ఒక altruistic కథకుడు- ముందొక ముళ్లకిరీటం!

 daalappa1

కవి/ రచయిత నాకు తెలుసు అని చెప్పేవాళ్లని- ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారని- అప్పుడెప్పుడో 80 ఏళ్ల క్రితమే చలం గారు (యోగ్యతాపత్రంలో) వెక్కిరింపు, చీత్కరింపు గుర్తుకొస్తున్నా, దాలప్పతీర్థం కథారచయిత చింతకింది శ్రీనివాసరావుతో నా వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ప్రస్తావించడానికి వెనుకాడటం లేదు. ఐతే, అతని కథలకి Motive springs చూపడానికైతే కాదు. అతను నాకు వ్యక్తిగతంగా తెలియక పోతే, ‘దాలప్పతీర్థం’ కథలు మరోలా అర్థమయ్యేవి (లేదా అపార్థానికి గురయ్యేవి). నిర్మమత్వంతో చూడాల్సిన కథలకి నాకు అతనితో ఉన్న పరిచయం అడ్డు కాలేదు సరికదా, నాకు ఆ దిశలో మరింత తోడ్పడింది.

కథల్లోకి వెళ్లే ముందు, కథా రచయిత రాతలకి సంబంధం లేదనిపించే కొన్ని సంగతులు:

ఆంధ్రప్రభ అనే ఒకానొక బుల్లి దినపత్రికని సామ్రాజ్యంగా భావిస్తూ, దానికి తానో చక్రవర్తినని విర్రవీగుతూ, తన భ్రమకి కించిత్ భంగం వాటిల్లినా అందుకు కారణమైన ఉధ్యోగులు అనే కీటకాల్ని కఠినంగా శిక్షిస్తూ- ఓ వేయి విషపడగల వాసుకి! ఆయన ఫ్యూడల్ హయాంలో రకరకాల శిక్షలకి గురైన వాళ్లలో ‘అవిధేయతా’ నేరం కింద అక్కడెక్కడో రూర్కేలా అనే శంకరగిరి మాన్యాలు పట్టిపోయిన వాడు చింతకింది శ్రీనివాసరావు. ఆంధ్రప్రభకి మంచిరోజులు తెచ్చి, దాన్ని భూమార్గం పట్టించిన ఎడిటర్ నిజం శ్రీరామ్మూర్తి గారు- ఆయన టైమ్‌లో తిరిగి తన విశాఖపట్నం గూటికి చేరే ముందు, ఒక నెల రోజులు పాటు హైద్రాబాదులో ఉన్నాడు చింతకింది. వాసుకి బాధితులు సాధారణంగా సెల్ఫ్ పిటీతో కుంగిపోతుంటే, వారి పట్ల సానుభూతి చూపించడంలో మిగతా సహోద్యోగులకి గొప్ప తృప్తి, ఒక మెట్టు ఎగువన ఉన్నామన్న ఆనందం కలిగేవి. కానీ, అటువంటి వారందరికీ చింతకింది ఒక చెంపపెట్టులా కనిపించాడు. సానుభూతి కాదుకదా, ఏ మాత్రం నంగిరితనాన్ని సహించనితనం ముఖాన కుంకుమ బొట్టులా మెరిసేది (ఇంటర్వ్యూలో తొలి ప్రశ్నగా శాఖ ఏమిటని నన్నడిగిన మా వాసుకి నెలకొల్పిన వాతావరణం వల్లనేమో, కొలీగ్స్ కులం సదరు కొలీగ్ కంటే ముందే తెలిసిపోతుండేది. కాబట్టి మెడలో నళినాక్షితాల మాల, స్పటిక పూసల హారం, ఆ పక్కన జంధ్యం, ముఖాన కుంకుమతో, మెడ ఎత్తి చూడాల్సిన చెయ్యెత్తు మనిషి- చింతకింది బ్రాహ్మడని మాకు ముందే తెలుసు). అలాగని ధూంధాంలాడుతుంటాడా అంటే, భారతీయ స్వభావాత్మ వంటి సత్-చిత్-ఆనంద తత్వానికి ప్రతినిధిలా ముఖాన చెదరని నవ్వు. 1990ల ద్వితీయార్థంలో నాతో చిన్నపాటి పరిచయం, తదనంతరం వీడ్కోలు- అంతే.

