రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి…!

మీ చేతుల్లో ఉన్న మూడు కథలకీ ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ఫోను కథలు. అది కూడా మొబైలు ఫోను. ఒక విధంగా చెప్పాలంటే ఇవి సాహిత్యాన్ని రియలిజం నుంచి వర్చువల్ రియలిజంకి తీసుకువెళ్తున్నాయని కూడా చెప్పవచ్చు. అంతేనా? అంత మాత్రమే అయితే వీటి గురించి మాట్లాడడానికి నాకేమంత ఉత్సాహముండేది కాదు. పైకి పూర్తిగా ఇప్పటి కథల్లా కనిపిస్తున్నప్పటికీ, వీటిలో కాలానికి అతీతమైన కొన్ని మూల్యాల ప్రతిపాదన వుందనిపించింది. అదేమిటో నాకు నేను అర్థం చేసుకునే ప్రయత్నంలోంచే ఈ నాలుగు మాటలూ.

2
స్కైబాబ గురించి నాకట్టే తెలియదు. ఆయన రచనలు కూడా నేనేమంత పెద్దగా చదవలేదు. ఈ కథలు చదవమని ఇచ్చినప్పుడు ఆయన తక్కిన రచనలు కూడా ఇమ్మని అడిగాను. ‘జగనే కీ రాత్: ముస్లిం కవిత్వం’ (2005), ‘అధూరె: ముస్లిం కథలు’ (2011)తో పాటు అతడు సంకలనం చేసిన ‘వతన్ : ముస్లిం కథలు’ (2004) పుస్తకాలు ఇచ్చాడు. అతడి కవిత్వం, కథలతో పాటు వాటిమీద నేటికాలపు తెలుగు కవులూ, రచయితలూ, విమర్శకులూ రాసిన అభిప్రాయాలన్నీ చదివాను. ముఖ్యంగా వతన్ సంకలనానికి రాసిన విపులమైన సంపాదకీయం కూడా చదివాను. ఇవన్నీ ఆయన ఆవేదననూ, అభిప్రాయాల్నీ చాలా సూటిగా వివరిస్తున్నవే. అయితే ఈ సంకలనంలో ఉన్న మూడు కథల్నీ అర్థం చేసుకోవడానికి ఇవేవీ నాకు చాలవనిపించింది.
నాకు స్కైబాబ గురించి మరింత తెలుసుకోవాలనిపించింది. జగనే కీ రాత్ సంపుటిలో ఖదీర్‌బాబు రాసిన ఒక వ్యాసముంది. అందులో ఖదీర్ ఇలా రాసాడు:
”స్కైబాబది నల్గొండ. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కేశరాజుపల్లి. దారుణమైన పేదరికం. ఏదైనా పని చేసి ఇంటికి సాయపడదామనుకుని స్నేహితుడితో కలిసి బట్టల వ్యాపారం చేసాడు. కిరాయి సైకిళ్లు తిప్పాడు. సోడాలు కొట్టాడు. పీర్‌లెస్ ఏజెంట్ అయ్యాడు. అద్దె పుస్తకాల షాపు నడిపాడు. పాన్‌లు కట్టాడు… ఎక్కడా ఆదాయం రాలేదు. పైగా ఎదురు నష్టం, అప్పులోళ్ళకు మొఖం చూపించలేక దాక్కుని తిరగడం, ఇంటికెళ్ళడానికి మొఖం చెల్లకపోవడం.
ఈ పేదరికం కంటే కూడా స్కైబాబను ఎక్కువ బేచైనీకి గురి చేసింది తమ ఇళ్ళల్లో ఉండే ఆడబిడ్డలు. వీళ్ళందరూ చదువుల్లేక జ్ఞానం లేక తినడానికి తిండి లేక చేయడానికి కుదురైన పనిలేక పెళ్ళిళ్ళు లేక ఈసురోమంటూ ఉండేవాళ్ళు. వాళ్ళను చూసే కొద్దీ స్కైబాబలో దుఃఖం సుడి తిరిగేది. దానిని బలంగా వ్యక్త పరచాలని అనిపించేది..”
ఈ నేపథ్యం స్కైబాబమీద నాకెంతో గౌరవాన్ని కలగచేసింది. ఇటువంటి నేపథ్యాలు ఎంతోమందికి ఉన్నా అందరూ రచయితలు కాలేరు. కొద్దిమంది మాత్రమే గోర్కీలూ, భరద్వాజలూ, స్కైబాబలూ కాగలుగుతారు.
