తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

 

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

నిజం చెప్పద్దూ, మా ఇంట్లో వెనక ఏడు తరాలు చూసుకున్నా రచయితలు ఎవరూ లేరు. దూరపు చుట్టాలలో సంగీతజ్ఞులు, ఇదే ఇంటిపేరుతో కొంతమంది రచయితలు వున్నా వారితో అనుబంధం తక్కువ. మరి నాలో ఈ సాహిత్యాభిలాష ఎక్కడిదా అని వెతుక్కుంటూ నాలోకి నేనే చూసుకుంటే –

ముందు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది. గత పాతికేళ్ళుగా ఆమె జ్ఞాపకంగానే మిగిలింది. పాత సినిమాపాటలో, లలిత సంగీతమో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా లేకుండా ఆమె నాకు గుర్తుకురాదు. రేడియో పాడుతుంటే, ఆమె పనులు చేసుకోవటం ఆమె గురించి గుర్తున్న సంతోషకరమైన జ్ఞాపకాలలో ఒకటి.

ఇక అదే రేడియోలో ఏ రాత్రిపూటో నాన్న పెట్టే కర్ణాటక సంగీతం – తెలియకుండానే త్యాగరాజునీ, శ్యామదాసునీ, పురంధరదాసునీ పరిచయం చేసేవి. సుబ్బలక్ష్మి, శమ్మంగుడి, మహారాజపురం, కున్నకూడి, పట్టమ్మాళ్ ఇలా ఒక్కొక్కళ్ళే మా గోడమీద చెక్కస్టాండ్ స్టేజి పైకి ఎక్కి టేప్ రికార్డర్ రూపేనా కచేరీలు చేస్తుండేవాళ్ళు. వీళ్ళంతా నాన్న సేకరించిన వందలకొద్ది సంగీతం క్యాసెట్లలో సంగీత సామ్రాట్టులు. వీరందరి మధ్యలో అక్కడక్కడ కనిపించే నాలుగైదు సినిమా పాటల క్యాసెట్లలో నుంచి ఎ.ఎమ్.రాజా, ఘంటసాల, లీల, సుశీల గొంతు సవరించేవాళ్ళు. వీళ్ళంతా అమ్మకోసం నాన్న రికార్డ్ చేయిస్తే ఇంటికి వచ్చిన అతిథులు. ఈ సంగీతం, సినీగీతం మధ్యలో ఎక్కడో కళల గురించి ఆసక్తో, అభిరుచో మొదలైంది.

వేమన్నని, పోతన్నని పరిచయం చేసింది మేనత్త. తొలి అడుగులు వేస్తున్నప్పుటి నుంచే తెల్లవారుఝామున లేపి, నీళ్ళు పోసి, దేవతార్చనకి పూలు కోసే నెపంతో నన్ను పక్కింటికి తీసుకెళ్ళి “శుక్లాంబర ధరం”తో మొదలుపెట్టి, “ఇంతింతై వటుడింతై” అంటూ పోతనని పలకరించి, ఆ తరువాత పాడ్యమి విదియ తదియలు, ప్రభవ విభవలు చెప్పించేది. తెల్లవారుఝామున చెప్పిన పద్యాలు, చదివిన చదువులు, నందివర్ధనం చెట్టు మీద నుంచి రాలిపడిన మంచుబిందువులంత స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ తెలుగుతో పరిచయం అయ్యింది.

“నానమ్మా కథ చెప్పవూ” అనే మాటతోనే రాత్రుళ్ళు మొదలయ్యేవి మాకు. రాజకుమారుడు, తెల్లగుర్రాలు, పూటకూళ్ళపెద్దమ్మలు, కాశీమజిలీలు, భోజరాజు కథలు, విక్రమార్కుడు… నిద్ర… కథ…! వింటూ నిద్రపోతూ, కథల్లో తూగుతూ, కలల్లో కథని చూస్తూ, మనమే యువరాజులై గుర్రం పైన స్వారీ చేస్తూ వుంటే… ఇంతలో రాక్షసుడొస్తే పక్కనే ధైర్యం చెబుతూ నానమ్మ. కొంత వూహ తెలిసాక రామాయణం, మహాభారతం ఆ తరువాత ధృవుడు, ఇంకోరోజు హరిశ్చంద్రుడు… “లోహితా, లోహితా” అంటూ హరిశ్చంద్రుడు ఎంత ఏడ్చాడోకానీ, నానమ్మ ఆ కథ చెప్పిన ప్రతిసారీ ఏడవడం ఒక ఆశ్చర్యకరమైన జ్ఞాపకం. కథతో, అందులో వుండాల్సిన ఎమోషన్ తో తొలి పరిచయం.

