రాలిపోయిన కాలం

ఎమ్వీ రామిరెడ్డి

ఎమ్వీ రామిరెడ్డి

మిగిలిపోయిన గాయాల గురించి

బెంగలేదు

పగుళ్లిచ్చిన కలల గురించి

పశ్చాత్తాపం లేదు

ముళ్లను కౌగిలించుకోబట్టే

పాఠాలు బోధపడ్డాయి

కళ్లు నులుముకున్న ప్రతిసారీ

నిప్పులకుంపట్లు బయటకు దూకేవి

అధ్యాయాల్ని ఔపోసన పట్టడానికి

తెల్లవారుజాముల్లో ఎన్నెన్ని మరణాలు

చీకటితెరల్ని చించుకుంటూ

వెలుగుపొరల్ని కౌగిలించుకుంటూ

చచ్చుబడిన కణాలను నిద్రలేపిన గుర్తులు`

అక్షరాలు అలసిపోయేదాకా

పరుగుపందెం ఆపబుద్ధి కాదు

pablo-picasso-paintings-0004

గుండెలమీద రెపరెపలాడే పేజీలు

దేహాత్మలోకి వెన్నెలదృశ్యాల్ని దించుతున్నప్పుడు

చుట్టూ సూర్యకిరణాల పరిభ్రమణం

ఎటు చూస్తే అటు ఓ విశాల బాట

మైలురాళ్ల వెంట ఆహ్వానతోరణాలు

తీరం చేరిన ప్రతిసారీ ఒక విజయోత్సవం

పరుగెత్తే మోహంలో

ఏమేం పోగొట్టుకున్నానో గుర్తించలేక

రాలిపడుతున్న చంద్రుళ్లను ఏరుకుని

మళ్లీ ఒంటికి అతికించుకోలేక

ధ్వంసమైన క్షణం మళ్లీ కొరడా ఝళిపిస్తుంది

రాలిపోయిన కాలాన్ని ఏ రూపంలో ఏరుకోవాలి

వెంట నిలబడటమా

వెన్నెముకను వదులుకోవటమా

అంటిపెట్టుకుని అంటకాగటమా

ఆరిపోయిన దీపాలను వెలిగించటమా

 గాయాల్లోంచి సన్నగా వేణుగానం

కలల కారడవుల్లో హరితకాంతి

పాఠాల పునశ్చరణలో నూతనశకం

– ఎమ్వీ రామిరెడ్డి

మీ మాటలు

  1. తిరుపాలు says:

    కవిత అద్బుతం!
    నిండైన కవిత్వం!
    చచ్చుబడిన కణాలను నిద్రలే పుతుమ్ది !
    ధ్వంసమైన క్షణం మళ్లీ కొరడా ఝళిపిస్తుంది
    మళ్లీ మళ్లీ చదివిస్తుంది!

  2. రామిరెడ్డి గారూ!

    రెండు కారణాలవల్ల మీ కవిత నాకు బాగా నచ్చింది.
    1. Natural and spontaneous outflow of the thoughts .
    2. Uniform spread of poetry in the poem . దాదాపు ప్రతి పంక్తిలో కవితా న్పర్శ వుంది.
    మంచి కవితను అందించినందుకు అభినందనలు.

  3. రవి వీరెల్లి says:

    ఎమ్వీ గారు,
    చక్కని కవిత.
    అభినందనలు!

    రవి

  4. Beautiful poem. Thank you.

Leave a Reply to తిరుపాలు Cancel reply

*