లెక్కల చిక్కు “రుణం”

మరో వుత్తమ కథ చూద్దాం. ఇదో అప్పు కథ. విలువల కథ. వంశగౌరవాల కధ. పరువు-ప్రతిష్టల కథ.

సారధి అనే కథకుడు తను పని చేస్తున్న ఒక ప్రభుత్వరంగ సంస్థ తను ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పుని తీర్చగలిగే స్థితిలో వుండి కూడా  వాయిదాకోసం ప్రయత్నించడం గురించి ఆవేదన చెందిన కథ. తను చిన్నప్పుడు బూట్లు ఎరువు తీసుకుని అవి పాడైపోతే వాటి ఖరీదు కట్టి ఇవ్వలేక పడ్డ ఆవేదన కథ. ఆ మిత్రుడు  మాధవరావుని కలిసి, దాదాపు ముప్పయ్యేళ్ల తర్వాత, క్షమాపణ కోరి తన “విలువల్ని” కాపాడుకున్న కథ. క్షమాపణ తర్వాత సారధి “మనస్సు ఉతికిన బట్టలా తేలిక అయ్యింది” అనుకుంటాడు. వెంటనే “కుటుంబాల నుండి, వంశాలనుండి,  వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది” అంటాడు. “విలువలు మారుతూనే ఉంటాయి. అయితే మారకూడని విలువలు కూడా వుంటాయి” అంటాడు. కథ చదివిన తర్వాత మనకొక ప్రశ్న వస్తుంది. ఎన్ని కష్టాలైనా పడి అప్పు తీర్చి తీరాలన్నది ఎలా “మారకూడని విలువ” అవుతుంది? దీనికి సమాధానం దొరకాలంటే మనం “అప్పు” పునాదిని పరిశీలించాలి. అప్పుకి మూలం అసమానత.  అవసరానికి మించిన డబ్బు, కేవలం మారక మాధ్యమం(Exchange Medium) ఒక చోట, అవసరాలకి సరిపోని ఆదాయం ఒక చోట వుండడం వల్ల అప్పు ఒక అవసరంగా వచ్చి ఆయుధంగా తయారౌతుంది.

జీవనోపాధికి అవసరమైన భూమి కొద్దిమంది చేతుల్లో వుండిపోవడంతో ఎంతోమంది కూలీలుగా, బీదవారుగా మిగిలిపోయేరు, కనీస అవసరాల కోసం వారు ఆదాయం చాలక, అప్పుపై ఆధారపడ్డారు. వాడకం సరుకుల వ్యాపారంతో పాటు మారకం సరుకు వ్యాపారం కూడా మొదలైంది. మొదటి దాంట్లో మిగులు ని “లాభం” అంటే రెండో దాంట్లో మిగులుని “వడ్డీ” అన్నారు. సాధారణంగా, అప్పులు తీసుకొనేది బీదవారు కాబట్టి వారి దగ్గర గోళ్లూడగొట్టి వసూలు చేసుకోవడం అవసరమైంది. దండోపాయం ప్రతీసారి కష్టమూ, ఖర్చూ  కాబట్టి

భేదోపాయంగా, అప్పు తీర్చి తీరాలన్న దాన్ని ఒక ఆదర్శంగా, విలువగా ప్రచారం చేసారు. ఈ “విలువ” పూర్తిగా “మిగులు” వున్న శ్రేణులకి, మధ్య తరహా శ్రేణికి వుపయోగపడేదే. భూస్వామ్య సమాజంలో అది ఒక నీతి. ఒక విలువ. ఒక ఆదర్శం. పతిభక్తి, రాజభక్తి, వర్ణాశ్రమ ధర్మం, కుల కట్టుబాటు వగైరా ఎన్నో విషయాల్లాగే ఇదీ ఒక భేదోపాయం.

వ్యవసాయం మీద ఎక్కువమంది ఆధారపడినప్పుడు సమాజం చిన్న సమూహాలుగా (గ్రామాలుగా) వుంటుంది. అక్కడ భూస్వామ్య సమాజపు నీతులు, ఆదర్శాలు, విలువలు చలామణి అవుతాయి. ఎన్ని కష్టాలు పడి అప్పు తీరిస్తే అంత నీతిమంతుడుగా,  పరువుగలవాడుగా సాగే ప్రచారం. చిన్న సమూహంలో ఈ విషయాన్ని మరింత ఘనీభవింప చేసి సంఘ భయాన్ని సృష్టిస్తుంది. సారధి తండ్రి కూడా ఆ సమాజంలోనే  జీవించారు. ఆ విలువల మధ్యనే పెరిగేడు అందుకే షావుకారుకి మళ్లీ నోటు రాశాడు. అప్పు తీర్చేడు. మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే సారధి తండ్రితో పాటు చాలామంది అలా నోట్లు రాసి ఇచ్చే వుంటారు. షావుకార్లు సారధి తండ్రితో పాటు ఇంకా ఎంతో మందికి  అప్పులిచ్చే వుంటారు. అది వాళ్ల వృత్తి. వాళ్లలో మిగిలిన వాళ్లు కూడా నోట్లు ఇచ్చే వుంటారు. లేకపోయి ఉంటే, ఆ చిన్న సమూహంలో కొంత అల్లరి,అలజడి. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే వుండాలి. షావుకార్లు అంత తొందరగా వూరుకోరు. అగ్నిప్రమాదం జరిగినపుడు కేవలం సారధి తండ్రి నోటు ఒక్కటే కాలిపోవడం అనేది మనం నమ్మగలిగే విషయం కాదు. దీన్నేదో చాలా గొప్ప విషయంగా”కుటుంబాలు, వంశాలు” అని రాయడం కొంత ఆదర్శరీకరణే. పౌరాణిక పద్ధతే. దీంట్లో వంశాలు, కుటుంబాలు, గౌరవాలు ఏమీ లేవు. కొన్ని కుటుంబాలు , వంశాలు నీతి గలవనీ గొప్పవనీ కొన్ని కావనీ అర్దం వచ్చేలా రాయడం అంటే వర్ణ వర్గ వ్యవస్ఠని సమర్ధించడమే.

