కథా చిలుక ఇంక చేతికి చిక్కనే లేదు!

 dasari1

నాకు కథంటే ఏమిటో  తెలుసు. కథలు ఎలా రాయాలో తెలుసు.

కానీ నాకు కథలు అల్లడం రాదు. యాభైకి పైగా కథలు రాసాను గానీ కథగట్టడం చేతగాలేదు. అందులొ ఒకటీ రెండూ కథలైఉండొచ్చుగాని అది కేవలం యాధృచ్ఛికం.

నాకు 110 మీటర్ల హర్డిల్ రేసు ఎలా పరిగెత్తాలో తెలుసు. ఆ రేసు లో గెలవడమూ జరిగింది- ’72 నుంచి ’74 దాకా…కాలేజీ ఆటల్లో. ఇది యాదృచ్ఛికం కాదు.

‘కథాకథనం’ లో కాళీపట్నంగారు, ” రాసే వాళ్ళలో డెభ్భై శాతం మందికి  కథ అంటే ఏంటో తెలీదు. తెలిసిన ముప్ఫైమందిలో ఇరవైమందికి కథ అల్లే ఒడుపు తెలీదు”.అంటారు. అదిగో ఆ ఇరవై శాతం మందిలో వాడిని నేను.

***

1972.

ఇంజినీరింగు మూడో సంవత్సరం.

కాకినాడ కాలేజి వార్షిక క్రీడలు….మీటర్ల హర్డిల్ రేసు.

అంతాకలిసి ఆరుమందిమి బారుతీరి ఉన్నాం.మిగిలిన అందరూ నాకన్న పొడవు. పెద్ద. శక్తిమంతులు. వేగవంతులు.

అయినా  నేను గెలిచాను. అందులోనూ ఉసైన్ బోల్ట్ కు మించిన లీడ్ తో.ఒక్కటే కారణం.

నాకు హర్డిల్సు ఎలా దాటాలో తెలుసు. ఎడమకాలు తన్నిపెట్టి కుడికాలు మీదుగా హర్డిల్స్ పైకెగరడం. ఎడమకాలును మడిచి ఒక సరళమైన అర్థవృత్తాకారంలో హర్డిల్ మీదుగా తీసుకు వెళ్ళడం, కుడికాలు భూమిని తాకీతాకగానే ఆ ఎడమ కాలును  తడబాటు లేకుండా ఇంకా ముందు సాగనివ్వడం- ఇది నాకు తెలుసు. అంచేత శృతి ఉన్న పాటలా సాగింది నా రేసు. మిగిలిన శక్తిమంతులంతా ఒకో హర్డిల్ దాకా రావడం, ఎలాగోలా దాని మీదనుంచి దూకడం, తడబడి నిలదొక్కుకుని ముందుకుసాగడం – పదిశృతుల్లో సాగిన పాట.

నాకెలా తెలిసిందీ ఒడుపూ? నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. పోటీలకు ఓ నెల ముందు పీ.ఆర్ కాలెజిలో ట్రైనింగ్ కాంప్ నడిపితే ఓ రెండురోజులు వెళ్ళాను. రేసు ఎలా పరిగెత్తాలో తెలిసింది. తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టే ఒడుపూ సమకూరింది.

***

కథలు రాయాలంటే ఏదో ప్రేరణ ఉండాలి. డబ్బూ, పేరూ ప్రేరణ అయిన వారి గురించి నేను మాట్లాడలేను. వారికి నా శుభాకాంక్షలు.

పరిసరాలను చూసి స్పందించి, అవి మనలో కలిగించిన అలోచనలనూ, అనుభూతులనూ, అవేదనలనూ అందరితో పంచుకోవాలనుకునే వారికోసమే  ఈ నాలుగు మాటలూ. ఆ ఆలోచనలూ, అనుభవాలను  కథలుగా చెప్పాలనుకొనేవారికి ఈ వ్యాసం.

