గ్రావిటీ

 

1

భూమి నుదుట తడిముద్దు పెట్టి

గుట్టుచప్పుడు కాకుండా ఇంకిన చినుకు

ఎదో ఓ రోజు ఊటనీరై ఉవ్వెత్తున ఉబుకుతుంది.

 

2

తల్లికొమ్మలోంచి తలపైకెత్తి

కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు

నేల రాలాకే గలగలా మాట్లాడుతుంది.

 

3

తొడిమెపై తపస్సు చేసి

లోకాన్ని తన చుట్టూ తిప్పుకున్న పువ్వు   

మట్టి పాదాలు తాకడానికి

ఏ గాలివాటానికో లొంగిపోతుంది.

 van_gogh_almond_tree

4

అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి    

చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు

చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి

అలల తలలను దువ్వుతాడు.

 

5

ఎప్పుడూ

కళ్ళనిండా కలల వత్తులేసుకుని  

ఆలోచనకీ అక్షరానికీ మధ్య తచ్చాడే నాకు      

 

ఆకులా  

పువ్వులా

చినుకులా 

అలను తాకే వెన్నెలలా

 

నిన్ను హత్తుకోవడమే ఇష్టం.

మీ మాటలు

 1. చాలా సున్నితంగా సుతారంగా కవిత్వీకరించదమెలాగొ మీద్వారానే తెలిసింది సార్.. భావ చిత్రాలు హత్తుకున్నాయి..

 2. చాలా చాలా బాగుందండీ గ్రావిటీ. మంచి ఆలోచనలు.

 3. చక్కని చిక్కని కవిత్వం రవి గారు. తప్పక రాస్తూ ఉండండి.

 4. బాగుందండి,. మంచి ఎత్తుగడలతో,…. చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి

  ఆలల తలలను దువ్వుతాడు.,.. కొంచెం వివరిస్తారా,..

  • వివరించేదేమీ లేదు భాస్కర్ గారు :-) :-)
   సముద్రానికి సందమామకీ ఉన్న సంబంధం పాతదే కదా. దువ్వడం అంటే ‘ప్రేమగా బతిమిలాడుకోవడం’ లాంటిదన్నమాట. ;-)

   మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు!

 5. రవి గారూ, కవిత చాలా బాగుంది. అభినందనలు.

 6. మొదటి నాలుగు భాగాల్ని తప్పక మళ్లీ చదివేలా చేసింది కవితలోని
  ఐదవ భాగం. కవిత బాగుంది. అభినందనలు రవి వీరెల్లి గారూ.

 7. ఎలనాగ గారి మాటే నాదీనూ. మీ కవిత్వంలో ఎప్పటిలాగే మాటలకందని సున్నితత్వం.

 8. swatee Sripada says:

  భూమి నుదుట తడిముద్దు పెట్టి
  గుట్టుచప్పుడు కాకుండా ఇంకిన చినుకు
  ఏదో ఓ రోజు ఊటనీరై ఉవ్వెత్తున ఉబుకుతుంది.
  రాలిన చినుకు క్షణం క్షణం కనిపిస్తుంది, భూమిపై వాలిన శబ్దం వినిపించదు. కాస్సేపట్లో ఇంకిపోయే వాన చినుకును చక్కటి పద చిత్రంలో గొప్పగా చెప్పారు రవి.నుదుట తడిముద్దు అనడంలోనే అన్యాపదేశంగా చినుకు పెదవుల పదచిత్రం స్ఫురిస్తుంది. గుట్టు చప్పుడుగా ఇంకిపోయిన చినుకు ఉవ్వెత్తున ఉబకడం ఒక విప్లవం ఒక ఆశావాదం . ఒక భవిష్యత్తు సమీకరణ.
  తల్లికొమ్మలోంచి తలపైకెత్తి
  కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు
  నేల రాలాకే గలగలా మాట్లాడుతుంది.
  కరుగుతున్న కాలాలన్నీ ఒడిసిపట్టిన ఆకు ,అనుభవాలను అతి సున్నితంగా చూపారు. నేల రాలాక గలగలా మాట్లాడటం ఒక పరాధీనత అనుభవాల సేకరణలో పంది రాలాకా మాట్లాడటం —ఒక ఖచ్చిత దృష్టికోణం చూపుతోంది.
  తొడిమెపై తపస్సు చేసి
  లోకాన్ని తన చుట్టూ తిప్పుకున్న పువ్వు
  మట్టి పాదాలు తాకడానికి
  ఏ గాలివాటానికో లొంగిపోతుంది.
  ఒక క్షణికాకర్షణ ,ఒక జీవన సారం ఎంత గొప్ప దీమంతులైన ఏదో ఒక బలహీనత ఎన్ని ప్రతీకలో