60ల్లో  శ్రీకాకుళంలోని గిరిజన ప్రాంతాల్లో అప్పులు తీర్చ  వద్దంటూ కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేసింది. పార్టీని అనుసరించిన గిరిజనులందరూ సొండీల, శావుకార్ల అప్పుని తీర్చారు. పార్టీ ప్రచారం  కంటే సంఘభయం ఎక్కువ పని చేసింది. ఈ రోజుకి కూడా అడవులు, కొండల్లో వుండే గిరిజనులు అప్పులు తప్పక తీరుస్తారు. “మళ్లీ ఇస్తాడు కదా షావుకారు” అనేది వాళ్ల సమాధానం. ఇప్పటికి కూడా, వ్యాపార సమాజపు నియమాలు పూర్తిగా ఎక్కని కొన్ని శ్రేణులు, స్త్రీలు, కూలీవారు, వగైరాలు అప్పులు తప్పక తీరుస్తారన్నది డ్వాక్రా అప్పులు, ఇందిరమ్మ ఇళ్ల అప్పులు చరిత్ర చదివిన వారికి స్పష్టమౌతుంది. సారధి పని చేసే ప్రభుత్వరంగ సంస్ధకి ఈ నీతి వర్తించదు. ఈ సూత్రాలు పనికి రావు. అదొక వ్యాపార సంస్థ. పెట్టుబడిదారీ సమాజ సూత్రాలు వేరు. అక్కడ లాభం ఒక్కటే ప్రధానం.  మిగతావేవీ వర్తించవు. కథలో చూస్తే ప్రభుత్వం ఇచ్చినది వడ్డీలేని అప్పు. ఈ డబ్బు సంస్థలో వున్నంత కాలం దాన్ని మదుపుల్లో పెట్టడానికి(Investments) వాడుకోవచ్చు. ఎక్కువ సరుకు (Stock) వుంచి డీలర్లపై రుద్ది అమ్మకాలు పెంచి లాభం గడించొచ్చు. అరువులు ఎక్కువ ఇచ్చి (Debtors) దానిపై వడ్డీ రాబట్టవచ్చు. ధర (Pricing) తమ అదుపులో వుంచుకోవచ్చు. సరఫరాదార్లకి  తక్షణమే ఇస్తామని చెప్పి (Creditors) బేరాలాడి  ధర తగ్గించుకోవచ్చు. స్థిర, చరాస్థులు (కార్మికులకి ఇళ్ళు కట్టడం, బస్సులు కొని రవాణా సౌకర్యం ఏర్పరచడం) కొని జీతాల బిల్లుల్లో కొంత మిగల్చవచ్చు. యంత్రాలు  వగైరా కొనేటప్పుడు DPGలు, LCలు వగైరా కాకుండా నేరుగా నగదు ఇచ్చి బాంకు ఖర్చులు మిగుల్చుకోవచ్చు. ధరలు తగ్గించుకోవచ్చు. ఏదీ కాకుంటే వుద్యోగులకే రకరకాల అప్పులిచ్చి వడ్డీతో సహా జీతాల్లో కోసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా వాడుకునే ప్రతి చర్యా సంస్థ లాభాల్ని పెంచేవే. అందుకే సంస్థ పెద్దలు అప్పు చెల్లింపుని  వీలైనంత కాలం  పొడిగించడానికి ప్రయత్నించడం ఎలా తప్పు అవుతుందీ?. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కథకుడు మాట్లాడుతున్నది ఒక ప్రభుత్వరంగ సంస్థ గురించి. వాటిల్లో వచ్చిన “లాభం” అంతా తిరిగి ప్రభుత్వానికే బదిలీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడా అదే. లాభాలు తిరిగి ప్రభుత్వ పరం కావడమే. నేను చెప్పినవి అస్థి అప్పుల పట్టీ (balance sheet) మీది కనీసపు విషయాలు. నా అవగాహన అంతే. లోతుల్లోకెళ్లి చెప్పగలిగే వాళ్లెంతోమంది వున్నారు. MBAలూ, CA లూ చదివిన వాళ్లు. ఇది అర్ధం చేసుకోలేని సారధి పాతకాలం తూకపు రాళ్లతో విషయాన్ని చూసి వేదన చెందుతాడు.