ఆ తరువాత ఇంకేముంది – మనకి చదవటం వచ్చేసింది. పాఠ్య పుస్తకాలలో – మొక్కపాటి, పానుగంటి, జాషువా, కరుణశ్రీ, సర్ ఆర్థర్ కానన్ డాయల్, సోమర్ సెట్ మామ్, బయట పుస్తకాలలో – యండమూరి, మల్లాది, సూర్యదేవర, యద్దనపూడి వీళ్ళందరూ పరిచయం అయ్యారు. వీళ్ళందరినీ చదివి అవన్నీ చాలక కనపడ్డ పుస్తకమల్లా నమిలేస్తూ, నెమరేస్తూ – కిరాణా కొట్టులో కట్టిచ్చిన పొట్లాల కాగితంతో సహా చదివేసి తృప్తిగా తీరుబడిగా కూర్చున్నాక ఒక శుభముహుర్తాన శ్రీశ్రీ కనపడ్డాడు. ఆయన వెంట మొదలుపెట్టిన పరుగు “కలం కల” అంటూ కవితై మయూరి వారపత్రికలో అచ్చైంది. ఆ తరువాత కథలు – 1995 తొలికథ ఆంధ్రప్రభ ఆదివారం పత్రికలో దీపావళి కథలపోటీలో సాధారణ ప్రచురణ. అప్పుడే రైల్వే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కథలపోటీలో మొదటి బహుమతి. తొలి అడుగులలో నాలుగు అచ్చు, పధ్నాలుగు రొచ్చు…!!

Cover

సాహితీవైద్యం కోసం వసుంధరగారికి రాయచ్చో రాయకూడదో అనుకుంటూ, ఒక రోజు ధైర్యం కూడగట్టుకోని “ఈరేశంగాడి ముచ్చట” పంపించాను. “కథాంశం బాగుంది. మీకంటూ ఒక శైలి ఏర్పడాలంటే మీరు ఎక్కువగా చదవా”లని వారి నుంచి ఉత్తరం. పెద్దల మాట చద్దన్నం మూట అని నాన్నమ్మ చెప్పిన మాట. అప్పుడే మరిన్ని పుస్తకాలు చదవాలని నిర్ణయించుకున్నాను!

అదే మొదలు. ఇట్నుంచి షిడ్నీ షెల్డన్, అగాథా క్రిస్టీ అట్నుంచి ముళ్ళపూడి, కొకు, బుచ్చిబాబు, చలం…. చదువుతున్నకొద్దీ కుచించుకుపోయి, నేను రాసినవీ కథలేనా అని ఆ మహామహుల రచనలలో ఆవగింజంతైనా అందుకునేదాకా రాయకూడదని ఆరేడు సంవత్సరాలు అజ్ఞాతవాసం. నేను రాసేది నాకు నచ్చేదాకా చదవటమే ఒక పని (ఇప్పటికీ కొనసాగుతోంది). గుజరాత్ లో చదువులు ఆ తరువాత కార్పొరేట్ వుద్యోగం. వుద్యోగం వూళ్ళు తిప్పింది. కొత్త ప్రాంతాలు, కొత్త మనుషులు, కొత్త పుస్తకాలు… కొత్త కొత్త కథలు. ఇందోరులో వున్నప్పుడు ఉజ్జైనిలో మంచినీటి కటకట గురించి పేపర్లో చదివిన తరువాత మళ్ళీ కలం కదిలింది. కొత్తగా పరిచయమైన టెక్నాలజీ సాయం తీసుకొని బ్లాగులు, అంతర్జాల పత్రికలకే పరిమితమై వుండిపోయాను.

ఆ తరువాత పరిచయమైన సాహితీ మిత్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. బ్లాగుల్లో గుట్టుగా వున్న నన్ను అచ్చోసిన రచయితని చేశారు.

వసుంధరగారిని మళ్ళీ పలకరించాను. “మీ కథలకి ఇక సాహితీవైద్యం అవసరంలేదు. పుష్టిగా వున్నా”యన్నారు. పత్రికలో నా కథ వచ్చినప్పుడల్లా చదివి అభినందించారు, ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఇచ్చిన ధైర్యం తోనే ఈ పుస్తకానికి వాళ్ళనే ముందుమాట అడిగేదాకా తీసుకొచ్చింది. వారి వాత్సల్యానికి, ప్రోత్సాహానికి నా సగౌరవనమస్సులు.

ఈ పుస్తకంతో నా సాహితీ ప్రస్థానం మొదలైంది.

***

చివరిగా ఒక్క మాట – ఇదంతా సోత్కర్షలా వుంటుందని తెలిసినా చెప్పే ధైర్యం చేశాను. చెప్పాల్సిన అవసరం వుందనిపించింది కాబట్టే ఆ సాహసం.

