ఇది అనామకురాలు, గాయత్రీ దేవుడి తో ముఖాముఖి!

 Dr Gayatridevi

ఔను, మీరు సరిగ్గానే చదివారు.
అనామకుడి “రమణీయం” 2006 లో ప్రచురణకి నోచుకుంది.

పుస్తకాన్ని ఇతరులకి అంకితం ఇవ్వడం ఒక సంప్రదాయం.  దాన్నిఛేదించాడు ఈ అనామకుడు.  తనకే అంకితం ఇచ్చుకున్నాడు.  ఆ అంకితం ఎలా ఇచ్చుకున్నాడో తన మాటలలో చూద్దాం!

” (గాయత్రీ)  దేవి,

నేనైన నీకు

నీవైన నేను

(రామం) బావ”

అందుకని విడదీయలేము.  అంత రమణీయంగా ఉంది వారి జీవితం.  కాబట్టీ ఇద్దరితోను కలిపి కూడా ఒక ముఖాముఖి!  ఆమె ఐన అతను. అతను ఐన ఆమె.  అమె అనామకుడు. అతను డా.గాయత్రీ దేవి.

గాయత్రీదేవి ఉషశ్రీ పెద్దమ్మాయి.  వైద్యం, చిత్రలేఖనం, రచనావ్యాసంగం – మూడు గుర్రాల స్వారీ.  రచనావ్యాసంగంలో ఆయుర్వేద పుస్తకాలు వ్యాసాలతోపాటు అడపాదడపా కథలు. అందులో కొన్ని హాస్యం, కొన్ని అ-హాస్యం.  వాటినీ వీటినీ కలిపి ఓ పుస్తకంలా వేస్తున్నారు.

అంతకుముందు ప్రచురణలు – ప్రకృతివరాలూ, అమ్మాయీ అమ్మా అమ్మమ్మా, నాన్నగారి అసంపూర్ణరచన పూరణ, ఎవరితో ఎలా మాట్లాడాలి—అన్ని రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా భరతముని ఆదర్శమహిళా పురస్కారం, ముంబయి ఆంధ్రమహాసభ ఉత్తమ మహిళా పురస్కారం. పత్రికల ద్వారా, టీవీ ద్వారా తెలుగు వారికి సుపరిచితం.

 

Qఅనిల్: తన రచనలు మీరు చదువుతారా?

అనామకుడు:తను తెలుగులో రాసిన కధలూ, వ్యాసాలూ చదువుతాను. తను రాసిన ఆయుర్వేదపరమైన పుస్తకాలూ వ్యాసాలూ నేను చదవలేదు. అలాగని చదవలేదనీ చెప్పలేను. ఒక్కోసారి వాటి ఎడిటింగ్ పని నాకు అప్పగిస్తుంది. అప్పుడు చదువుతాను.

Qఅనిల్మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రాస్తారు?

 అనామకుడు: నేనెక్కువ చదువుతాను. తక్కువ రాస్తాను. తనకి నెలనెలా రాయాల్సిన శీర్షికలు ఉంటాయి. తన పుస్తకాలూ వ్యాసాలూ జనానికి అవసరమైనవీ, ఉపయోగించేవీ.

Q అనిల్: మీకు రచనాసక్తి ఎలా కలిగింది?

 

అనామకుడు: నాకు పద్యాలు రాయాలన్న మక్కువ చిన్నప్పుడే కలిగింది. ఆ ఆసక్తికి కారణం – మా నాన్నగారూ మా పదో తరగతిలో మా తెలుగు మాస్టారూ. పద్యాల మీద ఇష్టం తర్వాత తర్వాత కధల మీదకి మళ్ళింది.

 

Qఅనిల్మీరు కలిసి రాయరా? చాలా మంది భార్యాభర్తలు ఆ పని చేస్తారు కదా?

 

అనామకుడు: లేదు. అది కుదిరే పని కూడా కాదు. ఒకే ఒక్క కధని ఇద్దరం రాసినట్లు ఉంటుంది. కథ తనది. కథనం నాది. పేరు ఎవరికి ఎవరు అని గుర్తు.

 

Qఅనిల్: ఐతే ఇద్దరూ కలిసి సాహితీ వ్యాసంగం చెయ్యలేదనే అనుకోవాలి.

అనామకుడు: కలిసి రాయలేదు కానీ ఇద్దరి రచనలకి ఒకరి సాయం ఇంకొకరికి ఉంది. కొత్తగా ఓ ప్రయోగం చేస్తున్నాం. ఇద్దరం చెరో పుస్తకం వేస్తున్నాం. నా పుస్తకానికి తను ముందు మాట రాస్తే తన పుస్తకానికి నేను రాసాను.

 

Qఅనిల్:ఏమిటా పుస్తకాలు?

 

అనామకుడు: తను రాసిన కధల్లో ఎక్కువ హాస్య కధలు ఉన్నాయి. కొన్ని హాస్యం కాని కథలూ ఉన్నాయి. అవీ ఇవీ కొన్ని ఏరి హాస్యాహాస్య కథలు అని వేస్తోంది.

