రాదారి ఆవల

కేక్యూబ్ వర్మ

కేక్యూబ్ వర్మ

వాక్యమేదీ కూర్చబడక

చర్మపు రహదారి గుండా ఓ నెత్తుటి దారమేదో అల్లబడుతూ

ఒకింత బాధ సున్నితంగా గాయమ్మీద మైనపు పూతలా

పూయబడుతూ రాలుతున్న పూరెక్కలను కూర్చుకుంటూ

ఒడిలోకి తీసుకున్న తల్లి తన నెత్తుటి స్తన్యాన్ని అందిస్తూ

బాధ ఉబకని కనులు మూతపడుతూ జీవమౌతూ

చిద్రమైన దేహాన్ని సందిట్లో ఒడిసి పడుతూ మురిగిన

నెత్తుటి వాసన వేస్తున్న పెదాలను ముద్దాడుతూ ప్రాణమౌతూ

చితికిన వేళ్ళ మద్య ఎముకల పెళపెళలతో కరచాలనమిస్తూ

కాసింత దప్పిక తీరా గొంతులో పాటలా జారుతూ

ఏదో మూయబడ్డ రహదారిగుండా ఒక్కో రాయీ రప్పా

తొలగిస్తూ తొలుస్తూ వెలుతురినింత దోసిలిలో వెలిగిస్తూ

సామూహిక గాయాల మద్య ఎక్కడో అతికీ అతకని

రాతి జిగురు కర కరమని శబ్దిస్తూ కలుపుతూ

ఈ ఇసుక నేలగుండా పాయలుగా ప్రవహించిన జీవధార

ఇంకిన జాడలను వేళ్ళ మద్య తడిని వెతుకుతూ

దీపం కాలిన వాసనేదో దారి చూపుతూ ఒకింత

ఆశపు వత్తిని ఎగదోస్తూ చమురు ఇరిగిన రాదారిలో పయనమౌతూ

గమ్యం అగోచరమయ్యే వేళ ఓ తీతువేదో గొంతు పగిలిన

రాగదీపమౌతూ రెక్క తెగి నేలకు జారుతూ

ఈ నెత్తుటి చిత్రాన్ని ఆవిష్కరించే సమయం

యింకా ఫ్రేం కాలేక రాతిరి ముడుచుకుంటూ ఆకు దోనెలో దాగుతూ

– కేక్యూబ్ వర్మ

మీ మాటలు

 1. మీ రాదారిలోకీ మమ్మల్ని సున్నితంగా తీసుకెళ్ళారు వర్మా…మీ కవితల్ని చాలా కారణాలకోసం చదువుతూంటాను. అందులో ముఖ్యమైనది భాష. కొన్ని పదచిత్రాలు అచ్చెరువొందెలా కుంచెని కదుపుతారు. మంచి బిగువున్న కవిత. అభినందనలు

 2. మీ ఆత్మీయ వ్యాఖ్యతో రాయడం పట్ల ఉన్న భయాన్ని పోగొడుతున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు వాసుదేవ్జీ..

 3. శ్రీనివాసు గద్దపాటి says:

  సామూహిక గాయాల మద్య ఎక్కడో అతికీ అతకని

  రాతి జిగురు కర కరమని శబ్దిస్తూ కలుపుతూ

  ఈ ఇసుక నేలగుండా పాయలుగా ప్రవహించిన జీవధార

  ఇంకిన జాడలను వేళ్ళ మద్య తడిని వెతుకుతూ……

 4. ధన్యవాదాలు శ్రీనివాసు గడ్డపాటి గారు..

 5. రాజశేఖర్ గుదిబండి says:

  నిరంతర భావ ప్రవాహం మస్తిష్కం లోకి చొచ్చుకొచ్చినట్లుంది..అద్భుతంగా ఉంది సర్..

 6. Vijaya Bhanu Kote says:

  చాలా చిక్కటి కవిత….కొన్ని భావోద్వేగాల్ని అదుపు తప్పించగల కవిత….చాలా బాగా రాసారు వర్మా జీ

 7. ధన్యవాదాలు రాజశేఖర్ గుదిబండి గారు, విజయభాను కోటే మేడంజీ..

 8. చాలా నచ్చింది వర్మ గారు.. మీ కవితలని చదవడానికి ముందు మెదడు ఫ్రేమ్ ఖాళీ చేసుకుని రెడీ అవుతాను. అప్పుడు మీ పద చిత్రాలు వాటి పెయిన్ శబ్దిస్తూ నిశ్శబ్దంగా కదిలిపోతూ వుంటే.. చివరలో.. రీచ్ అయ్యే మానసిక స్థాయి — అనుభూతుల్లో కొత్త ఎత్తుని చూసిన భావన మిగులుస్తుంది. అందుకే మీ కవితలకి కామెంట్ రాయాలంటే.. రెండు మూడు సార్లు చదవాల్సిందే..ఈ కవిత అచ్చంగా అదే మార్క్!

 9. జాన్ హైడ్ కనుమూరి says:

  ఓ నెత్తుటి దారమేదో అల్లబడుతూ… మొదలయ్యిన కవితాక్షరాలను చదువుతూ చదువుతూ
  నెత్తుటి చిత్రాన్ని ఆవిష్కరించే సమయంలోకి తెలియకుండానే చిక్కుకున్నాను

  బాధ స్పర్శించకుండా ఎలా వుంటుంది

  అభినందనలు…

 10. రవి వీరెల్లి says:

  వర్మ గారు,

  కవిత బాగుంది. మళ్ళీ మళ్ళీ చదువుకున్నా. చిక్కని కవిత్వం. అభినందనలు!

  రవి

 11. దీపం కాలిన వాసనేదో దారి చూపుతూ ఒకింత

  ఆశపు వత్తిని ఎగదోస్తూ చమురు ఇరిగిన రాదారిలో పయనమౌతూ

  గమ్యం అగోచరమయ్యే వేళ ఓ తీతువేదో గొంతు పగిలిన

  రాగదీపమౌతూ ………………పద చిత్రణ బాగుంది !! వర్మాజీ

 12. Rajendra Prasad Maheswaram says:

  వర్మ గారు, ఉబుసుపోకకు కాక,వుద్విగ్నతలవైపు మనిషినీ, మనస్సునూ,నడిపించే కవిత.

  “ఈ ఇసుక నేలగుండా పాయలుగా ప్రవహించిన జీవధార
  ఇంకిన జాడలను వేళ్ళ మద్య తడిని వెతుకుతూ
  దీపం కాలిన వాసనేదో దారి చూపుతూ ఒకింత
  ఆశపు వత్తిని ఎగదోస్తూ చమురు ఇరిగిన రాదారిలో పయనమౌతూ
  గమ్యం అగోచరమయ్యే వేళ ఓ తీతువేదో గొంతు పగిలిన
  రాగదీపమౌతూ రెక్క తెగి నేలకు జారుతూ
  ఈ నెత్తుటి చిత్రాన్ని ఆవిష్కరించే సమయం
  యింకా ఫ్రేం కాలేక రాతిరి ముడుచుకుంటూ ఆకు దోనెలో దాగుతూ”…….

  మరిన్ని మంచి కవితలకై ఎదురుచూస్తూ… RP

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*