ఇటువంటి నేపథ్యం ఉన్న రచయిత రాసిన కథలు కావడంతో ఈ మూడు కథలూ నాకెంతో విలువైన కథలనిపించాయి. ఆ విలువ కేవలం సాహిత్య విలువ కాదు, లేదా అతడి కథలమీదా, కవిత్వం మీదా అభిప్రాయాలు రాసిన రచయితలు భావిస్తున్నట్టుగా సమకాలీన ముస్లిం జీవిత సందర్భాన్ని చిత్రించడంలోని వాస్తవికత వల్ల మాత్రమే కాదు.
అసలు ఏ రచయిత అయినా తనకు తెలిసిందీ, తన అనుభవంలోకి వచ్చిందీ రాసినప్పుడు మాత్రమే విశ్వసనీయంగా ఉంటాడు. అది రచయిత ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి అటువంటి వాస్తవికతకి నేనెటువంటి అదనపు విలువనూ ఆపాదించలేను. మన సమాజంలో అల్పసంఖ్యాకులుగా, బీదరికంలో, సామాజికంగా అప్రధానీకరణకు లోనవుతున్న తెలుగు ముస్లిం జీవితాల్ని ఆ సమాజం నుంచే వచ్చిన ఒక రచయిత స్వానుభవంతో చిత్రించడం మనం రెండు చేతుల్తోనూ స్వాగతించదగ్గ విషయమే కానీ, ఆ ఒక్క కారణం వల్లనే ఆ సాహిత్యం ప్రీతిపాత్రం కానేరదు.
రచయిత ఏదైనా చెప్పనివ్వు. ఏదైనా చిత్రించనివ్వు. కాని ఒక కథ వార్తా కథన స్థాయిని దాటి సాహిత్య స్థాయిని అందుకోవడానికి నిలబడవలసిన ప్రమాణాలు వేరే ఉన్నాయి. ఆ ప్రమాణాల్లో అందరూ మాట్లాడేది శిల్పం గురించి. శిల్పమంటే, ఒక కథలో ఉండే వివిధ అంశాలు ఒకదానికొకటి ఎంత సౌష్టవంగా అమరాయన్నది. సాంకేతికంగా ఆ కథ ఎంత శక్తివంతంగా ఉందనేది. నిస్సందేహంగా తక్కిన కథల్నుంచి గొప్ప కథకుల్ని వేరు చేసేది, ఈ శిల్ప సామర్థ్యమే, సందేహం లేదు. కాని గొప్ప కథలన్నీ మనల్ని ముగ్ధుల్ని చేయాలని లేదు. మంచి కథలన్నీ మనని వెంటాడే కథలు కాలేవు. ఒక కథ మనల్ని మరీ మరీ మరీ వెన్నాడుతోందంటే అందులో ఏముందన్నట్టు?
ఒక కథ మనల్ని వెంటాడుతోందంటే, ఆ కథ చదివినప్పుడు మనలో ఏదో జరిగినట్టు. అది మనలో ఏదో సున్నితమైన రసాయనాల్ని విడుదల చేస్తుంది. దాన్నే జాయిస్ ‘ఎపిఫనీ’ అన్నాడు. ఎపిఫనీ యథార్థానికి మతపరమైన, ఆధ్యాత్మికమైన అర్థంలో వాడబడే పదం. దానికి జాయిస్ ఒక లౌకిక, సాహిత్యార్థాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. ‘..అది మనిషిలో అకస్మాత్తుగా సంభవించే ఆత్మిక పరివర్తన’ అన్నాడతడు.
మరో విధంగా చెప్పాలంటే దాన్ని సాక్షాత్కారం అనవచ్చు. మానవ సంబంధాల్లోనో, జీవిత గమనంలోనో ఒక సంఘటన లేదా ఒక సంభాషణ మనల్ని అకస్మాత్తుగా జీవిత మూలాలకు చేరువగా తీసుకుపోతుంది. దాన్నే జాయిస్ The whatness of a thing  అన్నాడు. అతడిట్లా రాసాడు:
This is the moment which I call epiphany.. when the relation of the parts (of an art object) is exquisite…its soul, its whatness leaps to us from the vestment of its appearance. The soul of the commonest object, the structure of which is so adjusted, seems to us radiant. The object achieves its epiphany.
ek kahaani ke theen rang
