సముద్రపు హోరుకి సరిగమల తోడు…మన్నాడే!

Manna-dey

“కడలిలెఒళవుం… కరళిలెమోహవుం.. అడజ్నుకిల్లొమనె అడజ్నుకిల్లా.. మానసమైనవరుం.. మధురం…”  అన్న మళయాళం పాట విన్నాను.

అబ్బ.. సముద్రపు హోరులో మెత్తగా సుతిమెత్తగా కలిసిపోయి ఆ స్వరం ఎవరిది? మన్నాడేది కాక?!

ఇరవై రెండుసార్లు ఆ సినిమా  ‘చెమ్మీన్’ చూశాను. సిల్వర్ స్క్రీన్ మీద చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లాంటిది ఆ సినిమా. దర్శకుడు రామూ కరియత్. సంగీత దర్శకుడు సలీల్ చౌధరి. నటీనటులు సత్యన్ , మధు, షీలా.. ఓహ్.. తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ఓ బెంగాలీ క్లాసికల్ సింగర్ ఓ మళయాళ చిత్రంలో పాడటమా? అసలెందుకు పాడించాల్సి వచ్చింది? ఎందుకూ? ఆ పాట ‘మన్నాడే’ మాత్రమే పాడగలడు. విన్న ‘చెవులకి’ ఆ సముద్రపు హోరుని తనొక్కడే వినిపించగలడు.

యస్. ఎస్.ఎల్.సి చదివేటప్పుడు మా ఇంట్లో రేడియో లేదు. హోటల్ రామారావు ముందర్నించి నడుస్తూ వుంటే రోజూ ఏదో ఓ సమయంలో ఓ పాట వినిపించేది. అతను హిందీ పాటలే ఎక్కువ వినేవాడు. ‘వివిధ్ భారతి’.. ఆ పాటకి అర్ధం అప్పుడు నాకు తెలీదు. కానీ .. గుండెకి గాయమై ఒక్కో రక్తపు బొట్టు కారుతుంటే, భగ్న హృదయానికి ఎలాంటి ‘తీయని’ బాధ వుంటుందో ఆ బాధ నా మనసుకి అర్ధమయ్యేది. అది నవరంగ్‌లోని పాట.
“తూ చుపీ హై కహా.. మై తడప్తా యహా” అన్న (నువ్వెక్కడ దాక్కున్నావూ.. నేనిక్కడ తపిస్తూ వున్నాను) గీతం అది. ఆలపించేది నేనే అనిపించేది. ఎన్ని పాటలూ? ఎందరో గాయకులున్నారు. గుండెలోతుల్లోంచి ‘విషాదాన్ని’ వెలికి తీసిన ముఖేష్, పాటకే సొబగులు అద్దే రఫీ..

మలయమారుతంలా తాకే తలత్, ఉత్సాహంతో వెర్రిగంతులు వేయించే కిషోర్.. ఎందరో మహానుభావులు… మరి ఆకాశంలోకి ‘స్వరాన్ని’ రాకెట్‌లా పంపే మహేంద్రకపూర్?  అవును. అందరూ మహానుభావులే…. కానీ… మన్నాడే వేరు.. మనిషికి బట్టలు తొడిగినట్టు పాటకి ‘శరీరాన్ని’ తొడుగుతాడు.

‘ధర్తి కహే పుకార్ కే’ (దో భీగా జమీన్)  పాట వింటుంటే మనమూ తుళ్లిపోతాం.
‘మౌసం బీతాజాయ్’ అంటూ.. ‘తూ ప్యార్ కా సగర్  హై.. తెరీ ఇక్ భూంద్ సే ప్యాసే హమ్’ అని మన్నాభాయ్ పాడుతుంటే కళ్లవెంట విషాదమో, ఆవేదనో కాని అశృవుల్ని రాలుస్తూ ‘ధ్యానం’ లో మునిగిపోతాం.. ఏమంటాడూ..?  నీవో ప్రేమసముద్రానివి.. ఒక్క చుక్క ప్రేమ చాలు మా దాహం తీరడానికి..’ అంటాడు. (సినిమా – సీమ, రచన – శైలేంద్ర). ‘ఇధర్ ఝూమ్ కె గాయె జిందగి.. ఉదర్ హై మౌత్ ఖడి ‘ అన్న లైను వినగానే తటాల్న మేలుకుంటాం. అవును.. ‘జీవితం ఇక్కడ చిందులేస్తుంటే, అక్కడ మృత్యువు నోరు తెరుచుకుని సిద్ధంగా వుంది..’ ఎప్పుడు తనలో మనని కలుపుకుంటుందా అన్నదే ప్రశ్న. ఆ ప్రశ్న వేసిందెవరూ?  ‘మనకి మనమేనా?’  అన్నంత మాయలో ముంచుతుంది మన్నాడే స్వరం.

