అలుపు లేని ‘జీవనసమరం’ ముగిసింది!

bharadwaja

జ్ఞాన పీఠ అవార్డ్ గ్రహీత శ్రీ రావూరి భర ద్వాజ  ఇక లేరు అన్న వార్త వినంగానే – గుండె ఉసూరుమంది.
ప్రఖ్యాత కథా,  నవలా రచయిత, బాల సాహిత్యోధ్ధారకుడు , రేడియో, స్టేజ్  నాటక రచయిత,  విశిష్ట విమర్శకులు.. ఇవన్నీ ఇప్పుడు మనం  వింటున్న బిరుదులు – ఆయన పేరు చివర!
కానీ, ఇవేవీ లేనప్పుడు..
తనకి ఈ సమాజం ఇచ్చిన బిరుదులు, తనని పేరు తో కాకుండా  పిలిచిన పిలుపులు అన్నీ తనకు బాగా గుర్తే అనే వారు  భరద్వాజ.
తనని-  అవమానించిన మనుషులే తన రచనలో పాత్రలు, తను -ఎదుర్కొన్న  అమానుష సంఘటనలే –  సన్నివేశాలు, తన జీవితానుభవాలే – రచనా సంపుటాలు. కష్టాల కన్నీల్లన్నీ అక్షరాలు గా మారాయి కామోసు!
నిజమే.
అందుకే వారి రచనలు జీవ జలాలు. జీవన సారాలు గా మిగిలిపోయాయి.
రచయిత గానే కాదు, వ్యక్తి గా కూడా అయన ఒక మహర్షి లానే జీవించారు. ‘తనని పనికిరావు ఫొమన్న  వారికే  తిరిగి సాయం చేసారు.  మనుషుల మీద తనకె లాటి  ధిక్కారాలు, ప్రతీకారాలూ లేవనే వారు. ఏ మనిషైనా దిగజారడానికి కారణం అవసరం అని నమ్మే ఈ సమాజ పరిశొధనాత్మకుని మాటలు శిలా శాసనాలు గా నిలిచి పోతాయనడం లో సందేహం లేదు.
తన శతృవు కైనా సాయం చేయడం  ఆదర్శం గా భావించే   ఈ రచయిత, కేవలం మాటల మనిషి మాత్రమే కాదు. చేతల చైతన్య మూర్తి కూడా! ‘సాయం పొందిన వ్యక్తి కళ్లల్లో కనిపించే ఆనంద తరంగం కంటే మించి పొందే అవార్డ్ ఏదీ వుండదని, దీనికి మించిన తృప్తి మరేదీ ఇవ్వదని   విశ్వసించే ఒక విశ్వ మానవ ప్రేమికుదు, శాంతి దూత –  భౌతికం గా మాత్రమే మనకు   లేరు.
కానీ ఆయన రచనలు ఇక్కడ మనల్ని నిత్యం పలకరిస్తూ వుంటాయి. మనిషి గా ఆలోచించమంటాయి.   ఆయన చదివింది 7 వ తరగతే అయినా, వారి రచనలు మాత్రం పరిశోధనాత్మకాంశాలు కావడం గొప్ప విశేషం.
విద్య –  వివేకం కన్నా గొప్పది కాదు.
మనిషి కి కొలమానం విజ్ఞానం కాదు. సంస్కారం.
మనిషిని మనిషి తెలుసుకోవడం కన్నా మరో విశిష్ట గ్రంధమే దీ లేదు అని నిరూపించేందుకు నిలువెత్తు నిర్వచనం గా నిలిచిపోతారు రావూరి.
పుట్టింది   కుగ్రామమే ఐనా, ఇప్పుడు సాహితీ ప్రపంచ పుటం లో వీరి స్థానం హిమాలయమంత!
చిన్నతనం లో –
తిండి లేకుండా చెరువులో నీళ్ళు తాగి బ్రతికానని చెప్పుకునే రావూరి చివరి శ్వాస వరకు కూడా చాలా నిరాడంబరమైన జీవితాన్నే  గడిపారు.

తెలుగు సాహితీ రంగానికి ఎనలేని కృషి సలిపి, అక్షరాలను  సంజీవిని  ఔషధ వృక్షాలుగా మార్చి,  తెలుగు నవలకు పట్టం కట్టించి,  ప్రతిష్టా కరమైన  జ్ఞాన పీఠ అవార్డ్ ని పొంది ..
అలసి సొలసి ఆయన విశ్రమించారేమో కానీ..
మనకు మాత్రం   విరామం వుండదు. ఆయన్ని స్మరించుకోవడంలో.
ఆయన చిరంజీవి గా వర్ధిల్లుతూనే వుంటారు.
తలచుకున్నప్పుడల్లా కన్నీరౌతూ గుర్తొస్తూనే వుంటారు.

ఆర్. దమయంతి

***

అసంతృప్తి కావాలి

నన్ను మండించాలని నీవూ, నిన్ను మసి చేయాలని నేనూ, సహస్ర సహస్రాబ్దాలుగా తంటాలు పడుతున్నాం.
నేను మండిపోనూ లేదు;నీవు మసి కుప్పగానూ మారిపోలేదు.
హోరాహోరీ పోరాటం అనంత కాలాల దాకా, అవిచ్చిన్నంగా
సాగుతూనే ఉంటుంది” అన్నది ఆ అంధకారం, దూరం నించి వస్తోన్న వెలుతురు వేపు చూస్తూ.

