నేను కథ ఇలా రాస్తాను..!

daggumati

1986 లో ‘దేవుడు’ పేరుతో తొలి కథ రాశారు దగ్గుమాటి పద్మాకర్.  అప్పటినుంచి ఇప్పటి వరకు 15 కథలు రాశారు.  పుస్తకం రాలేదు. 2 సార్లు ప్రధమ బహుమతులు వచ్చాయి. పరిధులు-ప్రమేయాలు, s/o అమ్మ, పతనం కాని మనిషి, యూ టర్న్, ఈస్తటిక్ స్పేస్, సెవెన్త్ సెన్స్ (చివరికథ 2010) కథలు చాలా మందికి నచ్చాయి.

పద్మాకర్ కథ ‘యూ టర్న్’ గురించి   జాన్సన్ చోరగుడి గారు (చినుకు, డీసెంబరు 2007) యిలా అన్నారు…

కొందరు కథకులు వర్తమానంలో వుంటూనే, భవిష్యత్తుని ఒడిసి పట్టుకుని దాన్ని వెనక్కి తెచ్చి దానికి గతాన్ని చూపించి వర్తమానం కోసం భవిష్యత్తు యేమి చేయాలో కర్తవ్యబోధ చేస్తారు. యునెస్కో, ప్లానింగ్ కమీషన్ వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థలు  చేయాల్సిన విధాన రూపకల్పనని దగ్గుమాటి పద్మాకర్ ఒక కథ ద్వారా చూపే సాహసం చేశాడు. అతడు మన తెలుగు కథకుడు కావడం మన అదృష్టం.

పద్మాకర్ కథ రాసే విధానం ఆయన మాటల్లోనే వినండి:

*

సీనియర్లకి చెప్పగలిగేంత వాడిని కాదుగాని, కొత్తగా కథలు రాస్తున్నవాళ్ళకి నాకు తెలిసిన నా అనుభవాలు మూడు నాలుగు ముక్కలు చెబుతాను, కేవలం నా గురించే… అంతకు ముందుగా నాదృష్టిలో ‘కథ’ గురించి రెండు ముక్కలు చెబుతాను…

*    *    *

 

రచయితలకెంత ఆశ ఉన్నాకూడా కథలు ఎప్పుడు తక్షణమే యే సమస్యలనీ పరిష్కరించవనేది ఒక నిజం.

తమని తాము గమనించుకుంటూ జీవించేవారిలో మాత్రమే ఒక మంచికథ తగిన సమయంలో తన ప్రభావాన్ని చూపుతుంది.

సహజంగా మనకి ఎదురయ్యేవారిలో…  జీవన గమనం లో సరయిన నడక రాని వాళ్ళు, నడుస్తూ నడుస్తూ దారి తప్పినవాళ్ళు,  సమస్యల రద్దీలో ఇరుక్కుని దారి కనిపించనివాళ్ళు, ధగద్ధాయమైన వెలుగుల మధ్యకూడా కళ్ళ ముందు చీకటి కమ్మినవాళ్ళు, అన్నీ సమకూరినా సంతోషం రుచి తెలియనివాళ్ళు, ఇతరులకు సహాయ పడాలని ఉన్నా మనుషులపై నమ్మకంపోయి పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వేసేవాళ్ళు, ఇకపోతే కుటుంబ సమస్యల్లోంచి బయటపడలేని వాళ్ళూ,  ఇలా రకరకాల సమస్యలున్న ప్రజలు మన కళ్ళముందు కదులుతూ ఉంటారు. అయితే నావరకు నేను ఇలాటి ప్రజల దైనందిన సమస్యలకి సంబందించిన ఇతివృత్తాలను కాకుండా… దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా అపరిష్కృతంగా వున్న కొన్ని సమస్యలపై తార్కికంగా ఒక సూచన అందించగలిగేలా  వున్న ఇతివృత్తాలను ఇష్టపడతాను.

నేను కథ రాయాలనుకున్న తరవాత ముందుగా ఆ కథని చదివే వాళ్ళని గుర్తు చేసుకుంటాను.  నా గత అనుభవాలు తీసుకుంటే, కథ అచ్చయిన తర్వాత, హోటల్ సర్వర్ల నుండి, మెకానిక్కులు, గృహిణులు, సైకియాట్రిస్టుల వరకు రకరకాల వాళ్ళు ఫోన్ లు చేశారు. కాబట్టి, కథని చదవబోయే పాఠకులందరి రసాస్వాదక సామర్ధ్యాన్ని ఒక రచయితగా గౌరవించాలి అని నిర్ణయించుకుంటాను.