వెన్నెల రాత్రుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ పాడుకునేవాడ్ని. ‘ఏ రాత్ భీగి భీగి..’ అంటూ. ‘చాంద్’ ఉండక్కర్లా… చీకటైనా విరహవేదనే.. ‘ఠండీ హవా!’ గుండెను తాకుతోంది మిత్రమా…!

‘సుర్ నా సజే.. క్యా గావూ మై.. సుర్ కే బినా జీవన్ సూనా..’ (శృతి చేయలేనివాడ్ని.. ఏమని పాడను? శృతి లేని జీవితం.. స్వరం లేని జీవితం శూన్యం కాదా?) దేన్ని సృశించాలి? దేన్ని ‘స్వరిం’చాలి? జీవితాన్నేగా..!

‘కోరి చునరియా ఆత్ మా  మోరీ.. మైల్ హై మాయాజాల్ .. ఓ దునియా మేరే బాబుల్ కా ఘర్.. ఏ దునియా ససురాల్’ తెల్లని వస్త్రం లాంటిది నా ఆత్మ.. యీ మాయాలోకం ‘మైల’ (మరకలతో) నిండి వున్నది. ఆ లోకం నా పుట్టిల్లు.. యీ లోకం అత్తవారిల్లు.. అయ్యో… యీ ‘మరక’ పడ్డ వస్త్రంతో నా ‘తండ్రి’కి మొహం ఎలా చూపించనూ? అని రెండు లోకాల్ని ఒకేసారి చూపించే మన్నా మన మద్యలో లేరా? వెళ్లిపోయారా ఆలోకానికి.. మాయ నిండిన యీలోకాన్ని వొదిలి?

‘లాగా  చునరీ మే దాగ్. చుపావు కైసే’ పాట ‘రానివాడు’ గాయకుడిగా అనర్హుడు. ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా, ‘పాటలపోటీ’ అంటూ జరిగితే మాత్రం యీ పాట ఎవరో ఒకరు పాడాల్సిందే. లేకపోతే అది ‘సంగీత కార్యక్రమం’ ఎందుకవుతుంది? తేనెపట్టులోంచి వరసగా తేనెచుక్కలు రాలినట్లు మన గుండెల మీద వాలుతాయి ఆ స్వరాలు.. అదీ.. మన్నా మేజిక్ అంటే.. అందరూ క్లాసికల్, సెమి క్లసికల్ సాంగ్స్ పాడగలరు. కానీ, మన్నాడే ‘స్టైల్’ వేరు. అత్యంత సహజంగా పాడతారు. గొంతు ‘పాట’ మొదలెట్టినప్పుడు ఎంత ‘ఫ్రెష్’గా వుంటుందో, చిట్టచివరి లైన్ కూడా అంతే ఫ్రెష్‌గా వుంటుంది. అదీ పాటలోని ‘ఎమోషన్స్’ని వెదజల్లుతూ..  బంగారానికి సువాసన అబ్బితే ఎలా ఉంటుందో తెలీదు గానీ, మన్నాడే ‘స్వరం’లో ఆయన పాడిన ప్రతీ పాటకీ ఓ ‘చిరునామా’  దొరుకుతుంది.

‘ఏ కజ్‌రారీ  చంచల్ అఖియా.. హోట్ గులాబీ..’ అని రాజ్‌కుమార్ అభినయిస్తుంటే పరవశించని హృదయం ఉన్నదా?  ‘ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయలియా’ పాటలో.. ఆ ‘పరవశం’ నింపింది మన్నాడే కాక మరెవరూ? నిజంగా మన్నాడే ‘జాదూ’ చేశారు.