ఇలాంటి స్పందనలు నాకు కలిగి నేను కథలు  రాసాను. మొదటి కథ 1978 లో దేవీప్రియ గారి ప్రజాతంత్ర లో వచ్చింది. ఆ సంతోషంలో మరో  నాలుగైదు రాసాను. ఎందుకో సంతృప్తి కలగలేదు. ఉప్పు లేదు.ఇతివృత్తం ఉంది. సన్నివేశాలు ఉన్నాయి. సంభాషణలున్నాయి.పాత్రలున్నాయి. వర్ణనలున్నాయి. భాషా, వాతావరణం, శైలీ అన్నీ ఉన్నాయి. అయినా ఉప్పు లేదు అనిపించింది. అదృష్టవశాత్తూ ఒక కథక మిత్రుడు అవి చదివాడు. “మీరు కథలుగాదు, వ్యాసాలు రాయండి”. అన్నాడు. తాటాకు మంట కోపం వచ్చింది. కానీ ఏదో  సత్యం చెప్పాడనిపించింది. కానీ ఆ సత్యమేంటో స్పష్టమవలేదు. అతనికీ తెలియదు. కానీ కథలు కట్టడం కట్టిపెట్టడం నాకూ, దేశానికీ క్షేమకరం  అనిపించింది.

మళ్ళా  దాదాపు  పదిహేనేళ్ళ తర్వాత  ఒక సంగతి పదిమందికీ చెప్పకుండా ఉందలేని సంధర్భంలో పడ్డాను.  రాయకుండా ఉండాలేని స్థితి. ‘నాకు తెలిసిన మాధవుడు ‘ బాణీ లో ‘బ్రతక నేర్వని వాడు ‘ గురించి రాసాను. సహృదయ మిత్రులు వాకాటి దాన్ని కథాప్రభ లో ప్రచురించారు. నేను గౌరవించే కథకులో పదిమంది, ‘బావుందోయ్ ‘    అని భుజం తట్టారు.

SAM_9938

ఓ రెండేళ్ళ పాటు అదే ఊపు. పది కథలు…అందులో ‘శేఫాలిక ‘ లాంటి అప్రయత్నంగా పుట్టిన కథలూ ఉన్నయి. అన్నీ అచ్చయ్యాయి..రచన, ఆహ్వానం, సుప్రభాతం..అయిన మళ్ళా అదే మధన. ఉప్పు లేదు అన్న స్పృహ, అసంతృప్తి. అసహనం…అందులోంచి ఒక జ్ఞానం.

సమాజం గురించీ, మనుషుల గురించీ కథల రాస్తున్నప్పుడు, ఆ  సమాజం గురించీ, కథలు రాయడం  గురించీ ప్రాధమిక శాస్త్రీయ అవగాహన అవసరమన్న జ్ఞానోదయం జరిగింది.

కొంచం తడుములాడగా సమాజపుటవగాహనకు సొషియాలజి అధ్యయనం మంచిమార్గమని తెలిసింది. ఇంటర్మిడియట్ పుస్తకాల్తో మొదలుపెట్టాను. అక్కడ మొదలైన ప్రయత్నం ఓ పదేళ్ళ తరవాత ఎం.ఫిల్ దగ్గర ముగిసింది.  ఓనమాలు తెలిసాయి.’ కామన్ సెన్సు, స్పందించే హృదయము  మాత్రమే సమాజపు గతిని అర్థంచేసికొవడానికి పనికి రావు’ అన్న నా  భావం నిజమని తెలిసింది.

కథ అంటే ఏమిటో తెలుసుకోవడం మాత్రం భగీరథ ప్రయత్నం అయింది.

ఇంగీషులోనూ, తెలుగులోనూ పుస్తకాలు వెదికాను. దొరికాయి.

సహ కథకులతోను, సీనియర్ రచయితలతోనూ చర్చించాను- వాళ్ళకు విసుగు పుట్టేదాకా!

కానీ కంచికి వెళ్ళిపోయే కథల చిదంబర రహస్యం తెలియలేదు. చాలా పుస్తకాలు మాయగారడీ వాళ్ళ దొంగ మోళీలుగా పరి.మరికొన్ని పరిణమించాయి. మరి కొన్ని కొండను తవ్వితే ఎలుక తోక  దొరికిన చందం.  కథామాంత్రికుడి ప్రాణాలు దాగి ఉన్న చిలుక ఉండే చెట్టుతొర్రదాకా చేరుకోగలిగానని కొన్నిసార్లనిపించినా, – చిలుక చేతికి చిక్కనే లేదు!

***

 

అదిగో  అలాంటిదే ‘ఎడిసన్ ‘ సమయం లో కాళీపట్నం గారి ‘కథకథనం’. చాలా చిన్న పుస్తకం, దొరికింది.

రసవిద్య నేర్పే తాళ పత్రగ్రంధం దొరికితే వేమన కూడా అంత సంబరపడిఉండడు.

