత్యద్భుతం. ఇది ప్రపంచ సాహిత్యంలోనే . ఒక మహోన్నతమైన ఆత్మకథల జాబితాలో చేరుతుంది అనడంలో సందేహం లేదు.
  మీ ఆత్మానందంలో నా హృదయం తడుస్తోంది.
  మొట్టమొదటిసారిగా చదివిన దానికి సరిగ్గా స్పందించ లేకపోతున్నాను.
  తమ్ముడు
  బాలాంత్రపు వెంకట రమణ
  సానా – యెమెన్

మీ మాటలు

*