‘కస్మే వాదే ప్యార్ వఫా.. సబ్ బాతే హై బాతోన్ కా క్యా?’ ఉప్‌కార్ సినిమాలో కళ్యాణ్‌జీ సంగీత నిర్దేశికత్వంలో ‘ఇందీవర్’ రాసిన యీ పాటని ‘మనసు’లోనే ‘ఆహ్వానించని మనిషి’ ఉండడు.

తేరీ సూరత్ మేరీ ఆంఖే’ సినిమాలో S.D.బర్మన్‌గారు శైలేంద్ర రాసిన ఓ అద్భుతమైన పాటని మన్నాడే చేత పాడించారు.

‘పూచోన కైసే మైనే రైన్ బితాయీ.. ఇక్ పల్ జైసే  ఇక్ యుగ్ బీతా.. యుగ్ బీతే మోహె నీంద్ నా ఆయే..’ శైలేంద్రగారి ‘భోజ్‌పురీ’ మెరుపులు చాలా సహజంగా మన్నాడే గొంతులో ఒదిగిపోయాయి. ముఖ్యంగా .. మోహే.. మోరా .. అనేవి. భాషకి అతీతుడేగా గాయకుడంటే! (స్నేహితులారా.. ఒక్కొక్క పాటనీ పూర్తిగా హిందీలో రాసి, తెలుగులో స్వేచ్చానువాదం  చేసి ‘వినిపించాలని’ వుంది. అంత పిచ్చెక్కుతోంది మన్నాడే పాటల్ని తలుచుకుని).

1965లో టాప్ 2nd  సాంగ్‌గా ‘బినాకా గీత్‌మాలా’లో వచ్చింది మన్నాడే పాడిన ‘ఆవో ట్విస్ట్ కరే’ పాట. మన్నాడే ఆ పాట పాడింది మెహ్‌మూద్ కోసం. సినిమా భూత్ బంగ్లా. సంగీతం ఆర్.డి.బర్మన్. రాసింది హస్రత్ జైపూరీ. పాయింట్లు 277. ఆయన ‘క్లాసికల్’ మాత్రమే కాదు ‘వెస్ట్రన్’ తోటీ ‘మేజిక్’ చెయ్యగలరని నిరూపించిన పాట అది. అదే సంవత్సరం రఫీ & మన్నాడే కలిసి పాడిన ‘ఏ దో దీవానే దిల్ కే చలే హై దేఖో మిల్ కే (జోహార్ మెహ్మూద్ ఇన్ గోవా.. సంగీతం-కళ్యాన్‌జీ- ఆనంద్‌జీ.. రచన కువర్ జలాలా బాదీ) 177 పాయింట్లతో 12వ పాటగా నిలిచింది. (మొత్తం 1965లో టాప్ 15 సాంగ్స్ లిస్ట్)

కాబూలీవాలా సినిమాలో ‘ఏ మేరే ప్యారే వతన్’ పాటని ఏ భారతీయుడైనా మర్చిపోతాడా? (సంగీతం సలీల్ చౌధరీ. రచన ప్రేమ్ ధవన్) అలాగే మరోపాట.. “పాడవోయి భారతీయుడా” అని శ్రీ శ్రీగారు రాసిన చిరస్మరణీయమైన పాట… హిందీలో సినిమా పేరు నాస్తిక్ (మన హైద్రాబాదీ ‘అజిత్’ హీరో. రాసింది ప్రదీప్.. సంగీతం సి.రామచంద్ర. ఆ పాట.. “దేఖ్ తేరే సంసార్‌కి  హాలత్ క్యా హోగయీ భగవాన్… కిత్‌నా బదల్ గయా ఇన్సాన్.” అనే పాట. ‘జానే అంజానే’ సినిమాలో శంకర్ జైకిషన్ స్వరపరచగా SH బిహారీ రాసిన “చమ్.. చమ్.. బాజేరే పాయలియా..!’  అనే పాట. అది గుండె చప్పుడుతో సహచర్యం చేస్తుంది. గుండెలో నాట్యం  చేయిస్తుంది. సీత ఔర్ గీతాలో ( ఆర్.డి. బర్మన్ – ఆనంద్ బక్షీ) ‘అభీ తో హాత్ మే జామ్ హై..’  పాటని ఎన్నిసార్లు ‘విస్కీ’తో ఆస్వాదించానో..