పాఠకులు నా కథ చదవాలనుకుని పేజీలు తెరిచినపుడు, విస్తరాకు ముందర కూర్చున్న అతిధుల్లా కనిపిస్తారు నాకు. అప్పుడొక ఇల్లాలు పొయ్యిదగ్గర వంట దినుసులతో పడే జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను. మనమొక ఇంటిలో ఆతిధ్యం స్వీకరించి, ఆ సాధారణ ఇల్లాలిని మెచ్చుకుంటే తనకెంత తృప్తో తెలిసిందే కదా. సరిగ్గా అలాంటి తృప్తినే పాఠకుల నుండి ఎదురు చూస్తాను.

కథ రాయమంటూ ఏ అర్ధ రాత్రో అపరాత్రో నాలో అప్పటికే రాజుకుంటున్న ఒక ఆలోచన ప్రవేశిస్తుంది. ఇక మాపాప ఖాళీనోట్సు ఒకటి తీసుకుని  రాయడం ప్రారంభిస్తాను. అప్పుడిక అలోచనల వేగంతో చేయి పోటీపడలేక గెలుక్కుంటూ పోతాను. ఎంతగా అంటే ఒక్కోసారి నారాత నాకే అర్ధంకాదు కొన్నిచోట్ల! ఐతే మొత్తానికి ఒక సిట్టింగ్ లోనే పాత్రలూ, సంఘటనలూ, ప్రధాన డైలాగులు పూర్తి అయిపోతాయి. ఆ అర్ధరాత్రి ఒక ‘అస్తిపంజరం ‘ అలా సిద్దం అవుతుంది.  ఇక మళ్ళీ దానిజోలికి కొద్ది రోజులపాటు  వెళ్ళలేను.(నిజానికి నెలలు, ఇది నా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే). ఇక అలమారలో దాచిపెట్టిన ఆ ‘అస్తిపంజరం’ నన్ను చాలారోజులపాటు పలకరిస్తూ ఉంటుంది, ఎప్పుడు జీవం పోస్తావంటూ!

జీవం పోయడం నాపని కాదని, నేను ఒక రూపాన్ని మాత్రమే ఇవ్వగలనని, జీవం అనేది అన్ని అక్షరాలమద్య తగు బంధం ఏర్పడినప్పుడు అదొక అసంకల్పిత ప్రతీకార చర్యలా పుడుతుందని చెప్పినా వినదు. సరే ఏదోవొకటి చెయ్యమంటుంది. అప్పుడు కాస్త ఏకాంతాన్ని వెతుక్కుని మళ్ళీకూర్చుంటాను.

ఇక అప్పుడు నా రఫ్ స్క్రిప్టును ముందేసుకుని చదువుతాను. కొంత కాలం గడిచినందువల్ల కథకి ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో అప్పుడు ఈజీగాతెలుస్తుంది. A*, B*, Z* , @ , § , # వంటి కొండ గుర్తులు పెట్టి మధ్య ఖాళీల్లో ఇరికించాల్సిన మేటర్ ని వేరేపేజీల్లో రాసుకుంటాను. ఇదంతా అస్థి గారికి కండరనిర్మాణం అనుకోవచ్చు. ఆనాటి నాశక్తి లేదా ఓపిక అంతటితో సమాప్తం అయిపోతుంది.

ఇక మళ్ళి ఇంకో రోజు కూర్చుని, స్క్రిప్టంతా కంటిన్యుటీ ఉందోలేదో చూస్తాను. కచ్చితంగా ఉండదు. అప్పుడు వరసగా అన్ని వాక్యాలు  చిన్నప్పుడు హిందీ,ఇంగ్లీషు సైలెంట్ గా ఎలా బట్టీపట్టానో అలా   అయిదారు సార్లు చదువుతూ కంటిన్యుటీ చెక్ చేసి తప్పులు సవరిస్తూ పోతాను. కంటిన్యుటీ లేని దగ్గర పాఠకులు కచ్చితంగా దాటవేస్తారు. అంటే భోజనంలో 2 ముద్దలు కలుపుకుని పక్కకు నెట్టినట్టు. ఇప్పుడు అస్థిగారికి  నరాలు, రక్త నాళాలు కూడా  సిద్దమయినట్టే. తర్వాత మీకు తెలిసిందే. నాకు నీరసం వచ్చేస్తుంది. పక్కన పెట్టేస్తాను. ఆయితే, ఇప్పుడు మాత్రం ఈ దశలో కథ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. కాస్త సంతోషం కూడా  వేస్తుంది.