“ప్రైవేటు రంగానికి ఇచ్చిన రాయితీలు లేదా రుణ మాఫీలతో పోలిస్తే మనలాంటి పబ్లిక్ సెక్టారు పొందేది లెక్కించ దగిందేం కాదు” అన్న సీ.ఎఫ్.ఓ మాటలు సారధికి అర్ధం కాలేదు. అతని ఆలోచనలూ, ఫైనాన్స్ రంగ సూత్రాలకు వ్యతిరేకం. సంతోష్‌కి అతను, నిరాసక్తంగా చెప్పిన కారణాలు. “కొత్త వేతన ఒప్పందం వల్ల  పెరిగే వేజ్ బిల్లు, ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదలయ్యే శివరామపూర్ ప్రాజెక్టుకు మూలధన అవసరాలు, వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో మూతబడబోయే ప్రాజెక్టులవల్ల తగ్గే రాబడి” ఇవేవీ సూత్రాలకి సరిపోవు. వేజ్ బిల్లు లాభనష్టాల ఖాతా వ్యవహారం. అప్పు ఆస్థి అప్పుల వ్యవహారం. కరెంటు బిల్లులు. మొబైల్ బిల్లులు, ఆదాయం (జీతం)లోంచి కడతాం. కొత్త ప్రాజెక్టుకి మూలధనం, ప్రభుత్వంనుంచో లేదా ప్రజలనుంచో తెస్తాం(shares). మూడు సంవత్సరాల తర్వాత రాబడి తగ్గుతుంది కాబట్టి ఈ అప్పు వాయిదా కూడా అప్పుడే కడతాం అనడం హాస్యస్పదం. మూడేళ్లలో నేను రిటైర్ అవుతాను. నా జీతంలోంచి కట్టలేను. పెన్షన్లోంచి కడతాను. కాబట్టి EMIలు అప్పటినుంచి ఇవ్వండి అని బాంకువాళ్లని అడిగి చూడండి. అప్పు వాయిదా కట్టేది నగదు రాబడుల్నించి. అది కేవలం అమ్మకాలు, లాభాలే కానక్కరలేదు. ఇందాక మనం అనుకున్న అనేక మార్గాలున్నాయి. “ఫండ్స్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో చూపించాం” అన్న సారధి  సరిగ్గా ఆలోచించలేదు. సారధి తయారు చేసిన నోట్‌ని సి.ఎం.ఓ తప్పక మార్చి వుంటాడు. క్లుప్తంగానే చెప్పాను. అవసరం అనుకుంటే చర్చిద్దాం.

ఈ సారధి ఆలోచనల్ని “మానవ సంబంధాలకుండే ఆర్ధిక కోణాన్ని కార్పోరేట్ వాతావరణానికి అన్వయించి  చెప్పటం వల్ల మేధను తాకే కథగా రూపొందింది” అని ప్రశంసించడం బృహదాశీర్వచనం. సంస్థకీ,  ప్రభుత్వానికీ మానవ సంబంధాలుండవు. సారధి ఆలోచనల్లో మేధస్సూ లేదు.

ఇంతకీ కథలో ముఖ్యవిషయం. వ్యవసాయ రుణాల మాఫీ. “రెండేళ్ళ క్రితం స్థోమత వుండి అప్పు, వడ్డీ కట్టకుండా, మాఫీతో లాభం పొందినోళ్ళు ఎందరో. ఇదిగో వీడే రెండు లక్షల దాకా మిగుల్చుకున్నాడు” అన్న మాధవరావు తండ్రి మాటలో వున్నది. అవి వాస్తవానికి రచయిత మాటలే. రచయిత ఆవేదనా అదే. 2008లో ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ ప్రకటించినపుడు గోలగా ఒక ప్రచారం జరిగింది. అప్పులు ఎగ్గొట్టే అలవాటుని ఇది తీసుకొచ్చిందనీ, దేశ సంపదనంతా దోచి పెట్టుతున్నారనీ పత్రికలూ, టీవీలూ వగైరా అంతా గగ్గోలుగా చెప్పిన విషయాలు రెండు. దేశంలో కౌలు రైతులు ఎక్కువ వుండడం, కౌలు రికార్డు కాకపోవడం వల్ల  ఈ ౠణమాఫీ కేవలం భూముల యజమాన్లకే సాయపడిందనీ,  నిజంగా వ్యవసాయం చేసిన కౌలు రైతులకి ఏం దక్కలేదనీ. రెండోది రుణం రద్దు వల్ల పెద్ద రైతులకే  లాభం జరిగిందనీ, అర్హత లేనివాళ్లు రద్దు వల్ల లాభపడ్డారనీ. ప్రచారం చేసేవాళ్లు వ్యూహాత్మకంగా చిన్న రైతుల్ని తోడు తెచ్చుకుని వాళ్లకేం దక్కలేదని చెప్పారు.

