బువ్వగాడు

కాశిరాజు

కాశిరాజు

“ఒలేయ్ ఆడికి అన్నమెట్టు” అన్నప్పుడల్లా
నాకు ఆకలేయదేందుకు ?
అన్నమంటే అమ్మా, నాన్నే అనిపిస్తుందెందుకు!

ఒరేయ్ బువ్వగా
ఇంతకుముందెప్పుడో ఇలాగే  అన్నం తింటన్నప్పుడు
రొయ్యల సెరువు కోసం ఇసకలంకని ఎవరికో ఇచ్చేసారని
కంచంలో కూడు అలాగే వొదిలి పరిగెట్టినపుడు
నీకూడా నేనొచ్చుండాల్సింది
ఆపూట నువ్వొదిలెల్లిన కూడు తినకుండా
నువ్వు తిన్న దెబ్బలని నేను కూడా తినుండాల్సింది.
నీ ఒళ్ళు సూత్తే నేతొక్కి తిరిగిన నేలలాగే ఉంది
ఒరేయ్ మట్టంటుకున్నోడా మురికి నిన్ను వదలదేరా

****
ఇంకోసారి
ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
కాళ్ళు కడుక్కుని కంచంముందు కుచ్చున్నావు
కాపుగారు పిలిచారనీ
వారం రోజుల్లో పెల్లుందనగా
పదిరోజుల ముందెళ్ళి పందిరేసావ్
విందులో సందడికి నోచుకోక విస్తళ్ళు తీసావ్
ఒరేయ్ ఆకలిదాచుకు నవ్వేవాడా
అందరూ నీకు బందువులేరా !

la
****
మరోసారి
శీతాకాలం పొద్దున్నపూట సూరీడుకంటే ముందులెగిసి
ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
నువ్వేమో కొరికిన ఉల్లిపాయ్ అలాగే వొదిలి
సద్దన్నం సకం కొల్లకేసి
పంచినుంచి రుమాలకి , రుమాలనుంచి గోసీకి మారి
శ్రమని చేలో చల్లడానికెల్లావ్
ఆ పూట నా బాక్సులో రొయ్యల గోంగూర బడికట్టికెల్లకుండా బండాడ దిబ్బకి తెవాల్సింది
ఒరేయ్ చేనుకు నీరైనోడా ! నువ్ చల్లిన మెతుకులే మొలుస్తున్నాయ్

****
బెమ్మోత్సవాలపుడు
మళ్ళీ ఒలేయ్ ఆడికి అన్నమెట్టని
అమ్మోచ్చేలోపే రధానికి రంగులేయడానికెల్లావ్
చెక్రాలు సుబ్బరంగా  తుడిసి, సీలల్లో నూనె పోసావ్
బగమంతుడు బద్దకిస్తాడని రధాన్ని నువ్వేలాగావ్
బతుకంతా మెతుక్కిమొకమాసినా బాగవంతుడుకంటే  గొప్పయ్యావ్

ఒరేయ్ బువ్వగా!
గెడ్డం మాసిన సూరీడా
బతుకంటే మెతుకులేనా?
అన్నమంటే  అమ్మా, నాన్నేనా
అన్నం ముందు కుచ్చుంటే
కంచం నిండినా , నువ్వు గుర్తొచ్చాకే కడుపునిండేది.

(నా బతుక్కీ , నా మెతుక్కీ, నా బంగారానికి , అంటే మా నానకి )

-కాశి రాజు

చిత్ర రచన: ఏలే లక్ష్మణ్

మీ మాటలు

 1. గెడ్డం మాసిన సూరీడుని తలచుకోగానే కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి కాశీరాజు గారు.. నాన్న అలా కనులముందే మట్టిలో ఇంకిన దైవమై దీపంలా ప్రత్యక్షమయ్యాడు.. ధన్యవాదాలు..

  శీర్షిక గెడ్డం మాసిన సూరీడు అంటే బాగుండేదని..