నేను వైజాగ్ బదిలీఐ వెళ్లాక చింతకింది నాకు నిజంగా పరిచయమయ్యాడు.

పన్నెండేళ్ల క్రితం నా కళ్ల ముందు నిలిచిన ఒక దృశ్యాన్ని చెప్పక పోతే, నేనిక్కడ రాసేదంతా అసంపూర్ణం. బాబ్జీ అనే సహద్యోగి. చిన్న వయసువాడే. రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా చనిపోయాడు. పోస్టుమార్టం అయ్యాక, దగ్గరి బంధువులు, కొలీగ్స్ ఎవ్వరూ కూడా శవం దగ్గరకి వెళ్లడానికి తటపటాయిస్తున్న సందర్భం. ఒక్కడే ఒక్కడు చింతకింది బాబ్జీ శవాన్ని భుజాన మోసుకుంటే బైటకి వచ్చినప్పటి దృశ్యం. శనిదానం. మృత్యుంజయ దానాలు పట్టే బ్రాహ్మడు, శవాన్ని మోసే బెస్త, పాడెగట్టే కాష్ఠమల్లడు, కాటిలో ప్రేతగోపుడు… అన్నీ అతడే. అసందర్భమే గానీ, సతిని మోస్తూ ప్రళయ తాండవం చేసిన రుద్రుడు గుర్తొచ్చాడు. శివుడితో పోలిక లేకపోలేదు, ఆయన గరళాన్ని గొంతులో దాచుకుంటే, చింతకింది దుఃఖాన్ని దాచుకున్నాడు. ఎవరు అతని నోట పలికించే వారోగానీ, చనిపోక ముందు తరుచూ అనేవాడు బాబ్జీ- ‘ నవ్విన నాప చేనే పండుతుందిలే. నన్ను చూసి నవ్విన నువ్వే ఓ రోజు నన్ను భుజాన ఎక్కించుకొని ఊరేగిస్తావు చూడ్రా బావా’. ఆ మాట మరోలా నిజం కావడం వల్ల పొర్లుతున్న, పొగులుతున్న దుఃఖాన్ని గొంతులోనే దాచుకున్న చింతకింది – అగ్ని పర్వతంలా గుంభనంగా కనిపించే మంచుకొండ – అప్పటి నుంచి ఆత్మబంధువు అనుకుంటాను. ఇంకా తరిచి చూసుకుంటే అతను నాకొక subject matter, ఒక phenomenon!