ముగ్గురు కలిసి నవ్వే వేళల...

ముగ్గురు కలిసి నవ్వే వేళల…

Qఅనిల్: ఎప్పుడు విడుదల?

అనామకుడు: విడుదల అని మేమేం కార్యక్రమం పెట్టుకోవడం లేదు. ఇంతవరకూ నా పుస్తకం దేనికీ అలా చెయ్యలేదు కూడా. ఐతే నవంబర్ పదకోండో తేదేన ఆన్లైన్ సైట్లో దొరికేలా చేస్తున్నాం. అదే విడుదల.

 

Qఅనిల్: చివరిగా ఏదన్న మాట చెప్తారా?

 

అనామకుడు: తన పుస్తకాలు చాలా మార్కెట్లో ఉన్నా మొదటిసారిగా కథలపుస్తకం వేస్తోంది. అదీ పెళ్ళిరోజుకి. అందుకు గాయత్రీదేవికి శుభాశీస్సులు.

 

Qఅనిల్: తన రచనలు మీరు చదువుతారా?

 

గాయత్రి: చదవను. ఎందుకంటే తను రాసిన ప్రతి రచనా ఎక్కడికైనా పంపించడానికి ముందు నాకు చదివి వినిపిస్తాడు. తను ఎకనామిక్స్ మీదో ఫైనాన్స్ మీదో రాసిన పుస్తకాలో వ్యాసాలో తను వినిపించడు. నేను చదవను.

 

Qఅనిల్: మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రాస్తారు?

 

గాయత్రి: ఏమో తెలియదు. నేనే ఎక్కువ రాస్తానేమో. ఐతే నేను రాసేవి ఎక్కువ ఆయుర్వేద వ్యాసాలూ పుస్తకాలూ ఉంటాయి. తనవి కధలూ, పద్యాలూ, నవలలూ, నాటికలూ – వాటిలో క్రియేటివిటి ఎక్కువ ఉంటుంది.

Hasya Hasya kathaluFrontCoverTitlePageW

Qఅనిల్: మీకు రచనాసక్తి ఎలా కలిగింది.

 

గాయత్రి: మా నాన్న ఉషశ్రీ నిరంతరం రాస్తూనే ఉండేవారు. అదే నాకూ వచ్చుంటుంది.

 

Qఅనిల్: మీరు కలిసి రాయరా? చాలా మంది భార్యాభర్తలు ఆ పని చేస్తారు కదా?

 

గాయత్రి: కలిసి రాయలేదు కానీ తన కథ ఒకదానికి నేను బొమ్మ గీసాను. ఆ కథ పేరు తల్లి. అలానే తను రాసిన పద్యాలకి నేను బొమ్మలూ, నేను గీసిన బొమ్మలకు తను పద్యాలూ – వేసానూ, రాసాడూ. ఆంధ్రప్రభలో ప్రచురించబడ్డాయి.

 

అనిల్: ఐతే ఇద్దరూ కలిసి సాహితీ వ్యాసంగం చెయ్యలేదనే అనుకోవాలి.

 

గాయత్రి: కలిసి పుస్తకాలు వేస్తున్నాం. ఐతే ప్రింట్ పుస్తకాలు కాదు. డిజిటల్ పుస్తకాలు.

 

Qఅనిల్: ఏమిటా పుస్తకాలు?

 

గాయత్రి: తను తొంభైల్లో రాసిన రెండు నవలికలు ఉన్నాయి. ఒకటి – ఓ మొగ్గ పువ్వవుతోంది. రెండోది – ఎరుపు తెల్లపోతోంది. ఈ రెండవ నవలనే సినిమా తియ్యాలని ఓ నిర్మాత పిలిచారు కానీ, బావకి కుదర్లేదు.

 

Qఅనిల్: ఎప్పుడు విడుదల?

 

గాయత్రి: మా పెళ్ళిరోజున. అది నవంబర్ పదో పదకొండో. నవంబర్ పది అర్ధరాత్రి ఒంటిగంటకి ముహూర్తం. అందుకే రెండురోజులూ మా పెళ్ళి రోజులే.

 

Qఅనిల్: చివరిగా ఏదన్న మాట చెప్తారా?

 

గాయత్రి: తనవి చాలా పుస్తకాలు తెలుగులో ఇంగ్లిషులో ప్రచురించబడ్డాయి. ఒక్కటి కూడా తను ప్రచురించింది కాదు. ఓ విధంగా ఈ పుస్తకం తను వేస్తున్న మొదటి పుస్తకం. నేనేం చెప్తాను – శుభాకాంక్షలు తప్ప.

 

(గాయత్రి గారి రచనల కోసం: http://kinige.com/kbrowse.php?via=author&name=Dr.+Gayatri+Devi&id=21)

మీ మాటలు

  1. సింపుల్ అండ్ స్వీట్ ఇంట్రో — ఇంటర్వ్యు..

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*