స్కైబాబ మనముందుంచిన మూడు కథల్లోనూ ఇటువంటి ఎపిఫనీనే మనం పొందుతున్నామని అర్థమవుతుంది. ‘మౌసమీ’ లో కథకుడు ఆఫ్రీన్‌ను చూసినప్పుడూ ‘జమీలా’ లో జమీలా కథకుడితో తన జీవితం మళ్ళా చిగురిస్తోందని చెప్పినప్పుడూ, ‘మిస్ వహీదా’లో వహీదా కూతురు ఫొటోలో ఉన్నామె తన తల్లి వహీదా అని చెప్పినప్పుడూ కథకుడు ఏ సాక్షాత్కారానికి లోనయ్యాడో ఆ సాక్షాత్కారానికి మనం కూడా లోనవుతాం.
కథల్లో ప్రధానంగా ఉండవలసింది ఇది. తక్కిన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల గురించిన చర్చ, ఆవేదన కథకి అదనపు బలాన్నివ్వగలవు తప్ప నేరుగా మనలో అటువంటి హృదయ పరివర్తనను తేలేవు.
3
ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసిన విషయమొకటి ఉంది. అది ఈ కథల్లో కనవచ్చే ఆదర్శలక్షణం. ఈ కథలు చదవగానే నాకు వెంటనే ప్రేమ్‌చంద్ రాసిన ‘సాల్ట్ ఇన్సపెక్టర్’ (1910) గుర్తొచ్చింది. దుర్భరమైన జీవిత వాస్తవం ఎదట దాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించవలసిన బాధ్యత తెలిసినవాడై కూడా ప్రేమ్‌చంద్ ఆ కథని ఎంతో ఆదర్శవంతంగా ముగించాడు. ఎందుకని? బహుశా అది రచయిత జీవస్వభావం వల్ల అనుకోవలసి ఉంటుంది. మానవుడి పట్ల అపారమైన ప్రేమ, దయ ఉన్నందుకు వాళ్ళు ఆ కథల్ని మరోలా రాయలేదు.
గోర్కీ రాసిన ‘ఇరవయ్యారు మంది పనివాళ్ళూ, ఒక స్త్రీ’ (1899) కథ చూడండి, అది భయంకరమైన జీవిత వాస్తవం మనుషుల్నెట్లా మృగాలుగా మారుస్తుందో చెప్పిన కథ. కాని ప్రేమ్‌చంద్ అట్లా రాయలేకపోయాడు. ఎందుకని? గోర్కీకి మనుషుల పట్ల ప్రేమ, దయ తక్కువేమీ కాదే! నేనేమనుకుంటానంటే, గోర్కీ వ్యక్తుల్ని ద్వేషించకుండా వ్యవస్థని ద్వేషిండమెట్లానో నేర్చుకున్నాడు. ప్రేమ్‌చంద్ వ్యక్తుల్ని ద్వేషించలేక పోతున్నాడు కాబట్టి వ్యవస్థను సంస్కరించడమెట్లా అని ఆలోచిస్తున్నాడు.
ఈ కథల్లో స్కైబాబ చేసింది కూడా ఇదే. ఇప్పటి సమాజంలో మొబైల్ ఫోను మనుషుల్లోని అతృప్త ఆకాంక్షలను చల్లార్చే ఒక కన్స్యూమరిస్టు సాధనం. కాని చాలామందికి అది విముక్తి సాధనం కూడా. అది నువ్వున్నచోటే, నీ పరిమితుల్ని దాటి విశాల ప్రపంచంతో కనెక్ట్ కాగలిగే అవకాశాన్నిస్తుంది. అటువంటి అవకాశాల్లో రిస్క్ కూడా ఉంటుంది. మౌసమీ, జమీలా, వహీదాలతో మాట్లాడే అవకాశం దొరికిన ప్రతి ఒక్కరూ ఈ కథల్లో కథకుడు ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తారన్న హామీ ఏమీ లేదు. కాని కథకుడు ఆయా అభాగ్య స్త్రీల పట్ల తన ప్రవర్తనలో అపారమైన ఆదర్శభావాన్ని చూపడమే ఈ కథల్లోని అత్యంత విలువైన అంశం. శతాబ్దం కిందట ప్రేమ్‌చంద్ కనపరచిన ఆదర్శవాదమే ఇప్పటి సమాజంలో ఎదట కూడా కథకుడు కనపర్చడం నన్నెంతో విస్మయపరిచిన మాట నిజమే కాని అంతకన్నా ఎక్కువ సంతోషమే కలిగించిందనాలి.
                                    వాడ్రేవు చినవీరభద్రుడు