  • m.viswanadhareddy says:

   గెడ్డం మాసిన సూరియుడు మాపుకుంది మనకోసమే అని తెలుసుకోగలిగితే మనం అపుడు నిజంగా మట్టిలో నుంచి వచ్చిన మొలకలమే ..చెమట వాసన తెలుసుకొగలిగినట్టె టైటిల్ గెడ్డం మాసిన సూరీదు అయితే చాలా బాగుండేది .. నేల వాసన పసిగట్టిన ఆ ”కాశరాజా అభినందనలు …మీ అన్నయ్య విశ్వనాధరెడ్డి

 2. రాజశేఖర్ గుదిబండి says:

  “….ఆ పూట నా బాక్సులో రొయ్యల గోంగూర బడికట్టికెల్లకుండా బండాడ దిబ్బకి తెవాల్సింది
  ఒరేయ్ చేనుకు నీరైనోడా ! నువ్ చల్లిన మెతుకులే మొలుస్తున్నాయ్”

  నువ్వు, మీ నాన్న బగారం..మీరు ధన్యజీవులు కాశి .మీ ప్రేమకి వందనం….

 3. కాశిరాజు గారూ, కవిత బాగుందండీ..

  “ఒరేయ్ మట్టంటుకున్నోడా మురికి నిన్ను వదలదేరా” — ఈ ఒక్క చోటా..మీరు “మురికి” అన్న పదాన్ని ఎలా వాడాలనుకున్నారో అర్థం కాలేదు. (పాజిటివ్/నెగటివ్)

 4. కవిత బాగుంది! ఒరే బువ్వగా! గెడ్డం మాసిన సూరీడా! చాలా అర్ధవంతంగా ఉంది!

 5. mercy margaret says:

  వండర్ఫుల్ పోయెమ్ కాశి .. ఒరే బువ్వగా! గెడ్డం మాసిన సూరీడా! ఈ కవిత బాగుంది! ఇంకా ఏదో ఇక్కడ చెమ్మగా తగులుతూ

 6. కాశిరాజు గారూ,

  చాలా ఆర్ద్రంగా ఉంది. మీ కవిత్వానికి ఒక కొత్త నుడికారం వస్తోంది. పట్టు వదలకండి.
  అభివాదములతో

 7. నారాయణ గరిమెళ్ళ says:

  తమకంటూ వేరే ఆకలి, లోకమూ లేకుండా
  సమస్త కాలమూ పిల్లల కోసం, ఊరి అవసరాలకోసం, పొలం మీది పంట కోసం గడిపేసే ఇలాంటి తల్లితండ్రుల స్వభావానికి సాటిరాగలదేముంది ఈ ప్రపంచంలో?

  వినోదాలలే మునిగి తేలడమే జీవితమనుకుంటున్న ఈ రోజులలో వీరి తత్వం పదే పదే గుర్తుకు తెచ్చుకుంటే ఆశ్చర్యమే కదా…

  నారాయణ గరిమెళ్ళ

  • పనికీ. మనుసులకీ నా తల్లి తండ్రులు ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది నాగేశ్వర్ రావు గారూ ధన్యవాదాలు _/\_

   • కాశి రాజు గారు,

    మంచి కవిత వ్రాసి మానవత్వం మూర్తిభవించిన నాన్నని గుర్తుకు తెచ్చారు.
    నా పేరును మీరు నాగేశ్వర రావు గారి పేరుగా పొరబడ్డట్టున్నారు.
    మంచి కవితకు మరొకసారి అభినందనలతో,

    నారాయణ.

 8. ఎన్నెల says:

  ExcellenT sir!

 9. ఎన్ వేణుగోపాల్ says:

  కాశి రాజు గారూ,

  కవిత చాలా చాలా బావుంది. ఆర్ద్రంగా, సున్నితంగా లోలోపలి భావాల్ని పలికించారు. ఒక్కొక్క అనుభవమూ గుండెని మెలిపెడుతుంది. ఒకటి రెండు అచ్చు తప్పులు, రెండు మూడు ఎక్కువ తూకపు పదాలు మినహాయిస్తే గొప్ప కవిత.

 10. ఒరేయ్ చేనుకు నీరైనోడా ! నువ్ చల్లిన మెతుకులే మొలుస్తున్నాయ్…..బాగుంది నచ్చింది ఇలాంటి వ్యాఖ్యలు నప్పవు ఈ కవితకి…మనసుకి హత్తుకుంది

మీ మాటలు

*