ఒకటికి పదిసార్లు చదివాను.

వార్తకూ, వార్తాకథకూ, వ్యాసానికీ, కథకూ మధ్యనున్న అతిసూక్ష్మమైన తేడా బోధపడింది.

వస్తువు, ఇతివృత్తం, సన్నివేశం, సంఘటనా, శిల్పం, శైలి – వీటి గురించి అవగాహన కుదిరింది. వస్తువుకూ ఇతివృత్తానికీ, సన్నివేశానికీ సంఘటనకూ, , శిల్పానికీ శైలికీ మధ్యనున్న తేడాలు తెలిసాయి.

అలాగే కథలో భాషా, వర్ణనలూ, పాత్రలూ, సంభాషణలూ ఎలా ఉపయోగించాలో తెలిసింది.

కథకు ఎలా పేరు పెట్టాలో, ఆరంభించాలో, ముగించాలో – ఇవన్నీ చిన్నపిల్లాడిని ఒళ్ళో కూర్చొపెట్టుకుని గోరుముద్దలు తినిపించినంత ప్రేమగా చెప్పుకొచ్చారు కాళీపట్నం.

ఇవన్నీ తెలుసుకున్న కొత్త ఉత్సాహం తో మనసులో పేరుకుపోయి ‘రాయి, రాయి ‘ అని వేధిస్తున్న వస్తువులలో నలభై, యాభై కథలు రాసాను – ఓ దశాబ్ద సమయంలో. కానీ షరమామూలే! ఉప్పు సమస్య. వాటిలో కొన్ని నిజంగా కథలే.సందేహం లేదు. రస సృష్టి కూడా జరిగిందన్న మాటా నిజమే,  కానీ అది యాదృచ్ఛికం! కథను అల్లే కట్టే నేర్పూ, కథను పండించే ఒడుపూ నాకు వంటబట్టలేదన్నది వాస్తవం!! సరే, మోళీ కట్టేసి ఉప్పుదగ్గరికి వస్తాను.

***

రెండు చేతులూ, రెండు కాళ్ళూ, ఒక తల, రెండు చెవులూ, రెండు కళ్ళూ ఒక ముక్కూ, బొట్టూ/మీసం- ఇది ఏ చిన్నపిల్లాడైనా గీయగల మనిషి బొమ్మ. ప్రయత్నిస్తే ఇదే బాణీలో పులిబొమ్మా, గుఱ్ఱం బొమ్మా, ఏనుగు బొమ్మ కూడా గీయవచ్చు. అలాగే వార్తను మించిన, కథను మించిన, వ్యాసాన్ని మించిన రచన ఎవరైనా చెయ్యవచ్చు.

కానీ ఆ బొమ్మను చిత్రం చేయడం ఎలా? రచనను కథ చేయడం ఎలా?

కీలకం ప్రాణ ప్రతిష్టలో ఉంది. కౌర్యం, హుందాతనం పులి మొహంలో కనిపించాలి. దయా, కరుణా మదర్ తెరిసా లో కనిపించాలి.  ఆక్రోశం, ఆక్రందన బడుగు జీవుల బొమ్మల్లో ప్రతిబింబించాలి. మేధస్సుని దాటి మనసుని పట్టుకు ఊపే విశేషం ఏదో కథలో పాఠకుడికి కనిపించాలి. అప్పుడవి చిత్రాలవుతాయి.కథలవుతాయి. ఆ శక్తి అలవడినపుడు అసలు రేఖలతో కూడా పని ఉండకపోవచ్చు. ఆకృతుల అవసరమూ ఉండకపోవచ్చు.కథాచట్రమే అవసరమవక పోవచ్చు. గుయోర్నికాలూ, వాంగ్మూలాలూ వస్తాయపుడు. సూటిగా గుండెను తడతాయి.

‘ఇంకా ఎంతకాలం ఈ అరిగిపోయిన సిద్ధాంతాలు ? ఎందుకా దిమ్మిసాగొట్టిన రహదారులూ ? మా స్పందనలు వేరు, మా అనుభవాలు వేరు . మేం కొత్తరకంగా రాస్తాం . నియమాలు పట్టించుకోం….. ‘ అనవచ్చు కొందరు నవతరం కథకులు.