బతుకు కోరేవాడు బావమరిది అంటారు, అలా కోరడానికి చుట్టరికాలు కలవనక్కరలేదు, చింతకిందిలా కలేసుకోవచ్చనుకుంటా. ఒక్క బాబ్జీ యే కాదు, అందరూ ఆయన బావలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు, వదినెలే. పిఆర్ వ్యవహారంలా నీళ్లమీద నూనె తెట్టెలా urbanized పైపై పలకరింపులు కావు. ఎంతవాడ్నైనా ‘ఒరే’ అంటూ పలకరించే చింతకిందిలో సామాజికంగా బ్రాహ్మణ్యం అందించే దాష్టీకం లేదు. ఆ మాటకొస్తే అనూచానంగా వచ్చే అలవాట్లే తప్ప ఆయన కులాన్ని పట్టించే లక్షణాలు మచ్చుకి కూడా లేవు. దాచుకోవడం తెలియని, ఇవ్వడానికే ఉన్నట్టు సాగిన ఆజానుబాహుత్వం ఉన్న ఇటువంటి వారికి, తమ దగ్గర లేనప్పుడు, మోకాళ్ల వరకూ వేళ్లాడే ఆ నిడద చేతులతోనే తీసుకోవడం, లేదా లాక్కోవడం అనే లక్షణాలు కూడా ఉంటాయి. కానీ, అడగటం, తన చేయి కింద కావడం చింతకింది స్వభావంలో లేదు. “….. శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,/ బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ/ ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్/ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?” అని బలి చక్రవర్తిలా తనది పైచేయి అనిపించుకోవాలన్న మెహర్బాణీ కూడా లేదు. తన చుట్టూ ఉన్న లోకం అంతా ఆయనకి ఒక కుటుంబం, ఒకే కుటుంబం. చింతకిందిలో మరో ముఖ్యమైన లక్షణం నైతికత. అది మర్యాదస్తుల దొంగ ముసుగు కాదు. ఒక పల్లెటూరి నిసర్గమైన నీతి. ఆరడుగుల పైనుండే చింతకింది సమక్షంలో చెట్టు నీడన సేదతీరుతున్నట్టుండే ఆడవాళ్లని గమనిస్తుంటే ఆశ్చర్యమేసేది. జింక- పులి సంబంధానికి సమాంతరంగా ఉండే ఆడ-మగ లోకంలో మానంత మనిషిలా కనబడేవాడు చింతకింది. అతని సమక్షంలో ఏ స్త్రీ కూడా తన పరిమితులు గుర్తొచ్చి న్యూనత పడటం, తన ఉనికి గురించి ఉక్రోషపడటం, తన భద్రత గురించి భయపడటం మచ్చుకైనా ఉండేవి కావు (అతనిని అందరూ అన్నగా భావించడం, నేను తనతో ముందే బావగా వరసలు కలిపేయడం వల్ల, నా వరకైతే భలే బాగుండేదనుకోండి).

ఇక వృత్తి పరంగా కూడా నికార్సైన జర్నలిస్టు. సాధారణంగా చలామణిలో ఉన్న పాత్రికేయం, ముఖ్యంగా ప్రాంతీయ పాత్రికేయం అంటే ఓ పవర్, ఒక దబాయింపు, పరోక్ష (ప్రత్యక్ష) బ్లాక్‌మెయిలింగ్, ఇంకా పైరవీకి synonym. కానీ, ఈనాడులో రిపోర్టరుగా చేరింది మొదలు, ఈరోజు ‘పబ్లిక్’ అనే దినపత్రిక ఎడిటర్‌గా ఎదిగినంత దశ వరకూ చింతకిందికి జర్నలిజం అతని ప్రవృత్తికి కొనసాగింపు. సొంతలాభమనే ప్రయోజనాన్ని ఆశించి, బెదరింపు లాంటి, ఎత్తుగడలాంటి, గూడుపుఠాణీ లాంటి, పోనీ భజనలాంటి రిపోర్టులు ఇతని నుంచి వచ్చే అవకాశమే లేదు. రాజకీయ నాయకుల మొదలు, సెలబ్రిటీస్ అందరితోనే విస్తారమైన పరిచయాలు ఇతనికి. పడవతో నీటికుండే తగుమాత్ర సంబంధంలాంటివే అవన్నీ.

కవులతో, రచయితలతో, కళాకారులతో మాత్రం ప్రగాఢమైన అనుబంధం. స్వతహాగా మంచి గాయకుడు. చాలా తక్కువ మందికి వంటబట్టే పద్య పఠనం అబ్బింది. పీసపాటి వారి నుంచి ఎందరో నాటకరంగ కళాకారులతో పాత్రికేయేతర బాంధవ్యం. మూర్తీభవించిన నియంతృత్వ నియతిలా కనిపిస్తాడు గానీ, పైపై నియమనిబంధనలకి అతీతంగా కళాకారుల్లో ఉన్న artistic moralityకే ఎక్కువ విలువిస్తాడు. చీమకుర్తి నాగేశ్వర్రావు గారికి వైజాగ్ రైల్వే స్టేషనులో చింతకింది పాదాభి వందనం చెసినప్పుడు చుట్టూ ఉన్న సభ్య సమాజం బిత్తరపోయింది. చీమకుర్తి అంతటి కళాకారుడని తెలియక పోవడం వల్లే కాదు, ఆ పచ్చి తాగుబోతు ఒక విసిరేసిన చింకిపాతలా ఉండటం కూడ బహుశా ఒక కారణం.