మీ మాటలు

 1. ఇది చక్కని అవగాహనతో, విశిష్టమైన రచనా సంవిధానంతో రాసిన సమీక్షావ్యాసం అని తెలుస్తూనే వుంది. మూడవ భాగంలోని రెండవ పేరాలో మీరు చెప్పింది మీ నిశిత పరిశీలనా దృష్టికి నిదర్శనం. అభినందనలు. అయితే ఇక్కడ నాదో చిన్న సందేహం. శిల్పానికీ భాషకూ సంబంధం లేదంటారా? భాష కూడా శిల్పాన్ని ప్రభావితం చేసే ఒక అంశం కాదంటారా?

 2. ” గోర్కీ వ్యక్తుల్ని ద్వేషించకుండా వ్యవస్థని ద్వేషిండమెట్లానో నేర్చుకున్నాడు. ప్రేమ్‌చంద్ వ్యక్తుల్ని ద్వేషించలేక పోతున్నాడు కాబట్టి వ్యవస్థను సంస్కరించడమెట్లా అని ఆలోచిస్తున్నాడు.”
  ఈ బావం లేక వాక్య నిర్మాణం నాలో ఒక ఆత్మ సాక్షాత్ కారాన్ని కలిగించి నట్లుంది.

  • – అంటే సంస్కరణ వాదానికి అభ్యుదయ వాదానికి తేడా!

 3. mercy margaret says:

  మంచి విశ్లేషణ సర్ .. తప్పక చదవాలనే ఉత్సాహం కలిగించారు ..

 4. గత రెండు మూడేళ్ళుగా భధ్రుడు మెచ్చని ముస్లిం రచయిత లేడు. సాహిత్య పీఠాధిపతులు ఆత్మ రక్షణలో పడ్డారేమో.

 5. నాగన్న says:

  ఇరవై సంవత్సరాలుగా, ఓ పదకొండు ఊళ్ళకు, మూడు దేశాలకు నాతో పాటు నా గైడీ మపాసా కధల పుస్తకం వెంట వస్తూనే ఉంది. ఇప్పుడు దానికి ఏక్ కహానీ కె తీన్ రంగ్ తోడవుతుంది… తప్పక చదవాల్సిన పుస్తకం.