[su_note] మొదటి దాని గురించి కథలో ఏమి లేదు కాబట్టి రెండు వాక్యాల్లో ముగిద్దాం. కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయ  ఎంట్రప్రెనూర్ లు వాళ్లు చేసేది వ్యవసాయ నిర్వహణ (organisation) పొలంలోకి దిగకుండా, భూమి(Land) కౌలుకు తీసుకొని కూలీల్తో, అవకాశం వున్నచోట యంత్రాల్తో పని చేయించి (Labour), పెట్టుబడి (Capital)  పెట్టి వ్యవసాయం నిర్వహిస్తారు. (Organisation). కూలీల విషయంలో వీళ్లు యజమాని కంటే ఎక్కువ ఘోరంగానే ప్రవర్తిస్తారు. కారణం లాభాపేక్ష. తొందరతొందరగా ఎక్కువెక్కువ లాభం సంపాదించాలన్న ఆకాంక్ష. ఎరువులు కుమ్ముతారు. కూలీల్ని పిండుతారు. పురుగుల మందు విషాన్ని చల్లుతారు. పర్యావరణాన్ని , ప్రజల్ని నాశనం చేసి లాభాలు దండుకుంటారు. ఇదంతా పెట్టుబడిదారీ వ్యవహారం. ఆ సూత్రాలే వీరికీ వర్తిస్తాయి. ఇక కథలో వున్నదీ, రెండోదీ అర్హత లేనివాళ్లు స్థోమత వున్నవాళ్లు రుణం రద్దు పొందారన్నది. నిజంగా ఇది ఆలోచించవలసిన అంశమే. చర్చించవలసినదే. అయితే రచయిత పొసగని అంశాల మధ్య కత్తు గట్టి కథ రాయడం వల్ల కథా శిల్పం, ప్రయోజనం రెండూ దెబ్బతిన్నాయి. విషయమేమిటంటే 2008లో రుణమాఫీ పెద్దలకి పూర్తిగా దోచిపెట్టలేదు. బోల్డు ఆంక్షలు పెట్టింది, రద్దు మొత్తాన్ని ఒక లక్షరూపాయలకు కుదించింది. ఆసక్తి వున్నవాళ్లు రిజర్వు బ్యాంకు సర్కులర్ RB1/2007-08/373 Dt. 19/6/2008 చూడవచ్చు.[/su_note]

నిజమే నష్టాలన్నీ ప్రజల పరం చేసి లాభాలు వ్యక్తుల పరం చెయ్యడం పెట్టుబడిదారీ మనుగడకి అవసరం. వాళ్ల ప్రతినిధిగా వున్న ప్రభుత్వం అదే చేస్తుంది. అమెరికాలో ఫ్రెడ్డీ, ఫానీ, లేమాన్ బ్రదర్స్ లాంటి ఎన్నో సంస్థలు కూలిపోతే, పెద్ద పాక్ఖేజీలు ప్రకటించి వాళ్ల కొమ్ము కాసింది ప్రభుత్వం. కోట్ల కోట్ల డాలర్లతో విదేశీ కంపెనీలు కొన్న కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని, ఎయిర్‌లైన్స్ వుద్యోగులు జీతాలడగితే ‘నా దగ్గర డబ్బుల్లేవ్’ అని నిస్సిగ్గుగా  ప్రకటించి విదేశాల్లో విలాసంగా గడిపేడు. మోడీ, గోయెంకాల్లాంటి ఎన్నో కంపెనీలు అప్పులు ఎగ్గొట్టి వుద్యోగుల జీతాలు ఎగ్గొట్టి BIFR వెనక ఆశ్రయం తీసుకున్నాయి. మన డెక్కన్ క్రానికల్ కథ చూడండి. కనీసం రోజుకొక్క కంపెనీ కథ వస్తుంది పేపర్లో. చాలా చిన్న అక్షరాల్తో. అప్పులు ఎగ్గొట్టడం, దివాలా తియ్యడం పెట్టుబడిదారీలో ఒక సూత్రం. ఒక విధానం

అర్హత లేని స్థోమత వున్న రైతులు రుణం రద్దు వాడుకోకూడదన్న ఆదర్శ ప్రకటన ఎవరి నుద్ధేశించి చేస్తున్నాడు రచయిత. ఆదర్శాల వల్ల, నీతిబోధల వల్ల, ఈ కథలు ఏనాటికీ చదవని పెట్టుబడిదార్లు “ఆత్మప్రబోధం” చేసుకుంటారా?రుణం రద్దు లేకపోయి వుంటే ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు వగైరా వ్యవసాయాధారిత వ్యాపారం ఎంత దెబ్బ తిని వుండేది. బాంకుల డబ్బు ఆగిపోతే వాళ్లు రుణాలివ్వకపోతే కన్స్యూమర్ వస్తువులు ఇనుము, సిమెంటు, గృహనిర్మాణ రంగ పరిశ్రమలు, కార్లు, రకరకాల వాహనాలు తయారు చేసే కంపెనీలూ ఏమై పోతాయి?

ఈ కథ పేరు రుణం.

రచయిత శ్రీ ముళ్లపూడి సుబ్బారావు.

ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి, 8 మే.2011

 

[su_box title=” Banks wrote off over Rs 1 lakh cr in last 13 yrs: Chakrabarty (BUSINESS LINE, BUSINESS STANDARD 19.11.13)”]

RBI Deputy Governor K.C. Chakrabarty has said banks have written off a whopping Rs 1 trillion in the past 13 years and criticised the lenders because as much as 95% of these write—offs were for large borrowers. He said that over 95% of such write—offs have been observed in the case of big accounts and expressed anguish that public discourse focuses only on the government’s agri debt waiver scheme of 2008. “We only talk about the debt waiver of the agricultural borrowers, we don’t say big players and of this (Rs 1 lakh Cr) 95% are all big borrowers and it has been written off,” he said. Chakrabarty was particularly critical of the system of a “technical write-off” by the lenders, saying he does not understand the system. [/su_box]

 