ఇంత సజ్జన సాంగత్యం, పురా- నవ సాహిత్య పరిచయం, భాషాభినివేశం, నిబద్ధత, కార్యశూరత్వం ఉన్న చింతకింది, 2010 వరకూ, అంటే తన 46 ఏట వరకూ సాహిత్య రంగ ప్రవేశం చేయలేదు, సాహిత్యానికి పాఠకుడిగా ఉన్నాడే గానీ. అదేదో నేరారోపణగా చెప్పడం లేదు. తొలి కథ ‘నిదర్శనం’ 2010 మధ్యలో రాస్తే, దాన్ని 25 జూలై, 2010 ‘ది సండే ఇండియన్’ పత్రికలో ప్రచురించే గౌరవం, ఆ పత్రిక ఎడిటర్‌గా నాకే దక్కింది. చింతకింది కథ రాయడం నాకేమంత ఆశ్చర్యం కాదుగానీ, ‘నిదర్శనం’ వంటి కథ రాయడం నాకు గొప్ప అబ్బురం. దాని కథాకాలంలో ఒక గమ్మత్తుంది. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల సమీపంలోని మొయిదా గ్రామ పొలిమేర్లలో గాలులు ప్రచారం చేసే శతాబ్దం నాటి గాథల్ని 21వ శతాబ్దం తొలి దశకం తర్వాత విన్నాడు రచయిత. విని, దాన్ని కథగా మార్చి, రెండు కాలాలకి గడుసుగా ముడి వేశాడు చింతకింది. జ్యోతిష్య, ఆగమాది శాస్త్రాల్లో నిష్ణాతుడైన ఓ పండితుని నిన్నటి తరాల కథే- నిదర్శనం. గత (మృత) బ్రాహ్మణీయ సమాజాల పునరుద్ధరణ ప్రీతిని ప్రతిఫలించినట్టుండే ఈ కథని తొలికథగా రాయడమే నా విస్మయానికి కారణం. అనుభవాల మీద (అరువు) ఆలోచనలు పెత్తనం చేస్తూ, అవి కథల, లేదా ఇతర సాహిత్య ప్రక్రియల రూపంలో ప్రతిపాదనల స్థాయికి దిగజారి రాజ్యమేలుతున్న వర్తమాన సాహిత్య వాతావరణం, రాజకీయాలూ తెలిసి తెలిసీ, ‘నిదర్శనం’ వంటి కథని రాయడం నా దృష్టిలో సాహసమే. ప్రగతి నిరోధకమనో, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలమనో, పాతచింతకాయ పచ్చడనో పక్కకి తోసేసే వీలున్న కథ.

ఆధునికత అందించిన అత్తెసరు జ్ఞానంతో నిర్లక్షించిన, పక్కకి తోసివేయబడ్డ అంశాల్ని ఆధునికోత్తర టార్చిలైట్లతో వెదికి, వెలితీయాలని ఊదరగొడుతున్న వర్తమానంలో, ఆధునిక పూర్వ సమాజాల బహుముఖీనతని ప్రదర్శించే ఏ కథనైనా తల మీద పెట్టుకోవల్సిందే. కానీ, అది అగ్రవర్ణ బ్రాహ్మణ సమాజాలదైతే ‘మార్కెటింగ్’ చాలా కష్టమే గాక, ఎదురు నిందలు మోయాల్సి ఉంటుందని తెలిసి కూడా ‘నిదర్శనం’ రాశాడు చింతకింది.