భయ్యా.. “దునియా బనానేవాలే.. క్యా తేరే మన్ మే”(శంకర్ జైకిషన్.. హస్రత్ జైపూరీ. సినిమా జిద్దీ) పాటలు వినకపోతే ‘కాహెకో దునియా బనాయీ? అని ఎలా ప్రశ్నించగలం? ‘బాత్ ఏక్ రాత్ కీ’లో ‘వో కిస్‌నే చిల్‌మన్ సే మారా… నజారా ముఝె.. ‘ (శంకర్ జైకిషన్.  మజ్రూహ్ రచన) అని మన్నాడే పాడుతుంటే పిచ్చెక్కదూ?

సోదరులారా.. సోదరీమణులారా.. క్షమించాలి. నా కళ్లు ‘నీలాల్ని’ వర్షిస్తున్నాయి. ఏడుపు తన్నుకొస్తుంది.

‘ఆజా సనమ్ మధుర్ చాంద్‌నీ మే హమ్..’   (శంకర్ జైకిషన్,  హస్రత్, చోరి చోరి సినిమా) ‘తుఝే సూరజ్ కహూ యా చందా (ఏక్ ఫూల్ దో మాలీ , కవి –  ప్రేమ్ ధవన్ రచన), కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే’ (మదన్‌మోహన్, రాజేంద్ర కృష్ణ. దేఖ్ కబీరా రోయా సినిమా), ‘శ్యామ్  ఢలే జమూన కినారే’ (తెలుగులో యమునా తీరమునా, సంధ్యా సమయమున…. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆనంద్ బక్షీ. పుష్పాంజలి సినిమా),’తుఝ్ బిన్ జీవన్, కైసే జీవన్(బావర్చీ సినిమా, మదన్‌మోహన్, కైఫీ ఆజ్మి), చునరీ సంభాల్ గోరీ.. ఉడీ చలీ జాయిరే (ఆర్.డి, మజ్రూహ్, బహారోన్ కి సప్నే సినిమా), మస్తీ భరా హై సమా…!’  (పర్వరిష్ సినిమా, హస్రత్ రచన, ఎన్.దత్తా) ‘తూ హై మేరా ప్రేమ్ దేవతా’ (ఓ.పి నయ్యర్, కమర్ జలాలాబాదీ, కల్పన సినిమా).

ఎన్ని పాటలు ఉదహరించను? భగవాన్. ఆయన మమ్మల్ని అలరించారు. పాటలతో మురిపించారు. నీలో మళ్లీ కలిసి పోవడానికి పుట్టింటికి అంటే నీ దగ్గరికి చేరిపోయారు. పోన్లే.. ” ఏ భాయ్ .. జరా దేఖ్ కే చలో’ అని మాకు జాగ్రత్తలు చెప్పే వెళ్లారుగా. జీవన వేదాంతం బోధించే వెళ్లారుగా.. ‘ కోయి బాత్ నహీ. ఫిర్ మిలేంగే’..

ఒకమాట చెప్పక తప్పదు. “వాలు జడ – తోలు బెల్టు ” అనే సినిమా జరిగేటప్పుడు ‘విజయబాపినీడు’గారు నన్ను “భువనచంద్రగారూ.. మీకు హిందీ అన్నా, హిందీ సాహిత్యమన్నా,  సినిమాలన్నా పిచ్చి కదా. మీకు నచ్చిన సీను, పాట చెప్పండి!” అంటే శ్రీ 420లోని సీను- దానిలో వచ్చే ‘ప్యార్ హువా ఇక్‌రార్ హువా హై, ప్యార్ సె ఫిర్ క్యో డర్‌తా హై దిల్’ అనే పాటని పాడి వినిపించా. ఆయన అదే పాటని (తెలుగులో రాస్తే) ఆ సినిమాలో పెడదామన్నారు. నేను ఒప్పుకోలేదు. రాయలేక కాదు. కానీ, అంత గొప్ప పాట గౌరవాన్ని యధాతథంగా నిలుపుదామని) చివరికి విజయబాపినీడుగారు నా మాటని గౌరవించి బాలూ+చిత్రలతో ‘తననా’లలో ఆ పాట పాడించారు. ‘No Lyric’ ఇదే నేను మన్నాడే బ్రతికుండగా ఆయనకిచ్చిన గౌరవం. ఆ గౌరవం భద్రంగా నా గుండెల్లో (మీ గుండెల్లోనూ) జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే ‘మన్నా’ మన గాయకుడు. మధురగాయకుడు.  శెలవు దాదా!