—చిత్ర

మీ మాటలు

  1. Lalitha P. says:

    పదమూడేళ్ళలో ట్రిలియన్ రూపాయలు మాఫీ చేసిన ఆర్ బీ ఐ లెక్క ఏమంత ఆశ్చర్యం కలిగించదు. సంస్కరణలంటే అమెరికన్ తరహాలో పెద్దలకు దోచిపెట్టటం, ఇంకా కొన్నాళ్ళకు వ్యవసాయాన్ని కార్పోరేట్ కు బదిలీ చెయ్యటం. ఇంతగా నడ్డి విరిచిన వ్యవసాయాన్ని కార్పోరేట్ లు ఏ పద్ధతుల్లో లేవనేత్తుతారో కూడా చూడబోతున్నాం.
    పది రూపాయల వడ్డీకి అప్పు చేసి పరమ నిజాయితీ(?)తో వడ్డీ కొంచెమైనా తగ్గించమని రుణదాతను అడగను కూడా అడక్కుండా ఆస్తులమ్మి ఆసలూ వడ్డీ రెండూ తీర్చిన వెర్రి మనిషి తెలుసు నాకు. విలువలూ ప్రతిష్టల పేరుతో ఇలా నాశనమైన వాళ్ళూ ఉంటారు.
    ఈ కథ లింక్ ఇవ్వలేదు.

  2. రమణ మూర్తి says:

    కథ మొదటి భాగంలో ఒక ప్రభుత్వరంగ సంస్థ, తన రుణవాయిదాలని కొన్నాళ్ళ పాటు వాయిదా వేయించుకొని, ఆ కాలానికి వడ్డీ మినహాయింపు పొంది, తద్వారా లాభం పొందాలనుకోవడం స్థూలాంశం. పైన వడ్డించేవాడు ఉన్నప్పుడు, ఎలాంటి కారణాలు చూపించి అయినా ఇది సాధించవచ్చు. ఆ వడ్డించేవాళ్ళు కూడా ఉన్నారని కథలో చెప్పడం జరిగింది. దీనికి బాలెన్స్ షీట్లూ, ప్రాఫిట్ అండ్ లాస్ ఎకౌంట్లూ, బీజీలూ, ఎల్ సీ లూ, డీపీజీలూ – ఈ అంశాల దృష్ట్యా అంత వివరణాత్మకమైన విమర్శ అనవసరమనిపించింది.

    కథలో ప్రస్తావించిన ఇంకొన్ని విషయాల మీద మీ విమర్శ కూడా కొంచెం వాస్తవదూరంగా ఉంది.

    <> ఇక్కడ ఆ ప్రభుత్వరంగ సంస్థ సీ ఎఫ్ ఓ లాభాలని పెంచాలని ఆలోచిస్తున్నది తన స్వప్రయోజనం కోసం. అతను కేవలం దానికోసమే ఈ పని చేయబూనుకున్నాడు గానీ, లాభాలు ప్రభుత్వపరం చేయాలని అతనికి తెలీకనా?

    <> ఎవరి ప్రశంసలో ఇక్కడ ఉదహరిస్తే, ఇది మీ కథావిమర్శ కంటే ఆ తొలి విమర్శకి ప్రతివిమర్శ అవుతుంది!

    <> ఒక పాత్ర చెప్పిన ఈ మాటలు ‘వాస్తవానికి రచయిత మాటలు’ అని మీరు ఎలా నిర్ధారణగా చెప్పగలరు? అదలా ఉంచితే, అవసరం లేని వాళ్ళు కూడా ఈ మాఫీలు పొందడం వాస్తవమే కదా? మాఫీలు వ్యక్తిగతమైన ఇబ్బందుల పరంగా జరిగితే పర్వాలేదు గానీ, రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికగా జరగటాన్ని ఎవరైనా ఎలా హర్షిస్తారు? [మీరు బాంకింగ్ రంగానికి చెందినవారో కాదో తెలీదు గానీ, వీటిల్లో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి..]

    <> రచయిత రాసిన వాక్యం ఇదీ: “కుటుంబాలనండి, వంశాలనండి వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది. ఒక తరం వాళ్ళు పొందిన జ్ఞానాన్ని రెండో తరం వాళ్ళు అందుకోగల్గాలి. కాలంతో పాటు విలువలు మారుతూనే ఉంటాయి. కొన్ని మారి తీరాలి. ఐతే మారకూడని విలువలు కూడా ఉంటాయి” ఈ వాక్యంలో వర్ణాలూ, వర్గాలూ వెతకడం కొంచెం విడ్డూరంగా ఉంది.

    నా ఉద్దేశంలో ఈ కథ లో చెప్పిన విషయాలు మంచివే అయినా, అవి బాగానే చెప్పబడినా – కథ నిర్మాణంలో కొంత గందరగోళం ఉంది. ముగింపు షార్ప్ గా కాకుండా, పాఠకుడికి ‘ఇదీ కథ’ అని వివరించినట్టుగా ఉంది. ఇలాంటి లోపాల మీద మీ వ్యాసం నడిచి ఉంటే బాగుండేది.

