చేత వెన్న ముద్ద

                                  Abhowthika_swaram

కొన్ని పుస్తకాలను ఏమని పిలవాలో తెలియదు కవిత, కథ, నవల, వ్యాసం లాంటి సాంప్రదాయక ప్రక్రియా రూపాలన్ని వాటి ముందు వెలతెలా పోతాయి. హృదయాన్ని అనుభూతి సంద్రంలో ముంచి తేల్చే కవిత్వం ఉంటుంది కానీ కవిత కాదు. కధనం వుంటుంది కానీ కధ కాదు. ఆలోచనా స్పోరకమయిన వ్యాఖ్యలు వుంటాయి కానీ వ్యాఖ్యా విన్యాసం కాదు. జీవిత చిత్రణలు వుంటాయి కానీ జీవిత చిత్రాలు కాదు. ఏ ప్రక్రియా రూపంలోనూ ఒదగని ఈ రచనలను ఏమని పిలవాలి?

ఉదాహరణకు పూడూరి రాజిరెడ్డి ‘‘మధుపం’’ ఇటివలి ‘‘పలక ` పెన్సిల్‌’’ తీసుకోండి. పైకి NON – SERIOUS  వ్యవహారంగా కనిపించినా చాలా సీరియస్‌ అంశాలనే ఆ పుస్తకాలు చర్చించాయి. ‘‘మధుపం’’ ఒక మగవాడి ఫీలింగ్స్‌ అంటూ ఆమధ్య తెలుగు పాఠక ప్రపంచంలో సంచలనం సృష్ఠించిన ఈ పుస్తకం కేవలం వైయక్తిక అనుభూతినో, లేదూ సామూహిక అవ్యవస్ధనో చిత్రికపట్టలేదు. అంతకు మించింది ఈ పుస్తకంలో ఏదో వుంది.

ఒక మగవాడి ఆలోచనలు అంటూ ఇటీవల వచ్చిన పలక`పెన్సిల్‌ లో కూడా… తత్వశాస్త్ర పరిభాషలో అతి ముఖ్యమయిన ‘‘నేను’’ అనే బ్రహ్మపదార్ధాన్ని అలవోకగా చర్చించింది. ఈ పలక-పెన్సిల్‌ గురించి మరొకసారి మాట్లాడుకుందాము. కానీ ప్రస్తుత పుస్తక సందర్భం ‘‘మాధవ్‌ శింగరాజు’’ కలం నుండి వెలువడిన ‘‘అభౌతిక స్వరం’’ ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ‘‘దీనిని ఏమని పిలవాలి?’’ అనే సందేహమే నన్ను పట్టి పీడించింది.

‘‘అభౌతిక స్వరం’’ అంటే ‘‘మంద్ర స్వరం’’ అని అర్ధం. ‘‘నేను’’ అనే శీర్షికన రెండు సంవత్సరాలపాటు ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకున్న యాభైమంది ప్రసిద్ధుల జీవితాలను కొల్లేజ్‌ చేసి చూపిన అక్షర సంచయం ఈ పుస్తకం.

సాప్రదాయిక పరిచయ వ్యాసాల లాగా వాళ్ల వాళ్ల జీవితాలలోని ప్రముఖ ఘట్టాలతో ఈ రచన నిండిపోలేదు వాళ్లు జీవితాంతం ఏ తాత్త్విక భూమిక ఆధారంగా పనిచేసి జీవితాన్ని కరిగించుకున్నారో ఆ భూమికలను పట్టుకుని వాళ్లలోకి పరకాయ ప్రవేశంచేసి, వాళ్ల స్వరంతో  పాఠకుడితో ముచ్చటలాడినట్లుగా, సంభాషించినట్టుగా మెల్ల మెల్లని మంద్ర స్వరంతో చేసిన రచన యిది. ‘‘నేను ’’ అనే శీర్షికన వెలువడిన రచనలు కనుక ఏది రచయిత స్వరమో….. ఏది అభౌతిక స్వరమో తేడా తెలియనంతగా వాళ్లతో రచయిత సంలీనం అయిపోతాడు.