ఇందులో మన్నాడే జీవిత విశేషాలు ‘ఒక్కటి’ కూడా రాయలేదు. ఎందుకు రాయాలి? ఎవరికి తెలీదని?

పోనీ వచ్చే ఏడాది ఆయన్ని స్మరించుకుంటూ ఎన్నెన్నో ‘విశేషాలు’ రాస్తాను. సరేనా.. అయ్యా .. యీ వ్యాసంలో ఉదహరించినవి చాలా తక్కువ పాటలు మాత్రమే. అంత సూర్యుడిని అద్దంలో చూపించాను.

అంతే

మీ భువనచంద్ర..

మీ మాటలు

 1. బాగుంది మీ నివాళి. నీటి తెరతో కప్పబడిన నయనాలతో రాసినట్లుగా తెలిసిపోతోంది. ఒక దుఃఖంతో కూడిన ఉద్వేగం ఎదో మిమ్మల్ని ఆవరించి మీ కలాన్ని నడిపించిందా అనిపించింది.

  “దునియా బనానేవాలే.. క్యా తేరే మన్ మే” – ఇది ముకేష్ పాడారు.

  • Bhuvanachandra says:

   అవును ఆ పాట ముఖేష్ రాసిందే ….అందులో”’ జీవన్ కె పథ్ పర్ మీత్ మిలాయి”’…..” జీవనపదంలోస్నేహితుల్ని కలిపావు మళ్ళీ ఎందుకు విడదీస్తున్నావూ ? ” అనే ప్రశ్న కోసమే ఆ పాటని ఉదహరించాను ….ఎమోషనల్ మిస్టేక్…..అలాగే … ”అడజ్ను విల్లో మనే అడజ్ను విల్లా ”.అంటే .. ”’కడలి లోని కెరటాలూ హృదయం లోని మొహాలూ ఎంత అణచినా అణగవు ”’అని అర్ధం ….థాంక్స్ యాజీ గారూ

 2. చాలా అత్మీయకరమైన, ఆప్యాయపూరిత నివాళి. ముఖ్యంగా మనసు తడిసే క్షణాలలో/ సందర్భాలలో వాళ్ళ పాటలు తలుచుకుని, వాటితో మనం ఊరట పొందటానికి మించిన నివాళి వేరే ఏదీ ఉండదని నా నమ్మకం.

  చిన్నప్పుడు రాజ్ కపూర్ మరియు ముఖేష్ అంటే విపరీతమైన పిచ్చి ఉండేది. ఎంత అంటే రాజ్ కి పాడిన ప్రతీ పాటా ముఖేష్ పాడినదే అన్న గుడ్డినమ్మకం. అలానే చాలా ఏళ్ళు “ఆజా సనమ్ మధుర్ చాందినీ మే హమ్”, “ప్యార్ హువా ఇక్‌రార్ హువా” ముకేష్ పాడాడనే అనుకునేదాన్ని. అసలు అలా ఇంకెవరూ పాడగలరంటే నమ్మలేకపోయేదాన్ని. ఎప్పటికో గానీ తెలీలేదు అది మన్నాడే పాడిందని. ఆనంద్ లో “జిందగీ ఏ కైసే పహేలీ” అనేది కూడా నాకు చాలా ఇష్టమైన పాట.