    • నమస్తే సార్ బావుంది . చదివినందుకు కృతఙ్ఞతలు రాసినందుకు మరిన్ని . నాకు ఎప్పటినుంచో సందేహం . పాత్రలు మాటల్ని రాసే దేవరు ? నాటకానికీ కథకీ తేడాలేమిటి? కథ ఒక ఉద్దేశం తో రాసేటప్పుడు రచయిత తన ఉద్దేశ్యాలను ఎలా చెప్తాడు? కథలో ఒక కీలక అంశం ఉంటుంది . అక్కడ రచయిత ఉద్దేశం పాఠకుడికి దొరుకుతుంది .దాన్నే మనం కథాంశం అంటాం. సరే గానీ ఈ కథలో కథాంశం ఏమిటి . ఈ కథ ఎందుకు రాయబడింది?
      ఈ పబ్లిక్ డొమైన్ లో వీళ్ళు స్పేస్ ఇవ్వలేక పోవచ్చు నా మెయిల్ ఇద చిత్రామారావు@జిమెయిల్.కం మాట్లాడదాం నిజమే. మీరన్నట్లు విజయ్ మల్లయ , డెక్కన్ క్రానికల్ లకి ఉన్న అర్హత మాధవరావు కి లేక పోవచ్చు. చివర్లో నేను క్లుప్తం గా చెప్పిన వాక్యాలు , బ్యాంకు ల డబ్బు ఆగిపోడం , వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు దెబ్బ తినడం గురించి కొంచెం ఆలోచిస్తే ధన్యుణ్ణి. ఇక సి ఎఫ్ ఓ ఉద్దేశం గురించి కాదు నా చర్చ . రచయిత తన మౌత్ పీసు గా వాడుకున్న సారధి ఆలోచనల లోని అసంగ తత్త్వం గురించి – చాలు దయచేసి మీ మెయిల్ ఇవ్వండి చిత్ర

  3. రమణ మూర్తి says:

    (వ్యాసకర్త ఉదహరించిన భాగాలు కామెంట్ పోస్టయ్యాక మిస్సయ్యాయి. పూర్తి పాఠం మళ్ళీ ఇస్తున్నాను..)

    కథ మొదటి భాగంలో ఒక ప్రభుత్వరంగ సంస్థ, తన రుణవాయిదాలని కొన్నాళ్ళ పాటు వాయిదా వేయించుకొని, ఆ కాలానికి వడ్డీ మినహాయింపు పొంది, తద్వారా లాభం పొందాలనుకోవడం స్థూలాంశం. పైన వడ్డించేవాడు ఉన్నప్పుడు, ఎలాంటి కారణాలు చూపించి అయినా ఇది సాధించవచ్చు. ఆ వడ్డించేవాళ్ళు కూడా ఉన్నారని కథలో చెప్పడం జరిగింది. దీనికి బాలెన్స్ షీట్లూ, ప్రాఫిట్ అండ్ లాస్ ఎకౌంట్లూ, బీజీలూ, ఎల్ సీ లూ, డీపీజీలూ – ఈ అంశాల దృష్ట్యా చర్చ అనవసరమనిపించింది.

    కథలో ప్రస్తావించిన ఇంకొన్ని విషయాల మీద మీ విమర్శ కూడా కొంచెం వాస్తవదూరంగా ఉంది.

    “…అందుకే సంస్థ పెద్దలు అప్పు చెల్లింపుని వీలైనంత కాలం పొడిగించడానికి ప్రయత్నించడం ఎలా తప్పు అవుతుందీ?. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కథకుడు మాట్లాడుతున్నది ఒక ప్రభుత్వరంగ సంస్థ గురించి. వాటిల్లో వచ్చిన “లాభం” అంతా తిరిగి ప్రభుత్వానికే బదిలీ చేస్తారు…”
    ఇక్కడ ఆ ప్రభుత్వరంగ సంస్థ సీ ఎఫ్ ఓ లాభాలని పెంచాలని ఆలోచిస్తున్నది తన స్వప్రయోజనం కోసం. అతను కేవలం దానికోసమే ఈ పని చేయబూనుకున్నాడు గానీ, లాభాలు ప్రభుత్వపరం చేయాలని అతనికి తెలీకనా?

    “…ఈ సారధి ఆలోచనల్ని “మానవ సంబంధాలకుండే ఆర్ధిక కోణాన్ని కార్పోరేట్ వాతావరణానికి అన్వయించి చెప్పటం వల్ల మేధను తాకే కథగా రూపొందింది” అని ప్రశంసించడం బృహదాశీర్వచనం…”
    ఎవరి ప్రశంసలో ఇక్కడ ఉదహరిస్తే, ఇది మీ కథావిమర్శ కంటే ఆ తొలి విమర్శకి ప్రతివిమర్శ అవుతుంది!

    “…ఇంతకీ కథలో ముఖ్యవిషయం. వ్యవసాయ రుణాల మాఫీ. “రెండేళ్ళ క్రితం స్థోమత వుండి అప్పు, వడ్డీ కట్టకుండా, మాఫీతో లాభం పొందినోళ్ళు ఎందరో. ఇదిగో వీడే రెండు లక్షల దాకా మిగుల్చుకున్నాడు” అన్న మాధవరావు తండ్రి మాటలో వున్నది. అవి వాస్తవానికి రచయిత మాటలే…”
    ఒక పాత్ర చెప్పిన ఈ మాటలు ‘వాస్తవానికి రచయిత మాటలు’ అని మీరు ఎలా నిర్ధారణగా చెప్పగలరు? అదలా ఉంచితే, అవసరం లేని వాళ్ళు కూడా ఈ మాఫీలు పొందడం వాస్తవమే కదా? మాఫీలు వ్యక్తిగతమైన ఇబ్బందుల పరంగా జరిగితే పర్వాలేదు గానీ, రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికగా జరగటాన్ని ఎవరైనా ఎలా హర్షిస్తారు? [మీరు బాంకింగ్ రంగానికి చెందినవారో కాదో తెలీదు గానీ, వీటిల్లో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి..]