ఇంట్లో మధురమయిన పాయసాన్ని అమ్మ వండి, పైపైన జీడిపప్పు, కిస్‌మిస్‌ లతో ‘‘గార్నిష్‌’’ చేసినట్లుగా ఈ రచనలు అన్నీ వుంటాయి. అందుకేనేమో ‘‘మాధవ్‌ శింగరాజు’’ వీటిని ‘‘Auto biographical vignettes of Great men and women” అన్నాడు. vignettes అంటే నిఘంటు అర్ధం ఇలా వుంటుంది. ‘‘Decoration Design or Small illustration used on the title page of  a Book or at the beginning or at the end of the chapter.”

పుస్తక సారాంశం మొత్తాన్ని ఒక వ్యాఖ్యలోనో లేక నాలుగయిదు అలతి, అలతి పదాలలోనో గుది గుచ్చి చేసే అందమయిన వ్యాఖ్య యిది. మరొక మాటలో చెప్పాలంటే అనంతమయిన సముద్రాన్ని గుప్పిటలో పట్టడం అన్నమాట.

బిజినెస్‌ గురు, మేనేజ్‌మెంట్‌ గురు, ఆధ్యాత్మిక గురు లాంటి చాలా మంది గురువుల గురించి మనం విని వుంటాము కానీ ‘‘ నో స్మోకింగ్‌ గురు ’’ అంటూ ఒకరు వున్నారు అన్న విషయాన్ని కూడా ఊహించి వుండము. అలాంటి నో స్మోకింగ్‌ గురు అలెన్‌ కరీతో మొదలు పెట్టి యూరీ గగారిన్‌ వరకు మొత్తం యాభై మంది ఒక విద్యుల్లతలాగా  ఈ పుస్తకంలో మెరిసి మనలని మైమరపిస్తారు.

మన మౌనరుషి భగవాన్‌ రమణమహర్షి, గాంధీజీ, జగదీశ్‌ చంద్రబోస్‌, జ్యోతిబసు, జ్యోతి బాపూలే, కల్పనా చావ్లా, ఎం.ఎఫ్‌ హుస్సేన్‌, ఎం.జి. రామచంద్రన్‌, ఓషో, ఆర్కే లక్ష్మణ్‌, సలీమ్‌ ఆలీ, సత్యజిత్‌ రే, సూర్యసేన్‌, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ లాంటి భారతీయులు ఈ పుస్తకంలో మనకు కొత్త రూపంలో దర్శనమిస్తారు.

కొత్తగా దర్శనమిస్తారు అని ఎందుకు అంటున్నాను అంటే ‘‘సలీమ్‌ ఆలీ’’ లాంటి పక్షి శాస్త్రవేత్తలో అంతర్గతంగా దాగివున్న ఒక గొప్ప తత్వవేత్తను ఈ పుస్తకం పట్టి చూపుతుంది. ఆర్నిథాలజిస్టు, ఫిలాసఫర్‌ ఈ రెండిరటికి సామ్యం ఎక్కడ!

‘‘పక్షులనుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపిస్తోంది. వాటికి భయం వుండదు. ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తాయి. మనషులు కూడా అలానే ఉండాలంటాను. స్వేచ్ఛలోనే క్రమబద్ధమయిన జీవితం వాటిది. వేకువతో లేస్తాయి. పరిమితంగా తింటాయి, చీకటి పడగానే గూళ్ళకు చేరుకుంటాయి. మనకెందుకు అలా సాధ్యం కాదు? అరాచకంగా, అస్తవ్యస్తంగా వుంటామెందుకు? అరుదయిన పక్షిజాతులు అంతరించి పోతున్నట్లే మనిషిలోని ఆరోగ్యకరమయిన అలవాట్లు కూడా క్రమంగా హరించుకుపోతున్నాయా?’’.