 6. ‘కథా దర్శనం’ తరువాతే కథా సమీక్ష /విమర్శ . కథా దర్శనానికి కొత్త కొత్త కోణాన్ని ఆవిష్కరించిన వీర భద్రుడు గారికి ధన్యవాదాలు .

 7. balasudhakarmouli says:

  ఈ కథలు- స్కైబాబ గారివి చదవడం వొక గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. నిజంగా జీవితపు విధ్వంసపు శకలాలు మనిసిని మామూలుగా వుండనివ్వవు. నిలువనివ్వవు. మళ్లీ జీవితాన్ని నిలబెట్టే పని చేస్తేనే గానీ .. ఆ దుఃఖానికి విముక్తి లేనట్టేనేమో ! కవులకు, కథకులకు జీవితాన్ని నిలబెట్టే పని చేయడంలో తర్ఫీదు యివ్వక్కర్లేదనుకుంటా. సమాజంపై వాళ్ల చూపే … దానికి నిరూపణ.

  నేను- ఈ కథలను ఆంధ్రజ్యోతిలో, చినుకులోనే ముందుగా చదివాను. నా గుండెల్ని పిండేసాయి. సహజంగా ప్రతి సామాన్యుని ఇంటిలోని స్త్రీల పరిస్థితీ బహుసా ఇంతేనేమో. మా యిల్లూ యిందుకు మినహాయింపు కాదు. అందుకేనేమో … చినుకు ప్రత్యేక సంచికలో మిగిలిన అన్ని కథలు కంటేనే స్కైబాబ గారి కథ నన్ను యిప్పటికీ వెంబడిస్తుంది.

  యిలాంటి జీవితం వున్న కథల కాళ్ల మీద పడి వందనం చేసుకోవాలి.

  అందుకే నేను నా పాటశాల పిల్లలచే ఈ కథలను చదివిస్తున్నాను. స్కైబాబ గారిని నా తరగతి గదిలో నా పిల్లలకు పరిచయం చేసాను. యింతవరకూ శ్రీశ్రీని, శివారెడ్డిని, శివసాగర్ ని, చాసోని పరిచయం చేసినవాడిని… యిప్పుడు స్కైబాబ గారిని.

  ఈ కథలతో- వో కొత్త వెలుగును, వో కొత్త ద్రుష్టిని చూపిస్తున్నాననుకుంటున్నా.

  వందనం స్రుజనకారులకు.

 8. మీరు వ్రాసినది చదివితే ఇంటరెస్టింగ్ గా ఉంది .రచయిత నేపధ్యం
  చదివి ఆయన పై గౌరవం వచ్చింది . కధల విమర్శ చదివితే
  జీవితపు ప్రతిబింబాలు కావొచ్చేమో అనిపిస్తుంది .

 9. పసునూరి says:

  కాలాన్ని పట్టించే కథామాలిక స్కైబాబ గారి ఏక్‌ కహానీకే తీన్‌ రంగ్‌..
  చినవీరభద్రుడుగారి ముందుమాట బాగుంది. కాకుంటే ముస్లిం జిందగీలు కడు పేదరికాన్నే కాకుండా, అనేక అవమానాలకు గురికావడానికి కారణమైన వ్యవస్థ తాలూకు అధిపత్యాన్ని కూడా కొంత స్పృశించి ఉంటే మరింత సమగ్రంగా ఉండేది.
  మరో విషయం
  జేమ్స్‌ జాయిస్‌ చెప్పిన..ఎపిఫని అనేదాన్ని పాఠకుడు పాత్రతో మమేకం కావడం కూడా అనుకోవచ్చా అనేది ఒక సందేహం..!!