నిజమే. నియమాలూ , సిద్ధాంతాలు కాలానుగుణంగా మార్చుకుంటూ వెల్లాలి. అవసరమైతే బద్దలుగొట్టాలి  కూడాను ! కాని ముందు అవి ఏమిటో తెలియాలి కదా… ‘ఓహ్ ! ఇదేనా కవిత్వం. ఇలా అయితే నేనూ రాయగలను, ‘ అని కథలో ఓ పిల్లాడంటే శ్రీ శ్రీ సంతోష పడటం వెనక ‘కవిత,ఓ కవిత…. ‘ పునాది ఉందన్నమాట మరిచిపోకూడదు. కథారహస్యాలు, కథల ప్రాణం ఎక్కడుందో ఆ వివరము తెలియక పోతే చిన్నపిల్లల బొమ్మలొస్తాయి, గుయర్నికాలు కాదు !

అన్నట్టు, నేను కావాలనే ‘వస్తువు, ఇతివృత్తం….’ఈ పాఠాలు చెప్పటం లెదు. కాళీపట్నం ఇప్పటికే చలాచక్కగా  ‘కథాకథనం’ లో చెప్పారు.  అది ఒకటికి పదిసార్లు చదవమనీ పాతా కొత్త కథకులందరికీ నా విన్నపం.

కథకులందరూ కొడవటిగంటిలూ , త్రిపురలూ కాగలరని నేనూ ఆశపడను. కానీ కథామూలాలు,లక్షణాలూ క్షుణ్ణంగా తెలుసుకుంటే నోటికి పదిమంది కథకులైనా తమ తమ కథల్లో ‘ ప్రాణ ప్రతిష్ట ‘ చెయ్యగలరని నా నమ్మకం.

 -దాసరి అమరేంద్ర

మీ మాటలు

  1. amarendra says:

    సంజాయిషీ- దిద్దుబాట్లు

    ఈ వ్యాసం లో అచ్చు తప్పులు ఉన్నాయి ..పూర్తిగా నాదే బాధ్యత..
    రెండు తప్పుల్ని సవరించాల్సిన అవసరం ఉంది ..
    చివరి భాగం మొదట్లో ..’వార్తను మించిన,కథను మించిన ..’ అన్న చోట ‘వార్తను మించిన, వార్తా కథను మించిన..’అని ఉండాలి
    అలాగే ఈ భాగం మధ్యలో ‘..అని కథ లో ఓ చిన్న పిల్లాడంటే శ్రీశ్రీ..’ అన్నచోట ‘ అని సభలో ఓ పిల్లాడంటే..’ అని ఉండాలి..

    మిగిలిన తప్పులు చదివి విసుక్కోండి..నవ్వుకోండి..నన్ను మాత్రం క్షమించేయండి..

  2. రమణ మూర్తి says:

    ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. రచనని కథకులూ సీరియస్ గా తీసుకోవడంలేదు, పాఠకులూ సీరియస్ గా తీసుకోవడం లేదు. “నాకు ఆ కథ, నిర్మాణం, శిల్పం లాంటివి తెలీవు” అని ఇరువర్గాలూ అంటున్నారు.

    బహుశా, ఈ విచిత్ర పరిస్థితి వల్లనే యేమో – కొంచెం బాగా రాయగలిగిన వాళ్ళు మిన్నకుండిపోతున్నారు.

    రాయడం, చదవడం వ్యాపకంగా ఉండే రోజులుపోయి, కాలక్షేపంగా మారుతున్న పరిణామక్రమంలో, ప్రమాణాలు ఇంకా దయనీయంగా తయారవుతాయి.

    [వల్లంపాటి గారి ‘కథాశిల్పం’ ఇంతే అద్భుతమైన ఇంకో పుస్తకం. కథానిర్మాణాలని పూర్తిస్థాయిలో చర్చించిన పుస్తకం.]

    • రమణ మూర్తి గారూ ,థాంక్స్
      క్షమించాలి ..నేను కొంచెం విభేదిస్తాను.
      సీరియస్ గా తీసుకోని వాళ్ళు అప్పుడూ ఉన్నారు ..తీసుకొనే వాళ్ళు ఇప్పుడూ ఉన్నారు.
      తీసుకొనే paathakula గురించీ, రచయితల గురించీ నా తపన.
      కారా గారు చెప్పిన 20 శాతం లోకి paathakuloo , పది శాతం లోకి రచయితలూ రావాలని నా కోరిక!
      అలా రావలసిన అవసరం గురించి,అందుకు నాకు సాయపడిన మార్గం గురించి చెప్పడమే నేను చేద్దామనుకొన్న పని.
      అవును.వల్లంపాటి గారిది మరో చక్కని పుస్తకం!!