రెండవ కథ, ఈ సంకలన శీర్షికగా నిలిచిన- దాలప్ప తీర్థం. ‘నిదర్శనం’లా దీనిని పుక్కిటి కథ అని తేల్చేయడానికి వీల్లేని, స్థల పురాణానికీ- వీరగాధకి మధ్యన నిల్చే ఆధునిక కాలానికి చెందిన కథ. ఈ వైవిధ్యం చూపించిన తర్వాత, సాధారణంగా రచయితకి ఒక అలసట ఉంటుంది. కానీ, ఈ సగటుతనాలు తనకి ఆపాదించడం కుదరదన్నట్టు నిండా మూడేళ్లు తిరక్కుండా 14 కథలతో ఒక కథాసంకలనంగా ముందుకొచ్చాడు (ఇంకొన్ని కథలు పక్కన పెట్టాడనుకుంటా). ఇదంతా గోళ్లు గిల్లుకుంటూ బోల్డు తీరుబడి దొరికి చేయలేదు; ఒక పక్క ‘సాక్షి’లో పని ఒత్తిడి, మరో పక్క తన పీహెచ్‌డీ థీసెస్.

ఇక ఈ కథల్లో సూత్రపాత్రల విషయానికొస్తే, దాదాపు అందరూ ‘పరోపకారమిధం శరీరం..’ అన్న సుభాషితం గురించి చదివే జ్ఞానం, వినే తీరుబడి లేని బొటాబొటీ బతుకుల వాళ్లే; అయినా ఆ సూక్తిని మనసా, కర్మణా ఆచరించిన వారే. ‘పిండిమిల్లు’ హుస్సేనయ్య (అనబడే షేక్ మక్బూల్ హుస్సేన్), ‘గుడ్డముక్కలు’లో సిలపరశెట్టి తాతయ్యలు, ‘పాలమ్మ’, ‘చెరుకుపెనం’ తెప్పగా ఏరు దాటించే రాపర్తి భూషణం, ‘జలగల డాక్టర్’ – సివ్వాల రామునాయుడు….

అందరూ రచయిత పుట్టి పెరిగిన చౌడవరం వాళ్లే, లేదా కాస్త ఇరుగూ పొరుగూ ఊళ్లోళ్లు. అతని చిన్ననాటి జ్ఞాపకాల్లోంచి, నోస్టాల్జియాలోంచీ మేల్కొని, కాగితాల మీదకి నడిచొచ్చిన వాళ్లే.

‘వసుధైక కుటుంబ’మనే అమూర్త భావాలకీ, అతిసాహస, వీరపరాక్రమ యోధానుయోధుల, దీరోదాత్తుల మహాకథనాలకీ వీడ్కోలుగా petits récits అనబడే స్థానీయ కథనాలకి Jean-François Lyotard దారులు వేశాక, ప్రపంచంలో, ముఖ్యంగా మూడో ప్రపంచంలో, ఆ ప్రపంచంలోని తెలుగు లోకంలో అటువంటి కథలు వెల్లువెత్తాయి. కాబట్టి, చింతకింది శ్రీనివాస్ ‘దాలప్పతీర్థం’ ఆ ఒరవడిలో కొత్తదేమీ కాదు. ఆ మాటకొస్తే, చింతకింది కాకుండా (నాకు వ్యక్తిగతంగా తెలియని) ఏ రచయితైనా ఇవే కథలు రాసి ఉన్నట్టైతే నాకు కచ్చితంగా విసుగొచ్చేది, ఈ మీదుమిక్కిలి మంచితనం, పరహితత్వం సరిపడక వెగటేసేది. అదేదో మహాభారత కాలం నాటి ద్వాపర యుగంలో ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడు, దుర్యోధనుడికి ఒక్క మంచివాడు కనబడలేదన్న పిట్ట కథ గుర్తొచ్చేది. మల్లాది రామకృష్ణశాస్త్రి వారంతటి విద్వన్మణి రాసిన ‘తేజోమూర్తులు’లో చిత్రించిన సమాజం, పల్లె, ప్రజ… అందరూ మరీ ఆదర్శప్రాయమై అదేదో రచయిత కలల ప్రపంచం లెమ్మనుకున్నట్టే మరోసారి అనిపించేది.