 10. mohan.ravipati says:

  ఏక్ కహానీ కా తీన్ రంగ్ కొంచెం ఆలస్యంగా చదివాను,చదివిన వెంటనే ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యాను. వహీదా, జమీలా, మౌసమి, మూడు కథలు ఒకే సమస్యకు ఉన్న మూడు నేపధ్యాలు. ముస్లిం మహిళలపై ఉండే విపరీతమైన ఆంక్షల వల్ల వారు పడే మానసిక వ్యధను చిత్రీకరించిన తీరు అధ్బుతంగా ఉంది.
  మిస్ వహీదా కథలో నిసార్ తో పాటు మనం కూడా కరీంనగర్ వెళ్ళి, ఒక్కసారిగా కూలిపోతాం, సీలింగ్ ఫాన్ రెక్కలు కు ఉరేసుకున్న వహీదా నుండి వచ్చే గాలి మనల్నిమనం ముఖం మీద వేసుకుంటున్న నల్లటి బురఖా తెరను తొలగించటానికి విశ్వప్రయత్నం చేస్తూ కనపడుతుంది.

  జమీలా కథలో బురఖాలో నుండి బయటపడుతున్న ఒక అలోచనా తరంగం కనిపిస్తుంది, బయట అడుగుపెడితే అవకాశాలను కళ్ళముందు చూపి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది ఇందులో అమ్మి జమీలా కి సపోర్ట్ చేసినట్లు చూపటంలో , ఏ తరంలో అయినా ఆంక్షల పంజరంలోనుండి ఎగిరివెళ్ళాలి అనుకొనే కూతురుకు తన పరిధిలో సహాయం చేసే నిజమైన అమ్మతనం కనపడుతుంది

  ఇక మౌసమీ కథ కొద్దిగా భిన్నమైనది, ఇక్కడ కూడా ఉంది ఆంక్షల పంజరమే, కాకపోతే అది సాంప్రదాయల ఆంక్షలు కాదు. దానికన్నా ఇంకొంచెం ఎక్కువే. కాకపోతే నిజ జీవితంలో అలా జరుగుతుందా అంటే చెప్పటం కష్టమే. కాకపోతే సమీర్ ని అంతగా కదిలించింది అఫ్రీన్ . సమీర్ అలోచన లో అఫ్రీన్ కి ఉన్న స్థానం అదే

  ఇలాంటి మంచి కథలు అందించిన స్కై బాబా గారికి హృదయ పూర్వక శుభాబినందనలు

 11. Vydehi Reddy (ఇది నా వాల్ లోని ఒక కామెంట్): Nenu mee books avi chadavaledu.. Bt Aaa Koratha theerindi.. Mee Rachanala Bhaavamanthaa macggiga lonuchi Venna muddanu theesi andinchinattu sir Vadrev china Veera bhadhrudi gaari maatalu vunnaay.. Nijamgaa atuvanti mahonnathula che me Rachanala chadavabadatam Santhoshakaram.. Aabhinandanalu kudaa.. Inkaa mee Sahithee Prayaanam munmunduku Saagaalani korukuntuu..

  1. ఇక ఇక్కడ కామెంట్స్ లో ఒకటి రెండింటి లో పొగడ్త కాస్త ఎక్కువైందా -అనే సందేహం కలిగింది.
  2. అందరికీ షుక్రియా
  3. విజయ్ కామెంట్ అన్యాయంగా ఉంది, వాడ్రేవు గారు ఇంతవరకు ‘బా’ (రహమతుల్లా)పై, నా ఈ మూడు కథలపైనే రాశారు. ‘గత రెండు మూడేళ్ళుగా భధ్రుడు మెచ్చని ముస్లిం రచయిత లేడు.’ anadam వాస్తవం కాదు.
  4. ఇక్కడ ‘eBook దొరుకుతుంది-
  http://kinige.com/kbook.php

  Ek Kahaani Ke Theen Rang By Sky Baba – Kinige Telugu books
  kinige.com
  Ek Kahaani Ke Theen Rang (ఏక్ కహానీ కె తీన్ రంగ్) By Sky Baba available on Kinige under categories: Ek Kahaani Ke Theen Rang , Skybaaba, Sky etc.. About Kinige: Kinige Telugu eBooks and other Indian language eBooks. An excellant platform for readers, writers and publishers. One can purchase an eBook…

మీ మాటలు

*