ఇప్పుడిక చివరి సమావేశం.

ఆలోచనకి పెద్దగా పని వుండదు గాని అయితే జాగ్రత్తగా ఉంటాను.

1] కథ కంటిన్యుటీని చెక్ చేయడానికి ముందుగా వేగంగా చదువుతాను.

2] పాత్రలు తమ ప్రవర్తనలో సందర్భానికి, వయసుకి, జ్ఞానానికి తగిన పదాలు లేని చోట మార్పు చేస్తాను. ఉదా: కోపంతో, ఆవేశంతో, రగిలిపోతూ, భగ్గుమంటూ… ఇలాంటి  పదాల్లో సన్నివేశానికి తగినది మారుస్తాను.

3] ఇక పోతే అన్ని కొటేషన్ల తర్వాత ఉన్న ముగింపులు సరిచేస్తాను. (ఆమె అన్నది/ ఆమె నవ్వుతూ అన్నది/ ఆమె అతన్ని చూస్తూ అన్నది)

4] ఇక అచ్చు తప్పులు, గుర్తులు సరిచేసుకుంటాను.

5] ప్రారంభం వేటగాడి ఉచ్చులా, ముగింపు కూరలో ఉప్పులా సరిగ్గా అమరాయో లేదో చూస్తాను.

6] సాధారణంగా కథకి తగ్గ పేరు ఈ దశవరకు తోచదు నాకు. కాన్సంట్రేషన్ అంతా కథపై ఉండటం వల్లకావొచ్చు. ఇప్పుడు పుస్తకం పక్కన పెట్టి, లేచి టీ తాగాలని బయలుదేరతాను. పెద్దగా ఆలోచించకుండానే 1 లేదా 2 పేర్లు గుర్తొస్తాయి. సాధరణంగా మొదటిదే ఫైనల్ అవుతుంటుంది నాకు.

7] తర్వాత టైపింగ్ అయ్యాక  చూస్తుంటే, ఆప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకున్నట్టే ఉంటుంది.

 

–దగ్గుమాటి పద్మాకర్ 

మీ మాటలు

  1. మీ కథా ప్రణాళిక బాగుందండి,. అభినందనలు,.. మరన్ని మంచి కథలతో పాఠకులను అలరించాలని కోరుకుంటూ,..

  2. ఆలోచనల వేగంతో చేయి పోటీపడలేక గెలుక్కుంటూ పోతాను… కథకి మీరు ఎలా పురుడు పోసి పండంటిబిడ్డను అందిస్తారో చాలా చక్కగా చెప్పారు. అభినందనలు. పరిష్కారం కాని సమస్యలతో చిరకాలం నిలిచే మరిన్ని కథలు మీ కలం నుండి జీవం పోసుకొంటాయని ఆశిస్తున్నా

  3. ఒక కథకుడు నేర్చుకోవలసినవి ఉన్నవి. తప్పకుండా మీరు చెప్పిని కొన్ని అంశాలు ఉదా: 1,2,3,4 ని ప్రతి కథకుడు పాటిస్తే, పాఠకుడి నెట్టిన పాలు పోసిన వాళ్ళవుతారు ఆ రచయితలు. బాగుంది.

  4. “ప్రారంభం వేటగాడి ఉచ్చులా, ముగింపు కూరలో ఉప్పులా సరిగ్గా అమరాయో లేదో చూస్తాను.” బ్రహ్మాండం.

  5. ఆర్.దమయంతి says:

    ‘పాఠకులు నా కథ చదవాలనుకుని పేజీలు తెరిచినపుడు, విస్తరాకు ముందర కూర్చున్న అతిధుల్లా కనిపిస్తారు నాకు. అప్పుడొక ఇల్లాలు పొయ్యిదగ్గర వంట దినుసులతో పడే జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను.’ బాగుందండి. బాగా చెప్పారు. అందరకీ అర్ధమయ్యే రీతిలో!
    అభినందనలతో..