కానీ,  చింతకింది గురించి ఆసాంతం తెలుసు కాబట్టి ఈ కథాస్థలం కల్పితం కాదనీ, రచయిత పుట్టి, తనకంటే ముందే పుట్టేసిన పలు చింతకింది శ్రీనివాసరావుల్ని చూస్తూ పెరిగి, వారిని తలుచుకుంటూ ఈ కథాశ్రేణికి కారణమయ్యాడనీ, మున్ముందు ఇంకా మరింత అవుతాడనీ అర్థమయ్యింది. ఒక సామాజిక న్యాయం కోసం, తనదైన అస్థిత్వం కోసం స్థానికత పడరానిపాట్లు పడుతూ, తనదైన చరిత్రని ఈ చిన్ని చిన్ని కథల ద్వారా పునర్నిర్మించుకుంటోంది. ఆ పునర్నిర్మాణ ప్రక్రియకి తన కథల ద్వారా చింతకింది చేసిన (చేస్తున్న) కాంట్రిబ్యూషన్ అధికం. ఈ కథల్లో ఇంటిపేర్లతో సహా తను అలవోకగా ప్రస్తావించిన పేర్ల వరకూ చాలు, ఒక ఉత్తరాంధ్ర గ్రామ సామాజిక జీవన వైవిధ్యాన్ని సమగ్రంగా గ్రంథస్థం చేయడానికి. ఆకెళ్ల సోమిదేవమ్మ, కాకరపర్తి సీతాలక్ష్మి, చింతలపాటి సత్యమాంబదేవి, పాలఘాట్ కృష్ణయ్యర్, అగ్గాల సన్నాసి, గరిమెళ్ల సూర్యకాంతమ్మ, అబ్బరాజు సూర్యారావు, మండా రామ సోమయాజులు, భమిడిపాటి యజ్ఞేశ్వరరావు, సచ్చరి పైడయ్య, నడుపూరి ఓబలేసు, జక్కవరం పైడితల్లి, బళ్ల కనకారావు, చుక్కా సీతయ్య, కర్రి పార్వతీశం, పిడపర్తి విశ్వేశ్వర సోమయాజులు, రాళ్లపల్లి కామేశ్వరరావు, పెన్మత్స కృష్ణభూపతి, పిప్పల నారాయణ, కొమ్మిరెడ్డి రాంబాబు, ఈతలపాక వెంకటేశం, గూనూరు గణేషుడు, బుద్ధ నాగజగదీషు, గండి గౌరునాయుడు, ధన్యంరాజు నరసయ్య, బోయిన గౌరీసు, నేమాని పార్వతీశం, యర్రంశెట్టి వీర్రాజు, కోయిలాడ వెంకట్, సుగ్గు వరాలు, మంత్రిప్రగడ గోపాల కృష్ణ, చుండూరు కామేశ్వరరావు, గాటూరి అప్పన్న, బయిన పాపారావు…. ఇంకా ఎందరో…. శారదా నది, బొడ్డేరు, తాచేరు, మానేరుల మధ్య చోడవరం, వడ్డాది, కొత్తకోట, మేడివాడ, అర్జాపురం, దొండపూడి వగైరా ఊళ్లలో ఎదురయ్యే పాత్రలు. వీటితోపాటు, ఉత్సవ సమయాలు, పొర్లు దండాలు, ఏకాకితనాలు, సామూహికత్వాలు, కుడి ఎడమలు, చీకటి వెలుగులు, ద్వంద్వాలు… వెరసి, “To see the world in a grain of sand, and to see heaven in a wild flower, hold infinity in the palm of your hands, and eternity in an hour”అన్న William Blakeని గుర్తుకు తెస్తాయి.