ఈ ఉటంకింపు చదివాక ఎవరికయినా ఏం అనిపిస్తుంది? THE FALL OF A SPARROW  అన్న సలీం అలీ జీవిత చరిత్ర మొత్తం చదివినా సలీం ఆలీ లోని ఈ ‘‘ఫిలాసఫర్‌’’ ను పట్టుకోవడం కష్టమేనేమో! ఈ తాత్త్విక భూమికను మాధవ్‌ శింగరాజు పట్టుకున్నాడు. రచనను గార్నిష్‌ చెయ్యడం అంటే ఇదే కదూ!.

భారతదేశపు దారిద్య్రాన్ని గ్లోరిఫై చేసి అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాడని సత్యజిత్‌ రే మీద ఒక విమర్శ వుంది చారులత లాంటి సినిమాలలో ‘‘దాంపత్య ద్రోహాలని’’ సింపుల్‌ గా తేల్చేశాడనే అపవాదు కూడా వుంది ఈ రెండు విమర్శలు సత్యజిత్‌ రే ను జీవితాంతం వెంటాడాయి. ‘‘ఎవ్రిబడి లవ్స్‌ ఎ గుడ్‌ డ్రౌట్‌’’ అని పాలగుమ్మి సాయినాధ్‌ ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యాన్ని ఎత్తి చూపుతూ మరొకచోట అంటాడు. కానీ సత్యజిత్‌ రే…..

‘‘కరువును కరువుగా తీయలేకే ‘‘డిస్టింట్‌ థండర్‌ ’’ కోసం పన్నెండేళ్ళు ఆగాను. కరువంటే చనిపోవడం కాదు. బతికించడం. కరువు రోజుల్లో ఏ పల్లెకయినా వెళ్లండి లేదనకుండా యింత ముద్ద పెడతారు. గడపగడపలో కడుపునింపే మానవత్వం కనిపిస్తుంది. వాళ్లు తినడానికే వుండదు. పస్తులుండి, పచ్చి మంచినీళ్ళు త్రాగి తమకోసం వుంచుకున్నది పెడతారు.  ‘‘ లేక పోవడం’’ లో కరువు ఉనికి లేదు. లేకున్నా పెట్టగలిగే ఔదార్యంలో వుంది. ‘‘డిస్టింట్‌ థండర్‌’’ లో వున్న పేరడాక్సికల్‌ యాంగిల్‌ యిదే! స్వార్ధాన్ని, అహంకారాన్ని, ఆధిక్య భావనను, అంటరానితనాన్ని కాల్చి బూడిదగా చేసి మనిషిని కొత్తగా మొలకెత్తిస్తుంది కరువు.

‘‘సత్యజిత్‌ రే’’ అనే సృజనకారుడి అంతరంగాన్ని అర్ధం చేసుకోవడంలో మనం పొరపాటు పడ్డామా……?

‘‘మనమెంతో వివేకులమని పాశ్చాత్యదేశాల నమ్మకం మీరే మా చిట్టచివరి ఆశ’’ అని వారు అంటున్నప్పుడు నా తల కొట్టేసినట్టు వుంటుంది. నిజంగా మనకు అంత వివేకం వుందా? ఉంటే పాశ్చాత్య విధానాలకు ప్రభావితమై ప్రకృతికి వ్యతిరేకంగా మనపై మనం ఎందుకు ప్రయోగాలు చేసుకుంటాం?.

తన జీవితం మొత్తం ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికే వెచ్చించాడు సుందర్‌లాల్‌ బహుగుణ. బహుగుణ జీవన సారాన్ని ఈ నాలుగు వాక్యాలలో సరళంగా, సూటిగా చెప్పడమే ఈ పుస్తకం సాధించిన విజయం. సుందర్‌లాల్‌ బహుగుణ  ఇంకోమాట కూడా అన్నాడు.