  6. మణి వడ్లమాని says:

    పద్మాకర్ గారు! ముందు మీకు అభినందనలు! హిందీలో ఒక సేయింగ్ వుంది కదా “దిల్ కి బాత్ మూసే నిక్ లా” అలా నా మనసు లో వి మీరు రాసినట్లు అనిపించింది. మీ మాటలలో”కథ రాయమంటూ ఏ అర్ధ రాత్రో అపరాత్రో నాలో అప్పటికే రాజుకుంటున్న ఒక ఆలోచన ప్రవేశిస్తుంది. ఖాళీనోట్సు ఒకటి తీసుకుని రాయడం ప్రారంభిస్తాను. అప్పుడిక అలోచనల వేగంతో చేయి పోటీపడలేక గెలుక్కుంటూ పోతాను. ఎంతగా అంటే ఒక్కోసారి నారాత నాకే అర్ధంకాదు కొన్నిచోట్ల! ఐతే మొత్తానికి ఒక సిట్టింగ్ లోనే పాత్రలూ, సంఘటనలూ, ప్రధాన డైలాగులు పూర్తి అయిపోతాయి. ఆ అర్ధరాత్రి ఒక ‘అస్తిపంజరం ‘ అలా సిద్దం అవుతుంది. ఇక మళ్ళీ దానిజోలికి కొద్ది రోజులపాటు వెళ్ళలేను.(నిజానికి నెలలు, ఇది నా వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే). ఇక అలమారలో దాచిపెట్టిన ఆ ‘అస్తిపంజరం’ నన్ను చాలారోజులపాటు పలకరిస్తూ ఉంటుంది, ఎప్పుడు జీవం పోస్తావంటూ!” ఇది నాకు కూడా అనుభవమే ! కొన్నిరోజులకి మళ్ళి అనిపిస్తుంది ఆ కధను పూరిచేయ్యలని. రాసినవిమూడు నాలుగు కదలే పెద్ద చెయ్యి తిరిగిన రచయిత నేమి కాను. మీ వ్యాసం చూసాక నాలో కలిగిన స్పందనను ఇలా పాఠక ముఖంగా పంచుకొన్నాను.

  7. ramachary bangaru says:

    తమని తాము గమనించుకుంటూ జీవించేవారిలో మాత్రమే ఒక మంచికథ తగిన సమయంలో తన ప్రభావాన్ని చూపుతుంది.అందరమూ ఒప్పుకోవాలిసినదే మరి.

    సహజంగా మనకి ఎదురయ్యేవారిలో… జీవన గమనం లో సరయిన నడక రాని వాళ్ళు, నడుస్తూ నడుస్తూ దారి తప్పినవాళ్ళు, సమస్యల రద్దీలో ఇరుక్కుని దారి కనిపించనివాళ్ళు,, ధగద్ధాయమైన వెలుగుల మధ్యకూడా కళ్ళ ముందు చీకటి కమ్మినవాళ్ళు, అన్నీ సమకూరినా సంతోషం రుచి తెలియనివాళ్ళు ఎక్కువమందే, ఇతరులకు సహాయ పడాలని ఉన్నా మనుషులపై నమ్మకంపోయినవాళ్ళు, ఇకపోతే కుటుంబ సమస్యల్లోంచి బయటపడలేని వాళ్ళూ, ఇలా రకరకాల సమస్యలున్న ప్రజలు మన కళ్ళముందు కదులుతూ ఉంటారు. అయితే నావరకు నేను ఇలాటి ప్రజల దైనందిన సమస్యలకి సంబందించిన ఇతివృత్తాలను కాకుండా… దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా అపరిష్కృతంగా వున్న కొన్ని సమస్యలపై తార్కికంగా అందరకీ ఒక సూచన అందించగలిగేలా వున్న ఇతివృత్తాలను బాగా చెప్పారు. .భూమి గుండ్రంగా ఉన్నదన్న వాస్తవంగా కథలకుండవలసిన మౌలిక అంశాలను సూత్రబడ్డంగా తెలిపారు.ధన్యవాదాలు పద్మాకరు గారు.

  8. తమని తాము గమనించుకుంటూ జీవించేవారిలో మాత్రమే ఒక మంచికథ తగిన సమయంలో తన ప్రభావాన్ని చూపుతుంది.

    బావుందండి . ఏదో ఒక కథ, నవల చదివినప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ప్రభావం చూపుతున్నది అన్నది నిజం .

    వ్యాసం విలువగా ఉంది. ధన్యవాదములు .

    • Dr.C.A.Prasad., says:

      మిత్రులు పద్మాకర్ gaariki., kadhalu yelaa raasthoro mee manasulo maatalu maaku cheppinanduku dhanyavaadaalu….

  9. amarendra says:

    బావుంది మీ వ్యాసం !