మళ్లీ మొదటిగడి (square one) దగ్గరకే వస్తే, పఠితకి రచయిత (వ్యక్తిగతంగా) తెలియడం అన్న కాన్సెప్ట్ మీద నిర్మించబడ్డ వ్యాసం ఓ పేకమేడ. ‘దాలప్పతీర్థం’ బాగోగులు ఎటువంటి ఊతకర్రల సాయంలేకుండా, దాని textకే పరిమితమై చూస్తే, ఒక అనుభవాన్ని అందించే ముందే రచయిత ఉద్దేశ్యాల మీద ఒకానొక అనుమానాన్ని రేకెత్తించే అవకాశముంది. కథాంశంలోని మానవీయతని సాకుగా చూపించి, కథన రీతి మీద నోరు మెదపకుండా చదువరిని emotionalగా కట్టడి చేసే ఎత్తుగడకి రచయిత పాల్పడుతున్నాడా అన్న అనుమానం. ‘నిదర్శనం’ కథతో తనమీద దాడికి కవ్వించిన తెగువ, లేదా ఆ కథాంశాన్ని మిషగా తనని మొగ్గగానే తుంచేసే అవకాశాన్ని తానే చేజేతులా అందించిన తెంపరితనం మరే కథల్లోనూ కనిపించదు. కథాంశం, దాని నేపథ్యం, దాని వెనుక చిత్తశుద్ధి, తత్పరతలు మాత్రమే కథకి సాహిత్య గౌరవాన్ని చెచ్చిపెట్టవు. వాటి దన్నుతో, take-it-for-granted దిలాసాతో, అభ్యాసం కూసువిద్యలా మూడేళ్లలో 14 కథలు రాసిపారేసినట్టు పాఠకుడికి తోచిందా- ఇక ఆ రచయిత (రచన మీద కూడా) గౌరవం తగ్గుతుంది, నమ్మకం సడలుతుంది. నిజానికి రచయిత నిబద్ధతంటే కమ్యూనిస్టులు చెప్పే మూసల్లోకి రంగూ, రుచీ లేకుండా ఒదిగిపోవడం కాదు, పాఠకుడికి రచన ద్వారా గతంలో ఇచ్చిన భరోసాని, కలిగించిన క్రెడిబిలిటీనీ నిలబెట్టుకోవడం. అటువంటి నిబద్ధత కోసం చింతకింది ఇంకా అక్షర దాస్యం, ధ్యానం చేయాలి. ‘శిఖండిగాడు’, ‘చిదిమిన మిఠాయి’ వంటి కథల్లో శైలీగతమైన లోపాలు కొన్ని కనిపిస్తున్నాయి. రచయిత సర్వజ్ఞుడేమీ కాదు కాబట్టి, కొన్ని ఖాళీల్ని (సహజంగా) వదిలేయడం కూడా రచనా సంవిధానంలో భాగమే. ఈ విషయం సాహిత్య అకాడమీ అవార్డులు సొంతం చేసుకొని, జ్ఞానపీఠాల మీద గురిపెట్టిన తెలుగు మహామహోపాధ్యాయులకే ఎక్కడం లేదు కాబట్టి, చింతకింది వంటి వారిని కార్నర్ చేయడం సబబు కాదేమో. అయినా, అక్షరలోకంలో చిన్నా పెద్దా ఉండవు కాబట్టి అటువంటి excuses, concessions దొరకవని చింతకింది శ్రీనివాస్ గ్రహించాలి. ‘కళింగాంధ్ర వారసుడు’ అంటూ వాడ్రేవు చినవీరభద్రుడు అంతటి సాహితీవేత్త అనడం ఒక ప్రశంసగా కాకుండా, దాన్నొక ముళ్లకిరీటంగా చూడాలి, దాన్ని ధరించడానికైనా, విడనాడటానికైనా-

నరేష్ నున్నా

 ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుంది.

మీ మాటలు

  1. ఇంతకీ ఈ కథలు మీకు నచ్చలేదంటునారా? చెప్పీ చెప్పకుండా వదిలేసారు. అసలు కథల మీద చర్చ కంటే మీ పర్సనల్ ఫ్రెండ్షిప్ వివరాలు ఎక్కువగా ఉన్నాయి.

    Do you recommend this book?

మీ మాటలు

*