‘‘గ్రామ స్వరాజ్యం అంటే స్వరాజ్యం వచ్చి, గ్రామం పోవడం కాదు, గ్రామం గ్రామంలాగా మిగలాలి గ్రామం వాకిట స్వరాజ్యం కాపలాగా పడి ఉండాలి’’

ఇప్పుడు జరుగుతున్నదేమిటి? గ్రామాలు పట్టణాలకి కాలనీలుగా మారిపోతున్న చారిత్రక విషాద దృశ్యాన్ని మనం చూస్తూనే వున్నాం కదా: సంపాదించిన దాన్ని నిలుపుకోవడం సంపాదించడం కన్నా కష్టం. ఎంత కష్టమయినా మనగ్రామాన్ని మనం నిలుపుకోగలగాలి అప్పుడే మన స్వాతంత్య్రానికి అర్ధం వుంటుంది.

ప్రపంచం మనలని మనం సాధించిన విజయాల ద్వారా, చేసిన ప్రయత్నాల ద్వారా మాత్రమే అంచనా వేస్తుంది.

వాటి ఆధారంగానే మన స్ధానాన్ని నిర్ణయిస్తుంది. మన నిర్ణయాల వెనుక వున్న కార్యకారణాలతో కానీ, అంతర్గత భావ సంఘర్షణలతో కానీ దానికి పనికిలేదు. అది వేసే ముద్రలన్నీ, ఉపరితల అంశాల ఆధారంగానే వుంటాయి.

ఒకప్పటి జన చైనా నాయకుడు ‘‘మావో’’ పైన చివరి దశలో వచ్చిన ఆరోపణలు అన్నీ యిన్నీ కావు. మావో నియంతగా మారిపోయాడన్నారు. పార్టీలో ప్రబలిన ఉదారవాద బూర్జువాలను బలహీనపర్చడానికి ‘‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’’, (ఒక పెద్ద ముందడుగు) తప్పిదాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి సాంస్కృతిక విప్లవాన్ని అడ్డుపెట్టుకున్నాడనీ అన్నారు. విప్లవం వల్ల ఇంత హింస ఎందుకు జరుగుతుందని ప్రశ్నించినవారూ వున్నారు.

మావో సాంస్కృతిక విప్లవాన్ని ఆలింగనం చేసుకోవడానికి కారణం ఏమిటి? చైనాలో మగవాళ్ళు మూడు ఆధిక్యతలకు  లోబడి జీవిస్తూ వుంటారు. రాజకీయం, కుటుంబం, మతం. ఈ మూడు మగవాడి పక్కలో పడుకుని వాడిని ఎటూ కదలనివ్వక మీద కాళ్ళేస్తాయి. రాజకీయ నిర్ణయాలు అతడి జుట్టును పట్టుకుంటాయి. కుటుంబ బాధ్యతలు అతడిని చుట్టుముడతాయి. మతం అతడిపై కుండల కొద్దీ సంప్రోక్షణ జలాన్ని కుమ్మరిస్తూవుంటుంది. స్త్రీలయితే, ఈ మూడు ఆధిక్యతలతో పాటు, పురుషుడి దురహంకారాన్ని కూడా భరించాలి.

సాంస్కృతిక విప్లవంతో తప్ప దేశం లోపల, బయట వున్న ఆధిక్యతల నిర్మూలన జరగదని మావో బలంగా విశ్వసించాడు.

విప్లవం డిన్నర్‌ పార్టీకాదు. తీరిగ్గా చదువుకునే స్పూర్తిదాయక వ్యాసం కాదు. చక్కటి పెయింటింగ్‌ కాదు. ఒక విప్లవం తరువాత మరొక విప్లవం రావాలి. విప్లమం నిరంతరం పురోగమించాలి.

ఇది మావో అంతరంగం. ఈ అంతరంగాన్ని ఎంత మంది పట్టుకోగలిగారు. అందుకే ప్రపంచం ఉపరితల అంశాల మీద ఆధారపడి బ్రాండీ ఇమేజ్‌ కల్పిస్తుందనేది. మాధవ్‌ శింగరాజు ఈ అంతరంగాన్ని పట్టుకోగలిగాడు.