  10. S V R Jogarao says:

    ఆర్యా,
    కథా రచన అంటే ఆషా మాషి వ్యవహారం కాదు .
    కథా మూలం ఒక సంఘటన కదిలిస్తే హృదయము స్పందిస్తే కథకు బీజము పడుతుంది.
    తరువాత పాత్రలు సంభాషణలు ఆ పిదప వర్ణనలు అద్దుకుంటాయి . చివరికి శిల్పము తయారయి కథ సిద్ధం అవుతుంది.
    ఇంత వేదన తరువాత కథ పలుకరిస్తుంది.

  11. ayyagari bhujanga rao says:

    కొత్తగా కథలు రాయాలనుకునే వాళ్లకు మంచి త్రోవ చూపెడుతుంది, మీ ఈ రచన.

    మంచి ఉపమానాలు, చదివించే గుణం ఉన్న ఈ విలువైన వ్యాసానికి

    ధన్యవాదాలు దయాకర్ గారూ!

  12. కథ వెనక నడిచే కథ.. చాలా కదనకుతూహలం గా చెప్పారు.. వెరీ ఇంట్రెస్టింగ్

  13. సాయి పద్మ says:

    నేను కథ ఇలా రాస్తాను .. భలే ఉంది అండీ.. కానీ ..”రచయితలకెంత ఆశ ఉన్నాకూడా కథలు ఎప్పుడు తక్షణమే యే సమస్యలనీ పరిష్కరించవనేది ఒక నిజం.” ఇది చాలా నిజం.. మరి మీలాంటి వాళ్ళు తక్కువ రాస్తే , మార్పు కి బీజం కూడా అంతే స్లో గా పడుతుంది కదా.. ఆలోచించండి

  14. కోడూరి విజయకుమార్ says:

    పద్మాకర్ గారు …
    మీరు కథలు రాసే పద్ధతిని, ఒక గంభీర ఉపన్యాసం లా కాకుండా, సులభ శైలిలో చక్కగా చెప్పారు …. అభినందనలు!

  15. Thirupalu says:

    ఇక్కడ కధల వర్కసాప్ నడపడం చాలా బావుంది. చాలా మంది కొత్త కధకులను తయారు అవుతారు.

  16. చాలా ఉపయోగకరమైన వ్యాసం. అందరి అనుభవాలు ఒకేలా వుండవు కానీ రాసేవారు అందరి అనుభవాలు తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా వుంటుంది. మీరు చెప్పిన విషయాలలో నేను కొత్తగా నేర్చుకున్నవి కొన్ని వున్నాయి. అందుకు మీకు ధన్యవాదాలు. అందరిలా నాది కూడా అదే అభ్యర్థన – ఇంకా తరచుగా కథలు రాయండి.

  17. ఇంత రుచికరమైన భోజనానికి రచయిత సంస్కారం , humility అదనపు ఘుమఘుమని అందించిందని చెప్పక తప్పదు. అభినందనలు పద్మాకర్ గారు !

  18. ఆకునూరి మురళీకృష్ణ says:

    స్వయంగా రచయిత అయిన వాళ్ళకి తోటి రచయితలు కథలెలా రాస్తారో తెలుసుకోవడం ఆసక్తి కరంగా వుంటుంది. ఆ ఆసక్తితోనే చదివానీ వ్యాసాన్ని. చాలా చక్కగా, కథ రాసినట్టుగానే, బాగా చెప్పారు. అభినందనలు పద్మాకర్ గారూ. కథలు ఇలా రాయాలి అని కాకుండా నేను ఇలా రాస్తాను అని చెప్పడం బాగుంది.

  19. krishareddy says:

    చెత్త వ్యవహారం కథ కు కూదా పతకాలా నిజమే మీరో ఉనెస్చొ రైటర్

  20. sasi kala says:

    హ్మ్ …. కద వెనుక ఇంత కష్టం ఉంది .అది నెలలో , సంవత్సరాలో !! బాగా వ్రాసారు

  21. jagadeesh mallipuram says:

    నమస్కారం పద్మాకర్ గారూ ! ”నేను కధ ఇలా రాస్తాను ” ఆలోచింప చేసింది. అలా రాస్తేనే ”ఈస్త టిక్ స్పేస్” లాంటి కళాఖండాలు వచ్చాయి కదా అనిపించింది. నాకూ అలా రాయాలనిపించింది. ఎందుకంటే నేనలా రాయలేను(దు). ఎప్పటికైనా అలా రాయలేక పోతానా?

  22. Jayashree Naidu says:

    “ప్రారంభం వేటగాడి ఉచ్చులా, ముగింపు కూరలో ఉప్పులా సరిగ్గా అమరాయో లేదో చూస్తాను.” — రెండుముక్కల్లో చెప్పేశారు :)

మీ మాటలు

*