      • రమణ మూర్తి says:

        మీకు వీలైతే “రెండు దశాబ్దాలు కథ 1990 – 2009” పుస్తకానికి జంపాల చౌదరి గారు రాసిన ముందు మాట చదవండి. పుస్తకం ఫ్రీ శాంపిల్ కినిగే లో లభ్యం. కథల ప్రమాణాలు ఎలా దిగజారుతున్నాయో అక్కడ స్టాటిస్టికల్ గా చెప్పడం జరిగింది.

        అవసరాలూ, కోరికలూ వేరు; వాస్తవాలు వేరు.. :)

  3. amarendra says:

    థాంక్స్ రమణ మూర్తి గారూ!

  4. prof.Raamaa Chandramouli says:

    ఈ వ్యాసం చాలా నిజాయితీగా హృదయంలోనుంది వెలువడింది ..అమరేంద్ర గారి ఆత్మాన్వేషణ ‘ ఉప్పు’ గురించి బాగుంది.ఐతే అంతిమంగా సృజన ఏదైనా ఆత్మతో,వేదనతో ,నిగ్రహాతీత మధనతో మాత్రమే నిర్వహించబడేది..వస్తువే తన రూపాన్నీ ,నడకనూ,విన్యాసానీ తొడుక్కుని ఆవిష్క్రుతమౌతుంది.అనుభవంనుండే శాస్త్రం..శాస్త్ర ఆవిష్కారం.

    – ప్రొ.రామా చంద్రమౌళి

  5. DrPBDVPrasad says:

    అమరేంద్ర గారూ! మీ హృదయ పంజరం లొ బంధించేసుకొన్న కథా చిలుక మీకు అందదు
    మీ శేఫాలిక లాంటి కథలతో మాలాంటి పాఠకులు చాలాసార్లు అందుకున్నారు.
    మీ మొదటి కథ చదవలేదుకాని, మీ కథలన్నింటిలోను ఇతివృత్తం కథనం ఆకట్టుకోవటమే కాదు వెంటాడతాయి. ఇంతకు మించి కథల్లో ఏముండాలో నాకయితే తెలియదు
    ఇలా వుండే ఏ కథైనా మా లాంటి వాళ్ళకు నచ్చుతాయి
    .మీ కథలకు స్పందించి ఆంధ్రప్రభ కి రెండుసార్లు లేఖ రాసిన ఊ హ్ ..పబ్లిష్ కాలేదు (సారంగ కి థాంక్స్) నేను గాజియాబాద్ లో ఉండి కలుసుకోలేక పోయాను

    అయితే..
    మీరు రామా చంద్రమౌళి గారు వంటి జగమెరిగిన కథకుల ఈ వినయం నూతన రచయితలను కొంత ఆలోచింప చేస్తుంది
    మీరు మరిన్ని కథలు రాయాలని కోరుకుంటూ
    …..

    • ప్రసాద్ గారూ ..థాంక్స్ ..ఏం చెప్పనూ,.. మీ మాటలు స్పూర్తిని ఇస్తున్నాయి..నా తపన కథ కు అత్యవసరమయిన ‘ప్రాణం’ గురించి ..ఆ విషయం లో నా మీద నాకు అసంతృప్తి ఉంది! అలా అని నేను ఇప్పటిదాకా రాసిన వాటిల్లో కనీసం ఇరవై కథలను నేను ఇష్టం గా ఓన్ చేసుకుంటాను !
      కానీ కథాలక్షనాలతో సంబంధం లేకుండా ‘ఆ యా వస్తువులే తమ తమ రూపాలను నిర్మించుకొంటాయి’ అన్నది మహా రచయితల విషయం లో జరగొచ్చు కానీ మామూలు రచయితలు ఆ ఈజీ ట్రాప్ లో పడి తమ తమ వార్తా కథనాలనూ, కథా వ్యాసాలనూ అసలు సిసలు కథలని భ్రమపడటం గురించి నాకు కన్సర్న్ఉంది ..అది velibuchhataaniki నన్ను నేనే నమూనా గా తీసుకుని ఈ వ్యాసం రాసాను!

      మరిన్ని కథలా !! నిజానికి నాకూ ఆ ఆశ ఉంది!
      మరో సారి మెనీ థాంక్స్!!ఫోను చెయ్యండి 9818982614

Leave a Reply to amarendra Cancel reply

*