తెలుగు భాషని మరుగుపరుస్తున్నారన్న అపవాదు మోసే తరంలో వాడిని నేను. ఆంగ్లమాధ్యమంలో చదువులు, కార్పొరేట్ వుద్యోగాల పరుగుల మధ్యలో తెలుగు భాషాభిమానాన్ని, సాహితీ ఆసక్తిని సజీవంగా వుంచుకోవచ్చని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నాలాంటివారు ఎందరో వున్నారు. తెలుగు భాష అంతరించిపోతోందని బాధపడటం వల్ల ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మానకూడదు. రేపటి తరానికి రెండు కథలు, నాలుగు పద్యాలు, కాసిన్న సామెతలు చెప్పి తెలుగు భాషని రుచి చూపించండి. ఆ తరువాత పఠనాసక్తిని కలిగించి వదిలిపెట్టండి. ఏ మాధ్యమంలో చదివినా, జీవనానికి మరే భాష అవసరం అయినా తెలుగు మీద మక్కువ ఎక్కడికీ పోదు. అందుకు నేనే సాక్ష్యమని చెప్పడానికే ఈ ముందుమాట.

 

భవదీయుడు

అరిపిరాల సత్యప్రసాద్

final invi

మీ మాటలు

  1. buchireddy gangula says:

    చాల చక్కగా చెప్పారు —కంగ్రాట్స్ సర్
    ———————-
    బుచ్చి రెడ్డి గంగుల

  2. సొంత జ్ఞాపకాల్ని చెప్పుకోవటం స్వోత్కర్ష అవుతుందేమోననే మీ భయం మీ modestyని సూచిస్తుంది. మీ వ్యాసశీర్షికలో కూడా విలక్షణతో పాటు modesty వుంది. అభినందనలు.

    కర్ణాటక శాస్త్రీయసంగీత శ్రవణభాగ్యం మీకు చిన్నతనంలోనే అన్నివేళలా అందుబాటులో వుండటం మీ అదృష్టం. మీ నాన్నగారు వందలకొద్దీ శాస్త్రీయసంగీతపు క్యాసెట్లను జమ చేసారని చెప్పారు కనుక త్యాగరాజ స్వామి, శ్యామ శాస్త్రిల సంగీతంతో పాటు ముత్తుస్వామి దీక్షితార్ సంగీతాన్ని కూడా వినే ఉంటారు మీరు. సాధారణంగా ఈ ముగ్గురి పేర్లనూ కలిపి పేర్కొనటం ఆనవాయితీ. ఎందుకంటే ఈ ముగ్గురినీ కలిపి కర్ణాటక సంగీత త్రిమూర్తులు(Trinity of Carnatic music) అని అంటారు. కర్ణాటక సంగీతానికి పితామహుడైన పురందర దాసు ఈ త్రయానికి దాదాపు 300 యేళ్ల ముందరి వాడు (పదిహేనవ శతాబ్దం). సంగీత వాతావరణమున్న కుటుంబంలో పెరిగిన మీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదేమో.

    ఒక కళను ఆస్వాదించిన మనసు వేరొక కళ చేత ప్రేరణ చెందే అవకాశముందనటానికి మీ బాల్యజీవితమే నిదర్శనం. ముఖ్యంగా శాస్త్రీయసంగీతానికీ కవిత్వానికీ మధ్య ఇటువంటి సంబంధం యెక్కువగా ఉంటుందనుకుంటాను.

    తెలుగుభాష పట్ల మీకు గల మమకారం ఆఖరి పేరాగ్రాఫ్ లో వ్యక్తమైంది. అందుకు మీరు అభినందనీయులు. మీ సాహితీ ప్రస్థానంలో సక్సెస్ మిమ్మల్ని వరించాలని ఆకాంక్షిస్తున్నాను.

    • మా ఇంట్లో సంగీత త్రిమూర్తుల చిత్రపటం టేప్ రికార్డర్ పైన వుంది. అయితే కారణం తెలియదు కానీ ముత్తుస్వామి కీర్తనలు తక్కువే విన్నాను.

      నిజానికి ఆఖరి పేరగ్రాఫ్ కోసమే ముందుమాట రాసుకున్నాను. లేదంటే ముందుమాట రాసే వుద్దేశ్యం లేకపోయింది. ఇది ప్రముఖ రచయితలు “వసుంధర” గారి సూచన. వారికి అభివందనాలు.

      మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.

      ఇక్కడ ఓ పొరపాటు విన్నవించాలి. శ్యామశాస్త్రి అని రావాల్సిన చోట శ్యామదాసు అని వచ్చింది. (సారంగలో కాదు, నా ముందుమాటలోనే జరిగిన తప్పు). ఇది పాఠకులు గమనించకపోవచ్చు కానీ తప్పు తప్పే. ఎన్ని సార్లు ప్రూఫ్ చదివినా ఇది కన్నుగప్పి తప్పించుకుంది. అందుకు క్షమాపణలతో –

  3. అభినందనలండి,..

  4. జస్ట్ గాట్ ఇట్ ఫ్రెష్ ఫ్రం ప్రెస్…ఆల్ ద బెస్ట్:-)

Leave a Reply to అరిపిరాల సత్యప్రసాద్ Cancel reply

*