“నీకు సంతృప్తి కావాలా? అసంతృప్తి కావాలా?” అన్నారు ప్రభువు ఉదయపు నడకలో.
“అసంతృప్తి” అన్నాను.
ప్రభువు ఆశ్చర్యంగా చూశాడు నావేపు.
“ఉన్న చోటనే ఉండి పొమ్మంటుంది సంతృప్తి. మునుముందుకు  నడిపిస్తుంది అసంతృప్తి” అన్నాను.
ప్రభువు నా వీపు తట్టాడు!
ఎందుకో తెలీదు.

రావూరి భరద్వాజ జ్నాపకాలతో……

– రాధాకృష్ణ

***

 జీవన సమరంలోని అన్ని కోణాల అనర్గళ అసమాన ఆవిష్కరణం

ఆయనతో అంతగా పరిచయం లేదు. పరిచయమంతా ఆయన రచనలతోనే.

రేడియోలో మొట్ట మొదటిసారి 1985లో నా గొంతు, నా కవిత్వం వినిపించింది ఆయనే. దిగ్గజాల మధ్యలో యువకవిగా నన్ను నిలబెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన కథల సదస్సుకు ఆయనతో పాటు రైలు ప్రయాణం…కాకినాడలో రెండు రోజుల కబుర్ల పారాయణం…! అది మామూలు ప్రయాణమూ కాదు…అవి మామూలు కబుర్లూ కాదు. జీవన సమరంలోని అన్ని కోణాల అనర్గళ అసమాన ఆవిష్కరణం.
ఈ మధ్యనే ఆయన జ్ఞానపీఠం అందుకున్నారు. కలవాలి కలవాలి అనుకుంటూనే కలవలేక పోయాను. ఇప్పుడు కలవాలన్నా…
ఆయన భౌతికంగా ఇక లేరు.

రావూరి భరద్వాజ గారూ…! జోహార్…జోహార్…

– చైతన్య ప్రసాద్

***

గమనిక:

వొక రచయిత కన్ను మూసాక మిగిలేది ఏమిటి? అతను మన కళ్ళు తెరిపించిన కొన్ని రచనలూ, కొన్ని జ్ఞాపకాలూ..

రావూరి భరద్వాజ గారి గురించి, వారి రచనలతో, వారితో మీకున్న జ్ఞాపకాల గురించి ఇక్కడ వ్యాఖ్యల రూపంలో పంచుకోండి. ఈ వ్యాఖ్యల పరిధి సరిపోదు అనుకుంటే editor@saarangabooks.com కి పంపండి. ప్రచురిస్తాం.

 

మీ మాటలు

 1. sankisa sankar says:

  జీవితం నుండి జీవనం , కవనం కధనం అబ్బిన మనిషి గురించి చక్కగా చెప్పారు ,

 2. @ విద్య – వివేకం కన్నా గొప్పది కాదు.
  మనిషి కి కొలమానం విజ్ఞానం కాదు. సంస్కారం. @
  ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు ! జ్ఞాన పీఠ ఆవ్వార్డ్ పొందిన రావూరి భరద్వాజ గారి జీవితమ్ ఇదే నిరూపిస్తుమ్ది!
  ఈ విషయం జ్ఞాపకం చేసు కోవడమే ఆయనకు మనం ఇచ్చే నివాళి!

 3. DrPBDVPrasad says:

  మానవీయతను మానవత్వపు విలువలను అంతర్లీనంగా కాకుండా మహా వాహినిగానే
  తాను సృష్టించిన సాహిత్యం లో ప్రవహింప జేస్తూ దానిలో తేలియాడే స్వచ్చ మనస్కులను,మునుగుతూ తేలిపోయే కొట్టుకులాడే మనస్తత్వాలను ,పూర్తిగా మునిగిపోయే కపటులను ఆయన ఆవిష్కరించారు .
  యదార్థ దృశ్యాల వ్యదార్థ్ర గాథల జీవన సమరాన్ని ఆవిష్కరించిన తీరు మానవత్వ ప్రబొధమనే సామాజిక స్పృహే స్వచ్చమనస్కుడైన సామాన్యుడైన ఒక మహోన్నత సామాజికుడు విశ్వ సాహిత్యమూర్తి శ్రీ రావూరి భరద్వాజ గారు
  వారి సాహిత్యం వారిని విశ్వసాహిత్య కర్తల్లొ ఒకరినిగా జెసి తెలుగు సాహిత్యానికే గౌరవం తెచ్చింది
  ………
  వారితో పరిచయం కావించి న వారు సాహిత్య బ్రహ్మ శ్రీ వివియల్ నరసింహారావుగారు .
  దురదృష్ట వశాత్తు ఇద్దరు పది రోజుల వ్యవధి లోనే లోకాన్ని వీడటం బాధాకరమైన విషయం ఆ ఇద్దరికి స్మృత్యంజలి

 4. జ్ఞానపీఠ్ పురస్కారం గ్రహీతలు వారి జీవితకాలంలో నే అందుకున్నారు. భరద్వాజ్ గారు అదృష్టవంతులు..తీసుకుని, చూసుకుని, మురుసుంటూ వెళ్ళారు.

మీ మాటలు

*