ఇలాంటి పుస్తకాలు రాయడం ఒక అసిధారవ్రతం. ఏమాత్రం అటూ ఇటూ అయినా రసాబాస తప్పదు. వారం, వారం ఒక స్ఫూర్తి దాయక జీవిత చిత్రణ చేయడం మాటలు కాదు. మనం మామూలుగా ఒక పుస్తకాన్ని చదివి బావుంది/ బావోలేదు అంటూ తేలికగా ఒక మాటలో తేల్చేస్తాం. కాని ఒక వాక్యం రాయడానికి ఎంత కష్టపడాలి ఎన్ని వాక్యాలని డిలీట్‌ చేయాలి ఒక్క స్ఫూర్తివంతమైన, ఒక అర్ధవంతమైన, ఒక అజరామరమైన వాక్యం రాయడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులను ఆలోచనలతో వెలిగించాలి.

అందుకేనేమో ‘‘ గీసుకున్న బొమ్మలని కసాబిసా చెరిపేయడం చూసి నన్ను సృజనాత్మక నిస్పృహ పీక్కునితింటున్నదని, దానిని తప్పించుకోవడానికి కాసేపు నేను విశ్రాంతిని కోరుకుంటున్నానని మీకు అనిపించవచ్చు. బొమ్మగీయడం, దాన్ని చెరిపేయడం రెండూ ఒక్కటేనాకు. నిర్మూలన కూడా నిర్మాణంలో భాగమే అయినప్పుడు నాకు వేరే ‘‘కప్‌ ఆఫ్‌ టీ’’ అవసరమౌతుందా’’ అంటాడు మన మగ్బూల్‌ ఫిదా హుస్సేన్‌.

అలవోకగా చేసినట్టుండే వ్యాఖ్యలలోనే ఎంత లోతు వుంటుందో ఈ పుస్తకంలో అడుగడుగునా తగిలే వ్యాఖ్యలు చెప్తాయి.

‘‘మేరీ క్యూరీ’’ని గురించి రాస్తూ ‘‘జీవితం చేసే సహాయ నిరాకరణ, ఎంత అమానుషంగా వుంటుందో’’ అని నిట్టూరుస్తాడు.  యం.జి రామచంద్రన్‌, కరుణా నిధుల స్నేహం గురించి రాస్తూ నేను సాధించిన దాని గురించే నా ప్రాణ మిత్రుడు మాట్లాడుతున్నాడు. నేను పోగొట్టుకున్న అతడి పూర్వపు స్నేహాన్ని పుష్పగుచ్ఛంతో తిరిగి యివ్వగలడా? అని నేను ఆలోచిస్తున్నాను’’. అంటూ ఎం.జి.ఆర్‌. ఆవేదనను అక్షర బద్దం చేస్తాడు.

‘‘మట్టిలో వున్న దేశభక్తిని ఏ సామ్రాజ్యవాది వచ్చి పూడ్చిపెట్టగలడు’’ అని ప్రశ్నిస్తాడు సూర్యసేన్‌ గురించి రాస్తూ మంద్రంగా వున్నా సరే..  గ్రీష్మ పరితప్త జ్వాలానల మేదిని శీతల పవనం సేద దీర్చినట్లుగా మరేదీ సేద దీర్చదు.

ఈ అభౌతిక స్వరం కూడా అంతే! మెల్లమెల్లగా మనలోకి చొచ్చుకుని పోయి మనల్ని వెంటాడుతూ వుంటుంది.

ముఖేష్‌ గొంతులోని జీరలాగా… అప్పటి దాకా వానలో తడిసివచ్చి దుస్తులు పిండుకుంటూ మాట్లాడుతున్నప్పుడు గొంతులోంచి పలికే చలి వణుకులాగా!