  అన్నట్టు “దునియా బనానే వాలే” తీస్రీ కసం లో ముఖేష్ పాడారండీ. మీరు ఆ పాటని మన్నాడే పాట అని కాకుండా, వూరికే సందర్భానుసారంగా చెప్పినట్టయితే ఓకే.

  • Bhuvanachandra says:

   పద్మ గారూ … సందర్భానుసారంగా ,” జీవనపదంలో స్నేహితుల్ని కలుపుతావు …మళ్ళీ ఎందుకు విడగోదతావూ ?”’…అన్న ప్రశ్నకోసం ఆ పాట ఉదహరించాను అన్నట్టు నేను ఇప్పటికీ RK పిచ్చోడ్నే…..ముకేష్ అంటే ప్రాణం రఫీ అంట ఆరాధన ..మన్నదే అంటే” తలవొంచి నిలబడెంత గౌరవమ్…….మీకు థాంక్స్

 3. amarendra says:

  భువన చంద్ర గారూ
  వూరికే థాంక్స్ అంటే పేలవంగా అనిపిస్తోంది..ఇంకేమీ అనే ప్రయత్నం చెయ్యను..
  ఏదో వనవాసులతెగలో పరిపూర్ణంగా బతికి మనిషి వెళ్ళిపోతే ఉత్సవం చేసుకుంటారట..
  94 నాలుగు ఏళ్ళు మనమధ్య మన్నా డే ఉండి వెళ్ళినందుకు నాకు అలాంటి భావనే కలిగింది ..చివరి వరకూ పాడుతూనే వెళ్ళిపోయాడా మహానుభావుడు !! మన్నా అన్నా- సెలవు !!

  • Bhuvanachandra says:

   అమరేంద్ర గారూ నిజం చెప్పారు ….ఈ ప్రపంచంలో ”వారు లేకపోవడం పరిశ్రమకి లోటు …నేను దిగ్భ్రాంతి చెందాను ”’అని గొప్ప గొప్ప కామెంట్లు ఇస్తారుగానీ …. ”పని” వొప్పగించరు….కళాకారులు బిజీ గా ఉన్నంత కాలం ”’జీవించే”వుంటారు …. ఆ ”పని”లేనప్పుడే అనారోగ్యం శరీరం లోకి ప్రవేశిస్తుంది ………మీకు నా ధన్యవాదాలూ ఆశీస్సులూ

 4. Ramkumar Bharatam says:

  మన్నాడే పాడిన పాటల్లో ఎక్కువ భాగం ఆణిముత్యాలే. ప్రతిరోజు సంగీతాభిమానుల నోళ్ళళ్ళో ఏదో ఓ టైంలో మెదిలేవే. భువనచంద్రగారు చాల బాగా రాసారు. అయితే నాస్తిక్ లోని దేఖ్ తెరె సంసార్ కి… పాట నాకు తెలిసి మన్నాడే పాడలేదు. ఆపాట పాడింది ప్రదీప్

  • Bhuvanachandra says:

   అవునా ….. నాదగ్గరున్న వివరాల ప్రకారం ”నాస్తిక్ ”కి సంగీతం ;సి .రామచంద్ర …రచన ; ప్రదీప్ …గానం ;మన్నాడే…ఇవన్నీ నేను చిన్నప్పుడు ఎయిర్ ఫోర్సు లో వుండగా రాసుకున్నవి. ఒక వేళ తప్పైతే మన్నించండి ……. పాట వినికూడా దశాబ్దాలు గడిచింది ….రామకుమార్ గారూ థాంక్స్

 5. అవునండి నాస్తిక్ సినిమాలో దేఖ్ తేరే సంసార్ పాట పాడింది ప్రదీప్..