  అనంతమైన ఆకాశాన్ని సాగు చేసి
  చుక్కల మొక్కలు నాటిన చంద్రుడు
  చిన్న నీటిబిందువు కోసం కిందికి చేతులు సాచి
  అలల తలలను దువ్వుతాడు.
  ఎంత ఎత్తులో ఉన్న అవసరాలు మరి

  ఎప్పుడూ
  కళ్ళనిండా కలల వత్తులేసుకుని
  ఆలోచనకీ అక్షరానికీ మధ్య తచ్చాడే నాకు
  ఆలోచనకూ అక్షరానికీ మధ్య తచ్చాడటం లో కూడా ఒక ఆర్తి ఒక స్ఫూర్తి , ఆకులా
  పువ్వులా ,చినుకులా, అలను తాకే వెన్నెలలా సమస్తం “నిన్ను “ దగ్గర ఆగిపోడం బావుంది.

  నిన్ను హత్తుకోవడమే ఇష్టం.

 9. పద్యం చాల బాగుంది, రవీ!

 10. Narayanaswamy says:

  అందమైన పద్యం! మంచి నిర్మాణం మంచి ఊహలూ వాటిని నిర్మించే పదచిత్రాలూ – అభినందనలు రవీ!

 11. చదివి ఆత్మీయంగా స్పందించిన పెద్దలకు, మిత్రులకు పేరు పేరునా ధన్యవాదాలు. Thank you so much for your encouragement.

 12. mercy margaret says:

  woww beautiful poem sir .. each stanza is amazing, the imageries used by you is like an abstract painting. thanks for this beautiful poem

 13. రవి,

  తమ అనంతమైన ప్రేమకు గురుత్వాకర్షణ ను యధేచ్చగా వాడేసుకుంటున్న
  ప్రకృతికి మీరు కూడా వంత పాడటం, కొమ్ము కాయడం చాలా మధురంగా ఉంది.
  చాలా బాగుంది. భూమిలో కొంత, ఆకాశంలో కొంత ముంచిన కలంతో ఈ కవిత ను అద్భుతంగా వ్రాశారు.

  అభినందనలతో,
  నారాయణ గరిమెళ్ళ.

 14. Rajasekhar Gudibandi says:

  కవిత చాలా బాగుంది రవి గారు. మళ్ళి మళ్ళి చదివిస్తుంది .
  స్వాతి శ్రీపాద గారి విశ్లేషణ చక్కగా ఉంది ..

 15. akella raviprakash says:

  తల్లికొమ్మలోంచి తలపైకెత్తి

  కరుగుతున్న కాలాలన్నీటినీ ఒడిసిపట్టిన ఆకు

  నేల రాలాకే గలగలా మాట్లాడుతుంది.

  గ్రేట్ lines

 16. దిలీప్ కుమార్ says:

  చాలా ఆందంగా రసారు రవి గారు, మి కవిత లాగా మి కవిత్వం కుడా “గ్రావిటి”తొ నిండిపొంది

 17. MADIPLLI RAJ KUMAR says:

  మీ కవిత పేర్లోనే గొప్ప ఆకర్షణ ఉంది. పై మూడు చెట్టు ఫ్రేములో చక్కగా ఒదిగాయి. ఐదోది మీ హృదయాన్ని పట్టి ఇచ్చింది.నాలుగోది నా మనసుకైతే దానికదిగా బాగున్నాఈ మొత్తానికీ కొంచెం ఎడంగా అనిపించింది. మొత్తానికి ఒక మంచి కవిత చదివిన అనుభూతి కలిగించారు. థాంక్యూ సర్.

మీ మాటలు

*