                                                                                               —వంశీకృష్ణ

మీ మాటలు

 1. ఒక పాఠక స్వరం says:

  వంశీ కృష్ణ గారూ … మీ పరిచయం ఆసక్తిగా, ఆత్మీయంగా, తుషార వేళ నులివెచ్చని కిరణాల తాకిడికి ఒక్కొక్క రేక విచ్చుకునే సుమంలా ఉంది సుమా. నిజమే … కవిత, కథ, నవల, వ్యాసం … ఏదీ కాని వీటిని ఏమందాం ? ఆ ప్రక్రియలకు అతీతమయినవి గనకే మాధవ్ గారు అభౌతిక స్వరాలని నామకరణం చేసినట్టున్నారు. ఆయన కొన్నేళ్ళ పాటు ఆ ప్రముఖుల చుట్టూ సుడిగాలికి మల్లే తిరిగి వాళ్ళు ఏమరుపాటున నోరు తెరవగానే లిప్త పాటున వాయు రూపం లో గబుక్కుమని దూరి వాళ్ళ హావ భావ విన్యాసాలతో పాటూ మీరన్నట్టు వాళ్ళు ఏ తాత్విక భూమిక ఆధారంగా జీవితాన్ని కరిగించుకున్నారో దాన్ని పట్టుకో గలిగారు. అందుకే ఒక్కో స్వరం మీటుతుంటే సప్త రాగాలను పలుకుతోంది. ఆశ్చర్యమ్ ఏమంటే .. మీరు మాదవ్ లోకి పరకాయ ప్రవేశం చేసి వీటన్నిటినీ కొండని అద్దంలో చూపడం. ఏదీ మాధవ స్వరమో … ఏదీ అభౌతిక స్వరమో పాఠకులు తెలుసుకోలేనంతగా జడ పాయ అల్లిన రచయిత అంతరంగ భావనా తరంగాలను ఎంచక్కా విడమర్చి చెప్పినందుకు ధన్యవాదాలు .
  – ఒక పాఠక స్వరం

 2. చాల చక్కగా వ్రాసారు వంశీ గారు . ఈ బుక్ గూర్చి ఎంత చెప్పినా తక్కువే . ఈ సంవత్సరం కూడా నా రీడింగ్ లిస్టు లో ఇదే
  ఫస్ట్ ఉంటుందేమో . అసలు ఆ ఒక్క జీవిత సందర్భం దగ్గర అంత ఆలోచన కోణం ఉందా అనిపిస్తుంది ,దానికి తోడు
  అద్భుతమైన వచనం .దీనిని పరిచయం చేస్తూ రాజిరెడ్డి గారు అన్నట్లు ”వచనం కవిత్వం అయితే గానం చెయ్యాల్సిందే ”
  కాకుంటే నారికేళ పాకం . పైపైన చదివితే రచయిత నాడి అందదు.
  ఇప్పుడు జగదీశ్ చంద్ర బోస్ గారి గూర్చి అనుకుంటాను చెపుతూ
  ”టాగూర్ నాకు ఏకాంతాన్ని కప్పులో వంపుతాడు ” అంటారు . మొత్తం చదివి అర్ధం అయిన వారికి తప్ప అది టాగూర్
  పుస్తకం చదవడం అని అర్ధం కాదు . ఇంకా ”ప్రపంచాన్ని జయించాలి అనుకునే వాడు ఆకలి కడుపులతో
  కవాతు చేయిస్తాడు ” ఇలాటి ప్రయోగాలు ఎలా ఉంటాయి అంటే ….. పుస్తకాల పిచ్చి ఉన్న వారికి పంచ బక్ష్య పరమాన్నాలు తిన్నంత హాయిగా ……
  మంచి పుస్తకం అంతే చక్కగా పరిచయం చేసారు . ప్రతి ఒక్కరు కొని దాచుకోదగ్గ పుస్తకం .

మీ మాటలు

*