  • Bhuvanachandra says:

   జ్యోతి గారూ చాలా చాలా థాంక్స్ …..తప్పుఅని తెలుసుకున్నాను …కానీ ”ఎర్isహ్యూమన్” అంటారుగా…..
   మంచివారుకడూ ….ఈసారికీ మన్నిం చెయ్యరూ
   పాటపంపినందుకు ”’కోటి” ధన్యవాదాలు

   • అయ్యో మిమ్మల్ని తప్పు పట్టడం లేదండి.ఒకోసారి జరిగిపోతుందంతే.. ఈ పాట ఇక్కడే చూస్తూ వినొచ్చు కదా అని లంకె పెట్టా అంతే.. అదేంఠోగాని నాకు పాటలు అక్షరాలకంటే వినడం, చూడడం ఇష్టం. :)

 6. kurmanath says:

  పాటకి శరీరాన్ని తొడిగి, ఆ శరీరానికి తను ప్రాణమవుతాడు. అన్నిటికంటే ఎక్కువగా, ప్రేమనీ, బాధనీ, విషాదాన్నీ ఎంత బాగా పాడతాడో? బహుశా మన్నాడేకి బాధకి, ప్రేమకి, విషాదానికి చెందిన మూలాలేవో తెలిసుంటాయి, కొంత మంది మహా రచయితలకు తెలిసినట్టుగా.

  • Bhuvanachandra says:

   నాద్ గారూ ….., మీరన్నది నిజం …..నేలని తవ్వకుండా విత్తనం మొలవదుగా….అలాగే గాయం లేని గుండెలో ”కళ”పుట్టదు………..నమస్తే

 7. మన్నా పై మీ అభిమానం ప్రతి వాక్యంలోంచి తొంగి చూస్తోందండి.. చాలా బాగా రాసారు.
  “कुछ ऐसे भी पल हॊतॆ है..” అని మన్నా ప్రైవేట్ సాంగ్ ఒకటి ఉంది. యోగేష్ రచన. ఇదివరకూ వినకపోయి ఉంటే ఇక్కడ వినండి..చాలా బాగుంటుంది.
  http://samgeetapriyaa.blogspot.in/2012/10/manna-deys.html
  మన్నా గురించి రాసిన టపాలో నేనూ దాదాపు ఇవే పాటలు ఉదహరించానండి..(http://trishnaventa.blogspot.in/2013/10/blog-post_25.html ) ఇప్పుడు మరికొన్ని గుర్తుకువస్తున్నాయి.. ఇంకో టపా రాయాలనిపించేలా! సరస్వతి చంద్ర లో “తుమ్ గగన్ కీ చంద్రమా”, మేరే హుజూర్ లో “ఝనక్ ఝనక్ తోరీ బాజే పాయలియా”, రాత్ ఔర్ దిన్ లో “దిల్ కీ గిరహ్ ఖోల్ దో..”, తీస్రీ కసమ్ లో “చలత్ ముసాఫిర్ మోహ లియా..” ఇలా….! చివర్లో మీరన్నట్లు ఎన్నని రాయగలము… కొన్నే పాడినా మూడొంతులు మంచిపాటలే అన్నీ!
  అప్పటిదాకా విలన్ గానే నటిస్తూవచ్చిన ప్రాణ్ కి మన్నా పాడిన “కస్మే వాదే ప్యార్ వఫా..”(ఉప్కార్) పాట తర్వాత క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. అది మన్నా గాత్ర మహత్యమే!

  • Bhuvanachandra says:

   తృష్ణ గారూ ..మళ్ళీ మరోసారి మన్నాడే ని విన్నాను ……ఎయిర్ ఫోర్సు లో వుండగా రాత్రిళ్ళు పాటలే పాటలు ”చలత్ ముసాఫిర్”నాకు చాలా ఇష్టమైన పాట…..మరోసారి ధన్యవాదాలు

 8. భువన చంద్ర గారూ … మీ నివాళి ఎన్నో జ్ఞాపకాలను తట్టి లేపింది . మీకు నచ్చిన పాట అనగానే రాజ్ కపూర్ , నర్గిస్ ల పాట బాపినీడు గారికి చెప్పారు కాని నన్నడిగితే పడొసన్ లోని ఎక్ చతురు నార్ కర్ కే సింగార్ చెప్పేవాన్ని . మన్నాడే స్వరం తమిళ యాస మాట్లాడే మహమూద్ కి ఎంత బాగా అమరిందండి . ఆ సినిమా చూసాక సునీల్ దత్ అంటె … అబ్బో (అలా అమాయకంగా ప్రేమించే పురుషులు ఎందరుంటారు?) అసలు ఆ పాట సన్నివేశం కొన్ని వేలసార్లు చూసినా బోర్ కొట్టదండి. సైరాభాను , మహమూద్, కిశోర్కుమార్ , సునీల్ దత్ … ఒకే ఫ్రేం లో అద్బుతం కదండీ .
  మీరు ఏర్ ఫోర్సు లో ఉండి బినాకా గీత మాల, జయ మాలా, సిలోన్ రేడియో లు విని విని హిందీ పాటల్ని అవపోసన పట్టినట్టున్నారు.
  ధన్యవాదాలు .
  – జగదీశ్వర్ రెడ్డి