    “…కొన్ని కుటుంబాలు, వంశాలు నీతి గలవనీ గొప్పవనీ కొన్ని కావనీ అర్దం వచ్చేలా రాయడం అంటే వర్ణ వర్గ వ్యవస్ఠని సమర్ధించడమే…”
    రచయిత రాసిన వాక్యం ఇదీ: “కుటుంబాలనండి, వంశాలనండి వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది. ఒక తరం వాళ్ళు పొందిన జ్ఞానాన్ని రెండో తరం వాళ్ళు అందుకోగల్గాలి. కాలంతో పాటు విలువలు మారుతూనే ఉంటాయి. కొన్ని మారి తీరాలి. ఐతే మారకూడని విలువలు కూడా ఉంటాయి” ఈ వాక్యంలో వర్ణాలూ, వర్గాలూ వెతకడం కొంచెం విడ్డూరంగా ఉంది.

    నా ఉద్దేశంలో ఈ కథ లో చెప్పిన విషయాలు మంచివే అయినా, అవి బాగానే చెప్పబడినా – కథ నిర్మాణంలో కొంత గందరగోళం ఉంది. ముగింపు షార్ప్ గా కాకుండా, పాఠకుడికి ‘ఇదీ కథ’ అని వివరించినట్టుగా ఉంది. ఇలాంటి లోపాల మీద మీ వ్యాసం నడిచి ఉంటే బాగుండేది.

    • సార్ నమస్తే. అవసరం లేని వాళ్ళు అని మీరు అంటున్నది బహుశా పెద్ద రైతులు కౌలు కి ఇచ్చిన యజమానుల గురించి కావచు. ఈ చర్చ మీద చాల పుస్తకాలు వచ్చాయి. రిజర్వు బ్యాంకు ఒక డాక్యుమెంట్ వేసింది .
      సరే ఇక్కడ సి ఎఫ్ ఓ డి చాలా చిన్న స్వార్ధం . ప్రమోషన్ . దానికీ సారధి ఆలోచనలకీ లింక్ ఉన్నదా? సారధి ఆలోచనా విధానం ఎలా సరి అయినది? ఏ సూత్రాల ప్రకారం సరి అయినది. నేను చేసిన తప్పు ఏమిటి? దయ చేసి చెప్పండి. 9030889473 చిత్ర

  4. ” నా అవగాహన అంతే. లోతుల్లోకెళ్లి చెప్పగలిగే వాళ్లెంతోమంది వున్నారు. MBAలూ, CA లూ చదివిన వాళ్లు. ఇది అర్ధం చేసుకోలేని సారధి పాతకాలం తూకపు రాళ్లతో విషయాన్ని చూసి వేదన చెందుతాడు.”

    వీళ్లు పెట్టుబడి దారి స్వభావంతో లెక్కలు చెప్పటంలో ఎక్స్‌ పెర్ట్‌ కావచ్చు. ఈ కధను విశ్లేషించటాకి తాత్వికత ఎక్కడనుండి వస్తుంది? మంచి సమీక్ష.Thanks.