  • Bhuvanachandra says:

   థాంక్స్ రెడ్డి గారూ ….చిత్రమేమంటే నాదగ్గర అప్పుడు ఓ బుల్లి రేడియోకూడా లేదు ……పాటల పిచ్చి ….ఇప్పుడు అన్నీ వున్నాయి కానీ గుండె నింపుకోవా లంటే మళ్ళీ” ఆ”పాటలే……ఇప్పుడొచ్చే పాటలకి అందం ఉందిగానీ హృదయం లేదు …ఏమో …నా ఆలోచన తప్పేమో కూడా

   • నిజమే ఇప్పుడొచ్చే పాటలకు కొన్ని మాత్రమే అందముంది కాని హృదయం లేదు అందుకే ఆ పాత మధురాలు ఇంకా గుండెల్లోనే దాగి ఉన్నాయి..

 9. BHUVANACHANDRA says:

  కారణం కొంత తెలుసు జ్యోతి గారూ …అప్పటి పాటలు రాగం మీద ఆధారపడితే …ఇప్పటి పాటలు” తాళం” మీదా ”వేగం”మీదా ఆధారపడుతున్నాయి.”’ పదాలు ” కూడా” పొడి పొడివే……అందుకే ”మనసు తడి ” మిస్ అవుతోంది…..

 10. వంగూరి చిట్టెన్ రాజు says:

  భువన చంద్ర గారూ

  చాలా మంచి వ్యాసం వ్రాశారు….
  1968 -70 ప్రాంతాలలో ఒక కొత్త సినిమాలో నటించడానికి ఒక మిత్రుడికి తోడుగా నేను బొంబాయి నుంచి హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడే నేను మన్నాడే గారిని కలుసుకున్నాను. ఆ సినిమాలో తెలుగు పాట పాడడానికి ఆయన వచ్చారు. నేను ఆ పాట వినలేదు..ఆ సినిమా కూడా నిర్మాణం పూర్తి చేసుకో లేదు. నాకు తెలిసీ మన్నాడే తెలుగులో పాడ లేదు….ఈ ఒక్కా సారీ తప్ప. ఈ విషయాలు మీకు ఏమైనా నా తెలుసా?

  –వంగూరి చిట్టెన్ రాజు
  .

 11. BHUVANACHANDRA says:

  శ్రీ చిట్టెన్ రాజు గారూ …..చదివినందుకు ధన్యవాదాలు ….నాకుతెలిసి ..మన్నాడే గారు తెలుగులో పాడలేదు ..అయినా వీలున్నంత వరకూ కనుక్కునే ప్రయత్నం చేస్తాను……మరోసారి ధన్యవాదాలతో ….భువనచంద్ర…

 12. BHUVANACHANDRA says:

  శ్రీ చిట్టెన్ రాజు గారూ …..చదివినందుకు ధన్యవాదాలు ….నాకుతెలిసి ..మన్నాడే గారు తెలుగులో పాడలేదు ..అయినా వీలున్నంత వరకూ కనుక్కునే ప్రయత్నం చేస్తాను……మరోసారి ధన్యవాదాలతో ….భువనచంద్ర…ఎలా వున్నారు మీ రచనలు చదివి ఆనందిస్తూనే వున్నా

 13. naaku telisi mannaday teluguloo bathukamma bathukamma anee paata paadaaru. neenadi 70’s loo vinnaanu.

 14. పూచోన కైసే మన్ రైన్ బితాయి పాట వింటుంటే బాల మురళి ఆలపించిన పిబరే రామ రసం గుర్తుకొస్తుంది.

మీ మాటలు

*