  5. Sivakumar Tadikonda says:

    “ఎన్ని కష్టాలైనా పడి అప్పు తీర్చి తీరాలన్నది ఎలా “మారకూడని విలువ” అవుతుంది?” అంటారు చిత్రగారు రెండవ పేరాలోనే! (చిత్రగారికి అప్పులిచ్చిన, ఇవ్వబోయే వాళ్లందరికీ – బహుపరాక్! ;-)) ఇది కథకు సంబంధించిన అంశంగాక చిత్రగారి అభిప్రాయమవడంవల్ల సమీక్ష మొదట్లోనే పక్కదారి పట్టినట్లయింది. వేరే కారణాలవల్ల కథ ఆశించినంత ఉత్తమంగా లేకపోవచ్చుగానీ, కొన్ని అంశాలని సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత నిజంగా స్వీకరించిన కొన్ని యుగాల తరువాత ఆ అంశాన్ని పట్టుకుని ఈ కథ ఎలా ఉత్తమ కథ అయింది అని ప్రశ్నించడం సమంజస మనిపించలేదు. తరువాతి నాలుగు పేరాలూ అసలు అప్పు అనేది ఎలా మొదలయింది, దాన్నసలు తీర్చాలా వంటి అంశాలమీద వివరణతో నిండివున్నాయి.
    “భేదోపాయంగా, అప్పు తీర్చి తీరాలన్న దాన్ని ఒక ఆదర్శంగా, విలువగా ప్రచారం చేసారు. ఈ “విలువ” పూర్తిగా “మిగులు” వున్న శ్రేణులకి, మధ్య తరహా శ్రేణికి వుపయోగపడేదే. భూస్వామ్య సమాజంలో అది ఒక నీతి. ఒక విలువ. ఒక ఆదర్శం. పతిభక్తి, రాజభక్తి, వర్ణాశ్రమ ధర్మం, కుల కట్టుబాటు వగైరా ఎన్నో విషయాల్లాగే ఇదీ ఒక భేదోపాయం.” అని నాలుగవ పేరాలో అన్న తరువాత, శ్రీకాకుళంలోని గిరిజన జాతులగూర్చి చెప్పి, “ఈ రోజుకి కూడా అడవులు, కొండల్లో వుండే గిరిజనులు అప్పులు తప్పక తీరుస్తారు. “మళ్లీ ఇస్తాడు కదా షావుకారు” అనేది వాళ్ల సమాధానం. ఇప్పటికి కూడా, వ్యాపార సమాజపు నియమాలు పూర్తిగా ఎక్కని కొన్ని శ్రేణులు, స్త్రీలు, కూలీవారు, వగైరాలు అప్పులు తప్పక తీరుస్తారన్నది డ్వాక్రా అప్పులు, ఇందిరమ్మ ఇళ్ల అప్పులు చరిత్ర చదివిన వారికి స్పష్టమౌతుంది.” అంటారు. భూస్వామ్య సమాజపు విలువలని పూర్తిగా వంటపట్టించుకోని గిరిజనులు కూడా అప్పులు తీర్చడమనేది వాళ్ల బతకనేర్చిన తనాన్ని చాటి చెబుతుంది. సుమతీ శతకకారుడన్న “అప్పిచ్చువాడు, …” ఆ పద్యంగూర్చి వినని వాళ్లుకూడా దాపుల్లోవుంటే బావుంటుంది అనేది మనుషులు “నేర్చుకున్న” విషయం.
    ఆరవ పేరాలో ఒక ముఖ్య విషయాన్ని చిత్రగారు చెబుతారు – “ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కథకుడు మాట్లాడుతున్నది ఒక ప్రభుత్వరంగ సంస్థ గురించి. వాటిల్లో వచ్చిన “లాభం” అంతా తిరిగి ప్రభుత్వానికే బదిలీ చేస్తారు. … ఇది అర్ధం చేసుకోలేని సారధి పాతకాలం తూకపు రాళ్లతో విషయాన్ని చూసి వేదన చెందుతాడు.”
    సారథి అవగాన లోపాన్నెత్తిచూపడానికి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ – ఇది ఏ కాలపు తూకపు రాళ్లకీ సరిపోదు గనుక. ఈ లోపాన్ని సవరించడానికి రచయిత ఒక ప్రైవేట్ రంగ సంస్థలోని ఉద్యోగిగా సారథిని చిత్రించివుండవచ్చు. అయితే, ఇక్కడ ఆలోచించవలసిన విషయం, కథలోని అన్ని పాత్రలూ సహేతుకంగా, ప్రపంచంలోని అన్ని విషయాలనీ ఆకళింపుచేసుకుని, పూర్తిగా అర్థంచేసుకునే ప్రవర్తించాలా అనేది. ఏ విషయంగూర్చి అయినా – అది కాపిటలిజం గావచ్చు, కమ్యూనిజం గావచ్చు, మతంగావచ్చు, ప్రతీ ఒక్కరి అవగాహనకీ ఇంకా తావుంటుంది. కాకపోయుంటే ఏ అంశంమీద అయినా కొన్ని వేల పుస్తకాలు వచ్చివుండేవి కావు.
    “అర్హత లేని స్థోమత వున్న రైతులు రుణం రద్దు వాడుకోకూడదన్న ఆదర్శ ప్రకటన ఎవరి నుద్ధేశించి చేస్తున్నాడు రచయిత.” అని ప్రశ్నిస్తారు చిత్రగారు చివర్లో. ప్రశ్నలోనే జవాబు దాగివుందిగదా! అయితే, ఆ జవాబు వారికి నచ్చదన్న విషయం తరువాతి రెండువాక్యాల్లో స్పష్టమవుతుంది. “ఆదర్శాల వల్ల, నీతిబోధల వల్ల, ఈ కథలు ఏనాటికీ చదవని పెట్టుబడిదార్లు “ఆత్మప్రబోధం” చేసుకుంటారా?రుణం రద్దు లేకపోయి వుంటే ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు వగైరా వ్యవసాయాధారిత వ్యాపారం ఎంత దెబ్బ తిని వుండేది. బాంకుల డబ్బు ఆగిపోతే వాళ్లు రుణాలివ్వకపోతే కన్స్యూమర్ వస్తువులు ఇనుము, సిమెంటు, గృహనిర్మాణ రంగ పరిశ్రమలు, కార్లు, రకరకాల వాహనాలు తయారు చేసే కంపెనీలూ ఏమై పోతాయి?” (ఋణం రద్దుచెయ్యడంవల్ల లాభించేదెందరో చెప్పారు. కానీ, ఆ “మాఫీ” ముల్యాన్ని చెల్లించేది సమాజంలో టాక్స్ కట్టే ప్రతీ వ్యక్తీ. పైగా, ఆ డబ్బు ప్రభుత్వం చెయ్యవలసిన కొన్ని పనులకి లోటు మిగులుస్తుంది, లేక చేస్తున్న కొన్ని కార్యక్రమాలని ఆపివెయ్యవలసి వస్తుంది. ఇట్స్ ఎ జీరో సం గేం. అది చిత్రగారు గమనించారా?) ఈ రెండువాక్యాలవల్లా, ఈ కథమీద చిత్రగారి వ్యాసాన్ని అభిప్రాయమని – అదికూడా భిన్నాభిప్రాయమని మాత్రమే – అనగలం తప్ప సమీక్ష అనిగానీ, విశ్లేషణ అనిగానీ అనలేం. అలాగే, ఈ వ్యాసం ఆధారంగా “రుణం” ఉత్తమ కథ కాదని కూడా అనలేం.

    • బావుంది దేశం లో అందరూ టాక్స్ పెయర్స్ అయితే ఎంత బాగుండు? టాక్స్ లు ఎన్ని రకాలు/

మీ మాటలు

*